Jump to content

కల్లూరు వేంకట నారాయణ రావు

వికీపీడియా నుండి
కల్లూరు వేంకట నారాయణ రావు
జననంకల్లూరు వేంకట నారాయణ రావు
1902, మార్చి 6
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బండమీదపల్లె
మరణం1979
ప్రసిద్ధిసాహిత్యచరిత్రకారుడు, పండితుడు
పదవి పేరుజిల్లావిద్యాశాఖాధికారి
తండ్రికల్లూరు యజమాన సుబ్బారావు
తల్లిలక్ష్మమ్మ

కవిత్వవేదిగా ప్రముఖుడైన రాయలసీమ రచయిత కల్లూరి వెంకటనారాయణరావు. ఈయన తన పేరుతో కాక గుప్తనామాలతో అనేక రచనలు చేసాడు. ఆయన రచనలను పాఠ్యాంశాలుగానూ బోధించేవారు.

బాల్యం

[మార్చు]

కల్లూరు వేంకటనారాయణరావు[1]1902 మార్చినెల 6వతేదీ అనంతపురంజిల్లా రాప్తాడు మండలంలోని బండమీదపల్లెలో జన్మించాడు. బడగనాడు నియోగి శాఖకు చెందినవాడు. వశిష్టగోత్రుడు. స్మార్తభాగవత సంప్రదాయస్తుడు. ద్వైతమార్గనిష్ఠుడు. తండ్రి యజమాన సుబ్బారావు. తల్లి లక్ష్మమ్మ. ఇతని పూర్వీకులు అనంతపురం జిల్లా లేపాక్షిమండలంలోని కల్లూరు గ్రామవాస్తవ్యులు. ఇతడు బాలమేధావిగా పేరొందాడు. విద్యార్థి దశలోనే విజ్ఞానచంద్రికాగ్రంథమాల వారు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నాడు.

విద్యాభ్యాసం, ఉద్యోగం

[మార్చు]

ఇంగ్లీషు, తెలుగు, కన్నడ భాషలలో ఎం.ఎ.చేశాడు. మల్లాది సూర్యనారాయణ శాస్త్రి, ప్రయాగ వెంకటరామశాస్త్రి, గరిమెళ్ల సోమన్న మొదలైన వారివద్ద శిష్యరికం చేశాడు. పుట్టపర్తి నరసింహాచార్యుల వద్ద సంస్కృతం నేర్చుకున్నాడు. 1925లో ఎల్.టి.ఉపాధ్యాయుడిగా అనంతపురం టీచర్ ట్రైనింగ్ స్కూలులో ఉద్యోగం ప్రారంభించాడు. 1934లో డిప్యుటీ ఇన్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా పదోన్నతిని పొంది కంభం, డోన్, జమ్మలమడుగు, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ,ఆలూరు,కర్నూలు,పులివెందుల, తాడిపత్రి,పెనుకొండ,రాయదుర్గం మొదలైన చోట్ల పనిచేశాడు. హొస్పేట, రాయచోటి ట్రైనింగ్ స్కూళ్లలో హెడ్‌మాస్టర్‌గా పనిచేశాడు. 1948 నుండి 1956 వరకు జిల్లావిద్యాశాఖాధికారిగా దక్షిణ కన్నడ, బళ్ళారి, అనంతపురం, నెల్లూరు, కృష్ణా, కడప జిల్లాలలో పనిచేసి 1956లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. ఇతడు క్షణకోపి.ఖండితవాది. ముఖస్తుతి, ఆత్మవంచన ఇతనికి గిట్టవు. ఎంతటివారినైనా నిర్దాక్షిణ్యంగా మాట్లాడటం ఇతని స్వభావం.

సాహిత్యసేవ

[మార్చు]

చిన్నతనంలోనే సత్యనారాయణమహాత్మ్యము, ఆంజనేయ స్తవకళామాలిక, మానసబోధ, కృష్ణార్జునీయము మొదలైన కావ్యాలను రచించాడు. అహల్యాసంక్రందనము అనే నాటకాన్ని 19 యేళ్ళ వయసులోనే రచించాడు. శ్రీరాఘవేంద్రస్త్రోతానికి తెలుగులో వ్యాఖ్యనం వ్రాశాడు. ఆంధ్రపత్రిక ఉగాది సంచికలలో కొన్ని వ్యాసాలు ప్రకటించాడు. బి.ఎ. పరీక్షకోసం వ్రాసుకున్న తెలుగు నోట్స్‌ను కొన్ని మార్పులతో ఆంధ్రవాజ్మయచరిత్ర సంగ్రహముగా రూపొందించి చిలుకూరు నారాయణరావు ప్రోత్సాహముతో వావిళ్ళవారి ద్వారా 1928లో ప్రకటించాడు. ఇది సుప్రసిద్ధ విమర్శగ్రంథముగా ఇతనికి పేరు తెచ్చిపెట్టింది. ఈ గ్రంథం 30 సంవత్సరాలపాటు విద్వాన్ పరీక్షకు పాఠ్యగ్రంథంగా ఉండేది. ఇంకా ఇతడు పాతికకు పైగా రచనలు చేశాడు. ఇతడు పద్యంకాని, గద్యంకాని తడుముకోకుండా సహజధారలో అప్పటికప్పుడే చెప్పగల సద్యస్ఫూర్తి కలవాడు. చెప్పింది, వ్రాసినది సాధారణంగా సవరణకు ఇష్టపడేవాడు కాదు. ఇతడు తన తొలి గ్రంథాలను తన జన్మనామమైన 'భోజరాజు' అనే పేరుతోనూ,ఆంధ్రవాజ్మయచరిత్రసంగ్రహాన్ని 'కవిత్వవేది' పేరుతోనూ, అశోకచరిత్ర కావ్యాన్ని 'బోధార్షేందు' అనే గుప్తనామంతోనూ,ఆంగ్లరచనలను స్వామినారాయణ అనే పేరుతోనూ రచించాడు. ఇతడు రచించిన చారిత్రకకావ్యం శ్రీమదశోక చరిత్రము (శాంతి సామ్రాట్టు - అశోక చరిత్రము) జాతీయోద్యమ నేపథ్యంలో వెలువడింది. దీనిని విశ్వనాథ సత్యనారాయణ, జమ్మలమడక మాధవరామశర్మ, దివాకర్ల వేంకటావధాని,కురుగంటి సీతారామయ్య, మల్లంపల్లి సోమశేఖరశర్మ,నిడుదవోలు వేంకటరావు, తుమ్మల సీతారామమూర్తి చౌదరి మొదలైన వారు ప్రశంసించారు.

సామాజిక, ఆధ్యాత్మిక సేవలు

[మార్చు]

ఇతడు చిన్నతనం నుండి ఆధ్యాత్మిక చింతన కలవాడు. ఇతనికి జ్యోతిశ్శాస్త్రములోనూ, మంత్రశాస్త్రములోనూ ప్రవేశం ఉంది. బాల్యం నుండి భవిష్యద్విజ్ఞానవాణి ఉండుటచే అనేకులు ఇతనిని ఆశ్రయించి తమతమ సాంసారిక క్లేశాలను తగ్గించుకునేవారు. ఇతడు గాయత్రీమంత్ర తత్పరుడై కలరా మొదలైన ఎన్నో వ్యాధులచే బాధపడేవారిని బాగుచేసినాడని, ఇతని సలహాను అనుసరించిన గుడ్డివాడికి చూపు వచ్చిందని, అనేకులకు సంతానమును, ఋణవిముక్తి మార్గమును, సుఖజీవిత యోగమును కలిగించినాడని చెప్పుకుంటారు. దేవాలయ పునరుద్ధరణ పట్ల నూతన ఆశ్రమ నిర్మాణము పట్ల ఇతనికి మక్కువ ఎక్కువ. ఉద్యోగ ప్రస్థానములోనే ఇతడు ఇసురాళ్ళపల్లెలోనూ, రైల్వేకొండాపురం లోను, అనంతపురం వద్ద గుత్తిరోడ్డులో ఉన్న తడకలేరు తీరంలో ఆనంద ఆశ్రమమును, శ్రీరాఘవేంద్రస్వామి బృందావనాశ్రమాలను స్థాపించాడు. ఈయన 1979లో అస్తమించాడు.

ఇతర విశేషాలు

[మార్చు]

నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కల్లూరు వేంకట నారాయణరావుని సన్మానించాలని భావించి ఆహ్వానం పంపగా ఆయన తిరస్కరించారు. కల్లూరు వేంకట నారాయణరావు వంశీకులు సమీప బంధువులైన కల్లూరు అహోబల రావు, శ్రీకృష్ణ దేవరాయ గ్రంథమాల స్థాపించి రాయలసీమ రచయితల చరిత్రను నాలుగు సంపుటాలుగా రచించి ముద్రించారు.

రచనల జాబితా

[మార్చు]
  1. అహల్యాసహస్రాక్షీయము (నాటకం)
  2. ఆంధ్రవాజ్మయచరిత్ర సంగ్రహం (విమర్శ)
  3. పుష్పాంజలి (పద్యకావ్యం)
  4. సత్యలీలాలహరి-తులసీవనమాలిక
  5. శ్రీకృష్ణార్జునీయము (నాటకం)
  6. శ్రీ విద్యారణ్యచరితము (పద్యకావ్యము)
  7. షాజహాన్ (పద్యకావ్యము)
  8. సాధనామృతము
  9. శ్రీమదశోకచరిత్రము(పద్యకావ్యము)
  10. శ్రీవీరేశలింగయుగము (19వశతాబ్దపు ఆంధ్రవాజ్మయచరిత్ర)
  11. The Message of Past and India
  12. శ్రీగీతోత్తర భాగవతము
  13. శ్రీవేదవ్యాస(ఆధ్యాత్మిక)రామాయణము
  14. విశ్వబోధాంజలి (వచనము)
  15. Bodhanjali
  16. శ్రీ ఆంజనేయస్తవకళామాలిక, మానసబోధ , భజనలు
  17. షడ్దర్శనములు(అముద్రితము)
  18. ఇస్లాం తత్త్వమంజూష(అముద్రితము)
  19. అవిధేయతనయ చరిత్రము(అముద్రితము)
  20. ద్రావిడభాషామూలము(అముద్రితము)
  21. పంపాభారతము(ఆదిపర్వము)
  22. పంపాభారత (ఆదిపర్వ) (కన్నడ పద్యకావ్యము)

బిరుదములు

[మార్చు]
  • అంతరార్థకళాప్రపూర్ణ
  • కవితాతపస్వి
  • కవితానందమనోదధి
  • కవిత్వవేది
  • కవిరాజశేఖర
  • మహాకవి

మూలాలు

[మార్చు]
  1. రాయలసీమ రచయితల చరిత్ర మొదటిసంపుటి - కల్లూరు అహోబలరావు,శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం