Jump to content

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు

వికీపీడియా నుండి
(తెలంగాణ ఆవిర్భావ ద‌శాబ్ది వేడుక‌ల‌ు నుండి దారిమార్పు చెందింది)
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగో
ప్రక్రియతెలంగాణ అవతరణ దినోత్సవం
తేదీ(లు)2023 జూన్ 2-22
ప్రారంభం2023 జూన్ 2
ముగింపు2023 జూన్ 22
ప్రదేశంతెలంగాణ
దేశంభారతదేశం
పాల్గొనువారుతెలంగాణ ప్రజలు
నాయకుడుకల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
ముఖ్యమంత్రి
నిర్వహణతెలంగాణ ప్రభుత్వం
వెబ్‌సైటు

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు అనేవి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన చారిత్రక సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఉత్సవాలు. 2023 జూన్ 2వ తేదీ నుండి 21 రోజులపాటు నిర్వహించబడిన ఈ ఉత్సవాలలో ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సంగీత విభావరి, సినిమా, జానపద కళాకారులతో ప్రదర్శనలు, సంగీత, నృత్యం, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.[1]

జూన్ 2న జెండా ఆవిష్కరణతో దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమై, జూన్ 22న అమరుల సంస్మరణతో ముగిసాయి. తెలంగాణ కోసం అమరులైన వారిని నిత్యం స్మరించుకునేందుకు వీలుగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవంలో భాగంగా జూన్ 22న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మొదటగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, నిత్య జ్వలిత దీప్తి అమరజ్యోతిని వెలిగించాడు.[2]

నేపథ్యం

[మార్చు]

తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా పండుగ వాతావరణంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాదు వరకు ఈ ఉత్సవాలు జరిగాయి.

రూపకల్పన

[మార్చు]

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో 2023 మే 13న ఉత్సవాల నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించబడింది. ఈ దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ విధివిధానాలపై ప్రభుత్వం అధికారులకు కీలక ఆదేశాలు జారీచేసింది.[3]

ఉత్స‌వాల క‌మిటీ

[మార్చు]

తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి అధ్య‌క్ష‌త‌న ఉత్స‌వాల క‌మిటీ ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ క‌మిటీలో స‌భ్యులుగా ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేవీ ర‌మ‌ణాచారి, ఎమ్మెల్సీ దేశ‌ప‌తి శ్రీనివాస్, ప్రణాళిక ముఖ్య కార్యాదర్శి, పురపాలక-పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజా సంబంధాల శాఖ ముఖ్య కార్యదర్శి, జీఏడీ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి టీకే శ్రీదేవి, పీఈ శాఖ ముఖ్య కార్యదర్శి, ఐఏఎస్‌ అధికారి ముషారఫ్‌ అలీ ఫరూఖీ, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డా. మామిడి హరికృష్ణ సభ్యులుగా ఉన్నారు. క‌మిటీ క‌న్వీన‌ర్‌గా ఐ అండ్ పీఆర్ స్పెష‌ల్ క‌మిష‌న‌ర్ వ్య‌వ‌హ‌రించారు.[4]

లోగో ఆవిష్కరణ

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం రూపొందించిన అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగోను 2023 మే 22న సచివాలయంలోని తన ఛాంబర్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆవిష్కరించాడు.[5]

తెలంగాణ తల్లి, బతుకమ్మ, బోనాలు, పాలపిట్ట, అమరవీరుల స్మారకం, కాళేశ్వరం, విద్యుత్తు, వ్యవసాయం, మిషన్ భగీరథ, సాంస్కృతిక, యాదాద్రి, మెట్రో రైలు, టీ-హబ్, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం మొదలైన చిహ్నాలతో ఈ లోగో రూపొందించబడింది.

వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల వివరాలతో రూపొందించిన దశాబ్ది ఉత్సవాల వెబ్‌సైట్‌ Archived 2023-06-05 at the Wayback Machineను రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండల తహసీల్దార్‌ కార్యాలయంలో 2023, జూన్ 1న తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు.[6]

తొమ్మిది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలు, సచివాలయం, 125 అడుగుల ఎత్తు గల అంబేద్కర్‌, అమరవీరుల స్తూపం, బడుగు, బలహీన వర్గాలకు అందిస్తున్న అనేక సంక్షేమ పథకాల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచబడ్డాయి.[7]

కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ

[మార్చు]

తొమ్మిది సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని నివేదిస్తూ ఫోటోలు, సమాచారంతో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ‘మెర్క్యురియల్ రైజ్ ఆఫ్ తెలంగాణ’ను 2023 జూన్ 19న ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలోని తన ఛాంబర్ లో ఆవిష్కరించి తొలి ప్రతులను శాసనసభ స్పీకర్ లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందజేశాడు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు టి.హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు రాజీవ్ శర్మ, సీఎం ప్రధాన సలహాదారులు సోమేశ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, సీఎస్ శ్రీమతి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణ రావు, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శ్రీ ముషరఫ్, హరిచందన తదితరులు పాల్గొన్నారు.[8]

రోజువారీ షెడ్యూల్

[మార్చు]
తేది దినోత్సవం కార్యక్రమం
జూన్ 2 ఉత్సవాల ప్రారంభం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించి, హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళుర్పించి సచివాలయ ప్రాంగణంలో జాతీయ పతాకావిష్కరణ జరిపి, దశాబ్ది ఉత్సవ సందేశాన్ని అందించాడు.[9] రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశాలు తదితర కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
జూన్ 3 తెలంగాణ రైతు దినోత్సవం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలు కేంద్రంగా కార్యక్రమాలు జరిగాయి. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో రైతు లు, ప్రజాప్రతినిధులు రైతు వేదికల వద్దకు తరలివచ్చారు. వ్యవసాయరంగంలో రాష్ట్రం సాధించిన విజయాలను, ఉచిత కరంటు, రైతుబంధు, రైతు బీమా తదితర పథకాల విశిష్టతను తెలియజేసే కార్యక్రమాల అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులందరితో కలిసి సామూహికంగా భోజనాలు చేశారు.[10]
జూన్ 4 సురక్షా దినోత్సవం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని, రాష్ట్ర పోలీసు శాఖ సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా రాష్ట్ర, జిలాస్థాయిలో కార్యక్రమాలు జరిగాయి. మాదాపూర్‌లోని దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై జరిగిన దశాబ్ది వేడుకలలో సైబరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం 500 డ్రోన్లతో  దాదాపు 20 నిమిషాలపాటు డ్రోన్‌ షో నిర్వహించబడింది. ఒకేసారి వందల డ్రోన్లు దుర్గం చెరువుపై ఎగురుతూ కారు, సీఎం కేసీఆర్‌, జై భారత్‌, జై తెలంగాణ, సచివాలయం, యాదాద్రి, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ భగీరథ, అంబేద్కర్‌ విగ్రహం, పోలీస్‌ ఇమేజ్‌ టవర్స్‌, షీటీమ్స్‌, సైబరాబాద్‌ పోలీసు లోగోలను ప్రదర్శించాయి.[11]
జూన్ 5 తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం నియోజకవర్గస్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశాల్లో విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పును తెలియజేసే కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. సింగరేణి సంబురాలు కూడా జరిగాయి.
జూన్ 6 తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహించి ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని వివరాలను తెలియజేశారు. దండు మల్కాపూర్‌లో ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఎంఎస్‌ఎంఈ గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌లో 50కి పైగా పరిశ్రమలను మంత్రి కేటీఆర్ ప్రారంభించాడు.[12]
జూన్ 7 సాగునీటి దినోత్సవం రవీంద్ర భారతిలో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సమావేశంతోపాటు ప్రతి నియోజకవర్గంలో సభలు జరిగాయి. సూర్యాపేట జిల్లాలో కాళేశ్వరం జలాలు పారుతున్న 68 కిలోమీటర్ల మేర మధ్యాహ్నం 12 గంటలకు లక్షమందితో 'కాళేశ్వరం జలానికి-లక్ష జనహారతి' కార్యక్రమం జరిగింది. రామప్ప చెరువులో మంత్రి కేటీఆర్, చివ్వేంల మండల కేంద్రంలోని 71 డీబీయం కాళేశ్వరం జలాలకు మంత్రి జగదీష్‌ రెడ్డి జలహారతి ఇచ్చి, ప్రత్యేక పూజలు చేశారు.
జూన్ 8 ఊరూరా చెరువుల పండుగ డప్పులు, బోనాలు, బతుకమ్మలు, కవులు రాసిన పాటలు, మత్స్యకారుల వలల ఊరేగింపులతో గ్రామ చెరువు దగ్గరికి వెళ్ళి చెరువుకట్టలపై సభలు నిర్వహించారు. నాయకులు, ప్రజలు కలిసి చెరువు కట్టమీద సహపంక్తి భోజనాలు చేశారు.[13][14]
జూన్ 9 తెలంగాణ సంక్షేమ సంబురాలు నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సభలు జరిగాయి. తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగం సాధించిన తీరును, దేశానికి దిక్సూచిగా మారిన తీరును వివరిస్తూ రవీంద్రభారతి నిర్వహించిన సభలో సంక్షేమ శాఖల మంత్రులు పాల్గొన్నారు. మంచిర్యాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ పథకాలను ప్రారంభించాడు.
జూన్ 10 తెలంగాణ సుపరిపాలన దినోత్సవం అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును తెలియజేసే కార్యక్రమాలను నిర్వహించారు.
జూన్ 11 తెలంగాణ సాహిత్య దినోత్సవం జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు, రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం జరిగింది. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా జిల్లా, రాష్ట్రస్థాయిలో కవితల పోటీలు నిర్వహించారు.
జూన్ 12 తెలంగాణ రన్ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.[15][16]
జూన్ 13 తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సమావేశాలలో వివరించారు. ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానం చేశారు.
జూన్ 14 తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం రాష్ట్రంలో వైద్య ఆరోగ్యరంగంలో జరిగిన విప్లవాత్మక అభివృద్ధి, ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్య విధానాల ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ధి గురించిన సమాచారాన్ని, సందేశాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందజేశారు. హైదరాబాదులోని నిమ్స్ లో 2 వేల పడకలతో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానా దశాబ్ధి' వైద్య భవన నిర్మాణానికి, నిమ్స్ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశాడు.[17]
జూన్ 15 తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతిని తెలిపే పలు కార్యక్రమాలు జరిగాయి. అవార్డు సాధించిన ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు, ఉత్తమ మండలాల ఎంపీపీలకు మంత్రులు, ఎమ్మెల్యేలు సన్మానం చేశారు.[18]
జూన్ 16 తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం పట్టణ ప్రగతి ద్వారా ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పట్టణాలు సాధించిన ప్రగతిని, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని తెలిపే కార్యక్రమాలు జరిగాయి. హైదరాబాదు మహానగరపాలక సంస్థ పరిధిలోని 150 వార్డులలో వార్డు పరిపాలన ప్రారంభించబడింది. కాచిగూడలోని వార్డు కార్యాలయాన్ని పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు.[19]
జూన్ 17 తెలంగాణ గిరిజనోత్సవం నూతనంగా ఏర్పడిన గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహించి, గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించారు. రవీంద్రభారతిలో ఉత్సవ సంబరాల్లో రాష్ట్ర మంత్రులు, చైర్మన్లు, వివిధ యూనివర్సిటీల వీ.సీలు, ప్రొఫెసర్లు, ఎరుకల సంఘం నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జూన్ 18 తెలంగాణ మంచినీళ్ల పండుగ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న తాగునీటి ఎద్దడి నుంచి నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు బిగించి ఉచితంగా స్వచ్ఛమైన సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న తీరును వివరించే వివిధ కార్యక్రమాలు జరిగాయి. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొని జలమండలి తాగునీటి రంగంలో సాధించిన విజయాలపై రూపొందించిన బుక్ లెట్ ను ఆవిష్కరించారు.
జూన్ 19 తెలంగాణ హరితోత్సవం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ హరితోత్సవంలో భాగంగా రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, తుమ్మ‌లూరులోని అర్బన్‌ ఫారెస్ట్‌లో మహాగని మొక్కను నాటి, 9వ విడత రిత‌హారంను ప్రారంభించాడు.[20] రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించబడింది. అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున జరిగిన కృషిని, తద్వారా అడవులు పెరిగిన తీరును వివరించారు. రవీంద్రభార‌తిలో నిర్వహించబడిదన హరితోత్స‌వం కార్యక్రమంలో ఉత్తమ సేవా మున్సిపాలిటీ అవార్డులను అందించారు.
జూన్ 20 తెలంగాణ విద్యాదినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల విద్యాసంస్థల్లో సభలు నిర్వహించి విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ఆధునికీకరించిన వెయ్యి బడులు, రాష్ట్రంలోని 25,26,907 విద్యార్థులకు ఉదయం 250 మిల్లీలీటర్ల రాగిజావ అందించే కార్యక్రమంతోపాటు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌, నోటుపుస్తకాలు, 19,800 ప్రాథమిక పాఠశాలలకు ట్యాబ్‌లు పంపిణీ చేయబడ్డాయి. 5వేల పాఠశాలల్లో రీడింగ్‌ కార్నర్లతోపాటు కంప్యూటర్ ఛాంప్స్ పేరుతో 1,600 పాఠశాలల్లో 4,800 డిజిటల్‌ తరగతులు ప్రారంభించబడ్డాయి.[21] రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో 8.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన విద్యా క్యాంపస్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించాడు.[22]
జూన్ 21 తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర మత ప్రార్థనా మందిరాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
జూన్ 22 అమరుల సంస్మరణ దినోత్సవం తెలంగాణవ్యాప్తంగా పల్లెపల్లెనా, పట్టణాలు, నగరాల్లో, విద్యాలయాల్లో అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటించారు. హైదరాబాద్ లో అమరుల గౌరవార్ధం ట్యాంక్ బండ్ పై కళాకారులతో భారీర్యాలీ నిర్వహించబడింది. నూతనంగా నిర్మించిన తెలంగాణ అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించాడు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉదయం అమరవీరుల స్థూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటించి, సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించిన సభలో పాల్గొన్నారు.

ముగింపు

[మార్చు]
తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్, తదితరులు
స్విఛాన్ చేసి తెలంగాణ అమరవీరుల స్మారక జ్యోతిని వెలిగించిన ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ అమరవీరులకు నివాళిగా క్యాండిల్‌ లైట్స్‌ ప్రదర్శనలో ముఖ్యమంత్రి కేసీఆర్, తదితరులు

జూన్ 22న నిర్వహించబడిన అమరుల సంస్మరణ దినోత్సవంతో ఈ ఉత్సవాలు ముగించబడ్డాయి. జై తెలంగాణ, తెలంగాణ అమరవీరులకు జోహార్లు అనే నినాదాలతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి హైదరాబాదులోని సచివాలయం ఎదురుగా ఏర్పాటుచేసిన అమరవీరుల సంస్మరణ వేదిక వరకు బైక్‌ ర్యాలీలు జరిగాయి.

అమరవీరుల గౌరవార్థం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో 125 అడుగుల డా. బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహం నుండి రాష్ట్ర సచివాలయం ఎదురుగా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం వేదిక వరకు 30 కళారూపాలకు చెందిన  6200 మందికి పైగా కళాకారులతో భారీ ఎత్తున 'అమరవీరుల సంస్మరణ ర్యాలీ' నిర్వహించబడింది. లక్షలమంది జనసంద్రంలో ఒగ్గుడోలు ఓంకార నాదాల మధ్య బోనాల కోలాటం ఆట పాటలతో తమ ప్రదర్శనలతో, విన్యాసాలతో అమరవీరులకు ఘనమైన సాంస్కృతిక నివాళిని అర్పించారు.[23]

ఈ సందర్భంగా తెలంగాణ కోసం అమరులైన వారిని నిత్యం స్మరించుకునేందుకు వీలుగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదటగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, నిత్య జ్వలిత దీప్తి అమరజ్యోతిని వెలిగించాడు. మొదటగా పోలీసులు అమరవీరులకు గౌరవ వందనం చేసి, 12 తుపాకులతో గన్‌ సెల్యూట్‌ నిర్వహించారు.[24]

‘జోహారులూ.. జోహారులూ.. అమరులకు జోహార్‌.. వీరులకు జోహార్‌’ అంటూ గేయాలాపనతో 10 వేల క్యాండిల్‌ లైట్స్‌ ప్రదర్శిస్తూ సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు అమరవీరులకు అర్పించిన నివాళితో అమరవీరుల సంస్మరణ సభ ప్రారంభమవగా, అమరవీరుల త్యాగాలను గుర్తుచేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగించాడు.[25][26]

మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాల్ని త్యాగం చేసిన అమరవీరుల కుటుంబ సభ్యులను (అమరుడు కాసోజు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ, తమ్ముడు రవీంద్రచారి... అమరుడు పోలీసు కిష్టయ్య భార్య పద్మావతి, కూతురు ప్రియాంక, కొడుకు రాహుల్‌... అమరుడు వేణుగోపాల్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ, అన్న వెంకట్రామిరెడ్డి, మేనమామ సిద్ధారెడ్డికి... అమరుడు సిరిపురం యాదయ్య వదిన లక్ష్మమ్మ, సోదరుడు మహేశ్‌... అమరుడు యాదిరెడ్డి తల్లి చంద్రమ్మ, సోదరుడు ఓంరెడ్డి... కావలి సువర్ణ తల్లిదండ్రులు) వేదిక మీదకు ఆహ్వానించి అమరజ్యోతి సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా సత్కారం అందించి గౌరవించారు.[27]

800 డ్రోన్లతో తెలంగాణ ఖ్యాతి నింగిని తాకేలా డ్రోన్ షో ప్రదర్శించబడింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్రవ్యాప్త ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

ఇతర వివరాలు

[మార్చు]

తెలంగాణ ప్రగతిపై డాక్యుమెంటరీ ప్రదర్శన: ప్రతిశాఖ సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని కూలంకశంగా రికార్డు చేస్తూ అన్నిశాఖలకు శాఖల వారీగా ఒక్కో డాక్యుమెంట్‌ను రూపొందించి 20రోజులపాటు సినిమా హాల్స్‌ టీవీలు తదితర మాధ్యమాల ద్వారా ప్రదర్శించారు.

తెలంగాణ ప్రస్థానంపై డాక్యుమెంటరీ: స్వతంత్ర భారతంలో తెలంగాణ కోసం సాగిన తొలిదశ ఉద్యమం నుంచి తెలంగాణను సాధన వరకు తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలియచేసే డాక్యుమెంటరీ, తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి ప్రభుత్వ పాలన ప్రారంభమైన 2014 జూన్ 2 నుండి 2023 జూన్ 2 దాకా స్వయంపాలనలో సాగిన సుపరిపాలన అది సాధించిన ప్రగతిని గురించిన డాక్యుమెంటరీలను రూపొందించారు.

చారిత్రక కట్టడాల అలంకరణ: గోల్కొండ కోట, భువనగిరి కోటలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలను, ప్రముఖ రామప్ప సహా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలను అందంగా విద్యుద్దీపాలతో అలంకరించారు. హుస్సేన్ సాగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బాణాసంచా పటాకులతో వెలుగులు విరజిమ్మేలా ప్రదర్శన కార్యక్రమాలను చేపట్టారు.

సాంస్కృతిక కార్యక్రమాలు: రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో 5నుంచి ఆరువేలమంది కళాకారులతో హైదరాబాద్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, ధూంధాం ర్యాలీ నిర్వహించబడ్డాయి.[28]

మూలాలు

[మార్చు]
  1. "CM Kcr: 21 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు: సీఎం కేసీఆర్‌". EENADU. 2023-05-13. Archived from the original on 2023-05-13. Retrieved 2023-05-13.
  2. telugu, NT News (2023-06-23). "CM KCR | పాలకుల్లో స్ఫూర్తి రగిలించేలా ఆకాశమంత దీపకళిక.. ఇకపై ప్రముఖులు ఎవరొచ్చినా ఇక్కడే తొలివందనం: ముఖ్యమంత్రి కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-06-24. Retrieved 2023-06-24.
  3. telugu, NT News (2023-05-13). "CM KCR | తెలంగాణ ఘనకీర్తిని చాటేలా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు : సీఎం కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-05-13. Retrieved 2023-05-13.
  4. telugu, NT News (2023-05-18). "దశాబ్ది ఉత్సవాల కమిటీ ఏర్పాటు". www.ntnews.com. Archived from the original on 2023-05-18. Retrieved 2023-05-18.
  5. "Telangana: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌". EENADU. Archived from the original on 2023-05-22. Retrieved 2023-05-22.
  6. "దశాబ్ది ఉత్సవాల వెబ్‌సైట్‌ ప్రారంభం". EENADU. 2023-06-02. Archived from the original on 2023-06-02. Retrieved 2023-06-04.
  7. ABN (2023-06-01). "దశాబ్ది ఉత్సవాల వెబ్‌ సైట్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-06-01. Retrieved 2023-06-04.
  8. "'తెలంగాణ ప్రగతి' నివేదన పుస్తకావిష్కరణ". EENADU. Archived from the original on 2023-06-20. Retrieved 2023-06-20.
  9. telugu, NT News (2023-06-02). "CM KCR | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. ముఖ్యమంత్రి ప్రసంగం". www.ntnews.com. Archived from the original on 2023-06-03. Retrieved 2023-06-04.
  10. telugu, NT News (2023-06-04). "Telangana Decade celebrations | పల్లెపల్లెన.. రైతు పండుగ.. కోలాహలంగా రైతువేదికలు". www.ntnews.com. Archived from the original on 2023-06-04. Retrieved 2023-06-05.
  11. telugu, NT News (2023-06-05). "Suraksha Dinotsavam | ఆకాశమంత అభిమానం.. దుర్గం చెరువుపై కట్టిపడేసిన డ్రోన్‌ షో". www.ntnews.com. Archived from the original on 2023-06-05. Retrieved 2023-06-05.
  12. telugu, NT News (2023-06-05). "Minister KTR | ఉన్న ఊళ్లోనే ఉద్యోగం.. 35వేల మందికి కొలువు.. రేపు దండు మల్కాపూర్‌లో 51 పరిశ్రమలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-06-05. Retrieved 2023-06-06.
  13. "చెరువంత సంబురం". EENADU. 2023-06-09. Archived from the original on 2023-06-09. Retrieved 2023-06-09.
  14. telugu, NT News (2023-06-09). "Telangana Decade Celebrations | ఊరూరా చెరువుల పండుగ.. డప్పు చప్పుళ్లతో మార్మోగిన పల్లెలు". www.ntnews.com. Archived from the original on 2023-06-09. Retrieved 2023-06-09.
  15. "శతాబ్ది దిశగా తెలంగాణ రన్‌". EENADU. 2023-06-13. Archived from the original on 2023-06-13. Retrieved 2023-06-13.
  16. telugu, NT News (2023-06-12). "Telangana Run | రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ 2కే రన్.. ఫొటోలు". www.ntnews.com. Archived from the original on 2023-06-12. Retrieved 2023-06-13.
  17. "CM Kcr: నిమ్స్‌లో 'దశాబ్ది' బ్లాక్‌ నిర్మాణం.. సీఎం కేసీఆర్ శంకుస్థాపన". EENADU. 2023-06-14. Archived from the original on 2023-06-14. Retrieved 2023-06-14.
  18. Namasthe Telangana (16 June 2023). "సఫాయన్నా.. మీకు సలామన్నా.. వైభవంగా పల్లె ప్రగతి దినోత్సవం". Archived from the original on 16 June 2023. Retrieved 16 June 2023.
  19. telugu, NT News (2023-06-16). "Minister KTR | అధికారులు ప్రజలకు మరింత చేరువగా ఉండేందుకే వార్డు పరిపాలన: మంత్రి కేటీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-06-17. Retrieved 2023-06-17.
  20. Satyaprasad, Bandaru (2023-06-19). "Harithotsavam : తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా పచ్చదనమేనన్న సీఎం కేసీఆర్, 9వ విడత హరితహారం ప్రారంభం". Hindustantimes Telugu. Archived from the original on 2023-06-19. Retrieved 2023-06-19.
  21. "డిజిటల్‌ అక్షరాస్యతకు 'కంప్యూటర్‌ ఛాంప్స్‌'". EENADU. 2023-06-20. Archived from the original on 2023-06-20. Retrieved 2023-06-20.
  22. telugu, NT News (2023-06-20). "KTR | త‌ర‌గ‌తి గ‌ది నాలుగు గోడ‌లు.. భార‌త‌దేశ భ‌విష్య‌త్‌కు మూల‌స్తంభాలు : మంత్రి కేటీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-06-20. Retrieved 2023-06-20.
  23. telugu, NT News (2023-06-23). "అమరుల స్ఫూర్తి నిత్య జ్వలిత దీప్తి". www.ntnews.com. Archived from the original on 2023-06-24. Retrieved 2023-06-24.
  24. "అమ‌రుల స్మార‌క చిహ్నాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్". Sakshi. 2023-06-22. Archived from the original on 2023-06-24. Retrieved 2023-06-24.
  25. "త్యాగనిరతి.. అమరజ్యోతి". EENADU. 2023-06-23. Archived from the original on 2023-06-24. Retrieved 2023-06-24.
  26. "మీ వెలుగులో ముందుకు". Sakshi. 2023-06-23. Archived from the original on 2023-06-22. Retrieved 2023-06-24.
  27. telugu, NT News (2023-06-23). "Telangana Martyrs Memorial | అమర జ్యోతి.. అఖండ స్ఫూర్తి.. ఫొటో గ్యాల‌రీ". www.ntnews.com. Archived from the original on 2023-06-24. Retrieved 2023-06-24.
  28. telugu, NT News (2023-05-13). "Telangana Formation Day | 21 రోజుల పాటు తెలంగాణ అవతరణ దశాబ్ధి వేడుకలు." www.ntnews.com. Archived from the original on 2023-05-13. Retrieved 2023-05-13.

బయటి లింకులు

[మార్చు]