దృశ్యం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దృశ్యం
Drushyam poster.jpg
దర్శకత్వంశ్రీప్రియ
నిర్మాతదగ్గుబాటి సురేష్ బాబు,
రాజ్ కుమార్ సేతుపతి
రచనజీతు జోసెఫ్
నటులుదగ్గుబాటి వెంకటేష్,
మీనా,
నదియా,
నరేష్
సంగీతంశరత్
ఛాయాగ్రహణంఎస్. గోపాల్ రెడ్డి
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ
సురేష్ ప్రొడక్షన్స్,
వైడ్ యాంగిల్ క్రియేషన్స్,
రాజ్ కుమార్ థియేటర్స్ ప్రై. లి.
విడుదల
జులై 11, 2014
భాషతెలుగు

సురేష్ ప్రొడక్షన్స్, వైడ్ యాంగిల్ క్రియేషన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ ప్రై. లి. సమ్యుక్తంగా నిర్మించించబడిన 2014 తెలుగు సినిమా "దృశ్యం". ఫ్యామిలీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన అరుదైన తెలుగు సినిమాల్లో ఒకటైన ఈ సినిమా మలయాళంలో 2013లో మోహన్ లాల్, మీనా, ఆశా శరత్, సిద్ధిక్ ముఖ్యపాత్రలు పోషించిన దృశ్యం సినిమాకి అధికారిక రీమేక్. 1980లలో నటిగా వెలిగిన శ్రీప్రియ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా దగ్గుబాటి సురేష్ బాబు, శ్రీప్రియ భర్త మరియూ నిర్మాత రాజ్ కుమార్ సేతుపతి ఈ సినిమాని సమ్యుక్తంగా నిర్మించారు.[1] దగ్గుబాటి వెంకటేష్, మీనా, నదియా, నరేష్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాలో కృతిక జయకుమార్, ఎస్తర్, రవి కాలే, సమీర్, సప్తగిరి, చలపతిరావు, చైతన్య కృష్ణ, రోషన్ బషీర్ మొదలగువారు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.[2] ఈ సినిమాతో సురేష్ ప్రొడక్షన్స్ సినీరంగంలో 50 ఏళ్ళు పూర్తిచేసుకుంది.[3]

ఈ సినిమా రాంబాబు అనే మధ్యతరగతి వ్యక్తి, తన కుటుంబం చుట్టూ తిరుగుతుంది. అరకులోని రాజవరం గ్రామంలో కేబుల్ ఆపరేటరుగా పనిచేసే రాంబాబుకి తన భార్య జ్యోతి, కూతుళ్ళు అంజు, అనులే ప్రపంచం. అనుకోకుండా వరుణ్ అనే కుర్రాడు అంజు నగ్నంగా ఉన్నప్పుడు ఒక వీడియో తీసి దాన్ని చూపించి అంజుని, జ్యోతిని బెదిరిస్తాడు. తమని తాము కాపాడుకోవడం కోసం వరుణ్ తలపై మోది గాయపరచాలనుకున్నా అతను చనిపోతాడు. విషయం తెలుసుకున్న రాంబాబు వరుణ్ తల్లి, ఇన్స్పెక్టర్ జనరల్ అయిన గీత ప్రభాకర్ నుంచి, ఇతర పోలీసుల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోడానికి ఏం చేసాడన్నదే ఈ సినిమా యొక్క మూల కథ.

శరత్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించగా ఎస్. గోపాల్ రెడ్డి ఈ సినిమాకి ఛాయాగ్రాహకునిగా, మార్తాండ్ కె. వెంకటేష్ ఈ సినిమాకి ఎడిటరుగా పనిచేసారు. ఈ సినిమా చిత్రీకరణ 2014 మార్చి 8న కేరళలో మొదలయ్యింది. అక్కడి నుంచి అరకు, విశాఖపట్నం, సింహాచలం, విజయనగరం, హైదరాబాదు ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో 2014 జూన్ 8న పూర్తయ్యింది.[4] ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2014 జూలై 11న విడుదలైనా 2014 జూలై 9న ప్రత్యేకమైన ప్రీమియర్ షోలను ఏర్పాటు చేసారు.[5][6] విమర్శకులను అమితంగా మెప్పించిన ఈ సినిమా భారీ విజయాన్ని కైవసం చేసుకుంది.[7]

కథ[మార్చు]

రాంబాబు (వెంకటేష్) అరకు ప్రాంతంలోని రాజవరం అనే గ్రామంలో తన భార్య జ్యోతి (మీనా) పేరు మీద పెట్టిన జ్యోతి కేబుల్ నెట్వర్క్ ద్వారా కేబుల్ ఆపరేటరుగా పనిచేస్తాడు. అనాధైన రాంబాబుకి జ్యోతి, తన ఇద్దరు పిల్లలు అంజు (కృతిక జయకుమార్), అను (ఎస్థర్)లే లోకం. ఇదీ కాక నాలుగవ తరగతి పాసయ్యాక చదువు ఆపేసిన రాంబాబుకి సినిమాలంటే విపరీతమైన ఆసక్తి. మధ్యతరగతి కుటుంబం అయినా వీళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఊళ్ళో కూడా రాంబాబు అంటే చాలా మందికి అభిమానం, గౌరవం. రాంబాబు ఎప్పుడు బాబాయి అని పిలిచే ఒక వ్యక్తి ఒక హోటల్ నడుపుతుంటాడు. ఆ హోటల్ ముందు కొత్త పోలీస్ స్టేషను కడుతుంటారు. రాంబాబు నిజాయితీపరుడైతే అతని శత్రువు వీరభద్రం (రవి కాలె) అవినీతిపరుడైన కానిస్టేబుల్. వీరభద్రం ఎందరినో హింసించి బాధపెట్టి బతుకుతుంటే రాంబాబుకి అతనికి గొడవలొచ్చి శత్రువులుగా మారతారు. అది కూడా ఒకందుకు రాంబాబుకి ఊళ్ళో జనాలకి తనపై గౌరవం పెరిగేలా చేసింది. అంతా బాగుందనుకున్నప్పుడు నేచర్ క్యాంప్ వెళ్ళి తిరిగొచ్చిన అంజుని వరుణ్ (రోషన్ బషీర్) అనే కుర్రాడు రాజవరంలో తిరిగి కలుస్తాడు. అక్కడ క్యాంపులో అంజు బట్టలు మార్చుకుంటున్నప్పుడు సెల్ ఫోనులో తీసిన వీడియో చూపించి తనని బెదిరిస్తాడు. అంజు నన్ను వదిలెయ్యమని బ్రతిమాలినా ప్రయోజనం ఉండదు. ఆ రాత్రి వర్షం పడుతున్నప్పుడు వరుణ్ పసుపు రంగు మారుతి కారులో రాంబాబు ఇంటికి వస్తాడు. అక్కడ రాత్రి 11 గంటలకు వరుణ్ అంజు, జ్యోతిలను వీడియో చూపించి బెదిరించి తనతో ఒక గంట పడుకోమంటాడు. ఆవేశంతో అంజు వరుణ్ తలపై ఐరన్ రాడ్డుతో మోదగా అతను కింద పడి ఎక్కడో లోపల గాయమై చనిపోతాడు. వెంటనే అంజు సెల్ ఫోన్ పగలకొడుతుంది. వరుణ్ శవాన్ని ఒక గోనుసంచిలో మూటకట్టి ఎరువుల కోసం రాంబాబు తవ్విన గొయ్యిలో పారేసి పూడ్చేస్తారు. అను జ్యోతి, అంజు గొయ్యిలో గోనుసంచి పడేసి పూడ్చెయ్యడాన్ని అను కిటికీలోనుంచి చూస్తుంది. రాంబాబుకి ఫోన్ చేసి చెప్దామంటే అతను సిగ్నల్స్ లేని కారణంగా సెల్ ఫోన్ కొనడు, వాడడు. వర్షం కురుస్తున్నందువల్ల కేబుల్ ఆఫీసులో ఉన్న రాంబాబు ఫోన్ పని చెయ్యదు.

కేబుల్ ఆఫీసులో రాత్రంతా గడిపి, సినిమాలు చూసి ఇంటికి తిరిగి రావడం రాంబాబు నిత్యం చేసే పని అవ్వడం వల్ల మరుసటి ఉదయం రాంబాబుకి జ్యోతి, పిల్లలు జరిగిందంతా చెప్తారు. జరిగిందంతా ఓపిగ్గా విన్న రాంబాబు కుటుంబాన్ని ఓదార్చి పోలీసుల నుంచి ఎలాగైనా మిమ్మల్ని కాపాడతానని హామీ ఇస్తాడు. కారణం ఏంటంటే, వరుణ్ ప్రపంచం దృష్టిలో ఇంకా బ్రతికే ఉన్నాడు. తన తల్లి గీత (నదియా) ఇన్స్పెక్టర్ జనరల్. తండ్రి ప్రభాకర్ (నరేష్) పెద్ద కోటీశ్వరుడు. లేక లేక పుట్టిన సంతానం అవ్వడం వల్ల వరుణ్ గారాభంగా పెరిగి దురలవాట్లకు బానిసయ్యాడు. అలాంటిది అతను కనపడటం లేదంటే కచ్చితంగా పోలీసులు తనకోసం వెతుకుతారు. అందుకోసం వరుణ్ సెల్, కారుని వెతికి తద్వారా అతని ఆచూకీని తెలుసుకుంటారు. కాబట్టి ఇప్పుడు రాంబాబు వాటిని మాయం చెయ్యాలి. ముందు వరుణ్ చనిపోయిన ప్రదేశానికెళ్ళి దినపత్రికతో విరిగిపోయిన ఫోనులోని సిం కార్డుని తీసుకుని దాన్ని పేపరులో మడిచి జేబులో పెట్టుకుని కారు తీసుకుని విజయనగరం వెళ్తుండగా ఆ పసుపు రంగు కారుని, అందులో రాంబాబుని వీరభద్రం చూస్తాడు. అయితే అతని మాటలను ఎవ్వరూ నమ్మరు. విజయనగరంలో సెకండ్ హ్యాండ్ ఫోన్ కొని ఆ షాప్ వాడి చేతే సిం కార్డ్ పెట్టించి, అతని చేతే ఫోన్ సైలెంటులో పెట్టించి తన వేలి ముద్రలు సెల్ ఫోనుపై పడకుండా దాన్ని కారులో ఉన్న మద్యంతో తడిపి బాగా తోమి గుడ్డలో చుట్టేసి దాన్ని ఒక నేషనల్ పర్మిట్ లారీపై పడేస్తాడు. ఆ తర్వాత దేవులపల్లిలో వాతావరణ కాలుష్యం కారణంగా మూసివేయబడిన క్వారీలోని చెరువులోకి తోసేసి ఇంటికొచ్చాక రేపు జ్యోతి, పిల్లలతో విజయనగరంలో సాయిబాబా గుడిలో జరుగుతున్న సచ్చిదానంద స్వామీజీ ప్రవచనాలకు వెళ్దామంటాడు. విజయనగరం వెళ్ళి అక్కడ సాయిబాబా గుడిలో దర్శనం చేసుకుని సాయంత్రం దాకా అక్కడే ఉండి రాత్రి ఒక చిన్న హోటల్లో టిఫిన్ చేసి ఒక లాడ్జిలో దిగి మరుసటి రోజు ఉదయం పక్క హోటల్ నుంచి టిఫిన్ తెప్పించి బిల్లు చింపేస్తాడు. ఆ తర్వాత థియేటరులో రేసుగుర్రం సినిమా చూసి పెద్ద హోటలుకెళ్ళి బిరియాని తిని ఆర్టీసీ బస్సెక్కి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు.

దేవులపల్లి క్వారీలోని చెరువులో వరుణ్ కారుని వారాల తర్వాత ఇద్దరు కుర్రాళ్ళ వల్ల దాన్ని బయటకు తీస్తారు పోలీసులు. పోలీసులు వరుణ్ కారు, సెల్ ఫోన్ రూట్లను పరిశీలించి ఆ ఫోన్ విశాఖపట్నంలో కవరేజ్ ఏరియాలో మొదలై కొంత దూరం వెళ్ళాక నాన్ కవరేజ్ ఏరియాలోకి వెళ్ళి మళ్ళీ విజయనగరంలో కవరేజ్ ఏరియాలోకి వచ్చి ఆపై చివరికి ఖరఘ్ పూర్ ప్రాంతంలోని ఒక పారిశ్రామిక ప్రాంతంలో సిగ్నల్స్ ఆగిపోయాయి. వరుణ్ రాజవరంలోని ఒక ఏటీఎంలో 20 వేల రూపాయలు క్రెడిట్ కార్డ్ వాడి తీసుకున్నాడని తెలుసుకున్న గీత రాజవరం పోలీస్ స్టేషను సబ్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ ఆఫీసుకి వరుణ్ ఫొటో ఫ్యాక్స్ చేస్తుంది. వరుణ్ వాడిన పసుపు కారుని చూసి వీరభద్రం ఈ కారుని రాంబాబు తీసుకెళ్ళడం నేను చూసానంటాడు. ఆగస్టు 3న ఒక ఇంటికి పాస్ పోర్ట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళిన వీరభద్రం రాంబాబు ఆ కారుని తియ్యడం చూస్తాడు. కానీ ఎవ్వరూ అతని మాటలు నమ్మరు. ప్రాథమిక విచారణ జరిపాక నవీన్ గీత కోరుకున్నట్టుగానే రాంబాబుని, అతని కుటుంబాన్ని విచారణకు పిలుస్తారు. ఇది జరుగుతుందని ఊహించిన రాంబాబు తన కుటుంబానికి పోలీసుల ముందు ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు. వాళ్ళందరూ చెప్పేది ఒకటే. ఆగస్టు 2 ఉదయం దాదాపు 8:30కి విజయనగరం సాయిబాబా గుడికి వెళ్ళారు. అప్పటికే అక్కడ ప్రవచనాలు మొదలయ్యాయి. రాత్రి హోటల్లో బస చేసి ఆగస్టు 3 పొద్దున్న రేసుగుర్రం సినిమా చూసి పెద్ద హోటల్లో బిరియాని తిని సాయంత్రం 5:00కి ఆర్టీసీ బస్సెక్కి వర్షంలో తడిసి ఇంటికి చేరారు. జలుబు, జ్వరం రావడం వల్ల పిల్లలు రెండు రోజులు స్కూలుకి వెళ్ళలేదు. సాక్ష్యాలుగా హోటల్ బిల్స్, బస్ టికెట్స్, సినిమా టికెట్స్, మెడికల్ బిల్స్ చూపిస్తారు. ఇవన్నీ విన్నాక వాళ్ళని ఇంటికి పంపేసి గీత ఇదొక కట్టుకథ అని బలంగా నమ్మి వాళ్ళు చెప్పిన కథలోని ప్రతీపాత్రని తీసుకు రమ్మంటుంది. వాళ్ళందరూ అనగా హోటల్ ఓనర్ (కాశీ విశ్వనాథ్), లాడ్జి ఓనర్ (జోగినాయుడు), థియేటర్ ప్రొజెక్టర్ ఆపరేటర్ (ఉత్తేజ్), బస్ కండక్టర్స్ (చిత్రం శ్రీను, కాదంబరీ కిరణ్), ప్రవచనం చెప్పిన స్వామీజీతో ఫోనులో మాట్లాడి గీత రాంబాబు వాళ్ళందరినీ అయితే ఆగస్టు 2 లేదా 3న కలిసాడని తెలుసుకుంటుంది. ఇదంతా జరిగి దాదాపు 25 రోజులైనా కూడా మీకెలా గుర్తుందని అడిగితే వాళ్ళంతా 3 రోజుల క్రితం మేం కలిసినప్పుడు మాట్లాడుకున్నామని, ఆ సందర్భంలో మేం మొదట ఆ రోజుల్లో అనగా ఆగస్టు 2 లేదా 3న కలిసామని అతని ద్వారా తెలుసుకున్నామని చెప్తారు. గీత అప్పుడు నిజాన్ని గ్రహిస్తుంది.

రాంబాబు ఆగస్టు 4,5న ప్రయాణం చేసాడు. ఆ రెండు రోజుల్లో చెప్పిందంతా జరిగింది. కానీ రాంబాబు చూపించిన సాక్ష్యాల వెనుక అసలు రహస్యం వేరే ఉంది. అదేంటంటే రాంబాబు ఆగస్టు 3న కారు చెరువులో తోసేసాక ఒక పెద్ద హోటలుకెళ్ళి అక్కడ నలుగురు తిన్న బిరియాని బిల్లుని దొంగిలించాడు. థియేటరుకెళ్ళి 4 టికెట్లు తీసుకుని సినిమా చూడలేదు. వేరే హోటలుకెళ్ళి అక్కడ టిఫిన్ తీసుకుని బిల్ తీసుకున్నాడు. ఆపై తిరుగుప్రయాణంలో ఆర్టీసీ బస్సెక్కి 4 టికెట్లు తీసుకుని రాత్రి ఆఫీసుకెళ్ళి అతని అసిస్టంట్ సింహాద్రితో నేను కుటుంబంతో సహా విజయనగరానికి ప్రవచనాలకి వెళ్తున్నానని చెప్పి 4,5 తేదీల్లో విజయనగరం వెళ్ళాడు. రాత్రి హోటల్లో దిగేటప్పుడు ఇది కుటుంబాలుండే లాడ్జ్ కాదేమోనని జ్యోతి చేత చెప్పించి లాడ్జ్ ఓనరుని జ్యోతి, పిల్లలతో రూము చూపించేందుకు పంపిన రాంబాబు బిల్ తీసుకోని రిజిస్టరులో 2వ తేదీన వచ్చి 3వ తేదీన వెళ్ళినట్లుగా రాసి బిల్ తీసుకుని ఆ రెండో రిజిస్టరులో వేరే పేరుతో వేరే రాతతో సైన్ చేస్తాడు. ప్రవచనం సీడీ మారుపేరుతో కొని ఇంట్లో కూర్చుని చూసి దాన్నే ఊళ్ళో బాబాయి హోటల్లో అందరికీ ప్రవచనం విశేషాలుగా చెప్పి తను ఊళ్ళో లేనట్టుగా నమ్మించాడు. కొన్ని రోజుల తర్వాత విజయనగరంలో హోటల్ ఓనర్, ఆర్టీసీ బస్ కండక్టర్, థియేటర్ ప్రొజెక్టర్ ఆపరేటర్, ఊళ్ళో బస్ కండక్టర్లను కలిసి తను ఆగస్టు 2,3 ఊళ్ళో లేనని నమ్మించి వాళ్ళ మనసుల్లో అది నాటుకుపోయేలా చేసాడు. ఒక రోజు రాంబాబు కుటుంబాన్ని పోలీసులు తీసుకెళ్తుంటే జ్యోతి తమ్ముడు రాజేష్ ఆ ఉదంతాన్ని చూస్తాడు. రాజేష్ రాంబాబు గతంలో ఇచ్చిన సూచనల ప్రకారం తన తల్లిదండ్రులతోపాటు ఊళ్ళో జనాన్ని, రాంబాబు సన్నిహితులని తీసుకుని అక్కడే ఇంటిదగ్గరుండి మీడియాని పిలుస్తాడు. ఈలోపు వాళ్ళచేత నిజం కక్కించడానికి వీరభద్రం చేత రాంబాబు, జ్యోతి, అంజులను గీత జాలిలేకుండా కొట్టిస్తుంది. అయినా వాళ్ళు నిజం చెప్పారు. అప్పుడు ప్రభాకర్ మండిపడి ఇదంతా ఆపెయ్యమంటాడు. వాళ్ళు నిర్దోషులయితే, వాళ్ళకేమైనా జరిగితే జీవితాంతం బాధపడాల్సివస్తుందని హెచ్చరిస్తాడు. ఈలోపు వరుణ్ స్నేహితుడి ద్వారా గీత, ప్రభాకర్ నేచర్ క్యాంపులో జరిగినదంతా తెలుసుకుంటారు.

వీరభద్రం అనుని కొట్టాక ఆ అమ్మాయి తననెక్కడ చంపుతారోనని భయపడి జ్యోతి, అంజు ఒక గోనుసంచిని గొయ్యిలో పాతిపెట్టడం తను చూసానని చెప్తుంది. అక్కడికెళ్ళి మీడియా సమక్షంలో తవ్వించి చూస్తే ఆ గోనుసంచిలో కుళ్ళిపోయిన పంది శవం ఉంటుంది. వెంటనే మీడియా ముందుకెళ్ళి రాంబాబు తమ కుటుంబంపై కక్షతో వీరభద్రం తన కుటుంబాన్ని హత్యకేసులో ఇరికించాలని చూసాడనీ, చిన్నపిల్లని కూడా చూడకుండా తన కూతురిని గాయపరిచాడని వాదిస్తాడు. దాడి చెయ్యబోతున్న వీరభద్రాన్ని ఊళ్ళో జనమంతా కలిసి చావబాదుతారు. రాంబాబు కుటుంబాన్ని నిర్దోషులుగా ప్రకటించిన జిల్లా కోర్ట్ వీరభద్రాన్ని విధులనుండి బహిష్కరిస్తుంది. మిగిలిన పోలీసులందరినీ వేరే ప్రాంతాలకు బదిలీ చేస్తుంది. గీత తన పదవికి రాజీనామా చేస్తుంది. అన్నీ వదిలేసి అమెరికాకి వెళ్ళేముందు గీత, ప్రభాకర్ రాంబాబుని క్షమించమని కోరుకుంటారు. అప్పుడు రాంబాబు నా కుటుంబమే నా ప్రపంచం, ఆ అనందమైన ప్రపంచాన్ని ఒక్కసారిగా కూల్చేయాలని చూసిన ఒక అతిథిని గతిలేక తిరిగిరాని లోకాలకు పంపేసానని చెప్తాడు. వరుణ్ హత్య కేవలం తన కూతురి భవిష్యత్తును కాపాడుకోవడం కోసమే జరిగిందని చెప్పి రాంబాబు వాళ్ళని క్షమించమని అడుగుతాడు. ఎవరిదారిన వారు వెళ్ళాక కొత్తగా కట్టిన పోలీస్ స్టేషనులో కొత్త సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర రిజిస్టర్ సైన్ చేసి వెళ్ళిపోతాడు. రాంబాబు వెళ్తుంటే ప్రేక్షకులకు వరుణ్ శవం సబ్ ఇన్స్పెక్టర్ రూములో ఫ్లోరింగ్ పని జరగకముందు కారుని చెరువులో ముంచేసిన రాత్రి రాంబాబు అక్కడ ఒక గొయ్యి తీసి పాతిపెట్టాడని ఒక ఫ్లాష్ బ్యాక్ ద్వారా తెలియజేసే సన్నివేశంతో కథ ముగుస్తుంది.

తారాగణం[మార్చు]

విమర్శకుల స్పందన[మార్చు]

దృశ్యం సినిమా కథ, కథనం, నటన వంటి అన్ని రంగాలూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. చక్రధర్ సినిమాను నవతరంగంలో రివ్యూ చేస్తూ ప్రస్తుత సమాజ పరిస్థితులమీద అవగాహన ఉన్న ఉండి ఇలాంటి కథని సహజత్వానికి దగ్గరగా తీయటం అభినందనీయం. సరిగ్గా ఇలాంటి అర్థవంతమైన సినిమాలే అవసరం మనకి. అన్నారు.[9]

పాటలు[మార్చు]

ఈ సినిమాలోని రెండు పాటలను చంద్రబోస్ రచించగా శరత్ స్వరకల్పన చేశారు. వీటిని లహరి మ్యూజిక్ ద్వార్ యూ ట్యూబ్లో 2014 జూలై 5 తేదీన విడుదల చేశారు.[10]

No. Track గాయకులు గేయరచన Duration
1 "ప్రతిరోజు పండుగ రోజే" కార్తిక్ చంద్రబోస్ 4:21
2 "నిమిషం నిమిషం" మధు బాలకృష్ణన్ చంద్రబోస్ 6:21

మూలాలు[మార్చు]

  1. "మళయాళ సూపర్ హిట్ సినిమాలో నటించనున్న వెంకటేష్". 123తెలుగు.కామ్. January 7, 2014. Retrieved July 17, 2014. CS1 maint: discouraged parameter (link)
  2. "మళ్ళీ తెరపై మెరవనున్న 'చంటి' జోడీ". 123తెలుగు.కామ్. February 17, 2014. Retrieved July 17, 2014. CS1 maint: discouraged parameter (link)
  3. "'దృశ్యం'తో సురేష్ ప్రొడక్షన్స్ 50 ఏళ్ల పండగ". వన్ఇండియా. July 8, 2014. Retrieved July 17, 2014. CS1 maint: discouraged parameter (link)
  4. "షూటింగ్‌ పూర్తిచేసుకున్న 'దృశ్యం'". వార్త. June 9, 2014. Retrieved July 17, 2014. CS1 maint: discouraged parameter (link)[permanent dead link]
  5. "11న 'దృశ్యం' కనిపిస్తుంది". ఆంధ్రభూమి. July 10, 2014. Retrieved July 17, 2014. CS1 maint: discouraged parameter (link)
  6. "'దృశ్యం' ప్రీమియర్ షో". సాక్షి. July 10, 2014. Retrieved July 17, 2014. CS1 maint: discouraged parameter (link)
  7. "హిట్ ఎఫెక్ట్: 'దృశ్యం' శాటిలైట్ రైట్స్ అదిరాయ్". వన్ఇండియా. July 14, 2014. Retrieved July 17, 2014. CS1 maint: discouraged parameter (link)
  8. ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". ర‌మేష్ గోపిశెట్టి. Archived from the original on 19 జూలై 2020. Retrieved 19 July 2020. Check date values in: |archivedate= (help)CS1 maint: discouraged parameter (link)
  9. చక్రధర్. "దృశ్యం-జీవితపు నాటకీయత". నవతరంగం. నవతరంగం. Archived from the original on 6 February 2015. Retrieved 27 January 2015. CS1 maint: discouraged parameter (link)
  10. "Drishyam Jukebox - Venkatesh & Meena [HD] - Telugu Movie". Lahari Music at YouTube. July 5, 2014. Retrieved 10 July 2014. CS1 maint: discouraged parameter (link)