Jump to content

సప్తగిరి (నటుడు)

వికీపీడియా నుండి
సప్తగిరి(Sapthagiri)
జననం
వెంకట ప్రభు ప్రసాద్

వృత్తిహాస్యనటుడు, సహాయ దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2006 - ప్రస్తుతం

సప్తగిరి ఒక తెలుగు సినీ హాస్యనటుడు.[1] అతని అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. తర్వాత తన పేరును సప్తగిరి అని మార్చుకున్నాడు. అతని స్వస్థలం చిత్తూరు జిల్లా, పుంగనూరు.[2] నటుడు కాక మునుపు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. బొమ్మరిల్లు సినిమా దర్శకుడైన భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా వచ్చిన పరుగు సినిమా అతనికి నటుడిగా గుర్తింపునిచ్చింది. ప్రేమకథా చిత్రమ్,వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుని నటుడిగా స్థిరపడిపోయాడు. సప్తగిరి చాలా లోబడ్జెట్ కామెడీ సినిమాల్లో కనిపించాడు.[3] డిసెంబరు 2016 లో వచ్చిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా కథానాయకుడయ్యాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సప్తగిరి అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. ఇతను చిత్తూరు జిల్లా, ఐరాల ప్రాంతంలో పుట్టి పెరిగాడు. తండ్రి అటవీ శాఖలో ఉద్యోగి. ఇంటర్ వరకు చదివాడు. తరువాత ఎంసెట్ లో మంచి ర్యాంకు రాలేదు. ఇంటర్ పరీక్షలయ్యాక ఒక రోజు తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాడు. అక్కడ ఓ సాధువు రూపంలో కనిపించిన వ్యక్తి ఇతన్ని సప్తగిరి అని సంబోధించడంతో అదెందుకో బాగుందనిపించి తరువాత తన పేరును సప్తగిరి అని మార్చుకున్నాడు. ఇంటర్ చదివేటప్పుడే సినిమాలు చూడ్డం బాగా అలవాటు అయ్యింది. అలాగని కేవలం చూసి వదిలేయడమే కాకుండా వాటిని నిశితంగా పరిశీలించేవాడు. క్రమంగా సినీ రంగం వైపు ఆసక్తి కలిగింది.

కెరీర్

[మార్చు]

తొలినాళ్ళు

[మార్చు]

ఇంటర్ అయిపోయిన తర్వాత హైదరాబాదుకు వెళ్ళి అవకాశాల కోసం ప్రయత్నించాలనుకున్నాడు. అక్కడ మల్టీమీడియా కోర్సు చేస్తానని ఇంట్లో చెప్పి హైదరాబాదుకు వచ్చాడు. తనకు అన్నయ్య వరసైన సతీష్ అనే వ్యక్తి ఇంట్లో ఉండేవాడు. మొదట్లో దర్శకత్వం వైపే ఆసక్తి ఉండేది కానీ నటనలో ఏమాత్రం ఆసక్తి లేదు. ఇంగ్లీషులో పరిజ్ఞానం పెంచుకుందామని ఎస్. ఆర్. నగర్ లోని ఓ శిక్షణా కేంద్రంలో చేరాడు. కానీ రెండు నెలలు గడిచాక అందులో పురోభివృద్ధి లేకపోవడంతో దానిని వదిలేశాడు. సహాయ దర్శకుడిగా అవకాశం కోసం స్టూడియోల చుట్టూ తిరిగే వాడు.

సహాయ దర్శకుడిగా

[మార్చు]

అన్నయ్య ఇంటికి దగ్గర్లోనే రమేష్ వర్మ అనే పబ్లిసిటీ డిజైనర్ ఉండేవాడు. అక్కడికి క్రమం తప్పకుండా వెళుతూ సినీ పరిశ్రమ వ్యక్తులతో పరిచయాలు పెంచుకున్నాడు. దర్శకుడు విరించి వర్మ, సప్తగిరి కలిసి అవకాశాల కోసం ప్రయత్నించేవాళ్ళు. ముందుగా రమేష్ వర్మ తరుణ్ తో ఒక వూరిలో అనే సినిమా చేయాలనుకున్నాడు. ఆ సినిమా కోసం సప్తగిరి ని చెన్నైకి పంపించాడు. కానీ రెండేళ్ళు గడుస్తున్నా ఆ సినిమా ఆలస్యం అవుతుండటంతో అతనికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో రమేష్ వర్మ ఇతన్ని శేఖర్ సూరి దగ్గర చేరమన్నాడు. శేఖర్ సూరి దర్శకత్వం వహిస్తున్న ఎ ఫిల్మ్ బై అరవింద్ కోసం సహాయ దర్శకుడిగా చేరమన్నాడు. ఈ సినిమాలో పనిచేయడం ద్వారా సప్తగిరి సినిమా యొక్క అన్ని విభాగాల గురించి తెలుసుకుంటూ సినీ ప్రముఖులతో మరిన్ని పరిచయాలు పెంచుకున్నాడు. అలాగే సినిమా పూర్తయ్యే సరికి ముగ్గురు సహాయ దర్శకులు మాత్రమే మిగలడంతో పని ఎక్కువ కావడంతో పాటు పరిజ్ఞానం కూడా లభించింది.

నటుడిగా

[మార్చు]

తరువాత భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన బొమ్మరిల్లు సినిమాకు సహాయ దర్శకుడిగా అవకాశం వచ్చింది. ఆ సినిమా నిర్మాత దిల్ రాజుకు సహాయ దర్శకుల చేత చిన్న చిన్న వేషాలు వేయించడం ఆనవాయితీ. దాంతో బొమ్మరిల్లు సినిమాలో చిన్న పాత్రలో మొదటి సారిగా తెరపై కనిపించాడు. తర్వాత భాస్కర్ దగ్గరే పరుగు సినిమాకు అసోసిసియేట్ డైరెక్టరుగా చేరాడు. బొమ్మరిల్లు సినిమాలో తన హావభావాల్ని పరిశీలించిన భాస్కర్ ఈ సినిమాలో కూడా ఓ పాత్ర రూపకల్పన చేశాడు. మొదట్లో నటించడం ఇష్టం లేకపోయినా అవకాశం పోగొట్టుకోకుండా ఉండటం కోసం నటన, దర్శకత్వం రెండు పనులూ చేశాడు. తర్వాత స్నేహితుడు ఆనంద్ రంగా తీసిన ఓయ్ సినిమాలో నటించాడు. నటనలో అవకాశాలు ఎక్కువగా రాసాగాయి. కందిరీగ, దరువు, నిప్పు, మంత్ర, గబ్బర్‌ సింగ్‌ లాంటి సినిమాల్లో నటించాడు. అదే సమయంలో దర్శకుడు మారుతి తీసిన ఈ రోజుల్లో సినిమా అతి తక్కువ బడ్జెట్ లో విడుదలై మంచి విజయం సాధించింది. ఎ ఫిల్మ్ బై అరవింద్ సినిమా సమయంలో సప్తగిరి, మారుతి కలిసి చాలా రోజులు పనిచేశారు. ఆ పరిచయంతో మారుతి తర్వాత తీస్తున్న ప్రేమకథా చిత్రమ్ లో అవకాశం కల్పించాడు. అందులో పాత్ర అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. దీని తర్వాత దృశ్యం, మనం, పవర్, ఎక్స్ ప్రెస్ రాజా, సోగ్గాడే చిన్ని నాయనా, మజ్ను తదితర చిత్రాల్లో నటించాడు.

ఒక రోజు విమానంలో వస్తుండగా ఓ తమిళ సినిమా చూసి దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసుకుని అందులో కథానాయకుడిగా నటిస్తే బాగుంటుందని అనుకుని స్నేహితులను సంప్రదించాడు. అలాగే తను వైద్యం కోసం వెళుతున్న హోమియో వైద్యుడు డాక్టర్ రవి కిరణ్ ఆ సినిమాను నిర్మాతగా ఉండటానికి ముందుకు వచ్చాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్ అనే పేరుతో డిసెంబరు 2016 లో ఈ సినిమా విడుదలైంది. ఇది సప్తగిరికి కథానాయకుడిగా మొదటి సినిమా.

సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "సెట్లోంచి పొమ్మనగానే కన్నీళ్లొచ్చేశాయి!". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 26 December 2016. Retrieved 26 December 2016.
  2. "ఫిల్మీబీట్ లో సప్తగిరి బయోగ్రఫీ, ప్రొఫైలు". filmibeat.com. ఫిల్మీబీట్. Archived from the original on 14 August 2016. Retrieved 24 September 2016.
  3. Sashidhar, AS. "Tollywood's new funny men". The Times of India. Archived from the original on 18 August 2014. Retrieved 16 Jan 2014.
  4. The Hindu, Reviews (7 November 2014). "Joru: Slapstick merry go round". Sangeetha Devi Dundoo. Archived from the original on 9 July 2018. Retrieved 20 June 2019.
  5. Nadadhur, Srivathsan (23 October 2015). "Columbus: In no man's world". The Hindu. Retrieved 27 May 2020.
  6. మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.
  7. 123 తెలుగు, సినిమా రివ్యూ (5 December 2014). "Lakshmi Raave Maa Intiki Telugu Movie Review". www.123telugu.com. Archived from the original on 23 March 2018. Retrieved 8 August 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  8. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (రివ్యూ) (23 December 2016). "సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌". www.andhrajyothy.com. Archived from the original on 25 December 2016. Retrieved 7 January 2020.
  9. 123తెలుగు, సమీక్ష (10 March 2017). "చిత్రాంగద – అంజలి మాత్రమే ఆకట్టుకుంది!". www.123telugu.com. Retrieved 12 March 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]