బి. పద్మనాభం

వికీపీడియా నుండి
(పద్మనాభం(నటుడు) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పద్మనాభం
జననం
బసవరాజు వెంకట పద్మనాభ రావు

(1931-08-20)1931 ఆగస్టు 20
మరణం2010 ఫిబ్రవరి 20(2010-02-20) (వయసు 78)
మరణ కారణంగుండె పోటు
వృత్తితెలుగు సినిమా, రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు
తల్లిదండ్రులు
  • వెంకట శేషయ్య (తండ్రి)
  • శాంతమ్మ (తల్లి)

పద్మనాభం (ఆగస్టు 20, 1931 - ఫిబ్రవరి 20, 2010) తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినీనిర్మాత, దర్శకుడు. ఇతని పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభ రావు. 1931లో ఆగస్టు 20వ తేదీన కడప జిల్లా (ఇప్పటి వై యస్సార్ జిల్లా) పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించాడు. తల్లి శాంతమ్మ. తండ్రి బసవరాజు వెంకటశేషయ్య కడపజిల్లా వేంపల్లెకి సమీపంలోనున్న వీరన్నగట్టుపల్లె గ్రామానికి కరణంగా ఉండేవాడు. ఈయన తాత సుబ్బయ్య కూడా కరణమే. ఈయనకు చిన్నప్పటినుంచి సంగీతమన్నా, పద్యాలన్నా మహా ఇష్టం. మూడవయేట నుంచి పద్యాలుపాడే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆ ఊరి టెంటు హాలులో ద్రౌపదీ వస్త్రాపహరణం, వందేమాతరం, సుమంగళి, శోభనావారి భక్త ప్రహ్లాద మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు, పాటలు, హాస్య సన్నివేశాలు, అనుకరిస్తుండేవాడు.

రంగస్థలానుభవం

[మార్చు]

1936లో ఐదేళ్ళ వయసులో "చింతామణి" నాటకంలో కృష్ణుడివేషం వేసి వన్స్ మోరులతోబాటు ఒక వెండికప్పు బహుమతిగా పొందాడు. స్త్రీపాత్రలకు ప్రసిద్ధిపొందిన కొండపేట కమాల్ ఈ నాటకంలో చింతామణి కాగా పద్మనాభం తండ్రి శ్రీహరి పాత్రధారి.

తర్వాత తమ్ముడు సుదర్శనంతో కలిసి ప్రొద్దుటూరులో వారాలు చేసుకుని, యాయవరం చేసుకుని చదువుకున్నా చదువు వంటబట్టలేదు. థియేటర్ మేనేజర్ ను మంచిచేసుకుని వచ్చిన సినిమాలన్నీ చూసేవాళ్ళు. అప్పుడే సైకిల్ తొక్కడం నేర్చుకున్న పద్మనాభం తమ్ముడితో కలిసి సైకిల్ కొనడానికి డబ్బు సంపాదించడానికి ఎవరికీ చెప్పకుండా రైల్లో టికెట్ లేకుండా ముందు బెంగుళూరు వెళ్ళి అక్కడేం చెయ్యాలో తోచక మద్రాసు వెళ్ళారు. అక్కడ నటి కన్నాంబ ఇంటికి వెళ్ళి ఆమెతో విషయం మొత్తం చెప్పేశారు. తమ గానకళతో ఆమెను మెప్పించి రాజరాజేశ్వరీ వారి కంపెనీలో కుదురుకున్నారు.

ఆ తర్వాత ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే ఇంకొకవైపు సి.ఎస్.ఆర్. లాంటివాళ్లతో కలిసి భక్త తుకారాం లాంటి నాటకాల్లో 50, 60 ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. ఋష్యేంద్రమణి వాళ్ళ ట్రూపులో పాదుకా పట్టాభిషేకం, సతీ సక్కుబాయి, హరిశ్చంద్ర, రంగూన్ రౌడీ, శ్రీకృష్ణలీలలు, మొదలైన నాటకాల్లో నటించాడు.

సినిమారంగం

[మార్చు]

నటగాయకుడిగా

[మార్చు]

శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ వాళ్ళు తీసిన పాదుకాపట్టాభిషేకం సినిమాలో కోరస్ లో పాడే అవకాశం వచ్చింది. పద్మనాభం సినిమాల్లో చేరగానే తమ్ముడు ఇంటికి తిరిగొచ్చేశాడు. తర్వాత గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో కాంభోజరాజు కథ ఆధారంగా నిర్మించిన 1945 నాటి తెలుగు జానపద చలన చిత్రం మాయలోకం లో పద్మనాభం కోరస్ పాడడమేగాక ఒక పాత్ర కూడా వేశాడు. ఇది నటుడిగా ఆయన తొలి సినిమా. రెండవ సినిమా త్యాగయ్య. మూడవ సినిమా ముగ్గురు మరాఠీలు. ఇక ఆ తర్వాత నారద నారది, యోగి వేమన ఇలా అవకాశాలు వరసగా వచ్చాయి. రాధిక (1947)లో కృష్ణ పాత్ర వెయ్యడమే గాక ఒక గోపబాలునికి ప్లేబ్యాక్ పాడాడు. తర్వాత భక్త శిరియాళలో చిన్న చిరుతొండడి పాత్ర, వింధ్యరాణిలో నటుడిగా, గాయకుడిగా అలరించాడు.

1948లో జెమిని వారి వీరకుమార్ చిత్రానికి ఒప్పుకుని కొంత అడ్వాన్స్ తీసుకున్నాడు. ఈలోగా యోగివేమన తీసిన కె.వి.రెడ్డి గుణసుందరి కథ తీస్తూండడంతో ఆయన్ను వాహినీ స్టుడియో లో కలవగా ఆయన పాట పాడించుకుని విని, గొంతు బాగాలేకపోయేసరికి చికాకు పడ్డాడు: "బాగా పాడేవాడివే! ఏమైంది నీకు? గొంతు ఇలా ఉంటే కప్పులు కడగడానికి కూడా పనికిరావు" అన్నాడు. దాంతో నిరాశపడ్డ పద్మనాభం సింహాద్రిపురం వెళ్ళిపోయాడు.

అప్పుడే తేలు కాటుతో తమ్ముడు ప్రభాకరం, జబ్బుచేసి చెల్లెలు రాజేశ్వరి మరణించడంతో విరక్తి కలిగి సినిమాలకు దూరంగా ఉన్నాడు. గుంతకల్ దగ్గరున్న కొనకొండ్లలో చిన్నాన్న శ్రీనివాసరావు దగ్గర కరణీకం నేర్చుకుంటూ ఉండగా వీరకుమార్ షూటింగుకు రమ్మని జెమిని వారి నుండి కబురు వచ్చింది. ఆ షూటింగు జరుగుతున్నరోజుల్లో విజయాసంస్థతో ఏర్పడిన పరిచయం ఆయన కెరీర్ ను మలుపుతిప్పింది.

షావుకారులో నౌకరు పోలయ్య వేషానికి ముందు బాలకృష్ణను అనుకున్నారు. ఐతే చక్రపాణి "వీడు ముదురుగా ఉన్నాడు. ఇంకెవరూ లేరా?" అని అడగడంతో దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ వెంటనే "రాధికలో కృష్ణుడిగా వేసిన పద్మనాభం ఉన్నాడు." అని పిలిపించి వేషం ఇప్పించారు. పాతాళభైరవి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు కె.వి.రెడ్డి తోటరాముడిగా రాజారెడ్డి, మాంత్రికుడిగా ముక్కామల అనుకున్నాడు. షావుకారు రషెస్ చూసిన వెంటనే మనసు మార్చుకుని హీరోగా ఎన్.టి.ఆర్., మాంత్రికుడిగా ఎస్.వి.ఆర్., అంజిగా బాలకృష్ణ, సదాజపుడిగా పద్మనాభం లను ఖరారు చేసుకుని విజయావారి పర్మనెంటు ఆర్టిస్టులుగా మూడేళ్ళ అగ్రిమెంటు తీసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పాతాళభైరవితో బాటు విజయావారి తర్వాతి చిత్రాలైన పెళ్లిచేసిచూడు, చంద్రహారం లలో నటించాడు. అదే సమయంలో గుబ్బి ప్రొడక్షన్స్ శ్రీకాళహస్తి మహాత్మ్యం లో కాశి వేషం వేశాడు. 1954లో వచ్చిన సతీ అనసూయతో మొదలుపెట్టి కృష్ణప్రేమ,సతీ సుకన్య, కృష్ణలీలలు, శ్రీరామకథ, సతీ తులసి, ప్రమీలార్జునీయం లలో నారదుడిగా వేశాడు.

నిర్మాతగా

[మార్చు]

1964 సంవత్సరంలో రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి దేవత, పొట్టి ప్లీడర్, శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న నిర్మించారు. మర్యాద రామన్నతోనే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గాయకుడిగా తొలిసారి పరిచయం చేశారు. 1968లో శ్రీరామకథ నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. 1970లో కథానాయిక మొల్ల తీసి బంగారు నంది అవార్డు పొందారు.

మరణం

[మార్చు]

2010 ఫిబ్రవరి 20న ఉదయం చెన్నైలో పద్మనాభం గుండెపోటుతో మృతి చెందాడు.[1]

ఇతర వనరులు

[మార్చు]

చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Actor Padmanabham no more". The Hindu (in Indian English). 21 February 2010. ISSN 0971-751X. Retrieved 1 July 2021.