రాజేంద్ర సింగ్
రాజేంద్ర సింగ్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | అలహాబాదు విశ్వవిద్యాలయం |
వృత్తి | నీటి పరిరక్షకుడు |
తరుణ్ భారత్ సంఘ్ | |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | నీటి ఆధారిత పరిరక్షణ |
బిరుదు | వాటర్‌మన్ ఆఫ్ ఇండియా |
వెబ్సైటు | tarunbharatsangh.in |
డా.రాజేంద్ర సింగ్ (జ. 1959 ఆగస్టు 6) భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో అల్వార్ జిల్లాకు చెందిన నీటి పరిరక్షకుడు,సంఘసేవకుడు. అతనిని "వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా"గా పిలుస్తారు. అతను స్టాక్‌హోం వాటర్ ప్రైజ్ ను గెలుచుకున్నాడు. అతను ప్రభుత్వేతర సంస్థ "తరుణ్ భారత్ సంఘ్"ను 1975లో స్థాపించాడు. రాజస్థాన్‌లో మంచి నీటి నిర్వహణలో విశేష కృషి చేసినందుకు గాను 2001 లో రామన్ మెగసెసే పురస్కారాన్ని అందుకున్నాడు.[2] ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో అంతరించిపోయిన 5 నదులకు జీవం పోసి, 1000 గ్రామాలకు నీరందించిన ఘనమైన చరిత్ర ఆయనది. వందల అడుగులు తవ్వితేగానీ జల పడనిచోట ఆయన పాటించిన విధానాలతో 15 అడుగుల లోతులోనే నీళ్లు పడేంతగా భూగర్భజలాలు చార్జ్ అయ్యాయక్కడ.[3] అతను వర్షపు నీటిని నిల్వచేసేట్యాంకులు, చెక్ డ్యాం లను ఉపయోగించి నీటిని సంరక్షించే విధానాలను అవలంబిస్తాడు. 1985లో ఒక గ్రామం నుండి ప్రారంభించి ఈ సంస్థ 8600 జోహాద్‌లు, ఇతర నీటి సంరక్షణ నిర్మాణాలను ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వచేసింది. అతను చేసిన ఈ విధానాల వల్ల రాజస్థాన్ లో అర్వారి, రూపారెల్, సర్సా, భగాని, జగజ్వాలి అనే ఐదు నదులు పునరుజ్జీవనం పొంది 1000 గ్రామాలకు నీటిని అందించాయి.[4][5]
2009లో భారత ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 కు అనుగుణంగా గంగా నది కోసం ఏర్పడిన అధికార ప్రణాళిక, ఫైనాన్సింగ్, పర్యవేక్షణ, సమన్వయ అధికారం గల సంస్థ "నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీ" సభ్యులలో రాజేంద్ర సింగ్ ఒకడు.[6] యునైటెడ్ కింగ్డంలో అతను ఇది నేలకోత, వరదలు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనే లక్ష్యంతో ఫ్లో పార్టనర్షిప్ అనే సంస్థను స్థాపించాడు.
ప్రారంభ జీవితం, విద్య
[మార్చు]రాజేంద్ర సింగ్ ఉత్తర ప్రదేశ్‌లో మీరట్‌కు సమీపంలో గల బాగ్పత్ జిల్లాలోని దౌలా గ్రామంలో జన్మించాడు. అతను రాజపుత్రుల కుటుంబంలో జమీందారీ సంప్రదాయానికి చెందినవాడు. ఏడుగురు సహోదరులలో ఇతను పెద్దవాడు. అతని తండ్రి 60 ఎకరాల భూస్వామి. సింగ్ ఆ గ్రామంలో ప్రారంభ విద్యను అభ్యసించాడు.[1]
1974లో తన జీవితంలో ముఖ్యమైన సంఘటన జరిగింది. ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు, గాంధీ శాంతి ఫౌండేషన్ సభ్యుడైన రమేష్ శర్మ మీరట్‌లో వారి ఇంటికి వచ్చారు. ఈ సంఘటన మూలంగా గ్రామీణాభివృద్ధికి సంబంధించి యువ రాజేంద్ర మనసులో బీజాలు పడ్డాయి. ఎందుకంటే శర్మ గ్రామం శుభ్రం చేయటం, ఒక గ్రంథాలయాన్ని ప్రారంభించడం, స్థానిక సంఘర్షణలను పరిష్కరించడం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు; తరువాత శర్మ మద్యపానానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలో రాజేంద్రను కూడా భాగస్వామిని చేసాడు.[1]
పాఠశాలలో ఆంగ్ల భాషా ఉపాధ్యాయుడు ప్రతాప్ సింగ్ ప్రభావం రాజేంద్రపై పడింది. ఆ ఉపాధ్యాయుడు తరగతి గదిలో తన విద్యార్థులతో రాజకీయాలు, సాంఘిక సమస్యలను చర్చించేవాడు. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించబడింది. దీని మూలంగా అతను ప్రజల సమస్యల గురించి తెలుసుకొని స్వంత అభిప్రాయాలను ఏర్పరచుకున్నాడు.[1] పాఠశాల విద్య పూర్తయిన తరువాత అతను అలహాబాద్ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల అయిన బారౌత్ కళాశాలలో హిందీ సాహిత్యంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసాడు. జయప్రకాశ్ నారాయణ్ (1965 మెగసెసే పురస్కార విజేత) స్థాపించిన విద్యార్థి సంఘం "ఛాత్ర యువ సంఘర్ష్ వాహిని"లో నాయకుడు అయ్యాడు. జయప్రకాష్ జబ్బు పడిన తరువాత అంతర్గత రాజకీయాలు అతనిని మోసగించాయి. సింగ్ విద్యను అభ్యసించి బి.ఎ.ఎం.ఎస్ వైద్యుడు అయ్యాడు.
జీవిత విశేషాలు
[మార్చు]విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత అతను 1980 లో ప్రభుత్వోద్యోగంలో చేరాడు. అతను జైపూర్ లో నేషనల్ సర్వీసు విద్యా వాలంటీర్ గా తన ఉద్యోగాన్ని ప్రారంభించి, రాజస్థాన్‌లో వయోజన విద్యా విభాగంలో నియమింపబడ్డాడు.[7] కాంపస్ ఫైర్ బాధితుల కోసం జైపూర్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, అధికారులచే స్థాపించబడిన "తరుణ్ భారత్ సంఘ్" (యంగ్ ఇండియా అసోసియేషన్) లో చేరాడు. మూడు సంవత్సరముల తరువాత ఆ సంస్థకు ప్రధానకార్యదర్శి బాధ్యతలను చేపట్టాడు. వివిధ సమస్యలను పరిష్కరించడంలో చేతకాని, అసమర్థమైన కార్యకర్తలు గల సంస్థ ప్రతినిధులను అతను ప్రశ్నించాడు. తత్ఫలితంగా మొత్తం బోర్డు సభ్యులు రాజీనామా చేసి 1984లో సంస్థను అతనికి అప్పగించారు.
అతను తీసుకున్న సమస్యలలో మొదటిది గ్రామస్థుల సహాయంకోసం ఒక గ్రామం నుండి వేరొక గ్రామానికి దేశద్రిమ్మరి వలె ప్రయాణిస్తూ ఉండే కమ్మరి పనివారితో కలసి పనిచేయడం. ఈ అవగాహన అతను ప్రజలతో కలసి పనిచేయడానికి స్ఫూర్తినిచ్చింది. ప్రజా సమస్యలపై అధికారుల ఉదాసీనత అతనిని నిరాశ పరచడం, ఈ సమస్యల పరిష్కారించడంలో తన అశక్తత కారణంగా అతను 1984లో ఉద్యోగాన్ని విడిచి పెట్టాడు. తన గృహ సామాగ్రిని 23,000 రూపాయలకు విక్రయించి, రాజస్థాన్‌లో బస్సు ఎక్కి చివరి బస్ స్టాప్ వరకు టికెట్ తీసుకున్నాడు. రాజస్థాన్‌లో మారుమూల ప్రాంతానికి వెళ్తున్న ఆ బస్సులో అతడితో పాటు తరుణ్ భారత సంఘ్ నుండి నలుగురు స్నేహితులు మాత్రమే ఉన్నారు. వారు 1985, అక్టోబరు 2 న రాజస్థాన్ లో ఆల్వార్ జిల్లాకు చెందిన తానగాజి తహసీల్ లో కిషోరి గ్రామానికి చేరుకున్నారు. తొలుత గ్రామస్థులు వారిని సంశయించినా, పొరుగు గ్రామమైన భీకంపుర గ్రామస్థులు వారిని అక్కడ ఉండడానికి అనుమతించి, వసతి కల్పించారు. వెంటనే, అతను సమీపంలోని గోపాలపుర గ్రామంలో ఆయుర్వేద వైద్యశాలను ప్రారంభించాడు. అతని స్నేహితులు గ్రామాలలో విద్యను బోధించడం మొదలు పెట్టారు.[7]
అటవీ నిర్మూలనం, గనుల తవ్వకాల ఫలితంగా నీరు తగ్గడం, వరదలు తరువాత తక్కువ వర్షాలు కురిసిన కారణంగా, ఒకప్పుడు పుష్కలంగా ధాన్యం పండించిన ఆల్వార్ జిల్లా బీడు భూములతో అనావృష్టికి గురైంది. దీనికి మరొక కారణం సాంప్రదాయ జల పరిరక్షణ విధానాలను నెమ్మదిగా విడిచిపెట్టడం, జోహాడ్ లేదా చెక్ డ్యాముల వంటి నిర్మాణాలకు బదులుగా గ్రామస్థులు "ఆధునిక" బోరు బావులపై ఆధారపడటం. ఈ బోరుబావులు భూగర్బ జలాలను పీల్చివేస్తాయి. ఇలా వాడడం మూలంగా భూగర్భ జలాల స్థాయి తగ్గి తరువాతి కాలంలో ఇంకా లోతైన బోరుబావులు త్రవ్వవలసి వస్తుంది. ఇలా పర్యావరణంగా బీడు భూములుగా మారే స్థితికి వస్తుంది.
అప్పుడు అతడు కలసిన మంగూలాల్ మీనా అనే గ్రామపెద్ద "రాజస్థాన్ లో విద్య కంటే నీటి సమస్య అధికంగా ఉంది" అని వాదించాడు.[8] పట్నాల నుండి వచ్చి, పరిశీలించి తిరిగి వెళ్ళిపోయే మేధావుల్లాగా కాకుండా స్వయంగా పనులు చేపట్టమని అతడు రాజేంద్రను సవాలు చేసాడు. సాంప్రదాయకంగా వర్షపునీటిని నిల్వ చేయడానికి ఉపయోగించే, (తద్వారా భూగర్భ జలాలను పునరుజ్జీవింపజేసే) జోహాడ్లు (దొరువుల వంటివి) కొన్ని దశాబ్దాలుగా విస్మరించడం వలన ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. వాటిని పునరుద్ధరించమని మంగూలాల్ అతణ్ణి ప్రోత్సహించాడు.
గత ఐదు సంవత్సరాలుగా భూగర్భ జలాలు అంతరించిపోయిన కారణంగా, ఈ ప్రాంతం అధికారికంగా "చీకటి జోన్"గా ప్రకటించబడింది. నీటి సంరక్షణ గురించి స్థానిక రైతులు సాంప్రదాయ పద్ధతులను అవలంబించాలని రాజేంద్ర కోరాడు. అతని స్నేహితులు ఈ పనులను స్వయంగా చేయడానికి ఇష్టపడక విడిపోయారు. అయినప్పటికీ స్థానిక యువకుల సహాయంతో అతను కొన్ని సంవత్సరాలపాటు నిర్లక్ష్యానికి గురైన గోపాలపుర జోహాడ్ పూడికతీత పనులను ప్రారంభించాడు. ఆ సంవత్సరం వర్షాలు బాగా పడినప్పుడు జోహాద్ పూర్తిగా నీటితో నిండిపోయింది. కొన్ని సంవత్సరాలుగా ఎండిపోయి ఉన్న బావులలోనికి నీరు చేరింది. గ్రామస్థులు జోహాద్ త్రవ్వకాలను కొనసాగించారు. దీని ఫలితంగా తరువాతి మూడు సంవత్సరాలలో 15 అడుగుల లోతుకు చేరింది.[7][9] ఈ కార్యక్రమాలు భూగర్భ జలాల స్థాయి పెరుగుదలకు దోహదపడ్డాయి. ఆ ప్రాంతాన్ని "వైట్ జోన్"గా మార్చాయి.
సరిస్కా అభయారణ్యం సరిహద్దులో, తనాగజి తహసీల్ లోని కిషోరి-భీకంపుర గ్రామంలో ఉన్న తరుణ్ ఆశ్రమం "తరుణ్ భారత్ సంఘ్"కు ప్రధాన కార్యాలయంగా మారింది. అతను 1986లో ఈ ప్రాంతంలోని గ్రామాలలో పాదయాత్రను ప్రారంభించాడు. గ్రామాలలో చెక్‌డ్యాం లను పునర్మించవలసినదిగా గ్రామస్థులకు శిక్షణనిచ్చాడు. గోపాల్‌పురలో గ్రామస్థులు సాధించిన విజయాన్ని పాదయాత్రలో అనేక గ్రామాలలో వివరించినప్పటికీ పెద్దగా విజయం సాధించలేదు కానీ, 1986లో గోపాల్ పురకు 20 కి.మీ దూరంలో గల భానోటా-కోల్యాల గ్రామ ప్రజలు తరుణ్ భారత సంఘ్ స్వచ్ఛంద కార్యకర్తలతో పాటు శ్రమదానం చేసి, పూర్తిగా ఎండిపోయిన అర్వారి నది మూలం వద్ద జోహాద్ ను నిర్మించారు. ఆ నదీ పరీవాహక ప్రాంతంలో అనేక గ్రామాలలో కూడా నిర్మించారు. వారు చిన్న మట్టి డ్యాములు, 224 మీటర్ల పొడవు, 7 మీటర్ల ఎత్తు గల కాంక్రీట్ డ్యాములు కూడా ఆరావళి కొండలపై నిర్మించారు. చివరికి ఆనకట్టల సంఖ్య 375 కు చేరుకున్నప్పుడు, 60 సంవత్సరాల పాటు ఎండిపోయి ఉన్న అర్వారి నదిలో 1990లో నీటిప్రవాహం మొదలైంది.
యుద్ధ ప్రాతిపదికన జోహాడ్లు నిర్మించిన తరువాత, సరస్కా చుట్టు ప్రక్కల ఉన్న చెరువులు, సరస్సులలోకి ఊహించిన స్థాయిలో నీరు చేరలేదు. దీనికి కారణం గనుల త్రవ్వకాల ఫలితంగా ఏర్పడిన గోతులను తవ్వినవారు పూడ్చని కారణంగా వాటి లోకి నీరు చేరి ఆవిరి కావడం అని గుర్తించాడు. 1991లో ఆరావళిలో మైనింగ్ నిషేధించబడినప్పటికీ కొనసాగుతున్నందున సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసాడు. 1992 మే లో, పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఆరావళి కొండలలో మైనింగ్‌ను నిషేధించింది. సరిస్కా అభయారణ్య ప్రాంతంలో పనిచేసే 470 గనులు మూసివేయబడ్డాయి. క్రమంగా టి.బి.ఎస్ సంస్థ 115 మట్టి, కాంక్రీటు నిర్మాణాలను అభయారణ్యం లోపల, చుట్టు ప్రక్కల మండలాలలో 600 నిర్మాణాలను చేపట్టింది. అనేక ప్రయత్నాల ఫలితంగా 1995లో అర్వారి జీవనదిగా మారింది.[5][9] ఈ నదికి అంతర్జాతీయ నది బహుమతి (ఇంటర్నేషనల్ రివర్ ప్రైజ్) వచ్చింది. 2000 మార్చిలో భారత రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ ఈ ప్రాంతాన్ని సందర్శించి, గ్రామస్థులకు "డౌన్ టు ఎర్త్ - జోసెఫ్.సి.జాన్ పురస్కారం"ను అందించాడు.[5]
తరువాతి సంవత్సరాలలో దశాబ్దాల కాలంగా పొడిగా మారిన రూపారెల్, సర్సా, భగాని, జహాజ్‌వాలి నదులు కూడా పునరుజ్జీవనం చెందాయి. జైపూర్, దౌసా, సవై మాధోపూర్, భరత్పూర్, కరౌలి ప్రాంతాలలోని పొరుగు జిల్లాలలోని వందలాది కరువు ప్రాంతాలలోని గ్రామాల నుండి కరువు కారణంగా వెళ్లిపోయిన గ్రామస్థులందరూ గ్రామాలకు తిరిగి వచ్చి వ్యవసాయ కార్యకలాపాలను మొదలుపెట్టారు. టి.బి.ఎస్. సంస్థ కార్యక్రమాలు క్రమంక్రమంగా విస్తరించాయి.[9]
2001 నాటికి టి.బి.ఎస్ 6,500 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. అందులో మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వారు రాజస్థాన్ లోని 11 జిల్లాలలో 850 గ్రామాలలో 4500 మట్టి చెక్‌డ్యాములు, జోహాడ్లను వర్షపునీటిని సంరక్షించడానికి నిర్మించారు. అతని కృషి ఫలితంగా 2001లో రామన్ మెగసెసే పురస్కారం లభించింది.[9] అనేకమంది గ్రామ ప్రజల ద్వారా అడవులను పునరుద్ధరించడం జరిగింది. ముఖ్యంగా సమాజ వనరులను పరిరక్షించడానికి గ్రామ సభలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఆర్వారి జిల్లా కేంద్రంలో గల భానొటా-కొల్యాల గ్రామం సమీపంలో గల "భైరోన్‌దేవ్ లోక్ వన్యజీవ్ అభయారణ్య" 12 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించడం వారి కృషికి చక్కని నిదర్శనం.
సాంప్రకాయ నీటి పరిరక్షణ, భుగర్బ జలాలనిర్వహణ కోసం భూగర్బ జలాల రీఛార్జ్ ఆవశ్యకత, సహజ వనరులను సంరక్షించడంలో సమాజం పాత్ర గూర్చి ప్రజలకు జ్ఞానాన్ని అందించేందుకు అతను రాజస్థాన్ లోని సుదూర గ్రామాలలో "పానీ పంచాయత్" లేదా "వాటర్ పార్లమెంట్" కార్యక్రమాలను నిర్వహించాడు.[10][11] 2005లో అతనికి "జమ్నాలాల్ బజాజ్ పురస్కారం" వచ్చింది.[6]
2006లో గంగానది ప్రధాన ప్రవాహమైన భాగీరథి నదిపై వివాదాస్పదంగా నిర్మిస్తున్న "లోహరినాగ్ పాలా హైడ్రో పవర్ ప్రాజెక్టు"ను నిలిపివేయడంలో అతను కీలక పాత్ర పోషించాడు. దీనికోసం ఐ.ఐ.టి, కాన్పూర్ పర్యావరణవేత్త జి.డి.అగర్వాల్ నిరాహారదీక్షలో పాల్గొన్నాడు.[12]
2009లో అతను పర్యావరణ శాస్త్రవేత్తల బృందం, ప్రభుత్వేతర సంస్థలతో పాటు బొంబాయి నగరం గుండా పారే, అంతరించిపోతున్న మిథీ నదికి పాదయాత్ర చేసాడు[13]. 2014 జనవరిలో గోదావరి నది ఒడ్డున త్రయంబకేశ్వరం నుండి పైథాన్ వరకు పర్వావరణ కాలుష్యం చేయరాదని ప్రజలకు ప్రేరేపించడానికి ఒక కార్యక్రమం చేసాడు. ఇటీవల ముంబైలోని అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డులో నీరు, దాని పరిరక్షణ, దాని విలువ గూర్చి ఉపన్యాసం ఇచ్చాడు.[14]
పురస్కారాలు, గౌరవాలు
[మార్చు]- నీటి సంరక్షణా విధానాలకొరకు చేసిన కృషికి 2001 లో రామన్ మెగసెసే పురస్కారం .[15]
- గ్రామీణాభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయొగిస్తున్నందుకు 2005 లో జమ్నాలాల్ బజాబ్ పురస్కారం[16]
- "గ్రహాన్ని రక్షిస్తున్న 50 మంది ప్రజలు" జాబితాలో గార్డియన్ పత్రిక స్థానం కల్పించింది.[8]
- 2015లో "స్టాక్‌హోల్ం వాటర్ ప్రైజ్" . ఇది "నోబెల్ ప్రైజ్ ఆఫ్ వాటర్"గా సుపరిచితం.[17]
- 2016లో యునైటెడ్ కింగ్‌దం ఆధారిత ఇనిస్టిట్యూట్ జైనాలజీ ద్వారా "అహింసా పురస్కారం.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "Biography of Rajendra Singh" (PDF). Magsaysay Award website. 2001. Archived from the original (PDF) on 2012-09-15. Retrieved 2018-05-28.
- ↑ "రాజేంద్రసింగ్ కు మెగసెసే".
- ↑ "వేదావతి హగరి నదికి మళ్లీ ప్రాణం!". Archived from the original on 2016-06-06. Retrieved 2018-05-28.
- ↑ "The water man of Rajasthan". Frontline, Volume 18 - Issue 17. 18–31 August 2001.
- ↑ 5.0 5.1 5.2 "Charles lauds the `water warriors'". The Hindu. 3 Nov 2003. Archived from the original on 17 నవంబరు 2003. Retrieved 28 మే 2018.
- ↑ 6.0 6.1 "Jamnalal Bajaj Awards Archive". Jamnalal Bajaj Foundation.
- ↑ 7.0 7.1 7.2 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;bio2
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 8.0 8.1 "50 people who could save the planet". The Guardian. 5 January 2008.
- ↑ 9.0 9.1 9.2 9.3 "The water man of Rajasthan". Frontline, Volume 18 - Issue 17. 18–31 August 2001.
- ↑ "Unquiet flows the water in this village". The Hindu. 15 April 2005. Archived from the original on 20 ఏప్రిల్ 2005. Retrieved 28 మే 2018.
- ↑ "Need to raise water level, says Rajendra Singh". The Tribune. 18 November 2006.
- ↑ "`Waterman' becomes Ganga's saviour". The Times of India. 5 September 2010. Archived from the original on 2012-07-01. Retrieved 2018-05-28.
- ↑ "Waterman of India plans a river parliament to revive the Mithi". Indian Express. 12 జనవరి 2009. Archived from the original on 6 సెప్టెంబరు 2012.
- ↑ "Godavari Parikrama". 14 January 2014. Archived from the original on 16 జనవరి 2014. Retrieved 28 మే 2018.
- ↑ "Singh, Rajendra". The Ramon Magsaysay Award Foundation. Retrieved 26 February 2018.[permanent dead link]
- ↑ "Shri Rajendra Singh". Jamnalal Bajaj Foundation. Retrieved 26 February 2018.
- ↑ "Rajendra Singh - The water man of India wins 2015 Stockholm Water Prize". SIWI. Stockholm International Water Institute. Retrieved 26 February 2018.
బయటి లంకెలు
[మార్చు]- "The Rediff Interview/ Magsaysay Award winner Rajendra Singh". Rediff.com. 15 August 2001.
- Rajendra Singh, Profile[permanent dead link] at Tarun Bharat Sangh
- Water man of Rajasthan
- ఇంటర్వ్యూలు
- Why "Gandhi of Water" Rajendra Singh Is Traveling the Length of the Ganges River at TreeHugger
- An Interview with Rajendra Singh
- Hindi-language 15-minute video interview with Rajendra Singh on the Ganga Action Plan: part 1, part 2
- మూలాల లోపాలున్న పేజీలు
- Pages using the JsonConfig extension
- All articles with dead external links
- రామన్ మెగసెసే పురస్కార గ్రహీతలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- 1959 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- భారతీయ పర్యావరణవేత్తలు
- రాజస్థాన్ వ్యక్తులు
- అలహాబాదు విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు