నేషనల్ ఆర్ట్ థియేటర్

వికీపీడియా నుండి
(రామకృష్ణా సినీ స్టూడియోస్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నేషనల్ ఆర్ట్ థియేటర్ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు విగ్రహం

నేషనల్ ఆర్ట్ థియేటర్ (National Art Theatre) తెలుగు నాటక, సినిమా నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి బహుముఖ ప్రజ్ఞాశాలి నందమూరి తారక రామారావు. ఎన్.టి.ఆర్. విద్యార్థిగా ఉన్న రోజుల్లో నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పేరిట నాటకాలాడేవారు. ఆ పేరుతో ఆయన సోదరుడు నందమూరి త్రివిక్రమరావు నిర్మాతగా 1953లో పిచ్చి పుల్లయ్యతో ప్రారంభించి ఎన్నో విశిష్టమైన చిత్రాలు నిర్మించారు. తరువాత హైదరాబాదులో వారి అబ్బాయి నందమూరి రామకృష్ణ పేరు మీద రామకృష్ణ స్టుడియో నిర్మించి రామకృష్ణా సినీ స్టుడియోస్ పతాకంపై దాన వీర శూర కర్ణ వంటి పలు చిత్రాలు నిర్మించారు.

చరిత్ర

[మార్చు]

1952 నాటికి తెలుగు సినిమా పరిశ్రమలో ముఖ్యమైన నటునిగా ఎదుగుతున్న ఎన్.టి.రామారావు సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంబించారు. తాను చేద్దామనుకున్న ప్రయోగాత్మకమైన సినిమాలు ఇతర నిర్మాతల డబ్బుతో చేయడం సరికాదని, వీలుకాదని భావించి ఆయన నిర్మాణానికి పూనుకున్నారు. నేషనల్ ఆర్ట్ థియేటర్ అన్న ఈ సంస్థ పేరును సినిమాల్లోకి రాకముందు రామారావు నాటకాలు ఆడిన స్వంత నాటకాల సంస్థ పేరునుంచి తీసుకున్నారు.[1] తమ బంధువైన దోనేపూడి కృష్ణమూర్తి ఆర్థికంగా దెబ్బతినడంతో ఆయనను నిర్మాణంలో భాగస్వామిగా తీసుకుని, తన తమ్ముడు నందమూరి త్రివిక్రమరావును మేనేజింగ్ పార్టనర్ గా పెట్టుకుని నేషనల్ ఆర్ట్స్ పతాకంపై 1953లో తొలిచిత్రంగా పిచ్చి పుల్లయ్య సినిమా నిర్మించారు. సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినా ఆర్థికంగా పరాజయం పాలైంది. నిర్మాణ సంస్థ పేరు నేషనల్ ఆర్ట్ థియేటర్ గా మార్చి 1954లో డి.యోగానంద్ దర్శకత్వంలో తోడుదొంగలు సినిమాను నిర్మించారు. అది కూడా పరాజయం పాలైంది. దాంతో మూడవ ప్రయత్నంలో అప్పటికి ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉన్న జానపద శైలిలో చిత్రాన్ని నిర్మించారు. డి.యోగానంద్ దర్శకత్వంలోనే జానపద ఫక్కీలో తీసిన జయసింహ చిత్రం ఘన విజయాన్ని సాధించి ఎన్టీఆర్ కి నిర్మాతగా తొలి విజయాన్ని అందించింది. తర్వాత ఎన్.ఏ.టి. పతాకంపై పండరీపుర క్షేత్రమహాత్యం, తెనాలి రామకృష్ణుడు ప్రబంధానికి ఎంచుకున్న ఇతివృత్తం అయిన ప్రసిద్ధ పుండరీకుని కథను తీసుకున్నారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తీసిన పాండురంగ మహత్యం ఘనవిజయం సాధించడంతో పాటుగా క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది. ఈ నిర్మాణ సంస్థలోనే ప్రయోగాత్మకంగా తన దర్శకత్వంలో సీతారామ కళ్యాణం తీశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రాముడి పాత్రను కాదని, రావణాసురుని పాత్ర పోషించారు. అదీ మంచి విజయం సాధించింది. ఎన్.టి.రామారావు పలు వేర్వేరు సినిమాలకు వేర్వేరు బానర్ల పేర్లు పెట్టి తీశారు.[2] ఆయా పతకాలపై తెలుగు సినిమాల్లో ప్రఖ్యాతి పొందిన నాలుగు విభాగాలైన సాంఘిక, పౌరాణిక, చారిత్రిక, జానపద విభాగాల్లోనూ సినిమాలు తీశారు. 1953 నుంచి 60 ఏళ్ళలో 2013 వరకూ ఎన్.ఏ.టి., దాని అనుబంధ సంస్థల ద్వారా 43 సినిమాలు నిర్మించారు. వాటిలో 10 పౌరాణిక చిత్రాలు, 7 చారిత్రిక చిత్రాలు ఉన్నాయి. 40 తెలుగు సినిమాలు, రెండు తమిళ చిత్రాలు, ఒక హిందీ చిత్రం ఎన్.ఏ.టి. సంస్థలు నిర్మించాయి.[3]

నిర్మించిన సినిమాలు

[మార్చు]

రామకృష్ణ సినీ స్టుడియోస్

[మార్చు]

రామకృష్ణ ఎన్.ఎ.టి.కంబైన్స్

[మార్చు]

ఎన్.ఎ.టి.పిక్చర్స్

[మార్చు]

ఎన్.ఏ.టి. సంస్థ నిర్మించిన పలు తెలుగు చిత్రాలు అవార్డులు, గౌరవాలు, ప్రేక్షకాదరణ పొందాయి. మరోవైపు పలువురు కళాకారులు, సాంకేతిక నిపుణులు సినిమా రంగానికి ఎన్.ఏ.టి సినిమాల ద్వారా పరిచయమయ్యారు. వహీదా రెహమాన్, బి.సరోజాదేవి, గీతాంజలి, నాగరత్నం, కె.ఆర్.విజయ తదితరులు కథానాయికలుగా ఎన్.ఏ.టి. సంస్థ ద్వారానే పరిచయం అయ్యారు. గులేబకావళి కథ ద్వారా జోసెఫ్ కృష్ణమూర్తి, అక్బర్ సలీమ్ అనార్కలి చిత్రం ద్వారా సి.రామచంద్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ద్వారా రవీంద్ర జైన్ లను సంగీత దర్శకులుగా తెలుగు తెరకు పరిచయం చేశారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవికాంత్ నగాయిచ్ సీతారామ కళ్యాణం ద్వారా, కె.ఎస్.ప్రకాష్ దాన వీర శూర కర్ణ సినిమా ద్వారా, నందమూరి మోహనకృష్ణ అగ్గిరవ్వ సినిమా ద్వారా ఛాయాగ్రాహకులుగా పరిచయం అయ్యారు. ఈ బ్యానర్లో నిర్మించిన పాండురంగ మహత్యం సినిమా ద్వారానే సముద్రాల జూనియర్ మాటల రచయితగా, గులేబకావళి కథ ద్వారా సి.నారాయణరెడ్డిని సినిమా పాటల రచయితగా, దానవీరశూరకర్ణ ద్వారా కొండవీటి వెంకటకవిని మాటల రచయితగా, అనురాగ దేవత సినిమా ద్వారా పరుచూరి బ్రదర్స్ ని సినీరచయితలుగా పరిచయం చేశారు. సినిమా నిర్మాతలుగా తర్వాతికాలంలో విజయవంతమైన డి.వి.ఎస్.రాజు, పుండరీకాక్షయ్య ఈ నిర్మాణ సంస్థల్లోనే తొలిగా పనిచేశారు.[3]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "NTR's production house completes 60 years". nandamurifans.com. Archived from the original on 22 August 2015. Retrieved 18 August 2015. "60 ఏళ్ళ ఎన్.ఏ.టి." అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన
  2. "NTR's production house completes 60 years". nandamurifans.com. Archived from the original on 22 August 2015. Retrieved 18 August 2015. "నిర్మాతగా ఎన్టీఆర్ కి వజ్రోత్సవం" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన
  3. 3.0 3.1 "NTR's production house completes 60 years". nandamurifans.com. Archived from the original on 22 August 2015. Retrieved 18 August 2015. "నిర్మాతగానూ ఓ ముద్రవేసి.. అరవై ఏళ్ళు" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన