Jump to content

వినుకొండ వల్లభరాయుడు

వికీపీడియా నుండి
(వినుకొండ వల్లభరాయడు నుండి దారిమార్పు చెందింది)

వినుకొండ వల్లభరాయడు తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధి పొందిన వీధినాటకం క్రీడాభిరామం గ్రంథకర్త. కాకతీయుల కాలంనాటి తెలుగు ఆచార వ్యవహారాలను, పండుగలను, దైవీరూపాలను మొదలుకొని ఎన్నెన్నో విశేషాలతో కూర్చిన గ్రంథం క్రీడాభిరామం. తెలుగు సాహిత్యంలోనే కాక ఆంధ్రుల సంస్కృతి, చరిత్రలను రచించే చారిత్రికులకు కూడా క్రీడాభిరామం ప్రాధాన్యత కలిగిన రచన. అయితే ఈ గ్రంథాన్ని వినుకొండ వల్లభరాయుడు కాక శ్రీనాథుడు రచించాడనే వాదనలు కూడా ఉన్నాయి.

వ్యక్తిగత వివరాలు

[మార్చు]
వినుకొండ నంద్యాల రైలు మార్గం, నల్లమల అడివి హద్దు దగ్గర
వినుకొండ నంద్యాల రైలు మార్గం, నల్లమల అడివి హద్దు దగ్గర

వినుకొండ వల్లభరాయల పూర్వులు గుంటూరు సీమలోని వినుకొండ వాస్తవ్యులు. విజయనగర సామ్రాట్టు రెండవ హరిహరరాయల ఏలుబడిలో వల్లభరాయుడి తండ్రి భాండాగార రక్షకునిగా, వినుకొండకు మహాప్రధానిగా పనిచేశారు. వల్లభరాయుడు భైరవస్వామి భక్తుడు. వల్లభరాయుడు కడప ప్రాంతంలోని (నేటి వై.ఎస్.ఆర్.జిల్లా) లోని మోపూరు గ్రామాధిపతి. మోపూరు గ్రామంలోనే ఆయన ఇష్టదైవం భైరవస్వామి కొలువై ఉన్నాడు. వల్లభరాయుడు 15వ శతాబ్ది ప్రథమార్థం (సా.శ.1400-1450) లో జీవించినట్టుగా చరిత్రకారులు నిర్ధారించారు.

వంశ చరిత్ర

[మార్చు]

క్రీడాభిరామం అవతారికలో వల్లభరాయని వంశ వర్ణన గలదు.[1]

కవి తన వంశానికి మూలపురుషుడు గాధి సుతుడైన విశ్వామిత్రుడు అని చెప్పుకొనెను. విశ్వామిత్ర గోత్రజుడు మంచన. మంచన పుత్రుడు చంద్రామాత్యుడు. ఇతడు కర్ణాటక దేశాధీశుడైన పెదబుక్కరాయలు మంత్రి. ఇతని భార్య పోచాంబ. వీరి పుత్రుడు మంచనార్యుడు. మంచన భార్య తిప్పమ్మ. వీరికి సింగన, తిప్పన, మల్లన, చెన్నమంత్రి అను నలుగురు పుత్రులు కలిగిరి. అందు సింగన కుమారుడు చంద్ర మంత్రి. రెండవ కుమారుడు మల్లన. ఇతడు మిరుతూరి విట్ట మంత్రి పుత్రికయైన త్రిపురమను వరించెను. వారికి వల్లభ, లింగన, తిప్పన, సింగన, భైరవులను పుత్రులు కలిగిరి. వీరిలో వల్లభన్నకు బైచమంత్రి, మల్లన, పోచన్న, తిప్పన అను నలుగురు పుత్రులుదయించిరి. రెండవ కుమారుడగు లింగన రెండవ హరిహర రాయలు సైన్యాధిపతి. మూడవ కుమారుడు తిప్పన హరిత గోత్రుడైన తిప్పనార్యుని కుమార్తె పెద్దమాంబను వివాహము చేసికొనెను. ఇతడు హరిహర రాయలు భాండాగారాధ్యక్షుడు. సత్యవ్రతుడు. సత్కీర్తి వడసినవాడు. వినుకొండ దుర్గాధ్యక్షుడు. ఇతనికి బైచన, మల్లన, తిప్పన అను పుత్రులుదయించిరి. అందు యేపూరునకు (ములికినాడు) తిప్ప మంత్రి వల్లభుడాయెను. అతని భార్య చందమాంబిక. ఇతడు రాయల నవరత్న భాండాగారాధ్యక్షుడు కూడ. ఇతని కూర్మిసుతుడు వల్లభుడు. ఆ వల్లభుడే క్రీడాభిరామం గ్రంథకర్త.

సాహిత్యరంగం

[మార్చు]

వల్లభామాత్యుడు తెలుగులో లభ్యమవుతున్న తొలి నాటకంగా భావిస్తున్న క్రీడాభిరామం కర్తగా సాహిత్యరంగంలో పేరొందారు. తనకాలం కన్నా ముందే పతనమైపోయిన కాకతీయుల సామ్రాజ్యానికి రాజధాని ఓరుగల్లులోని విశేషాలను, వివరాలను, శృంగారపరమైన వర్ణనలతో క్రీడాభిరామం రచించారు. కాకతీయ చక్రవర్తి రెండవ ప్రతాపరుద్రుని పరిపాలన కాలంలో రావిపాటి త్రిపురాంతకదేవుడు సంస్కృతంలో రచించిన ప్రేమాభిరామానికి అనువాదంగా క్రీడాభిరామాన్ని గురించి రాసుకున్నారు. దశరూపకాల్లో ఒకటైన వీధి అనే ప్రక్రియలో ప్రేమాభిరామాన్ని రచించట్లుగా, దానికి అనంతర కాలంలో మఱింగంటి సింగరాచార్యులు ద్విపదానువాదం చేసినట్లు సారస్వతాధారాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ గ్రంథాలు అలభ్యం. తెలుగు సాహిత్యంపై తనదైన ముద్రవేసిన యుగకర్త శ్రీనాథుని కవిత్వానికి ప్రభావితుడైనట్టుగా వినుకొండ వల్లభరాయ గురించి సాహితీవిమర్శకుడు బి.వి.సింగరాచార్యులు పేర్కొన్నారు.[2]

విశిష్టత

[మార్చు]

పూర్వకవులెవరూ ప్రయోగించని తెలుగు పలుకుబడులను, నుడికారాలతో విశిష్టమైన స్వతంత్ర రచనగా క్రీడాభిరామాన్ని రచించారు. వల్లభామాత్యుని అనంతర కాలపు ప్రబంధ యుగానికి చెందిన కవులైన శ్రీకృష్ణదేవరాయలు, పెద్దన, తెనాలి రామకృష్ణుడు వంటి గొప్ప కవులు ఆ పలుకుబడులను, నుడికారాలను అనుసరించారు. శృంగార కావ్యాలైన బిల్హణీయం, శశాంక విజయం, రాధికా సాంత్వనం, అహల్యాసంక్రందనం మొదలైన రచనల్లో ప్రౌఢ శృంగార కృతియైన క్రీడాభిరామం ముద్ర కనిపిస్తుంది.[2]. తెలుగు భాష గురించి పేర్కొనదగ్గ వాక్యాల్లో ఒకటైన దేశ భాషలందు తెలుగు లెస్స అన్న వాక్యం వినుకొండ వల్లభరాయనిదే. వల్లభామాత్యుని రచనలకు ప్రభావితుడైన శ్రీకృష్ణదేవరాయలు వేరే పద్యంలో ఈ వాక్యాన్ని ఉటంకించారు.

వివాదం

[మార్చు]

వినుకొండ వల్లభరాయునిదిగా భావించే క్రీడాభిరామం కర్తృత్వ విషయమై వివాదం నెలకొంది. క్రీడాభిరామం రచించింది వల్లభరాయుడు కాదనీ, ప్రసిద్ధ కవి, కొండవీటి విద్యాధికారి శ్రీనాథుడేనని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. శ్రీనాథుని వీధినాటకంలోని పద్యాలంటూ క్రీడాభిరామంలోని రెండు పద్యాలు లాక్షణిక గ్రంథమైన అప్పకవీయంలో కనిపిస్తూండడంతో పండితులు కొందరు క్రీడాభిరామం శ్రీనాథుని కృతి కావచ్చని భావించారు. శ్రీనాథుని ఇతర కావ్యాల్లో కనిపించే పదబంధాలు, పద్యపాదాలు, భావాలు ఇందులో దొర్లడంతో దీన్ని శ్రీనాథ కవి రచనేనని పలువురు వాదించారు.
వేటూరి ప్రభాకరశాస్త్రి క్రీడాభిరామము వినుకొండ వల్లభరాయనిది కాక శ్రీనాథుని రచనేనని పేర్కొన్నారు. టేకుమళ్ల కామేశ్వరరావు, చిలుకూరి పాపయ్యశాస్త్రి, బండారు తమ్మయ్య ఈ రచన ప్రధానంగా వినుకొండ వల్లభరాయని కృతే అయినా, శ్రీనాథుడు ఏ సందర్భంలోనో వల్లభరాయుని సందర్శించినప్పుడు సరిదిద్ది, రచనలో చేయివేసి ఉంటాడని భావించారు. టేకుమళ్ళ అచ్యుతరామయ్య, బి.వి.సింగరాచార్యులు ఈ రచన వినుకొండ వల్లభరాయనిదేనని పేర్కొన్నారు.
బి.వి.సింగరాచార్యులు శ్రీనాథుని ఇతరేతరములైన ఏ కావ్యాలలోనూ కనిపించనివీ, క్రీడాభిరామంలో వాడినవీ ఐన పలు పదప్రయోగాలను చూపి రచన వల్లభరాయునిదేనని నిరూపించారు. అప్పటికే ప్రఖ్యాతి పొందిన శ్రీనాథుని హాస్య వ్యంగ్య రూపం (కారికేచర్) గా మంచన పాత్రను రూపొందించారనీ, శ్రీనాథుని కవిత్వాన్ని హాస్యానుకరణం (పేరడీ) చేశారనీ పేర్కొన్నారు. శ్రీనాథుని పట్ల ఎంతో ఆసక్తి ఉంటే తప్ప ఇటువంటివి సాధ్యం కాదని తెలిపారు.[2]

మూలాలు

[మార్చు]
  1. సాంఘిక చరిత్ర, ఆంధ్ర వాజ్మయమున చారిత్రక కావ్యములు, బి. అరుణకుమారి, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం, 1978, పేజీలు: 321-334.
  2. 2.0 2.1 2.2 క్రీడాభిరామం:సమాలోకనము(పీఠిక):బి.వి.సింగరాచార్యులు:ఎమెస్కో బుక్స్