శేఖర్ చంద్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శేఖర్ చంద్ర
వృత్తిసంగీత దర్శకుడు, గాయకుడు
జీవిత భాగస్వామిమాధురి
పిల్లలునయనిక
తల్లిదండ్రులు

శేఖర్ చంద్ర ఒక సినీ సంగీత దర్శకుడు, గాయకుడు.[1] నచ్చావులే, నువ్విలా, మనసారా, కార్తికేయ, సినిమా చూపిస్త మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా అతను సంగీతం అందించిన కొన్ని సినిమాలు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

శేఖర్ చంద్ర తండ్రి హరి అనుమోలు ప్రముఖ సినిమాటోగ్రాఫర్. మయూరి, లేడీస్ టైలర్, నువ్వే కావాలి, గమ్యం లాంటి విజయవంతమైన సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. శేఖర్ చిన్నప్పుడే పియానో అంటే ఇష్టంగా ఉండేది. పట్టుబట్టి మరీ తండ్రి దగ్గర చిన్న పియానో కొనిపించుకున్నాడు. అప్పుడు అదే అతని ప్రపంచం లా అనిపించేది. ఖాళీ సమయాల్లో అందులో ఏదో ఒకటి వాయిస్తూ కాలక్షేపం చేసేవాడు. గిటార్ కూడా నేర్చుకున్నాడు. పాఠశాలలో కార్యక్రమాల్లో కూడా వాయించేవాడు.

తల్లిదండ్రులు మొదట సందేహించినా అతను సంగీతం మీద ఆసక్తిని గమనించి సంగీత దర్శకుడు కీరవాణి దగ్గరకు తీసుకెళ్ళారు. ఆయన అతనిలో ప్రతిభను గుర్తించి హైదరాబాదులో కాకుండా చెన్నైలో ఏదైనా సంగీత కళాశాలలో చేర్చమన్నాడు. దాంతో శేఖర్ తల్లిదండ్రులు అతన్ని చెన్నైలో ట్రినిటీ సంగీత కళాశాలలో చేర్చారు. అక్కడ సంగీతం నేర్చుకుంటూనే కీరవాణి పాటలు రికార్డింగుకు వెళ్ళి అక్కడ కోరస్ లో పాటలు పాడేవాడు. కొద్ది రోజులు సీరియల్స్ కీ, జింగిల్స్ కీ సంగీతం సమకూర్చాడు. కొన్నాళ్ళు కోటి దగ్గర కీబోర్డు ప్లేయర్ గా పనిచేశాడు.

శేఖర్ భార్య మాధురి అమెరికాలో ఎమ్మెస్ చేసి ఎల్. వి. ప్రసాద్ కంటి ఆసుపత్రిలో క్లినికల్ రీసెర్చి విభాగంలో కొద్దిరోజులు పనిచేసింది. తరువాత వారికి నయనిక అనే పాప జన్మించింది.

సంగీతదర్శకత్వం వహించిన సినిమాలు[మార్చు]

రికార్డింగ్ స్టూడియోలకు వచ్చి పోతున్నప్పుడే దర్శకుడు ఉప్పలపాటి నారాయణరావు తో పరిచయం అయింది. మొదటగా ఆయనకు తెలిసిన వాళ్ళ సినిమాలో సంగీత దర్శకుడిగా అవకాశం ఇప్పించాడు. కానీ ఏదో కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. తరువాత జ్ఞాపకం అనే సినిమాకు సంగీతం రూపకల్పన చేశాడు. అదే అతని మొదటి సినిమా. ఆ సినిమాకు పనిచేస్తున్నపుడే దర్శకుడు రవిబాబుతో పరిచయం ఏర్పడింది. అలా రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అనసూయ సినిమాకు సంగీతాన్నందించాడు. తర్వాత వచ్చిన నచ్చావులే సినిమా కూడా శేఖర్ చంద్రకు సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చింది. ఆ సినిమాలో పాట పాడిన గీతా మాధురికి ఉత్తమ గాయనిగా నంది పురస్కారం లభించింది. తర్వాత నువ్విలా, బెట్టింగ్ బంగార్రాజు, అమరావతి, అవును, మాయ, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, మనసారా లాంటి సినిమాలు చేశాడు.

సినీ జాబితా[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "నా ప్రయాణం 'విషాదం'తో మొదలైంది!". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 13 November 2016. Retrieved 13 November 2016.
  2. తెలుగు గ్రేట్ ఆంధ్ర, రివ్యూ (5 September 2014). "సినిమా రివ్యూ: బూచమ్మ బూచోడు". www.telugu.greatandhra.com. Retrieved 7 August 2020.