చందవరం బౌద్ధక్షేత్రం
ఆంధ్రప్రదేశ్ లో స్థానం | |
ఇతర పేర్లు | చందవరం తవ్వకాల ప్రాంతం |
---|---|
స్థానం | చందవరం |
ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
నిర్దేశాంకాలు | 15°55′58.5156″N 79°25′40.2240″E / 15.932921000°N 79.427840000°E |
రకం | బౌద్ధం, పురావస్తు తవ్వకాల స్థలం |
చరిత్ర | |
నిర్మించినవారు | శాతవాహన వంశం[1] |
పదార్థాలు | సున్నపురాయి |
స్థాపన తేదీ | క్రీ.పు 2 శతాబ్దం నుండి క్రీ. శ 2 శతాబ్దం |
సంస్కృతులు | బౌద్ధ సంస్కృతి |
స్థల గమనికలు | |
తవకాల తేదీలు | 1972-77 |
పురాతత్వవేత్తలు | వేలూరి వేంకట కృష్ణ శాస్త్రి |
స్థితి | పునర్నిర్మితము |
యజమాని | ప్రభుత్వ |
ప్రజలకు అందుబాటు | అవును |
బౌద్ధ |
పర్యాటక ప్రాంతాలు |
---|
ప్రముఖ బౌద్ధ స్థలాలు |
లలితగిరి
|
చందవరం గ్రామంలో ఉన్న బౌద్ధక్షేత్రం అతి పురాతన బౌద్ధక్షేత్రాలలో ఒకటి. ఇది ప్రకాశం జిల్లాలో దొనకొండకు ఈశాన్యంలో 10కి.మీ దూరంలో గుండ్లకమ్మ నదీతీరంలో ఉంది. 1967 లో పురాతత్వ పరిశోధన శాఖ ఉద్యోగి వేలూరి వేంకట కృష్ణ శాస్త్రి పరిశోధన చేసి బౌద్ధక్షేత్రంగా నిర్ణయించాడు. 1972-77 కాలంలో త్రవ్వకాలు జరిపి మహాస్తూపం, 15 సాధారణ స్తూపాలు, 100 చిన్న స్తూపాలు వెలికితీశారు. ఇది శాతవాహనుల పాలనలో క్రీ.పూ 2వ శతాబ్దం - సా.శ. 2 వ శతాబ్ద కాలంలో నిర్మించబడింది.
చరిత్ర
[మార్చు]1967 లో చందవరం గ్రామ మునసబు దగ్గరలోని సింగరకొండ పైన ప్రాచీన కట్టడాలలోని శిల్పాలను ప్రక్కకు తొలగించి ప్రజలు ఇటుకలు తీసుకొనిపోతున్నారని పురాతత్వ పరిశోధన శాఖ సంచాలకులకు లేఖరాయగా, శాఖ తరపున వేలూరి వేంకట కృష్ణ శాస్త్రి పరిశోధన చేసి బౌద్ధక్షేత్రంగా నిర్ణయించాడు. ఇక్కడ కొండశిఖరం మీద రెండస్థుల స్తూపం ఉంది. సాంచి స్తూపం తరువాత స్థానంలో చందవరం బౌద్ధస్తూపం ప్రాధాన్యత కలిగి ఉంది.[2] 1972-77 కాలంలో 4 మార్లు త్రవ్వకాలు జరపబడ్డాయి. 15 సాధారణ స్తూపాలు, 100 చిన్న స్తూపాలు కనుగొనబడ్డాయి[3]. ఇది క్రీ.పూ 2 వ శతాబ్దం - సా.శ. 2 వ శతాబ్ద కాలంలో నిర్మించబడింది.[4] అమరావతి స్కూల్‌లోని శిలాకృతుల ఆధారంగా కూడా ఈ బౌద్ధారామం క్రీ.పూ 2వ (కామన్ ఎరా) శతాబ్దంనాటిదని నిర్ణయించబడింది.[1][5]
త్రవ్వకాలలో లభించిన శాతవాహన నాణాలు ఆధారంగా, సా.శ.1-2 శతాబ్దాలకే ప్రఖ్యాతి పొందినదని తెలుస్తుంది. ఒక చిన్న కుండలో లభించిన 1600 నాణేలకు ఒకవైపు గుర్రం, రెండవవైపు శూన్యంగా ఉంది. ఇవి క్రీ.పూ 2-3 శతాబ్దాలవని అంచనా. సా.శ. 7వ శతాబ్దిలో హ్యూన్సాంగ్ అనే చీనా యాత్రీకుడు వర్ణించిన చుళియే ప్రాంతలోని స్తూపం ఇదేనని అభిప్రాయబడుతున్నారు. అప్పుడు రేనాటి చోళులపరిపాలనలో వున్నందున చుళియే అని వ్యవహరించారు.[4]
ఇది అంధ్రప్రదేశ్‌లో నిర్మించబడిన మొదటి బౌద్ధారామంగా విశ్వసించబడింది. ఇక్కడ బౌద్ధమత సంబంధిత కార్యక్రమాలు చురుకుగా సాగేవి.[6][7] చందవరం బౌద్ధారామం వారణాశి నుండి కంచి వెళ్ళే బౌద్ధసన్యాసులకు విశ్రాంతి ప్రదేశంగా ఉపయోగించబడింది.
ప్రయాణ సౌకర్యాలు
[మార్చు]గుంటూరు - అనంతపురం జాతీయ రహదారి NH544D లో వెల్లంపల్లి ఊరు దగ్గరలో ఈ ప్రదేశం ఉంది. దగ్గరి రైల్వేస్టేషన్ దొనకొండ లో, దగ్గరి విమానాశ్రయాలు కర్నూలు, విజయవాడలో ఉన్నాయి. కురిచేడు నుండి త్రిపురాంతకం పోవు ప్రైవేట్ బస్సులో ఈ ప్రదేశం చేరుకోవచ్చు. ఒంగోలు నుండి దొనకొండ మీదుగా చందవరం చేరుకొని అక్కడినుండి ఆటోల ద్వారా కూడా ఈ ప్రదేశం చేరవచ్చు.
నిర్మాణం
[మార్చు]చందవరం బౌద్ధస్తూపాన్ని శాతవాహన రాజుల పాలనాకాలంలో నిర్మించారు. కొండశిఖరం మీద ఉన్న ఎత్తైన వేదికమీద రెండస్తులుగా స్తూపం నిర్మించబడింది. మహాస్తూపనిర్మాణం హీనయాన బౌద్ధులచేత నిర్మించబడిందని భావించబడుతుంది. మహాస్తూపం 148 అడుగుల వ్యాసార్ధం కలిగివుంది. దీనిని చేరటానికి చక్కని మెట్లవరస నిర్మించబడింది. స్తూప వేదికకు నలు దిక్కులా ఆయకస్తంభాలు నిలబెట్టడానికి నిర్మించిన ఆయక వేదికలున్నాయి. వేదిక పైన అర్ధగోళాకారపు గుమ్మటము, దానిపైన హార్మిక ఉంది. హార్మికపైన నిలబెట్టిన ఛత్రం శిథిలమైంది. గుమ్మటము చుట్టుకొలత 120 అడుగులు ఎత్తు 30 అడుగులు. మహాస్తూపంలో మాహాచైత్య 1.6 మీ ఎత్తు, 60 సెమీ వెడల్పు ఉంటుంది. మహాస్తూపం తక్షిలా (పాకిస్థాన్) లోని ధర్మరాజికా స్తూపాన్ని పోలి ఉంటుంది.
మహాస్తూపం శిలాఫలకాలు సున్నపురాయితో చేయబడింది. మేథి (Drum) విభాగంలో శిలాఫలకాలపై రెక్కలుగల జంతువులు, సింహాలు, పూర్ణకుంభాలు, అగ్ని స్తంభాకృతిలోనున్న బుద్ధునికి ఇరువైపుల నిల్చి ఆరాధిస్తున్న దంపతుల శిల్పాలున్నాయి. గుమ్మటానికి చుట్టూ అతికించిన 10 అడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పుస గల శిల్ప పటాలు 30 కి పైగా లభించాయి. ఈ ఫలకాలమీద బుద్ధుని జ్ఞానోదయం, ధర్మచక్రప్రవర్తన, మహాపరినిర్వాణ ఘట్టాలను సూచించే బోధివృక్షం, ధర్మచక్రం, స్తూపాకృతులున్నయి. వేదికపైన శిల్పపటాలను దర్శిస్తూ బౌద్ధమతస్థులు ప్రదక్షిణం చేసేవారు. ఈ స్తూపానికి రెండు అంతస్తులలో (వేదిక, అండం) ప్రదక్షిణపథాలున్నాయి.[4]
తస్కరణ
[మార్చు]1980 లో ప్రదర్శనశాలని నిర్మించి దానిలో ధర్మ చక్రాలు, స్తూప, బోధి చెట్టు శిలాఫలకాలు, జాతక కథల చిత్రాలతో కూడిన ఫలకాలు ప్రదర్శనకు పెట్టారు[3]. 2001లో మూడు స్తంభాలు 9 అడుగుల పొడవైన బుద్ధుని శిల్పం అపహరణకు గురైంది. 2001 మార్చిలో అలంకరణ స్తంభాలు, తామర పతకం అపహరణకు గురైంది. 2002 అక్టోబరులో బోధిచెట్టు, చైత్ర చెక్కబడిన 9 అడుగుల ఫలకాలు సిమెంటు వేదిక నుండి త్రవ్వి తీయబడి మ్యూజియం నుండి తస్కరించబడ్డాయి.[5] ఆ తరువాత ప్రదర్శన వస్తువులను చందవరం గ్రామంలోని పంచాయితీ కార్యాలయంలో భద్రం చేశారు.[3]
16 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా దేశంలోని ప్రదర్శనశాల కొన్న శిలాఫలకం చందవరం నుండి దొంగిలించినది అని తేలడంతో దానిని తిరిగి పంపింది. అయితే ఆంధ్రప్రదేశ్ పురాతత్వ శాఖ దానిని ఆధారం చేసుకొని దొంగిలించినవారి నుండి ఇతర అపహరణ వస్తువులు సేకరించలేదు.[8].
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- "AP Buddhist Places Brochure" (PDF). APTDC. 2016. p. 25. Retrieved 2020-07-02.
మూలాల జాబితా
[మార్చు]- ↑ 1.0 1.1 "Chandavaram – Foothold of Buddhist Mahastupa". kostalife.com. Archived from the original on 2015-12-08. Retrieved 2015-12-01.
- ↑ "Chandavaram monastic cluster". Monastic Asia. Retrieved 2015-12-01.
- ↑ 3.0 3.1 3.2 "Brief Introduction on Dist. Archaeological Site Museum, Chandavaram, Prakasam District :". Retrieved 2020-07-01.
- ↑ 4.0 4.1 4.2 డా వి.వి.కృష్ణశాస్త్రి చరిత్ర పురాతత్వ వ్యాసాలు. ఎమెస్కో బుక్స్. 2014. pp. 232–234. ISBN 978-93-83652-79-2.
- ↑ 5.0 5.1 "Easy pickings". India Today. Retrieved 2015-12-01.
- ↑ "About Chandavaram Excavation Site". Holidayiq.com. Archived from the original on 2015-12-10. Retrieved 2015-12-01.
- ↑ "Chandavaram Buddhist site". Discovered India. Retrieved 2015-12-01.[permanent dead link]
- ↑ "The Chandavaram Loot – How Andhra Pradesh Is Missing An Opportunity To Go After Heritage Smugglers". Swaraj. 2018-11-19. Retrieved 2020-07-01.