Jump to content

కె.వి.రెడ్డి

వికీపీడియా నుండి
కె. వి. రెడ్డి
కె.వి.రెడ్డి
జననంకదిరి వెంకట రెడ్డి
జూలై 1, 1912
కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా
మరణంసెప్టెంబర్ 15, 1972
చెన్నై
నివాస ప్రాంతంచెన్నై
వృత్తితెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత

కదిరి వెంకటరెడ్డి (1912 జూలై 1- 1972 సెప్టెంబరు 15) తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత. తెలుగు సినిమా స్వర్ణయుగంగా భావించే కాలంలో విజయవంతమైన, విమర్శకులు ఆణిముత్యాలుగా అభివర్ణించిన పలు సినిమాలు తీసిన దర్శకుడు. అతను దర్శకునిగా మొత్తం 14 సినిమాలు తీయగా వాటిలో 10 వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సాధించినవే. దర్శకునిగా దాదాపు మూడు దశాబ్దాల కాలం పనిచేశాడు.

కె.వి.రెడ్డి చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో తన మేనమామల వద్ద పెరిగాడు. చిన్నతనంలో అతని అల్లరికి పట్టపగ్గాలు ఉండేవి కాదు. చదువూ చక్కగానే చదివేవాడు. తర్వాతి కాలంలో తనను సినిమా రంగంలోకి తీసుకువచ్చి దర్శకుడిని చేసిన వ్యాపారవేత్త మూలా నారాయణస్వామితో తాడిపత్రిలోనే కలిసి చదువుకున్నాడు. మేనమామల ప్రోద్బలంతో, సహాయంతో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరిన కె.వి. అక్కడే మెట్రిక్, డిగ్రీ పూర్తిచేశాడు. ఉద్యోగ ప్రయత్నాలు విఫలమై, చిన్న వ్యాపారం చేస్తూండగా మూలా నారాయణస్వామి పిలవగా సినిమా నిర్మాణ శాఖలో కెరీర్ ప్రారంభించాడు.

వాహినీ పిక్చర్స్ సంస్థలో ప్రొడక్షన్ మేనేజరుగా ప్రారంభమై 1942లో భక్త పోతన సినిమాకు దర్శకత్వం వహించాడు. సినిమా మంచి విజయం కావడంతో వాహినీ ప్రొడక్షన్స్ ఏర్పడి, అందులో కె.వి.రెడ్డి నిర్మాణ భాగస్వామిగా చేరాడు. ఆపైన ప్రధానంగా వాహినీ, విజయా వంటి నిర్మాణ సంస్థల్లో సినిమాలు తీశాడు. జయంతి అనే స్వంత సంస్థ నెలకొల్పి 3 సినిమాలు తీశాడు. ఇవి కాక అన్నపూర్ణ ప్రొడక్షన్స్, ఎన్.ఏ.టి. సంస్థలకు ఒక్కో సినిమా తీశాడు. అతని విజయవంతమైన సినిమాల్లో మాయాబజార్ (1957) వంటి పౌరాణిక నేపథ్యం ఉన్న చిత్రం, శ్రీకృష్ణార్జున యుద్ధము (1963), శ్రీకృష్ణసత్య (1972) వంటి పౌరాణిక చిత్రాలు, గుణసుందరి కథ (1949), పాతాళ భైరవి (1951), జగదేకవీరుని కథ (1961) వంటి జానపదాలు, పెద్దమనుషులు (1954), దొంగ రాముడు (1955) వంటి సాంఘిక చిత్రాలు, భక్త పోతన (1943), యోగివేమన (1947) వంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు ఉన్నాయి. కె.వి.రెడ్డి సినిమాలు భారీ విజయాలు సాధించి, నిర్మాణ సంస్థలకు విపరీతమైన లాభాలు, ఎంతో పేరు తెచ్చిపెట్టేవి. దీనితో 1950ల్లో మొదలై 60ల తొలినాళ్ళ వరకూ అతనితో సినిమాలు తీయడానికి పోటీపడే పరిస్థితి ఉండేది. 60వ దశకం మలి భాగంలో కె.వి.రెడ్డి తీసిన సత్య హరిశ్చంద్ర (1964), ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968), భాగ్యచక్రం (1968) సినిమాలు వరుసగా పరాజయం పాలు కావడంతో అతనితో సినిమా చేయడానికి ఎవరూ ముందుకురాని స్థితి ఏర్పడింది. ఈ స్థితిలో కె.వి.ని గురువుగా భావించే ఎన్.టి.రామారావు అతనిపై గౌరవాభిమానాల వల్ల తన స్వంత సంస్థ అయిన ఎన్.ఏ.టి. ద్వారా శ్రీకృష్ణసత్య (1971) సినిమా తీయించాడు. పరాజయాల వల్ల సినిమా తీసే అవకాశం లేని దుస్థితిలో కెరీర్ ముగించాల్సి వస్తుందన్న భయాందోళనల నుంచి విడిపిస్తూ ఆ సినిమా మంచి విజయం సాధించింది. మంచి సినిమా తీసిన సంతృప్తితో 1972లో కె.వి.రెడ్డి మరణించాడు.

కె.వి.రెడ్డికి దర్శకత్వంలో ప్రత్యేకమైన పద్ధతి ఉండేది. ఒక సినిమా చేసేప్పుడు పూర్తి శ్రద్ధ దాని మీదే పెట్టేవాడు. చాలా కసరత్తు చేసి స్క్రిప్టు పూర్తిచేయడం, ఒక్కసారి బౌండ్ స్క్రిప్టు పూర్తయ్యాకా ఇక దానిలో చిత్రీకరణ దశలో ఏమాత్రం మార్పుచేయకపోవడం అతని పద్ధతి. ఆ స్క్రిప్టు కూడా కె.వి. స్క్రిప్టు చేతిలో ఉంటే ఎవరైనా దర్శకత్వం చేయవచ్చు అనే స్థాయిలో ఉండేది. ఎన్ని అడుగుల ఫిల్మ్ తీయాలనుకుంటే అన్నే అడుగులు తీయగలగడం అతని ప్రత్యేకతల్లో ఒకటి. ముందు రిహార్సల్స్ చేయించి, సంతృప్తిగా వచ్చాకే షూటింగ్ చేసేవాడు. దుక్కిపాటి మధుసూదనరావు, ఎన్.టి.రామారావులు తమకు కె.వి.రెడ్డి గురుతుల్యుడని చెప్పుకునేవారు. అక్కినేని నాగేశ్వరరావు, దుక్కిపాటి మధుసూదనరావు అన్నపూర్ణ పిక్చర్స్ స్థాపించాకా తొలి చిత్రం కె.వి.రెడ్డితో తీసి, అతని పద్ధతులు నేర్చుకుని, తమ సంస్థను ఆ ప్రకారం నడుపుదామన్న ఉద్దేశంతో రెండేళ్ళు వేచి చూసి మరీ సినిమా తీశారు. ఎన్.టి.రామారావు తాను దర్శకత్వం వహించడం మొదలుపెట్టాకా కె.వి.రెడ్డిని చూసి నేర్చుకున్న పద్ధతులను సాధ్యమైనంత అనుసరించేవాడు. కె.వి.రెడ్డి తీసిన భక్త పోతన సినిమా విజయం వల్ల వాహినీ ప్రొడక్షన్స్ (అంతకుముందున్న వాహినీ పిక్చర్స్ పంపిణీ సంస్థగా మిగిలిపోయింది) ఏర్పడగా, పాతాళ భైరవి సాధించిన ఆర్థిక విజయం విజయా సంస్థ స్థిరపడడానికి సహకరించింది. ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు, అల్లు రామలింగయ్య వంటి నటులు, పింగళి నాగేంద్రరావు, డి.వి.నరసరాజు, కొసరాజు రాఘవయ్య వంటి కవి రచయితల సినిమా కెరీర్లు స్థిరపడడానికి కె.వి.రెడ్డి సినిమాల ప్రభావం చాలా ఉంది. ప్రత్యేకించి అప్పటివరకూ కృష్ణుడి పాత్రలో పెద్దగా విజయం సాధించని ఎన్.టి.రామారావును కృష్ణుడిగా నిలబెట్టి, అతని పౌరాణిక చిత్రాల కెరీర్ కు పునాదులు వేసింది కె.వి.రెడ్డే. అతని సినిమాల్లో పెద్దమనుషులు, పెళ్లినాటి ప్రమాణాలు ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా జాతీయ బహుమతి సంపాదించుకోగా 2013లో సిఎన్ఎన్-న్యూస్ 18 నిర్వహించిన పోల్లో భారతీయ ప్రేక్షకులు ఇప్పటివరకూ వచ్చిన భారతీయ సినిమాల్లో అత్యుత్తమంగా మాయాబజార్ ఎంచుకున్నారు.

జీవిత చరిత్ర

[మార్చు]

బాల్యం నుంచి సినీ రంగం వరకు (1912-1937)

[మార్చు]

బాల్యం

[మార్చు]

శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి సమీపంలో తేళ్ళమిట్ట పల్లెలో 1912 జూలై 1న కె.వి.రెడ్డి జన్మించాడు. అతని పూర్తి పేరు కదిరి వెంకటరెడ్డి. తల్లిదండ్రులు వెంకట రంగమ్మ, కొండారెడ్డి.[1] చిన్నతనంలోనే అతని తండ్రి మరణించాడు. దాంతో తల్లితో పాటు తాడిపత్రిలోని అమ్మమ్మ గారి ఇంటికి వచ్చేశాడు. అకాలంలో వైధవ్యం మీద పడ్డ అతని తల్లి, జీవితం మీది వైరాగ్య భావంతో గడుపుతూ ఉండడంతో చిన్ననాట కె.వి.రెడ్డి అల్లరికి పట్టపగ్గాలు ఉండేవి కాదు.[2]

తాడిపత్రిలో అతని బాల్యమంతా అల్లరి, ఆటపాటల్లో సంతోషంగా గడిచింది. చెరువుల్లో ఈతలు, కొండలు గుట్టలు ఎక్కడాలు, చేపలు పట్టడాలు, చెట్లూ పుట్టల వెంబడి తిరగడాలు, మహిమలు చేసే శక్తులు సంపాదించేందుకు శ్మశానాల్లో ఎముకలు సేకరించడం వంటి సాహసాలు, అల్లరులు చేసేవాడు.[3] ఒకసారి అడవుల్లో తిరుగుతూ కె.వి.రెడ్డి, అతని మిత్రులు ఎలుగుబంటి కనిపిస్తే దాని మీద రాళ్ళు వేసి దాన్ని రెచ్చగొట్టారు. అది కోపంతో వెంబడిస్తే అందరూ పారిపోయారు. పారిపోతున్న పిల్లలని వదిలి ఎలుగుబంటి వెనక్కి వచ్చి చూస్తే కె.వి.రెడ్డి మాత్రం భయం వల్ల దారితోచక అక్కడే ఉండిపోయాడు. భయంతో వణుకుతున్న కె.వి.రెడ్డిని చూసి అది జాలిపడి విడిచిపెట్టేస్తే అతని ప్రాణాలు దక్కాయి. ఈ సంఘటన తర్వాతికాలంలో గుర్తుచేసుకున్న కె.వి.రెడ్డి "జంతువులకు కూడా జాలి, దయ వంటి సుగుణాలు ఉంటాయని ఆ సంఘటన వల్లే తెలిసిందని" చెప్పాడు. గుణసుందరి కథ సినిమాలో ఎలుగుబంటి పాత్ర రూపకల్పన వెనుక చిన్నతనంలో అతను చూసిన జాలిగుండె గల ఎలుగుబంటి స్మృతి ఉంది.[4]

విద్యాభ్యాసం

[మార్చు]

ఆటపాటలలో మునిగితేలుతున్నా కె.వి.రెడ్డి తొలినుంచి బాగా చదివేవాడు. చదువుతో పాటుగా ఫుట్ బాల్, హాకీలాంటి ఆటల్లోనూ ముందుండేవాడు. ఈ పాఠశాల దశలోనే మూలా నారాయణస్వామితో స్నేహం ఉండేది. కె.వి. స్కూల్ ఫైనల్ పూర్తయ్యాక మేనమామలు, ఇతర కుటుంబ పెద్దలు సమీపంలోని అనంతపురం కళాశాలలో కాక ప్రతిష్టాత్మకమైన మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల లోనే చదివించాలని నిర్ణయించి ఏర్పాట్లు చేశారు. మద్రాసు (నేటి చెన్నై)లో విక్టోరియా హాస్టల్లో ఉంటూ, ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకునేవాడు. పల్లెటూళ్ళలో చెరువుల్లో మునుగుతూ, కొండలెక్కుతూ ఉత్సాహభరితంగా గడిపిన కె.వి.రెడ్డికి హఠాత్తుగా మద్రాసు నగర జీవితం చాలా ఒంటరిగా, విసుగ్గా తోచింది. దాంతో నగర జీవితంలో ప్రాచుర్యం పొందుతున్న సినిమా థియేటర్ల మీద అతని దృష్టి పడింది. కాలక్షేపం కోసం సినిమాలు చూడడం మొదలుపెట్టి ఆదివారాల్లో మూడు ఆటలూ చూడసాగాడు. అలా క్రమేపీ డిగ్రీ పూర్తిచేశాడు.[3] దర్శకుడు పి. పుల్లయ్య గ్రాడ్యుయేషన్లో కె.వి.రెడ్డికి సీనియర్. కె.వి. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేనాటికే పుల్లయ్య సినిమాల్లోకి ప్రవేశించి హరిశ్చంద్ర సినిమాకు దర్శకత్వం వహించాడు. కాలక్షేపం కాక సినిమాలు చూసినా చాలా శ్రద్ధతో సినిమాల్లోని అంశాలు పరిశీలించే అలవాటు కె.వి.రెడ్డికి ఉండడంతో పి.పుల్లయ్య అతనితో సినిమాలకు పనికివచ్చే కథల గురించి చర్చలు చేస్తూండేవాడు. పుల్లయ్య, కె.వి.రెడ్డి స్టార్ కంబైన్స్ లాడ్జిలో కలిసి రాత్రి తెల్లవార్లూ సినిమా కథల గురించి చర్చించేవారు.[5]

ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపారం

[మార్చు]

చదువు పూర్తికాగానే కె.వి.రెడ్డి ఏదైనా ఉద్యోగం సంపాదించాలన్న ఉద్దేశంతో పలు ప్రయత్నాలు చేశాడు. ఎంత తీవ్రంగా ప్రయత్నించినా ఏ ఉద్యోగమూ దొరకలేదు. డిగ్రీ ఆనర్స్ పాసైన కె.వి. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ప్రయత్నించినా కనీసం ఆరు నెలల విద్యాబోధన అనుభవం లేదన్న కారణంతో తిరస్కరించారు. ఉద్యోగ ప్రయత్నాల్లో వైఫల్యంతో విసిగి వేసారిన కె.వి.రెడ్డి, ఎ.ఎ.వి.కృష్ణారావు అన్న స్నేహితునితో కలిసి "ది స్టాండర్డ్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ కంపెనీ" ని స్థాపించాడు. 250 రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ఈ కంపెనీ పాఠశాలలు, కళాశాలల్లో ప్రయోగశాలలకు ఉపకరించే శాస్త్రోపకరణాలను తయారుచేసేది. 1936-37 మధ్యకాలంలో ఏడాది పాటు చేసిన ఈ వ్యాపారం లాభాలను సంపాదించి పెట్టింది.[6]

వైవాహిక జీవితం

[మార్చు]

కె.వి.రెడ్డి భార్య శేషమ్మ. ఆ దంపతులది చాలా అన్యోన్యమైన దాంపత్యం. పున్నమి దగ్గర పడే కొద్దీ రాత్రిళ్ళు డాబా మీదికి భార్యని తీసుకువెళ్ళి వెన్నెల్లో గడపడం కె.వి.కి సరదా. అలానే ఉదయాన్నే భార్య తల దువ్వనిదే బయటకు అడుగు పెట్టేవాడు కాదు. అవుట్ డోర్ షూటింగులు లేక చెన్నైలోనే ఉన్నప్పుడు నిత్యం తన భార్య చేతి వంటే తినేవాడు. వయసు పెరిగే కొద్దీ బలపడిపోయిన ఆ అనుబంధం చివరికి భార్యకు క్యాన్సర్ అనీ, తగ్గడం కష్టమనీ తెలిసిన తర్వాత తాను రోజూ వేసుకోవాల్సిన రక్తపోటు, మధుమేహం మందులు వేసుకోవడం మానేసే వరకూ వెళ్ళిపోయింది.[1]

కె.వి.రెడ్డి-శేషమ్మ దంపతులకు తొమ్మిది మంది సంతానం. పెద్ద కూతురు లక్ష్మీదేవిని ఓ వ్యాయామ ఉపాధ్యాయునికి ఇచ్చి పెళ్ళిచేశాడు. రెండో కూతురు సుమిత్రాదేవి భర్త లాయరు, వ్యాపారవేత్త. మూడవ సంతానమూ, పెద్ద కుమారుడు అయిన శ్రీనివాసరెడ్డి కె.వి. ఆఖరు చిత్రాల్లో కొన్నిటికి సహాయ దర్శకుడిగా పనిచేసి, ఆ పని మాని గోల్డ్ స్పాట్ సంస్థ మేనేజరుగా పనిచేస్తూ చిన్నవయసులోనే గుండెజబ్బుతో మరణించాడు. నాలుగవ సంతానమైన నరసింహారెడ్డి నావికాదళ అధికారిగా పనిచేసి అమెరికాలో స్థిరపడ్డాడు. ఐదవ సంతానం పార్వతీదేవిని బేతంచర్లకు చెందిన రామనాథరెడ్డికి ఇచ్చి వివాహం చేశాడు. ఐదవ సంతానమైన రామచంద్రారెడ్డి ఐఐటీలో చదువుకుని, అమెరికాలో 30 ఏళ్ళు పనిచేసి, హైదరాబాద్ లో సెమికండక్టర్స్ తయారుచేసే కంపెనీ పెట్టాడు. ఏడో సంతానం కొండారెడ్డి చెన్నైలో ఆటోమొబైల్ వర్క్ షాపు నిర్వహిస్తూ చిన్నతనంలోనే చనిపోయాడు. ఎనిమిదో సంతానమైన గీతాలక్ష్మి వ్యాపారవేత్త రాచమల్లు సుదర్శన్ రెడ్డి భార్య. ఆఖరు సంతానమైన వరలక్ష్మి కర్నూలుకు చెందిన న్యాయవాది ఎ. ప్రభాకరరెడ్డి భార్య.[1]

తన పిల్లలు సాంకేతిక నిపుణులుగానో, వైద్యులుగానో స్థిరపడాలని ఆశించాడే తప్ప, వారు సినిమా రంగంలోకి రావాలని కోరుకోలేదు. ఆ ప్రకారమే కొడుకులు సినిమా రంగానికి బయటే వేర్వేరు రంగాల్లో పనిచేశారు. అల్లుళ్ళను కూడా సినిమా రంగం నుంచి తెచ్చుకోలేదు. పిల్లలను క్రమశిక్షణతో పెంచాడు. సినిమా రూపకల్పనలో హడావుడి ఉన్నా ఉదయం, మధ్యాహ్నం పిల్లల కోసం సమయాన్ని కేటాయించి, వారిని తానే చదివించేవాడు. తన పిల్లల్లో ప్రత్యేకించి కూతుళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉండేది, వచ్చిన అల్లుళ్ళు వాళ్ళను ఎలా చూస్తున్నారో అన్న బెంగ ఎప్పుడూ ఉండేది.[1]

సినిమా రంగంలోకి; వాహినీ సంస్థతో అనుబంధం (1937-1950)

[మార్చు]

నిర్మాణ విభాగంలో (1937-1941)

[మార్చు]

శాస్త్రోపకరణాల తయారీ వ్యాపారంగా చేస్తున్న కె.వి.రెడ్డిని అతని బాల్య స్నేహితుడు మూలా నారాయణస్వామి తాను భాగస్వామిగా ఓ సినిమా నిర్మాణమవుతోందని ఆసక్తి ఉంటే నిర్మాణ శాఖలో పనిచేయవచ్చని ఆహ్వానించాడు. కె.వి.రెడ్డి అలా వచ్చి రోహిణీ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న గృహలక్ష్మి సినిమాకి క్యాషియర్ ఉద్యోగం చేశాడు.[6] 1938లో గృహలక్ష్మి సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అయినా సినిమా నిర్మాణంలో విలువల విషయమై హెచ్.ఎం.రెడ్డి ధోరణి బి.ఎన్.రెడ్డికి నచ్చకపోవడంతో బి.ఎన్.రెడ్డి, మూలా నారాయణస్వామి రోహిణీ పిక్చర్స్ నుంచి విడిపోయి, తమ వాటా సొమ్ముతో బయటకు వచ్చేశారు. మూలా నారాయణస్వామి, బి.ఎన్.రెడ్డి స్వంతంగా వాహినీ పిక్చర్స్ సంస్థ ప్రారంభించారు. వాహినికి మూలా నారాయణస్వామి ఛైర్మన్, బి. ఎన్. రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్.[7] కె.వి.రెడ్డి కూడా వీరితో వచ్చి వాహినీ సంస్థలో చేరాడు. వాహినీ వారు తీసిన వందేమాతరం (1939), సుమంగళి (1940), దేవత (1941) సినిమాలకు ప్రొడక్షన్ మేనేజరుగా పనిచేశాడు. క్యాషియర్‌గా గృహలక్ష్మికి పనిచేసిన నాటి నుంచీ ప్రొడక్షన్ విభాగంలో పనిచేస్తున్నా సినిమా నిర్మాణంలో ఇతర అంశాల పట్ల కూడా అవగాహన పెంచుకున్నాడు.[6]

దర్శకునిగా తొలి అడుగు (1942-1943)

[మార్చు]
కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన తొలి సినిమా భక్త పోతన పోస్టర్

1941 వరకు వాహినీ ప్రొడక్షన్స్‌లో వచ్చిన మూడు సినిమాలు: వందేమాతరం, సుమంగళి, దేవత. వీటన్నిటికీ బి. ఎన్. రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ మూడు సినిమాలు పెద్ద విజయం ఏమీ సాధించలేదు. విమర్శకుల ప్రశంసలు సంపాదించుకున్నా, ఆర్థికంగా అంతంతమాత్రమే.[7] ఈ దశలో కె.వి.రెడ్డి భక్త పోతన సినిమా స్క్రిప్టు తయారుచేసుకున్నాడు.[6] కె.వి.రెడ్డి దర్శకత్వంలో భక్త పోతన సినిమా తీసేందుకు కంపెనీ తీర్మానించింది. భక్త పోతన సినిమా ప్రారంభం అయ్యేలోగానే ప్రొడక్షన్ మేనేజరు దర్శకత్వం ఎలా వహిస్తాడన్న పెదవి విరుపులు మొదలయ్యాయి. ముఖ్యంగా బి.ఎన్.రెడ్డికి, ఉమ్మడి ఆస్తి పద్ధతిలో సాగుతున్న అతని కుటుంబ సభ్యులకు ఈ సినిమా కె.వి.రెడ్డి తీయడం నచ్చలేదు. బి.ఎన్.రెడ్డి తీసిన సినిమాల ఫలితమే అంతంతమాత్రంగా ఉంటే దర్వకత్వ శాఖలో అనుభవం లేని కె.వి.రెడ్డి సినిమా తీస్తే కంపెనీ దివాలా తీస్తుందన్న వ్యాఖ్యలు చేశారు. కె.వి.రెడ్డితోనూ వ్యక్తిగతంగా వారి ప్రవర్తన మారిపోయింది. దాంతో మనస్తాపం చెందిన కె.వి.రెడ్డి, వారికి అంతగా ఇష్టం లేనప్పుడు తీయవద్దు లెమ్మని మూలా నారాయణస్వామితో చెప్పేశాడు.[7][6] అయితే మూలా నారాయణస్వామి అందుకు ఒప్పుకోక, బోర్డు మీటింగ్ పెట్టి అందులో కె.వి.రెడ్డి భక్త పోతన సినిమా తీస్తాడని, లాభం వస్తే కంపెనీదని, నష్టం వస్తే వ్యక్తిగతంగా తాను భరిస్తానని తేల్చి చెప్పడంతో సినిమా ప్రారంభం అయింది.[8]

సినిమా విజయవంతం అవుతుందని మూలా నారాయణస్వామికి, కె.వి.రెడ్డికి తప్ప మరెవరికీ నమ్మకం లేదు. నిర్మాణం సాగుతున్నప్పుడు వాహినీ సంస్థ వారు కె.వి.రెడ్డిని "భక్త పోతన దర్శకత్వానికి వెయ్యి రూపాయలు తీసుకుంటారా? లాభాల్లో పది శాతం వాటా కావాలా?" అని అడిగితే కె.వి.రెడ్డి పారితోషికం వద్దని, లాభాల్లో పది శాతం కావాలని సమాధానమిచ్చాడు. వెయ్యి రూపాయలు చాలా పెద్ద మొత్తమైన ఆ రోజుల్లో లాభాల్లో పది శాతం వాటా కోరడం కె.వి. రెడ్డికి తన స్క్రిప్టు మీద, దర్శకత్వం మీద ఉన్న నమ్మకాన్ని సూచించింది.[6] కె.వి.రెడ్డి దర్శకత్వంలో, బి.ఎన్.రెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో ప్రారంభమైన భక్త పోతన సినిమా నిర్మాణ పనుల్లో మూడు శాతం పూర్తయ్యాకా మరో అవాంతరం వచ్చింది. సినిమా నిర్మాణం నాలుగింట మూడు వంతులు పూర్తి అయిపోయే సరికి రెండవ ప్రపంచ యుద్ధం ముమ్మరమై భారతదేశపు తీర నగరాల మీద జపాన్ వాళ్ళు బాంబులు వేయడం మొదలుపెట్టారు. వాహినీ సంస్థను హుటాహుటిన తాడిపత్రికి తరలించి, మద్రాసులో అన్నీ మూసేశారు. సినిమా ఆగిపోయింది. వెనక్కి తిరిగొచ్చి సినిమా పూర్తిచేస్తామని ఎవరికీ నమ్మకం లేదు. కె.వి.రెడ్డి కూడా తొలి సినిమాకే ఇలా అవడంతో డీలా పడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ బాంబుల భయం పోవడంతో మళ్ళీ సినిమా నిర్మాణం ప్రారంభమైంది.[8]

అందరూ మద్రాసు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఈ సినిమా ఛాయాగ్రాహకుడు రామ్‌నాథ్, కళా దర్శకుడు శేఖర్ జెమినీ స్టూడియోలో చేరారు. బాంబుల భయం పోయి సినిమా ప్రారంభమయ్యాకా ట్రిక్ షాట్లు మిగిలిపోవడంతో రామ్‌నాథ్‌ను కలిసి పని పూర్తిచేయమని కె.వి.రెడ్డి కోరాడు. తాను లేకుంటే సినిమా పూర్తిచేయలేకుంటే ఇంకేమి దర్శకుడంటూ రామ్‌నాథ్ రెచ్చగొట్టడంతో కె.వి.రెడ్డి స్వయంగా ట్రిక్ షాట్లు నేర్చుకుని రామ్‌నాథే మెచ్చుకునేలా తానే అదంతా పూర్తిచేశాడు.[8] 1943 జనవరి 7న సినిమా విడుదల అయింది. తెలుగు నాట మాత్రమే కాక ఆనాటి మైసూరు, కేరళ ప్రాంతాలు సహా మొత్తం దక్షిణ భారతదేశమంతటా ఘన విజయం సాధించింది.[9]

వాహినీ ప్రొడక్షన్స్‌లో భాగం (1944-1946)

[మార్చు]
స్వర్గ సీమ సినిమాలోని ఓ సన్నివేశంలో ప్రేక్షకుల్లో ఒకడిగా కె.వి.రెడ్డి తెర మీద కనిపించాడు.

భక్త పోతన భారీ విజయం సాధించడంతో వాహినీ పిక్చర్స్ ఛైర్మన్, ఇతరత్రా పలు వ్యాపారాలున్న మూలా నారాయణస్వామికి ఈ సినిమా వ్యాపారం కూడా లాభసాటియేనన్న గురి కుదిరింది. అప్పటివరకూ సినిమాలు తీస్తూ వచ్చిన వాహినీ పిక్చర్స్ సంస్థను పంపిణీకి పరిమితం చేసి, సినిమాలు నిర్మించడానికి వాహినీ ప్రొడక్షన్స్ ప్రారంభించాలని మూలా నారాయణస్వామి బోర్డులో ప్రతిపాదించి తీర్మానం చేయించాడు. వాహినీ ప్రొడక్షన్స్ మూలధనంగా రూ.2 లక్షల 50 వేలు నిర్ణయించగా దానిలో రెండు లక్షల రూపాయలు మూలా నారాయణస్వామే పెట్టుబడి పెట్టాడు. మిగతా రూ.50 వేలులో బి.ఎన్.రెడ్డి కుటుంబంతో పాటు కె.వి.రెడ్డి పెట్టుబడి కూడా స్వీకరించి వాహినీ ప్రొడక్షన్స్‌లో కె.వి.రెడ్డికి భాగస్వామ్యం కల్పించారు. అప్పుడే వాహినీ ప్రొడక్షన్స్‌లో బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డిలు ఒకరి తర్వాత మరొకరు సినిమాలు తీయాలని నిర్ణయం జరిగింది. అలా వాహినీ ప్రొడక్షన్స్ ప్రారంభం అయినాకా ఆ బ్యానర్ మీద మొదటి సినిమాగా బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో స్వర్గసీమ తీస్తే, దానికి ప్రొడక్షన్ మేనేజరుగా మళ్లీ కె.వి.రెడ్డి బాధ్యత తీసుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం రోజులు కావడంతో ముడి ఫిల్మ్‌కి చాలా ఇబ్బందులు ఎదుర్కొని, ప్రభుత్వం విధించిన పరిమితిలో 11 వేల అడుగులకే పరిమితమై స్వర్గసీమ తీసినా ప్రేక్షకులు ఆదరించారు.[7] స్వర్గ సీమ సినిమాలో కె.వి.రెడ్డి "ఓహో తపోధనా" పాటలో ప్రేక్షకుల్లో ముందువరుసలో ఒకడిగా కొద్ది క్షణాల పాటు తెరమీద కనిపించాడు.[10]

యోగి వేమన, గుణసుందరి కథ (1947-1949)

[మార్చు]

ఇలా స్వర్గసీమ సినిమాకు ప్రొడక్షన్ మేనేజరుగా పనిచేస్తూనే కె.వి.రెడ్డి తాను తీయాల్సిన సినిమాకు స్క్రిప్టు తయారుచేసుకోవడం ప్రారంభించాడు.[7] భక్త పోతన ఘన విజయంతో పోతనగా నటించి మెప్పించిన చిత్తూరు నాగయ్య స్వంత నిర్మాణ దర్శకత్వంలో త్యాగయ్య సినిమా తీసి విజయాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలోనే నీతి శతకంతోనూ, యోగి అన్న పేరుతోనూ ప్రఖ్యాతి చెందిన వేమన కవి జీవితం ఆధారంగా సినిమా తీయడానికి నిర్ణయించుకున్నారు. సముద్రాల సీనియర్‌తో కలిసి కె.వి.రెడ్డి వేమన గురించి ఉన్న జానపద గాథలను కలిపి ఈ స్క్రిప్టును రూపొందించారు. యోగి వేమన కళాఖండం అన్న పేరును సంపాదించుకుంది. పెద్ద విజయం సాధించలేదు.[11]

ఇదే సమయంలో తమ సినిమాల నిర్మాణానికి స్టూడియో కోసం ఎక్కువ సమయం ఆగాల్సివస్తోందని, తమకే స్వంతంగా స్టూడియో ఉంటే బావుంటుందని వాహినీ ప్రొడక్షన్స్ వారు భావించారు. స్టూడియోకి మూలా నారాయణస్వామి పెట్టుబడి పెట్టగా, నిర్మాణ బాధ్యతలను బి.ఎన్.రెడ్డి తీసుకున్నాడు. కె.వి.రెడ్డి యోగి వేమన తీశాకా వాహినీ పద్ధతి ప్రకారం తర్వాతి సినిమా బి.ఎన్.రెడ్డి తీయాల్సి ఉన్నా అతను స్టూడియో నిర్మాణ పనుల్లో బాగా బిజీగా ఉండడంతో తర్వాతి సినిమా కూడా కె.వి.రెడ్డే తీశాడు. అదే గుణసుందరి కథ. మూలా నారాయణస్వామి నిర్మాతగా వాహినీ స్టూడియో బ్యానర్ మీద ఈ సినిమా ప్రారంభమైంది.[12] అప్పటివరకూ తన దర్శకత్వంలో కానీ, వాహినీ సంస్థ ద్వారా కాని తీయని జానపద శైలిలో సినిమా తీయాలని కె.వి.రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఇందుకు ఆంగ్లంలో విలియం షేక్‌స్పియర్ రాసిన నాటకం కింగ్ లియర్ మూల కథాంశంగా ఎంచుకున్నారు. అయితే ఆంగ్లంలో విషాదాంత నాటకం నుంచి స్ఫూర్తి తీసుకుని కథా రచయిత పింగళి నాగేంద్రరావు, స్క్రీన్ ప్లే రాసిన కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వరరావులు పూర్తిస్థాయి వినోదాత్మకంగా తయారుచేశారు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.[4]

అత్యున్నత దశ (1950-1963)

[మార్చు]

పాతాళ భైరవి (1949-1951)

[మార్చు]

1949 ప్రాంతంలో వాహినీ స్టూడియోస్, ప్రొడక్షన్స్ సహా ఆబ్కారీ వ్యాపారం, పలు సంస్థలు ఉన్న మూలా నారాయణస్వామి మీద ఆదాయపు పన్ను శాఖ వారు రెయిడ్ చేసి 20-30 లక్షల రూపాయలు ఫైన్ వేసి, ఆస్తులన్నీ జప్తు చేసుకున్నారు.[12] వాహినీ స్టూడియోస్ ఈ చిక్కుల్లో పడి జప్తు కాకుండా ఉండాలని స్టూడియోను అప్పటికప్పుడు నాగిరెడ్డి, చక్రపాణి కలిసి పెట్టిన విజయా ప్రొడక్షన్స్‌కి వాహినీ స్టూడియోస్ లీజుకు ఇచ్చినట్టు చూపించారు.[12] ఆస్తులన్నీ సీజ్‌లో ఉండి ఆదాయం నిలిచిపోయింది. క్రమేపీ మూలా నారాయణస్వామి సమస్యలు పెరుగుతూ పోగా వాహినీ ప్రొడక్షన్స్‌లో తన భార్య పేరిట ఉన్న రూ.లక్ష మిగిలిన వాటాదారులకు అమ్మేసుకున్నాడు. ఒకనాడు రాయలసీమ బిర్లా అన్న పేరు తెచ్చుకున్న మూలా, చివరికి క్షయ వ్యాధికి గురై శానిటోరియంలో చాలా దుస్థితిలో మరణించాడు.[12]

పాతాళ భైరవిలో ఓ సన్నివేశం

ఈ పరిస్థితుల మధ్య కొత్తగా ఏర్పడ్డ విజయ ప్రొడక్షన్స్ సంస్థ మొదటి సినిమాగా షావుకారు తీస్తే, మంచి పేరు మాత్రం తెచ్చుకుని ఆర్థికంగా విజయం సాధించలేదు. ఆ దశలో నిర్మాతలు నాగిరెడ్డి-చక్రపాణి విజయా సంస్థకు ఓ జానపద సినిమా తీసిపెట్టమని కె.వి.రెడ్డిని కోరారు. అరేబియన్‌ నైట్స్‌ అన్న మధ్య ప్రాచ్యానికి చెందిన కథల్లోని అల్లావుద్దీన్ అద్భుత దీపం అన్న ప్రముఖ జానపద కథను స్ఫూర్తిగా తీసుకుని పింగళితో పాతాళ భైరవి కథ రాయించుకుని దానికి కమలాకర కామేశ్వరరావుతో కలిసి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు కె.వి.రెడ్డి.[13] చక్రపాణి స్వయానా స్క్రీన్ ప్లే రచయిత కావడంతో విజయా వారి సినిమాలకు స్క్రీన్ ప్లే దశ నుంచి నిర్మాతలిద్దరూ ఇన్వాల్వ్ అయ్యేవారు. కానీ కె.వి.రెడ్డికి అలాంటి జోక్యం ఇష్టం లేకపోవడంతో తమ ఇష్టాయిష్టాలు పక్కనపెట్టి పూర్తి బాధ్యత కె.వి.రెడ్డి మీదే పెట్టి సినిమా నిర్మించారు.[14] తోట రాముడు పాత్రకు అక్కినేని నాగేశ్వరరావును, మాంత్రికుడు పాత్రకు ముక్కామలను కె.వి.రెడ్డి తీసుకుందామని అనుకున్నాడు. ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వేరే షూటింగ్ గ్యాప్‌లో టెన్నిస్ ఆడుతుంటే చూసిన కె.వి.రెడ్డికి ఓడిపోతున్న ఉక్రోషంలో రామారావు ప్రవర్తన జానపద నాయకుని తరహాలో ఉందనిపించి హీరోగా నిర్ణయించుకున్నాడు. కొత్తవాడైన రామారావుకు తగ్గట్టు ఉండాలని ఎస్వీ రంగారావును ప్రతినాయకుడిగా నిశ్చయించుకున్నాడు.[13]

ఒకేసారి తెలుగులోనూ తమిళంలోనూ సినిమా తీశారు. 1951 మార్చి 15న తెలుగు వెర్షన్ విడుదలైంది.[14] విడుదలైనప్పుడు మొదట సినిమాకు యావరేజి అన్న మాట ప్రబలింది. ఇది కూడా ఫ్లాప్ అయితే మరో సినిమా తీసేందుకు స్తోమత సరిపోని నిర్మాతలు కంగారుపడ్డారు. కానీ కె.వి.రెడ్డి మాత్రం సినిమా మీద నమ్మకంగానే ఉండేవాడు. నాలుగో వారం నుంచి కలెక్షన్లు పెరిగి, హౌస్ ఫుల్స్ అవుతూ సినిమా అప్పటివరకూ ఉన్న రికార్డులన్నిటినీ తిరగరాసే స్థాయిలో విజయవంతం అయింది.[15] మేలో విడుదలైన తమిళ వెర్షన్ కూడా భారీ హిట్ అయింది. నేరుగా విడుదలైన కేంద్రాల్లో రజతోత్సవం, 200-రోజులు పూర్తిచేసుకున్న తొలి తెలుగు చలన చిత్రం పాతాళ భైరవి. పది సెంటర్లలో వంద రోజులు, ఐదు సెంటర్లలో 175 రోజులు పూర్తిచేసుకుంది. జెమినీ వాసన్ హిందీ హక్కులు కొని రెండు పాటలు పునర్నిర్మించి, డబ్బింగ్ సినిమాగా 1952లో విడుదల చేస్తే అక్కడా మంచి విజయం సాధించింది.[13] ఈ ఘన విజయం ఆర్థికంగా విజయా ప్రాడక్షన్స్‌ని నిలబెట్టింది, ఎన్.టి.రామారావుకు, ఎస్.వి.రంగారావుకు స్టార్ హోదా ఇచ్చింది, పింగళి రాసిన కొన్ని డైలాగులు జనంలో సామెతల తరహాలో అలవాటైపోయాయి.

పెద్ద మనుషులు (1951-1954)

[మార్చు]
సినిమాలో కీలకమైన ఛైర్మన్ పాత్ర తన గురించి తాను వివరిస్తున్నట్టుగా పెద్దమనుషులు పోస్టర్

పాతాళ భైరవి సినిమా విడుదలై ఆరు వారాలు కాగానే దాని సత్తా తేలిపోవడంతో కె.వి.రెడ్డికి బ్లాంక్ చెక్ ఇచ్చి నాగిరెడ్డి విజయా సంస్థకు మరొక సినిమా తీసిపెట్టమని కోరాడు. కాని కె.వి.రెడ్డి మాత్రం బి.ఎన్.రెడ్డి మల్లీశ్వరి తీయడం పూర్తి కాగానే, తాను వాహినీ సంస్థకు ఓ సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. వాహినీ తన సంస్థే కాబట్టి తన మాట మన్నించి ఈసారికి విజయాకి చేయమని నాగిరెడ్డి రెట్టించి అడిగితే అది తన మాతృసంస్థ అని తేల్చిచెప్పడంతో నాగిరెడ్డి-చక్రపాణి నొచ్చుకున్నారు.[16] కె.వి.రెడ్డి ఆంగ్ల నాటకాలు, సినిమాలు బాగా చూసేవాడు. నార్వేజియన్ రచయిత హెన్రిక్ ఇబ్సన్ రాసిన "పిల్లర్స్ ఆఫ్ సొసైటీ" నాటకంలో ప్రధానమైన పాయింట్ తీసుకుని, ఆ ప్రేరణతో సాంఘిక సినిమా చేద్దామని కె.వి. నిర్ణయించుకున్నాడు.[17] పాతాళ భైరవి నాటి నుంచీ విజయా ప్రొడక్షన్స్ కు నెలజీతం పద్ధతి మీద పింగళి నాగేంద్రరావు కాంట్రాక్టులో ఉన్నాడు. దీంతో కె.వి.రెడ్డి వెళ్ళి వాహినీలో తాను తీయబోయే సినిమాకు రచయితగా పింగళిని ఉపయోగించుకోనివ్వమని నాగిరెడ్డిని లాంఛన ప్రాయంగా అడిగాడు. కె.వి.రెడ్డి విజయా సంస్థకి సినిమా తీయనన్నాడన్న కోపంలో ఉన్న నాగిరెడ్డి ఒప్పుకోలేదు.[16] దీనితో కొత్త రచయిత కోసం కె.వి.రెడ్డి ప్రయత్నించాల్సి వచ్చింది. విజయవాడలో జరిగిన పాతాళ భైరవి విజయోత్సవంలో ఈ సంగతులన్నీ తెలుసున్న కాజ వెంకట్రామయ్య ఉద్దేశపూర్వకంగా అప్పటికి నాటక రచయిత, దర్శకుడు అయిన డి.వి.నరసరాజుతో "నాటకం" అన్న అతని నాటకాన్ని ప్రదర్శింపజేశాడు.[18] ఆ నాటకం నచ్చిన కె.వి.రెడ్డి నాటక రచయిత డి.వి.నరసరాజును తన సినిమాకు రచయితగా తీసుకున్నాడు.[19]

స్క్రిప్ట్ పని ప్రారంభించిన కె.వి.రెడ్డి, డి.వి.నరసరాజు పిల్లర్స్ ఆఫ్ సొసైటీ నాటకాన్ని పూర్తిగా అనుసరించకుండా అందులో ముఖ్యమైన రెండు పాత్రలను తీసుకుని, మిగతా కథను స్వంతంగా అభివృద్ధి చేసుకున్నారు.[17] ఈ సినిమా నిర్మాణం సమయంలోనూ కె.వి.రెడ్డికి, నాగిరెడ్డికి నడుమ సమస్యలు పెరిగి పెద్దవై సినిమా నిర్మాణం వాహినీ స్టూడియోలో చేసుకుంటానన్నా నాగిరెడ్డి తిరస్కరించేదాకా పోయింది.[20] దీనితో సినిమాను రేవతి స్టూడియోలో సెట్ వేసి తీయడం మొదలుపెట్టాడు కె.వి.రెడ్డి. కొన్ని సినిమాలకు పనిచేసి, అప్పటికి ఇంటి వద్ద వ్యవసాయం చేసుకుంటున్న కొసరాజు రాఘవయ్యని వెతికించి, ప్రత్యేకంగా కోరి ఈ సినిమాలో పాటలు రాయించుకున్నాడు. బి.ఎన్.రెడ్డి, నాగిరెడ్డిల తమ్ముడు బి. ఎన్. కొండారెడ్డి దీనికి ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు. అత్యంత కీలకమైన ధర్మారావు పాత్రను జంధ్యాల గౌరీనాధశాస్త్రితో వేయించాడు.[17] బి.ఎన్.రెడ్డి, కాజ వెంకట్రామయ్యలు కల్పించుకుని మధ్యవర్తిత్వం వహించడంతో కె.వి.రెడ్డికి, నాగిరెడ్డికి మనస్పర్థలు పోవడంతో తిరిగి సినిమా వాహినీ స్టూడియోలో నిర్మించసాగారు. పెద్దమనుషులు తర్వాత మరో సినిమా బయటి నిర్మాతకు చేసి, మళ్ళీ ఓ జానపద చిత్రాన్ని విజయా వారికి నిర్మించేట్టు ఒప్పందం.[20] పెద్ద మనుషులు సినిమా పూర్తై 1954 మార్చి 11న విడుదలైంది. సినిమా మంచి విజయాన్ని సాధించింది. అంతవరకు జానపదాలకు, చారిత్రక కల్పనలకు పేరుతెచ్చుకున్న కె.వి.రెడ్డి సాంఘిక వ్యంగ్య చిత్రాన్నీ విజయవంతంగా తీయడం సినీ పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కె.వి.రెడ్డి పరిచయం చేసిన రచయిత నరసరాజుకు, వెనక్కి తీసుకువచ్చిన గేయ రచయిత కొసరాజుకు ఈ విజయం లాభించింది.[17] 2వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో సినిమాకి ఉత్తమ తెలుగు చలన చిత్రంగా రాష్ట్రపతి నుంచి రజత పతకం లభించింది.[21]

దొంగరాముడు (1954-1955)

[మార్చు]
దొంగరాముడు సినిమా పోస్టర్

తెలుగు సినిమా కథా నాయకుడుగా స్థిరపడ్డ అక్కినేని నాగేశ్వరరావు, దుక్కిపాటి మధుసూదనరావుతో కలిసి సినిమా నిర్మాణం ప్రారంభించాలని 1951లో అన్నపూర్ణ పిక్చర్స్ పెట్టాడు. కె.వి.రెడ్డి కథా చర్చలు, స్క్రిప్టు రూపకల్పన, చిత్రీకరణ అంతా ఒక పద్ధతిగా, పక్కాగా చేస్తాడని పేరు ఉండడంతో తొలి సినిమా అతని దర్శకత్వంలో చేయించుకుని, ఆ పద్ధతులు నేర్చుకుని అనుసరించాలని నిర్మాతలు ఆశించారు. కె.వి.రెడ్డి అప్పటికి పెద్దమనుషులు సినిమా కథా చర్చల్లో ఉండడంతో, అది పూర్తయ్యేది ఎప్పుడో తెలియదని, పూర్తయ్యాకా తీస్తానని చెప్పాడు. అందుకు నాగేశ్వరరావు, మధుసూదనరావు ఒప్పుకుని కె.వి.రెడ్డి కోసం రెండేళ్ళు వేచి చూశారు.[22] నిజానికి కె.వి.రెడ్డికి అక్కినేని నాగేశ్వరరావును డైరెక్ట్ చేయాలని, నాగేశ్వరరావుకు కె.వి. దర్శకత్వంలో నటించాలని కోరిక ఉండేది.[23] పెద్దమనుషులు సినిమాకి చేయాల్సిన పని పూర్తి కాగానే కె.వి.రెడ్డి, డి.వి.నరసరాజు, అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మాతలతో కథాచర్చలకు కూర్చున్నారు. ముందు "సెవెన్ యియర్ ఇచ్" అన్న ఆంగ్ల చిత్రం స్ఫూర్తితో ఓ సినిమా కథను అనుకున్నా, దానిలో హీరో పాత్ర నెగెటివ్ షేడ్స్ ఉందన్న కారణంగా మధుసూదనరావుకు నచ్చకపోవడంతో పక్కనపెట్టారు.[నోట్స్ 1] తమ్ముడి కోసం దొంగతనాలు చేసి, అతను ఉన్నతస్థానానికి ఎదిగాకా అతని అన్నలమని చెప్పుకోలేని స్థితిలో పడడం అన్న పాయింట్‌తో "లవింగ్ బ్రదర్స్" అన్న నవల సారాంశం దుక్కిపాటి మధుసూదనరావు చదివాడు. దాన్ని మధుసూదనరావు నరసరాజుతో కూర్చుని మార్పులుచేసి కె.వి.రెడ్డికి వినిపించాడు. తమ్ముడి పాత్రను చెల్లెలిగా మార్చడంతో పాటు కథలో ఆ ముఖ్యమైన పాయింట్ ఒక్కటీ తీసుకుని మిగతా అంశాలు, పాత్రలు మార్చి రాశారు. కె.వి.రెడ్డికి కథ బాగా నచ్చేసింది.[22] సినిమా రషెస్ వేసి చూపించినప్పుడు నవయుగ పంపిణీదారులు, రిలీజ్ ముందు షో చూసిన పరిశ్రమ వర్గాలు సినిమా బాగోలేదన్నట్టుగానే ప్రతిస్పందించారు. కె.వి.రెడ్డి వద్దన్నా నిర్మాతలు ప్రివ్యూ వేయగా అది చూసినవారూ బాగోలేదన్నారు. కానీ సినిమా మాత్రం మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకుంది.[23] తమిళ వెర్షన్ తిరుట్టు రామన్ కూడా మంచి విజయం సాధించింది.[24]

మాయాబజార్ (1955-1957)

[మార్చు]
సుందరి నీ వంటి దివ్య స్వరూపము పాట రికార్డింగులో పిఠాపురం నాగేశ్వరరావు, సావిత్రి, ఘంటసాల తదితరులతో కె.వి.రెడ్డి (మైకుకు కుడిపక్క)

నాగిరెడ్డికి ఒప్పుకున్నట్టుగానే కె.వి.రెడ్డి దొంగరాముడు తర్వాత విజయా వారికి మాయాబజార్ తీయడం ప్రారంభించాడు.[20] 1936లో ఒకసారి మాయాబజార్ తెలుగులో సినిమాగా వచ్చింది, మొత్తం మరో ఆరుసార్లు ఇతర భారతీయ భాషల్లో నిర్మితమైంది. అంతకుముందు నుంచీ నాటకాల్లో శశిరేఖా పరిణయం పేరిట పేరొందింది. పాండవులు, కౌరవులు, యాదవుల మధ్య సాగే ఈ కథ మాత్రం మహాభారతం లోనిది కాదు. జానపద గాథల మీద ఆధారపడి తీయాల్సిన సినిమా. అందులోనూ భారీ తారాగణం అవసరమైన కథ కావడంతో ఉన్న పాత్రలన్నిటికీ పెద్ద నటులు కుదిరిపోతే పాండవులు, ద్రౌపదీ ఎలా దొరుకుతారన్న ఉద్దేశంతో వారు లేకుండానే స్క్రీన్ ప్లే పకడ్బందీగా రాసుకోసాగారు పింగళి, కె.వి.రెడ్డి. పాత్రల రూపకల్పన విషయంలోనూ అప్పటివరకూ కృష్ణుడికి చిన్న కిరీటం (హాఫ్ క్రౌన్), పింఛం ఉండగా, దాన్ని మారుస్తూ పూర్తి కిరీటం పైన పింఛాలతో కె.వి.రెడ్డి నేతృత్వంలో మా.గోఖలే, కళాధర్ రూపొందించారు. ఇలా ప్రతీ ఆభరణం విషయంలోనూ, పాత్ర రూపకల్పన విషయంలోనూ, సెట్‌ల స్కెచ్‌లలోనూ శ్రద్ధ తీసుకుని ఆలోచించి సినిమా స్క్రిప్ట్ తయారుచేస్తూంటే దాదాపు ఏడాది గడిచింది.[25] ఇంతలో హఠాత్తుగా నిర్మాతలు నాగిరెడ్డి-చక్రపాణి బడ్జెట్ గురించి తమలో తాము భయపడి సినిమాకి చేస్తున్న పని ఆపమని కబురుపెట్టారు. ఈ దశలో సినిమా ఆపడంతో హర్ట్ అయిన కె.వి.రెడ్డి పలువురు తెలుగు, తమిళ నిర్మాతలు, నిర్మాణ సంస్థలు ఆ సినిమా తమకు తీసిపెట్టమన్నా వినలేదు. చేస్తే విజయా ప్రొడక్షన్స్ కే సినిమా చేస్తానని తేల్చి ఊరుకున్నాడు.[26] ఎందరు నిర్మాతలు ఈ సినిమాను తాము తీస్తామని ముందుకు వస్తున్నారన్నది సూచనా ప్రాయంగా అక్కినేని నాగేశ్వరరావు చెప్పడంతో తెలుసుకున్న నిర్మాతలు మధ్యవర్తి ద్వారా మాట్లాడించి, కె.వి.రెడ్డితో బడ్జెట్ వేయించుకుని సినిమా పున:ప్రారంభించారు.[27] ఈ సంఘటనతో పాటుగా సినిమా చిత్రీకరణలో చక్రపాణి ఇన్వాల్వ్ కావడం, నిర్మాతలు రషెస్ వేస్తే చూసిన వారందరూ తలో వ్యాఖ్య చేయడంతో కె.వి.రెడ్డి మీద ఒత్తిడి పెరిగింది. దీంతో కె.వి.రెడ్డికి నాగిరెడ్డి-చక్రపాణిలతో విభేదాలు, మనస్పర్థలు పెరిగాయి.[28] అయినా సినిమా నిర్మాణం విషయంలో, నాణ్యత విషయంలో నాగిరెడ్డి మంచి సహకారం ఇచ్చాడు.

మాయాబజార్లో శశిరేఖ (సావిత్రి) ప్రియదర్శిని చూసే సన్నవివేశ చిత్రీకరణలో కె.వి.రెడ్డి

కె.వి.రెడ్డి మాయాబజార్ సినిమా చిత్రీకరణను ప్రత్యేక శ్రద్ధతో చేశాడు. చిన్న చిన్న డైలాగులు, ట్రిక్ షాట్లు, హావభావ వ్యక్తీకరణలతో సహా ఔచిత్యం పరిశీలించుకుంటూ సినిమా చేశాడు. తెలుగులోనూ, తమిళంలోనూ సమాంతరంగా చిత్రీకరణ చేశాడు. అప్పటికి కొన్ని సాంఘిక చిత్రాల్లోఎన్.టి.రామారావు కృష్ణుడి పాత్ర వేస్తే ప్రేక్షకులు థియేటర్లో అపహాస్యంగా నవ్వారు. ఈ కారణంగా తాను ఆ పాత్రకు సరిపోనని భావించి అతడు, కృష్ణుడి పాత్ర వెయ్యనంటే కె.వి.రెడ్డి పట్టుబట్టి, ఒప్పించి మరీ వేయించాడు. సినిమా చిత్రీకరణకు ముందు ప్రతీ నటుడితోనూ రిహార్సల్స్ చేయించి, సినిమా ఎంత పొడవు వస్తుందన్నది కె.వి.రెడ్డి సూక్ష్మంగా అంచనా వేసి తీయడంతో సినిమా నిడివికీ, చిత్రీకరించిన నిడివికీ 300 అడుగులు మాత్రమే తేడా వచ్చింది.[29]

1957 మార్చి 27న విడుదలైన మాయాబజార్ ఆర్థికంగానూ, సినిమా రంగంపై ప్రభావం పరంగానూ, విమర్శకుల ప్రశంసల పరంగానూ కూడా ఘన విజయం సాధించింది. సినిమా విడుదలైన 60 ఏళ్ళ తర్వాత కూడా రంగుల్లో తీసి విడుదల చేయడం, దశాబ్దాల తర్వాత సిఎన్ఎన్-ఐబిఎన్ సర్వేలో భారతీయ ప్రేక్షకులు ఈ సినిమాని భారతీయ సినిమాల్లో అత్యుత్తమ చిత్రంగా ఎన్నుకోవడం లాంటి సంఘటనలు సినిమా ప్రభావాన్ని చూపుతున్నాయి.[29][30]

స్వంత నిర్మాణ సంస్థ: పెళ్ళినాటి ప్రమాణాలు (1958)

[మార్చు]

వరుసగా విజయాలు సాధించిన ఉత్సాహంతో కె.వి.రెడ్డి తన స్నేహితులు పి.ఎస్.రెడ్డి, తిక్కవరపు పఠాభిరామిరెడ్డిలను కలుపుకుని స్వంత నిర్మాణ సంస్థ జయంతి పిక్చర్స్ స్థాపించాడు. ఆంగ్ల నాటకం సెవన్ ఇయర్స్ ఇచ్ ఆధారంగా అనుకున్న సబ్జెక్టుతోనే సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. 1952 నాటి ఈ ఆంగ్ల నాటకాన్ని హాలీవుడ్ సినిమాగా తీసి 1955లో విడుదల చేయగా మంచి విజయాన్ని, ప్రఖ్యాతిని సాధించింది. పెళ్ళయిన ఏడేళ్ళకు భార్యనీ, పిల్లాడిని వదిలివేసి పక్కింటి అమ్మాయితో పారిపోదామన్న కోరికతో సతమతమయ్యే హీరో కథతో ఆ నాటకం, సినిమా వచ్చాయి. 1954లోనే అన్నపూర్ణ పిక్చర్స్ తొలి చిత్రంగా ఈ కథాంశంతో తయారుచేసిన కథతో సినిమా చేయాలని కె.వి.రెడ్డి ప్రతిపాదిస్తే మిగిలిన నిర్మాతల్లో ఒకడైన దుక్కిపాటికి అది నచ్చకపోవడంతో వదిలి వేరే కథతో దొంగరాముడు తీశాడు. తన స్వంత నిర్మాణ సంస్థ పెట్టాకా, తనకు ఇష్టమైన ఆ నాటకంలో మూల కథాంశాన్ని మాత్రం తీసుకుని మిగతా అంతా మార్చి పెళ్లినాటి ప్రమాణాలు కథ పింగళి నాగేంద్రరావుతో కూర్చుని తయారుచేసుకున్నాడు.[31]

కె.వి. పెళ్ళినాటి ప్రమాణాలు కథను తెలుగులోనూ, తమిళంలోనూ సమాంతరంగా తీశాడు. సినిమా చిత్రీకరణకు కేవలం 3-4 సెట్లు మాత్రమే వేశారు. అవుట్ డోర్ షూటింగ్ కోసం మద్రాసుకు సమీపంలోని మహాబలిపురం వెళ్ళి చేసుకు వచ్చారు. 1958 డిసెంబరు 12న విడుదలైన సినిమా ఫర్వాలేదనిపించుకునే స్థాయి వసూళ్ళు సాధించింది. 1959 సెప్టెంబరు 4న విడుదలైన తమిళ వెర్షన్ పెట్టుబడి మాత్రం రాబట్టుకునేలా ఆడింది. జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా పెళ్ళినాటి ప్రమాణాలు రజత పతకం పొందడం ఒక్కటే కె.వి.రెడ్డికి, సహ నిర్మాతలకు ఊరట కలిగించే అంశం.[31]

జగదేకవీరుని కథ (1959-1961)

[మార్చు]

1944 నాటి విజయవంతమైన తమిళ జానపద చిత్రం జగదల ప్రతాపన్ మూల కథాంశాన్ని స్వీకరించి ఒక జానపద సినిమా కథను కె.వి.రెడ్డి, పింగళి నాగేంద్రరావు తయారుచేశారు. ఈ కథతో విజయా ప్రొడక్షన్స్ లో సినిమా తీయడానికి కె.వి.రెడ్డి రెండు షరతుల మేరకు అంగీకరించాడు. సినిమా నిర్మాతలు నాగిరెడ్డి-చక్రపాణిలే అయినా జగదేకవీరుని కథ సినిమాకి నిర్మాత-దర్శకుడిగా తన పేరే పడాలి, తనకు నెల జీతంతో పాటుగా మొత్తంగా లాభాల్లో వాటా కూడా పంచాలన్నది మొదటి షరతు. చక్రపాణి సినిమా స్క్రిప్టు దశలో కానీ, చిత్రీకరణలో కానీ ప్రమేయం కల్పించుకోకూడదన్నది రెండవ షరతు. తమ బ్యానర్లో భారీ ఆర్థిక విజయాలైన మాయాబజార్, పాతాళ భైరవి సినిమాలను తీసిన కె.వి.రెడ్డితో మరో జానపదం తీసే అవకాశం వదులుకోలేక, తప్పనిసరి పరిస్థితుల్లో అవమానకరమైనా ఆ షరతులకు నాగిరెడ్డి-చక్రపాణి అంగీకరించారు.[32][33]

జగదల ప్రతాపన్ (1944) తమిళ జానపద కథల నుంచి తీసుకుని నిర్మించగా మంచి విజయం సాధించిన తమిళ చిత్రం. జగదల ప్రతాపన్ నుంచి మూల కథాంశాన్ని మాత్రమే స్వీకరించి కె.వి.రెడ్డి, పింగళి నాగేంద్రరావు పాత్రల పరంగానూ, కథా పరంగానూ పలు మార్పులు చేసి కొత్త కథ అనిపించేలా జగదేక వీరుని కథ సినిమా స్క్రిప్టు తయారుచేసుకున్నారు. అంతకుముందు తాను దొంగరాముడు సినిమాకి పనిచేసిన పెండ్యాల నాగేశ్వరరావును సంగీత ప్రాధాన్యమున్న ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు. ఎన్.టి.రామారావు, సీయెస్సార్ ఆంజనేయులు, రాజనాల వంటి నటులు, పలువురు హీరోయిన్ పాత్రలతో పాటుగా భారీ తారాగణంతో, తనకు అలవాటైన, నిపుణులైన సాంకేతిక నిపుణులతో కలిసి, పెద్ద ఎత్తున సెట్లు, ట్రిక్ వర్కు, చిత్రీకరణకు ప్రాధాన్యత ఉన్న పాటలతో సినిమాను తీశాడు. 1961లో విడుదలైన తెలుగు వెర్షన్ 18 సెంటర్లలో నేరుగా, ఆపైన మరికొన్ని సెంటర్లు పెంచుకుని వాటిలోనూ శతదినోత్సవాలతో మంచి విజయం సాధించింది. కె.వి.రెడ్డి, పింగళి పాత సినిమాని ఏ స్థాయిలో మార్చారంటే మళ్ళీ తమిళంలోకి అనువదించి జగదల ప్రతాపన్ పేరిట విడుదల చేయగా, అదీ ఘన విజయం సాధించింది.[32]

సీతారామ కళ్యాణం దర్శకత్వం ప్రతిపాదన, తిరస్కరణ

[మార్చు]

ఈ దశలోనే రామాయణం ఆధారంగా తన స్వంత సంస్థ ఎన్.ఎ.టి.కి ఒక సినిమా చేయనున్నానని, దానికి దర్శకత్వం వహించాలని కె.వి.రెడ్డిని కోరాడు ఎన్.టి.రామారావు. ప్రత్యేకించి తన స్వంత సంస్థలో, గురుతుల్యునిగా భావించే కె.వి.రెడ్డితో పౌరాణిక సినిమా అన్నది రామారావును చాలా ఉత్సాహపరిచింది. కె.వి.రెడ్డి స్క్రిప్టు మీద పని ప్రారంభించి, ఎన్టీఆర్ శ్రీరామునిగానూ, ఎస్వీఆర్ రావణునిగానూ నటిస్తారని ప్రకటించాడు. రామారావు ఆలోచన వేరే విధంగా ఉంది. అప్పటికే భూకైలాస్ సినిమాలో రావణుని వేషం వేసివున్నాడు. కేవలం సీతాదేవి మీద మోహం అన్నదొక్కటి లేకపోయి ఉంటే మహాశివభక్తునిగా, రసజ్ఞునిగా, సంగీత విద్వాంసునిగా ఎన్నో సద్గుణాల సంపన్నుడైన రావణాసురునిలోని ఇతర కోణాలను ఆవిష్కరిస్తూ, పరస్త్రీ వ్యామోహం వల్లనే నాశనమైన సంగతి స్ఫురింపజేస్తూ తానే రావణాసుడి పాత్ర పోషించాలని ఆశించాడు. కృష్ణునిగా, రామునిగా అవతారపురుషుల పాత్రలు పోషించిన రామారావే రావణాసురుడి పాత్ర పోషించడం ప్రేక్షకులు ఆమోదించే ప్రసక్తి ఉండదనీ, అసలు అలాంటి ప్రయత్నం మంచిది కాదని అభిప్రాయపడి కె.వి.రెడ్డి ఆ ప్రతిపాదన తిరస్కరించాడు. నిర్మాత, నటుడు అయిన ఎన్.టి.రామారావు రావణుని పాత్ర పోషించేందుకు పట్టుబట్టడంతో, తానే కృష్ణుని పాత్రలో నిలబెట్టిన ఎన్.టి.రామారావును రావణుడి పాత్రలో డైరెక్ట్ చేయడం మాత్రం కుదరని పని అని తేల్చి, ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో రామారావు తొలిసారి స్వయంగా దర్శకత్వం వహించాడు.[34]

శ్రీకృష్ణార్జున యుద్ధం (1961-1963)

[మార్చు]

తన స్వంత బ్యానర్ అయిన జయంతి పిక్చర్స్ కి కె.వి.రెడ్డి శ్రీకృష్ణార్జున యుద్ధం 1961లో జగదేక వీరుని కథ తర్వాత ప్రారంభించాడు. అప్పటికే 1960లో దర్శకుడు కె.బి.తిలక్ ఇదే కథను శ్రీకృష్ణార్జున పేరుతో ఎన్.టి.రామారావు కృష్ణునిగా, జగ్గయ్య అర్జునుడిగా ప్రారంభించాడు. మధ్యలో ఆలోచన మారి జగ్గయ్యను అర్జున పాత్ర నుంచి తొలగించి, అక్కినేని నాగేశ్వరరావును సంప్రదించగా అతను తిరస్కరించాడు. ఎన్.టి.రామారావుతో పాటు పౌరాణిక సినిమాల్లో నటిస్తే తాను తేలిపోతానన్న ఉద్దేశంతో నాగేశ్వరరావు తిరస్కరించాడు. ఆపైన ఆర్థికంగానూ సమస్యలు ఎదురై ఆ సినిమా ఆగిపోయింది.[35] అదే గయోపాఖ్యానం కథను శ్రీకృష్ణార్జున యుద్ధం పేరిట కె.వి.రెడ్డి స్వంత సంస్థకు తీయడానికి సిద్ధమై అక్కినేని నాగేశ్వరరావును అడిగాడు. అయితే కృష్ణుని నాగేశ్వరరావు, అర్జున పాత్ర రామారావు ధరించేలా అడిగాడు. ఔచిత్యం ప్రకారం మహావీరుడైన అర్జునుడు మంచి దేహదారుఢ్యంతో ఉండాలి కనుక రామారావును ఆ పాత్రకు తీసుకోవడం, తనను కృష్ణుని పాత్ర వేయమనడం సరైన ఆలోచనే అని అక్కినేని అంగీకరించాడు. కానీ అప్పటికే మాయాబజార్ సినిమాతో రామారావును కృష్ణునిగా తిరుగులేని విధంగా ప్రేక్షకుల్లో నిలబెట్టిన కె.వి.రెడ్డి మళ్ళీ ఈ ప్రయోగం చేస్తే తొలి చిత్రం పెళ్ళినాటి ప్రమాణాలు దెబ్బతిన్న జయంతి సంస్థ మరో దెబ్బ తట్టుకోలేదని, కాబట్టి తనతో అర్జునుడి పాత్రే వేయించమని సూచించాడు.[36] పౌరాణిక పాత్రల్లో అసలు రామారావుతో మల్టీ స్టారర్ చేయకూడదని నిశ్చయించుకున్నా కె.వి.రెడ్డి మీదున్న గౌరవంతో ఈ పాత్ర మాత్రం ఒప్పుకున్నాడు.[35][37] సినిమా మంచి విజయాన్ని సాధించింది. కె.వి.రెడ్డి, మిత్రులు పెట్టిన జయంతి పిక్చర్స్ తన తొలి, ఏకైక విజయాన్ని శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాతో అందుకున్నది.

పరాజయాలు

[మార్చు]

సత్య హరిశ్చంద్ర (1963-1965)

[మార్చు]

తెలుగు నాటక రంగంలో ప్రాచుర్యం పొందిన గయోపాఖ్యానాన్ని శ్రీకృష్ణార్జున యుద్ధంగా తీస్తే మంచి విజయం సాధించింది. దీనితో కె.వి.రెడ్డి ప్రేక్షకాదరణ పొందిన మరో పౌరాణిక నాటకం సత్య హరిశ్చంద్ర ఆధారంగా విజయా వారికి సినిమా ప్లాన్ చేశాడు. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాసిన నాటక పద్యాలు మంచి జనాదరణ పొందాయి. కాపీహక్కుల సమస్య కారణంగా కె.వి.రెడ్డి పింగళితో వేరేగా పాటలు, పద్యాలు రాయించుకున్నాడు తప్ప నాటకంలోని పద్యాలు వాడుకోలేదు. ఎన్.టి.రామారావు హరిశ్చంద్రుడిగా, ఎస్. వరలక్ష్మి చంద్రమతిగా, ముక్కామల విశ్వామిత్రుడిగా నటించారు. 1964 ఏప్రిల్ 22న విడుదలైన ఈ సినిమా పరాజయం పాలైంది. ప్రేక్షకులు అప్పటికే హరిశ్చంద్ర నాటక పద్యాలకు అలవాటు పడి ఉండి, సినిమాలోనూ వాటిని ఆశించి నిరుత్సాహపడడం ఒక కారణం.[38][39]

ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1965-1968)

[మార్చు]

పార్వతీ దేవి శాపవశాన ఉమ, చండి, గౌరీ అన్న ముగ్గురు మానవ కన్యల రూపంలో అవతరించి, శివుడిని చేరుకున్నట్టుగా తయారుచేసిన కథతో విజయా ప్రొడక్షన్స్ బ్యానర్లో కె.వి.రెడ్డి ఉమా చండీ గౌరీ శంకరుల కథ తీశాడు.[40] 1962లో తొలిసారి ఎన్.టి.రామారావు దక్షయజ్ఞం సినిమాలో శివుని పాత్ర ధరించాడు. సినిమా విడుదలైన 15 రోజుల్లో అతని పెద్ద కొడుకు రామకృష్ణ అకాల మరణం చెందడంతో లయకారుడైన శివుడి పాత్ర వేయడం వల్లే ఈ అనర్థం జరిగిందన్న సెంటిమెంటు ఏర్పరుచుకున్నాడు. ఇక శివుడి పాత్ర ధరించకూడదన్న నిర్ణయానికి వచ్చేశాడు. కాకుంటే తనకు గురుతుల్యుడైన కె.వి.రెడ్డి అడిగితే కాదనలేక శివుడిగా రెండోసారి ఈ సినిమాలో నటించాడు.[41] ఈ సినిమా కూడా ఫ్లాప్ అయి, నష్టాలు మూటకట్టుకుంది.[42]

విజయా సంస్థ నుంచి తొలగింపు, భాగ్యచక్రం నిర్మాణం (1968)

[మార్చు]

విజయా సంస్థలో వరుసగా రెండు సినిమాలు కె.వి.రెడ్డి ఫ్లాప్ ఇవ్వగా, ఇక నష్టాలు తప్పవని తెలియగానే నాగిరెడ్డి-చక్రపాణి కె.వి.రెడ్డికి చెందిన సాంకేతిక నిపుణులు అందరికీ సెటిల్ చేసి ఉద్యోగంలోంచి తీసేశారు. సంవత్సరాలుగా నెల జీతం మీద పనిచేస్తున్న రచయిత పింగళి నాగేంద్రరావు, కళా దర్శకులు గోఖలే, కళాధర్, అసిస్టెంట్ డైరెక్టర్లు, నిర్మాణ శాఖ ఉద్యోగులు, ఇలా అందరినీ తొలగించారు. ఇది పరిశ్రమలో సంచలనం కలిగిచింది. గతంలో విజయా ప్రొడక్షన్స్ సినిమాలకు కూడా తన పేరే నిర్మాతగా పెట్టాలనీ, చక్రపాణి కథల్లో కల్పించుకోకూడదని మొదలైన షరతులు పెట్టినందుకు, కేవలం హిట్ల కోసమే కె.వి.రెడ్డితో పనిచేసి ఇప్పుడు అతని పని పూర్తికాగానే తప్పిస్తున్నారన్న వ్యాఖ్యానాలు వచ్చాయి.[43]

స్వంత సంస్థ అయిన జయంతి పిక్చర్స్ కి భాగ్య చక్రం అన్న జానపద చిత్రాన్ని ఎన్.టి.రామారావు హీరోగా తీయడం ప్రారంభించాడు కె.వి.రెడ్డి. ఈ సినిమా నిర్మాణంలో ఉండగా ఇతర భాగస్వాములతో వివాదాలు వచ్చాయి. చివరికి ఎలానో పూర్తైన ఈ సినిమాకి దర్శకుడు, నిర్మాత తానే అయినా కె.వి.రెడ్డి ప్రమేయం తక్కువే.[44] 1968 సెప్టెంబరులో విడుదలైన భాగ్య చక్రం కూడా పరాజయం పాలైంది.

విజయంతో ముగింపు, మరణం

[మార్చు]

1968లో భాగ్య చక్రం విడుదలయ్యాకా ఇక కె.వి.రెడ్డికి రెండేళ్ళ పాటు ఏ అవకాశం రాలేదు. దీనికి తోడు తన రచయితను, సాంకేతిక నిపుణులను విజయా ప్రొడక్షన్స్ లో ఉద్యోగం నుంచి తొలగించడం, తనకు ఇచ్చిన కారును వెనక్కి తెప్పించుకోవడం వంటివాటిని అవమానంగా భావించి మరింత కుంగిపోయాడు.[43] మరో సినిమా చేసి హిట్ కొట్టే వీలు లేకుండా ఇలా చివరి సినిమాల్లో ఫ్లాపులు ఇచ్చిన దర్శకుడిగానే మిగిలిపోతానేమోనని మథనం చెందేవాడు. ఎవరినీ అవకాశం అడగలేని, అడిగినా ఇవ్వని స్థితిలో మిగిలిపోయాడు. హెచ్.వి.సంజీవరెడ్డి, ఎం.లక్ష్మీకాంతరెడ్డి అన్న వ్యాపారులు నిర్మాతలుగా మారి కె.వి.రెడ్డి అసిస్టెంట్ అయిన సింగీతం శ్రీనివాసరావుకు దర్శకత్వం అవకాశం ఇచ్చి, దర్శకత్వ పర్యవేక్షణ కె.వి.రెడ్డితో చేయిద్దామని ముందుకువచ్చారు. ఎలాగైనా సినిమా తీసి విజయం సాధించి కెరీర్ ముగించాలన్న ఆతృతలో "ఈ సినిమా నేనే దర్శకత్వం చేస్తాను. రెండో సినిమా సింగీతానికి ఇద్దురు గాని" అనే స్థితికి వెళ్ళిపోయాడు. కె.వి.రెడ్డికి మార్కెట్ లేదన్న దృష్టితో వాళ్ళు చెప్తాం లెండి అని వెళ్ళిపోయారు.[45]

ఈ స్థితిలో కె.వి.రెడ్డి పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న ఎన్.టి.రామారావు అతని ఇంటికి వచ్చి "రెడ్డి గారూ, మీ రచయిత పింగళి నాగేంద్రరావు గారితో రాయించుకున్న స్క్రిప్టులు రెండు నా దగ్గరున్నాయి. చాణక్య చంద్రగుప్త, శ్రీకృష్ణసత్య - నా స్వంతానికి ఈ రెండిటిలో ఏదోక సినిమా తీసిపెట్టండి. మీరేది తీసినా ఓకే" అని ఆఫర్ చేశాడు. శ్రీకృష్ణసత్య తీస్తానన్నాడు కె.వి.రెడ్డి.[43] శ్రీకృష్ణసత్య సినిమా కథ త్రేతా, ద్వాపర యుగాల మధ్య సాగుతుంది. శ్రీకృష్ణుడికి సత్యభామకీ మధ్య ఉన్న అనురాగం, పలు జన్మల పాటు సాగిన వారి బంధం ఈ చిత్రానికి ప్రధాన కథాంశం. పలు ఉపకథలతో సాగిన ఈ సినిమాలో చాలా భాగం తీశాకా కె.వి.రెడ్డి అనారోగ్యంతో ఇబ్బందిపడుతూ ఉంటే రామారావు అతన్ని కూర్చోబెట్టి సూచనలు తీసుకుంటూ పూర్తిచేశాడు. 1971 డిసెంబరు 24న విడుదలైన శ్రీకృష్ణసత్య మంచి విజయాన్ని సాధించింది.[46] ఈ సినిమా దర్శకత్వం, దాని ఫలితం కె.వి.రెడ్డికి చాలా సంతృప్తిని కలిగించాయి. సన్నిహితులతో "రామారావు నాకు కొండంత బలమూ, ధైర్యమూ ఇచ్చాడు. ఒక మంచి చిత్రం తీసి తృప్తిగా రిటైరై హాయిగా తాడిపత్రి వెళ్ళిపోతాను" అనేవాడు. కానీ అప్పటికే అనారోగ్యంతో బాధపడుతూండడంతో మరో సినిమా తీయడం సాధ్యపడలేదు. ఆరోగ్యం క్షీణించి 1972 సెప్టెంబరు 15న కె.వి.రెడ్డి మరణించాడు.[43] కె.వి.రెడ్డి చనిపోయిన కొద్ది నెలలకే అతని భార్య కూడా మరణించింది.

సినిమాల రూపకల్పన

[మార్చు]

పద్ధతులు, విధానాలు

[మార్చు]

సినిమా దర్శకుడిగా కె.వి.రెడ్డి తనకంటూ ప్రత్యేకించిన కొన్ని పద్ధతులను తయారుచేసుకుని, ఆ ప్రకారం పనిచేశాడు. సినిమా ఎలా తయారవ్వాలన్న విషయాన్ని చాలా విపులంగా ఆలోచించుకునేవాడు, అది 100 శాతం ఉంటే 99 శాతానికో, 98 శాతానికో సంతృప్తి పడకుండా ఖచ్చితంగా వంద శాతం వచ్చేలా చేసేవాడు. అలా రావడానికి వివిధ పద్ధతులు, విధానాలు రూపొందించుకుని పనిచేసేవాడు.[47] అతను సినిమా ప్రారంభించక ముందు స్క్రిప్టు మీద, పాత్రధారుల ఎంపిక, రూపకల్పన వంటి విషయాల మీద చాలా గట్టి కసరత్తు చేసేవాడు. తాను, తన రచయితల (సాధారణంగా పింగళి నాగేంద్రరావు కానీ, డి.వి.నరసరాజు కానీ), తన సహ దర్శకుడు (చాలా చిత్రాలకు కమలాకర కామేశ్వరరావు) ప్రధానమైన కథా చర్చల బృందం. వీరందరూ అథమపక్షం ఆరునెలలు కూర్చుని తాము అనుకున్న మూల కథాంశాన్ని పూర్తిస్థాయి కథగా అభివృద్ధి చేశాక, స్క్రీన్ ప్లే రాసుకునేవారు. సూక్ష్మమైన విషయాలను సైతం సినిమా స్క్రీన్ ప్లేలో రాసేవాడు. జగదేకవీరుని కథ స్క్రిప్టులో సెట్ ప్రాపర్టీల వివరాలు నిర్దేశిస్తూ తేలు కావాలని రాసి, అది బతికున్న తేలు అయివుండాలని చేర్చిన వివరణ కూడా కె.వి.రెడ్డి సూక్ష్మతరమైన పరిశీలన, నిర్దేశాలకు మచ్చుతునక.

సహకరించని మేధావి కన్నా, సహకరించి పనిచేసే సాధారణమైన వ్యక్తితో పనిచేయడం మేలు అన్నది సాంకేతిక నిపుణులను ఎన్నుకోవడంలో అతని పద్ధతి.[48] బి.ఎన్.రెడ్డి తనకు మల్లీశ్వరి సినిమాకి పనిచేసిన కవి, రచయిత కృష్ణశాస్త్రిని, సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావును పెద్దమనుషులు సినిమాకి పెట్టుకొమ్మని సలహా ఇస్తే "నాకీ మహాకవులు, జీనియస్సులు వద్దు బ్రదర్" అని సున్నితంగా తిరస్కరించాడు.[49] ఒక సమయంలో ఒకే సినిమా మీద పనిచేసేవాడు. మిగిలిన వాళ్ళు రెండు సినిమాల మీద ఒకేసారి పనిచేస్తున్నారు కదాని చెప్తే "ఐ డోన్ట్ హావ్ టూ బ్రెయిన్స్" అన్నది అతని సమాధానం. అలాగే తనకు పనిచేసే కథా రచయిత కూడా తన సినిమా పూర్తయ్యేదాకా వేరే సినిమాలకు రాయకూడదన్నది కె.వి.రెడ్డి నియమం. ఆ పద్ధతిలోనే మొదట పనిచేసిన సీనియర్ సముద్రాల, తర్వాత పింగళి, డి.వి.నరసరాజు అదే పద్ధతిలో పనిచేశారు.[50]

ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయాకా ఇక దానిలోని అక్షరాన్ని కూడా షూటింగ్ దశలో మార్చేవాడు కాదు. కె.వి. మాయాబజార్ తమిళ వెర్షన్ కోసం తమిళ హాస్యనటుడు తంగవేలును తీసుకున్నాడు. అప్పటికి ఎన్నో తమిళ సినిమాల్లో స్క్రిప్టులో లేని హాస్య సన్నివేశాలను సెట్లో అప్పటికప్పుడు డైలాగులు కల్పించి పనిచేసే పద్ధతి ప్రకారం పనిచేస్తున్న తంగవేలును అలా జోకులు, డైలాగులు సెట్లోనే కల్పించి చెప్పడానికి అవకాశం ఇమ్మని కోరాడు. కె.వి.రెడ్డి ఆ మాట నేరుగా కొట్టిపారేయకుండా "మీలాంటి సీనియర్ కమెడియన్ సినిమా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తూంటే కాదనే మూర్ఖుడిని కాదు" అంటూనే మాయాబజార్ తమిళ వెర్షన్ బౌండ్ స్క్రిప్ట్ చేతికి ఇచ్చి, పదిహేను రోజులు మీ దగ్గర ఉంచుకుని ఆ జోకులు, డైలాగులు ఏవో ఈ దశలోనే చెప్పండి చర్చించి బావుంటే చేర్చుకుందాం అని తేల్చాడు. చదివిన తంగవేలు స్క్రిప్ట్ ఇస్తూ ఇంత పర్ఫెక్ట్ స్క్రిప్టులో మార్పుచేర్పులు ఏమీ చెప్పలేం అని, అందులో ఉన్నది అక్షరం మార్చకుండా అనుసరించి చేస్తానని చెప్పాడు. ఇలా ఏ స్థాయి వ్యక్తి అయినా స్క్రిప్ట్ దశలో సలహాలు ఇస్తే పరిశీలించేవాడు, తాను మొత్తం సినిమాని దృష్టిలో ఉంచుకుని తుది నిర్ణయం తాను తీసుకునేవాడు. కానీ చిత్రీకరణ దశకు వెళ్ళాక మాత్రం స్క్రిప్ట్ మార్పులకు చాలా వ్యతిరేకి. "ఫాన్ కింద కూర్చుని పదిమంది ప్రశాంతంగా ఆలోచించి స్క్రిప్ట్ దశలో తీసుకునే నిర్ణయాల కన్నా లైట్లు, చెమట, టెన్షన్ మధ్యలో సెట్స్ మీద తీసుకునే నిర్ణయాలు సరైనవి ఎలా అవుతాయని" అడిగేవాడు.

కె.వి. బడ్జెట్ విషయంలోనూ చాలా కచ్చితమైన అంచనా వేసేవాడు. వేసిన బడ్జెట్ మించి ఒక్క రూపాయి ఎక్కువ పడినా తానే పెట్టుకుంటానని చెప్పగలిగిన సామర్థ్యం అతనికి ఉండేది. కొందరు దర్శకులు లక్ష అడుగుల ఫిల్మ్ ఎక్స్ పోజ్ చేసి చివరికి ఎడిటింగ్ లో 18-19 వేల అడుగులకు ఎడిట్ చేయించుకునే రోజుల్లోనే 18 వేల అడుగుల ఫిల్మ్ తీయాలంటే కేవలం 300 అడుగులు మాత్రమే అటూ ఇటూ అయ్యేలా ఖచ్చితత్వంతో తీసేవాడు. దొంగరాముడు సినిమాను 17 వేల అడుగుల నెగెటివ్ ఎక్స్ పోజ్ చేసి తీయాలని ప్రణాళిక వేసి, ఓ 250 అడుగులు మించి తీశాడు. అది కూడా ముందు హీరో విలన్ల మధ్య ముష్టి యుద్ధం ప్లాన్ చేసి, తర్వాత రెజ్లింగ్ గా మార్చడం వల్లనే పెరిగింది.[1]

స్క్రిప్ట్ దశలో అసిస్టెంట్లు డైలాగ్ చెప్తుంటేనూ, తర్వాతి దశలో నటులు రిహార్సల్స్ చేస్తూండగానూ స్టాప్ క్లాక్ వాడి ఏ డైలాగ్ ఎంత సమయం పడుతుందో, అలా ఏ సీన్ ఎంత సమయం అవుతుందో లెక్కించుకుని అంచనా కట్టడం కె.వి.రెడ్డి పద్ధతుల్లో ఒకటి. ఆ లెక్క ఎంత సూక్ష్మంగా గణించేవాడంటే అసిస్టెంట్ ఒక డైలాగ్ చదివి నిమిషం అని లెక్క వేస్తే "ఆ పాత్ర గోవిందరాజు సుబ్బారావు వేస్తున్నాడు. ఆయన డైలాగ్ చెప్పే పద్ధతిలో మరో అర నిమిషం ఎక్కువ పడుతుంది. ఆ చొప్పున పెంచి రాసుకుని లెక్కవేయండి" అన్నాడు కె.వి.[1]

సినిమా చిత్రీకరణ ముందు దశలోనే సినిమాని బట్టి కళా దర్శకులు గోఖలే-కళాధర్ లతో కూర్చుని కిరీటాలు, కంకణాలు సహా ప్రధాన పాత్రల రూపకల్పన, చిన్న చిన్న డీటైల్స్ తో సహా సెట్స్ వివరాలు తయారు చేయించుకునేవాడు. చిత్రీకరణకు ముందు విధిగా రిహార్సల్స్ ఉండేవి. ఆ రిహార్సల్స్ కేవలం నటుల విషయంలోనే కాకుండా ఒక్కోసారి లైటింగ్, కెమెరా కదలికలు వంటి సాంకేతికాంశాలు సరిజూసుకునేందుకు డమ్మీగా అసిస్టెంట్లను పెట్టి కూడా చేసేవాడు. ఎలా చేయాలో నటులకు నటించి చూపే పద్ధతి కె.వి. వద్ద ఉండేది కాదు. స్క్రిప్టులో ఉన్న వివరాలు, నేపథ్యాన్ని అనుసరించి నటులే రెండు మూడు రకాలుగా చేసి చూపితే, అందులో ఏది సందర్భానికి బావుంటుందో కె.వి. చెప్పడం, ఎక్కువ తక్కువలు ఉంటే అతను సూచించి రిహార్సల్స్ పూర్తిచేసి, ఆ విధంగా కెమెరా ముందు నటింపజేయడం జరిగేది. ఎవరినీ అతిగా మెచ్చుకునే పద్ధతి ఉండేది కాదు. షాట్ ఓకే అయితే ఓకే అనేవాడు కాదు "పాస్" అనేవాడు. నటులు అత్యద్భుతంగా చేసిన అరుదైన సందర్భాల్లో మాత్రం సింపుల్ గా "గుడ్" అనేవాడు. అయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను చిన్న చిన్న అంశాలను బట్టి కూడా అంచనా వేయగలిగేవాడు.[51]

సెట్స్ మీద ఉన్నప్పుడు నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండాలన్నది అతని లెక్క. షాట్ గాప్ లో ఒకసారి నిర్మాతలు నాగిరెడ్డి-చక్రపాణి ఏవో కబుర్లు చెప్పుకుంటూంటే పెద్దగా "ఈజ్ దిస్ ఏ ఫిష్ మార్కెట్, బ్రదర్" అని అరిచాడు. తన పని డిస్టర్బ్ అయితే నిర్మాతలనే గద్దించే పద్దతి అతనిది. అలానే మరోసారి చిత్రీకరణ సమయంలో స్టూడియోలో ఏదో కార్ వేగంగా శబ్దం చేసుకుంటూ వెళ్లిందని కె.వి. డిస్టర్బ్ అయితే మరుసటి రోజుకు నాగిరెడ్డి స్టూడియో అంతటా ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయించడం మొదలుపెట్టాడు. తాను సినిమా తీసేప్పుడు రషెస్ అనే పేరుతో ఎవరికీ చూపించడం కె.వి.కి ఇష్టం ఉండేది కాదు. సినిమా మొత్తం తెలీక, తాను ఏ సీన్ ఎందుకు తీస్తున్నాడన్నది అర్థం కాక ఎవరెవరో ఏవేవో కామెంట్లు చేస్తారని రషెస్ చూపడం నచ్చేది కాదు. కానీ, సినిమా పరిశ్రమలో, స్టూడియోలో, నిర్మాణ సంస్థలో పలువురు ఒత్తిడి చేస్తూండడంతో నాకెందుకు ఈ చెడ్డ పేరు అంటూ మాయాబజార్ సినిమా నాటికి రషెస్ చూపించడానికి అనుమతించడం మొదలుపెట్టాడు.[28] సినిమా ప్రివ్యూ వేయడం కూడా అతనికి నచ్చేదికాదు. సినిమా బావుందా లేదా అన్నది నిర్ణయించాల్సింది టిక్కెట్టు పెట్టుకుని చూసే ప్రేక్షకులే కానీ ఫ్రీ పాస్ లు పుచ్చుకుని వచ్చి జడ్జిమెంట్లు ఇచ్చే పెద్దమనుషులు కాదని కె.వి. నమ్మకం.[15]

శైలి, థీమ్స్

[మార్చు]

క్లీన్ ఫ్రేమ్ పెట్టుకుని, కథలో ఉన్న డ్రామాకి న్యాయం చేస్తూ సూటిగా, హాయిగా కథ చెప్పడమే కె.వి.రెడ్డి టెక్నిక్. చిత్ర విచిత్రమైన షాట్స్, విభిన్నమైన కోణాలు, కొత్త కెమెరా టెక్నిక్ లతో తమాషాలు చేయడం కె.వి.కి నచ్చేది కాదు. ఇందుకే కె.వి.రెడ్డి గురించి విమర్శకుడు ముళ్ళపూడి వెంకటరమణ "సినిమాటిక్ ఇంద్రజాలానికి ఒడికట్టడు" అన్నాడు. స్క్రీన్ ప్లేలో కథకు అవసరమైన సంగతులు విడిచిపెట్టకపోవడం, అనవసరమైనవి చేరనీయకుండా జాగ్రత్తపడడం కె.వి.రెడ్డి సినిమా శిల్పం. కె.వి.రెడ్డి సినిమాలో జానపద శైలి ప్రధానమైన థీమ్. అతని కథలు "సగం సత్యం, సగం స్వప్నం" అన్నట్టుగా, పాత్రలు అనగనగా మార్కు మనుషుల్లా ఉంటాయి. కె.వి.రెడ్డి తీసిన జానపద చిత్రాలతో పాటుగా, "దొంగరాముడు వంటి సాంఘికాలకు, మాయాబజార్ వంటి పౌరాణికాలకు" ఇదే స్థాపత్య సూత్రం అంటూ అతని థీమ్స్ సాగే పద్ధతిని విమర్శకులు విశ్లేషించారు. తన ఈ తరహా విడిచిపెట్టి సాంఘిక పోకడలతో తీసిన "పెళ్ళినాటి ప్రమాణాలు" ప్రజాదరణ సాధించలేదు. "ఒక తరహా వంటపట్టిపోయిన వ్యక్తి మరో దాన్ని అవలంబిస్తే, ఒక్కోసారి రాణించదన్న దానికి నిదర్శనం" అని ఆ సినిమాపై విమర్శలు వచ్చాయి. ఇదంతా కె.వి.రెడ్డి ఇతర సాంఘికాల్లోనూ జానపద ఫక్కీ ఉండేదన్నదానికి ఉదాహరణ.[52]

అలవాట్లు, అభిరుచులు

[మార్చు]

కె.వి.రెడ్డి చూడడానికి ఒక సినిమా డైరెక్టరులా కాక సామాన్య రైతులా కనిపించేవాడు. మొదటి సారి చూసినవారు "సినిమా డైరెక్టరులా లేడే" అనుకునేలా ఉండేవాడు. చూడడానికి మోటు మనిషిలా కనిపించేవాడు. మనిషి మంచి పొడవు ఉండేవాడు. చాలా గంభీరమైన, పెద్ద కంఠం.[47] మోచేతుల వరకూ హాండ్స్ ఉన్న తెల్ల చొక్కా, ముతక ఖద్దరు పంచె, ఒక కండువా అతని ఆహార్యం. ఎప్పుడూ చొక్కా జేబు పర్సు, ఏవేవో కాగితాలు, పెన్నుతో ఎత్తుగా ఉండేది.[53] ఎవరైనా ఫుల్ హాండ్స్ చొక్కా కుట్టించుకోవచ్చు కదా అని సూచిస్తే "ఎందుకూ గుడ్డ వేస్ట్" అనేవాడు. అనవసరమైన ఖర్చు చేయకపోవడం, అవసరమైనంత మేరా ఖర్చు చేయడం అలా అతనికి జీవితంలోనూ అలవాటే.

కె.వి.రెడ్డి ఎవరితో మాట్లాడినా బ్రదర్ అనే సంబోధించేవాడు. వందేమాతరం సినిమాకి కె.వి.రెడ్డి ప్రొడక్షన్ మేనేజరుగా, కమలాకర కామేశ్వరరావు అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేసే రోజుల్లో ఒకరినొకరు ఆప్యాయంగా బ్రదర్ అని పిలుచుకునేవారు. ఈ అలవాటే క్రమేపీ కె.వి.కి జీవితకాలం ప్రతివారితోనూ కొనసాగింది. ఇది వాహినీ సంస్థలో బి.ఎన్.రెడ్డి, విజయా సంస్థలో నాగిరెడ్డి-చక్రపాణిలకు పాకి, అలా ఆ సంస్థల్లో పనిచేసి ఎన్.టి.రామారావు కూడా జీవితకాలం అలవాటైన పిలుపుగా మారింది.[54] ఏదీ మనసులో పెట్టుకోకుండా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం, ఎదుటివారి మెప్పుకోసం చూడకుండా బాగోలేనిది బాగోలేదనే స్పష్టంగా చెప్పడం కె.వి.రెడ్డి మాటతీరు.[55] కె.వి. మాట్లాడేప్పుడు ఎక్కువగా ఆంగ్లంలోనే సంభాషించేవాడు.[53] ఆంగ్ల సినిమాలు, పుస్తకాలు విరివిగా చదివేవాడు, వాటి నుంచి చాలాసార్లు తన సినిమాలో మూల కథకు స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి చేసుకునేవాడు. కె.వి.రెడ్డికి తెలుగు సాహిత్యంలో మంచి ప్రవేశం ఉంది. అతను చదువుకునే రోజుల్లోనే తెలుగు సబ్జెక్టు మీద బాగా మక్కువ ఉండేది, ఇంటర్మీడియట్లో తెలుగు సబ్జెక్టులో ప్రెసిడెన్సీ కాలేజి మొత్తానికి ప్రథమ స్థానం సాధించాడు. కావ్యాలు, ఇతిహాసాలు అధ్యయనం చేశాడు.[56] తాను ఎన్ని సినిమాలు తీసి, ఎన్ని అవార్డులు సాధించినా మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఇంటర్మీడియట్లో తెలుగులో కాలేజీ ఫస్టు వచ్చిన సంగతే చివరిదాకా అందరికీ గర్వంగా చెప్పుకునేవాడు.[51]

కె.వి.రెడ్డి మంచి భోజన ప్రియుడు. ఫ్రెంచి కట్ మీసకట్టు అతనికి చాలా ఇష్టం. దాన్ని మెయింటైన్ చేయడానికి నిత్యం షేవింగ్ చేసుకుని, తన మీసకట్టు తీర్చిదిద్దుకునేవాడు. అతనికి రక్తపోటు, మధుమేహం ఉండేవి.[1] సినిమా రూపకల్పనలో వచ్చే అడ్డంకులు, సమస్యలు అతని రక్తపోటును పెంచేస్తూ ఉండేవి. సినిమాలు ఆగిపోవడం, ఎవరెవరో వాటి రిలీజుకు ముందే తోచిన కామెంట్లు చేయడం వంటివి అతనికి టెన్షన్ కలిగించి, ఆరోగ్యాన్ని దెబ్బతీసేది.[57] జనానికి ఎలాంటి తరహా సినిమాలు నచ్చుతాయన్నదానిపై తనకు కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉండేవి. ఆ దినుసులు లేని సినిమాలు పోతాయని నమ్మేవాడు. మిగిలిన సినిమాల సంగతి ఎలా ఉన్నా అతను తప్పనిసరిగా ఫ్లాప్ అవుతుందనీ, డైలాగులు ఏదో బావున్నంత మాత్రాన కథ ఏమీ బాగోలేదని అనుకున్న గుండమ్మ కథ సినిమా మట్టుకు హిట్ అయింది. అదెలా హిట్టయిందబ్బా అని సంవత్సరాల పాటు, ఎప్పుడు గుర్తుకువచ్చినా ఆశ్చర్యపోతూనే ఉండేవాడు కె.వి.రెడ్డి. "ఐ స్టిల్ డోన్ట్ అండర్ స్టాండ్ హౌ పీపుల్ లైక్డ్ దట్ పిక్చర్" (ఆ సినిమాని జనం ఎలా ఇష్టపడ్డారన్నది నేనిప్పటికీ అర్థంచేసుకోలేకపోతున్నాను) అన్నది ఆ సినిమా మీద అతని చివరి మాట.[58] తన సినిమాలు తాను మళ్ళీ మళ్ళీ చూసే అలవాటు కె.వి.రెడ్డికి బాగా ఉండేది. కె.వి.రెడ్డి కుమారుడు రామచంద్రారెడ్డి చెప్పినదాని ప్రకారం నెలనెలా మాయాబజార్ సినిమా వేసి ఇంట్లో అంతా చూసేవారు.[1]

ప్రభావం

[మార్చు]

మేము కె.వి చెప్పిన, చూపించిన దారిలోనే వెళ్లాలని ప్రయత్నించాము. తొలిరోజుల్లో సాధ్యమయింది. కానీ, రానురాను సాధ్యపడలేదు -దుక్కిపాటి మధుసూదనరావు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత.

కె.వి.రెడ్డి సినిమాలు, వాటిలో పాత్రలు, సంభాషణలు వంటివాటి ప్రభావం ప్రేక్షకుల మీద, అతను సినిమాలు నిర్మించే పద్ధతుల ప్రభావం సినిమా పరిశ్రమలో ఇతర నిర్మాతలు, దర్శకుల మీద ఉంది. అక్కినేని నాగేశ్వరరావు, దుక్కిపాటి మధుసూదనరావు అన్నపూర్ణ పిక్చర్స్ స్థాపించి తొలి సినిమా తీయడానికి కె.వి.రెడ్డి కోసం రెండు సంవత్సరాల పాటు వేచి చూశారంటే, మంచి విజయవంతమైన ప్రారంభం అందిస్తాడన్న నమ్మకం కన్నా అతను సినిమాలు తీసే పద్ధతి, ప్రణాళికాయుతమైన నిర్మాణశైలి నేర్చుకోదగ్గవన్నదే ముఖ్య కారణం. కె.వి.రెడ్డి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నామని, తర్వాత తర్వాత తమ సంస్థ [అన్నపూర్ణా పిక్చర్స్] అలాంటి విధానాలతోనే కొనసాగిందని అని మధుసూదనరావు చెప్పేవాడు.[22] తాను నిర్మాతగా అన్నపూర్ణ పిక్చర్స్ లో ఆఖరి చిత్రంగా శ్రీరంగనీతులు సినిమా 20 ఏళ్ళ తర్వత తీసినప్పుడు కూడా అక్కినేని నాగేశ్వరరావు దొంగరాముడు నాటి తరహాలో రిహార్సల్స్ చేసి, స్క్రిప్టులో ఉన్నది ఉన్నట్టు తీయాలని కె.వి.రెడ్డికి పనిచేసిన డి.వి.నరసరాజును రచయితగా తీసుకుని అలా చేయించుకున్నాడు.[59]

ఎన్.టి.రామారావు తొలి దశ నుంచీ కె.వి.రెడ్డి సినిమాల్లో పనిచేశాడు. రామారావు స్వంతంగా సినిమా దర్శకత్వం ప్రారంభించిన సీతారామ కళ్యాణం నుంచీ తాను కె.వి.రెడ్డి సినిమాల నిర్మాణ సమయంలో పరిశీలించి, నేర్చుకున్న అంశాలనే ఆచరణలో పెట్టాడు.[60] పక్కా బౌండ్ స్క్రిప్టుతోనే షూటింగ్ కి దిగడం, షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడిగా రామారావు చాలా ఏకాగ్రతతో, నిశ్శబ్ద వాతావరణం కల్పించుకుని పనిచేయడం వంటివన్నీ కె.వి.రెడ్డి నుంచే నేర్చుకున్నాడు.[5] కె.వి.రెడ్డి తన గురువు అని రామారావు ఎప్పుడూ ప్రస్తావించేవాడు.[34] ఆ గౌరవాభిమానాలతోనే కె.వి. ఫ్లాపుల్లో ఉన్నప్పుడు శ్రీకృష్ణ సత్య తీయించాడు.

1941 వరకూ బి.ఎన్.రెడ్డి వాహినీ సంస్థకు ఎన్ని సినిమాలు తీసినా యావరేజిలుగా నిలుస్తున్న దశలో కె.వి.రెడ్డి తీసిన భక్త పోతన ఆర్థికంగా ఘన విజయం సాధించింది. వాహినీ పిక్చర్స్ అధినేత మూలా నారాయణస్వామి ఈ విజయంతో ప్రభావితుడై సినిమా వ్యాపారంలో ఇంతటి డబ్బుంటుందా అనుకోవడం వల్ల వాహినీ సంస్థ స్థిరత్వానికి పునాదులు వేశాడు. 1949లో కొత్తగా పెట్టిన విజయా సంస్థ కూడా షావుకారు పరాజయంతో సమస్యల్లో ఉండగా కె.వి.రెడ్డి అందించిన పాతాళ భైరవి, మాయాబజార్ వంటి విజయాలు నిలబెట్టాయి. అలా వాహినీ, విజయా సంస్థలు నిలబడడంలో కె.వి.రెడ్డి పాత్ర ఉంది. ఎన్టీ రామారావు సహా చాలామంది అతను కృష్ణపాత్రలో నప్పడని, అప్పటికే ప్రేక్షకులు తిరస్కరించారని భావిస్తే కె.వి.రెడ్డి మాత్రం జాగ్రత్తగా రూపకల్పన చేసి మాయాబజార్ ద్వారా ఎన్టీఆర్ ను కృష్ణుడిగా నిలబెట్టాడు. ఆపైన రామారావు అటు పౌరాణిక సినిమాల్లోనూ, ఇటు ప్రత్యేకించి కృష్ణ పాత్రలోనూ చాలా పేరు పొందాడు. పాతాళభైరవి ద్వారా విలన్ గా, మాయాబజర్ ద్వారా క్యారెక్టర్ నటునిగా ఎస్వీ రంగారావు కెరీర్ మలుపుతిప్పాడు. అలానే ఎందరో నటులకు, సాంకేతిక నిపుణులకు కె.వి.రెడ్డి బ్రేక్ ఇచ్చాడు. పింగళి నాగేంద్రరావు, కొసరాజు రాఘవయ్య చౌదరి వంటివారికి కె.వి.రెడ్డి సినిమాల ద్వారానే బ్రేక్ రాగా డి.వి.నరసరాజును తానే పరిచయం చేశాడు. పలు సినిమాలకు దర్శకత్వం వహించిన కమలాకర కామేశ్వరరావు, సింగీతం శ్రీనివాసరావు అతని అసిస్టెంట్లే.[47]

పనిచేసిన సినిమాలు

[మార్చు]

నోట్స్

[మార్చు]
  1. కె.వి.రెడ్డికి ఆ సెవెన్ ఇయర్స్ ఇచ్ సినిమా సబ్జెక్టు మీద బాగా ఇష్టం ఉండడంతో తర్వాతికాలంలో పెళ్ళినాటి ప్రమాణాలుగా తీశాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 పులగం, చిన్నారాయణ. "జగదేక దర్శకుడు". సాక్షి ఫన్ డే. జగతి పబ్లికేషన్స్. Retrieved 16 February 2019.
  2. పులగం చిన్నారాయణ 2019, p. 36.
  3. 3.0 3.1 పులగం చిన్నారాయణ 2019, p. 37.
  4. 4.0 4.1 ఎం.ఎల్., నరసింహం (29 September 2012). "గుణసుందరి కథ (1949)". ద హిందూ (in Indian English).
  5. 5.0 5.1 యు., వినాయకరావు (11 November 2011). "దర్శకులకు మార్గదర్శకుడు కె.వి.రెడ్డి". నవ్య. బ్లాక్ & వైట్. Retrieved 17 February 2019.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 పులగం చిన్నారాయణ 2019, p. 38.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 డి. వి. నరసరాజు 2004, p. 9.
  8. 8.0 8.1 8.2 డి. వి. నరసరాజు 2004, p. 10.
  9. Bhaktha Potana (1943), M. L. Narasimham, Blast from the past, The Hindu, 11 December 2011.
  10. పులగం చిన్నారాయణ 2009, p. 63.
  11. నరసింహం, ఎం.ఎల్. (23 June 2012). "Blast from the past: Yogi Vemana (1947)". ద హిందూ (in Indian English).
  12. 12.0 12.1 12.2 12.3 డి. వి. నరసరాజు 2004, p. 13.
  13. 13.0 13.1 13.2 ఎం.ఎల్., నరసింహం (13 April 2013). "పాతాళభైరవి (1951)". ద హిందూ (in Indian English). Retrieved 3 February 2019.
  14. 14.0 14.1 డి. వి. నరసరాజు 2004, p. 17.
  15. 15.0 15.1 డి. వి. నరసరాజు 2004, p. 18.
  16. 16.0 16.1 డి. వి. నరసరాజు 2004, p. 19.
  17. 17.0 17.1 17.2 17.3 పులగం, చిన్నారాయణ (10 March 2014). "చిన్న బుద్ధుల 'పెద్ద మనుషుల' పై సినిమా చురకత్త". సాక్షి. Retrieved 3 February 2019.
  18. డి. వి. నరసరాజు 2004, p. 21.
  19. డి. వి. నరసరాజు 2004, p. 23.
  20. 20.0 20.1 20.2 డి. వి. నరసరాజు 2004, p. 24.
  21. "2nd National Film Awards". International Film Festival of India. Archived from the original on 14 మార్చి 2016. Retrieved 23 ఆగస్టు 2011.
  22. 22.0 22.1 22.2 రావి, కొండలరావు. "'ప్రమాణాలు' వద్దనుకుంటే... 'దొంగరాముడు' వచ్చాడు". సితార. Archived from the original on 2 సెప్టెంబరు 2018. Retrieved 4 February 2019.
  23. 23.0 23.1 "దొంగరాముడుకు 60 ఏళ్ళు". ప్రజాశక్తి. 1 అక్టోబరు 2017. Archived from the original on 2015-10-04. Retrieved 2019-02-04.
  24. "నేటితో అరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న 'దొంగరాముడు'". ఆంధ్రజ్యోతి. 1 October 2015.[permanent dead link]
  25. డి. వి. నరసరాజు 2004, p. 25.
  26. డి. వి. నరసరాజు 2004, p. 27.
  27. డి. వి. నరసరాజు 2004, p. 28.
  28. 28.0 28.1 డి. వి. నరసరాజు 2004, p. 29.
  29. 29.0 29.1 ఎం.ఎల్., నరసింహం (30 April 2015). "మాయాబజార్ (1957)". ది హిందూ (in Indian English). Retrieved 14 February 2019.
  30. "Mayabazar is India's greatest film ever - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 14 February 2019.
  31. 31.0 31.1 ఎం.ఎల్., నరసింహం (30 July 2015). "పెళ్ళినాటి ప్రమాణాలు (1958)". ద హిందూ (in Indian English).
  32. 32.0 32.1 నరసింహం, ఎం.ఎల్. (7 July 2016). "జగదేక వీరుని కథ (1961)". ద హిందూ (in Indian English). Retrieved 14 February 2019.
  33. డి. వి. నరసరాజు 2004, pp. 31–32.
  34. 34.0 34.1 పులగం చిన్నారాయణ 2009, pp. 243, 244.
  35. 35.0 35.1 యు., వినాయకరావు (28 May 2015). "'కృష్ణార్జున' చిత్రానికి బ్రేక్ ఎందుకు?". ఆంధ్రజ్యోతి. Retrieved 17 February 2019.[permanent dead link]
  36. అక్కినేని నాగేశ్వరరావు 2009, p. 39.
  37. యు. వినాయకరావు 2012, p. 86.
  38. వి.ఎస్., కేశవరావు. "నాటికీ, నేటికీ మేటి సినిమా హరిశ్చంద్ర". మన తెలంగాణ. Archived from the original on 30 సెప్టెంబరు 2020. Retrieved 17 February 2019.
  39. యు. వినాయకరావు 2012, pp. 89, 90.
  40. యు. వినాయకరావు 2012, p. 98.
  41. యు. వినాయకరావు 2012, p. 82.
  42. యు. వినాయకరావు 2012, p. 99.
  43. 43.0 43.1 43.2 43.3 డి. వి. నరసరాజు 2004, p. 32.
  44. కొండలరావు, రావి. "ప్రతిభకు గీటురాయి... సృజనకు సూదంటురాయి!". సితార. Archived from the original on 9 November 2018. Retrieved 17 February 2019.
  45. ఎం.బి.ఎస్., ప్రసాద్. "సినీ స్నిప్పెట్స్‌- రాజాజీ ఆఖరి సంతకం సింగీతంకే!". గ్రేట్ ఆంధ్ర. Retrieved 17 February 2019.
  46. యు. వినాయకరావు 2012, p. 100.
  47. 47.0 47.1 47.2 సింగీతం, శ్రీనివాసరావు. "మహాదర్శకుడి గురించి ఆయన శిష్యదర్శకుడు". సాక్షి ఫన్ డే. జగతి పబ్లికేషన్స్. Retrieved 16 February 2019.
  48. "మా'ర్గ "దర్శకుడు"-కె.వి రెడ్డి". sarasabharati-vuyyuru.com. Retrieved 15 February 2019.
  49. డి. వి. నరసరాజు 2006, p. 183.
  50. డి. వి. నరసరాజు 2006, pp. 251, 252.
  51. 51.0 51.1 సింగీతం, శ్రీనివాసరావు (1 July 2012). "స్వర్ణయుగాన్ని చూపించిన గురువు". ఈనాడు సినిమా. న్యూస్ టుడే. Retrieved 17 February 2019. కె.వి.రెడ్డి శతదినోత్సవం సందర్భంగా సింగీతం వ్యాసం
  52. "కె.వి.రెడ్డి". తెలుగు వెలుగులు. హైదరాబాద్: మోనికా పబ్లిషర్స్. 2002. p. 120. Archived from the original on 9 జనవరి 2019. Retrieved 18 February 2019. 1958-60 నడుమ ఆంధ్రపత్రికలో ప్రచురితమైన తెలుగు వెలుగు శీర్షికలో తొలి ప్రచురణ; వ్యాసంలో రచయిత పేరు ఉండదు, కానీ రాసినవాడు ముళ్ళపూడి వెంకటరమణ
  53. 53.0 53.1 "జయాపజయాలు సమానంగా భావించే కె వి రెడ్డి". www.prajasakti.com. Archived from the original on 5 జూలై 2015. Retrieved 16 February 2019.
  54. పాటిబండ్ల, దక్షిణామూర్తి. "వందేమాతరం-తెలుగులో తొలితరం సాంఘిక చిత్రం". నవతరంగం. Archived from the original on 29 జూన్ 2013. Retrieved 16 February 2019.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  55. అక్కినేని, నాగేశ్వరరావు (2005). వందనం అభివందనం-నేనూ నా దర్శకులు. హైదరాబాద్: లారెస్కో ఎంటర్టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. pp. 32–39. Retrieved 17 February 2019.[permanent dead link]
  56. డి. వి. నరసరాజు 2006, p. 242.
  57. డి. వి. నరసరాజు 2004, pp. 29, 31.
  58. డి. వి. నరసరాజు 2004, p. 93.
  59. డి.వి.నరసరాజు 2004, pp. 131–133.
  60. ఎం.ఎల్., నరసింహం (14 April 2016). "సీతా రామ కళ్యాణం (1961)". The Hindu (in Indian English). Retrieved 16 February 2019.

ఆధార గ్రంథాలు

[మార్చు]
కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు
భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కథ | శ్రీకృష్ణసత్య