డోకూరి కోట్ల బాలబ్రహ్మాచార్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డోకూరి కోట్ల బాలబ్రహ్మాచారి సహస్రాధికంగా అవధానాలు చేసి ప్రసిద్ధి చెందినవాడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు మహబూబ్ నగర్ జిల్లా, దేవరకద్ర మండలానికి చెందిన డోకూరు గ్రామంలో 1911, ఫిబ్రవరి 15వ తేదీన జన్మించాడు.[1] ఇతడికి తన మూడవయేట స్ఫోటకం వచ్చి రెండు కళ్లూ కోల్పోయి అంధుడయ్యాడు. ఇతని తండ్రి అనంతరామాచార్యులు ఇతనికి వాగ్రూపంలో తెలుగులో పంచకావ్యాలు, సులక్షణసారము, అప్పకవీయం, వ్యాకరణ, జ్యోతిశ్శాస్త్రాలను నేర్పాడు. తన తండ్రి వద్ద నేర్చుకున్న విద్యతో మంచి పండితుడిగా, కవిగా ఎదిగి రామాయణ, భారత, భాగవతాలను పురాణాలుగా చెప్పేవాడు. హరికథలను కూడా చెప్పేవాడు. అంధుడైనా ఇతడు అనేక అవధానాలు చేసి, గొప్ప రచనలు చేసి 1983, ఏప్రిల్ 8వ తేదీన మహబూబ్ నగర్లో మరణించాడు.

అవధానాలు[మార్చు]

ఇతడు గద్వాల సంస్థానంలో పోకూరి కాశీపతి చేసిన అష్టావధానాన్ని శ్రద్ధగా ఆలకించి మరునాడు తాను కూడా అవధానాన్ని నిర్వహిస్తానని చెప్పగా సంస్థానంలోని పండితులు ఆయన మాటలను నమ్మలేదు. పట్టువదలని బాలబ్రహ్మాచారి ఆ సంస్థానంలోనే రెండురోజులు ఉండిపోయాడు. చివరకు గద్వాల రాజు అనుమతి ఇవ్వగా ఇతడు విజయవంతంగా అష్టావధానాన్ని నిర్వహించాడు. అప్పటి నుండి వెనుదిరుగక ఆంధ్రదేశం అంతటా వెయ్యికి పైగా అవధానాలను చేశాడు.

ఇతడు విశాఖపట్టణం, రాజమండ్రి, మండపేట, ఏలూరు, మచిలీపట్టణం, గుడివాడ, విజయవాడ, మంగళగిరి, గుంటూరు, గురజాల, కొల్లూరు, పిడుగురాళ్ల, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, త్రిపురాంతకము, ప్రొద్దుటూరు, రాజంపేట, శ్రీశైలం, బ్రహ్మంగారి మఠం, తాడిపత్రి, యాడికి, బెళగల్లు, హైదరాబాదు, భువనగిరి, హనుమకొండ, వరంగల్లు, సంగారెడ్డి, సిద్ధిపేట, వేములవాడ, యాదగిరిగుట్ట, మహబూబ్ నగర్, జడ్చర్ల, పాలెం, గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, కొడంగల్, నారాయణపేట, మక్తల్, అచ్చంపేట, దైవముదిన్నె మొదలైన అనేక పట్టణాలలోను, పల్లెలలోను అవధానాలు ప్రదర్శించాడు.

ఇతని అవధానాలలో సమస్య, దత్తపది, వ్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి, ఘంటాగణనం, వారకథనము, పురాణపఠనము, యాంత్రికచిత్రము, అంకపూరణము, అప్రస్తుత ప్రశంస మొదలైన అంశాలు ఉంటాయి.

అవధానలలోని కొన్ని పూరణలు[మార్చు]

 • సమస్య: బల్లున దెల్లవారునెడ భానుఁడు గ్రుంకెను బశ్చిమాంబుధిన్

పూరణ:

కల్లయొ నిక్కమో యెఱుఁగఁగావలె లోకుల మాటలంచునే
నల్లన రోజుఁదెల్పు గడియారముఁజేతను గట్టి యమ్రికా
న్మెల్లగఁ జేరి కన్గొనగ నిక్కమె యయ్యెను భారతావనిన్
బల్లున దెల్లవారునెడ భానుఁడు గ్రుంకెను బశ్చిమాంబుధిన్

 • సమస్య: పున్నమ చందమామపయి ముట్టడి బెట్టెను జిమ్మ చీకటుల్

పూరణ:

అన్నుల మిన్న తావక ముఖాబ్జముపై విరబారుచున్న యా
క్రొన్నెటిగుంపు భాతినదిగో కనుమా భవనాళి కెంతయున్
గన్నుల పండువై వెలఁగఁగా గవిసెన్ఁబగ చేత రాహు వీ
పున్నమ చందమామపయి ముట్టడి బెట్టెను జిమ్మ చీకటుల్

 • దత్తపది: తారణ - పార్థివ - వ్యయ - సర్వజిత్తు అనే పదాలతో భారతార్థంలో పద్యం.

పూరణ:

 తారణ కౌతుకంబున గదాధరుఁడెవ్వనిపైఁ గడంగునో
దారుణభంగి నంచు మది తల్లడమందెడి పార్థివాళిపైఁ
దీరని కిన్కమై నడరి దివ్యులు మెచ్చ వ్యయంబొనర్చి పెం
పాఱెను సర్వజిత్తుఁడయి యయ్యనిలాత్మజుఁడాహవంబునన్

రచనలు[మార్చు]

 1. నాగ్నజితి పరిణయము
 2. మహేంద్ర గర్వభంగము
 3. సుగుణవర్మోపాఖ్యానము
 4. మున్నెంకొండ వేంకటేశ్వర శతకము
 5. కొడంగల్ వేంకటేశ్వర శతకము
 6. నామలింగేశ్వర శతకము
 7. మౌనప్రభు శతకము
 8. భారతి శతకము
 9. శంభులింగ శతకము
 10. శ్రీరంగనాథ శతకము
 11. వజ్రసూచి
 12. కలిమి కొలిమి
 13. చమత్కారదర్శిని

బిరుదులు[మార్చు]

 • చతుర్విధ కవితాధురీణ
 • చిత్రకవితా ప్రవీణ
 • కవిశిరోభూషణ
 • ఆశుకవితాధురీణ
 • అవధాన పంచానన
 • కవిరత్న
 • కవిశేఖర

మూలాలు[మార్చు]

 1. రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 251–256.