మలాలా యూసఫ్‌జాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మలాలా యూసఫ్‌జాయ్
ملاله یوسفزۍ
వ్యక్తిగత వివరాలు
జననం (1997-07-12) 1997 జూలై 12 (వయసు 27)
మింగోరా, North-West Frontier Province, పాకిస్తాన్
పౌరసత్వంపాకిస్తాన్
రాజకీయ పార్టీఏదీకాదు
వృత్తిPupil, blogger, activist
జాతి / తెగపష్తూన్
బంధువులుజియావుద్దీన్ యూసఫ్ జాయ్ (తండ్రి)
Known forమహిళా హక్కులు activism, educationism, taliban assassination attempt
సంస్థలుమలాలా ఎడ్యుకేషన్ ఫండ్
పురస్కారములునేషనల్ యూత్ పీస్ ప్రైజ్ (2011)
సిమోన్ డి బ్యూరోర్ ప్రైజ్ (2013)

అత్యంత చిన్న వయసులో నోబెల్ బహుమతి గెలుచుకున్న వ్యక్తిగా పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్‌జాయ్ [Malala Yousafzai]

చరిత్ర సృష్టించారు. భారతీయుడు కైలాశ్ సత్యార్థితో పాటు 17 ఏళ్ల మలాలాకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు మహిళా విద్యకు తన మద్దతును ప్రకటించడమే కాకుండా, పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తిన మలాలా యూసుఫ్ జాయ్ (Malala Yousafzai) ను హత్య చేస్తామని తెహ్రీక్ ఈ తాలిబన్ తీవ్రవాద సంస్థ తాజాగా ప్రకటించింది. ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తినందకు ఆమెపై తీవ్రవాదులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెల్సిందే. ఆమెకు విజయవంతంగా ఆపరేషన్ జరిగింది. బుధవారం పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆస్పత్రి డాక్టర్లు ఏడు గంటల పాటు శ్రమించి ఆమె వెన్నెముకలో ఉన్న బుల్లెట్‌ను తొలగించారు.

ఈ విషయం తెలుసుకున్న తాలిబన్ తీవ్రవాదులు.. ఆమెను హతం చేసి తీరుతామని ప్రకటించారు. డాక్టర్లు ఆమెను రక్షించినప్పటికీ తమ చేతుల్లో చావు తప్పదని హెచ్చరించారు. ఈ యువతి సాహసంపై పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ మాట్లాడుతూ మలాలా ఒక వ్యక్తికాదని ఓ శక్తి అని చెప్పుకొచ్చారు. ఆమె ధైర్యం, తెగింపును ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాలన్నారు. ఉగ్రవాదంపై పోరాడి గెలుపు సాధిస్తామని చెప్పారు. ఈ దాడి పాకిస్థాన్‌కు మేల్కొలుపు కావాలన్నారు.

పాకిస్థాన్ అమ్మాయి మలాలా యూసఫ్ జాయ్ జీవిత చరిత్ర "ఐయామ్ మలాలా" పేరిట పుస్తక రూపంలో రానుంది. తాలిబన్ల దాడిలో గాయపడి ఇటీవలే పాఠశాలలో చేరిన పాక్ అమ్మాయి, మలాలా యూసఫ్ జాయ్ తన జ్ఞాపకాలను పుస్తక రూపంలోకి తీసుకురానుంది.

తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను 'ఐయామ్ మలాలా' (నేను మలాలా) అన్న పేరుతో ఆమె పుస్తకం రాసింది.

బర్మింగ్‌హామ్‌లో ఇస్లాం సంప్రదాయంలో అసర్ మలిక్‌తో మలాలా యూసఫ్‌జాయి  పెళ్లి చేసుకున్నాని ట్విట్టర్ వేదికగా 2021 నవంబరు 9న వెల్లడించారు.[1]

నేపథ్యం

[మార్చు]

మలాలా అంటే అర్థం - బాధాసర్పద్రష్ట. ఆమె బాధంతా చదువుకునే హక్కు కోసమే. పస్తూన్ కవయిత్రి, పోరాటయోధురాలు మెయివాండ్ మలాలా పేరులోని ‘మలాలా’ను ఆమె తండ్రి జియావుద్దీన్ యూసఫ్ జాయ్ కూతురికి పెట్టారు. యూసఫ్‌జాయ్ స్వాత్ లోయలో ప్రముఖ తెగ. స్వాత్ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా మలాలా ‘నా స్వాత్ లోయ’ అనే అంటుంది. మలాలా తండ్రి కూడా కవి. కుశాల్ పబ్లిక్ స్కూల్స్ పేరిట ప్రైవేటు పాఠశాలలను నిర్వహిస్తూ ఉంటారు. ఇదికూడా కుశాల్ ఖాన్ ఖట్టక్ అనే పస్తూన్ కవి పేరులోదే.

ఆశయము

[మార్చు]

మలాలా ఆశయం వైద్యవృత్తి. కానీ తండ్రి ప్రోత్సాహం మేరకు రాజకీయాలలో చేరాలని నిర్ణయిం చుకుంది. ఇద్దరు తమ్ముళ్లు నిద్రపోతున్నా, అర్థరాత్రి దాటే వరకు మలాలా తండ్రితో రాజకీయాల గురించి చర్చిస్తూనే ఉండేది. ఆ చైతన్యం ఫలితమే 2008 సెప్టెంబరులో పెషావర్ ప్రెస్‌క్లబ్‌లో ఇచ్చిన ఉపన్యాసం. అక్కడే మలాలా వేసిన ప్రశ్న ‘చదువుకోవడానికి నాకు ఉన్న హక్కుని లాక్కోవడానికి తాలిబన్లు ఎవరు?’ ఇదే ప్రశ్న చానెళ్ల ద్వారా స్వాత్ లోయ మొత్తం ప్రతిధ్వనిం చింది. అప్పటి నుంచే ఆమె, ఆమె కుటుంబ సభ్యులు తాలిబన్లకు శత్రువులయ్యారు.

యుద్ధవాతావరణానికి ఏ మాత్రం తీసిపోని స్వాత్ లోయలో సాధారణ ప్రజల జీవితం ఎలా ఉన్నదో ప్రపంచానికి తెలియచేసేందుకు బీబీసీ పూనుకున్నది. స్వాత్‌లోయ అనుభవాలను మలాలా ‘గుల్ మకాయ్’ (జొన్న పువ్వు అని అర్థం) అనే మారుపేరుతో డైరీ రూపంలో బీబీసీ కోసం ఉర్దూలో రాసింది. అది తాలిబన్ల నెత్తుటి చరిత్రే. ‘తూటాలతో మనలని మౌనంగా ఉండేటట్టు చేయగలమని ఉగ్రవాదుల ఆలోచన.

అందులో వాళ్లు విఫలమయ్యారు. ఆ మౌనం నుంచి వేల గొంతులు వినిపించాయి’ అంటూ సమితి సభలో మలాలా చెప్పిన మాట అక్షరాలా నిజం. మలాలా మీద కాల్పులు జరగగానే పాకిస్థాన్ ప్రజలతోపాటు, ప్రపంచంలో చాలామంది ఆ బాలికకు సంఘీభావం ప్రకటించారు. మలాలా మీద ఉగ్రవాదులు కాల్పులు జరిపిన (2012 అక్టోబరు 9) వార్త పెనుగాలిలా ప్రపంచాన్ని తాకగానే నోబెల్ శాంతి బహుమతి గ్ర హీత డెస్మాండ్ టుటు అదే బహుమతికి మలాలా పేరును సిఫారసు చేశారు. అంతటి పురస్కారం పరిశీలనకు ఎంపికైన పిన్న వయస్కురాలు మలాలాయే. నాటికి ఆమె వయసు పదిహేనేళ్లు. అప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ బహుమతులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఆ ప్రయాణం ఎంత స్ఫూర్తిదాయకమో, అంత విప్లవాత్మకం కూడా.

‘ఎవరి మీదో ప్రతీకారం తీర్చుకోవడం గురించి మాట్లాడటానికి రాలేద’ని సమితి సభలో మలాలా చెప్పింది. ‘ఈ ప్రపంచంలోకి వచ్చిన ప్రతి చిన్నారికి చదువుకునే హక్కు ఉంది. అది మాట్లాడేందుకు ఇక్కడ నిలబడ్డాను’ అని ప్రకటించింది. నిజానికి ఆ ఆశయాన్నే పాకిస్థాన్‌లో, స్వాత్ లోయలో ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించింది. కానీ స్వాత్ లోయ ఒక యుద్ధభూమి. మత ఛాందసవాదుల స్థావరం. 2007-2008 విద్యాసంవత్సరంలో తాలిబన్లు అక్కడ యుద్ధం మొదలుపెట్టారు. తాలిబన్ల సమాంతర ప్రభుత్వంతో లోయ నలిగిపోతోంది.

తాలిబాన్ల హింసాకాండ - మలాలా పోరాటం

[మార్చు]
Malala Yousafzai in the Oval Office, 11.10.2013

స్వాత్ లోయలో ఆడపిల్లలకు అక్షరం నిషిద్ధమైంది. బాలికల పాఠశాలలన్నీ మూసివేయాలని 2009లో తాలిబాన్లు హుకుం జారీచేశారు. వందకు పైగా బాలికల పాఠశాల భవనాలను పేల్చివేశారు. ఉగ్రవాదుల మాటను ఖాతరుచేయని పౌరులు 2009 మార్చి తరువాత పెద్ద ఎత్తున మూల్యం చెల్లించవలసివచ్చింది. బడికి వెళ్లే బాలికలనే కాదు, ఉపాధ్యాయినులను కూడా బహిరంగంగా చంపడం మొదలుపెట్టారు. ఆ జనవరిలో స్వాబి అనేచోట ఐదుగురు ఉపాధ్యాయినులను తాలిబన్లు కాల్చిచంపారు. కొడుకుతో కలిసి బాలికల పాఠశాలకు వెళుతున్న ఒక ఉపాధ్యాయినిని ఆ పసివాని ముందే రెండు నెలల తర్వాత కాల్చిచంపారు.

ఇది కరాచీలో జరిగింది. జూన్‌లో క్వెట్టాలో మరో ఘోరానికి పాల్పడ్డారు. 40 మంది బాలికలతో వెళుతున్న పాఠశాల బస్సును ఆత్మాహుతి దళసభ్యుడు పేల్చి, 14 మంది బాలికలను పొట్టన పెట్టుకున్నాడు. ఓ అర్థరాత్రి మలాలా స్వస్థలం మింగోరా పట్టణంలో, వారింటి సమీపంలోనే, మూతపడిన బాలికల పాఠశాల భవంతిని కూడా తాలిబన్లు పేల్చివేశారు. అయినా మలాలా బడికి వెళుతూనే ఉంది. సంగీతం నిషిద్ధమైంది. టీవీలు మూగబోయాయి. స్త్రీలు గడపదాటి రావడం మీద ఆంక్షలు మొదలయ్యాయి. పెచ్చరిల్లిన తాలిబన్ల మీద చివరికి పాకిస్థాన్ సైన్యం యుద్ధం ప్రారంభించింది. అప్పుడే బీబీసీలో మలాలా డైరీ కూడా ఆగి పోయింది. అప్పుడే జర్దారీ ప్రభుత్వానికీ, తాలిబన్లకీ మధ్య ఒప్పందం కుదిరిందన్న వార్త ఎఫ్‌ఎం రేడియోలో ప్రసారమైంది.

ఆ ఇంటిల్లిపాదికి కన్నీటి పర్యంతమైంది. ప్రభుత్వం తలొగ్గినది మరి దేనికో కాదు, షరియత్‌ను తుచ తప్పకుండా స్వాత్ లోయలో అమలు చేయడానికి తాలిబన్లను అనుమతించింది. ఆ తరువాత ఒకరోజు స్కూలు నుంచి తిరిగివస్తుండగా ఒక ముసుగు వీరుడు మలాలా ఎదురుపడి చంపుతానని హెచ్చరిం చాడు. కొద్దిరోజులకే స్కూలు నుంచి బస్సులో ఇంటికి వెళుతున్న మలాలా మీద ఒక ఆగంతకుడు కాల్పులు జరిపాడు. బ్రిటన్‌లోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఎట్టకేలకు మలాలా గెలిచింది. ఈ ఉదంతం విన్న వెంటనే ‘బిగ్గరగా ఏడవాలనిపించింది’ అని వ్యాఖ్యానించింది మడోనా. ఆ రోజు లాస్ ఏంజెలిస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాడిన ‘హ్యూమన్ నేచర్’ అన్న పాటను మలాలాకు అంకితం చేసింది.

ప్రఖ్యాత హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ వెంటనే ఒక వ్యాసం రాసింది. టీనా బ్రౌన్‌తో కలిసి పాకిస్థాన్ బాలికల చదువు కోసం విరాళాలు సేకరించి పంపాలని జోలీ నిర్ణయించింది. హక్కుల కోసం వీరోచిత పోరాటం చేసిన బాలిక మలాలా అని హిల్లరీ క్లింటన్ ఒక సభలో ప్రశంసించారు. లారా బుష్ ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రికలో ఒక వ్యాసం రాసింది. నాజీల దురాగతాల గురించి రహస్యంగా డైరీ రాసి చరిత్ర ప్రసిద్ధికెక్కిన యానీ ఫ్రాంక్‌తో మలాలాను పోల్చింది లారా. పాకిస్థాన్‌లోని పెషావర్ వంటి ప్రాంతాలలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ కాల్పులు జరిపినవారు నిందితులని 50 మంది ముల్లాలు కలిసి ఫత్వా జారీచేశారు.

ఇంత కదలికను కూడా తాలిబన్లు గుర్తించడానికి సిద్ధంగా లేరు. షరియత్‌ను అడ్డంపెట్టుకుని మలాలా అశ్లీలాన్ని ప్రోత్సహిస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఆమె బతికి బట్టకట్టి తిరిగి పాకిస్థాన్ వచ్చినా చావు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. మలాలా మీద తాము కాల్పులు జరిపినది విద్యాహక్కు కోసం ఆమె చేస్తున్న ఉద్యమాన్ని చూసి కాదనీ, ఇస్లాం రక్షణకు పాటుపడుతున్న సంస్థలను దూషించినందుకేనని వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఐక్యరాజ్యసమితిలో ఉపన్యాసం ముగిసిన తరువాత మలాలా మళ్లీ పాక్‌కు తిరిగి రావలసిందనీ, ఇక్కడి మదర్సాలో చదువుకోవాలనీ తాలిబన్లు పిలుపునివ్వడం కొసమెరుపు. ఇకపై ఆమెను చంపే ప్రయత్నం మరోసారి జరగదని కూడా తాలిబన్ అధికార ప్రతినిధి ఔదార్యం ప్రకటించాడు.

ప్రపంచం మొత్తం మీద విద్యావకాశాన్ని కోల్పోయిన 5,70,00,000 బాలబాలికల తరఫున 40 లక్షల మంది సంతకాలు చేసిన మహాజరును ఉపన్యాసం తరువాత సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్‌కి మలాలా అందచేసింది. ఒక్క పాకిస్థాన్‌లోనే చదువుకు నోచుకోని బాలబాలికలు 50 లక్షలు. ఇప్పుడు స్వాత్‌లోయలో ప్రతి బాలిక గొంతు విప్పుతోంది. ఇక్కడ ప్రతి బాలిక మలాలాయే అని సీఎన్‌ఎన్ విలేకరి ఎదుట బాలికలంతా ముక్తకంఠంతో చెప్పారు.

‘సాటి మనిషిని ప్రేమించడమే నా కుటుంబం నాకు నేర్పిన సంస్కారం. నా మీద తూటాలు కురిపించిన తాలిబన్ వచ్చి నా ఎదురుగా నిలిచినా అతడిని నేను క్షమిస్తాను. గాంధీజీ, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ థెరిసాలే నాకు ఆదర్శ’మని మలాలా చెప్పింది. తాలిబన్లకు చదువు లేదు, అందుకే ఇలాంటి దుష్టకార్యాలకు పాల్పడుతున్నారని నిష్కర్షగానే చెప్పింది. కానీ ఆ ఉపన్యాసంలో ఆమె ప్రపంచ పెద్దలను ఉద్దేశించి పలికిన మాట చరిత్రాత్మకం.

మూలాలు

[మార్చు]
  1. "మలాలా యూసఫ్‌జాయ్: అసర్ మలిక్‌తో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నిఖా". BBC News తెలుగు. 2021-11-10. Retrieved 2021-11-15.

యితర లింకులు

[మార్చు]