శిల్ప (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శిల్ప
శిల్ప
జననం
మైత్రేయి

వృత్తిటెలివిజన్ నటి, డబ్బింగు కళాకారిణి
క్రియాశీల సంవత్సరాలు1986 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిమహర్షి రాఘవ
పిల్లలురుద్రాక్ష్

శిల్ప తెలుగు సినిమా డబ్బింగు కళాకారిణి, నటి. తొలి తెలుగు సీరియల్ నటిగా గుర్తింపుపొందిన శిల్ప, దాదాపు వెయ్యికి పైగా సినిమాలలో ప్రధాన పాత్రలకు డబ్బింగ్ చెప్పింది. ఉత్తమ డబ్బింగు కళాకారిణిగా నంది పురస్కారాలను కూడా అందుకుంది.[1]

జీవిత విశేషాలు[మార్చు]

శిల్ప అసలు పేరు మైత్రేయి. బాల్యం, విద్యాభ్యాసమంతా హైదరాబాదులోనే గడిచింది.

నటుడు మహర్షి రాఘవతో శిల్పకు ప్రేమ వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు (రుద్రాక్ష్) ఉన్నాడు.

టీవీరంగం[మార్చు]

తొలి సీరియల్

1986, అక్టోబరులో దూరదర్శన్ లో వచ్చిన 'అనగనగా ఒక శోభ' అనే తొలి సీరియల్ లో హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ కోసం 26 మంది అమ్మాయిలకు ఆడిషన్స్ నిర్వహించిన తరువాత శిల్పను ఓకే చేశారు. హిందీలో రజనీ అనే సీరియల్ ను తెలుగులో అనగనగా ఒక శోభ పేరుతో తీయగా దూరదర్శన్ లో 13వారాలు టెలికాస్ట్ అయింది. దీనికి ధర్మవరపు సుబ్రహ్మణ్యం సంభాషణలు రాయగా, పద్మనాభం శిల్ప తండ్రి పాత్రలో నటించాడు.

ఈ సీరియల్ చివరి మూడు ఎపిసోడ్లు ఉందనగా శిల్పకు రెండో సీరియల్ 'బుచ్చిబాబు' లో అవకాశం వచ్చింది. ఆ తరువాత 'పెళ్ళిచూపులు', 'కన్యాశుల్కం', 'ఆనందో బ్రహ్మ' వంటి సీరియళ్ళలో ప్రధాన పాత్రలలో నటించింది. వ్యాఖ్యాతగానూ, సందేశానిచ్చే ప్రభుత్వ ప్రకటనలు కూడా చేసింది.

సినిమారంగం[మార్చు]

సీరియళ్ళలో శిల్ప నటనను చూసిన మెచ్చిన దరకశకుడు కె.విశ్వనాథ్ తను తీసిన ఆపద్బాంధవుడు సినిమాలో చిరంజీవి పక్కన డాన్స్ చేసే పాత్రలో శిల్పకు అవకాశం ఇచ్చాడు. ఆ తరువాత దర్శకుడు జంధ్యాల తన జంబలకిడిపంబ సినిమాలో అవకాశం ఇచ్చాడు. అలా అగ్నిప్రవేశం, ప్రజలమనిషి, ఆవారాగాడు, యుగకర్తలు, సరసాల సోగ్గాడు, అభిసారిక, పూజకు పనికిరాని పువ్వు, ఆఖరి క్షణం, చిట్టెమ్మ మొగుడు మొదలైన సినిమాలలో నటించింది. చివరగా లక్కీఛాన్స్ సినిమాలో నటించింది.

డబ్బింగు కళాకారిణిగా[మార్చు]

తన నాన్న ప్రోత్సాహంతో డబ్బింగ్ చెప్పడం ప్రారంభించింది. ఉషాకిరణ్ మూవీస్ మేనేజింగ్ డైరెక్టర్ అట్లూరి రామారావు తీస్తున్న అమ్మ అనే చిత్రంలో ఓ కొత్త హీరోయిన్ కావ్యకి మొదటగా డబ్బింగ్ చెప్పింది. ఆ తరువాత ఉషాకిరణ్ మూవీస్ నుండి వచ్చిన పీపుల్స్ ఎన్కౌంటర్ చిత్రంలో నటి సంధ్యకి డబ్బింగ్ చెప్పింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో ఒక్కోరోజు మూడు సినిమాలకు డబ్బింగ్ చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. సింగిల్ టేక్ లో చెప్పేలా ఎదిగింది. మొదట్లో సైడ్ క్యారెక్టర్స్ కి డబ్బింగ్ చెప్పిన శిల్ప, ఆ తరువాత అశ్విని నాచప్ప నటించిన అశ్విని సినిమాలో అశ్విని క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పడంద్వారా మెయిన్ క్యారెక్టర్స్ కి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించింది.[2]

శిల్ప తన కెరీర్లో ఎక్కువ సౌందర్య సినిమాలకే డబ్బింగ్ చెప్పింది. మనవరాలి పెళ్ళి సినిమాతో మొదటగా తెలుగులో తెరంగేట్రం చేసిన సౌందర్యకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించి, సౌందర్య చనిపోయేంతవరకు అనేక సినిమాలకి శిల్ప డబ్బింగ్ చెప్పింది. అరుంధతి సినిమాలో జేజమ్మ పాత్రకు డబ్బింగ్ కు శిల్పకు మంచి పేరు తెచ్చింది. మిస్టర్ పెళ్ళాంలో ఆమని, చూడాలని ఉందిలో అంజలా ఝవేరీ, తొలిప్రేమలో కీర్తి రెడ్డి, నరసింహలో సౌందర్య, పాండురంగడులో టబు, స్వరాభిషేకంలో ఊర్వశి, వీడేలో విలన్, క్షేత్రంలో ప్రియమణి, పంచాక్షరిలో అనుష్క, రాజన్నలో స్నేహ, దృశ్యంలో మీనాలతోపాటు ఇండస్ట్రీలో మనిషా కోయిరాలా, రవీనాటాండన్, ప్రీతిజింతా వంటి నార్త్ హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పింది.[3]

అవార్డులు[మార్చు]

నటన, డబ్బింగ్ విభాగంలో (వీరంగం (2011), విజయ రామరాజు (2000),[4] అనగనగా ఒక అమ్మాయి (1999)) 12 నంది అవార్డులు వచ్చాయి. పెళ్లి చూపులు అనే సీరియల్లో చేసిన ఒక్క ఎపిసోడ్ కే నంది వచ్చింది.

మూలాలు[మార్చు]

  1. "Shilpa: ఆఫ్‌ స్క్రీన్‌లో సౌందర్యని చూస్తే ఆశ్చర్యపోతారు..: శిల్ప". EENADU. 2024-01-07. Archived from the original on 2024-01-07. Retrieved 2024-01-18.
  2. Vadlmudi, Raghu (2019-12-28). "ఆ సీరియల్ హీరోయిన్ స్టార్ హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పి ఎన్నో అవార్డ్స్ అందుకుంది.! ఆమె భర్త కూడా సీరియల్స్ లో.!". TeluguStop.com. Retrieved 2024-04-17.
  3. telugudesk (2020-11-05). "మహర్షి రాఘవ భార్యనే.. ఇప్పుడు మనం చూసే బుల్లితెర తొలినాటి హీరోయిన్ అని మీకు తెలుసా.?!". Telugudesk. Retrieved 2024-04-17.
  4. "Telugu Cinema Etc - Idlebrain.com". www.idlebrain.com. Retrieved 2024-04-17.