Jump to content

దీపావళి

వికీపీడియా నుండి
(హరిత దీపావళి నుండి దారిమార్పు చెందింది)


దీపావళి
దీపావళి
యితర పేర్లుదీపావళి
జరుపుకొనేవారుహిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు
రకంభారతదేశం, సంస్కృతి
2023 లో జరిగిన తేది12 నవంబర్ (ఆదివారం)
2024 లో జరిపే తేదీ30 నవంబర్ (సోమవారం)
ఉత్సవాలుదీపాలు, అలంకరణలు, కొనుగోళ్లు, టపాకాయలు, పూజలు, ప్రార్థనలు, బహుమతులు, ఫలహారాలు

భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాలికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి. దీన్ని నరక చతుర్దశి జరుపుకుంటారు.

దీపాలంకరణ

[మార్చు]

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోஉస్తుతే ||

దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలొ దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది.దీపాలపండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వెేస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.

ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. త్రిలోకాథిపతీ.."నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని" సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.[1]

నరక చతుర్దశి

[మార్చు]
కృష్ణుడు, సత్యభామ కలిసి నరకాసురడి సైన్యాలతో పోరాడుతున్న చిత్రం.

ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడు నే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామి కి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైనా మహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది.

అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు,' పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్ఠమైంది.

నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.

సత్యం-శివం-సుందరం

[మార్చు]

పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని ప్రాణికోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని ఐహికంగాను, విజ్ఞాన ధర్మగరిమను ఆధ్యాత్మికంగాను ప్రసాదిస్తుంది. ఈ దీపాల వెలిగింపు ద్వారా మూడు రంగులు ప్రధానంగా మనకు గోచరమవుతాయి. నీలము, పసుపు, తెలుపు- ఈ మూడు రంగులు మానవ మనుగడకు అవశ్యకమైన సత్త్వరజస్తమోగుణాల సమ్మేళనంగా ఆర్యులు చెబుతుంటారు. ఈ మూడు రంగులను జగతిని పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగా భావిస్తారుట పౌరాణికులు. అంతేకాక సత్యం-శివం-సుందరం - అవి దీప ప్రజ్వలన ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లును, మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా గైకొంటారు భారతీయులు.

అంధతమిస్రంచ దక్షిణాయనమేవచ

ఉత్తరాయణే తస్మా జ్యోతిర్దానం ప్రశస్వతే

అంధ తమ్స్రమనేది ఒక నరకం, దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకొని తరించడానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతిని దానం చేయుట ఉత్తమోత్తమమైన కార్యంగా భావిస్తారు హైందవులు. ఆశ్వయుజ మాసంలో వచ్చే బహుళ చతుర్ధశి, అమావాస్యలు పరమ పవిత్ర పర్వదినాలు. భక్తి విశ్వాసాలతో, ఆనందోత్సాహాలతో దేశమంతటా పిల్లలూ, పెద్దలూ అందరూ కలసి జరుపుకునే పండుగ రోజులివి.

దివ్వి దివ్వి దీపావళి మళ్ళీ వచ్చే నాగులచవితి అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయంగా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. వెలుగులనిచ్చే దీపావళి అని అర్ధం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి, ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజాగృహంలో నువ్వులనూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని అవాహన చేసి విధివిధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్దులౌతారు. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకరపువ్వొత్తులు, కళ్ళు మిరుమిట్లుగొలుపుతుంటే మరో ప్రక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో మ్రోగుతుంటాయి పరిసరాలన్నీ. ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో, ఆ వెలుగులో, శబ్దతరంగాలలో దారిద్ర్య దు:ఖాలు దూరంగా తరిమి వేయుబడి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని, అంతేకాక వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి.

అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.

దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి, రాముడు సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజచేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. దీపావళి పండుగల్లాంటివే ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి.

భగినీ హస్త భోజనం

[మార్చు]

దీపావళి కొన్ని ప్రాంతాల్లో అయిదు రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్యయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు, కార్తీక శుద్ద విదియ భగినీహస్త భోజనంతో ముగుస్తాయి.దీపావళి అయిన రెండో రోజు చేసుకుంటారు.భారతదేశంతో పాటు నేపాల్‌లో కూడా జరుపుకొంటారు.ఈ రోజును పుష్ప ద్వితీయ, యమ ద్వితీయ, కాంతి ద్వితీయ, వంటి అనేక పేర్లతో పిలుస్తారు.భయ్యా ధూజీ అనే పేరుతో ఉత్తరదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన భగినీ హస్త భోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది.

మూలాలు

[మార్చు]
  1. http://telugu.webdunia.com/religion/religion/vendiveluguladeepavali/0910/15/1091015085_1.htm
"https://te.wikipedia.org/w/index.php?title=దీపావళి&oldid=4307795" నుండి వెలికితీశారు