Jump to content

ముత్యాల సుబ్బయ్య

వికీపీడియా నుండి
ముత్యాల సుబ్బయ్య
సుప్రసిద్ద తెలుగు సినీ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య
జననం15సెప్టెంబర్1950
కె.బిట్రగుంట, ప్రకాశం జిల్లా
వృత్తిసినిమా దర్శకుడు, రచయిత
జీవిత భాగస్వామిపార్వతి
తల్లిదండ్రులు
  • ముత్యాల శంకరయ్య, (తండ్రి)
  • ముత్యాల శేషమ్మ (తల్లి)

ముత్యాల సుబ్బయ్య (15-09-1950)తెలుగు సినిమా దర్శకుడు. ఎక్కువగా కుటుంబ కథాచిత్రాలు దర్శకత్వం వహించాడు. ఈయన దాదాపు 50 సినిమాలకి దర్శకత్వం వహిస్తే 75 శాతం విజయం సాధించాయి. ఒకే నిర్మాతకి ఐదారు సినిమాలు తీసి నిర్మాతల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో సెంటిమెంట్లు ఎక్కువగా పండించడంతో ఈయనకు సెంటిమెంటు సుబ్బయ్య అనే పేరు కూడా ఉంది.

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

జన్మ నామం:సుబ్బయ్య

పుట్టిన తేదీ:15సెప్టెంబర్1950

తల్లిదండ్రులు:-శంకరయ్య,శేషమ్మ

తోబుట్టువులు:-ముగ్గురు(ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు)

జీవిత భాగస్వామి:పార్వతి

వృత్తి:దర్శకుడు,రచయిత

పనిచేసిన కాలం:1973నుండి ప్రస్తుతం

ఈయన ప్రకాశం జిల్లాలోని కె.బిట్రగుంట గ్రామంలో జన్మించారు. పది సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ గ్రామంలోనే ఉన్నారు. తరువాత ముత్యాల శంకరయ్య వ్యవసాయ పనుల రీత్యా నెల్లూరు జిల్లా లోని పార్లపల్లి గ్రామానికి వారి కుటుంబం మారడం జరిగింది.దిగువ మధ్య తరగతి వ్యవసాయాధారిత కుటుంబంలో ముత్యాల శంకరయ్య, ముత్యాల శేషమ్మ దంపతులకు మొదటి సంతానంగా సుబ్బయ్య జన్మించారు. ఆయనకు ఇద్దరు చెల్లెళ్ళూ, ఒక తమ్ముడు. 10 సంవత్సరాల వయసు వచ్చేవరకూ కె.బిట్రగుంట గ్రామంలోనే ఉన్నారు.ఉన్నత పాఠశాల చదువూ, కాలేజీ అంతా ఈ ఊరునుంచే సాగింది. పి.యూ.సి అయ్యాక, ఊరికి పక్కనే ఉన్న విడవలూరు కాలేజీలో బి.కామ్ లో చేరారు.

హైస్కూల్లో ఉండగానే అంటే 8 వ తరగతి నుంచే నాటకాలమీద ఆసక్తి ఉండేది. కాలేజీకి వచ్చే సరికి అది పరాకాష్ఠకి చేరుకుంది. కాలేజీ పూర్తయే సరికి దాదాపు 100 నాటకాల్లో నటించడం, ఉత్తమనటుడుగా, ఉత్తమ దర్శకుడిగా బహుమతులు తెచ్చుకోవడం జరిగింది. ఊళ్ళో ఉన్న కుర్రవాళ్ళతో కలిసి రవీంద్ర ఆర్ట్ థియేటర్స్ అని ఒక నాటక సమాజాన్ని స్థాపించి చుట్టుపక్కల జరిగే పరిషత్ నాటకాల్లో కూడా పాల్గొంటూ ఉండేవారు. వీటన్నింటితోనూ చదువులో వెనకబడేవారు. కాలేజీలో రెండేళ్ళు ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీగా పనిచేశారు కానీ డిగ్రీ అత్తెసరు మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు.

సినీరంగ ప్రవేశం

[మార్చు]

స్నేహితుల ప్రభావంతో సినిమాల్లోకి వెళ్ళాలకున్నాడు. తన ఊరిలో కొంతమందికి సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళతో బంధుత్వం ఉండేది. రాజేంద్ర కుమార్ అనే కళాదర్శకుడికీ, సీనియర్ కమేడియన్ రమణారెడ్డి గారికీ, వారి బంధువూ అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్ ఐన ఎం.ఎస్.కోటారెడ్డి గారికీ ఆ ఊళ్ళో బంధువులున్నారు. వీళ్ళే కాకుండా తన స్నేహితుల కుటుంబసభ్యులకి మద్రాసులో హోటల్ నవయుగ, ద్వారకా లాడ్జి ఉండేవి.

ఏలాగతేనేం ఈ లింకులన్నీ ఉపయోగించి 1973 ప్రాంతాల్లో మద్రాసులో అడుగుపెట్టారు . అప్పటికి రాజేంద్ర కుమార్ గారు ఒక సినిమాకి పనిచేస్తున్నారు. మానాపురం అప్పారావు గారి దర్శకత్వంలో సావిత్రి, హరనాథ్ తారాగణంతో మొదలైన సినిమాకి అప్రెంటీస్ గా చేరారు. సినిమా మొదలన కొద్ది రోజులకే ఆగిపోయింది.

తర్వాత అక్కినేని సంజీవి గారి దర్శకత్వంలో రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ నిర్మిస్తున్న సిసింద్రీ చిట్టిబాబు సినిమాకి అప్రెంటీస్‍గా కుదురుకోగలిగారు. తెర మీద ఎమ్. సుబ్బయ్యగా చూసుకోగలిగిన మొదటి సినిమా ‘సిసింద్రీ చిట్టిబాబు’.

తరువాత సుప్రియా హోటల్ రెడ్డిగారి సలహా, రికమెండేషన్ మేరకు అప్పటికే బడిపంతులు లాంటి సూపర్ హిట్స్ తో మంచి పేరులో ఉన్న పి.చంద్రశేఖరరెడ్డి గారి వద్ద తల్లీకొడుకులు సినిమాకి అప్రెంటీస్‍గా చేరడంతో తన సినీ జీవితానికి ఒక మార్గం దొరికింది. [చంద్రశేఖరరెడ్డి గారి వద్దనే దాదాపు 10 సినిమాల వరకూ పనిచేశారు. ఆయన వద్దనే అప్రెంటీస్ నుంచీ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచీ, కోడైరెక్టర్ దాకా ఎదిగారు. ఆ విధంగా 6-7 సంవత్సరాలు గడిచాయి. మధ్యలో కొంతకాలం గాప్ వస్తే మృణాల్‍సేన్ గారి ఒక ఊరి కథకి కో-డైరెక్టర్ గా పనిచేసి మళ్ళీ పి.సి.రెడ్డి గారి వద్దకి వచ్చేశారు. ఆయనప్పుడు కృష్ణంరాజు, శ్రీధర్‌ లతో రాముడు – రంగడు చేస్తున్నారు. దానికీ ముత్యాల సుబ్బయ్య కోడైరెక్టర్.[1]

దర్శకుడిగా

[మార్చు]

రాముడు - రంగడు సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్‍గా పనిచేస్తున్న పొన్నతోట రఘురాం సుబ్బయ్యతో ఏదైనా సొంతంగా సినిమా తియ్యాలని ఉంది” అని చెప్పాడు. సుబ్బయ్య తాను ఎన్నాళ్ళుగానో తననుకుంటున్న ఒక కథ (18 ఏళ్ళ అమ్మాయి మెడలో 8 ఏళ్ళ అబ్బాయి అనుకోకుండా తాళి కట్టడం.. తద్వారా జరిగే పరిణామాలూ) థ్రెడ్ చెప్పారు. కథ వినగానే రఘురాం చేద్దామని అన్నాడు. దీనిని నటీనటులగా వాణిశ్రీ, బాలకృష్ణ లతో చేయాలనుకొని కొన్నికారణాల వల్ల హీరోయిన్ పాత్రకి మాధవి ని, హీరో పాత్రకి రాజేంద్ర ప్రసాద్‍ నీ తీసుకున్నారు.

షూటింగు అంతా రాజమండ్రి దగ్గరే మొత్తం 20 రోజులలోగా ముగిసింది. దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్య మొదటి సినిమా అది మూడు ముళ్ళ బంధం. తనకంటే వయసులో పదేళ్ళు పెద్దదైన యువతికి ఒక పిల్లవాడు తాళి కట్టడం, తర్వాత అతను పెద్దయిన తర్వాత వేరే అమ్మాయిని ప్రేమించడం. ఇదీ స్థూలంగా ఆ చిత్రకథ. ఈ చిత్రానికి సెన్సార్‍ ఇబ్బందులు ఎదురైనా సుబ్బయ్య ఎలాగో వారిని ఒప్పించి సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు. 1980 అక్టోబరు ప్రాంతాల్లో విడుదలైంది. కానీ ప్రేక్షకులు సినిమాని ఆదరించలేదు. చిత్రకథ ప్రత్యేకత వల్ల దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్యకు పేరు తెచ్చింది.

అప్పటికి ఆర్థిక పరిస్థితులుకూడా బాగా లేవు. అప్పటికే ముగ్గురు పిల్లల తండ్రి. ఒక సంవత్సరం తర్జన, భర్జనల అనంతరం మళ్ళీ కోడైరెక్టర్‍గానైనా సరే చేద్దామని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలోనే టి. కృష్ణ నేటి భారతం సినిమాని తొలి ప్రయత్నంగా తీస్తూ కో-డైరెక్టర్‍ కోసం చూస్తున్నారని బి.గోపాల్, పి.సి.రెడ్డిగార్ల ద్వారా ముత్యాల సుబ్బయ్య కబురొచ్చింది. అప్పటినుంచీ మొదలుపెట్టి టి.కృష్ణ గారు తీసిన ఆరు సినిమాలకీ ఆయనే కో-డైరెక్టర్‍గా పనిచేశాడు.[2]

టి.కృష్ణతో వందేమాతరం, దేవాలయం సినిమాలు తీసిన హరికృష్ణ మైనంపాటి భాస్కర్ గారు వ్రాసిన వెన్నెలమెట్లు నవలని చదివి సినిమాగా తీద్దామని నిర్ణయించుకుని ముత్యాల సుబ్బయ్యను పిలిచారు. అది చదివిన టి. కృష్ణ ఆ చిత్రాన్ని ముత్యాల సుబ్బయ్యనే దర్శకత్వం చేయమన్నాడు. అప్పటికే విజయశాంతి, రాజశేఖర్‍ లతో ఎక్కువ సినిమాలకి పనిచేసి ఉండటంతో, నవలలో కేరెక్టర్స్ కి వాళ్ళే సరిపోతారని నిర్ణయించుకుని అరుణకిరణంగా ఆ నవలని తీశారు. 1986 లో రిలీజ్ అయింది. 150 రోజుల సినిమా అయింది అది. ఈ సినిమా ముత్యాల సుబ్బయ్యకు పునర్జన్మనిచ్చిన మొదటి సినిమా.

పురస్కారాలు

[మార్చు]

చిరంజీవితో హిట్లర్, అన్నయ్య, వెంకటేశ్ తో పవిత్రబంధం, పెళ్ళి చేసుకుందాం (1997),[3] బాలకృష్ణతో ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ (1988), పవిత్రప్రేమ, కృష్ణబాబు వంటి సినిమాలు ఏ హీరో ఇమేజీ లేకుండా కేవలం కథా బలంతో కలికాలం, అమ్మాయి కాపురం, సగటు మనిషి లాంటి సినిమాలు దర్శకుడిగా రూపొందించిన సుబ్బయ్య అరుణ కిరణం, ఎర్ర మందారం, అమ్మాయి కాపురం, పవిత్రబంధం చిత్రాలకు నంది అవార్డు అందుకున్నారు. కలికాలం చిత్రానికి కళావాహినీ అవార్డు, 2004 లో కె.వి.రెడ్డి అవార్డు, పి.పుల్లయ్య పురస్కారం కూడా అందుకున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-02. Retrieved 2014-05-03.
  2. ముత్యాల, సుబ్బయ్య. "మొదటి సినిమా-ముత్యాల సుబ్బయ్య" (PDF). కౌముది.నెట్. కౌముది.నెట్. Retrieved 1 September 2015.
  3. తెలుగు ఫిల్మ్ నగర్, సినిమా (9 October 2019). "మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 'పెళ్లి చేసుకుందాం'కు 22 ఏళ్ళు". www.thetelugufilmnagar.com. Prabhu. Archived from the original on 14 June 2020. Retrieved 15 June 2020.

ఇతర లింకులు

[మార్చు]