కల్పము (కాలమానం)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు. ఇది 432 కోట్ల సంవత్సరాలు. ఒక కల్పంలో 14 మన్వంతరాలుంటాయి. మన్వంతరాన్నే మనుయుగమని కూడా అంటారు. మన్వంతరానికి 31,10,40,000 సంవత్సరాలు. ఒక్కో మన్వంతరంలో భూమిని ఒక్కో మనువు పాలిస్తాడు. ప్రస్తుతం నడుస్తున్నది ఏడవ మన్వంతరం. పాలిస్తున్నది వైవస్వత మనువు. దీన్ని వైవస్వత మన్వంతరం అంటారు. ఒక్కో మన్వంతరంలో 71 మహాయుగాలు, ఒక్కో మహాయుగంలో నాలుగు యుగాలు (కృత, త్రేతా, ద్వాపర మరియు కలి యుగాలు) ఉంటాయి.


దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.


 • కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
 • త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
 • ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
 • కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు
 • మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)

ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.


కాలమానము సౌర (మానవ) సంవత్సరాలు దివ్య సంవత్సరాలు
ఒక చతుర్యుగము 43,20,000 12,000
71 చతుర్యుగములు 30,67,20,000 8,52,000
ప్రతి కల్పాదియందు వచ్చు సంధ్య 17,28,000 4,800
14 సంధ్యా కాలములు 2,41,92,000 67,200
ఒక సంధ్యాకాలముతో పాటు ఒక మన్వంతరము 30,84,48,000 8,56,800
14 సంధ్యలతో పాటు కలిపిన 14 మన్వంతరములు 4,31,82,72,000 1,19,95,200
14 మన్వంతరములు + కల్పాది సంధ్య = ఒక కల్పము
= బ్రహ్మకు ఒక పగలు
4,32,00,00,000 1,20,00,000


కల్పముల పేర్లు[మార్చు]

మహాభారతంలో చెప్పిన ప్రకారం ప్రస్తుతం బ్రహ్మకు 51వ సంవత్సరంలో "శ్వేతవరాహ కల్పం" నడుస్తున్నది. మత్స్య పురాణం (290.3-12)లో 30 కల్పాల పేర్లు చెప్పబడ్డాయి. అవి[1]:

 1. శ్వేత కల్పము
 2. నీలలోహిత కల్పము
 3. వామదేవ కల్పము
 4. రత్నాంతర కల్పము
 5. రౌరవ కల్పము
 6. దేవ కల్పము
 7. బృహత్ కల్పము
 8. కందర్ప కల్పము
 9. సద్యః కల్పము
 10. ఈశాన కల్పము
 11. తమో కల్పము
 12. సారస్వత కల్పము
 13. ఉదాన కల్పము
 14. గరుడ కల్పము
 15. కౌర కల్పము
 16. నారసింహ కల్పము
 17. సమాన కల్పము
 18. ఆగ్నేయ కల్పము
 19. సోమ కల్పము
 20. మానవ కల్పము
 21. తత్పుమాన కల్పము
 22. వైకుంఠ కల్పము
 23. లక్ష్మీ కల్పము
 24. సావిత్రీ కల్పము
 25. అఘోర కల్పము
 26. వరాహ కల్పము
 27. వైరాజ కల్పము
 28. గౌరీ కల్పము
 29. మహేశ్వర కల్పము
 30. పితృ కల్పము

వాయు పురాణం 21వ అధ్యాయంలో 28 కల్పాల పేర్లున్నాయి. తరువాతి అధ్యాయంలో మరో ఐదు కల్పాలపేర్లున్నాయి.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. Vasu, S.C. & others (1972). The Matsya Puranam, Part II, Delhi: Oriental Publishers, p.366


బయటి లింకులు[మార్చు]