తెలంగాణ సాహిత్య అకాడమి
తెలంగాణ సాహిత్య అకాడమీ | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | సాహిత్యం (వ్యక్తిగతం) | |
వ్యవస్థాపిత | 2017 | |
బహూకరించేవారు | తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ ప్రభుత్వం | |
వివరణ | తెలంగాణ సాహిత్య అకాడమీ పురస్కారం |
తెలంగాణ సాహిత్య అకాడమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అధికారిక సంస్థ.
స్థాపన
[మార్చు]తెలంగాణ సాహిత్య వికాసానికి విస్తృతంగా కవులను వెలుగులోకి తేవడానికి సాహిత్య అకాడమి ఏర్పాటు చేయాలని అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు.మూడున్నర దశాబ్దాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో సాహిత్య అకాడమీ కొనసాగింది. అప్పట్లో ఏపీ సాహిత్య అకాడమీ, ఏపీ సంగీత, నాటక అకాడమీ, ఏపీ లలిత కళల అకాడమీలు ఉండేవి. ఎన్టీ రామారావు సీఎం అయ్యాక వాటిని రద్దుచేసి వాటి స్థానంలో తెలుగు వర్సిటీని స్థాపించారు. స్వతహాగా సాహిత్య అభిలాషి అయిన కేసీఆర్.. వాటిని పునరుద్ధరించాలని నిర్ణయించారు. 2017 మే 02న తెలంగాణ సాహిత్య అకాడమి G.O.R.t. No. 344 ద్వారా పునరుద్ధరించబడింది.అదే రోజున ప్రసిద్దకవి డా. నందిని సిధారెడ్డి గారిని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ గా G.O.R.t. No. 1033 ద్వారా నియమించడం జరిగింది. తేది. 10.05.2017 రోజున తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. వారి అనంతరం మామిడి హరికృష్ణ గారిని, 2020 జూలై 28న తెలంగాణ సాహిత్య అకాడమి ఛార్జ్ కార్యదర్శిగా నియమించడం జరిగింది. జూలూరి గౌరీశంకర్ 2021 డిసెంబరు 17న తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[1][2]
తెలంగాణ సాహిత్య అకాడమి రవీంద్రభారతి ప్రాంగణంలోని కళాభవన్ లో ఏర్పాటైంది.రిజిస్టేషన్ నెం. 787/2017 ద్వారా తెలంగాణ సాహిత్య అకాడమి సంస్థగా నమోదైంది.
చైర్మన్లు
[మార్చు]- నందిని సిధారెడ్డి (10.05.2017 నుండి 2020)
- జూలూరు గౌరీశంకర్ (2021 డిసెంబరు 22[3] - ప్రస్తుతం)
లక్ష్యాలు
[మార్చు]- అరుదైన, అపురూపమైన గ్రంథాల సేకరణ, ప్రచురణ.
- వెలుగులోకి రావలసిన సాహిత్య అంశాలపై పరిశోధన.
- సాహిత్య సభలు, సమావేశాలు, శిక్షణా శిబిరాలు, సదస్సుల నిర్వహణ.
- తెలుగు నుండి ఇతర భాషలలోకి, ఇతర భాషల నుండి తెలుగులోకి అనువాదాలు చేయించడం.
ప్రచురణలు
[మార్చు]- శాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ
- తెలంగాణ పద్య కవితా వైభవం (రచన: డా. గండ్ర లక్ష్మణరావు)
- తెలంగాణ సినీగేయ వైభవం (రచన: కందికొండ)
- సురవరం ప్రతాపరెడ్డి కథలు
- అస్తిత్వ (ప్రాతినిధ్య తెలంగాణ కథలు)
- హిందువుల పండుగలు
- మూడుతరాల తెలంగాణ కథ
- తెలంగాణ సామెతలు
- తెలంగాణ నవలా వికాసం (రచన: కాసుల ప్రతాపరెడ్డి)
- అభ్యుదయ తెలంగాణ అంశాలు - మాదిరాజు రామకోటేశ్వరరావు స్వీయచరిత్ర
- ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం (డా. వెల్లండి శ్రీధర్)
- తెలంగాణాలో శాతవాహనుల వారసత్వం (ఈమని శివనాగిరెడ్డి)
- తెలంగాణాలో భావకవితా వికాసం
- తొలినాళ్ల సోయి
- గోండ్వానాలాండు ఎంత ప్రాచీనమైనదో తెలుగు కూడా అంతే ప్రాచీనమైనది (సగిలి సుధారాణి)
- మందార మకరందాలు (రచన: డా. సింగిరెడ్డి నారాయణరెడ్డి)
- వాగ్భూషణం భూషణం (డా. ఇరివెంటి కృష్ణమూర్తి)
- రైతు ఋణ విముక్తి (రాళ్ళబండి రాఘవశర్మ)
- బ్రిటిష్ గ్రంథాలయంలో తెలుగు పుస్తకాల పట్టిక
- సింహగిరి వచనములు
- మాదిరెడ్డి సులోచన కథలు
- తెలంగాణ భాష - ఒక అవలోకనం[4]
కార్యక్రమాలు
[మార్చు]- మన ఊరు - మన చరిత్ర: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ విద్యార్థి ఒక చరిత్రకారుడు కావాలని, వారు పుట్టి, పెరిగిన ఊరికి సంబంధించిన ప్రతీ అంశాన్ని సున్నితంగా పరిశీలించి రాబోయే తరాల వారికి తమ గ్రామచరిత్రను పుస్తకం రూపంలో అందించాలన్న ఉద్దేశంతో మన చరిత్ర మనమే రాసుకుందాం అనే నేపథ్యంతో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రూపొందించబడింది. 2022 మార్చి 29న నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. గ్రామ చరిత్ర, దేవాలయాలు-వాటి ప్రాచీనత, శాసనాలు, పాత నిర్మాణ అవశేషాలు, రాష్ట్ర అవతరణ తర్వాత వేగవంతంగా జరిగిన పనులు, వ్యవసాయ పంటలు, పరిశ్రమలు, చేతివృత్తులు, రవాణా సౌకర్యాలు, రహదార్లు-రోడ్లు, వ్యాపారాలు, వాహనాలు, కులాలు, మతాలు, పండుగలు, ఆటపాటలు, గ్రామం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వారి చరిత్ర, తెలంగాణ పోరాటయోధులు మొదలైన అంశాలు నిక్షిప్తం చేస్తారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ సాధించిన విజయాలు:
[మార్చు]కరోనా కాలం – ఆగని అక్షర యజ్ఞం
2020 జనవరిలో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపివేసి, మానవ జాతి చరిత్రలోనే వ్యక్తులను, వ్యవస్థలను అన్నిటినీ స్తంభింపచేసింది. 2020 మార్చి 23న భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూ’ను విధించాల్సి వచ్చింది. ఆ తర్వాత రోజు నుంచే దేశ చరిత్రలో మొట్టమొదటసారిగా ‘లాక్‌డౌన్’ విధించారు. ఈ నేపథ్యంలో అన్ని యంత్రాంగాలు, సంస్థలు, వ్యవస్థలు చాలా వరకు నిర్‌వ్యాపారమై ఎక్కడివక్కడే కుదేలైన పరిస్థితులలో సాహితీ, సాంస్కృతిక కార్యకలాపాలు కూడా ఆగిపోయాయి.
ఇలాంటి పరిస్థితులలో 2020 జూలై 28 నాడు ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు సెక్రటరీగా అదనపు బాధ్యతలు అందించింది. అప్పటికే, భాషా సాంస్కృతిక శాఖ చేపట్టిన ‘‘6 సి ఇనిషియేటివ్’’లో భాగంగా సాహితీ కార్యక్రమాలకు తెలంగాణ సాహిత్య అకాడమి సారథ్యంలో ఆన్‌లైన్ వేదికగా శ్రీకారం చుట్టింది. “6సి” అంటే (Corona Cannot Control Culture, Creativity, Cinema). ఈ పేరుతో 4 ఏప్రిల్, 2020 నాడు సాంస్కృతిక, సాహితీ కార్యక్రమాలకు ఆన్‌లైన్ ద్వారా డిజిటల్ / వర్చువల్ ప్లాట్‌ఫామ్‌పై నిర్వహించడానికి భాషా సాంస్కృతిక శాఖ నిర్ధిష్ట కార్యాచరణ పథకాన్ని రూపొందించి అమలు చేసి విజయము సాధించింది. ఈ విధానంలో నిర్వహించిన నృత్యోత్సవాలు, డ్రామా ఉత్సవాలు, యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్ వర్క్ షాప్, కర్రసాము, డైరెక్షన్, సంగీతోత్సవాలు ఇతర వర్క్ షాప్‌లు ఎంతో ఆదరణను, ప్రశంసలను పొందాయి. ఈ అనుభవంతో తెలంగాణ సాహిత్య అకాడమి ద్వారా వర్చువల్/డిజిటల్ విధానంలో ఆన్‌లైన్ సాహితీ కార్యక్రమాలను, కవి సమ్మేళనాలను నిర్వహించడం ప్రారంభించింది.
అలా తెలంగాణ సాహిత్య అకాడమీ ఈ కరోనా సమయాల్లో ఫిజికల్ గానూ, డిజిటల్ గానూ ఈ దిగువ రకాల సాహిత్య, భాషా కార్యక్రమాలను నిర్వహించింది.
1. తెలంగాణకు చెందిన ప్రముఖ సాహితీవేత్తల జయంతులు, వర్ధంతులు :
[మార్చు]తెలంగాణాకు చెందిన ముకురాల రామారెడ్డి, మాడపాటి, రావెళ్ళ వెంకట రామారావు, మఖ్ధూం మొహియుద్దీన్, నీలా జంగయ్య, సరోజిని నాయుడు, గడియారం రామకృష్ణశర్మ, ఒద్దిరాజు సోదరులు, బిరుదురాజు రామరాజు, సామల సదాశివ, పల్లా దుర్గయ్య, సురవరం ప్రతాపరెడ్డి, సుద్దాల హనుమంతు, పైడిమర్రి, చందాల కేశవదాసు, దాశరథి సోదరులు, పాకాల యశోదారెడ్డి, వానమామలై, దేవులపల్లి రామానుజరావు, కాళోజి, నందగిరి ఇందిరాదేవి, షోయబుల్లాఖాన్, మాదిరెడ్డి సులోచన, వట్టికోట, ఆదిరాజు, పొట్లపల్లి, లోకమలహరి, భండారు అచ్చమాంబ మొదలగు సాహితీ వైతాళికుల జయంతి, వర్ధంతుల సందర్భంగా వారి చిత్ర పటాలకు పూలమాలలతో నివాళులు అర్పించడమే కాక, వారు చేసిన సాహితీ కృషిని గుర్తుచేసుకోవడం, ఆన్‌లైన్ వేదిక గానూ యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా వారి జీవిత విశేషాలను తెలుగు సాహితీ లోకంలో వ్యాప్తి చేసింది.
2. కవి సమ్మేళనాలు - రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ బహు భాషా కవి సమ్మేళనాలు :
[మార్చు]కావ్యకౌముది సంస్థతో కలిసి ‘‘అంతర్జాతీయ బహుభాషా కవి సమ్మేళనం’’లను 4 సార్లు ఆన్‌లైన్ వేదికగా నిర్వహించగా అందులో ప్రతిసారీ దాదాపు 25 పైగా దేశాల నుంచి కవులు పాల్గొని తమ తమ భాషలలో కవితలు వినిపించారు. ఇవే కాకుండా తెలుగు కవి సమ్మేళనాలను కూడా ఆయా సాహితీ సంస్థల కార్యక్రమాలలో అంతర్భాగంగానూ, ప్రత్యేకంగానూ నిర్వహించింది.
3. భాషా ఛందస్సుపై అవగాహన కార్యక్రమాలు :
[మార్చు]‘‘తెలుగులో బాలవ్యాకరణం, భాష, విమర్శ’’ అంశాలపై సంవత్సర కాలం పాటు ఆన్‌లైన్ కార్యక్రమాలను తెలంగాణ సారస్వత పరిషత్ ప్రాచ్య కళాశాల పూర్వ విద్యార్థుల సహకారంతో తెలంగాణ సాహిత్య అకాడమి నిర్వహించింది. భాష, వ్యాకరణంపై ఉన్న ఎన్నో క్లిష్ట అంశాలను ఈ కార్యక్రమంలో విశదీకరించి చర్చించడం ద్వారా ఉపాధ్యాయులు, భాషా పండితులు, సాహితీ వేత్తలకు అవగాహన కల్పించడం సాధ్యమయింది.
4. ప్రసిద్ధ కవులచే స్వయంగా ‘కావ్యగానం’ కార్యక్రమాలు :
[మార్చు]ప్రముఖ కవులు తాము రాసిన కవితల గురించి, దాని నేపథ్యాన్ని గురించి వారి ముఖతః వారే వివరించే విధంగా వినూత్నమైన కార్యక్రమాన్ని ‘కావ్యగానం’ అనే పేరిట తెలుగు భాషా చైతన్య సమితితో కలిసి తెలంగాణ సాహిత్య అకాడమి ప్రతి ఆదివారం నిర్వహించింది. అనుమాండ్ల భూమయ్య, కూరెళ్ల విఠలాచార్య, తిరునగరి, జింబో, గండ్ర లక్షణ రావు, రామా చంద్రమౌళి, జలజం, నాళేశ్వరం, సుద్దాల అశోక్ తేజ, అయినంపూడి శ్రీలక్ష్మీ, యాకూబ్, వనపట్ల, జూపాక సుభద్ర, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, సుంకిరెడ్డి, అన్నవరం, అఫ్సర్, ప్రసేన్, జూకంటి, వేణు సంకోజు, నలిమెల భాస్కర్, షాజహానా, ఎస్వీ సత్యనారాయణ, దేశపతి శ్రీనివాస్, దోరవేటి, కాంచనపల్లి, దామెర రాములు, శిలాలోహిత, స్వాతి శ్రీపాద, రేణుక అయోల, కొండెపూడి నిర్మల, మహెజబీన్, సీతారాం, రేడియం మొదలగు సమకాలీన కవులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సాహిత్య ప్రస్థానాన్ని, కవితా విశేషాలను వివరించడం పరిశోధనలకు, భవిష్యత్ తరాలకు ఒక డాక్యుమెంటేషన్‌ను అందజేసిందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం పరిశోధకులకు ‘First Hand Source of information’గా భావించగలిగే స్థాయిలో రూపొందడం విశేషం.
5. ప్రచురణ విక్రయ కేంద్రం ఏర్పాటు :
[మార్చు]తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురించిన పుస్తకాలను విద్యార్థులు, పరిశోధకులు, పోటీ పరీక్షల అభ్యర్థులకు, సాహితీ ప్రియులకు అందరికీ అందుబాటులో ఉంచడానికి రవీంద్రభారతి ప్రాంగణంలో శాశ్వత విక్రయ కేంద్రాన్ని 13 నవంబరు, 2020 నాడు ఏర్పాటు చేసింది. దీనివల్ల వ్యక్తులు పుస్తకాలను చూడటం, చదవడం, అవసరమైన వాటిని డిస్కౌంట్‌లో కొనుగోలు చేసే అవకాశం లభించింది.
6. హైదరాబాద్ బుక్ ఫేయిర్‌లో స్టాల్ ఏర్పాటు :
[మార్చు]ప్రతి యేటా ప్రతిష్ఠాత్మకంగా భాషా సాంస్కృతిక శాఖ, హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించే బుక్ ఫెయిర్‌లో తెలంగాణ సాహిత్య అకాడమికి ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఫెయిర్‌ను సందర్శించే లక్షలాది మంది పుస్తక ప్రేమికులకు అకాడమీ ప్రచురించిన పుస్తకాలను చేరువ చేసింది.
7. సోషల్ మీడియా ద్వారా తెలంగాణాసాహితీ, భాషా విషయాల వ్యాప్తి :
[మార్చు]తెలంగాణకు సంబంధించిన సాహితీ, భాషా విషయాలు, వైతాళికులకు సంబంధించిన విశేషాంశాలను, జీవన ప్రస్థానాన్ని వాట్సప్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు, సందర్భోచితంగా తెలియపరుస్తూ ఒకవైపు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యక్రమాలను, మరొకవైపు ఆ విశేషాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే ప్రయత్నాన్ని చేసింది.
ఇలా ‘కోవిడ్ సవాలు’ను అవకాశంగా మలుచుకుంటూ ఆన్‌లైన్ వేదికగా గణనీయమైనంత సాహితీ, భాషా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా తెలంగాణ సాహిత్య అకాడమి తెలంగాణ ప్రాంతం అనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలుగు వారందరికీ చేరువ అయింది. సౌతాఫ్రికా నుండి మొదలుకొని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వరకు, కెనడా నుంచి మొదలుకొని బ్రిటన్ వరకు వివిధ NRI సంస్థలతో సమన్వయం చేసుకుంటూ తెలంగాణ సాహిత్య అకాడమి రకరకాల సాహిత్య కార్యక్రమాలను నిర్వహించింది. ఇక దేశీయంగా వివిధ సాహితీ సంస్థల సహకారంతో పైన తెలిపిన విభిన్నమైన సాహితీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం ‘‘హైబ్రిడ్ తరహా’’ లో ఆన్‌లైన్ / వర్చువల్ కార్యక్రమాలను , ఆఫ్ లైన్ కార్యక్రమాలను సమాంతరంగా నిర్వహిస్తూ వర్గాలు, ప్రాంత పరిమితులకు అతీతంగా తెలంగాణ సాహిత్య అకాడమీ అందరినీ కలుపుకొని పోవాలనే లక్ష్యాన్ని సాధించడంలో సఫలీకృతం అయింది.
8. పుస్తక ప్రచురణలు
[మార్చు]తెలంగాణ సాహిత్య అకాడమి ప్రధాన లక్ష్యాలలో పుస్తక ప్రచురణలు కూడా ఒకటి. దీనివల్ల ఆయా భాషా, సాహిత్య విషయాలు గ్రంధస్థం కావడమే కాక, భావితరాలకు ‘రెఫరెన్స్’గా నిలుస్తాయి. అందుకే “తెలంగాణ భాష – ఒక అవలోకనం” (నలిమెల భాస్కర్) వంటి పుస్తకాలను ఎన్నిటినో ఈ కరోనా కాలంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా ప్రచురించింది.
అంతేగాక, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, విద్యావేత్తగా, సాహితీవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, పాలనాదక్షుడిగా, ఆర్థిక సంస్కరణల ప్రతిపాదకుడిగా పూర్వ ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావు పాత్ర రాష్ట్ర దేశ విషయాలలో అనన్య సమాన్యమైనది. ఆయన శత జయంతి సందర్భంగా వారి మూర్తిమత్వాన్ని 360 డిగ్రీలలో ఆవిష్కరించడమే ప్రధాన లక్ష్యమని ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ మొత్తం 8 పుస్తకాలను ప్రచురించింది. వాటిలో శ్రీ పీవీ గారు రాసినవి 4 పుస్తకాలు కాగా, మిగతావి ఆయన కృషిని, జీవితాన్ని విశ్లేషించే గ్రంథాలు కావడం విశేషం. వాటి వివరాలు:
శ్రీ పీవీ నరసింహారావు రచనలు (ఇంగ్లీష్ లో)
i. Influence of India's Culture on the West and Other Speeches: పశ్చిమ దేశాలపై భారత సంస్కృతి ప్రభావంపై పీవీ నరసింహారావు గారి ప్రసంగాల సంకలనం
ii. The Granny & Other Stories: పీవీ నరసింహారావు గారు రాసిన 8 అరుదైన కథల సంకలనం. ఇందులో ప్రసిద్ధ గొల్ల రామవ్వ కథ కూడా ఉంది.
iii. The Meaning of Secularism and Other Essays: పీవీ నరసింహారావు గారు వివిధ సందర్భాలలో రాసిన వ్యాసాల సంకలనం.
iv. Thus Spake PV-Interviews with P.V.NarasimhaRao: పీవీ నరసింహారావు గారిని వేర్వేరు మీడియా ప్రతినిధులు చేసిన ఇంటర్వ్యూల సంకలనం.
శ్రీ పీవీ గారిపై ఇతర పుస్తకాలు (ఇంగ్లీష్ లో)
v. P.V. Narasimha Rao-Architect of India's Reforms: పీవీ నరసింహారావు చేసిన ఆర్థిక సంస్కరణలపై సంజయ బారు రాసిన కాఫీ టేబుల్ పుస్తకం.
vi. Legend in Lines: పీవీ నరసింహారావు గారు స్ఫూర్తిగా దాదాపు 125కు పైగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర కార్టూనిస్ట్ లు వేసిన క్యారికేఛర్ ల సంకలనం.
శ్రీ పీవీ గారిపై తెలుగులో ప్రచురించిన పుస్తకాలు
vii. నమస్తే పీవీ: పీవీ నరసింహారావు గారి గురించి నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురించిన వ్యాసాల సంకలనం.
viii. కాలాతీతుడు: పీవీ నరసింహారావు గారి జీవితం స్ఫూర్తితో 143 మంది కవుల కవితా సంకలనం.
పై పుస్తకాలను 2021 జూన్ 28న పీవీ జ్ఞానభూమిలో జరిగిన పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు.
9. సమకాలీన సాహితీవేత్తల రచనలు, జీవితం, సాహిత్యంపై చర్చ – సదస్సులు :
[మార్చు]అ) ఉనికి సామాజిక, సాంస్కృతిక వేదిక – నల్లగొండ (బండారు శంకర్) వారి ఆద్వర్యంలో మునాసు వెంకట్ కవిత్వంపై, మహాకవి గింజల నరసింహారెడ్డి కవిత్వంపై ఒక రోజు సదస్సు.
ఆ) సాహితీ మిత్ర మండలి, పరకాల వారు సాహితీ కార్యక్రమాలపై సదస్సు (డా.పల్లేరు వీరస్వామి).
ఇ) సాహితీ సోపతి, కరీంనగర్ (అన్నవరం దేవేందర్) వారి పదేండ్ల పండుగ సాహితీ ఉత్సవాలు, డా.కాలువ మల్లయ్య సప్తతి సాహిత్య సంబురాలను నిర్వహించింది.
ఈ) భానుపురి సాహితీ వేదిక, సూర్యాపేట వారి ఆద్వర్యంలో సక్కనితొవ్వ సాహితీ సంకలన ఆవిష్కరణ, భానుపురి సాహితి జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం వంటి కార్యక్రమాలను (ఆఫ్ లైన్‌లో - భౌతికంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ) విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
ఇవేకాక కవిత్వం / సాహిత్యానికి సంబంధించిన పుస్తకావిష్కరణలను, బాల సాహిత్యంపై, కావ్య పాఠనంపై కొత్త పుస్తకాల పరిచేయంపై ప్రత్యేక సాహితీ సదస్సులు / చర్చా గోష్టులను కూడా విజయవంతంగా నిర్వహించి తెలంగాణ సాహితీ సమాజంలో తనదైన ముద్రను వేసింది. వీటికి తోడు 2022 సంవత్సరపు క్యాలెండర్ ను, డైరీని కూడా ప్రచురించడం ద్వారా సాహితీవేత్తలకు తెలంగాణ సాహిత్య అకాడమి కార్యకలాపాలను మరింత చేరువ చేసే ప్రయత్నాలు చేసింది. ఇది కేవలం డైరీ గానే కాక, అందులో తెలంగాణకు చెందిన ప్రముఖ సాహితీ వైతాళికుల జయంతులు, వర్ధంతుల విషయాలను, రాష్ట్ర అవతరణ నుండి సాహిత్య రంగం ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ పురస్కారాలు సాధించిన అక్షర మూర్తుల వివరాలను అందించింది.[5]
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- మన తెలంగాణ పత్రికలలో ప్రచురితమైన కథనం [1] Archived 2021-07-14 at the Wayback Machine
- ↑ Namasthe Telangana (17 December 2021). "పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన సీఎం కేసీఆర్". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
- ↑ Eenadu (17 December 2021). "పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను ఖరారు చేసిన కేసీఆర్". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
- ↑ Mana Telangana (22 December 2021). "ఆర్కైవ్ నకలు". www.manatelangana.news. Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
- ↑ telugu, NT News (2022-12-02). "స్వరాష్ట్రంలోనే మన భాషకు గుర్తింపు". www.ntnews.com. Archived from the original on 2022-12-03. Retrieved 2022-12-06.
- ↑ NavaTelangana (27 February 2022). "తెలంగాణ సాహితీ ప్రస్థానంలో నవోదయం !". Archived from the original on 24 May 2022. Retrieved 24 May 2022.