సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం
సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం (IGMDP) భారత ప్రభుత్వం చేపట్టిన క్షిపణి తయారీ కార్యక్రమంలో భాగం. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ బోర్డు కలిసి ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నాయి.[1][2] ప్రాజెక్టు 1982–83 లో మొదలైంది. కొంత కాలం పాటు ప్రాజెక్టుకు అబ్దుల్ కలాం నాయకత్వం వహించారు, ఆయన నాయకత్వంలోనే, 2008లో, ప్రాజెక్టు పూర్తయింది. ఈ ప్రాజెక్టు నిర్మించిన చివరి క్షిపణి అగ్ని-3.[3]
2008 జనవరి 8 న IGMDP విజయవంతంగా పూర్తయిందని DRDO అధికారికంగా ప్రకటించింది.[2] తలపెట్టిన రూపకల్పన లక్ష్యాలు పూర్తయ్యాయి, క్షిపణులు చాలావరకు అభివృద్ధి అయ్యాయి, అవి భారత సైనిక బలగాల్లోకి చేరుకున్నాయి అని కూడా ప్రకటించింది.[4]
ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి, దాన్ని నిర్వహించిన అబ్దుల్ కలాం తరువాతి కాలంలో భారత రాష్ట్రపతి అయ్యాడు.[5]
చరిత్ర
[మార్చు]1980 ల ప్రారంభం నాటికి ప్రొపల్షన్, నేవిగేషన్, ఏరోస్పేస్ పదార్థాల తయారీలో DRDL కుశలత సాధించింది. ఈ సాంకేతిక సామర్థ్యాలన్నిటినీ దృఢపరచుకోవాలని అప్పటి ప్రధాని ఇందిరా గాంధి, రక్షణ మంత్రి ఆర్. వెంకట్రామన్, రక్షణ మంత్రి సలహాదారు వి.ఎస్.అరుణాచలం భావించారు.
ఈ ఆలోచనే సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమానికి దారితీసింది. ఎస్సెల్వీ-3 ప్రాజెక్టుకు డైరెక్టరుగా వ్యవహరించి, 1983 నుంచి DRDL డైరెక్టరుగా ఉన్న అబ్దుల్ కలామ్ ను ఈ కార్యక్రమానికి నాయకుడిగా నియమించారు. శాస్త్రవేత్తలు క్షిపణులను ఒకదాని తరువాత ఒకదాన్ని తయారు చెయ్యాలని సంకల్పించగా, అన్నిటినీ ఒక్కసారే అభివృద్ధి చేసే వీలుందేమో చూడమని రక్షణ మంత్రి వారిని ఆదేశించాడు. ఆ విధంగా IGMDP లో నాలుగు ప్రాజెక్టులు ఒక్కసారే మొదలయ్యాయి.:
- తక్కువ పరిధి, భూమి-నుండి-భూమికి క్షిపణి (పృథ్వి)
- తక్కువ పరిధి, తక్కువ ఎత్తు, భూమి-నుండి-గాలిలోకి క్షిపణి (త్రిశూల్)
- మధ్య పరిధి, భూమి-నుండి-గాలిలోకి క్షిపణి (ఆకాశ్)
- మూడవ తరం ట్యాంకు విధ్వంసక క్షిపణి (నాగ్)
అగ్ని క్షిపణిని భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సాంకేతికను ప్రదర్శించే వాహనంగా IGMDP రూపకల్పన చేసింది. తరువాత దీన్ని వివిధ పరిధులు కలిగిన బాలిస్టిక్ క్షిపణిగా తయారు చేసింది.[2] ఈ కార్యక్రమంలో భాగంగా క్షిపణి పరీక్షా స్థావరంగా చాందీపూర్ వద్ద ఇంటెరిం టెస్ట్ రేంజిని అభివృద్ధి చేసారు.[6]
అవాంతరాలు
[మార్చు]1988 లో పృథ్వి క్షిపణిని, 1989 లో అగ్ని క్షిపణిని తొలిసారి పరీక్షించిన తరువాత భారత క్షిపణి అభివృద్ధి కార్యక్రమానికి ఉపయోగపడే ఏ సాంకేతికతనూ అందకుండా మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ (MTCR) ఆంక్షలు విధించింది. దీన్ని ఎదుర్కొనేందుకు IGMDP, DRDO ప్రయోగశాలలు, పరిశ్రమలు, విద్యా సంస్థలను ఒకతాటిపైకి తెచ్చి క్షిపణికి అవసరమైన వ్యవస్థలను తయారుచెయ్యడం మొదలుపెట్టింది. ఈ కారణంగా క్షిపణి అభివృద్ధి మందగించినా, MTCR ఆంక్షల కారణంగా అందని అనేక సాంకేతిక అంశాలను దేశీయంగానే అభివృద్ధి చేసారు.[6]
పృథ్వి క్షిపణి వ్యవస్థ
[మార్చు]క్షిపణి | రకం | వార్‌హెడ్ | పేలోడ్(కెజి) | పరిధి (కి.మీ.) | పరిమాణం (మీ) | ఇంధనం/దశలు | బరువు (కెజి) | ఎప్పటినుండి
మోహరించారు |
వర్తుల దోష పరిధి (మీ) |
---|---|---|---|---|---|---|---|---|---|
పృథ్వి-I | వ్యూహాత్మక | Nuclear, HE, submunitions, FAE, chemical | 1,000 | 150 | 8.55X1.1 | ఒకే దశ, ద్రవ ఇంధనంతో | 4,400 | 1988 | 30–50 |
పృథ్వి-II | వ్యూహాత్మక | Nuclear, HE, submunitions, FAE, chemical | 350–750 | 350 | 8.55X1.1 | ఒకే దశ, ద్రవ ఇంధనంతో | 4,600 | 1996 | 10–15 |
పృథ్వి-III | వ్యూహాత్మక | Nuclear, HE, submunitions, FAE, chemical | 500–1,000 | 350–600 | 8.55X1 | ఒకే దశ, ఘన ఇంధనంతో | 5,600 | 2004 | 10–15 |
పృథ్వి భూమ్మీద నుండి భూమి మీదకు ప్రయోగించే, తక్కువ పరిధి, బాలిస్టిక్ క్షిపణుల కుటుంబం. ఇది దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మొట్టమొదటి క్షిపణి. 1983 లో అభివృద్ధి మొదలై 1988 ఫిబ్రవరి 25 న తొలి పరీక్ష శ్రీహరికోటలో జరిగింది. దాని పరిధి 150 నుండి 300 కి.మీ.. పృథ్వి-1, పృథ్వి-2 క్షిపణుల నావికా దళ కూర్పును ధనుష్ అని పెరు పెట్టారు. రెండూ కూడా సముద్రం నుండి భూమి మీది లక్ష్యాలను ఛేదించగలవు.
పృథ్వి ప్రొపల్షన్ సాంకేతికతను సోవియట్లకు చెందిన భూమి-నుండి-గాలి లోకి ప్రయోగించే SA-2 నుండి గ్రహించారని వినికిడి.[7] దీనిలోని వివిధ కూర్పులు ద్రవ ఇంధనాన్ని గానీ, ఘన, ద్రవ ఇంధనాలు రెండింటినీ గానీ వాడుతాయి. యుద్ధభూమి క్షిపణిగా అభివృద్ధి చేసిన పృథ్వి, అణు వార్‌హెడ్‌ను మోసుకుపోగలదు.
పృథ్వి క్షిపణి సైన్యానికి, నావికాదళానికి, వైమానిక దళానికీ కూడా ఉపయోగపడేలా మూడు రకాలను తయారుచెయ్యాలని IGMDP తొలుత భావించింది.[8] కాలక్రమేణా పృథ్వి యొక్క సాంకేతిక అంశాలు అనేక మార్పులకు లోనయ్యాయి. 1994 లో పృథ్వి-1 భారత సైన్యంలోకి చేరింది. ఈమధ్య వచ్చిన వార్తల ప్రకారం పృథ్వి-1 క్షిపణిని తొలగించి దాని స్థానంలో ప్రహార్ క్షిపణిని మోహరిస్తున్నారని తెలిసింది.[9] పృథ్వి-2 1996 లో సైన్యంలో చేర్చారు. పృథ్వి-3, 600 కి.మీ. పరిధి కలిగినది. ఇది 2004 లో భారత సైన్యంలో చేరింది.[10]
అగ్ని క్షిపణి వ్యవస్థ
[మార్చు]అగ్ని, మధ్యంతర పరిధి నుండి ఖండాంతర పరిధి కలిగిన బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ. మొదట్లో 1500 కి.మీ. పరిధితో సాంకేతిక ప్రదర్శనగా అభివృద్ధి చేసిన అగ్నిలో ఘన, ద్రవ ఇంధనాలు రెంటినీ వాడేవారు. ప్రయోగించే ముందు సిద్ధం చేసేందుకు చాలా సమయం పట్టేది. తదుపరి, ఉత్పత్తి స్థాయిలో అభివృద్ధి చేసిన అగ్ని రకాల్లో ఘన ఇంధనాన్ని మాత్రమే వాడారు. దీంతో శత్రువు దాడి చేస్తే వేగంగా ప్రతిచర్య చెయ్యగల వీలు కలిగింది.[11] తన అణు, క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కాదని, పాకిస్తాన్ నుంచి ఉన్న ప్రమాదం భారత భద్రతా వ్యవస్థలో ఒక చిన్న అంశమనీ భారత్ చెప్పింది. చైనా, భారత సమీకరణమనే పెద్ద అంశం విషయంలో "విశ్వసనీయ నిరోధకం" అభివృద్ధి చేసే కార్యక్రమంలో అగ్నికేంద్రస్థానంలో ఉంది.[12]
2008 లో IGMDP ముగిసిన తరువాత అగ్ని-6 ను స్వతంత్ర ప్రాజెక్టుగా చేపట్టారు.
క్షిపణి | ప్రాజెక్టు | రకం | వార్‌హెడ్ | పేలోడ్ (కెజి) | పరిధి (కి.మీ.) | పరిమాణం (మీ) | ఇంధన | బరువు (కెజి) | ఎప్పటినుండి పనిచేస్తోంది | వర్తుల దోష పరిధి (మీ) |
---|---|---|---|---|---|---|---|---|---|---|
అగ్ని-1 | IGMDP | వ్యూహాత్మక | Nuclear, HE, penetration, sub-munitions, FAE | 1,000 | 700–1,250 | 15X1 | ఒకే దశ, ఘన ఇంధనంతో | 12,000 | 2002 | 25 |
అగ్ని-2 | IGMDP | వ్యూహాత్మక | Nuclear, HE, penetration, sub-munitions, FAE | 750–1,000 | 2,000–3,500 | 20X1 | రెండున్నర దశలు, ఘన ఇంధనంతో | 16,000 | 1999 | 30 |
అగ్ని-3 | IGMDP | వ్యూహాత్మక | Nuclear, HE, penetration, sub-munitions, FAE | 2,000–2,500 | 3,500–5,000 | 17X2 | రెండు దశలు, ఘన ఇంధనంతో | 44,000
22,000 (తాజా కూర్పు) |
2011 | 40 |
అగ్ని-4 | అగ్ని-IV | వ్యూహాత్మక | Nuclear, HE, penetration, sub-munitions, FAE | 800–1,000 | 3,000–4,000 | 20X1 | రెండు దశలు, ఘన ఇంధనంతో | 17,000 | 2014 | |
అగ్ని-5 | అగ్ని-V | వ్యూహాత్మక | Nuclear, HE, penetration, sub-munitions, FAE | 1,500 (3–10 MIRV) | 5,500–8,000 | 17X2 | మూడు దశలు, ఘన ఇంధనంతో | 50,000 | పరీక్షించారు | <10 మీ |
అగ్ని-6 | అగ్ని-VI | వ్యూహాత్మక | Nuclear, HE, penetration, sub-munitions, FAE | 1,000 (10 MIRV) | 8,000-10,000 | 40X1.1 | మూడు దశలు, ఘన ఇంధనంతో | 55,000 | అభివృద్ధి దశ |
త్రిశూల్ క్షిపణి వ్యవస్థ
[మార్చు]భారత సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో తయారైన మరో క్షిపణి, భూమి-నుండి-గాలిలోని లక్ష్యాలను ఛేదించే త్రిశూల్. దాని పరిధి 12 కి.మీ.. అది 5.5 కెజి వార్‌హెడ్‌ను కలిగి ఉంటుంది. పొడవు 3.1 మీటర్లు, బరువు 135 కెజి.[13] తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ నౌకలపై దాడి చేసే క్షిపణులను నాశనం చేసే విధంగా ఈ క్షిపణిని తయారు చేసారు. 2008 ఫిబ్రవరి 27 న భారత్ ఈ ప్రాజెక్టును అధికారికంగా మూసేసింది.[14]
ఆకాశ్ క్షిపణి వ్యవస్థ
[మార్చు]ఆకాశ్ మధ్యంతర పరిధి గల, భూమి-నుండి-గాలిలోకి గురి పెట్టే క్షిపణి. భారత్ ప్రభుత్వం 20 వ శతాబ్దంలో చేపట్టిన క్షిపణి అభివృద్ధి కార్యక్రమాల్లో ఇది అత్యంత ఖరీదైనది. 12 కోట్ల డాలర్ల ఈ కార్యక్రమం ఖర్చు ఇలాంటి ఇతర వ్యవస్థల కంటే చాలా ఎక్కువ.[14]
720 కి.గ్రా. బరువుతో, 35 సెంమీ వ్యాసంతో, 5.8 మీటర్ల పొడవు కలిగిన ఆకాశ్ క్షిపణికి 30 కి.మీ. పరిధి ఉంది. ఆకాశ్ మ్యాక్ 2.5 వేగంతో ప్రయాణిస్తుంది. ఇది 18 కి.మీ. ఎత్తుకు చేరుతుంది. ఇది ఘన ఇంధనంతో పని చేస్తుంది. ఆకాశ్ వ్యవస్థ బహుళ లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించగలదు. ఆకాశ్ యొక్క ర్యామ్‌జెట్ ప్రొపల్షను వ్యవస్థ కారణంగా వేగం తగ్గకుండా ప్రయాణిస్తుంది. దీనితో పోల్చగల క్షిపణి -పేట్రియాట్‌లో వేగం తగ్గుతుంది.[15] ఆకాశ్ క్షిపణిలో బహు లక్ష్యాల, బహు ఫంక్షన్ల ఫేస్‌డ్ ఎర్రే రాడారైన రాజేంద్ర రాడార్ ను స్థాపించారు. ఈ రాడారుకు 80 కి.మీ. అన్వేషణ పరిధి, 60 కి.మీ. ఎంగేజిమెంటు పరిధి ఉంది.[16]
ఆకాశ్ క్షిపణికి స్వంత గైడెన్స్ లేదు. అది పూర్తిగా రాడారుపై ఆధారపడుతుంది. శత్రు విమానాలు చేసే జామింగు నుండి ఇది రక్షిస్తుంది. శత్రు విమానాల స్వీయ రక్షణ జామింగు వ్యవస్థ ఎంతో శక్తివంతమైన రాజేంద్రకు వ్యతిరేకంగా పనిచెయ్యాల్సి ఉంటుంది. పైగా ఆకాశ్ దాడి చేస్తున్న విమానానికి, దాడి గురించి తెలిసే టర్మినల్ సీకర్ లాంటిదేమీ ఆకాశ్‌లో ఉండదు.
భారత సైన్యంలోని ఆకాశ్ T-72 ట్యాంకు చాసిస్‌ను లాంచరుగానూ, రాడార్ వాహనంగానూ వాడుతారు. వైమానిక దళం, అశోక్ లేల్యాండ్ ట్రక్కును క్షిపణి లాంచరును లాగేందుకు, BMP-2 ను రాడారు కోసమూ వాడుతుంది. రెండు లాంచర్లు కూడా మూడేసి ఆకాశ్ క్షిపణులను మోయగలవు. ఆకాశ్ వ్యవస్థను రైలు, రోడ్డు, విమానాల ద్వారా మోహరించవచ్చు.
ఆకాశ్ మొదటి పరీక్ష 1990 లోను, అభివృద్ధి పరీక్షలు 1997 మార్చి వరకూ జరిగాయి. 2007 లో భారత వైమానిక దళం ఆకాశ్ పరీక్షలు పూర్తి చేసి, 2 స్క్వాడ్రన్లను తన దళంలోకి చేర్చుకుంది. 2010 ఫిబ్రవరిలో మరో 6 స్క్వాడ్రన్లకు ఆర్డరిచ్చింది.
నాగ్ క్షిపణి వ్యవస్థ
[మార్చు]నాగ్ మూడవ తరం ట్యాంకు విధ్వంసక క్షిపణి. దీనికి 3 నుండి 7 కి.మీ. పరిధి ఉంది.
నాగ్ 8 కెజిల HEAT వార్‌హెడ్‌ను వాడుతుంది. దీనికి ERA (Explosive Reactive Armour), కాంపోజిట్ ఆర్మర్ వంటి రక్షక కవచాలను ఛేదించగల శక్తి ఉంది. దీనిలో రేయింబవలు పనిచేసే సత్తా గల Imaging Infra-Red (IIR) గైడెన్స్ వ్యవస్థ ఉంది. ప్రయోగించేటపుడు IIR స్థితి LOBL (Lock on Before Launch) లో ఉంటుంది. హెలికాప్టరు నుండి ప్రయోగించగల కూర్పు కూడా నాగ్‌లో ఉంది.
సైన్యానికి, వైమానిక దళానికీ వేర్వేరు కూర్పులను తయారు చేస్తున్నారు. సైన్యంలో ఈ క్షిపణిని మోసుకెళ్ళేందుకు (NAMICA-Nag Missile Carrier) అనే వాహనాలను వాడుతారు. NAMICAలో లక్ష్యాన్ని చేరుకోగల థెర్మోగ్రాఫిక్ కెమెరా ఉంది. ఈ వాహనాలు ఒక్కొక్కదానికీ 4 క్షిపణులను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంది.
2005 మార్చి 19 న నాగ్‌ను 45 వ సారి అహ్మద్‌నగర్ లోని పరీక్షా కేంద్రంలో పరీక్షించారు. ఆ తరువాత సైన్యంలో చేర్చారు.
ఇతర అభివృద్ధి కార్యక్రమాలు
[మార్చు]క్షిపణి అభివృద్ధిలో ఎదురైన అనేక విజయాలు, అపజయాలు 1990 ల్లో ఈ కార్యక్రమ విస్తరణకు దారితీసాయి. దూర పరిధి అగ్ని క్షిపణి, సాగరిక (కె-15) అనే జలంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి, 8,000–12,000 కి.మీ. పరిధి గల సూర్య అనే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణీ విస్తరించిన కార్యక్రమంలో ఉన్నాయి.[17]
ఒక సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి వ్యవస్థను సంయుక్తంగా కల్పించి, అభివృద్ధి చేసి, తయారు చేసి, అమ్మకం చేసేందుకు గాను 1998 లో భారత్ రష్యా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ (BAPL) అనే సంస్థను ఏర్పాటు చేసింది. 2006 లో ఈ ప్రతిపాదన విజయవంతంగా నెరవేరి, బ్రహ్మోస్ క్షిపణి తయారైంది. ఈ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భూమి, ఓడ, జలాంతర్గామి, విమానాల నుండి ప్రయోగించవచ్చు. మ్యాక్ 2.5 నుండి 2.8 వరకూ వేగంగల ఈ క్షిపణి ప్రపంచంలోనే అత్యధిక వేగం కలిగినది. మ్యాక్ 8 వేగం గల బ్రహ్మోస్-2 ను తయారు చెయ్యాలని BAPL ప్రతిపాదించింది. ఈ మొట్టమొదటి హైపర్‌సోనిక్ క్షిపణి 2016-17 లో సిద్ధం కావచ్చని ఆశిస్తున్నారు. ప్రయోగశాల పరీక్షలు మొదలయ్యాయి.[18]
డా.ఎస్ ప్రహ్లాద (మాజీ-DRDO డైరెక్టరు) చెప్పిన ప్రకారం, ఇకపై కొత్త క్షిపణి, ఆయుధ వ్యవస్థలను ఐదేళ్ళ కార్యక్రమాల్లో తయారు చేస్తారు. ఖర్చులు తగ్గించుకునేందుకు గాను భారత ప్రైవేటు సంస్థలు, విదేశీ సంస్థలు కూడా ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటాయి. స్వతంత్రంగా జరుగుతున్న నాగ్, సూర్య క్షిపణుల అభివృద్ధి అలాగే కొనసాగుతుంది.[19] వీటితోపాటు లేజర్ ఆధారిత క్షిపణి నిరోధక వ్యవస్థను కూడా DRDO అభివృద్ధి చేస్తోంది. భారత్‌పై శత్రువు ప్రయోగించిన క్షిపణిని వెనువెంటనే గుర్తించి, అడ్డుకుని, నాశనం చేసే వ్యవస్థే ఇది.[20]
2008 నుండి తలపెట్టిన ప్రాజెక్టులు విడిగా దేనికదే అభివృద్ధి చెయ్యడం (ఉదాహరణకు అగ్ని), వ్యూహాత్మక వ్యవస్థలను విదేశీ సంస్థలతో సంయుక్తంగా నిర్మించడం చేస్తున్నారు.[21]
భారత్ నిర్భయ్ అనే ఓ కొత్త క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి చేస్తోంది. ఈ అభివృద్ధి మధ్యంతర స్థితిలో ఉంది. ఇది 6 మీటర్ల పొడవు, 520 మిమీ వ్యాసం, 1 టన్ను బరువు, 1000కి.మీ. పరిధీ కలిగి ఉంటుంది. దీని వేగం మ్యాక్ 0.7.[22] ఇప్పటివరకు జరిపిన నాలుగు పరీక్షలలో మొదటిది, మూడోది, నాలుగోది విఫలం కాగా, రెండోది పాక్షికంగా విజయవంతమయింది.
2008 సెప్టెంబరులో భారత శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఒక సాంకేతికత కారణంగా క్షిపణుల పరిధిని 40% వరకు పెంచగల సామర్థ్యం ఏర్పడింది. క్షిపణి ముందు కొనకు రాసిన క్రోమియం పూత కారణంగా ఇది సాధ్యపడింది.[23]
పినాక రాకెట్ వ్యవస్థకు పృథ్వి క్షిపణికీ మధ్య నున్న అంతరాన్ని పూడ్చేందుకు ఒక వ్యూహాత్మక క్షిపణిని అభివృద్ధి చేసారు. 2011 జూలై 17 న మొదటి పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. ప్రహార్అని పేరు పెట్టిన ఈ క్షిపణి పరిధి 150 కి.మీ. ఈ క్షిపణిని మోసుకెళ్ళేందుకు రోడ్డు మొబైలు లాంచరును తయారు చేసారు. ఏకకాలంలో ఇది 6 క్షిపణులను మోసుకు పోగలదు.[24] ప్రహార్ యొక్క ఎగుమతి చేసే కూర్పుకు ప్రగతి అని పేరు పెట్టారు. 2014 నవంబరులో ఈ క్షిపణి ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది.[25]
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతీయ బాలిస్టిక్ క్షిపణి రక్షణ కార్యక్రమం
- పృథ్వి క్షిపణులు
- అగ్ని క్షిపణులు
- సాగరిక
- అబ్దుల్ కలామ్ ద్వీపం
బయటి లింకులు
[మార్చు]మూలాలు, వనరులు
[మార్చు]- ↑ "Indian Ordnance Factories: Ordnance Factory Itarsi". Ofb.gov.in. Retrieved 2012-12-24.
- ↑ 2.0 2.1 2.2 "Integrated Guided Missile Development Program". Archived from the original on 21 మార్చి 2012. Retrieved 9 June 2012.
- ↑ "Agni III Launched Successfully". Press Information Bureau, Government of India. New Delhi, India. 12 April 2007. Retrieved 9 June 2012.
- ↑ "India scraps integrated guided missile programme". The Hindu. Chennai, India. 9 January 2008. Archived from the original on 4 నవంబరు 2012. Retrieved 9 June 2012.
- ↑ "Biography: Avul Pakir Jainulabdeen Abdul Kalam". Vigyan Prasar Science Portal. Archived from the original on 2007-03-09. Retrieved 2007-05-14.
- ↑ 6.0 6.1 T. S., Subramanian (31 January 2009). "Missile shield". Frontline. India. Retrieved 31 May 2012.
- ↑ John Pike. "Prithvi – India Missile Special Weapons Delivery Systems". Globalsecurity.org. Retrieved 2010-10-08.
- ↑ Centre for Non Proliferation Studies Archive Archived 2001-12-02 at the Library of Congress Web Archives accessed 18 October 2006.
- ↑ "After 17 years in service, the Prithvi I missile will give way to smaller and better Prahar". defense-update.com. Retrieved 2013-07-01.
- ↑ "Dhanush/Sagarika (Project K-15) (India) – Jane's Naval Weapon Systems". Janes.com. Retrieved 2012-12-24.
- ↑ "The Indian Drive towards Weaponization: the Agni Missile Program". Fas.org. Retrieved 2012-12-24.
- ↑ "Feature". Pib.nic.in. Retrieved 2012-12-24.
- ↑ "Trishul Surface To Air Missile Not A Failure Says Government". India-defence.com. 17 May 2007. Retrieved 2010-08-31.
- ↑ 14.0 14.1 "India Shuts Down Trishul Missile Project" Rediff.com 27 February 2008
- ↑ T.S. Subramanian (11 December 2005) "Akash missile achieves a milestone" Archived 2005-12-12 at the Wayback Machine The Hindu'.'
- ↑ Global Security.
- ↑ John Pike. "Surya – India Missile Special Weapons Delivery Systems". Globalsecurity.org. Retrieved 2010-08-31.
- ↑ BrahMos Website Archived 2003-10-03 at the Wayback Machine accessed 18 October 2006.
- ↑ "The Hindu News Update Service". Chennai, India: Hindu.com. 29 January 2008. Archived from the original on 2011-02-01. Retrieved 2010-08-31.
- ↑ "The Hindu News Update Service". Chennai, India: Hindu.com. 18 January 2009. Archived from the original on 2011-02-01. Retrieved 2010-08-31.
- ↑ "The Hindu News Update Service". Chennai, India: Hindu.com. 9 January 2008. Archived from the original on 2010-11-12. Retrieved 2010-08-31.
- ↑ "India's New Missile on the Cards". Newspostindia.com. Archived from the original on 2007-07-01. Retrieved 2010-08-31.
- ↑ "New tech to boost missile range by 40%". The Times of India. 10 September 2008. Archived from the original on 2016-03-05. Retrieved 2016-07-24.
- ↑ India all set to test new short-range tactical missile
- ↑ "Tactical Missile Pragati Readied for Export". Indian Express. 5 Nov 2014. Archived from the original on 6 నవంబరు 2014. Retrieved 24 జూలై 2016.