సాహితీ రూపకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్ర సాహిత్యంలో ఎన్నో ప్రయోగాలు, ఎన్నెన్నో సంవిధానాలు, ఎన్నెన్నో ప్రక్రియలు చోటు చేసుకున్నాయి. వాటిలో సాహితీ రూపకాలు కొన్ని. రూపకం అంటే నటులు ఆయా పాత్రల రూపాలను ఆరోపించుకొని అభినయించడం. అయితే సాహితీ రూపకాలలో పాల్గొనేవారు ఉద్దండ పండితులు, కవులు. అంతే కాని నటులు కారు. మామూలు నాటకాలలో అయితే నటులు అవసరమైన వేషధారణ చేసుకుని నాటక రచయిత వ్రాసిన దానిని కంఠస్థం చేసుకుని అభినయించటం జరుగుతుంది. ఈ సాహితీరూపకాలలో పాల్గొనే కవులంతా స్వయంగా రచయితలు కాబట్టి వీరికి మరొకరు వ్రాసియివ్వవలసిన అవసరంలేదు. అప్పటికి అప్పుడు సద్యస్ఫూర్తితో పద్యాలు చెప్పుతూ, చమత్కారాలు సృష్టిస్తూ, కావ్య ప్రసంగాలు చేస్తూ, సమస్యలు పూరిస్తూ సహజమైన సాహితీగోష్ఠిని తలపించే స్థితి ఈ సాహితీ రూపకాల లక్షణం.

కొన్ని సాహితీ రూపకాలు:

భువన విజయము

[మార్చు]

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. ఇతడి ఆస్థానంలో సంస్కృతాంధ్ర, కన్నడ, తమిళ కవులెందరో ఉండేవారు. వారిలో ఎనిమిది మందికి అష్టదిగ్గజాలు అనే పేరు వచ్చింది. ఇతడు తన సభలో ఎనిమిది దిక్కులా ఎనిమిది సింహాసనాలు ఏర్ఫాటు చేసి అల్లసాని పెద్దన మొదలైన కవులను సింహాసనాలపై ఆసీనులను చేసి గోష్ఠి జరిపేవాడు అని ప్రతీతి. దీనిని స్ఫూర్తిగా తీసుకుని 1952 ప్రాంతాలలో గుంటూరులోని ఏకా ఆంజనేయులు అనే సంపన్నుడికి పెద్దనాది కవులుగా విశ్వనాథ సత్యనారాయణ వంటి పెద్ద కవులను ఆహ్వానించి రాయలుగా ఎవరైనా సాహితీప్రియుడైన ప్రముఖవ్యక్తిని కూచోబెట్టి గోష్ఠి నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అతడి ఆలోచనకు జమ్మలమడక మాధవరామశర్మ రూపకల్పన చేశాడు. ఆవిధంగా మొట్టమొదటి భువనవిజయ రూపకం గుంటూరులో ప్రారంభమైంది. దీనిలో జమ్మలమడక మాధవరామశర్మ తిమ్మరుసు గాను, విశ్వనాథ సత్యనారాయణ పెద్దన గాను, మోచర్ల రామకృష్ణయ్య , వేదాంతకవి ప్రభృతులు వివిధ పాత్రలను ధరించారు. హైకోర్టు నాయమూర్తి కందా భీమశంకరం శ్రీకృష్ణదేవరాయల పాత్రను పోషించాడు. వీరంతా సాంప్రదాయ సూచకమైన ధోవతి, శాలువా, లాల్చీలే తప్ప ప్రత్యేకమైన వేషధారణ చేసుకోలేదు.

ఆనాటి నుండి భువన విజయము పేరుతో ఆంధ్రరాష్ట్రం నలుమూలలా కొన్ని వేల ప్రదర్శనలు జరిగాయి. తెలంగాణా ప్రాంతములో దివాకర్ల వేంకటావధాని దీనిని ఒక నాటకంగా రచించి, కొంతమంది విద్యాంసులను ఎంపికచేసి, వాళ్ళచేత వేషధారణ చేయించి, రంగులు పూయించి కొన్ని వందల ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు. తెలుగు రాష్ట్రంలోనే కాక వివిధ రాష్ట్రాలలో తెలుగువారున్న ప్రతిచోటా ఈ సాహితీరూపకం ప్రదర్శింపబడింది. అంతే కాకుండా తానా సంస్థ సహకారంతో అమెరికాలో న్యూయార్క్, పిట్స్‌బర్గ్, న్యూజెర్సీ, డెట్రాయిట్, చికాగో, డెన్వర్, లాస్ ఏంజిలిస్, శాన్ ఫ్రాన్సిస్కో మొదలైన నగరాలలో ప్రదర్శింపబడింది. ఈ రూపకాలలో ఆయా పాత్రధారుల సాహితీప్రాభవము, సమయస్ఫూర్తి, ఆశుకవితా ప్రజ్ఞ ఈ ప్రక్రియకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది.

శ్రీకృష్ణ దేవరాయలు పాత్రను పోషించిన ప్రముఖులు

[మార్చు]

ఆవుల సాంబశివరావు, జి.రామానుజులునాయుడు, కె.పి.నారాయణరావు, కనుమలూరు వెంకటశివయ్య, ఐ.వి.సుబ్బారావు, ఎస్.వి.జోగారావు, జూపూడి యజ్ఞనారాయణ, పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు మొదలైన ప్రముఖులెందరో రాయల పాత్రను ధరించి భువన విజయ రూపకానికి గౌరవం చేకూర్చారు.

అష్టదిగ్గజ కవులు, తిమ్మరుసు పాత్రలు ధరించిన కొందరు ప్రముఖులు

[మార్చు]

ప్రసాదరాయ కులపతి, పొత్తూరి వెంకటేశ్వర రావు, పిరాట్ల వెంకటేశ్వర్లు,జంధ్యాల పాపయ్యశాస్త్రి, ఓరుగంటి నీలకంఠశాస్త్రి, వావిలాల సోమయాజులు, ఏలూరిపాటి అనంతరామయ్య, కోగంటి సీతారామాచార్యులు, మేడసాని మోహన్, తంగిరాల వెంకట సుబ్బారావు, ముదిగొండ శివప్రసాద్, గుండవరపు లక్ష్మీనారాయణ, జంధ్యాల మహతీశంకర్, కడిమెళ్ళ వరప్రసాద్, అక్కిరాజు సుందర రామకృష్ణ, మాడుగుల నాగఫణిశర్మ, మొవ్వ వృషాధిపతి, పింగళి వెంకటకృష్ణారావు, పింగళి జగన్నాథరావు, గండ్లూరి దత్తాత్రేయశర్మ,డా. రాయప్రోలు వేంకట కామేశ్వరశర్మ, వద్దిపర్తి పద్మాకర్ మొదలైనవారు.

ఇంద్రసభ

[మార్చు]

భువన విజయము విజయవంతంగా ప్రదర్శన జరుగుతుంటే ఎప్పుడూ అష్టదిగ్గజ కవులేనా? నన్నయ, తిక్కన, శ్రీనాథుడు ఇలా వివిధకాలాల కవులను ఒకే వేదికపై కలిపే ఆలోచన కలిగి మరిన్ని సాహితీరూపకాలు సృజించబడ్డాయి. ఇంద్రసభలో భిన్నకాలాలకు చెందిన కవులు స్వర్గలోకంలో గోష్టి జరిపితే ఎలా ఉంటుందో ఈ రూపకంలో కల్పించబడింది. ఇంద్రుడు లేదా బృహస్పతి ఈ సభను నిర్వహిస్తారు.

యమసభ

[మార్చు]

పురాణ ప్రబంధ కవులనుండి, అధునాతన విప్లవ కవులదాకా ప్రతి ప్రక్రియలోనూ పండితులు సమాధానం చెప్తారు. చిత్రగుప్తుడు నిర్వాహకుడు.

సాహిత్య ధర్మాసనం

[మార్చు]

ఇది కూడా యమసభ వంటిదే. న్యాయమూర్తి ముందు జరిగే విచారణలో కవులు పాల్గొంటారు.

శృంగార ధర్మాసనం

[మార్చు]

ప్రబంధ నాయికలు వరూధిని, సత్యభామ మొదలైనవారు తమ పాత్రలను చిత్రించటంలో రచయితలు చేసిన అన్యాయాలపై ఆరోపణలు చేయటం - వాటి విచారణ. ఒక్కొక్కసారి నాయికా పాత్రల తరఫున న్యాయవాదులుగా పండితులు పాల్గొంటారు.

సరస్వతీ సామ్రాజ్యం

[మార్చు]

దివ్యలోకాలలో సరస్వతీదేవి సన్నిధిలో భిన్నకాలాల కవుల గోష్ఠి. సరస్వతిగా ఒక రచయిత్రిగాని, ప్రముఖ స్త్రీగాని ఉంటారు. నారద పాత్రధారి గోష్ఠిని నిర్వహిస్తాడు.

శ్రీదేవీ సాహితీసభ

[మార్చు]

పరమేశ్వరీ భక్తులైన కవుల సభ.

మణిద్వీప సభ

[మార్చు]

దీనిలో సప్తర్షులుగా కవులు పాల్గొంటారు.

కైలాస సాహితీసభ

[మార్చు]

శివలోకంలో శివభక్తులైన కవుల సభ. శివుడు లేదా నంది ఈ సభ నిర్వహిస్తారు.

వైష్ణవ సాహితీసభ

[మార్చు]

విష్ణులోకంలో విష్ణుభక్తులైన కవుల సభ. విష్ణువు లేదా నారదుడు ఈ సభను నిర్వహిస్తారు.

వైకుంఠ సాహితీసభ

[మార్చు]

వేంకటేశ్వరస్వామి సన్నిధిలో కవులగోష్ఠి.

వైకుంఠరానసభ

[మార్చు]

రామభక్తులైన కవుల గోష్ఠి.

శ్రీరామ సాహితీసభ

[మార్చు]

దీనిలో కవులుగాని రామాయణ పాత్రలు కాని ఉంటాయి.

భారత సభ

[మార్చు]

నారాయణుని సన్నిధిలో కాని, వ్యాసుని సన్నిధిలో కాని భారతరచయితల గోష్ఠి.

భారతావరణ సభ

[మార్చు]

నన్నయ భారతరచన ప్రారంభాన్ని తెలిపే సభ.

మనుమసిద్ధి సభ

[మార్చు]

తిక్కన భారతావరణం తెలిపే సభ.

ఎర్రన సభ

[మార్చు]

ఎర్రాప్రగడ భారతాది గ్రంథరచన తెలిపే సభ.

భారత ధర్మాసనం

[మార్చు]

కౌరవ పాండవ పక్షాల న్యాయనిర్ణయ సభ.

హరిహరనాథ సభ

[మార్చు]

తిక్కనతో పాటు శైవ వైష్ణవ కవులు పాల్గొనే సభ.

బ్రహ్మ సభ

[మార్చు]

సత్యలోకంలో భిన్నకాలాలకు చెందిన కవులు పాల్గొనే సభ. దక్షుడు కాని, బ్రహ్మ కాని సభను నిర్వహిస్తారు.

నవరస తరంగిణి

[మార్చు]

రసానంద స్వరూపాన్ని వివరించే రూపకము. రస ప్రతినిధులుగా కవులు పాల్గొంటారు. రసబ్రహ్మ నిర్వహిస్తాడు.

చంద్ర సభ

[మార్చు]

చంద్రుడు కళానిధి కనుక ఈ సభలో కవులతో పాటు సంగీత నాటక ప్రతినిధులు కూడా పాల్గొంటారు. చంద్రుడు లేదా మన్మథుడు నిర్వహిస్తారు.

కొండవీటిసభ

[మార్చు]

పెదకోమటివేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారి శ్రీనాథుడు నిర్వహించేసభ. వామనభట్టు మొదలైన పండితులతో సాహిత్య యుద్ధం.

కనకాభిషేక సభ

[మార్చు]

ప్రౌఢరాయల ఆస్థానంలో డిండిమభట్టును ఓడించి శ్రీనాథుడు కనకాభిషేకం పొందిన ఘట్టం.

త్రైలోక్యవిజయము

[మార్చు]

రాజమండ్రి పాలకులైన వీరభద్రారెడ్డి వేమారెడ్డి సభలో శ్రీనాథుడు కాశీఖండ కృతి సమర్పణ.

రఘునాథనాయకుని సభ

[మార్చు]

దక్షిణదేశ రాయల ఆస్థానంలో జరిగిన కవుల గోష్ఠి.

విజయరాఘవనాయక సభ

[మార్చు]

ఇది రఘునాథనాయకుని కుమారుని సభ. దీనిలో ఆనాటి కవులు రంగాజమ్మ మొదలైనవారు ఉంటారు.

సాహిత్య విధాన సభ

[మార్చు]

గవర్నరు, ముఖ్యమంత్రి, స్పీకరు, శాసనసభ్యులు, ప్రతిపక్షనాయకులు, ప్రతిపక్షసభ్యులు వీరితో సాహిత్య ప్రక్రియలు, వాటి ప్రభావము, సమాజావసరాలు మొదలైన వాటి గురించి చర్చించుట.

ఆనందగజపతి సభ

[మార్చు]

విజయనగర పరిపాలకుడైన ఆనంద గజపతి కవితాపోషణ చేసిన రాజసభ.

కృష్ణాపత్రిక దర్బారు

[మార్చు]

కృష్ణాపత్రిక ఆఫీసులో రచయిత గోష్ఠి.

త్రిభువన విజయము

[మార్చు]

పుట్టపర్తిలో సత్యసాయిబాబాను త్రిభువనాధిపతిగా భావించి చేసిన మహాసభ.

ఇందిరా మందిరం

[మార్చు]

శారదా విజయం

[మార్చు]

తెలుగు దర్బారు

[మార్చు]

గణపతి విజయం

[మార్చు]

తెలుగు విదుషీమణులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

భువనవిజయము సాహితీరూపకచరిత్ర - ప్రసాదరాయకులపతి -2006- పేజీలు 2-9