Jump to content

కమ్మ

వికీపీడియా నుండి

కమ్మ (Kamma) అనునది భారతదేశంలో ఒక కులం లేక సామాజిక వర్గం.[1] కమ్మ కులం వారిని కమ్మలు లేక కమ్మవారు అంటారు.కమ్మవారు ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ జనాభాలో 5 నుండి 6% ఉంటారని అంచనా.[2][3] వీరి భాష తెలుగు. కొంతమంది కమ్మవారు తమ కులనామం అయిన "కమ్మ" అనే పేరునే తమ ఇంటిపేరుగా మరికొంత మంది కమ్మవారు పేరులో చౌదరి, నాయుడు గౌరవ బిరుదుగా ఉపయోగిస్తున్నారు.[4] 1910లో కృష్ణా జిల్లా కౌతారంలో మొదటి కమ్మ మహాసభ జరిగింది.కంఠంనేని వెంకట రంగయ్య, బొబ్బా పద్మ నాబయ్య [5] కీలక పాత్ర పోషించారు

చరిత్ర

కాకతీయుల పతనం అనంతరం ఢిల్లీ సుల్తానులు ఓడించి స్వతంత్ర రాజ్యం స్థాపించిన ముసునూరి కాపయ నాయకుడు

పుట్టు పూర్వోత్తరాలు

కమ్మ అన్న పదం సా.శ. ఒకటో శతాబ్దం నుంచి ఉంది.[6] కమ్మవారి పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర విషయంలో పలు సిద్ధాంతాలు, వాదనలు ఉన్నాయి. గుండ్లకమ్మ, పేరికమ్మ (కృష్ణానది) నదుల మద్య ఉన్న ప్రాంతాలను ప్రాచీన ప్రాంత విభాగమైన కమ్మనాడుగా పిలిచేవారనీ, ఆ ప్రాంతంతో మూలాలు ముడిపడివుండడంతో ఈ కులానికి కమ్మ అన్న పేరు వచ్చినట్టు చెప్తారు. ప్రధానంగా దీని ప్రకారం వీరు ఈ ప్రాంతానికి స్థానికులు, వ్యవసాయదారులు.

పలువురు కమ్మ కులస్తులైన చరిత్రకారులు రాసిన కుల చరిత్రల్లో మూలాలకు సంబంధించి మరో కథనం వ్యాప్తిలో ఉంది. దాని ప్రకారం వీరు సామాన్య శక పూర్వం గంగా మైదానంలోని కర్మ రాష్ట్రానికి చెందిన బౌద్ధులనీ, సా.శ.పూ. 184 సమయంలో రాజ్యానికి వచ్చిన పుష్యమిత్ర సుంగుని కాలంలో పెద్ద సంఖ్యలో దక్షిణాదిన ఉన్న కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి వలసవచ్చారనీ చెప్తారు. సంస్కృతంలోని కర్మ పదం పాళి భాషలోని కమ్మగా మారిందనీ, ఆ పదాన్నే వీరు వెంట తీసుకువచ్చి తమను కమ్మ కులస్తులుగా చెప్పుకున్నారనీ ఈ ప్రత్యామ్నాయ కథనం చెప్తోంది. ఈ సిద్ధాంతం కృష్ణా పరీవాహక ప్రాంతాల్లోని బౌద్ధ సంస్కృతిని వారు కమ్మ రాష్ట్రం నుంచి తీసుకువచ్చారని పేర్కొంటోంది. మరికొన్ని భేదాలతో ఇటువంటి సిద్ధాంతాలు విరవిగా కనిపిస్తున్నాయి. సా.శ. పదో శతాబ్దం నుంచి కమ్మ వారు కులంగా ఉన్నట్టు ప్రస్తావనలు ఉన్నాయి. ఐతే కమ్మనాడు సంబంధించిన మిగతా వర్గములను కూడా చారిత్రకముగా కమ్మబ్రాహ్మణులు, కమ్మకాపులు, కమ్మకోమటులు అని పిలిచేవారు. కాలక్రమములో ఈ భౌగోళిక సూచన కమ్మవారికి మాత్రమే కులనామముగా మిగిలిపోయింది.

వృత్తులు

కమ్మవారు ఎక్కువగా ఆంధపాంతం లోని కృష్ణా గుంటూరు జోల్లాలలో ఉన్నారు. అత్యు త్తమంగా వ్యవసాయం చేయగల వారిలో పీరు (ప్రభఛానంగా చెప్పుకోదగిన వారు. పీరు తాము నివసించు (పొంతాలలో జాగా కృషి చెసి, చక్కని పంటలు పండించి ఆయా 'పాంతాలను సస్య శ్యామలం చేశారు. ఆధునిక పద్ధతుల (ప్రకారం "వ్యవ సాయంచేసి ఆదాయం వృద్ధి చేసుకొనడం ద్వారానూ పొదుపరితనంవల్లనూ పీరు సాధారణంగా. సిరినంప దలు గల్నరెదావారు. పీరిలో (స్త్రీలకు మంచి గొరవ (పతిపత్తులు కలవు[7]

రాజ్యపాలన, సైనిక వృత్తి

కాకతీయ సామ్రాజ్యంలో కమ్మవారు సైన్యాధ్యక్ష హోదా నుంచి పలు సైనిక పదవుల్లోనూ, సైన్య భాగంలోనూ ఉండేవారు. కాకతీయ సామ్రాజ్యం పతనం చెందాకా కాకతీయ సేనానులు కమ్మ నాయకులైన ముసునూరి ప్రోలయ నాయకుడి నాయకత్వంలో తిరుగుబాటు చేసి ఓరుగల్లు స్వాధీనం చేసుకున్నారు. సంక్లిష్టమైన దశాబ్దాల్లో కమ్మవారైన ముసునూరి నాయకులు ఓరుగల్లు రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించి, దక్షిణ భారతదేశంలో హైందవ రాజవంశాలు పట్టు సంపాదించేందుకు వీలిచ్చారు.[8] కమ్మ కులస్తులు తాము ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్నాక ఓరుగల్లు పేరును, ఓరుగల్లు తోరణం వంటి చిహ్నాలను తమ కుల సంఘాలు, కాలనీలు, ప్రదేశాలకు ఔన్నత్య సూచకంగా ఉపయోగించారు. ముసునూరి నాయకుల రాజ్యం పతనం చెందాక విజయనగర సామ్రాజ్యంలో సైనిక విభాగంలోనూ, సామంత రాజులుగానూ కమ్మవారు పనిచేశారు. ఈ క్రమంలో విజయనగర సామ్రాజ్య విస్తరణలో భాగంగా నేటి తమిళనాడు ప్రాంతాలకు సైనికుల నుంచి సైన్యాధ్యక్షుల వరకూ పలు హోదాల్లో కమ్మవారు వెళ్ళారు. అమర నాయకులుగా, దండ నాయకులుగా ఉంటూ స్థానికంగా ఒక పక్క రాజకీయ నాయకత్వం, మరోపక్క వ్యవసాయ వృత్తి చేపట్టి స్థిరపడ్డారు. వాసిరెడ్డి, శాయపనేని, పెమ్మసాని, రావెళ్ళ, యార్లగడ్డ, సూర్యదేవర వంటి కమ్మవారి వంశాలు సంస్థానాలను పరిపాలించాయి.[9]

వ్యవసాయం

నేటి పశ్చిమగోదావరి జిల్లాలో కొంత భాగం, కృష్ణా, గుంటూరు జిల్లాలు కలిసిన ఉమ్మడి కృష్ణా జిల్లాలో కృష్ణా నదీ బేసిన్: కమ్మవారు వ్యవసాయదారులుగా దీర్ఘకాలంగా వున్న ప్రాంతం (లేత పసుపు రంగులో గుర్తించి ఉంది)

విజయనగర సామ్రాజ్య కాలంలోనూ, కాకతీయ కాలంలోనూ ముమ్మరంగా, ఆపైన కొంతమేరకు సైనిక, రాజకీయ, పరిపాలన వృత్తుల్లో పనిచేసినా, కమ్మవారికి శతాబ్దాలుగా వ్యవసాయం ప్రధాన వృత్తిగా కొనసాగింది. ప్రధానంగా కృష్ణా డెల్టా ప్రాంతంలో 20 శాతం జనాభా, 80 శాతం వ్యవసాయ భూమి వీరిదేనని ఒక అంచనా. విజయనగర సామ్రాజ్య పరిపాలనా కాలంలో సైనిక హోదాల్లో పనిచేసిన వీరు, దక్షిణాంధ్ర ప్రాంతాల (నేటి తమిళనాడు)ను ఆక్రమించడంలో సాయం చేశారు. యుద్ధంలో పనిచేసి, శాంతి సమయంలో అక్కడే భూములు సాధించుకుని స్థిరపడ్డారు. గణనీయమైన సంఖ్యలో నేటి తమిళనాడు ప్రాంతాల్లో స్థిరపడ్డ వీరు అప్పటికే ఉన్న వ్యవసాయ భూములను, కొత్తగా అడవులను కొట్టి సాగులోకి తెచ్చిన భూములను సాగుచేశారు.[10] హైదరాబాద్ సంస్థానాన్ని నిజాంలు పరిపాలిస్తున్న కాలంలో స్థానిక రాజకీయ సంతులన కోసం, రెవెన్యూ వృద్ధి కోసం కృష్ణా డెల్టా నుంచి వలసవచ్చిన కమ్మవారిని నిజాం సాగర్ ప్రాజెక్టు లబ్ధి ప్రాంతాల్లో ఉదారంగా భూములు, రెవెన్యూ హోదాలు ఇచ్చాడు. ఈ ప్రాంతాల్లోనూ విస్తారంగా స్థిరపడి వ్యవసాయం చేశారు.[11] స్వాతంత్ర్యం అనంతరం భారతదేశంలో భూసంస్కరణల ద్వారానూ, రైతాంగ పోరాటాల ద్వారానూ గ్రామాల్లో నివసించని భూస్వాములు, బ్రాహ్మణుల నుంచి గ్రామీణ రైతులైన మరికొందరు కమ్మవారికి దక్కాయి.[12]

1960ల మధ్యకాలంలో ప్రారంభమైన హరిత విప్లవం వల్ల పారంపర్యంగానూ, భూసంస్కరణలు, రైతాంగ పోరాటం ద్వారా లభించిన భూముల ద్వారానూ విస్తారమైన భూయజమానులుగా, వ్యవసాయదారులుగా ఉన్న కమ్మవారి ఆర్థిక స్థితిని బాగా అభివృద్ధి చేసింది. ఈ భూముల్లో కొన్నిటికి అప్పటికే బ్రిటిషు ప్రభుత్వం, తర్వాతి భారత ప్రభుత్వం నిర్మించిన నీటిపారుదల వ్యవస్థల వల్ల కాలువల ద్వారా నీటి అందుబాటు ఉండడంతో వ్యవసాయదారులైన కమ్మవారికి సంపద మిగులుతో పాటుగా ఆ దశలో రాబడిలో స్థిరత్వమూ పెరిగింది.[12] వ్యవసాయ సంస్కరణలు, హరితవిప్లవం కారణంగా పెరిగిన ధరలకు ఇక్కడ భూమిని అమ్మి ఇతర ప్రాంతాల్లో వ్యవసాయానికి అనుకూలంగా ఉండి చవకగా దొరికే భూములు కొని సాగుచేశారు.[13] వ్యవసాయ వలసల్లోనూ కింది స్థాయి కమ్మ వ్యవసాయదారులు కృష్ణా డెల్టాలోని కొద్దిభూములను అమ్ముకుని తెలంగాణ, రాయలసీమల్లోని సాగునీటి సౌకర్యం లేని భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి, బోరు బావుల ద్వారా సాగు వృద్ధి చేసుకుని మధ్యస్థాయి వ్యవసాయదారులు అయ్యారు. మధ్యస్థాయి, సంపన్న కమ్మ వ్యవసాయదారులు నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు, కెసి కెనాల్, తుంగభద్ర, పెన్న నదుల ఆయకట్టుల్లో విస్తారంగా భూములు కొన్నారు.[14] పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చిన్న కమతాలు కలిగిన కమ్మ కుటుంబాలు తుంగభద్ర ప్రాజెక్టు పరిధిలో, అంతే మంచి నీటివసతి కలిగిన చవకైన భూములు కొనుగోలు చేసి వలసవెళ్ళి మధ్యస్థాయి, పెద్ద వ్యవసాయదారులుగా అభివృద్ధి చెందారు.[15]

కమ్మవారు 20వ శతాబ్ది రెండవ అర్థభాగం నుంచి పలు రంగాల్లో వ్యాపార, ఉద్యోగ హోదాల్లో రాణిస్తున్నా, పలు కుటుంబాల ఆర్థిక కేంద్రం వ్యవసాయం నుంచి తరలిపోయినా కృష్ణా డెల్టాలోని భూములను పూర్తిగా అమ్ముకోలేదు. అందుకు భిన్నంగా ఇతర పెట్టుబడుల నుంచి వచ్చిన మిగులును భూములకు మళ్ళించడం కనిపిస్తుంది. పలువురు ఇతర వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాల కారణంగా స్వయంగా వ్యవసాయం చేసే పరిస్థితి లేకున్నా ఈ భూములను కనీసం కౌలుకు ఇచ్చి భూములపై తమ యాజమాన్యాన్ని కొనసాగిస్తున్నారు.[16][11]

వ్యాపారం, పరిశ్రమలు

బ్రిటిషు ఇండియా, భారత ప్రభుత్వాలు కాలువల తవ్వకం, భారీ నీటి పారుదల ప్రాజెక్టులు వంటి వ్యవసాయ సంస్కరణల ద్వారా చేసిన వ్యవసాయాభివృద్ధి నుంచి లాభం పొంది, వలసలతో ఇతర ప్రాంతాల్లోనూ వ్యవసాయ అవకాశాలను అందిపుచ్చుకున్న కమ్మవారు 20వ శతాబ్ది మధ్యభాగం నుంచి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. ఈ ప్రయత్నాలు సంపదను వికేంద్రీకరించడంలో ఉపకరించాయి. 1960లు, 70ల్లో జరిగిన హరిత విప్లవం ఈ ప్రయత్నాలకు తోడుకావడంతో పెట్టుబడికి మరింత అవకాశం కలిగి వ్యాపారాలను విస్తరించారు.

కమ్మవారిలో జమీందారీ ఉన్న కొద్ది కుటుంబాలు స్వాతంత్ర్యానంతరం తొలి దశాబ్దాల్లోనే పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టారు.[a] అయితే హరిత విప్లవం ఫలితాలు ఇస్తున్నా కాలంలోనే వ్యవసాయోత్పత్తుల్లో మిగులును వ్యవసాయాధారిత పరిశ్రమల్లో, రవాణా రంగంలో ప్రధానంగా పెట్టుబడులు పెట్టారు. క్రమేపీ ఈ వ్యాపారాలు వృద్ధిచేస్తూ వ్యవసాయం కొనసాగిస్తూనే, కేవలం వ్యవసాయంపైనే ఆధారపడాల్సిన స్థితి లేకుండా చేసుకున్నారు. ఉద్యోగ రంగంతో పాటుగా వ్యాపార రంగంలోని వీరి అభివృద్ధి కమ్మవారిని మరింత పట్టణీకరణ, నగరీకరణ చెందేలా, హైదరాబాద్‌, విజయవాడ వంటి నగరాల్లో తాము స్థిరపడే దిశగా తీసుకువెళ్ళింది.[13] భారతదేశంలోని రెండవ అతిపెద్ద సినీ పరిశ్రమగా ఎదిగిన తెలుగు సినిమా పరిశ్రమలోనూ కమ్మవారి ప్రభావం విస్తరించింది. అగ్ర కథానాయకులు, దర్శకులు, నిర్మాతల్లో వీరి సంఖ్య ప్రబలంగా ఉండడంతో తెలుగు సినిమా రంగ అభివృద్ధిలో గట్టి పాత్ర పోషించారు. పత్రికా రంగంలోనూ, తర్వాతి దశలో వచ్చిన టీవీ రంగంలోనూ వీరు గణనీయమైన పెట్టుబడులు పెట్టి, పలు తెలుగు పత్రికలు, టీవీ ఛానెళ్ళ అధినేతలుగా కొనసాగుతున్నారు. [17]

కమ్మవారిలో విద్యాభివృద్ధి వల్ల 1960ల్లో తొలి తరం అమెరికా తెలుగు డయాస్పోరాగా వెళ్ళిన డాక్టర్లు, ఇంజనీర్లలో కొందరు పెట్టుబడి, నైపుణ్యంతో తిరిగివచ్చారు. వీరు అంతకుముందు కన్నా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేట్ వైద్యశాలలు, పరిశ్రమలు స్థాపించి నిర్వహించసాగారు. ఇతర వ్యాపార రంగాల్లోనూ వృద్ధి చెందారు. క్రమేపీ 1991 తర్వాత భారతదేశం సరళీకరణ-ప్రపంచీకరణ జరిగడం, 1996 తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు సరళీకరణ-ప్రపంచీకరణ విధానాలను వినియోగించుకుని నియో-లిబరలైజేషన్ పద్ధతులను ప్రోత్సహించడం వంటి పరిణామాలతో ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్‌ కళాశాలలు, కార్పొరేట్ సంస్థలు వంటివాటి స్థాపనలో కమ్మవారు మరింతగా వ్యాపారాభివృద్ధి చేశారు. హైదరాబాద్‌ నగరంలో రియల్‌ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి ఆ రంగంలో విజయం సాధించారు.[17]

విద్యాభివృద్ధి, ఉద్యోగాలు

20వ శతాబ్దికి ముందు భారతదేశంలో ఇతర వ్యవసాయ కులాలలానే వీరిలోనూ అక్షరాస్యత శాతం, ఉన్నత విద్య తక్కువగా ఉండేది. 20వ శతాబ్ది తొలి దశకాల నుంచే సాంఘిక చైతన్యం పెరిగి సంఘీభావం మద్దతు కావడంతో అక్షరాస్యత పెరిగింది. ఈ పెరుగుదలలో 20వ శతాబ్ది తొలినాళ్ళలో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో బ్రాహ్మణేతరుల్లో విద్య, ఉద్యోగాలు పెరగాలని బ్రాహ్మణేతరులైన జమీందారులు ప్రారంభించిన బ్రాహ్మణేతరోద్యమ ప్రభావం కూడా ఉంది. కమ్మ మహాజన సభ అన్న కులసంఘం కమ్మవారిలో విద్యాభివృద్ధి ఆవశ్యకతను విస్తారంగా, సుదీర్ఘకాలం చేసిన ప్రచారం త్వరితగతిన వీరిలో విద్యాభివృద్ధి చెందడానికి ఒక ప్రధానమైన కారణంగా నిలిచింది. విద్య కొరకు వీరు అనేక విద్యాలయాలు స్థాపించి తమవారితో పాటు బ్రాహ్మణేతర సమాజానికి విద్యను చేరువ చేసారు. వీరిలో సంపన్నులు పిల్లల విద్య కోసం అవసరమైన ఖర్చు భరించారు. విద్యాభివృద్ధిని కేంద్రంగా వారు ఏర్పాటు చేసుకున్న విద్యాసంస్థలు, హాస్టళ్ళు వంటివి కమ్మవారిలో విద్యాభివృద్ధికి చాలా ప్రోత్సహించాయి.[18]

విద్యాభివృద్ధి, అక్షరాస్యత కారణంగా బ్రాహ్మణులు ఆధిక్యతతో ఉన్న ఉద్యోగాల్లోకి క్రమేపీ కమ్మవారు ఇతర వ్యవసాయ కులాలతో పాటుగా సంఖ్యలో పెరుగుతూ వచ్చారు. 20వ శతాబ్ది ఉత్తరార్థంలో వైద్యం, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యలు సహా పలు ఉన్నత విద్యావకాశాలు స్వీకరించి ఆయా ఉద్యోగాల్లో పనిచేశారు.

రాజకీయం

స్వాతంత్ర్య పోరాటంలో పలువురు కమ్మ వారు పాల్గోన్నారు. విదేశాలలో ఉన్నతవిద్య అభ్యసించి వచ్చి గాంధీజీ పిలుపు నందుకొని ఉద్యోగాలను వదిలి స్వాతంత్ర్యం కొరకు పాటుపడ్డారు. మాగంటి బాపినీడు, ఎన్.జి. రంగా, కల్లూరి చంద్రమౌళి, మోటూరి సత్యనారాయణ, యేర్నేని సుబ్రహ్మణ్యం, పర్వతనేని వీరయ్య చౌదరి. గొట్టిపాటి బ్రహ్మయ్య వంటి వారు ముందువరసలో ఉండి ఉద్యమాన్ని నడిపారు.

20వ శతాబ్ది తొలినాళ్ళలో బ్రాహ్మణవ్యతిరేకోద్యమం పేరిట ఉద్యోగాలు, విద్య, అధికారం వంటివాటిలో బ్రాహ్మణేతరులకు జనాభా ప్రాతిపదికన అవకాశం దక్కాలని వాదించిన జస్టిస్‌ పార్టీకి కొందరు కమ్మవారు మద్దతుగా ఉండేవారు. జాతీయవాదులుగా బ్రిటిషు వారు భావించిన బ్రాహ్మణుల ఆధిపత్యం దీని ద్వారా బద్దలుకొట్టవచ్చని భావిస్తూ బ్రిటిషు ప్రభుత్వం ఈ ఉద్యమానికి మద్దతునిచ్చింది. అయితే 1930ల్లో ఆర్థిక మాంద్యం కారణంగా రైతుల మీద పన్నులు బాగా పెరిగాయి. ఈ దశలో వ్యవసాయదారులైన కమ్మవారు అప్పటివరకూ జస్టిస్ పార్టీ విధానమైన బ్రిటిషు‌ అనుకూలత విడిచిపెట్టి జాతీయోద్యమంలో పనిచేశారు.[19] 1934లో ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచీ పార్టీ ఉన్నత నాయకత్వం నుంచి శ్రేణుల వరకూ కమ్మవారు ఎక్కువగా ఉంటూ వచ్చారు. కమ్యూనిస్టు పార్టీ శాఖ ఆర్థికంగా బలపడడానికి అవసరమైన నిధులు కమ్మవారు విస్తారంగా అందించారు.[20] కమ్మవారు ఏక్కువగా కమ్యూనిస్టు సానుభూతిపరులుగా కొనసాగితే, 20వ శతాబ్ది తొలినాళ్ళలో బ్రాహ్మణేతరోద్యమంలో కీలకంగా పనిచేసిన మరో తెలుగు కులం వారైన రెడ్లు క్రమేణా 1930ల నుంచి రెండు దశాబ్దాల్లో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గచూపుతూ 1950ల నాటికి ఆంధ్ర కాంగ్రెస్‌లో నిర్ణయాత్మకంగా ఎదిగారు.[21][b]

స్వాతంత్ర్యం సిద్ధించాక ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల రాజకీయాల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో, మరీ ముఖ్యంగా కోస్తాంధ్ర డెల్టాలో, కీలకపాత్ర వహించి, సామాజికంగా, సాంస్కృతికంగా ప్రభావశీలంగా ఉన్నా కమ్మ కులస్తులకు ఎవరికీ రాజకీయాల్లో ముఖ్యమంత్రిత్వం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తొలి మూడు దశకాలలో (1950, 1960, 1970) కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో లభించలేదు.[c] 1982 లో సినీ నటుడు ఎన్‌.టి.రామారావు ఈ పరిణామాన్ని మారుస్తూ తెలుగు దేశం పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయ్యాడు.[22] రాజకీయ విశ్లేషకులు తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటుబ్యాంకుగా కులపరంగా కమ్మ-బీసీ కులాలు నిలిచాయని విశ్లేషించారు. కమ్మ కులానికి చెందిన ఎన్.టి.రామారావు (7 సంవత్సరాలు), చంద్రబాబు నాయుడు (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు, తెలంగాణ విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా (5 సంవత్సరాలు) అనేక పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.[23]

సంస్కృతి

సాంఘిక ఉద్యమాలు

బ్రాహ్మణేతరోద్యమం

20వ శతాబ్దిలో పలు బ్రాహ్మణేతర అగ్రకులాలు తెలుగునాట బ్రాహ్మణేతరోద్యమాన్ని స్వీకరించి నడిపించాయి. ఈ బ్రాహ్మణేతరోద్యమంలో పాల్గొన్న తెలుగు కులాల్లో కమ్మవారు ముందువరుసలో ఉంటారు. 1916లో గుంటూరు జిల్లాలోని కొల్లూరులో కమ్మ కులస్తులు వేదం అభ్యసించడాన్ని బ్రాహ్మణులు వ్యతిరేకించారన్న అభియోగం వచ్చింది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో బ్రాహ్మణులు కమ్మవారి వంటి బ్రాహ్మణేతరులు వేదాధ్యయనం చేయకూడదని రిజిస్టర్డ్ నోటీసు వెలువరించారు. ఆనాటి కృష్ణా జిల్లాలోని (తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో భాగమైంది) కొత్తవరంలో కమ్మవారు చౌదరి అన్న పౌరుష నామాన్ని ధరించడాన్ని కొందరు బ్రాహ్మణులు వ్యతిరేకించారన్న కారణంగా వివాదం ఏర్పడింది. ఈ వివాదాలను బ్రాహ్మణేతరోద్యమం కమ్మవారిలో వేగవంతం కావడానికి బాహ్య కారణాలుగా నిలిచాయి.[24]

గుంటూరు జిల్లాకు చెందిన కమ్మ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన త్రిపురనేని రామస్వామి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. మొదట్లో ఇతను చౌదరి అన్న పౌరుష నామాన్ని ధరించాడు. ఇంగ్లాండు వెళ్ళి బారిస్టర్ విద్య అభ్యసించి తెనాలి తిరిగివచ్చి ప్రాక్టీస్ పెట్టాడు. హేతువాదం, ఆర్య-ద్రావిడ దండయాత్ర సిద్ధాంతం, బ్రాహ్మణులు సమాజంలో అసమానమైన భాగాన్ని తీసుకుంటున్నారన్న వాదం, పురాణాల పట్ల విమర్శనాత్మక ధోరణి, బ్రాహ్మణేతరులు, ప్రత్యేకించి కమ్మవారు విద్యను అభ్యసించి, ఉన్నతోద్యోగాలు సాధించాలన్న ప్రచారం వంటి అనేకానేక అంశాలు ఇతని బ్రాహ్మణేతరోద్యమంలో కలగలిశాయి. ఈ సిద్ధాంతాలను వ్యాప్తిచేయడానికి తెలుగు సాహిత్యాన్ని ఉపయోగించుకున్నాడు. ఆ క్రమంలో కావ్యాలు, నాటకాలు రచించాడు. సూతాశ్రమం పేరిట ఒక హేతువాద ఆశ్రమాన్ని తెనాలిలో నెలకొల్పాడు. ఈ ఉద్యమంలో సుర్యదేవర రాఘవయ్య చౌదరి, టి. జి. సరస్వతి, దుగ్గిరాల రాఘవచంద్ర సచ్ఛాస్త్రి వంటి వారు కూడా ఈ ఉద్యమంలో చురుకుగా పనిచేశారు.

బ్రాహ్మణేతరోద్యమంలో బ్రాహ్మణులు చేపట్టే పౌరోహిత్యం వంటి వృత్తులు తాము స్వీకరించడం, శూద్రులకు నిషేధమని పారంపర్యంగా చెప్పిన వేదవిద్యలు నేర్చుకోవడం వంటివి కొందరు చేశారు. హేతువాద ఉద్యమాలు, కమ్యూనిస్టు ఉద్యమాలు కమ్మవారిలో విస్తరించడానికి, అవి తెలుగునాట పాదుకొల్పడానికి ఈ బ్రాహ్మణేతరోద్యమం ఉపకరించింది. ఐతే, కమ్మవారు ప్రధాన పాత్ర వహించిన బ్రాహ్మణేతరోద్యమం తెలుగునాట చివరకు ఉన్నత వ్యవసాయ కులాల సంస్కృతీకరణగా పరిణమించింది.[23]

కమ్మ పురోహితులు

బ్రాహ్మణులే ఎందుకు పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలు చేయించాలన్న ప్రశ్నపై కొందరు కమ్మవారు అవసరమైన శ్రౌతం, వేదం నేర్చుకుని కమ్మ పురోహితులుగా వ్యవహరించారు. దీని వెనుక త్రిపురనేని రామస్వామి ప్రోత్సాహం, ఆలోచన ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని పచ్చలతాడిపర్రు గ్రామానికి చెందిన కమ్మ వ్యవసాయదారుడు పిన్నమనేని సోమయ్యవర్మ 1936లో తాను వితంతు వివాహం చేసుకోవడానికి పురోహితుల నిరసన వల్ల ఇబ్బంది పడడంతో, తానే వేదాధ్యయనం చేసి కమ్మ పురోహితునిగా వ్యవహరించాడు. ఇతనే తొలి కమ్మ పురోహితుడన్న పేరుపొందాడు. తాను మరో 20 మంది కమ్మ యువకులకు వేద విద్య నేర్పి, వారిని కూడా పురోహితులను చేశాడు.[25] ఈనాటికీ యార్లగడ్డ పాపారావు చౌదరి (కారంచేడు), రావి వెంకట్రావు (వట్టిచెరుకూరు), పిన్నమనేని గాంధీ (పొన్నూరు), వేముల శ్రీహరి (తెనాలి), తదితరులు కమ్మ పురోహితులుగా వివాహాలు చేయిస్తూ శిష్యులను తయారుచేస్తూ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.[25]

ఆర్యసమాజం

కావూరి గోపయ్య అన్న మరో కమ్మ వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి ఆర్య సమాజ ప్రభావానికి లోనై స్వయంగా వేదవేదాంగాలను దశాబ్దాల పాటు అభ్యసించి పండిత గోపదేవ్ శాస్త్రిగా పేరు మార్చుకుని, ఉపనీతుడై యజ్ఞోపవీతాన్ని ధరించడం ప్రారంభించాడు. తెలుగు నాట ఆర్య సమాజాన్ని స్థాపించి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో ఆర్య సమాజ సిద్ధాంతాలను ప్రచారం చేశాడు. వైదిక సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించాడు. పలువురు కమ్మ యువకులను, ఇతర బ్రాహ్మణేతరులను కూడా తన బాటలో నడిపి వారినీ ఉపనీతులను చేశాడు.[26][27]

సాహిత్యం, కళాపోషణ

20వ శతాబ్దికి పూర్వం ప్రధానంగా కమ్మవారు, అందులోనూ పరిపాలన రంగంలోని కమ్మవారు, కవిపండితులను ప్రోత్సహించి, పోషిస్తూ సాహిత్య పోషకులుగా వ్యవహరించారు. కాకతీయుల సేనాని గన్నమ నాయుడు,[28] గజపతుల సామంతుడు దాసరి చినగంగన్న,[29] విజయనగర సామంతులు గోళ్ళ పెదరామ భూపాలుడు-చిన రామ భూపాలుడు,[30] పరిపాలకులైన రావెళ్ళ లింగభూపాలుడు,[31] చిరుమామిళ్ళ పాపయ,[32] వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు[33] వంటి కమ్మవారు కవులను ఆదరించి కావ్యాలు రాయడానికి ప్రోత్సహించిన సాహిత్య పోషకులుగా పేరొందారు. ముక్త్యాల సంస్థానాధీశులైన వాసిరెడ్డి వంశస్థులు తరతరాలుగా సాహిత్య పోషకులుగా కొనసాగారు. వాసిరెడ్డి రామలింగ భూపాలుడు,[34] వాసిరెడ్డి భవానీ ముక్తీశ్వరనాయుడు,[35] వాసిరెడ్డి వెంకటలక్ష్మీనృసింహనాయుడు,[36] వాసిరెడ్డి చంద్రమౌళీశ్వర ప్రసాద్[37] ఈ పరంపరను కొనసాగిస్తూ కవి పండితులను ఆదరించి, కావ్యరచనకు ప్రోత్సాహం కల్పించారు.

20వ శతాబ్దికి పూర్వం సాహిత్య సృజన చేసిన కొద్దిమంది కమ్మవారు ఉన్నారు. కాకతీయ కాలానికి చెందిన జాయప సేనాని నృత్తరత్నావళి అన్న సంస్కృత నాట్య శాస్త్రాన్ని రాశాడు. ఇతనిని గురించి సూర్యదేవర రవికుమార్ వ్యాఖ్యానిస్తూ "జాయప నాయకుని (సంస్కృత భాషలో) కవిత చెప్పిన తొలి కమ్మకవి అని భావించవచ్చు" అన్నాడు.[38] సాయపనేని వేంకటాద్రి నాయకుడు, చిరుమామిళ్ళ సుబ్రహ్మణ్య కవి వంటివారు 19వ శతాబ్దికి పూర్వం సాహిత్య సృజన చేసిన కమ్మవారు. చిరుమామిళ్ళ సుబ్రహ్మణ్యకవి ఒక కమ్మ కులస్తుడైన వ్యవసాయదారుడు, అతను చెప్పిన కృతులు భక్తి సంప్రదాయంలో మంచి ప్రాచుర్యం సంపాదించాయి.

20వ శతాబ్దిలో కమ్మవారు అంతకుముందు శతాబ్దాలకు భిన్నంగా ఎందరో సాహిత్య రచన చేశారు. అలా సాహిత్య రచన ప్రారంభించిన కమ్మవారిలో పేరుపొందినవాడు, ఇతరులకు స్ఫూర్తిగా నిలిచినవాడు త్రిపురనేని రామస్వామి. రామస్వామి వంటివారు ప్రారంభించిన సాంఘికోద్యమాల స్ఫూర్తితో పాటు విద్యాభివృద్ధి కూడా కమ్మవారి సాహిత్య సృజనకు కూడా తోడ్పాటుగా నిలచింది. తుమ్మల సీతారామమూర్తి, కొత్త భావయ్య కొత్త సత్యనారాయణ చౌదరి, సుంకర సత్యనారాయణ, సంజీవ దేవ్, త్రిపురనేని గోపిచంద్. ఆలూరి బైరాగి తదితరులు ఎందరో సాహిత్య సృష్టి చేసినవారిలో ఉన్నారు. చక్రపాణి, కొసరాజు రాఘవయ్య చౌదరి వంటివారు సినీ సాహిత్య రచనలోనూ, నార్ల వెంకటేశ్వరరావు వంటివారు పత్రికా రచనలోనూ ప్రాచుర్యం పొందారు.

సామెతల్లో

ప్రతీ కులంపైనా ఉన్నట్టే కమ్మ వారిపైనా సామెతలు ఉన్నాయి. పూర్వం నుంచీ జనం నోళ్ళలో నానుతున్న ఈ సామెతల్లో సాధారణీకరణ కనిపిస్తుంది. క్రమేపీ సమాజంలోని స్థితిగతుల వల్ల ఇవి ప్రాసంగికత కోల్పోతున్నాయి.

  • కమ్మవాని చేతులు కట్టినా నిలవడు
  • కమ్మవాళ్ళు చేరితే కడమ జాతులు వెళ్ళును
  • కమ్మవారికి భూమి భయపడుతుంది
  • కమ్మ గుట్టు గడపదాటదు[39][40]

అభివృద్ధి కోసం వలసలు

కొత్త నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం జరిగినా, పెట్టుబడులకు అవకాశాలు కనిపిస్తున్నా, వృత్తి, ఉద్యోగాలకు డిమాండ్ ఉన్నా కమ్మవారు వలస వెళ్ళి స్థిరపడడానికి ఎక్కువ మొగ్గుచూపారు. ఈ క్రమంలో ప్రస్తుత తెలంగాణాలోని నిజామాబాద్ ప్రాంతానికి, హైదరాబాద్, బెంగుళూరు వంటి నగరాలకు, కర్ణాటక,[15] తమిళనాడు రాష్ట్రాలకు, అమెరికా, కెనడా వంటి దేశాలకు భారీ ఎత్తున వలసలు వెళ్ళి వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అవకాశాలు అందుకున్నారు. అమెరికాలో ఐటీ ఉద్యోగులుగా కానీ, వాణిజ్యవేత్తలుగా కానీ స్థిరపడ్డారు, ప్రస్తుతం తెలుగు డయాస్పోరాలో పెద్ద సంఖ్యలోని వారిలో వీరూ ఉన్నారు.[41] అమెరికాలో న్యూజెర్సీ, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో స్థిరపడ్డ వీరు ఉత్తర అమెరికాలోని తెలుగు సాంస్కృతిక సంఘాల్లో ఒకటైన తానాలో ఎక్కువ సంఖ్యలో ఉంటూ సంస్థ నిర్వహణలో కీలకంగా ఉన్నారు.[42]

విమర్శలు

1980ల్లో వ్యాపారస్తులైన కమ్మవారు తమ కులానికి చెందిన రాజకీయవేత్తల ఎదుగుదలకు సహకరించారని, 1990లు, 2000లో తమ రాజకీయ ఆధిక్యత వినియోగించుకుని రాజకీయ నాయకులు వ్యాపార రంగంలోని కమ్మవారి విజయాలకు పాక్షిక ధోరణితో సహకారం అందించారని విమర్శలు, పరిశీలనలు ఉన్నాయి.[17][d] ఐతే తెలుగుదేశం పార్టీకి, కమ్మ కులంతో ముడిపెట్టడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, సహా పలువురు తెదేపా నాయకులు పలు సందర్భాల్లో బహిరంగంగా ఖండించారు.[43] మరోవైపు రాజకీయ విశ్లేషకులు స్వంత కులానికి చెందిన మీడియా, పారిశ్రామిక సంస్థలు అదే కులం రాజకీయాధికారం సాధించడానికి సహకరించం, ఆ అధికారాన్ని తిరిగి ఉపయోగించుకోవడం అన్నది ప్రత్యేకించి ఒక కులానికి సంబంధించిన అంశంగా కాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాధారణమైపోయిన ధోరణిగా చూస్తున్నారు. రాజకీయ విశ్లేషకుడు ఆచార్య కె.శ్రీనివాసులు "అధికారాన్ని పొందే కులాలకు పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు ఉండడం, సొంత మీడియా సంస్థలు ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి." అని విశ్లేషించాడు.[23] మొదటి నుండి అత్యధిక కమ్మ వారు కాంగ్రేసేతర పార్టీలను బలపర్చేవారు కాబట్టి ప్రతి పక్షం విజయం సాధించిన సమయంలో వారు అధికారంలోకి రావటం సహజ పరిమాణంగా భావించవచ్చు.

ప్రముఖ వ్యక్తులు

మూలాలు

  1. కమ్మవారి చరిత్ర, కొత్త బాపయ్య చౌదరి, 1939, పావులూరి పబ్లిషర్స్, గుంటూరు, కొత్త ఎడిషన్, 2006
  2. Democratic Process and Electoral Politics in Andhra Pradesh, India Archived 2007-09-28 at the Wayback Machine, కె.సి.సూరి (సెప్టెంబరు 2002), 11వ పేజీ
  3. 1921 జనాభా లెక్కల ప్రకారం కమ్మ కులం జనాభా 4.8%. కులాల వారీగా జనాభా లెక్కల నమోదు 1921 తరువాత జరుగలేదు. Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories Archived 2007-09-28 at the Wayback Machine, కె.శ్రీనివాసులు (సెప్టెంబరు 2002), పొలిటికల్ సైన్సు విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు; 3వ పేజీ. ఇప్పటి జనాభాలో ఏ కులం శాతం ఎంత అనే విషయంపై అంచనాలు మాత్రమే చలామణీ అవుతున్నాయి
  4. కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు
  5. Innaiah, N. (1985). Āndhrapradēślō kularājakīyālu. Vi. Aśvanīkumār.
  6. ఆంధ్రుల చరిత్రము - మొదటి భాగము, చిలుకూరి వీరభద్ర రావు, 1910, పేజి 232
  7. Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ Magazine Volume 1. Vol. Volume 1. Dept of Information and PR of Andhra Pradesh. 01-08-1957. p. 34. {{cite book}}: |volume= has extra text (help); Check date values in: |year= (help); More than one of |pages= and |page= specified (help)
  8. ముసునూరి నాయకులు, మల్లంపల్లి సోమశేఖర శర్మ ఎమెస్కో పునర్ముద్రణ, 2015
  9. శ్రీ కృష్ణ దేవ రాయలు వంశ మూలాలు, ముత్తేవి రవీంద్రనాథ్, సావిత్రి పబ్లికేషన్స్
  10. Benbabaali 2013, p. 2.
  11. 11.0 11.1 Benbabaali 2013, p. 3.
  12. 12.0 12.1 Purendra Prasad 2015, p. 78.
  13. 13.0 13.1 Benbabaali 2013, p. 5.
  14. Purendra Prasad 2015, p. 79.
  15. 15.0 15.1 బత్తిని, దీప్తి; బళ్ల, సతీశ్ (10 May 2018). "కర్ణాటకలో తెలుగువాళ్లు ఏమనుకుంటున్నారు?". Retrieved 7 October 2019.
  16. Benbabaali 2013, p. 7.
  17. 17.0 17.1 17.2 17.3 Benbabaali 2013, p. 6.
  18. A. Satyanarayana, 2002 & 58.
  19. Benbabaali 2013, p. 4.
  20. Selig S. Harrison 1956, p. 381.
  21. Selig S. Harrison 1956, p. 384.
  22. Prakash Sarangi 2004, p. 109.
  23. 23.0 23.1 23.2 సతీశ్, బళ్ల (8 April 2019). "తెలుగునాట కుల రాజకీయాలు: ఆ రెండు కులాల మధ్యే ప్రధాన పోటీ". బీబీసీ తెలుగు. Retrieved 7 October 2019.
  24. Ramaswamy, Uma (1978). "The Belief System of the Non-Brahmin Movement in India: The Andhra Case". Asian Survey. 18 (3): 290–300. doi:10.2307/2643221. ISSN 0004-4687. Retrieved 7 October 2019.
  25. 25.0 25.1 "పురోహితులు మారారు!". www.andhrajyothy.com. 31 October 2017. Retrieved 5 October 2019.[permanent dead link]
  26. "గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 331-సంస్కృత శతక కర్త –అభిరాజ్ రాజేంద్ర మిశ్ర (1943)". సరసభారతి ఉయ్యూరు. Retrieved 5 October 2019.
  27. ముదిగొండ, శివప్రసాద్. "భారత్ విచ్ఛిన్నానికి కుట్ర!". www.andhrabhoomi.net. ఆంధ్రభూమి. Archived from the original on 5 అక్టోబరు 2019. Retrieved 5 October 2019.
  28. సూర్యదేవర రవికుమార్ 2012, pp. 7–9.
  29. సూర్యదేవర రవికుమార్ 2012, pp. 9–12.
  30. సూర్యదేవర రవికుమార్ 2012, pp. 16–19.
  31. సూర్యదేవర రవికుమార్ 2012, pp. 19–30.
  32. సూర్యదేవర రవికుమార్ 2012, pp. 30–37.
  33. సూర్యదేవర రవికుమార్ 2012, pp. 37–43.
  34. సూర్యదేవర రవికుమార్ 2012, pp. 48–50.
  35. సూర్యదేవర రవికుమార్ 2012, pp. 50–52.
  36. సూర్యదేవర రవికుమార్ 2012, pp. 52–55.
  37. సూర్యదేవర రవికుమార్ 2012, pp. 55, 56.
  38. సూర్యదేవర రవికుమార్ 2012, p. 57-59.
  39. పాపిరెడ్డి, నరసింహారెడ్డి (1983). "తెలుగు సామెతలు-జనజీవనం".
  40. పాపిరెడ్డి, నరసింహారెడ్డి. తెలుగు సామెతలు - జనజీవనం. p. 115-117.
  41. Sanam Roohi 2017.
  42. Benbabaali 2016, p. 1.
  43. "కమ్మ పార్టీ అని ముద్రవేశారు... నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర : చంద్రబాబు". వెబ్ దునియా. 7 October 2019. Retrieved 7 October 2019.
  44. 44.0 44.1 44.2 44.3 44.4 44.5 Benbabaali, Dalel (2018-11). "Caste Dominance and Territory in South India: Understanding Kammas' socio-spatial mobility". Modern Asian Studies (in ఇంగ్లీష్). 52 (6): 1938–1976. doi:10.1017/S0026749X16000755. ISSN 0026-749X. {{cite journal}}: Check date values in: |date= (help)

నోట్స్

  1. ఉదాహరణకు కపిలేశ్వరం - కేశవకుర్రు జమీందారీకి చెందిన ఎస్.బి.పి.బి.కె.సత్యనారాయణ కాకినాడ, ఉయ్యూరు ప్రాంతాల్లో, ఉండ్రాజవరం జమీందారీకి చెందిన ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ తణుకు, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో మధ్య, భారీ పరిశ్రమలు స్థాపించారు.
  2. ఈ పరిణామానికి ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం నుంచే పార్టీలో పనిచేస్తూ, అగ్ర నాయకుడిగా కొనసాగిన పుచ్చలపల్లి సుందరయ్య, కాంగ్రెస్‌ నాయకుడు ఎన్‌.జి.రంగా ముఖ్యమైన మినహాయింపులుగా ఉన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య సంపన్న భూస్వామి రెడ్డి కుటుంబంలో జన్మించిన వ్యక్తి, రంగా వ్యవసాయదారులైన కమ్మవారి కుటుంబంలో జన్మించాడు.. సుందరయ్య జన్మనామం పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి, కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా తన పేరులోని కులసూచకమైన రెడ్డి విడిచిపెట్టాడు. రంగా కాంగ్రెస్ నాయకుల్లో ముఖ్యుడైనా మంత్రి, ముఖ్యమంత్రి వంటి పదవులు ఆశించలేదు. కాంగ్రెస్ వదిలి స్వతంత్ర పార్టీ స్థాపకుల్లో ఒకరిగా వెళ్ళి, దశాబ్ది తర్వాత కాంగ్రెస్‌కు తిరిగివచ్చాడు. భారత రైతాంగ దివిటీగా దీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా పనిచేశాడు.
  3. ఎన్టీరామారావుకు ముఖ్యమంత్రి కాక పూర్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ఎక్కువగా రెడ్డి కులస్తులకు దక్కింది. పది మంది ముఖ్యమంత్రులు అయితే వారిలో ఏడుగురు గురు రెడ్లు, ఒక్కరూ కమ్మవారు లేరు.
  4. హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌ రంగంలో కమ్మవారి విజయాలను తరచుగా వారి రాజకీయ ప్రాబల్యానికి ఆపాదిస్తూంటారు. ఉదాహరణకు ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో దలేల్ బెన్‌బబాలి కమ్మవారి ఆధిపత్యం-ప్రాంత స్థితిగతుల గురించి పరిశోధించి ఇచ్చిన అకడమిక్‌ టాక్‌లో "అతను (చంద్రబాబు) వలసవచ్చి జీవిస్తున్న కమ్మవారు నివసించే జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి ప్రాంతాలకు సమీపంలో హైదరాబాద్ పశ్చిమ సరిహద్దుల్లో హైటెక్‌ సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించాడు. ఇది వారి భూముల విలువ విపరీతంగా పెరిగేందుకు దారితీసింది. రాజకీయ బలం తద్వారా రియల్‌ ఎస్టేట్ అంచనాకు వీలైన ప్రత్యేక సమాచారం అందుబాటులో ఉన్న కమ్మ వ్యాపారస్తులు ఈ ప్రాంతంపై పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున లాభాలు సంపాదించారు." అని అభిప్రాయపడ్డారు. [17]

ఆధార గ్రంథాలు, వనరులు

"https://te.wikipedia.org/w/index.php?title=కమ్మ&oldid=4334312" నుండి వెలికితీశారు