దుత్తలూరి రామారావు
దుత్తలూరి రామారావు | |
---|---|
జననం | శ్రీ సత్యసాయి జిల్లా,గుడిబండ మండలం, మందలపల్లి గ్రామం | 1939 అక్టోబరు 21
మరణం | 2001 ఫిబ్రవరి 22 | (వయసు 61)
వృత్తి | ఉపాధ్యాయుడు |
ప్రసిద్ధి | కవి, సినిమా నటుడు, సినీ గేయరచయిత |
భార్య / భర్త | లలితమ్మ |
పిల్లలు | పద్మశ్రీ బాబు బాలాజి పార్థసారథి |
తండ్రి | దుత్తలూరి చలపతిరావు |
తల్లి | లక్ష్మీదేవమ్మ |
దుత్తలూరి రామారావు రచయిత, కవి, సినిమా నటుడు, రంగస్థల నటుడు. ఇతనికి ఆయుర్వేద వైద్యంలోను, జ్యోతిష శాస్త్రంలోను కొంత ప్రవేశం ఉంది.
జీవిత విశేషాలు
[మార్చు]దుత్తలూరి రామారావు 1939, అక్టోబర్ 21వ తేదీన అనంతపురం జిల్లా, మడకశిర తాలూకా,(ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లా, గుడిబండ మండలం) మందలపల్లి గ్రామంలో దత్తలూరి చలపతిరావు, లక్ష్మీదేవమ్మ దంపతులకు జన్మించాడు.[1] అమరాపురం హైస్కూలులో 4వఫారం చదివే సమయంలో ఇతడు తన సహజ పాండిత్యంతో పద్యాలు, పాటలు వ్రాస్తూ, హరికథలు గానం చేస్తూ ఆ పాఠశాల ఆంధ్రోపాధ్యాయుడు రూపావతారం నారాయణశర్మ దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత కల్లూరు సుబ్బారావు ప్రోత్సాహంతో హైదరాబాదుకు వచ్చి తెలుగు విశారద పరీక్షలకు చదవడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో ఇతడి ప్రతిభను దివాకర్ల వెంకటావధాని గుర్తించి తన శిష్యునిగా స్వీకరించాడు. ఇతడు 1960 నుండి 1970 వరకు వివిధ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. మడకశిరలో జరిగిన సభలకు వచ్చిన చిత్తూరు నాగయ్య ఇతడిని సినిమాలలో నటించమని ప్రోత్సహించాడు. అతని ప్రోత్సాహంతో మద్రాసు వెళ్ళి కొన్ని సంవత్సరాలు గడిపి కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు ధరించి అక్కడ ఇమడలేక తిరిగి వచ్చాడు. ఇతని భార్య లలితమ్మ కవయిత్రి, గాయకురాలు. ఈమె అనేక పాటలు, సంప్రదాయపు పాటలు, పెళ్లి పాటలు, దేశభక్తి పాటలు ఎన్నో రచించి సుశ్రావ్యంగా పాడేవారు. ఇతని కుమార్తె పద్మశ్రీ సంగీత శిక్షకురాలిగా పేరు సంపాదించింది. పెద్ద కుమారుడు బాబు బాలాజి నాట్యకళాకారుడు, రచయిత, గాయకుడు. ఇతడు ధర్మవరంలో శ్రీలలిత కళా నాట్యనికేతన్ పేరుతో శిక్షణా సంస్థను నెలకొల్పి శాస్త్రీయ, జానపద నృత్యాలలో అనేకమందిని కళాకారులుగా తీర్చిదిద్దాడు. రెండవ కుమారుడు పార్థసారథి జ్యోతిషశాస్త్రంలో నైపుణ్యం సంపాదించాడు. ఇతని మనుమరాళ్ళు హర్షశ్రీ,రామ లాలిత్యలు కూడా ఇతని వారసత్వాన్ని కొనసాగిస్తూ నాట్యరంగంలో రాణిస్తున్నారు.
సాహిత్యకృషి
[మార్చు]ఇతడు భక్తకవి. ఇతని రచనలన్నీ ఆధ్యాత్మిక సంబంధమైనవే. ఇతని రచనలలో కొన్ని:
- శ్రీ రాఘవేంద్రస్వామి వారి చరిత్ర
- శని మహాత్మ్యము (లేక) విక్రమార్క గర్వభంగము
- నిర్వచన పద్మావతీ శ్రీనివాస కళ్యాణము
- శ్రీ వెంకటేశ్వర గానామృత లహరి
- శ్రీ తాళ్ళపాక అన్నమయ్య చరిత్ర
- శ్రీ సత్యనారాయణ పూజా మహాత్మ్యము
- కలియుగ వైపరీత్యము
- భిక్షాటనాధీశ్వర శతకము
- పాంచజన్యము
- అమృతాభిషేకము
- నివేదన
- నిత్యనివేదన
- హనుమద్విజయం (సుందరాకాండ)
- శ్రీ వరసిద్ది వినాయక గానామృత లహరి (పాటలు)
నాటకరంగం
[మార్చు]ఇతడు అనేక పౌరాణిక, సాంఘిక, చారిత్రక నాటకాలలో నటించాడు. శ్రీకృష్ణరాయబారం నాటకంలో శ్రీకృష్ణుడిగా, శ్రీరామాంజనేయ యుద్ధం నాటకంలో రాముడిగా, భువనవిజయం సాహిత్యరూపకాలలో అప్పాజీ, ధూర్జటి పాత్రలలో నటించి వాటిని రక్తికట్టించాడు. ఇతని నటనను చూసి చిత్తూరు నాగయ్య, ఎస్.వి.రంగారావు మొదలైనవారు మెచ్చుకున్నారు.
సినీరంగం
[మార్చు]- గేయరచయితగా
- జీవిత రంగం (1974)
- 1 నమశ్రీ శాంభవీ లలితే సర్వకల్మష నాశిని (శ్లోకం) - ఎస్.జానకి
- 2 నమశ్రీ లలితాదేవి నానాదు:ఖ వినాశిని (శ్లోకం)- ఎస్. జానకి
- గంగ యమున సరస్వతి (1977)
- 1 శ్రీమన్మహా చీట్లపేకా మఝాకా భలే షోక నీ ఢాక కాక (దండకం) - పట్టాభి
- 2 కులమత భేదముల్ గూల్చియు నొకచోట జేర్చి యాడింతువే చీట్లపేక (పద్యం) - పట్టాభి, రమణ
- జగన్మోహిని (1978)
- కలియుగ దైవం (1983)
- ఉగ్రరూపం (1984)
- చాముండేశ్వరి పూజా మహిమె (కన్నడ) (1987)
- శ్రీ దేవీకామాక్షీ కటాక్షం (1988)
- శ్రీశైల భ్రమరాంబికా కటాక్షం (1991)
- నటుడిగా
- ఒకే కుటుంబం (1970) - సన్నాయి ఊదేవాడు
- ప్రేమనగర్ (1971) - పెళ్ళిపెద్ద
- రాజకోట రహస్యం (1971) - మంత్రి
- అంతా మన మంచికే (1972) - భానుమతి సహోద్యోగి
- బాలభారతము (1972) - అక్రూరుడు
- శాంతి నిలయం (1972)
- దేశోద్ధారకులు (1973) - మంత్రి
- పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973) - బ్యాంకు మేనేజరు
- ఆడంబరాలు - అనుబంధాలు (1974) - రైతు
- యమగోల (1977) - పోలీసు
- గంధర్వ కన్య (1979) - గంధర్వుడు
- కలియుగ దైవం (1983) - పూజారి
భక్తిగీతాలు
[మార్చు]ఇతడు సినిమా పాటలు మాత్రమే కాకుండా అనేక భక్తి గీతాలను రచించాడు. ఇతని పాటలు ప్రైవేటు ఆల్బమ్‌లుగా రికార్డు చేయబడ్డాయి. వాటిలో కొన్ని:
క్ర.సం. | ఆల్బమ్ పేరు | గాయకులు |
---|---|---|
1 | ఆంధ్ర క్షేత్ర సంగీత యాత్ర | పి.సుశీల |
2 | కనక దుర్గగీతామృతం | ఎస్.పి.శైలజ |
3 | శ్రీ వేంకటేశ్వర గానామృతం | భారతీ రాజకుమార్, సుమిత్ర |
4 | శ్రీవేంకటేశ్వర మహోత్సవ సేవలు | వి.రామకృష్ణ, జి.ఆనంద్, బి.వసంత |
5 | వరలక్ష్మి వ్రత కల్పం | విజయలక్ష్మీ శర్మ, బి.వసంత |
6 | శ్రీ గణేశ్వర గానామృతం | మనో, విజయలక్ష్మీ శర్మ, బి.వసంత, పద్మశ్రీ, బాబు బాలాజీ |
7 | అలమేలు మంగ వైభవం | రాము, గోపిక పూర్ణిమ, మల్లికార్జున్ |
8 | సత్యసాయి వైభవం | పి.సుశీల |
9 | వెంకటేశ్వర జానపద లహరి | మంగళంపల్లి బాలమురళీకృష్ణ |
10 | ఓం నమో వేంకటేశాయ | వందేమాతరం శ్రీనివాస్ |
11 | వరసిద్ధి వినాయక గానామృత లహరి | మధుసూదనరావు |
మూలాలు
[మార్చు]- ↑ కల్లూరు అహోబలరావు (1 August 1986). రాయలసీమ రచయితల చరిత్ర - 4వ భాగం (PDF) (1 ed.). హిందూపురం: శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల. pp. 121–126. Retrieved 17 January 2023.