నేలకొండపల్లి (ఖమ్మం జిల్లా)
నేలకొండపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఖమ్మం, నేలకొండపల్లి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°07′04″N 80°02′27″E / 17.117824°N 80.040779°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం |
మండల కేంద్రం | నేలకొండపల్లి |
గ్రామాలు | 22 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 61,325 |
- పురుషులు | 30,238 |
- స్త్రీలు | 31,087 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 56.40% |
- పురుషులు | 67.05% |
- స్త్రీలు | 45.70% |
పిన్‌కోడ్ | 507160 |
నేలకొండపల్లి, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలానికి చెందిన గ్రామం.[1]
ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 23 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2156 ఇళ్లతో, 7767 జనాభాతో 1435 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3827, ఆడవారి సంఖ్య 3940. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1679 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 198. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 579716.[3] పిన్ కోడ్: 507160.ఎస్.టి.డి.కోడ్ = 08742.
గ్రామ చరిత్ర
[మార్చు]నేలకొండపల్లి గ్రామం గొప్ప చారిత్రక స్థలం. మహాభారతంతో ముడిపడ్డ కథలొకవైపు, బౌద్ధ అవశేషాల తాలూకు చారిత్రక వాస్తవాలు మరొక వైపు ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత నిస్తున్నాయి. నేలకొండపల్లికి ఒక మైలు దూరంలో విరాటరాజు దిబ్బ, కీచక గుండం అనే స్థలాలు మహాభారత కథతో సంబంధం కలిగి ఉన్నాయి.
మనం చూస్తున్న ఈ ప్రాంతాన్ని కీచకగుండం అని పిలుస్తారు. ఇది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో ఉంది.దీనికి కీచకగుండం అని పేరు రావడానికి కారణం, భీముడు కీచకుడిని చంపింది ఇక్కడే అని జనం చెబుతుంటారు. అంతేకాదు కీచకుడిని చంపిన తర్వాత పాతిపెట్టిన ప్రాంతం కూడా ఇదే కావడంతో, దీనికి కీచకగుండం అని పేరుపెట్టారు.
నేలకొండపల్లి అనగానే టక్కున గుర్తొచ్చే పేరు భక్తరామదాసు. భద్రాచలంలో శ్రీరామచంద్రుడికి గుడి కట్టించిన పరమభక్తుడు రామదాసు. ఆ భక్తరామదాసు నడయాడిన ఈ ప్రాంతం ఎన్నో వింతలు విశేషాలకు పెట్టింది పేరు. రామదాసు సా.శ.1664లో ఈ గుడి కట్టించాడు. అంతకంటే కొన్ని శతాబ్దాల ముందు, అంటే సా.శ.2వ శతాబ్దంలోనే మనం చూస్తున్న బౌద్ధస్థూప నిర్మాణం జరిగింది. ఆ రోజుల్లో దక్షిణ భారతదేశానికి ఇక్కడ నుంచే బౌద్ధ విగ్రహాల పంపిణీ జరిగేది. విగ్రహాల తయారీ కేంద్రం ఇక్కడే ఉండేది. నేలకొండపల్లి అంటే నెలసెండా అనే పట్టణం అని, 2వ శతాబ్దంలోనే టోలమీ రాసిన ఇండికా గ్రంథంలో నేలకొండపల్లి ప్రస్తావన ఉంది. ఇట్లా నేలకొండపల్లి చరిత్ర 2వేల సంవత్సరాలదని అర్థమవుతోంది. కీచకవధ గురించి తెలుసుకోవాలంటే మనం పాండవుల వనవాసచరిత్రను గుర్తుచేసుకోవాలి. పాండవులు 12ఏండ్ల వనవాసం తర్వాత అజ్ఞాతవాసం కోసం ఉత్తరభారతం నుంచి దక్షిణభారత ప్రాంతానికి వచ్చారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వద్ద, విరాటరాజు రాజ్యం ఉంది. ఆ రాజు వద్ధ పాండవులు మారువేషంలో పనికి చేరుతారు. భీముడు ఆడవేషంలో వచ్చి కీచకుడిని వధిస్తాడు. కీచకుడు భీముడి యుద్ధం అతి భీకరంగా సాగుతుంది. మనం చూస్తున్న ఈ బైరాగుల గుట్ట రాళ్ల కిందనే కీచకుడిని సమాధి చేశారని చరిత్ర చెబుతోంది.
కురుక్షేత్ర సంగ్రామానికి నాంది పల్కింది నేలకొండపల్లే! కీచకవధ అంటే ద్వాపరయుగం నాటి కౌరవ పాండవ యుద్ధ కాలంలోకి పోవాలీ! మహాభారతంలో యుద్ద సన్నివేశాల వేదికగా నిలిచిన ప్రాంతాలు కాలక్రమేణా కనుమరుగయ్యాయి! కానీ, వాక్కు రూపంలో మాత్రం ఈ ప్రాంత చరిత్ర సజీవంగా నిలిచింది! ద్వాపర యుగం నుంచి, బౌద్ధుల వరకు, ఆ తరువాత కాకతీయులు, నిజాం కాలంలో భక్తరామదాసు వరకు ఎంతో చరిత్ర ఈ ఊరి సొంతం! భక్తరామదాసు చరిత్ర అంటే, 400 ఏండ్ల క్రితం సంగతి! కాని, గత 40 ఏండ్ల క్రితం వరకు కూడా, ఇక్కడ మనం చూస్తున్న బౌద్ధస్థూపం కనిపించేది కాదు! ఇక్కడ ఇపుడు మనం చూస్తున్న ఆ బౌద్ధస్థూప నిర్మాణం ఇటీవలే తవ్వకాల్లో బయటపడింది! ముజ్జుగూడెం గ్రామానికి చెందిన కొందరు పండుగల సమయంలో పుట్టమన్ను కోసం తవ్వకాలు జరిపారు! బౌద్ధస్తూపం బయటపడింది! సా.శ.2వ శతాబ్దం నుంచి దాదాపు 1800 ఏండ్లు అలా మట్టిపొరల్లో దాగున్న తథాగతుని చరిత్ర చీకట్లోనే ఉండిపోయింది!
బౌద్ధస్తూపం ఎలా మట్టిపొరల్లో వందల ఏళ్లు మరుగునపడ్డదో, సరిగ్గా అలాగే ఇదిగో ఈ ద్వాపరయుగ చరిత్ర సైతం వెలుగుచూడలేదు! కీచకవధ జరిగిన యుద్ధప్రాంతాలు అలానే మరుగునపడ్డాయి! కాని, వాక్కు మాత్రం చరిత్రను బతికిస్తున్నది! కౌరవ పాండవ వనవాస కాలంలో పాండవులు తమ బాణాలను జమ్మిచెట్టుపై దాచరని మనకందరికీ తెలుసు! ఆ జమ్మిచెట్టు బాణాపురంలోనే ఉందని మాత్రం ఎవరికీ తెలియదు! బాణాపురం ముదిగొండ మండలంలో ఉంది! ఈ ఊరిలోనే పాండవులు బాణాలు దాచారట! అందుకే ఈ ఊరికి బాణాపురం అనే పేరు వచ్చింది! మనం చూస్తున్న గోకినేపల్లికి ఆ పేరు రావడానికి కారణం పాండవులు వనవాస కాలంలో గోవులు ఇక్కడే కాశారట! అందుకే ఈ గ్రామానికి గోకినేపల్లి అని పేరు వచ్చిందని ఇక్కడి జనం తరతరాలుగా చెబుతున్నారు!
ఊరొక్కటే! కాని, ఒక్కో యుగంలో ఒక్కో చరిత్రకు దోసిలిపట్టింది నేలకొండపల్లి! తరతరాలుగా జనవాక్కుగా పిలవబడుతూ, కీచకగుండం కొలువైంది ఇక్కడే! ఈ చరిత్ర ఏ చరిత్రపుటల్లోకి ఎక్కలేదు! పాండవుల వనవాసం తర్వాత అజ్ఞాతవాసం కోసం విరాటరాజ్యంలో మారువేషంలో ఉంది! కురుక్షేత్ర సంగ్రామానికి నాంది పల్కిన నేలకొండపల్లి చరిత్రను ముందు తరాలకు తీసుకెళ్లడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి! కీచకవధ జరిగిన ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నా, ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ నిమ్మకు నీరెత్తినట్లు ఉంది! దీన్ని స్థానిక ప్రజలు ఖండిస్తున్నారు!నేలకొండపల్లి నాటి ద్వాపరయుగం నుంచి నేటి భక్తరామదాసు వరకు ఎన్నో విశేషాలకు వేదికైంది! కాలరగ్బంలో ఇంకా వెలుగులోకి రాని చరిత్ర అవశేషాలతో నెలువైంది! కాలగర్భంలో కలసిన ఈ కౌరవ పాండవ యుద్ధ విశేషాలతో పాటు, మట్టిపొరల్లో మరుగునపడ్డ తథాగతుని చరిత్రను వెలుగులోకి రావాల్సి ఉంది! నాటి ద్వాపరయుగం నుంచి నేటి భక్తరామదాసు వరకు, విశేషాలను వెలుగులోకి తెస్తూ కేసీఆర్ సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నేలకొండపల్లివాసులు కోరుతున్నారు!
ఇప్పటికైనా కీచకవధ జరిగిన నేలకొండపల్లిని టూరిస్టు స్పాట్‌గా ప్రకటించాలి! ద్వాపరయుగం నాటి చారిత్రక స్థలాలపై పరిశోధనలు చేసి, మరింత సమాచారాన్ని వెలుగులోకి తెచ్చి, పరిరక్షించాల్సిన బాధ్యత తెలంగాణ సర్కార్ పై ఉందంటున్నారు జిల్లావాసులు!
ఇటీవలి చరిత్రకు వస్తే.., నేలకొండపల్లి భక్త రామదాసుగా ప్రసిద్ధి గాంచిన కంచర్ల గోపన్న ఇక్కడే జన్మించాడు. ఆయన పుట్టిన ఇంటిని భక్త రామదాసు ధ్యాన మందిరంగా పిలుస్తున్నారు. గ్రామంలో పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి.
గ్రామంలో సౌకర్యాలు
[మార్చు]ఇక్కడ మండల రెవెన్యూ కార్యాలయం, మండల అభివృద్ధి కార్యాలయం, పోలీస్ స్టేషను, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, పలు జాతీయ బ్యాంకులు, తపాలా కార్యాలయాలు ఉన్నాయి.
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో 9ప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 9, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు 8, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు ఏడు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల ఖమ్మంలో ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ ఖమ్మంలో ఉన్నాయి.సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఖమ్మంలో ఉన్నాయి.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]నేలకొండపల్లిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఏడుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్.బి.బి.యస్. కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు.నాటు వైద్యులు ఇద్దరు ఉన్నారు. ఐదు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
[మార్చు]మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ ఉంది. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]నేలకొండపల్లిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
నేలకొండపల్లి ఖమ్మం నుండి కోదాడ (నల్లగొండ జిల్లా)రహదారిపై ఉంది. ఖమ్మం నుండి కోదాడ, నల్లగొండ, మిర్యాలగూడ, తిరుపతి, గుంటూరు వంటి ప్రదేశాలకు వెళ్ళే బస్సులు ఇక్కడ ఆగుతాయి. హైదరాబాదు వెళ్ళాలంటే ఖమ్మం లేదా కోదాడ నుండి ఎక్స్ ప్రెస్స్ బస్సులు దొరకుతాయి. ఖమ్మం నుండి దేశం లోని అన్ని ముఖ్య ప్రదేశాలకు రైలు సౌకర్యం ఉంది. అతి దగ్గర విమానాశ్రయం హైదరాబాదు విజయవాడలో ఉన్నాయి.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]నేలకొండపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 284 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 112 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 51 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 29 హెక్టార్లు
- బంజరు భూమి: 100 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 859 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 35 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 953 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]నేలకొండపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 473 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 75 హెక్టార్లు
- చెరువులు: 405 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]నేలకొండపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]సందర్శించవలసిన ప్రదేశాలు/ దేవాలయాలు
[మార్చు]- శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం:- కలియుగవరదుడైన శ్రీ వెంకటేశ్వరస్వామి ఇక్కడ భక్తాభీష్ట వరదుడై కొలువుదీరి ఉన్నాడు.చూపరులను ఆకట్టుకొనే ఆలయశోభతో, వివిధ దేవీదేవతలతో ఈ ధామం అలరారుతోంది. ప్రతి శుక్ర, శనివారాలలో ఇక్కడ విశేషపూజలు జరుగుతవి.ఈ ఆలయదర్శనం సర్వశుభదాయకంగా భక్తులు భావిస్తారు.[2] ఇంకా
- చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన భీమేశ్వరాలయం, వేణుగోపాలస్వామి, రాజగోపాలస్వామి ఆలయం, ఉత్తరేశ్వర ఆలయములు ఉన్నాయి. వీటిని కనీసం 400 సంవత్సరముల క్రితం నిర్మించారని ప్రతీతి.
విశేషాలు
[మార్చు]భక్తకవి రామదాసు స్వస్థలం
[మార్చు]పాహి రామప్రభో . . పాహి భద్రాద్రి వైదేహి . . . రామప్రభో అంటూ రాముడిని పరిపరివిధాలా ఆర్తిగా కీర్తించిన భక్తకవి రామదాసు (కంచర్ల గోపన్న) స్వస్థలం నేలకొండపల్లి. రామదాసు నేలకొండపల్లిలోని రాజగోపాలస్వామి అనుగ్రహంతోనే జన్మించాడని ప్రతీతి. రామదాసు తల్లిదండ్రులు, రామదాసు ఇలవేల్పుగా ఇష్టదైవంగా ఆరాధించుకున్న దైవం శ్రీ రాజగోపాలస్వామి[4].
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2017-12-12.
- ↑ "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ ఈనాడు జిల్లా ఎడిషన్ 18 సెప్టెంబరు 2013. 1వ పేజీ.[2] ఈనాడు జిల్లా ఎడిషన్ 25 అక్టోబరు 2013.
ఇతర లంకెలు
[మార్చు]- అంతర్లోచన బ్లాగ్ లో నేలకొండపల్లి పై వ్యాసం
- నమస్తే తెలంగాణ వెబ్ లో నేలకొండపల్లి పై వ్యాసం Archived 2016-03-05 at the Wayback Machine