పులుపుల వెంకటశివయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పులుపుల వెంకటశివయ్య కాకలుతీరిన కమ్యూనిస్టు యోధుడు. ఉత్తేజకరమైన పాటలను రాసిన రచయిత, యువజన, కార్మికోద్యమనేత.[1]

బాల్యం విద్యాభ్యాసం

[మార్చు]

వీరు నరసరావుపేటకు సమీపంలోని రొంపిచర్ల గ్రామంలో 1910 నవంబర్ 14న భగవాను, కోటమ్మ దంపతులకు జన్మించారు. పౌరోహిత్యం వృత్తిలో భాగంగా వీరి తండ్రి భగవాను వినుకొండలో స్థిరపడ్డారు. పలుపుల మిడిల్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో గుఱ్ఱం జాషువా తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1933లో బి.ఎస్‌.సి. చదవటానికి జాతీయ విశ్వవిద్యాలయమైన బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయానికి వినుకొండ నుండి చేరిన శివయ్య అక్కడ ఆరెస్సెస్‌ అగ్రనేత గోల్వాల్కర్‌తో పరిచయంతో ఆ శిబిరంలో చేరినా ఆ సంస్థ మతదురహంకారపూరిత వైఖరికి నిరసనగా వెంటనే బయటకు వచ్చారు. అప్పుడే అక్కడవున్న ఆంధ్రవిద్యార్థులు పోలేపెద్ది నరసింహమూర్తి, చండ్ర రాజేశ్వరరావు, తుమ్మల వెంకటరామయ్య తదితరుల సాన్నిహిత్యంలో కమ్యూనిస్టు ఓనమాలు శివయ్య దిద్దుకున్నారు. 1934లో పరీక్షలు పూర్తిచేసుకుని కాశీ నుండి ఒక ట్రంకుపెట్టెనిండా కమ్యూనిస్టు సాహిత్యాన్ని తీసుకువచ్చి కమ్యూనిస్టు స్రవంతిని ఆంధ్రలో ప్రవహింపజేశారు.

రాజకీయ జీవితం

[మార్చు]

1935 ఏప్రిల్‌ 17న గుంటూరులో జరిగిన తొలి సమావేశంలో కమ్యూనిస్టుపార్టీ జిల్లా కార్యదర్శిగా పోలేపెద్ది నరసింహమూర్తి ఎన్నికకాగా శివయ్య కమిటీ సభ్యునిగా ఎన్నికైనారు. పార్టీ మొదటి మహాసభల్లో పోలేపెద్డి రాష్ట్రపార్టీ కార్యదర్శిగా ఎన్నికవటంతో శివయ్య జిల్లాపార్టీ కార్యదర్శిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. గుంటూరులో పార్టీ కార్యకర్తలను పోషించటానికి, పార్టీని నిర్మించటానికి నండూరి ప్రసాదరావుతో కలిసి ఫ్రెండ్స్‌హోమ్‌ భోజనశాలను నడిపారు. అదేకాలంలో గుంటూరు పట్టణంలోను, జిల్లావ్యాపితంగా కూలీ రక్షణసంఘం, ప్రెస్‌ వర్కర్స్‌ యూనియన్‌, ముఠా కార్మికసంఘం, మున్సిపల్‌ కార్మికసంఘాలను నిర్మించి వారి హక్కులసాధనకై పాటుబడ్డారు. గుంటూరులోని కమ్మహాస్టల్‌ను కేంద్రంగా చేసుకొని బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించారు. విద్యార్థులెందరినో శివయ్య కమ్యూనిస్టులుగా తీర్చిదిద్డారు. అటువంటివారిలో మాకినేని బసవపున్నయ్య, మోటూరు హనుమంతరావు, వై.వి.కృష్ణారావు, వేములపల్లి శ్రీకృష్ణ, ఎల్‌.బి. గంగాధరరావు, టి.వెంకటేశ్వరరావు తదితరులున్నారు. వీరంతా తరువాత కమ్యూనిస్టుపార్టీ నేతలుగా రాష్ట్ర, జాతీయస్థాయిలో ఎదిగారు[2]. శివయ్య డిటెన్షన్‌ విధానానికి వ్యతిరేకంగా 1937-38 సంవత్సరంలో ఏ.సి. కళాశాలలో నిర్వహించిన విద్యార్థి ఉద్యమంలో పరోక్షంగా ప్రధానపాత్ర వహించారు. రాష్ట్రవ్యాపితంగా పార్టీ నిర్మాణంకొరకు శివయ్య ఆంధ్రరాష్ట్రం మొత్తం విస్తృతంగా పర్యటించారు. 1937 ప్రారంభంలో జరిగిన తూర్పుగోదావరిజిల్లా కమ్యూనిస్టుపార్టీ మహాసభలకు అధ్యక్షత వహించారు. 1938లో నెల్లూరువెళ్ళి అక్కడ ఎ.బి.ఎం. హైస్కూల్‌ విద్యార్థులచేత వారి హక్కులసాధనకోసం సమ్మెనడిపారు. రాష్ట్రంలో అంతకుముందు ఎక్కడా జరగనిరీతిలో రోమన్‌కాథలిక్‌ చర్చిలో పాటిస్తున్న కుల, మత భేదాలకు నిరసనగా సమ్మెను నిర్వహించి చరిత్రసృష్టించిన సమరజీవి శివయ్య. ఆంధ్రరాష్ట్రంలో కమ్యూనిజం పాఠాలు చెప్పిన తొలి అధ్యాపకుడు శివయ్య. 1937, 1938లో కొత్తపట్నం, మంతెనవారిపాలెంలలో జరిగిన కమ్యూనిస్టుపార్టీ వేసవి రాజకీయ పాఠశాలకు సిలబస్‌ను తయారుచేయటమేగాక ఆ పాఠశాలలకు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. ఈ పాఠశాలలో తయారైన అనేకమంది తరువాత కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రధాన భూమికను పోషించారు. శివయ్య జాతీయోద్యమంలో, కమ్యూనిస్టు ఉద్యమంలో జైలుశిక్షలకు గురైనారు. రెండవ ప్రపంచయుద్ధ కాలంలో 1943లో రహస్యజీవితం గడుపుతూ అరెస్టయ్యారు. 21 నెలల జైలు శిక్షను కోర్టు విధించింది. అయితే శివయ్య బళ్ళారిలోని అల్లీపురం జైలుగోడలు బద్దలుకొట్టుకొని బయటకొచ్చారు. తరువాత తిరిగి ఆరు నెలల జైలుశిక్షను అనుభవించారు. శివయ్య కమ్యూనిస్టుపార్టీ గుంటూరుజిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కమిటీ సభ్యునిగా, ఆంధ్రరాష్ట్ర ఆర్గనైజర్‌గా పనిచేశారు.

వినుకొండ సీమ ప్రజల ఆదరాభిమానాలను పొందిన శివయ్య వినుకొండ మేజర్‌ పంచాయతీ అధ్యక్షునిగా 1952 నుండి రెండు పర్యాయాలు పనిచేశారు. 1952, [3] 62 ఎన్నికలలో వినుకొండ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికైనారు. విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ఉద్యమ సందర్భంగా రెండోసారి శాసనసభ్యత్వానికి రాజీనామాచేసిన త్యాగశాలి శివయ్య. ప్రాచీనాంధ్ర, ఆంగ్ల సాహిత్యంలో మొదటినుంచీ అభి నివేశంవున్న వ్యక్తి శివయ్య.

సాహితీరంగం

[మార్చు]

శివయ్య కమ్యూనిస్టు ఉద్యమానికేగాక అభ్యుదయ సాహిత్యోద్యమానికి అందించిన సేవలు నిరుపమానమైనవి. అరసంలో శివయ్యది ఆదినుంచీ ప్రధాన పాత్ర. 1973లో గుంటూరులో జరిగిన అరసం ఆరవ రాష్ట్ర మహాసభలను ఉత్తేజకర ఉపన్యాసంతో ప్రారంభించారు. అరసం జిల్లాశాఖ అధ్యక్షునిగా, ఆఫ్రో ఆసియా రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా శివయ్యమృతి చెందే వరకూ కొనసాగారు.

కమ్యూనిస్టు రచయితగా సోవియట్‌ యూనియన్‌ను గురించిన సందేహాలు - సమాధానాలు పుస్తకాన్ని రచించారు. 1939లో అతివాద గ్రంథమండలి ప్రచురించిన ఆ పుస్తకంలో వర్ధమాన సోవియట్‌ యూనియన్‌పై ఆనాడు చెలరేగుతున్న విద్వేషపు ప్రచారాన్ని తిప్పికొట్టారు. 1949-50 సంవత్సరంలో మద్రాసులో రహస్య జీవితం గడుపుతూ కమ్యూనిస్టుపార్టీ అగ్రనాయకులు ఎస్‌.ఎ.డాంగే రచించిన పుస్తకాన్ని 'ఆదిమ కమ్యూనిజం నుంచి బానిసవిధానం వరకు'గా అనువాదం చేశారు. ఈ పుస్తకాన్ని విశాలాంధ్ర ప్రచురించింది. 1975 డిసెంబరులో కమ్యూనిస్టు పార్టీ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని రాసిన 'గుంటూరు జిల్లాలో కమ్యూనిస్టుపార్టీ ప్రారంభ దినాలు - కొన్ని స్మృతులు' రాష్ట్ర, జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించిన విశిష్టమైనచారిత్రక పత్రం. అభ్యుదయ సాహితీవేత్తగా శివయ్యరాసిన 'పలనాడు వెలలేని మాగాణిరా' నిత్యనూతన గేయం. పలనాటి ప్రాభవ వికాసాలను, భౌగోళిక, చారిత్రక, సాహిత్య అంశాలను నిక్షిప్తంచేసిన చారిత్రక గేయమది. "ఆయన మొదట్నించీ మా ముఠాలోనే వుంటే (అంటే రచయితగా జీవించినట్లయితే) అభ్యుదయ సాహిత్యోద్యమం యింకా పరిపుష్ఠం చెందేదేమో!" అని శివయ్యకు అత్యంత సన్నిహితులు, ప్రముఖ కవి కుందుర్తి ఆంజనేయులు అభిప్రాయపడ్డారు. అయితే దీనికి సమాధానమన్నట్టుగా "శివయ్య ఇంకా గొప్పకవి అయివుండేవారు. సాహిత్యకృషి సాగించివుంటే కవిత్వంకన్నా గొప్ప పనులు నిర్వహించాలనుకున్నారు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి, ప్రజా సమస్యలకు తమకు తాము అంకితం చేసుకున్నారు" అని భాషాశాస్త్రవేత్త చేకూరి రామారావు అన్నారు. శివయ్యరాసిన 'తెలుగు సాహిత్యంలో దేశభక్తి' వ్యాసంలో మధ్యయుగపు తెలుగుసాహిత్యానికి, శ్రీనాథునికి సంబంధించి పరిశోధకులు సైతం చేయనటువంటి అపూర్వ నిర్ధారణలు చేశారు. "పురాణ కవులలో చివరివాడు, ప్రబంధకవులకు మొదటివాడు అయిన శ్రీనాథుడు మధ్యయుగ సారస్వత చరిత్రలో కాకతీయకాలపు స్వర్గస్మృతులను కలిగించే కవినాథుడు" అనీ "మధ్యయుగ సారస్వతంలో శ్రీనాథుడొక్కడే రాజకీయ నిర్వచనంతో దేశ స్వాతంత్య్రాన్ని ఆశయంగా బోధించాడు" అని స్పష్టంచేసిన సాహిత్య విశ్లేషకుడు శివయ్య.

1944లో రాజమండ్రివెళ్ళి హితకారిణీ సమాజ్‌ నిర్వాహకులతో కలిసి మాట్లాడి వీరేశలింగం పంతులు రచనలను ప్రచురించటానికి అనుమతిని సాధించి తెలుగువారికి వీరేశలింగం రచనలను చేరువచేసిన కార్యదక్షుడు శివయ్య. 1943లో తొలి అభ్యుదయ కవితా సంకలనం 'నయాగరా'ను ప్రచురించి చిరకీర్తిని పొందిన ఆ కవులకు మార్గదర్శకుడు శివయ్య. "నయాగారా కవులు ముగ్గురిని ఒక దారికి లాగడానికి ప్రయత్నించిన వారిలో శివయ్య ముఖ్యులు" అని అందులో ఒకరైన కుందుర్తి పేర్కొన్నారు. తన వ్యక్తిత్వంతో, మార్క్సిస్ట్‌ తాత్విక చింతనతో సృష్టించిన సాహిత్యంతో తెలుగునేలను ప్రభావితం చేసిన శివయ్య అసాధారణుడు.

పలనాడువెలలేని మాగాణిరా!

[మార్చు]

వీరు వ్రాసిన "పలనాడు వెలలేని మాగాణిరా" అనే వీర గేయగాథ సుప్రసిద్ధమైనది. అందులోని కొన్ని పంక్తులు:

శాతవాహన తెలుగు చక్రవర్తుల శౌర్య
మిదెబ్రాహ్మ్య మిదెక్షాత్రమన్న గర్జా ఘోష
పులకలే యెత్తించెరా పలనాట
పౌరుషమ్మే పొంగెరా!

తొలిసంజ దీక్షతో తెలుగు శిల్పుల చేతి
పోగరలు మలచిన బుద్ధయుగ జీవితము
నవశిల్ప రతనంబురా ,పలనాట
నాగార్జునుడి కొండరా!

బౌద్ధనాగార్జునిని బుద్ధవిజ్ఞాజ్యోతి
వరమహా యానమై వసుమతిని ప్రవహింప
హెచ్చుతగ్గులు సమసెరా పలనాట
విజ్ఞాన ప్రభ వెలిగెరా!

వర్ణధర్మాలన్న ఉక్కుచట్రము పగిలి
మాల కన్నమదాసు మనసైన సుతుడుగా
వీరవైష్ణవ మొచ్చెరా, పలనాట
బ్రహ్మన్న కలిగీతలో!

మగువ నాగమ్మతో మాయ యుద్ధము వచ్చి
మగువ మాంచాల తా మగని రణమున కంప
వీరవనితలు పుట్టిరీ ,పలనాట
శౌర్యముగ్గులు పెట్టిరీ!

బాలచంద్రుని కత్తి పదును మెరపులు మెరసి
తరలి కారంపూడి ధర్మరణరంగాన
వీరరక్తము చిందెరా,పలనాట
నాగులేరై పారెరా!

బాలచంద్రుని కదన కౌశలము కధలల్లి
శ్రీనాధ కవిరాజు చంద్రవంకకు చెప్ప
ఎదకరిగి ప్రవహించెరా ,పలనాట
ఎత్తిపోతల దూకెరా!

కృష్ణరాయల సభా కవిదిగ్గజాలలో
ఘటికాశతగ్రంధ కరణధుర్యుండైన
భట్టుమూర్తే వెలసెరా, పలనాట
ప్రౌఢ శ్లేషలు పల్కెరా!

కలిమి బలిమీ గల్గు కర్షకుల సీమలో
కానికాలం వచ్చి కలహములు చెలరేగ
కుంఫిణీ వాడొచ్చెరా, పలనాట
ఖైదుకొట్టులు కట్టెరా!

దాస్యమూ దోపిడీ దారిద్ర్యమూ హెచ్చి
పాడిపంటల మేలి బంగారు నాతల్లి
కరువుకాటకమొచ్చెరా, పలనాడు
కంటనీరెట్టిందిరా!

ఒక్క సుముహూర్తాన ఉప్పొంగి భరతోర్వి
స్వాతంత్ర్య సమరాన సింహనాదం సేయ
మేరువైనిలచిందిరా, పలనాడు
ముందుండిపోరిందిరా!

కన్నెగంటి హనుమంతు కోరమీసము త్రిప్పి
పలనాటి ప్రజలచే పన్నులెగబెట్టించె
బలియిచ్చె హనుమంతునూ, పలనాడు
పరప్రభుత్వపు గుండ్లకూ!

ఆనాటి పౌరుషాలానాటి విక్రమా
లానాటి వైభవాలానాటి సంస్కృతుల్
ఈనాటికీ చరితలోనా, పలనాడు
వెలయించె బంగారుతో!

వెనుకతరములవారి వీరచరితల సిరులు
నార్వోసి త్యాగంబు నీర్వెట్టి పెంచరా !
విరిసి సుఖములు పండురా, పలనాడు
వెలలేని మాగాణిరా!

మరణం

[మార్చు]

సోవియట్‌ యూనియన్‌లో పర్యటిస్తూ 1976 జూలై 14న మాస్కోలో వీరు మరణించారు.

అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ 1980 నుండి పులుపుల వెంకటశివయ్య పేరిట పురస్కారాలను ప్రకటించింది. ఈ సత్కారాన్ని పొందిన వ్యక్తులు/సంస్థలు:[4]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-07-19. Retrieved 2016-07-18.
  2. http://54.243.62.7/literature/article-13403[permanent dead link]
  3. "మద్రాసు శాసనసభ సమీక్ష - 1952-57" (PDF). తమిళనాడు శాసనసభ. p. 93. Archived (PDF) from the original on 2020-10-15. Retrieved 2021-11-03.
  4. పెనుగొండ లక్ష్మీనారాయణ (1 January 2020). గుంటూరు సీమ సాహిత్య చరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం. pp. 282–283.