Jump to content

బతుకమ్మ

వికీపీడియా నుండి
(బతకమ్మ నుండి దారిమార్పు చెందింది)
బతుకమ్మ
బతుకమ్మ
అధికారిక పేరుతెలంగాణ పండుగ
యితర పేర్లుపూలపండుగతెలంగాణ రాష్ట్రంలో జరుపుకొనే పండగ
రకంగౌరీ దేవి పండుగ
ప్రారంభంమహాలయ అమావాస్య
ముగింపుదుర్గాష్టమి
జరుపుకొనే రోజుసెప్టెంబరు/అక్టోబరు
ఉత్సవాలు9 రోజులు
సంబంధిత పండుగదసరా
కొత్తకోడళ్లకు ఇచ్చే బతుకమ్మ వాయనం - వెండి బతుకమ్మ
తంగేడు, గునుగు, గుమ్మడి, తామర వంటి పూలతో పాటు వెండి కోలలు అమర్చిన బతుకమ్మ

'బతుకమ్మ' పండుగను తెలంగాణా రాష్ట్రంలో భాద్రపదమాస అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.[1][2] తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.[3]

బతుకమ్మ పండుగ విశిష్టత

[మార్చు]

సెప్టెంబరు, అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు. నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కలయకలతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి 'బతుకమ్మ పండుగ', మరియొకటి దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక.

రంగు రంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు అనే పాటలను పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చిన గత వెయ్యి ఏళ్లుగా బతుకమ్మను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు. ఎన్నో చరిత్రలు, పురాణాలు మేళవిస్తారు.ఎన్నో చారిత్రక పాటలు పాడుతారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో" పాటల వెనుక ఉండే మర్మం ఇదే.

ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. సీతాఫలాలు (షిత్పొలా పండ్లు అంటారు) కూడా ఈ సమయంలో ఒక పెద్ద ఆకర్షణ. సీతాఫలాన్ని పేదవాని ఆపిల్ అంటారనేది తెలిసినదే. అలాగే జొన్న పంట కోతకు సిధ్ధంగా తలలూపుతూ ఉంటుంది. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ ఆడపడుచులు ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతమయిన రంగురంగుల పువ్వులతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు

తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ ఖండాంతరాలు దాటి ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది.

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ దసరా సంబరాలు 2023

పండుగ కథ

[మార్చు]

తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యలు సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటులకు యుద్ధం జరిగినప్పుడు ఈ చాళుక్యలు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతంచేసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాస్రాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. అప్పటి వేములవాడ (ప్రస్తుత కరీంనగర్ జిల్లా) లో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది. ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందరచోళా కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళానే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైన రాజేంద్రచోళ సత్యాస్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. సా.శ 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బ్రిహదేశ్వరాలయంలో ప్రతిష్ఠించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బ్రిహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళ రాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి, బ్రిహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది. బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణవాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణవాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు.

బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు "బొడ్డెమ్మ" (మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ) ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు.

ఆకాశంలో బతుకమ్మ

[మార్చు]

తెలంగాణ పర్యాటక శాఖ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2018, అక్టోబరు 19న ఆకాశంలో బతుకమ్మ కార్యక్రమం జరిగింది. బతుకమ్మను పట్టుకొని పారా మోటారులో ఎక్కిన పలువురు మహిళలు ఆకాశంలో 5 నిముషాలపాటు విహరించారు. సికింద్రాబాద్‌లోని బైసన్ పోలోగ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్ సునీతా భగవత్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, షి టీమ్స్ సభ్యులు పాల్గొన్నారు.[4]

పండుగ సంబరాలు

[మార్చు]
బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడుతున్న మహిళలు
బతుకమ్మ సంబరాలు
చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేస్తున్న దృశ్యం
మలీద - చక్కెర, రొట్టెతో చేసిన పిండివంటకం
తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు

9 రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువతీయువకులు పాల్గొంటారు. చివరిరోజును సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.[5]

  1. ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
  2. అటుకుల బతుకమ్మ: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
  3. ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
  4. నానే బియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
  5. అట్ల బతుకమ్మ: అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.
  6. అలిగిన బతుకమ్మ: ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.
  7. వేపకాయల బతుకమ్మ: బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
  8. వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
  9. సద్దుల బతుకమ్మ: ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు.

పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం. తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.

తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం వాని చుట్టూ తిరుగుతూ ఆడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు.[6]

అయితే చివరి రోజు బతుకమ్మ (సద్దుల బతుకమ్మ) పండుగ అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోనికి పోయి తంగేడు, గునుగు మొదలగు పూలను భారీగా ఏరుకుని వస్తారు. ఆ తరువాత ఇంటిళ్ళపాదీ కూర్చుని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇందులో గునుగు పూలు, తంగెడు పూలు ముఖ్య భూమికను పోషిస్తాయి.

ఈ పూలను జాగ్రత్తగా ఒక రాగి పళ్ళెం (తాంబలం) లో వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. ముందుగా తంగెడు ఆకులు, పూలు పళ్లెంలో లేదా తాంబోలంలో పేర్చుతారు, ఆపై తంగేడు పూల కట్టలు పేర్చుతారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ అమరిక ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది. తెల్లని గునుక పూలను రంగులతో అద్ది పెడతారు. పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరి మాతను పెడతారు. ఇలా పేర్చిన బతుకమ్మను గృహంలోని దైవస్థానంలో అమర్చి కొవ్వొత్తులతో, అగరొత్తులతో అలంకరించి పూజిస్తారు. సాయంకాలం అందరూ తమ తమ బతకమ్మలతో ఒక చోట చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరి దేవిని కీర్తిస్తూ ఆడవారు పాడుతారు. ఆడవారు వారికి ఉన్న అన్ని రకాల ఆభరణాలను దరించి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఇలా చాలా సేపు ఆడాక మగవారు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మా వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు.

ఆపై ఇంటి నుండి తీసుకువచ్చిన పెరుగన్నం, సత్తుపిండి (మొక్కజొన్నలు, లేదా వేరుశనగ లేదా పెసర విత్తనాలను దోరగ వేయించి, వాటిని పిండి చేసి, వాటితో చక్కెర పిండి లేదా బెల్లం, నెయ్యి తగినంత కలిపి తయారు చేస్తారు) లను ఇచ్చి పుచ్చుకొని తింటారు.

చివరి రోజు సాయంత్రం, ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు, అభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. ఐక్యత, సోదరభావం, ప్రేమను కలపి రంగరిస్తూ మానవ హారం ఏర్పరిచి పాటలు పాడుతారు. ఒకరు ముందుగా పాట మొదలుపెడితే మిగిలినవారు వారితో గొంతు కలుపుతూ పాడుతారు. ఈ జానపద గీతాలు చుట్టు పక్కలా ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణా సంస్కృతిని ఆవిష్కరిస్తాయి.

చీకటి పడుతుంది అనగా, స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువు గానీ, తటాకంవైపు గానీ ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపు అందంగా అలంకిరించుకున్న స్త్రీలు, బతుకమ్మలతో అత్యంత సుందరంగా, వైభావయానంగా ఉంటుంది. ఈ ఊరేగింపు కొనసాగినంత సేపూ, జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. జలాశయం చేరుకున్న తరువాత, మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ, ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తరువాత "మలీద" (చక్కెర, రొట్టెతో చేసినది) అనే పిండి వంటకాన్ని బంధు మిత్రులకు పంచిపెడతారు. ఆ తరువాత ఖాళీ తాంబలంతో పాడుతూ, బతుకమ్మను కీర్తిస్తూ ఇంటికి చేరుతారు. ఈ తొమ్మిది రోజులూ, ఈ పాటలన్నీ అర్ధరాత్రి వరకూ వీధులలో మారు మ్రోగుతూనే ఉంటాయి.

హన్మకొండలో బతుకమ్మ పండగ, దసరా పండుగ

[మార్చు]

హన్మకొండ పట్టణం అయినప్పటికీ బతుకమ్మ, దసరా పండుగలను మాత్రం పల్లెల్లో కంటే గొప్పగా జరుపుకుంటారు. పితృ అమావాస్య (పెత్రమవాస్య) తో బతుకమ్మ పండుగ మొదలుపెట్టి తొమ్మిది రోజుల పాటు రోజూ సాయంత్రం బతుకమ్మ ఆడుకుంటారు. అయితే ఆరవ రోజు మాత్రం బతుకమ్మ ఆడరు. పెత్రమావస్య ముందు రోజు సాయంత్రం నుండి చుట్టుప్రక్కల పల్లెల నుండి వచ్చిన అమ్మకదారులు తంగేడు, గునుగు, తామర, గుమ్మడి, బంతి, చేమంతి మొదలగు పువ్వులను అమ్ముతారు. వీటితో పాటు బతుకమ్మ పేర్చడానికి సిబ్బులు, గుమ్మడి ఆకులను కూడా అమ్ముతారు. తిరిగి వీటినన్నింటిని సద్దుల బతుకమ్మ ముందురోజు కూడా అమ్ముతారు. బతుకమ్మ మొదటిరోజు నుండి ఎనిమిదోరోజు వరకు అందరు వారి ఇంటి దగ్గరి గుళ్ళల్లో, ఖాళీ ప్రదేశాల్లో బతుకమ్మ ఆడుతారు. కాని తోమ్మిదో రోజైన దుర్గాష్టమి నాడు సాయంత్రం మాత్రం పిల్లల నుండి పెద్దలవరకు, ఎన్నడూ ఇంట్లో నుండి బయటికి వెళ్ళని వారు కూడా ప్రతి ఒక్కరు కొత్తబట్టలు వేసుకొని, వివిధ నగలను ధరించి తాము తయారుచేసిన బతుకమ్మలను చేత బట్టుకుని పద్మాక్షమ్మ గుట్టకు పోతారు. బతకమ్మలను మధ్య వుంచి, బాలికలు, స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ, "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! బంగారు బతుకమ్మ ఉయ్యాలో!! " అని గొంతెత్తి ఒకరు పాడగా మిగతా వారు ఆ పాటను అనుసరిస్తూ పాడుతారు. సుమారు గంట నుండి రెండు గంటల వరకు అలా ఆడిన తర్వాత, బతుకమ్మను అక్కడే ఉన్న కోనేటిలోని నీళ్ళల్లో వదులుతారు. బతుకమ్మతోబాటు సద్దులు కూడా పట్టుకుపోతారు. సత్తిపిండి, నువ్వులపొడి, పల్లీలపొడి, కొబ్బరిపొడి మొదలగు వాటిని కలిపి సద్దులు అంటారు. బతుకమ్మను నీళ్ళల్లో వదిలిన తర్వాత సద్దులను అందరు పంచుకుని తిని, పసుపుకుంకుమలను ఒకరికొకరు ఇచ్చుకుంటారు. తిరిగి ఆటోలల్లోగాని, కార్లల్లోగాని ఇంటికి చేరుకుంటారు. బతుకమ్మ పండుగ మరుసటి రోజు వచ్చే దసరా పండుగను కూడా హన్మకొండలో వైభవంగా జరుపుకుంటారు. దసరా రోజు ప్రతి ఒక్కరు తమ తమ వాహనాలను కడుక్కొని, పూలదండవేసి కొబ్బరికాయ కొట్టి మొక్కుతారు. చేతిపనులవారు తమ పనిముట్లకు, పరిశ్రమల వారు తమ యంత్రాలకు పూజలు చేస్తారు. పోలీస్, మిలిటరీ వాళ్ళు కూడా తమ ఆయుధాలకు పూజచేస్తారు. ఇండ్లకు ముగ్గుపోయడం, గృహప్రవేశాలు, దుకాణాల ప్రారంభం మొదలగు కొత్తపనులను చేస్తారు. బతుకమ్మరోజు కూరగాయల భోజనంచేస్తే, దసరా నాడు మాత్రం అందరు (శాకాహారులు మినహా) మాంసాహార భోజనం చేస్తారు. పూరీలు, గారెలు చేసుకుంటారు. చాలా మంది మద్యాన్ని కూడా సేవిస్తారు. సాయంత్రం నాలుగు గంటల నుండి పురుషులు, స్త్రీలు, పిల్లలందరూ కొత్తబట్టలు వేసుకొని జమ్మి కొరకు పద్మాక్షమ్మగుట్టకు పోతారు. గుట్ట దగ్గరికి పోవడానికి బలమైన కారణముంది. గుట్ట దగ్గరికి వివిధ ప్రాంతాలనుండి వచ్చిన ప్రతి ఒక్కరు వస్తారు. తమ చిన్ననాటి మిత్రులను, దోస్తులను కలుస్తారు. జమ్మి ఆకు తీసుకొని, పాలపిట్టను చూసి, దసరా ఉత్సవ కమిటీవారు ఏర్పాటు చేసిన రావణాసుర వధను చూసి ఇంటికి వస్తారు. గుట్ట దగ్గరి నుండి ఇంటికి వచ్చేవరకు, వచ్చిన తర్వాత పెద్దలకు, మిత్రులకు జమ్మి ఆకు చేతిలో పెట్టి, కాళ్ళకు మొక్కి, ఆలింగనం చేసుకుంటారు. కొంత జమ్మియాకును బీరువాలల్లో వేసుకుంటారు. ఈ విధంగా బతుకమ్మ, దసరా పండుగలను హన్మకొండలో బాగా ఘనంగా జరుపుకుంటారు.

వివిధ ఆచారాలు

[మార్చు]

జానపదులు తమసంతు దక్కాలని అమ్మదేవతలకు మొక్కుకునే ఆనవాయితీ పురాతనమైనది. పుట్టిన పిల్లలను చల్లగా చూడమని అమ్మదేవతల ముందు కట్టిన ముడుపులు, మొక్కులు చెల్లించుకుంటారు. కొంతమంది పుట్టినపిల్లలు పుట్టినట్లు చనిపోతుంటే, పిల్లలు పుట్టిన వెంటనే పెంట మీద వేసి తెచ్చుకుని ‘పెంటమ్మ లేదా పెంటయ్య’ అని పేరు పెట్టుకుంటారు. మరి కొందరు పుట్టినపిల్లల్ని ఎవరికైనా ఇచ్చి ‘బిచ్చంగా’ తిరిగియ్యమని కోరుకుంటారు. అట్లా తీసుకున్న పిల్లలకు ‘భిక్షపతి,భిక్షమ్మ’లని పేరు పెట్టుకుంటారు. వాళ్ళే బుచ్చపతి, బుచ్చమ్మలుగా పిలువబడుతుంటారు. ఇట్లాంటి సందర్భాల్లోనే బతుకనిపిల్ల బారెడనే సామెతలు పుట్టాయి. పిల్లల్ని బతికించమనే వేడుకునే దేవతల్లో మన బతుకమ్మ ఒక దేవత. ఆ దేవత వరాన బతికితే బతుకమ్మ, బతుకయ్యలని పేర్లు పెట్టుకుంటారు. సమ్మక్క మేడారంలో బతుకయ్య పేరున్న వాళ్ళు ఇపుడు కూడా వున్నారు.

ఈ పూలపండుగ బతుకమ్మ ఎంగిలిపూలతో మొదలుపెట్టి సద్దులబతుకమ్మతో ముగిసిపోతుంది. బొడ్డెమ్మపండుగ నాడు ‘బొడ్డెమ్మ బొడ్డెమ్మా వలలో , బిడ్డాలెందారే.. వలలో’ అని పాడే పాట సంతానం గురించే కదా. నాటి రోజుల్లో నీళ్ళాడే (ప్రసవ) సమయాల్లో శిశుమరణాలు జాస్తిగా వుండేవి. నీటిరేవులే ఆనాటి తల్లులకు ప్రసూతి స్థలాలు. నీళ్ళల్లో ప్రసవించే సమయంలో తల్లులు తమసంతు బతికినందుకు ప్రతీకగా నీటివారన పెరిగే తంగేడు, గునుగు పూలముద్దలను నిమజ్జనం చేసివుంటారు. ఆ తల్లుల ఆచారమే బతుకమ్మ పండుగగా మారి వుంటుంది. ఇది తెలంగాణా ప్రాంతానికే చెందడం మన గొప్ప సంస్కృతికి సాక్ష్యం. ఎవ్వరికన్న ఐదారుగురు కన్నా ఎక్కువమంది పిల్లలుంటే ఆ తల్లిని గౌరవించేవాళ్ళు. మానవజాతి పిల్లల వల్లనే కదా ఇన్ని వేలయేండ్లుగా మనగలిగింది. అందుకే తల్లికంత గౌరవం. అమ్మతనం మీద భక్తి. ఆ భక్తే అమ్మదేవతలను కల్పించింది. పూజించింది. అమ్మదేవతల పూజల్లో ఒక ఆరాధనా రూపమే మన బతుకమ్మ.

బౌద్ధంలో ముందు చెడ్డదేవతగా, పిల్లల్ని ఎత్తుకపోయే రాక్షసిగా పిలువబడ్డ హారీతి బుద్ధునివల్ల మంచిదానిగా, పిల్లల్ని రక్షించే దేవతగా మారిపోయింది. ఆమెనే పిల్లలదేవతగా కొలుస్తారు. పుట్టిన తమ పిల్లలు బతుకాలని, రోగాలు, రొష్టులు లేకుండా వుండాలని హారీతిని ఆరాధించేవారు. ఈ దేవత గురించి బౌద్ధ జాతక కథల్లో చదువగలం. వివిధ చారిత్రకదశల్లో ఈ దేవత విగ్రహాలు వేర్వేరు రూపాల్లో అగుపిస్తున్నాయి. చాళుక్యులు తమను తాము హారీతిపుత్రులుగా శాసనాల్లో చెప్పుకున్నారు.2వ శతాబ్దంలో ఇక్ష్వాకుల కాలం నుండి హారీతి శిల్పాలు కనిపిస్తున్నాయి.12వ శతాబ్దం దాకా శాసనాల్లో హారీతిపేరు ప్రస్తావించబడ్డది. పిల్లల్ని బతికించే దేవత హారీతినే బతుకమ్మగా భావించినారేమో.

కూష్మాండిని దేవతకు ప్రతీకగా గుమ్మడిపువ్వును పూజించే ఆచారమే బతుకమ్మ పండుగగా మారిందని కొందరి అభిప్రాయం. మన పూర్వీకులు ఇనుము-ఉక్కు తయారీకి తంగేడుచెక్కను వాడేవారని నేను విన్నాను. తోలు తయారీకి తంగేడు ఎంత అవసరమో అందరికి తెలుసు. గునుగుకు నీళ్ళను శుభ్రపరిచే గుణముంది. తమకు నిత్యజీవితాసరాలైన తంగేడు, గునుగుపూలతో మనపూర్వీకులు తమ అమ్మదేవత (కూష్మాండిని?) ని పూజించే రూపమే పరిణామంలో జాతరగా మారి వుంటుంది. గునుగు, తంగేడుపువ్వులతో కొప్పురం రూపంలో పూలబతుకమ్మను పేర్చి, శిఖరం లేదా సిగమీద గుమ్మడి పువ్వుంచి, పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. పూజపువ్వులను తొక్కుట్లవెయ్యని ఆచారమే బతుకమ్మలను నీళ్ళలో వదిలే సంప్రదాయమైంది.

దసరా పండుగ సందర్భంగా కొలిచే హిందూదేవత నవదుర్గారూపాల్లో కూష్మాండిని ఒకటి. ఎనిమిదవ రోజున కూష్మాండినిని అర్చిస్తారు. అదేరోజు బతుకమ్మలాడుతారు. కొన్ని ప్రాచీన ఆచారాలను మతాలు స్వంతం చేసుకున్న క్రమం చరిత్రలో కనిపిస్తుంది మనకు. ఈ పండుగకు కూడా కులాల మసిపూయడం అనాచారం. ఇది ఎక్కువ (పెద్దకులాల) వాళ్ళ పండుగ కాదు తక్కువ (చిన్నకులాల, జాతుల) వాళ్ళదే. గిరిజనులదే. తొలి మొలకలను, తొలిపూతను కొలిచే ఆచారం గిరిజనులదే. పువ్వంటే రేపటి ఫలమని వాళ్ళకు తెలుసు. ఆడపిల్లలను, పువ్వుల్ని కొలిచే పండుగే మన బతుకమ్మ. ఈ పండుగకు మతం లేదు. మతాచారాలు రుద్దబడ్డాయి. మన ప్రాంతంలో కూష్మాండిని ఆరాధన జైనులవల్ల వచ్చింది. జైనమతానుయాయులైన కాకతీయులవల్ల ప్రోత్సహించబడ్డది. జైనంలో 22వ తీర్థంకరుని శాసనదేవత, యక్షిణి అంబిక (అంబ=అమ్మ) లేదా కూష్మాండిని (గుమ్మడితీగె, గుమ్మడిపువ్వు). ఈమె ప్రతిమాలక్షణంలో చేతుల్లో ఫలాలతో, ఇద్దరు పిల్లలతో, మామిడిచెట్టుకింద కూర్చొనివున్నట్టు ఉంది. అంబిక కూడా ఒక అమ్మదేవతే. ఈ దేవతలకు ప్రతిమారూపాలు సా.శ. 5వ శతాబ్దం నుంచే కల్పించబడ్డాయి. అంతకు ముందున్నట్టు చారిత్రకాధారాలు లేవు.

బతుకమ్మల తయారీలో కూడా చాలా భేదాలు కనిపిస్తాయి. బతుకమ్మలు స్తూపాల ఆకారంలో వుంటాయి. లింగాల తయారీలో కూడా ఇటువంటి సంప్రదాయముందని చాలాచోట్ల చెప్పబడింది. పూర్వం బౌద్ధులు తమ ఆరాధనలో భాగంగా చేసుకున్న స్తూపాలను పూలు, మట్టి, ఇసుక, పేడ, రాయి, ఇటుకలతో తయారుచేసుకునేవారు. బౌద్ధభిక్షుకులు నిరంతరం ప్రయాణిస్తుండడం వల్ల స్తూపారాధనకు తమకు దొరికిన వాటినే స్తూపాలుగా చేసుకుని బుద్ధునికి ప్రతీకగా నమస్కరించేవారు. పూలు, ఇసుక, మట్టి, పేడ స్తూపాలను నీటిలో కలిపేసేవారు మర్యాదగా. వాళ్ళు తిరుగాడిన ప్రదేశాల్లోని ఎన్నో వాగులు, ప్రవాహాలు భిక్కేరులుగా పిలువబడుతున్నది ఒక్క తెలంగాణలోనే. అందువల్లనే తొలుత బౌద్ధులైన గిరిజనులు, వనజనులు ఈ ఆచారాన్ని కొనసాగించివుంటారు. దానికి వారి కోరికలు మన్నించిన అమ్మదేవతకు ప్రతీకగా తర్వాత చేసుకుని వుంటారు. పిదప కాలాల్లో వచ్చిన మతపరిణామాలవల్ల ఈ దేవతలను తమ, తమ మతదేవతలుగా చేసుకున్నారు. ఆ దేవతలే బౌద్ధంలో హారీతిగా, జైనంలో ఆమ్రకూష్మాండినిగా, హిందూమతంలో అంబికగా పూజింపబడ్డారు. తెలంగాణాలో అతిప్రాచీనమైన అమ్మదేవతల ఆరాధనమే తల్లుల రూపంలో ఏ దేవత వచ్చినా తమ దేవతల్లో కలుపుకున్న సంప్రదాయమే బతుకమ్మ జాతరగా నిలిచిపోయింది. దసరాపండుగతో బతుకమ్మను కలుపడం, అమ్మదేవతలను కాకుండా పితృదేవతలను పూజించే ఆచారంగా మారడం ‘పెత్రామాస’ (పితృ అమావాస్య) ను ఈ పండుగలో చేర్చడం తర్వాతి కాలాల్లో వచ్చిన పరిణామమే.

జనపదుల ఆచారాలు చాలా ప్రాచీనమైనవి. అవి వేలయేండ్ల పూర్వపువి. ఒక్కో జాతికి, ప్రాంతానికి పరిమితమైనవి. బతుకమ్మ మనకు, మన తెలంగాణాకే పరిమితమైంది. ప్రపంచంలో మరెక్కడా లేని పూలపూజ మన సంస్కృతి. బతుకమ్మ జానపదుల పండుగ. బతుకమ్మ ఆటలో గుస్సాడి నృత్యం, చప్పట్లలో జానపదుల పాట, ఆటల కలయిక మనమూలాలను ఎరుకపరిచే మంచి సంప్రదాయం. బతుకమ్మ అచ్చతెలుగు మాట. దాన్ని సంస్కృతీకరించి పౌరాణికం చెయ్యొద్దు.

బతుకమ్మ వేడుకలు

[మార్చు]
  • 2022: తెలంగాణ రాష్ట్రంలో 2022 సెప్టెంబరు 25వ తేదీ నుండి అక్టోబరు 3వ వరకు బతుకమ్మ వేడుకలు జరిగాయి.[7] ఈ బతుకమ్మ వేడుకల కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 10 కోట్ల రూపాయలు విడుదల చేశాడు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో సెప్టెంబరు 26వ తేదీ నుండి అక్టోబరు 2వ వరకు మహిళలు, మహిళా ప్రతినిధులతో బతుకమ్మ ఆటలు, తెలంగాణ సంగీత నాటక అకాడమీ సారథ్యంలో సెప్టెంబరు 26, 27, 28 మూడురోజులపాటు దేవి వైభవ్‌ నృత్యోత్సవాలు, అధికార భాషా సంఘం సారథ్యంలో అక్టోబరు 2న గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళిగా బతుకమ్మ ఉత్సవాలు తదితర కార్యక్రమాలు, చివరిరోజు అక్టోబరు 3న ఎల్‌బీ స్టేడియం నుంచి వేలాదిమంది మహిళలతో, బతుకమ్మలతో వెయ్యి మందికిపైగా జానపద, గిరిజన కళాకారులతో ఊరేగింపుగా వెళ్ళి ట్యాంక్‌బండ్‌పై నిమజ్జన ఉత్సవాలు[8] నిర్వహించబడ్డాయి.[9]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నిచోట్ల అంతగా జరగనప్పటికీ గుంటూరుజిల్లా పల్నాడు ప్రాంతాలలోని కొన్ని గ్రామాలలో ఘనంగా జరుపుతారు. వాటిలో మాచెర్ల, కంభంపాడు, కారెంపూడి గ్రామాలలో జరుగుతుంది. తెలంగాణాలో మాత్రమే విశేష ప్రచారాన్ని పొంది బతుకమ్మ పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మహార్నవమి వరకు తొమ్మిది రోజులు ఈ పండుగ జరుగుతుంది. దీనిలో భాగంగా మొదటి ఎనిమిది రోజులూ, పెళ్ళికాని ఆడపిల్లలు ఆడుకుంటారు. దీనిని బొడ్డెమ్మ అంటారు. తొమ్మిదవ రోజున మాత్రం చద్దుల బతకమ్మ అంటారు. బకతమ్మ పండుగ ఆశ్వయుజ మాసంలో రావడం వల్ల వర్ష ఋతువుతో నిండిన చెరువులు, తొణికసలాడుతూ వుంటాయి. పండి ఒరిగిన జొన్న చేలూ, పచ్చగా పెరిగే పైరు సంపద, విరబూసిన చెట్లతో ప్రకృతి సౌందర్యమయంగా వుంటుంది. ఈ పండుగ రోజుల్లో పుట్ట మన్నుతో ఒక బొమ్మను చేసి, బహుళ పంచమి నాడు దానిని ప్రతిష్ఠించి దాని పైన, ఒక కలశాన్ని వుంచి, కలశంపైన పసుపు ముద్దతో గౌరమ్మను నిలిపి పూలతోనూ, పసుపుతోనూ అలంకరిస్తారు. ఈ విధంగా ప్రతి ఇంటిలోనూ చేయకపోయినా, గ్రామానికి ఒక గృహంలో చేసినా సరిపోతుందని వారి అభిప్రాయం.

బొడ్డెమ్మను నిలిపిన తరువాత ఆ వాడలో వున్న ఆడపిల్లలందరూ అక్కడ గుమికూడుతారు. ఈ వినోదాన్ని చూడడానికి పెద్దలందరూ వస్తారు. ఇలా ఎనిమిది రోజులూ కన్నె పడచులు ఆడుకుంటారు. తరువాత నవమి రోజున కోడి కూసే సమయాన స్త్రీలు లేచి, పరిసరాలన్నీ తిరిగి రకరకాల పూలు సేకరించి, గోరు వెచ్చని జీడిగింజల నూనెతో తలంటి పోసుకుని, నూతన వస్త్రాలు ధరించి, అలికి ముగ్గులు వేసిన ఇంట్లో చాపు వేసి, బతకమ్మలను పేర్చి, గుమ్మడి పూవు అండాశయాన్ని తుంచి పసిడి గౌరమ్మగా పెడతారు. పసుపుతో ముద్ద గౌరమ్మను చేసి పెట్టి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకాలతో అలంకరించి పగలంతా అలాగే వుంచుతారు.

సాయంత్రం పిన్నలు, పెద్దలు, నూతన వస్త్రాలు ధరించి స్త్రీలు, వివిధ అలంకారాలను అలంకరించుకుని బతకమ్మలను చేత బట్టుకుని చెరువు కట్టకో, కాలువ గట్టుకో దేవాలయానికో వెళ్ళి బతకమ్మలను మధ్య వుంచి, బాలికలు, కన్నె పడుచులు, స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ, గొంతెత్తి ఒకరు పాడగా వలయాకారంగా తిరుగుతున్న వారు ఆ పాటను అనుసరిస్తూ పాడుతారు.

ఆ దృశ్యాన్ని గ్రామస్తులందరూ ఆనందిస్తూ వుంటారు. మగపిల్లలు కొయ్య గొట్టాలలో, కాగితపు అంచులను కన్నెపిల్లల పైనా స్త్రీల పైనా ప్రయోగిస్తారు. బతకమ్మ పాటలు, ఒకో ప్రాంతంలో ఆయా మాండలిక పదాలతో ప్రతి చరణాంతం లోనూ, ఉయ్యాలో అని, కోల్ కోల్ అనీ, చందమామా అనీ, గౌరమ్మ అనీ పదాలు పాడతారు. పాటల్లో లక్ష్మీ సరస్వతుల స్తోత్రాలేగాక, అనేక పౌరాణిక గాథలైన, శశిరేఖ, సతీ అనసూయ, కృష్ణలీల, సీతా దేవి వనవాసం మొదలైనవే గాక, సారంగధర, బాలనాగమ్మకు సంబంధించిన పాటలు కూడా పాడుతూ వుంటారు.

బతుకమ్మ పండగ వస్తూందంటే తెలంగాణా పల్లెల్లో నూతన వుత్సాహం వెల్లి విరుస్తుంది. అది ఒక పెద్ద సంబరంగా భావిస్తారు. ఇళ్ళు శుభ్రపరుస్తారు. చక్కగా అలంకరించు కుంటారు. ఆడపిల్లల్ని పుట్టింటికి తీసుకు వస్తారు. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకు అత్తగారి ఇంటి నుంచి కాగితపు పూలతో చేసిన బతకమ్మను వాయినంగా పంపుతారు. అత్తగారింట్లో వుండే ప్రతి ఆడపిల్లా ఎప్పుడు కన్న వారింటికి వెళ్ళాలా? కన్నవారి పిలుపు ఎప్పుడు వస్తూందా? తనను తీసుకువెళ్ళడానికి అన్న ఇంకా రాలేదే అన్న బాధను వ్వక్తపరుస్తారు.

ఉదాహరణకు పండుగ వస్తుందంటే, ప్రియుని రాకకై ఎదురు చూసే ప్రియురాండ్లు పాడుకునే పాట.........

బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
నానోము పండింది ఉయ్యాలో
నీనోము పండిందా ఉయ్యాలో
మావారు వచ్చిరి ఉయ్యాలో
మీవారు వచ్చిరా ఉయ్యాలో

బతకమ్మలను పిల్చుకుంటూ పాడే పాట


ఒక్కొక్క వువ్వేసి చంద మామ||
ఒక జాము అయే చంద మామ||

రెండేసి పువ్వు తీసి ||చంద మామ||
రెండు జాము లాయె ||చంద మామ||

ఈ విధంగా ఎన్నో పాటలు పాడుతారు. తొమ్మిదవ నాడు బొడ్డెమ్మ చర్చించి కలశంలో, ఆవాడ పిల్లలు ప్రతిదినం చెచ్చి పోసే బియ్యం పరమాన్నం వండి పంచి పెట్టి ఒక బావి దరి చేరి


బొడ్డెమ్మ బొడ్డెమ్మ.... బిడ్డలెందారే
బవిల పడ్డ వారికి ......వారిద్దరమ్మా
చెర్ల బడ్డవికి ..... .. చేరిద్దరమ్మా
కుంట్ల బడ్డ వారుకి.. కోరుద్దరమ్మ
నిద్రపో బొడ్డేమ .... .. నిద్రబోవమ్మ
నిద్రకు నూరేండ్లు...... నీకి వెయ్యేండ్లు
నిను గన్న తల్లికి....... నిండ నూరేంళ్ళు
అంటూ బొడ్డెమ్మను నీటిలో వదులుతారు. బొడ్డెమ్మ పండుగలో పాడబడే పాటలు ఇంకా కొన్ని వందలున్నట్లు బి. రామరాజుగారు తమ జానపద గేయ సాహిత్యంలో తెలియచేసారు.

కోసలాధీశుండు ఉయ్యాలో – దశరథ నాముండు ఉయ్యాలో -
కొండ కోనలు దాటి ఉయ్యాలో – వేటకే బోయెను ఉయ్యాలో -
అడవిలో దిరిగెను ఉయ్యాలో – అటు ఇటు జూచెను ఉయ్యాలో -
చెట్టు గుబురుల చాటు ఉయ్యాలో – చెరువొకటి కనిపించె ఉయ్యాలో -
శబ్దమేదొ వినెను ఉయ్యాలో – శరమును సంధించె ఉయ్యాలో -
జంతువేదొ జచ్చె ఉయ్యాలో – అనుకొని సాగెను ఉయ్యాలో -
చెంతకు చేరగా ఉయ్యాలో – చిత్తమే కుంగెను ఉయ్యాలో -
కుండలో నీళ్ళను ఉయ్యాలో – కొనిపో వచ్చిన ఉయ్యాలో -
బాలుని గుండెలో ఉయ్యాలో – బాణమే గ్రుచ్చెను ఉయ్యాలో -
ఎవ్వరు నువ్వనె ఉయ్యాలో – ఏడ్పుతో దశరథుడు ఉయ్యాలో -
శ్రవణుడు నేననె ఉయ్యాలో – చచ్చేటి బాలుడు ఉయ్యాలో -
తప్పు జరిగెనంచు ఉయ్యాలో – తపియించెను రాజు ఉయ్యాలో -
చావు బతుకుల బాలుడుయ్యాలో – సాయమే కోరెను ఉయ్యాలో -
నా తల్లిదండ్రులు ఉయ్యాలో – దాహంతో ఉండిరి ఉయ్యాలో -
ఈ నీళ్ళు గొంపోయి ఉయ్యాలో – ఇచ్చి రమ్మనెను ఉయ్యాలో -
ఆ నీళ్ళతో రాజు ఉయ్యాలో – అడవంతా వెదికె ఉయ్యాలో -
ఒకచోట జూచెను ఉయ్యాలో – ఒణికేటి దంపతుల ఉయ్యాలో -
కళ్ళైన లేవాయె ఉయ్యాలో – కాళ్ళైన కదలవు ఉయ్యాలో -
వృద్ధ దంపతుల జేరి ఉయ్యాలో – వేదన చెందుతూ ఉయ్యాలో -
సాష్టాంగ పడె రాజు ఉయ్యాలో – సంగతి జెప్పెను ఉయ్యాలో -
పలుకు విన్నంతనే ఉయ్యాలో – పాపమా వృద్ధులు ఉయ్యాలో -
శాపాలు బెట్టిరి ఉయ్యాలో – చాలించిరి తనువులుయ్యాలో -
శాపమే ఫలియించి ఉయ్యాలో – జరిగె రామాయణం ఊయ్యాలో -
లోక కల్యాణమాయె ఉయ్యాలో – లోకమే మెచ్చెను ఉయ్యాలో

ఇవి కూడా చూడండి

[మార్చు]

మరొక పాట

[మార్చు]
  • ఒక్కేసి పువ్వేసి సంధమామ వొక్కా జములయే సంధమామ
  • సిక్కుడు సెట్టుకింద సిరి సపలేసి రామన్న ఉయ్యాలో శ్రీహరి ధేవన ఉయ్యాలో

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. A journey through change Archived 2013-09-11 at the Wayback Machine. The Hindu, 22 February 2005. Retrieved 6 October 2011.
  2. Joys of cooking Archived 2013-10-15 at the Wayback Machine, The Hindu, 27 September 2010. Retrieved 6 October 2011.
  3. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (2 June 2019). "మన తెలంగాణ ఘన తెలంగాణ". Archived from the original on 2 జూన్ 2019. Retrieved 15 June 2019.
  4. నమస్తే తెలంగాణ (20 October 2018). "ఆకాశంలో బతుకమ్మ". www.ntnews.com. Archived from the original on 23 October 2018. Retrieved 23 October 2017.
  5. "తొమ్మిది రోజుల ఫలహారాలు". Archived from the original on 2023-10-15. Retrieved 2023-10-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. Indian Divine Festival (4 October 2013). "Bathukamma Festival (Panduga)". Archived from the original on 4 October 2013. Retrieved 19 October 2012.
  7. "రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు". ETV Bharat News. Archived from the original on 2022-10-10. Retrieved 2022-10-10.
  8. "హైదరాబాద్‌: సద్దుల బతుకమ్మ సంబురం (ఫొటోలు)". Sakshi. 2022-10-03. Archived from the original on 2022-10-03. Retrieved 2022-10-10.
  9. telugu, NT News (2022-09-22). "తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ సంబురాలు : శ్రీనివాస్‌గౌడ్‌". Namasthe Telangana. Archived from the original on 2022-10-07. Retrieved 2022-10-10.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బతుకమ్మ&oldid=4354351" నుండి వెలికితీశారు