రవిప్రకాష్
రవిప్రకాష్ | |
---|---|
![]() | |
జననం | దుగ్గిరాల రవి 1978 డిసెంబరు 4 విజయవాడ |
విద్య | ఎం. బి. బి. ఎస్ |
వృత్తి | నటుడు |
రవిప్రకాష్ ఒక సినీ నటుడు.[1] తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 125 కి పైగా చిత్రాల్లో నటించాడు.[2] ముందుగా వైద్యవిద్యనభ్యసించి తర్వాత ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన శుభవేళ అనే చిత్రంలో కథానాయకుడిగా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించాడు. తర్వాత ఎక్కువగా సహాయ పాత్రల్లో నటించాడు. ముఖ్యంగా రవిప్రకాష్ ఘర్షణ, అతడు, వేదం సినిమాల్లో పోషించిన పోలీసు ఆఫీసరు పాత్రలతో ప్రేక్షకులకు చేరువయ్యాడు. తమిళంలో వానం, పయనం, మాట్రాన్ లాంటి సినిమాల్లో నటించాడు.
వ్యక్తిగత విశేషాలు[మార్చు]
రవిప్రకాష్ అసలు పేరు దుగ్గిరాల రవి.[3] స్వస్థలం విజయవాడ. తండ్రి జిల్లా కోర్టులో పనిచేసేవాడు. తర్వాత విశాఖపట్నంలోనే వ్యాపారస్తుడిగా స్థిరపడ్డారు. తల్లి గృహిణి. ప్రాథమిక విద్య నుంచి పీజీ దాకా విశాఖపట్నంలో చదువుకున్నాడు. సామాజిక సేవ స్ఫూర్తితో వైద్యవిద్య చదవాలనుకున్నాడు. 2000 లో ఎం. బి. బి. ఎస్ పూర్తయింది. చదివే సమయంలో స్నేహితుల సలహా మేరకు నట శిక్షకుడు సత్యానంద్ దగ్గర శిక్షణ తీసుకున్నాడు.[4] వైద్యవృత్తిలోకి రాకమునుపే సరదాగా సినిమాల్లో అవకాశం కోసం ఫోటోలు పంపించాడు. సినిమా అవకాశం రావడంతో ఆ రంగంలోకి ప్రవేశించాడు.
ఈయనకు ఒక అక్క. ఆమె అమెరికాలో నివసిస్తోంది.[5] ఇతని భార్య, ఆమె కుటుంబం మొత్తం వృత్తిరీత్యా వైద్యులే.[6]వీరికి ఒక బాబు.
కెరీర్[మార్చు]
2000లో రమణ దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన శుభవేళ అనే చిత్రంలో కథానాయకుడిగా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించాడు. రమణ, దర్శకుడు తేజ స్నేహితుడు కావడంతో ఈ సినిమా నిర్మాణంలో ఆయనే కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో సిబ్బంది పొరపాటు వల్ల పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల రవికాంత్ అనే పేరుతో అచ్చైంది. తర్వాత రవిప్రకాష్ అని పేరు మార్చుకున్నాడు. అయితే ఈ సినిమా ఆశించినంతగా ఆడలేదు. తర్వాత హైదరాబాదులో గాంధీ ఆసుపత్రిలో రెండు సంవత్సరాలు హౌస్ సర్జన్ చేయడం కోసం గ్యాప్ తీసుకున్నాడు. పెద్దగా శిక్షణ లేకుండా మొదటి సినిమా నటించడం వల్ల నటనలో మరిన్ని మెలకువలు తెలుసుకోవడం కోసం మరోసారి పలు విభాగాల్లో శిక్షణ పొంది తన నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నాడు. 2002 లో జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ఈశ్వర్, వై. వి. ఎస్. చౌదరి దర్శకత్వంలో నందమూరి హరికృష్ణ కథానాయకుడిగా వచ్చిన సీతయ్య సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు పోషించాడు. 2004 లో తమిళ దర్శకుడు గౌతం మీనన్ దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడిగా తమిళ రీమేక్ చిత్రం ఘర్షణలో అతను పోషించిన పోలీసు ఆఫీసరు పాత్ర అతనికి మంచి గుర్తింపునిచ్చింది. తర్వాత అలాంటి పాత్రలు చాలా నటించాడు. 2005 లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అతడు సినిమాలో రవి ప్రకాష్ పోషించిన సి.బి.ఐ ఆఫీసరు పాత్ర కూడా అతనికి గుర్తింపు తెచ్చిపెట్టింది.
2010 లో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాలో కూడా పోలీసు అధికారి పాత్ర పోషించాడు. ముస్లింలందరినీ ఒకే గాటనకట్టి అనుమానించి చివరికి మానవత్వమే గొప్ప అని తెలుసుకునే పాత్ర.
సినిమాలు[మార్చు]
- శుభవేళ (2000)
- ఈశ్వర్ (2002)
- ఘర్షణ (2004)
- అతడు (2005)
- సైనికుడు (2006)
- సీతయ్య
- వేదం (2010)
- పంచాక్షరి (2010)
- గగనం (2011)
- దూకుడు (2011)
- జులాయి (2012)
- ఇష్క్ (2012)
- అత్తారింటికి దారేది (2013)
- శ్రీరస్తు శుభమస్తు
- స్టాలిన్
- గబ్బర్ సింగ్
- ప్రస్థానం
- సింహా
- డిక్టేటర్
- లయన్
- సన్నాఫ్ సత్యమూర్తి
- సోలో
- దాగుడుమూత దండాకోర్
- కంచె (2015)
- జనతా గ్యారేజ్ (2016)
- శతమానం భవతి (2016)
- రాజా ది గ్రేట్
- అంతకు మించి (2018)
- మార్షల్ (2019)
- కృష్ణ రావు సూపర్ మార్కెట్(2019)
- రెడ్ (2021)
- కార్తీక్స్ ది కిల్లర్ (2021)
- ప్లాన్ బి (2021)
- కపట నాటక సూత్రధారి (2021)
- భగత్‌సింగ్ నగర్ (2021)
- అం అః (2022)
మూలాలు[మార్చు]
- ↑ "ఉత్తమ నటనపై దృష్టి". prajasakti.com. Retrieved 29 November 2017.[permanent dead link]
- ↑ "నోట్ల రద్దు ప్రభావం సినీ రంగంపై ఎక్కువే: నటుడు రవి ప్రకాశ్". andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Archived from the original on 7 డిసెంబరు 2016. Retrieved 29 November 2017.
- ↑ "Special chit chat with Actor Ravi Prakash". 10TV.
- ↑ "Rocking Ramulamma Show". 6TV.
- ↑ "Telugu actor Ravi Prakash Exclusive Interview". Youtube. Studio N News.
- ↑ "Interview with actor Ravi Prakash Part3". Cinegoer.