Jump to content

జయదేవ్

వికీపీడియా నుండి
(సజ్జా జయదేవ్ బాబు నుండి దారిమార్పు చెందింది)
సజ్జా జయదేవ్ బాబు
జయదేవ్
జననంసజ్జా జయదేవ్ బాబు
సెప్టెంబరు 13, 1940
వైఎస్ఆర్ జిల్లా, కడప
నివాస ప్రాంతంమద్రాసు (చెన్నై)
ఇతర పేర్లుజయదేవ్
వృత్తిఆచార్యుడు, వ్యంగ్య చిత్రకారుడు
ఉద్యోగంసర్ త్యాగరాయ కాలేజీ డ్రాయింగ్ మాష్టారి
పదవి పేరుఆచార్యుడు
భార్య / భర్తరాజలక్ష్మి
పిల్లలుశారద, పద్మజ, కాంచన, ప్రసూన
తండ్రిసజ్జా ముత్యాలు
తల్లిసజ్జా నవనీతమ్మ
సంతకం

జయదేవ్ తెలుగు వ్యంగ్య చిత్రకారుడు. 1940 సెప్టెంబర్ 13న కడపలో జన్మించాడు. ఇతని పూర్తి పేరు సజ్జా జయదేవ్ బాబు. 1959వ సంవత్సరం నుండి కార్టూన్లు (వ్యంగ్య చిత్రాలు) చిత్రిస్తూ ఉన్నాడు. గీతల్లో ఒడుపే కార్టూన్ కు ప్రాణం అన్నమాటను నిత్య సత్యం చేస్తూంటాయి ఆయన కార్టూన్లు. ఈయన తన బాల్యంలో ఎక్కువ భాగం మదరాసు లోని పాత చాకలి పేటలో గడిపాడు. చదువుకొనే రోజుల్లోనే స్వతహాగా చిత్రాలు గీయటం ప్రారంభించాడు. ఆచార్యుడిగా జంతుశాస్త్రాన్ని మదరాసులోని సర్ త్యాగరాయ కాలేజీలో 1997 వరకు బోధించాడు.

ఆంధ్రపత్రిక సచిత్ర వార పత్రికలో 1959లో మొదలు పెట్టి, తెలుగులో వచ్చిన దాదాపు అన్ని వార, మాస పత్రికలన్నిటిలోనూ తన వ్యంగ్య చిత్రాలను ప్రచురించాడు. అన్ని పత్రికలు, ముఖ్యంగా యువ దీపావళి సంచికలలో ఈయన కార్టూన్లు లేకుండా ప్రచురించబడేవి కాదు. 2002 వరకు ఆయన చిత్రీకరించిన వ్యంగ్య చిత్రాల సంఖ్య 40,000 పైగా ఉన్నాయి. జయదేవ్ కార్టూన్లతో వుత్తేజంపొంది ఆయనకు ఏకలవ్య శిష్యులుగా చాలా మంది తెలుగు కార్టూనిష్టులు ఏర్పడ్డారు. వారినందరిని వీలైనంతవరకు ముఖాముఖిగా కలిసి ప్రోత్సహించేవాడు. కార్టూన్ల సంకలనాలు, "గ్లాచ్చూ మీచ్యూ" అనే ఆత్మకథ రచించాడు. వివిధ సంస్థలచే సత్కరించబడ్డాడు. ధూమపానం వల్ల వచ్చే దుష్పరిణామాల గురించిసామాజిక స్పృహ కల్గించే వ్యంగ్య చిత్రాలు కూడా గీశాడు. వ్యంగ్యచిత్రాల కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేశాడు. 'నేపాళం', 'భూపాళం', '(తాగుబోతు) బ్రహ్మం', 'మిస్టర్ నో', 'బాబాయ్-అబ్బాయ్' వంటి పాత్రలను కార్టూన్లలో సృష్టించి పాఠకులను అలరించాడు. అంతర్జాలంలో వ్యంగ్యచిత్రాల వెబ్సైట్ లను నిర్వహించాడు. తోటి కార్టూనిస్టులను కూడా అంతర్జాలాన్ని అధునికి సాంకేతికతలను వాడటానికి ప్రోత్సహించాడు.

కార్టూనిస్ట్ అయిన విధం

[మార్చు]

జయదేవ్ చిన్నతనంలో చదువు మొదలు పెట్టినప్పుడు పడిన పునాది చేతి వ్రాత గుడ్రంగా వ్రాసేవాడు. 6వ 7వ తరగతులు చదువుతున్నప్పుడు బొమ్మల ఉపాధ్యాయుడు దగ్గర పెన్సిల్తో బొమ్మలు గీయటం నేర్చుకున్నాడు. 9వ తరగతిలో తరగతి పత్రికకు ఆంగ్లకవి వర్డ్స్ వర్త్ పద్యానికి బొమ్మ గీసి మెప్పు సంపాయించాడు. 1957లో కాలేజీలో చదువుకుంటున్నప్పుడు, జీవశాస్త్ర ఆచార్యుడు వ్రాయబోతున్న పుస్తకానికి బొమ్మలు వేయటంకోసం, పెన్సిల్ తో కాకుండా, ఇండియన్ ఇంక్ తో, బ్రిస్టల్ బోర్డు పేపరు మీద, సన్నటి క్రోక్విల్ పాళీతో బొమ్మలు వెయ్యటం నేర్చుకున్నాడు. డ్రాయింగ్ మాష్టారి

జయదేవ్ మొదటి కార్టూన్

జయదేవ్ మొదటి కార్టూన్ ఆంధ్ర పత్రిక 1959లో ప్రచురితమైంది. కాని ఆ మొదటి కార్టూన్ ప్రస్తుతం అందుబాటులో లేదు. చివరికి, వేసిన జయదేవ్ దగ్గరకూడ లేదట. కాని వారు చెప్పిన ప్రకారం, ఆ మొదటి కార్టూన్ నిశ్శబ్ద వ్యంగ్యచిత్రమే. అందులో రెండు బొమ్మలు. మొదటి బొమ్మలో దొంగను తరుముతున్న పోలీస్. రెండో బొమ్మలో పోలీస్ దొంగ జుట్టుపట్టుకునేప్పటికి, ఆ దొంగ పెట్టుకున్న పెట్టుడు జుట్టు(విగ్) పోలీస్ చేతిలోకి ఊడొచ్చి, వాడు పారిపోవటం! తన మొదటి కార్టూన్ తనదగ్గరే లేదని బాధపడుతుంటాడు జయదేవ్.

జయదేవ్ వ్యక్తిత్వం

[మార్చు]
రాజకీయనాయకులు రోడ్‌షోల పేరిట జరుపుతున్న హడావిడి చూసి, వికీపీడియాకోసం ప్రత్యేకంగా వేసిన వ్యంగ్య చిత్రం

జయదేవ్ మృదు స్వభావి, మితభాషి. నవ్వు మొహమైనా పెద్దగా నవ్వరు[1] జయదేవ్ కార్టూన్లతో వుత్తేజంపొంది ఆయనకు ఏకలవ్య శిష్యులుగా చాలా మంది తెలుగు కార్టూనిష్టులు ఏర్పడ్డారు.[1] వారిని వీలైనంతవరకు ముఖాముఖిగా కలిసి ప్రోత్సహించేవాడు. తనను సంప్రదించే వారికి కార్టూన్ ద్వారానే స్పందించేవాడు. ఈ వికీపీడియా వ్యాసానికి స్పందించి వేసిన చిత్రాన్ని చూడండి.

వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు

[మార్చు]

బాపు తరువాత సంతకం అక్కర్లేని అతి కొద్దిమంది వ్యంగ చిత్రకారులలో జయదేవ్ ఒకడు. చూడగానే ఇది జయదేవ్ కార్టూన్ అని తెలిసిపోతుంది. ఇతడు వేసిన కార్టూన్లలో చక్కటి పొందిక అకట్టుకునే ఆకర్షణ. బొమ్మ చిత్రీకరణలో ఎటువంటి విపరీతాలు (మిడి గుడ్లు, అసహజ రూపాలు వంటివి) ఉండవు. సహజత్వానికి దగ్గరగా కార్టూన్ల లోని అయా పాత్రల ముఖ భంగిమలు, సదర్భానికి సరిపొయే ముఖ కవళికలు హాస్యప్రధానంగా చిత్రీకరించటంలో జయదేవ్ దిట్ట. అలాగే కార్టూన్లలోని సంభాషణలు ఎంతో పొదుపుగా చక్కటి భాషలో ఉండి అరోగ్యకరమైన హాస్యాన్ని అందిస్తాయి. బొమ్మకి వ్యాఖ్యా, లేదా వ్యాఖ్యకు బొమ్మా అని తటపటాయించేవారికి, వ్యాఖ్య లేకుంటే బొమ్మ అర్ధం కాదు. బొమ్మలేకుంటే వ్యాఖ్య అర్ధంకాదు. కార్టూన్లలో ఈ రెండిటికీ మంచి సంబంధం ఉండాలి అని వివరిస్తారు జయదేవ్.

'నేపాళం', 'భూపాళం', '(తాగుబోతు) బ్రహ్మం', 'మిస్టర్ నో', 'బాబాయ్-అబ్బాయ్' వంటి పాత్రలను కార్టూన్లలో సృష్టించి పాఠకులను అలరించాడు.

గౌరవాలు

[మార్చు]
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు నిర్వహించిన కార్టూన్ల పోటీలో మొదటి బహుమతి
  • 1991: ఊర్కహోన్డే ఛార్టర్, న్నొకి-హైస్ట్, బెల్జియం-గౌరవ ప్రస్తావన
  • 1992: ఒక్ హొట్స్క్ అంతర్జాతీయ కార్టూన్ పోటీ, జపాన్-ప్రత్యేక బహుమతి
  • 1993: భారత ప్రభుత్వం నిర్వహించిన పర్యావరణ అవగాహన పోటీలో ప్రథమ బహుమతి
  • 1994: ఒక్ హొట్స్క్ అంతర్జాతీయ కార్టూన్ పోటీ, జపాన్-ప్రత్యేక బహుమతి
  • 1995: అంతర్జాతీయ సందేశాత్మక కార్టూన్ ఫెస్టా, 1994, మియాగవ, జపాన్- కంపెనీ సౌజన్య బహుమతి
  • 1996: 25వ అంతర్జాతీయ కార్టూన్ ఫెస్టివల్ లో జూరీ సభ్యునిగా నియామకం
  • 1997-2000: వ్యవస్థాపక ప్రిన్సిపాల్, హార్ట్ ఏనిమేషన్ ఎకాడమీ,హైదరాబాదు.
  • 2002: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ, రాజకీయ వ్యంగ చిత్రకారుల ఫోరం వారి సన్మానం
  • 2023: మార్చిలో జయదేవ్ అభిమాన కార్టూనిస్టులందరూ కలసి ఆయనతో వారి అనుభవాలను 'జర్నీ విత్ జయదేవ్' పేరుతో పుస్తక రూపంలో ప్రచురించారు.

పుస్తకాలు

[మార్చు]
జయదేవ్ కార్టూన్ల సంపుటి

జయదేవ్ కార్టూన్ల సంపుటాలు ప్రచురించబడ్డాయి. వాటిలో ఔత్సాహిక వ్యంగ్య చిత్రకారులకు జయదేవ్ సూచనలు పొందుపరిచారు[2]

  • ఊహలు మెదడులో తళుక్కున మెరుస్తాయి. వ్యంగ్య చిత్రకారుడు ఆవిధంగా వచ్చిన ఊహలను ఒక చిన్న పుస్తకం లో, రాసుకోవాలి.
  • మన కార్టూన్ ఆలోచనలు మన దేశవాతావరణానికి అనుగుణంగా ఉండాలి.
  • చిత్తు బొమ్మ వేసి, ఊహకు సరిపడా వ్యాఖ్య రాసేయాలి.
  • కార్టూన్ అనుకున్నప్పుడు దృశ్యాన్ని చిత్రించడమే కాకుండా పాత్రలకు సంబంధించిన భావాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి.
  • మాట్లాడే పాత్ర నోరు తెరిచి ఉండాలి. ఆవతలి పాత్ర భావాన్ని సూచించేలా ఉండాలి.
  • పాత్రల చిత్రీకరణ అయ్యాక నేపథ్యాన్ని గీయాలి. నేపథ్య స్థానాన్ని సూచించాలి.
  • ముఖ్యమైన అంశాలుంటే చాలు. అనవసరమైన వివరాలతో నేపథ్యం, పాత్రలపై ఆధిపత్యం చేయకుండా జాగ్రత్తపడాలి.
  • కార్టూన్ గీశాక ముందస్తుగా ఇంట్లో వాళ్ళకీ, స్నేహితులకి చూపించాలి. వాళ్ళు మెచ్చుకుంటే తప్పకుండా పత్రికల ఎడిటర్లు ఆ కార్టూన్ కు పాస్ మార్కులిచ్చినట్లే.
  • ఓపిక అలవరుచుకోండి. అలోచించండి. హాయిగా సరదాగా నోరువిప్పి మాట్లాడండి. ఇతరుల మాటలను వినండి. శ్రద్ధగా పరిశీలన చేయండి.......కార్టూన్లు గీయండి.

తన ఆత్మకథను "గ్లాచ్చూ మీచ్యూ-1" గ్లాచ్చూ మీచ్యూ-2 అన్న పేరుతో రెండు భాగాలుగా ప్రచురించాడు. ఇటీవలే 'ది బెస్ట్ ఆఫ్‌ జయదేవ్ కార్టూన్స్’ పేరుతో తనుగీసిన రంగుల కార్టూన్లతో సంకలనం ప్రచురించాడు.

కార్టూన్లతో సంఘ సేవ

[మార్చు]
పొగతాగటం అనారోగ్య హేతువు అని చక్కగా చెపుతున్న నిశ్శబ్ద వ్యంగ్య చిత్రం

పొగ తాగటం వల్ల వచ్చే దుష్పరిణామాలు, నలుగురూ ఉన్నచోట ధూమపానం వల్ల జరెగే అసౌకర్యం, ఇతరులకు అనారోగ్య హేతువు కావటం వంటి విషయాలమీద అవగాహన 1970లలోనే వచ్చింది. కాని, బహిరంగ ప్రదేశాలలో పొగతాగటాన్ని నిషేధించటానికి అప్పటినుండి, మూడు దశాభ్దాల పైన పట్టింది. 1960-1970 దశకాలలో మధ్యాహ్నం సమయంలో వేసే ఆటలకు (అప్పట్లో సౌకర్యవంతమైన చల్లని వాతావరణం కలిగివుండే హాళ్ళు లేవు, మొదటి ఆటకు బయట వెలుగు ఉండదు కనుక తలుపులు మొత్తం తీసేవారు)సినిమాకు వెళ్ళితే, పొగ మేఘాల మధ్య చూడవలసి వచ్చేది. పొగరాయుళ్ళు అంతగా తమ అలవాటును యధేచ్ఛగా అన్ని చోట్లా కొనసాగించేవారు. ఇది గమనించి బాధపడిన జయదేవ్, తన కార్టూన్లను మాధ్యమంగా వాడుకుంటూ, ధూమపానం వల్ల వచ్చే దుష్పరిణామాలను ప్రజలకు హాస్యంతో జతపరిచి చెప్పసాగారు. అంతేకాక, తాను స్వతహాగా ఆచార్యుడవటం వల్ల, తాను పాఠం మొదలు పెట్టటానికి ముందు విద్యార్థులకు పొగ తాగవద్దని హితవు పలికేవారు. వీరి మాటలు సరైన సమయంలో, సరైన విధంగా ఆ విద్యార్థుల మనస్సులమీద పనిచేసి అనేకమందిని ఆ చెడ్డ అలవాటు బారిన పడకుండా చేసింది. వీరు వేసిన కార్టూన్ (పక్కన కనబడుతున్న కార్టూన్) సకల ప్రజాదరణ పొందటమే కాకుండా, భారత కాన్సర్ సంఘం వారు, తమ ధూమపాన వ్యతిరేక ఉద్యమ ప్రచారంలో కూడా వాడుకుంటున్నారట. భారత వాణిజ్య ప్రదర్శన సంస్థ వారు జయదేవ్‌ను ఢిల్లీకి ఆహ్వానించి సత్కరించారు.

ప్రముఖుల అభిప్రాయాలు

[మార్చు]
  • బాబు -ప్రముఖ కార్టూనిస్ట్ - కార్టూను గీతలు హడావిడిగా కాక, శ్రద్ధగా గీసినట్టుండి, అందంగా కనిపిస్తాయి. రాత అచ్చు అక్షరాల్లా ఉంటాయి. సంభాషణరహిత కార్టూన్లు వెయ్యటంలో దిట్ట. హాస్యం అతని కార్టూన్ గమ్యం. సైన్సు విషయాలమీద తెలుగులో కార్టూన్లు వెయ్యగల ఏకైక కార్టూనిస్ట్. మెగతా కార్టూనిస్టులకు ప్రోత్సాహం ఇచ్చే విషయంలో చాలా చొరవ చూపుతారు.
  • వంశీ-ప్రముఖ సినీ దర్శకుడు-అందరూ ఒక కోణంలో అలోచించగలిగితే, జయదేవ్ పలు కోణాల్లో అలోచించగల సామర్థ్యం తన స్వంతం చేసుకున్న వ్యక్తి........అన్ని కార్టూనులూ చూసి అనందించాను. కొన్ని కడుపుబ్బ నవ్విస్తే మరికొన్ని చాలా అలోచింపజేశాయి. ఒక కార్టూనిస్టు ఏ విధంగా ఆలోచించాలో, ఎలా అలోచింపజేయాలో జయదేవ్ తన కార్టూన్ల ద్వారా విపులీకరించారు.
  • శివలెంక రాధాకృష్ణ ఆంధ్ర పత్రిక సంపాదకులు-చక్కటి గీత, నొప్పించని హేళన, మొత్తం మీద అందంగా కనిపించే బొమ్మ-తెలుగు కార్టూన్‌లలో ఈ లక్షణాలు ఉన్న సంప్రదాయాన్ని బాపు గారు మొదలు పెట్టారు.జయదేవ్, బాబు గారల హాస్య చిత్రాలు ఈ సంప్రదాయాన్నే కొనసాగిస్తున్నాయి.
  • రామకృష్ణ - ప్రముఖ కార్టూనిస్ట్-"జయదేవ్‌ది ఓ ప్రత్యేకమైన శైలి. ఆ శైలే, క్రింద సంతకం చూడనవసరం లేకుండానే తేలికగా పట్టించేస్తుంది......విషయం ఎన్నుకునే విధానం చాలా గొప్పగా ఉంటుంది. నిశ్శబ్ద వ్యంగ్య చిత్ర నేర్పరి. "ట్యూబ్‌లైటు" కార్టూన్లలో మరింత పరిశీలిస్తేకాని బుర్రలో లైటు వెలగని గొప్ప కార్టూన్లు వేశారాయన. చిన్న కార్టూన్లలోనే ఆయన చేసే బహు విశాలమైన సన్నివేశ చిత్రీకరణ అద్భుతం....."

జయదేవ్ వ్యంగ్య చిత్ర మాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 [హాస్యానందం ఏప్రిల్ 2011 సంచికలోబ్నిం వ్యాసం]
  2. జయదేవ్ కార్టూన్లు సంపుటి, ప్రచురణ మీడియా హౌస్ పబ్లికేషన్స్ 2002 సంవత్సరం-"జోకు ఐడియాను కార్టూన్గా డెవలప్ చేయడం ఎలా"జయదేవ్ గారు ఇచ్చిన సూచనలు

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జయదేవ్&oldid=4314596" నుండి వెలికితీశారు