ముదిగొండ వీరభద్రయ్య
ముదిగొండ వీరభద్రయ్య | |
---|---|
జననం | వీరభద్రయ్య 1942 తెలంగాణ |
నివాస ప్రాంతం | పుట్టపర్తి |
వృత్తి | అధ్యాపకత్వం |
ప్రసిద్ధి | విమర్శకుడు కవి |
మతం | హిందువు |
తండ్రి | సదాశివయ్య |
తల్లి | శ్యామలాంబ |
ముదిగొండ వీరభద్రయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాహితీవేత్త, ఆచార్యుడు. 1988 నుండి 2004 వరకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు. అంతకు ముందు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలొ 1967 నుండి 1975 వరకు పని చేసారు. 2007 నుండి 2014 వరకు శ్రీ సత్య సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (ఎస్.ఎస్.ఎస్.ఐ.హెచ్.ఎల్)లో గౌరవ ఆచార్యులుగా పనిచేశారు 1964 నుండి ఖమ్మం , కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 24 సంవత్సరాలు అధ్యాపకునిగా పనిచేశారు [1] 2015లో తెలంగాణ ప్రభుత్వం నుండి రాష్ట్ర తొలి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట వ్యక్తి పురస్కారం అందుకున్నాడు.[2]ప్రతి రచనను కొత్త కోణాలనుండి దర్శించి విశ్లేషించి, వివేచించారు. ఆధునిక సాహిత్యంలోని భిన్న ప్రక్రియలను స్పృశించి, వాటిలోని శిల్పరీతులు, వస్తు వివేచనలను గురించి వ్యాసాలు, గ్రంథాలను రచించి, ఈ దశాబ్దిలోని సాహిత్య విమర్శ వికాస క్రమంలో సమకాలీన సాహిత్య మూలాలను సప్రమాణంగా, శాస్త్రీయ నిబద్ధతతో వివేచించారు. కళాతత్త్వ శాస్త్రాన్ని తెలుగులొ మొదట రచించినా, విమర్శ మౌలికాంశాల వివేచన చేసినా, ఆధునిక సాహిత్యంలో వస్తురూపాల వివేచన చేసినా, భావచిత్రం, ప్రతీక, రూపకాత్మక రచనలను (ఎలెగొరీ) గురించి చెప్పినా, వస్తు సంవిధానాన్ని పరిశీలించినా, అనువర్తిత విమర్శలో సాహిత్య విలువలను నిర్ణయించినా, చాలా ఖచ్చితంగా, నిష్పాక్షికంగా, నిర్ణయాత్మకంగా విమర్శ కృషిని సాగించారు . వీరి విమర్శకృషి కవి జీవిత కావ్య విమర్శ, ప్రతీక విమర్శ, భావచిత్ర విమర్శ, శిల్ప విమర్శ, సామాజిక విమర్శ, అనువర్తిత విమర్శ మొదలైన విభిన్న శాఖల్లో కొనసాగింది. వీరి విమర్శ గ్రంథాలను ఈ క్రింది విధంగా విభజించవచ్చు. 1. శాస్త్ర గ్రంథాలు, 2.అనువర్తిత విమర్శ (వస్తు, శిల్ప వివేచనలు) 3.ప్రతీక విమర్శ , 4. సామాజిక సాహిత్యాంశాలపై విమర్శ , 5.అగ్రశ్రేణి - సమకాలిక విమర్శకులపై విమర్శ, 6. పీఠికలు - సంపాదకీయాలు , 7.కవి జీవిత కావ్య సమన్వయ విమర్శ. ఈ ఏడు అంశాల పైన వీరభద్రయ్య విమర్శ కృషిని సాగిస్తూ గ్రంధాలు రాశారు .
జననం - విద్యాభ్యాసం
[మార్చు]ముదిగొండ వీరభద్రయ్య 1942 లో తెలంగాణ లోని వరంగల్ పట్టణంలో జన్మించారు 1963లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ తెలుగు పట్టా పొందారు . 1981లో వరంగల్లులోని కాకతీయ విశ్వవిద్యాలయం నుండి "సామాజిక సాంస్కృతిక దృక్పథం గల కవిగా శ్రీశ్రీ " అన్న అంశంమీద పిహెచ్.డి. పట్టా పొందారు.[3] 1979 లో వీరి “తెలుగు కవిత-సాంఘిక సిద్ధాంతాలు” అన్న విమర్శ గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
రచనలు
[మార్చు]సాహిత్య, సంగీత, తాత్త్విక, అనువాద రంగాల్లో 62 గ్రంధాలు రచించారు. వీరు రచించిన గ్రంథాలు-విమర్శ మౌలిక లక్షణాలు, అనువర్తిత విమర్శ, సాంఘిక విమర్శ, బయోగ్రఫికల్ విమర్శ, నవల-కథానిక విమర్శ, ప్రతీక భావ చిత్ర విమర్శ, చారిత్రక విమర్శ, మార్క్సిస్ట్ విమర్శ, నవ్య సంప్రదాయ విమర్శ- అన్న విభాగాలకు చెందుతాయి. పుట్టపర్తి లోని ప్రశాంతి నిలయం నుండి వెలువడే సనాతన సారధి మాస పత్రికకు మూడేళ్లు సంపాదకునిగా వ్యవహరించారు. కావ్య రచనల్లో 1.రసభావ చిత్రాలు,2.ఆధిరోహణం, 3.మహామౌనం, 4.జాతి విపంచీ గానం, 5.కవిత్వ కళాతత్త్వం, 6.స్రోతస్విని ముఖ్యమైనవి.
విమర్శ గ్రంథాలు
[మార్చు]వీరు రచించిన విమర్శ గ్రంథాలు- 1.ది మేజర్ క్రిటిక్స్ ఆఫ్ మోడర్న్ తెలుగు లిటరేచర్ పేరిట ఒక గ్రంధాన్ని ఆంగ్లం లో రచించారు 2.శివయోగి, 3.తెలుగు కవిత - సాంఘిక సిద్ధాంతాలు, 4.విమర్శ మౌలిక లక్షణాలు, 5.సాహితీ విమర్శ - సూత్రం: అన్వయం 6.సాహితీ విమర్శ-ఆలోచన: ఆలోకన , 7.జీవిఎస్ విమర్శ దర్శనం, 8.సంపత్ కుమార విమర్శ-దేశీయతా భూమిక, 9.సుప్రసన్న- సమన్విత విమర్శ, 10.వేయి పడగలు - నవలా శిల్పం, 11.రావిశాస్త్రి గారి ధర్మేతిహాసం-మూడు కథల బంగారం, 12.నా దేశం నా ప్రజలు (విప్లవకావ్య విమర్శ), 13.శేషేంద్రుని కవిత్వం పై కవిత్వం (చిన్న పుస్తకం), 14.కొందరు మానవతా కవులు - ఒక పరిశీలన, 15.జాతీయ కావ్యేతిహాసం వందేమాతరం వస్తు శిల్ప విమర్శ, 16.అనువర్తిత విమర్శ - విలువల నిర్ణయం, 17.వేయి పడగలు-ఒక పరిశీలన, 18. విశ్వనాథ సాహిత్య తత్త్వవివేచన, 19.సినారె - మట్టి మనిషి ఆకాశం, [4]
శాస్త్ర గ్రంథాలు
[మార్చు]విమర్శలోని ముఖ్య సూత్రాలను గురించి ఆంగ్లంలో I._A._Richards రచించిన “Principles of Literary Criticism” అన్న గ్రంథం ఉన్నట్టే తెలుగు సాహిత్య విమర్శలో కూడా అటువంటి సమగ్రమైన గ్రంథం విమర్శక పాఠకులకు ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి, తెలుగు సాహిత్య విమర్శలోని మౌలికాంశాలను గురించి విశ్లేషిస్తూ రచించిన గ్రంథం విమర్శ -మౌలిక లక్షణాలు. ఈ గ్రంథంలో ‘విమర్శ’ అంటే ఏమిటి? ‘విమర్శ’ శాస్త్ర ప్రతిపత్తి, విమర్శ ముఖ్య లక్షణాలు, విమర్శ - ప్రశంసల మధ్య తేడాలు, విమర్శక లక్షణాలు, విమర్శలో భాష, ధ్వని, అలంకారం, వక్రోక్తి తదితర ఆలంకారిక సిద్ధాంతాలను ఆధునిక విమర్శ పద్ధతికి అన్వయించి చూపించారు. విమర్శకు ఉండవలసిన మౌలిక లక్షణాలు-విశ్లేషణ, వ్యాఖ్యానం, తులనాత్మక పరిశీలన, నిర్ణయం అన్న ఈ నాలుగు అంశాలు విమర్శను పరిపుష్టం చేస్తాయని వివరించారు. విమర్శకుడు సాహిత్య విలువలను ఎత్తి చూపుతున్నప్పుడు ఒక పరిభాషను ఉపయోగించడంవలన విమర్శతత్త్వం వ్యక్తమవుతుంది. అదేవిధంగా “ప్రశంసలోకన్నా విమర్శలో బుద్ధి ప్రమేయం ఎక్కువ?” అని, విమర్శకులు వైయక్తికంగా కనిపించే ప్రశంసదోషాన్ని తొలిగించడానికి దాన్ని బుద్ధికి లొంగదీయాలని ప్రశంస-విమర్శలకు మధ్యనున్న తేడాను స్పష్టపరిచారు. అదేవిధంగా విమర్శక పాఠకులు ఎలాంటి రచనను ఆదరిస్తారో చెబుతూ “రచనలోని వస్తువు విషయంలో రచయితకు ఉండే తపన రచనకు ప్రాణం పోస్తుంది. అలాంటి రచననే గొప్ప రచనగా విమర్శక పాఠకులు గుర్తిస్తారు.” (పే. 38) అని పేర్కొన్నారు . ఇంకా ఈ గ్రంథంలో ఆలంకారిక దృక్పథాలైన ధ్వని, అలంకారం మొదలగు సిద్ధాంతాలను స్పష్టీకరించి, ఆధునిక కవుల మౌలికాంశాలను సూత్రీకరించి ఆ అంశాలను ఆధునిక ప్రక్రియలైన కవిత్వం, కథానిక, నాటకాలకు అనువర్తించి, విమర్శ లక్షణాలను మొట్టమొదటి సారిగా విశ్లేషణాత్మకంగా వారు వివరించారు.అంతేకాక ఈ గ్రంథంలో విమర్శ పద్ధతులైన గ్రంథపరిష్కరణ, కవిజీవిత కావ్య సమన్వయం, మనోవిశ్లేషణ, మార్క్సిస్టు విమర్శ మొదలగు ఇతర విమర్శ పద్ధతులను గురించి సమగ్రంగా విశ్లేషిస్తూ, ఆయా విమర్శ పద్ధతుల ప్రధాన సూత్రాలు, నిర్వచనాలు, ప్రయోజనాలు, వాటి పరిమితులు ఆరంభ వికాసాలను గురించి చాలా స్పష్టంగా వివరించి, విమర్శలోని ముఖ్యాంశాలన్నింటినీ స్పష్టపరిచారు.
కళాతత్త్వ శాస్త్ర రంగంలో ప్రసిద్ధ విమర్శకులెవరూ చేయనటువంటి కృషిని, విశ్లేషణాత్మకంగా, సూక్ష్మ పరిశీలనతో వీరభద్రయ్య తన గ్రంధం లో వివరించారు . ఆంగ్లంలోని Aesthetics ని ఇటీవల “సౌందర్యశాస్త్రం” అని పిలుస్తున్నారు. అయితే ఈ పేరు లలిత కళల తత్త్వాన్ని సూచించడంలేదు. అందువలన ఈ శాస్త్రానికి ‘కళాతత్త్వశాస్త్రం’ అని పేరు పెట్టారు. భారతదేశంలో సంగీత, నృత్య, నాటక, శిల్ప, కావ్యకళలు దేనికవే స్వయం ప్రతిపత్తితో వికాసాన్ని కలిగి ఉన్నాయి. కళ ప్రాకృతికమైనా, కళాత్మకమైనా దాని సౌందర్యాన్ని విశ్లేషించి నిరూపించే శాస్త్రంగా దీన్ని గుర్తించారు. ఈ లలిత కళల్లోని కళాగత సౌందర్యాన్ని గురించి తాత్త్వికంగా వివేచించేది కళాతత్త్వ శాస్త్రం. ఈ శాస్త్రానికి సంబంధించిన మౌలికతత్త్వ వివేచన చేయడం ప్రస్తుత గ్రంథ ముఖ్య ఉద్దేశం. పాశ్చాత్యుల తాత్త్వికాంశాలపై సౌందర్యమీమాంస ఏ పద్ధతిలో జరిగిందో అంతకంటే స్పష్టరూపంలో భారతదేశంలో సౌందర్య మీమాంస కావ్యశాస్త్రంలో జరిగింది. అది అభినవగుప్తుడు, క్షేమేంద్రుడు, భోజుడు మొ॥ ఆలంకారికుల చర్చలతో సాగింది. వీరు ప్రతిపాదించిన రసం, ఆనందం, ఔచిత్యం తదితరాంశాలు సాహిత్యేతర లలితకళలకు కూడా అన్వయిస్తాయి. కాబట్టి కళామీమాంస అక్కడినుంచే ప్రారంభమైందని చెప్పవచ్చు
కళాతత్త్వ శాస్త్రానికి అనుబంధంగా గ్రహించవలసిన గ్రంథం విశ్వనాథ సాహిత్య తత్త్వ వివేచన. విశ్వనాధ సాహిత్యానికి మూల చైతన్యం సాహిత్య రస దర్శనం. ఆయన నేటి ప్రక్రియలన్నింటికీ అనుశీలన సూత్రాలను తమ రచనల్లోనే ప్రత్యక్షంగా, పరోక్షంగా సూచించారు. విశ్వనాథ సాహిత్య తత్త్వంలో కావ్యతత్త్వంతో పాటు కళాసౌందర్యతత్త్వం కూడా ఇమిడి ఉందని వీరభద్రయ్యగారి అభిప్రాయం. ఆ కళాసౌందర్యతత్త్వాన్ని విశ్వనాథ వారు దేశీయ పద్ధతిలో ఆవిష్కరించారని వివరించడమే ఈ గ్రంథ సారాంశం.
మరో ముఖ్య గ్రంధం సాహిత్య విమర్శ - సూత్రం - అన్వయం. ఈ గ్రంధం లో ఎక్కువగా కవిత్వం పైనే విమర్శ కొనసాగింది. ఆధునిక కవిత్వంలోని అభివ్యక్తి అంతా ప్రతీకలు, భావచిత్రాలపైనే ఆధారపడింది. పాశ్చాత్య సాహిత్య విమర్శలోని సింబల్, ఇమేజ్, మెటఫర్, ఎలెగరీ అన్న అంశాలను గురించి సమగ్ర అవగాహనతో తెలుగు సాహిత్యంలోని విలువలను సముచితంగా వివేచించి ఆధునిక కవుల అభివ్యక్తిని శాస్త్రీయ పద్ధతిలో అనుశీలించారు. ఈ గ్రంథంలోని వ్యాసాలను 5 ప్రకరణలుగా విభజించారు. అభివ్యక్తి, అలంకారం, భావచిత్రం, ప్రతీక, శిల్పం అన్న అంశాలను సూత్రాన్వయ పద్ధతిలో వివరంగా చర్చించిన గ్రంథం ఇది. కవిత్వం, కథ, నవల, తదితర ప్రక్రియలకు పై అంశాలను అన్వయించడం, ఆయా అంశాలను గురించి స్పష్ట ప్రతిపాదనలను, వివరణలను ఇవ్వడం వాటి మధ్య సామ్య భేదాలను బేరీజు వేసి స్పష్టపరచారు.
అనువర్తిత విమర్శలో సాహిత్య విలువలకు గల ప్రాధాన్యతను తెల్పుతూ, అనువర్తిత విమర్శ వల్ల సాహిత్య తత్త్వ వివేచన నిగ్గుతేలుతుందని అనువర్తిత విమర్శ - విలువల నిర్ణయం అనే గ్రంధం లో పేర్కొన్నారు .ఈ వివేచన అనువర్తిత విధానం వల్లనే విశ్వజనీనతను సాధించుకుంటుందని, ఏ రచన ఐనా విమర్శకు ఎంచుకున్నప్పుడు ప్రధానంగా అందలి సాహిత్య విలువలను వివేచించిన తర్వాతే సాహిత్యేతర విలువలకు ప్రాధాన్యమివ్వాలని చెబుతూ ఆలంకారిక ప్రమాణాలను రచనలకు అనువర్తించే పద్ధతిని ప్రతిపాదించిన గ్రంథమిది. ఒక కావ్యం లేదా కవిత ధ్వని ప్రధానం అయినప్పుడు అది ఎంతో విలువ కలిగి ఉంటుంది. కాబట్టి ధ్వని ప్రమాణాన్ని అనువర్తన చేసి కావ్య విలువలను నిర్ణయించడం అనువర్తిత విమర్శలో ముఖ్య పద్ధతి అంటూ “మహా ప్రతిభావంతుని రచన వచ్చినప్పుడు సాహిత్య తత్త్వ వివేచన సమగ్రంగా అన్ని పార్శ్వాలను ఇమిడించుకుంటూ జరగాలేతప్ప వేరే రకంగా జరగటానికి వీల్లేదు, అలా చేస్తే అకారణంగా సాహిత్యాన్ని గొంతునులుమడమే” అవుతుంది అంటారు. సాహిత్య విలువలను గురించి చెబుతూ “ఒక వస్తువుకు విలువ లేక మూల్యం అన్నది దానిపై మనకు కలిగే ఇష్టానిష్టాలాధారంగా కల్గుతుందని అర్థం.” అంటూ చెప్పారు. ఒక వస్తువు విలువను గ్రహించడానికి మూడంశాలు తోడ్పడతాయి. అవి-1.వస్తువును మనస్సులోకి గ్రహించడం. 2.దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవడం. 3.ఇష్టపడటం. అన్న మూడు ప్రక్రియలు వ్యక్తిలో జరిగినప్పుడే ఆ వస్తువు విలువను ఆగ్రహించగలుగుతాడు. విమర్శ కృషిలో విమర్శ శాస్త్ర గ్రంథరచన తర్వాత చెప్పుకోదగింది అనువర్తిత విమర్శకృషి, వీరు అనువర్తిత విమర్శలో సాహిత్య విలువల ప్రాధాన్యతను గురించి ఒక శాస్త్ర గ్రంథాన్ని రచించారు. అదే విధంగా సూత్రం- అన్వయంలో కథ, నవల, కవిత్వం ఇత్యాది ప్రక్రియలకు విమర్శసూత్రాలను ఏ విధంగా అనువర్తింపవచ్చునో ఉదాహరణలతో సహా నిరూపించారు.
ప్రతీక కావ్యాల్లోని ప్రతీకలు, భావచిత్రాల పైన విమర్శ వ్యాసాలను “నాదేశం నా ప్రజలు” (విప్లవకావ్య విమర్శ), “మట్టి మనిషీ - ఆకాశం” లొ రాశారు, అదే విధంగా నవలల్లో ప్రతీకలను గురించి చర్చించిన విమర్శ గ్రంథం విశ్వనాథ వారి ‘వేయిపడగలు - నవలాశిల్పం”. ప్రతి కావ్యం ఏదైనా ఒక సిద్ధాంతాన్ని తప్పకుండా ప్రబోధించాలన్న నియమం లేదు. అలాగని ఎలాంటి ప్రయోజనం ఆశించని కావ్యం ఉండదు. సమాజ సాహిత్యాల్లో సమాజమే ఎప్పుడూ ఒక అడుగు ముందుంటుంది. సమాజంలో వస్తున్న మార్పునకు అనుగుణంగానే సాహిత్యంలో వస్తువు మారుతుంది. అటువంటి సాహిత్యం సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. అదే పద్ధతిలో నన్నయనుండి ఆధునికులవరకు వచ్చిన సాహిత్యంలో (కవిత్వంలో) ఆయా కవులు తమ కావ్యాల్లో ప్రతిబింబింపజేసిన వివిధ సాంఘిక సిద్ధాంతాలను వివేచిస్తూ, వీరభద్రయ్యగారు రచించిన గ్రంథం “తెలుగుకవిత - సాంఘిక సిద్ధాంతాలు” ఈ గ్రంథం 1979 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పోటీల్లో బహుమతి పొందింది.
ఆధునిక సాహితీ ప్రక్రియలైన కవిత్వం, కథ, నవల మొదలైన అంశాలన్నింటి పైనా విమర్శలు రాసి, అనువర్తిత విమర్శను పరిపుష్టం చేసిన వీరభద్రయ్యగారు అగ్రశ్రేణి విమర్శకులైన విశ్వనాథ, ఆర్.ఎస్. సుదర్శనం, శేషేంద్ర, చేరా, వడలి, సంపత్కుమార, సుప్రసన్న, జీవీయస్ మొదలైన వారిని గురించి క్లుప్తంగా “Major Critics of Modern Telugu Literature” అన్న గ్రంథంలో వివరించి, జీవీయస్, సంపత్కుమార, సుప్రసన్నాచార్యులపై విడిగా మూడు విమర్శ గ్రంథాల ద్వారా వారి విమర్శ కృషిని వివేచించారు. అంతేకాకుండా సమకాలికులైన 10 మంది నవలా విమర్శకులను గురించి ‘నవల-నవలా విమర్శకులు’ అన్న ప్రత్యేక గ్రంథాన్ని రాశారు.
విమర్శకులను వివేచిస్తూ వీరభద్రయ్యగారు రచించిన మరో గ్రంథం “సంపత్కుమార విమర్శ -దేశీయతా భూమిక” చేతనావర్తకవుల్లో ఒకడుగా, ఛందశ్శాస్త్రవేత్తగా, అలంకార శాస్త్రంలో అపారమైన పరిజ్ఞానం కలిగిన సంపత్కుమార కల్పవృక్షం పై వారు చేసిన శిల్పానుశీలన, కన్యాశుల్క తొలి, మలి కూర్పులు తులనాత్మన పరిశీలన, కిన్నెరసాని వస్తు విన్యాస పరిశీలన, ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ - సాంప్రదాయిక రీతి అన్న విమర్శ గ్రంథంలో ఆధునిక విమర్శకులు ప్రతిపాదించిన అంశాలు సాంప్రదాయికరీతిలో ఏ విధంగా అనుసంధానమై ఉన్నాయి? అన్న అంశాలను వారు వివరించిన తీరు వారి గ్రంథాలను పరిశీలిస్తే, వారి కృషి సాహిత్యవిద్యకు ఎంతగా మేలు చేసిందో అర్థమవుతుంది .
1962 లో రాసిన మొట్టమొదటి విమర్శ గ్రంథం ‘శివయోగి’ అనే కవి జీవిత కావ్య సమన్వయ విమర్శ గ్రంథం. కవి యొక్క జీవిత, సాహిత్యాల సమన్వయ వివేచన చేసేది కవి జీవిత కావ్య సమన్వయ విమర్శ. కవి జీవిత విశేషాలు, ప్రధానాంశాలు, వారి అనుభవాలు ఆయా రచనల్లో ప్రతిఫలించిన విధానాన్ని గురించి ఈ విమర్శ ప్రధానంగా వివరిస్తుంది. ఈ విమర్శ గ్రంథంలో వీరభద్రయ్యగారు ఒక యోగి రాసిన కృతులు, పద్యాలను ఆధారంగా చేసుకొని యోగి జీవిత చరిత్రను వివరించారు. రచనల ఆధారంగా రచయిత జీవిత చరిత్రను నిర్మించడం అన్న పద్ధతికి శ్రీకారం చుట్టినవారు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. వారు రచించిన గ్రంథం “వేమన”. అదే పద్ధతిలో వచ్చిన గ్రంథము ఈ “శివయోగి”. శివయోగి ఒక పరమ పవిత్రమైన యోగి. ఆయన కవిత్వం రాసినా, శతకం రాసినా - ఆయన సాహిత్య చైతన్యంలో యోగసాధనలోని బీజం నుండి సమాధివరకు అన్ని దశలనూ ఆయన వారి గ్రంథాల్లో వీరభద్రయ్య ప్రతిఫలింపజేశారని, భిన్న విమర్శ శాఖలపై వివేచించడంలో వారికి గల అభిరుచి, కృషి వ్యక్తమవుతుందని డాక్టర్ వారిజా రాణి "ఆధునిక విమర్శకులు -ప్రస్థానాలు (సమకాలికులు)" అన్న గ్రంధంలో "భిన్న విమర్శ శాఖల సాధకుడు -ముదిగొండ" పేరిట రాసిన వ్యాసం లో పేర్కొన్నారు .
సంపాదకత్వం
[మార్చు]- సంజీవ దేవ్ వ్యాసాలు - సంపుటం 1 (తెలుగు అకాడెమి)
- సంజీవ దేవ్ వ్యాసాలు - సంపుటం 2 (తెలుగు అకాడెమి)
- మను వసు చరిత్ర రచనా విమర్శనం (తెలుగు విశ్వవిద్యాలయం) (తెన్నేటి రామచంద్రరావు)
- మను వసు చరిత్ర రచనా విమర్శనం (తెలుగు విశ్వవిద్యాలయం) (కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి)
- పింగళి సూరన (డి. దక్షిణామూర్తి)తెలుగు విశ్వవిద్యాలయం) & పింగళి సూరనామాత్యుడు (వింజమూరి రంగాచార్యులు)
- అన్నమయ్య సర్వేశ్వర శతకం (అర్ధ తాత్వర్య వ్యాఖ్యానాలు)
- సనాతన సారథి (మాస పత్రిక-ప్రశాంతి నిలయం)
- భగవాన్ శ్రీ సత్య సాయి బాబా దివ్య జీవిత చరిత్ర (రా.గణపతి రచన)
సంగీత గ్రంథాలు
[మార్చు]- మన సంగీత కళావిద్యానిధులు
- వీణ:వీణా పాణులు
- ఈమని శంకరశాస్త్రి (చిన్న పుస్తకం)
- హిమాలయోత్తుంగ శిఖరం వీణాపాణి విశ్వేశ్వరన్ (చిన్న పుస్తకం)
ఆధ్యాత్మిక గ్రంథాలు
[మార్చు]- శ్రీ సత్యసాయి అవతార తత్త్వం-లక్ష్యం
- షిరిడి సాయి సచ్చరిత-అంతరార్థం
- భగవాన్ స్వీయ కథనాలతో శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర (శ్రీ రమణాశ్రమం హైదరాబాద్ )
- శ్రీ సత్యసాయి జ్ఞాన మననం (సాధనా ట్రస్ట్-ప్రశాంతి నిలయం)
- శ్రీ సత్య సాయి వాహిని;వేద రసవాహిని (సాధనా ట్రస్ట్-ప్రశాంతి నిలయం)
- ఆత్మ శాస్త్రం (సాధనా ట్రస్ట్-ప్రశాంతి నిలయం)
- భగవాన్ శ్రీ సత్యసాయి దివ్యలీలా మకరందం. (సి.పి.బ్రౌన్ అకాడమీ)
అనువాద రచనలు
[మార్చు]- సాధన-నివృత్తి మార్గం
- భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారితో సంభాషణ (హి స్లాప్ )
- శ్రీ సత్యసాయి-ఆర్తత్రాణ పరాయణుడు (కస్తూరి)
- దివ్య గురువు (జెన్నీ సోక్రాట్)
- సమస్త లోకాః సుఖినోభవంతు (పి.పి.ఎస్.శర్మ)
- లీలామోహన సాయి (టి.ఆర్.సాయి మోహన్)
- శ్రీ సాయి మహిమలు (ఎ.చిదంబర కృష్ణన్)
- దివ్యస్మృతి (డయానాబాస్కిన్)
- రసో వై సః (బ్రహ్మానంద పాండా)
- సత్యం శివం సుందరం (6వ సంపుటం)
- భగవాన్ శ్రీ సత్యసాయి-జీసస్ క్రైస్ట్ (సంకలనం, అనువాదం)
పురస్కారాలు
[మార్చు]- తెలుగు కవిత సాంఘిక సిద్దాంతాలు పుస్తకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం
- రావిశాస్త్రి రచన దర్మేతిహాసం-మూడు కధల బంగారం విమర్శ గ్రంధ రచనకు గాను శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం
- దిగుమర్తి సాహిత్య పురస్కారం
- జి.వి.ఎస్. కళాపీఠ పురస్కారం
- ధర్మేతిహాసం -రావిశాస్త్రి మూడు కధల బంగారం అన్న విమర్శ గ్రంధం రచించినందుకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సాహిత్య విమర్శక పురస్కారం ఇచ్చింది
ఇతర వివరాలు
[మార్చు]- సిద్దిపేటలో ముదిగొండ వీరభద్రయ్య అధ్యాపకుడిగా పనిచేశారు .[5] వైణికుడు .
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ, సంపాదకీయ పేజీలో (20 September 2020). "మహా మౌనమే కవిత్వం". ntnews. డా॥ పి. భాస్కర యోగి. Archived from the original on 20 September 2020. Retrieved 8 October 2020.
- ↑ సాక్షి, తెలంగాణ (31 May 2015). "రాష్ట్రావతరణోత్సవాల్లో ప్రతిభకు పట్టం". Sakshi. Archived from the original on 19 December 2015. Retrieved 9 October 2020.
- ↑ "ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య". Archived from the original on 2020-10-11. Retrieved 2020-10-09.
- ↑ ఆంధ్రభూమి (24 May 2019). "నేడు ముదిగొండ వీరభద్రయ్యకవిత్వకళాతత్వం గ్రంథావిష్కరణ". andhrabhoomi.net. Archived from the original on 8 October 2020. Retrieved 8 October 2020.
- ↑ తెలుగు వెలుగు, భాషోద్యమం. "భాషాభివృద్ధికి నిబద్దులం!". www.teluguvelugu.in. Archived from the original on 8 October 2020. Retrieved 8 October 2020.
ఇతర లంకెలు
[మార్చు]- వాహిని వెబ్సైటులో ముదిగొండ వీరభద్రయ్య గురించిన వివరాలు Archived 2020-10-11 at the Wayback Machine