వట్టికోట ఆళ్వారుస్వామి
వట్టికోట ఆళ్వారు స్వామి | |
---|---|
జననం | చెరువు మాదారం, నల్గొండ జిల్లా, తెలంగాణా | 1915 నవంబరు 1
మరణం | ఫిబ్రవరి 5, 1961 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత, ఉద్యమకారుడు, ప్రచురణ కర్త, పాత్రికేయుడు, కమ్యూనిస్టు నేత, గ్రంథాలయోద్యమ నాయకుడు. |
వట్టికోట ఆళ్వారుస్వామి (1915 నవంబరు 1 - 1961 ఫిబ్రవరి 5) తెలంగాణ ప్రజాసాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసినవాడు. ఆయన రచయిత, సేవాశీలి, ఉద్యమకర్త, కమ్యూనిస్టు నేత, ప్రచురణకర్త, పాత్రికేయుడు, ప్రచారకుడు. భాషాసాహిత్యాల దగ్గర్నుంచి పౌరహక్కుల దాకా వట్టికోట అన్ని ఉద్యమాల్లో పాలుపంచుకున్నాడు. తెలుగులో రాజకీయ నవలలకు ఆద్యుడు.[1] తెలంగాణా ప్రాంతంలో గ్రంథాలయోద్యమం నడిపించి ప్రజలను తమ అక్షరానికి పదును పెట్టడం ద్వారా చైతన్య పరిచాడు.[2]
బాల్యం
[మార్చు]1915 నవంబర్ 1వ తేదీన నల్లగొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని చెరువు మాదారంలో సింహాద్రమ్మ, రామచంద్రాచార్యులకు జన్మించాడు. తండ్రి చిన్ననాట చనిపోవడంతో సీతారామారావు అనే ఉపాధ్యాయుడికి వండిపెడుతూ విద్యాభ్యాసం, సారస్వతాభ్యాసం చేశాడు. ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు స్వయంగా నేర్చుకున్నాడు[3]
నిజాంకు వ్యతిరేకంగా
[మార్చు]హోటల్ కార్మికుడిగా జీవితం ప్రారంభించిన ఆయన స్వయంగా చదువు నేర్చుకుని, రచయితై, ప్రచురణ కర్త అయ్యాడు. వంటపనిలో, ప్రూఫ్ రీడింగ్‌లో, హోటల్ సర్వర్‌గా పనిచేస్తున్నప్పుడు ఆయన పొందిన అనుభవాలు ఆయన ప్రజల మనిషిగా నిలబడేట్టు చేశాయి. గ్రంథాలయోద్యమంతో మొదలైన ప్రేరణ ఆళ్వారుస్వామిని నిజాం వ్యతిరేకోద్యమం దాకా నడిపించింది. ప్రజల్లో కలిసి ఆయన పనిచేసిన తీరు నిజాంకు కోపం తెప్పించింది. దానితో ఆయన జైలు పాలు అయ్యాడు. నిజాంను గడగడలాడించిన 'ఆంధ్రమహాసభ' నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకుడుగా ప్రజాచైతన్యాన్ని కూడగట్టాడు. కడివెండి లో దొడ్డి కొమరయ్య ఊరేంగింపులో జరిగిన కాల్పులపై నిజనిర్ధారణకు పద్మజానాయుడును వెంట తీసుకు వెళ్ళాడు. మీర్జాన్ పత్రికలో వచ్చిన ఈ వార్తా తెలంగాణా ప్రజానీకాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. తన వ్యాసాల ద్వారా ప్రభుత్వాలను నిలదీసాడు. ఉదాహరణకు గద్వాల్ సంస్థానం లో ప్రజలపై మోపిన అధిక పన్నులపై మీర్జాన్ పత్రికలో వ్యాసం సంస్థానాధీశులను ఇబ్బంది పెట్టింది.[3]
రచనలు
[మార్చు]1941 నుంచి రచనా వ్యాసంగాన్ని చేపట్టిన వట్టికోట రచనలు గోల్కొండ, మీర్జాన్, ఆంధ్రకేసరి, గుమస్తా, స్రవంతి వంటి పత్రికలలో ప్రచురితమయ్యేవి. తెలంగాణా లో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటుకు కృషి చేసాడు.[2]
- వట్టికోట జైలు జీవితం జైలు లోపల పేరుతో కథల సంపుటిగా వెలువడింది.
- తెలంగాణ ప్రజాజీవిత నేపథ్యంతో 1952లో ప్రజల మనిషి నవల రచించిండు.[4]
- కనువిప్పు నాటికతోపాటు 14 ఏకాంకిలు రచించాడు.
- వట్టికోట ధర్మరాజు అను కలం పేరుతో కూడా కొన్ని రచనలు చేశారు. కాళోజి నా గొడవ స్పూర్తితో రామప్ప రభస రచించారు. ఊరూరా తిరిగి రచనలు, కవిత్వము సేకరించేవాడు.[3]
కథలు
[మార్చు]- అంతా ఏకమైతే - (ప్రజాసాహితి, 01-02-1982)
- ఆలు కూలి - (కిన్నెర, 01-02-1953, పత్రిక, 01-02-2006)
- గాలి పటం - (అభ్యుదయ, 01-05-1956)
- కాఫిర్లు - (విశాలాంధ్ర, 27-01-2002)
- పతితుని హదయం - (సృజన, 01-11-1982, చూపు, 01-09-1997)
- పరిగె - (ప్రజాసాహితి, 01-02-1985, విశాలాంధ్ర, 29-06-1997)
- పరిసరాలు - (స్రవంతి, 01-09-1954)
- బదనిక - (కిన్నెర, 01-11-1953)
- చిన్నప్పుడే కథ
- గిర్దావారు
- రాజకీయ బాధితులు
- నాడు-నేడు
- భర్తకోసం [2]
- 1940-45 మధ్యకాలంలోని రాజకీయ, సాంఘిక ప్రజా ఉద్యమాల చిత్రణతో గంగు నవల రచించిండు.
తెలంగాణ చైతన్యం కోసం 'దేశోద్ధారక గ్రంథమాల' స్థాపించి 35 పుస్తకాలు ప్రచురించాడు. తెలంగాణ విశేషాలను కూర్చి, 'తెలంగాణ' పేరుతో సంపుటాలు ప్రచురించిండు. ఇవేవీ ఇప్పుడు అందుబాటుల లేకుండా పోయినయి.
విశేషాలు
[మార్చు]- ఆళ్వారు స్వామి చదువు మధ్యలో ఆపేసి గ్రంథాలయోద్యమంలో కొనసాగాడు. తెలంగాణా ప్రాంతంలో అప్పటికి పట్టణ ప్రాంతాలలో 100 సంవత్సరాలు దాటిన అనేక గ్రంధాలయాలున్నాయి. ఆళ్వారు గ్రామీణ గ్రంధాలయాలు, సంచార గ్రంధాలయాలు స్థాపించాడు. గ్రామీణ ప్రజలకు పుస్తకాలందించడం కొసం తలమీద తట్టలో పుస్తకాలు పెట్టుకుని ఊరూరా తిరిగి వారికి ఆధునిక సాహిత్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. దేశోద్ధారక రిఫరెన్స్ గ్రంధాలయం స్థాపించి పాత పత్రికలూ సంచికలు పరిశోధకులకు అందుబాటులో ఉంచారు.[3]
- పత్రికా పరిజ్ఞానం ఉండడము వలన సురవరం ప్రతాప రెడ్డి హైదరాబాద్ లో స్థాపించిన "గోలకొండ" పత్రిక లో ప్రూఫ్ రీడర్ గా పని చేసాడు. గ్రంధాలు రాయడం, ప్రచురించడం, విక్రయించడం, ప్రచారం చేయడం వంటి ఇతనికి నిత్యకృత్యం అవడం తో మిత్రులు ఇతనిని సంచార గ్రంధాలయంగా అభివర్ణించే వారు. [2]
- దాశరధి వట్టికోట కలసి 1948 లో మూడు నెలలు నిజామాబాద్ జైలులో ఉన్నారు.[2] దాశరథి పద్యాలు జైలు గోడల మీద రాసి దెబ్బలు తిన్నాడు. దాశరధి "ఆళ్వారు నేను కలిసి నిజామాబాద్ జైలు లో ఉన్న మూడునెలలు మూడు రోజులు గా గడిచాయి. ఆళ్వారు త్యాగమూర్తి, కల్మషం తెలియని తెలియని కమనీయ మూర్తి, అనురాగమూర్తి, పేద జనులకు ఆత్మీయమూర్తి. మా మైత్రికి చిహ్నంగా అగ్నిధార అంకితమిస్తున్నాను" ఆన్నారు. [3]
- ప్రజల మనిషి నవలలో కంఠీరవం డైలాగులు: - “ఇస్లాం అంటే శాంతి. శాంతిని కోరి సత్యానికి పోటీపడే ఏమతమైనా నాకు సమ్మతమే! కాని మీరు, మీ మతాన్ని శాంతికి ద్రోహం చేసేదిగా మార్చినారు“. ”కులాల పేర, మతాల పేర ప్రారంభమైన అడ్దుగోడలు క్రమంగా బలమైన అడ్డంకులుగా తయారైనాయి. దాంతో మనలో ఐక్యత నశించింది”
- రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో హైదరాబాద్ రాష్ట్రం ఎదుర్కొన్న ఆహార కొరత నివారణకొరకు అఖిలపక్షాలను ఏకంచేయడంలో ముఖ్య పాత్ర వహించాడు[3].
- స్వాతంత్రోద్యమంలో 1937 లో నిజామాబాద్ లో జరిగిన ఆంధ్ర మహాసభ లో పాల్గొన్నాడు. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో కాంగ్రెస్ వాడిగా సత్యాగ్రహం చేసాడు. ఇందుకు సికింద్రాబాద్ లో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. తెలంగాణా లో స్టేట్ కాంగ్రెస్, ఆర్య సమాజం, ఆంద్ర మహాసభ, కమ్మూనిస్టు పార్టీ, అభ్యుదయ రచయితల సంఘం, తెలంగాణా రచయితల సంఘం వంటి సామాజిక, రాజకీయ సాహిత్య సంస్థలలో కార్యకర్తగా, నాయకుడిగా పనిచేశాడు. హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, 1944లో గుమాస్తాలు సంఘం, రిక్షాకార్మీక సంఘం, రైల్వే ఉద్యోగులు, కార్మీక ఉద్యోగుల సంఘాలకు నాయకత్వం వహించాడు. [2]
మరణం
[మార్చు]- 1961 ఫిబ్రవరి 5న మరణించారు.
మూలాలు
[మార్చు]- ↑ Encyclopaedia of Indian literature vol. 1 By various పేజీ.146
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 నాగయ్య, కట్టా (October 2010). "తెలంగాణా గ్రంథాలయోద్యమ దీప్తి వట్టికోట ఆళ్వారు స్వామి". గ్రంధాలయ సర్వస్వము. 71 (7). విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయ సంస్థ: 7–8.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 శారద, రావి (October 2017). "దేశోద్దారక గ్రంథమాల". గ్రంధాలయ సర్వస్వము. విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయ సంస్థ. 78 (6): 17–18.
- ↑ ప్రజారాజ్యాన్ని కలగనే ప్రజల మనిషి Sakshi | Updated: December 08, 2013
బయటి లింకులు
[మార్చు]- ఆళ్వారుస్వామికి దాశరథి 'అగ్నిధార'ను అంకితం ఇస్తూ రాసిన కవిత
- ఆళ్వారుస్వామి భార్య యశోదమ్మ గారితో ఇంటర్వ్యూ - ఆంధ్రజ్యోతి, 2006 జనవరి 30
- ఆళ్వారుస్వామి జీవిత చరిత్ర
- వట్టికోట ఆళ్వారుస్వామి కథల పట్టిక
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- తెలంగాణా విముక్తి పోరాట యోధులు
- 1915 జననాలు
- 1961 మరణాలు
- తెలుగు కవులు
- తెలుగు రచయితలు
- తెలుగు నవలా రచయితలు
- తెలుగు కథా రచయితలు
- తెలుగు నాటక రచయితలు
- నల్గొండ జిల్లా రచయితలు
- నల్గొండ జిల్లా గ్రంథాలయోద్యమ నేతలు
- తెలుగు గ్రంధాలయ ప్రముఖులు