అమరావతి (గ్రామం)
అమరావతి (గ్రామం) | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°34′23″N 80°21′29″E / 16.57306°N 80.35806°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | అమరావతి |
విస్తీర్ణం | 11.7 కి.మీ2 (4.5 చ. మై) |
జనాభా (2011)[1] | 13,400 |
• జనసాంద్రత | 1,100/కి.మీ2 (3,000/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 6,432 |
• స్త్రీలు | 6,968 |
• లింగ నిష్పత్తి | 1,083 |
• నివాసాలు | 3,316 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08645 ) |
పిన్‌కోడ్ | 522020 |
2011 జనగణన కోడ్ | 589946 |
బౌద్ధ |
పర్యాటక ప్రాంతాలు |
---|
ప్రముఖ బౌద్ధ స్థలాలు |
లలితగిరి
|
అమరావతి ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లాలో కృష్ణా నదీ తీరానికి కుడి వైపున ఉన్న ఒక గ్రామం. ఇదే పేరుతో ఉన్న మండలానికి కేంద్రం కూడా. ఇది సమీప పట్టణమైన గుంటూరు నుండి 32 కి. మీ. దూరంలో ఉంది. దీనికి వేల సంవత్సరాల ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉండటాన పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ అమరావతి స్థూపం, పురావస్తు సంగ్రహాలయం ప్రధాన ఆకర్షణలు.కృష్ణా నదీ తీరానికి కుడి వైపున సమీప పట్టణమైన గుంటూరు నుండి 32 కి. మీ. దూరంలో ఉంది.
సమీప గ్రామాలు
వైకుంఠపురం 9 కి.మీ,వడ్డమాను 5 కి.మీ,ధరణికోట 1. 5 కి.మీ,ఎండ్రాయి 6 కి.మీ,హరిచంద్రాపురం 12 కి.మీ.
చరిత్ర
ప్రాచీన శాసనాల ప్రకారం ఈ పట్టణానికి ధాన్యకటకం అనే పేరు ఉన్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాలలో ఒకటైన అమరేశ్వరాలయం పేరు మీదుగా అమరావతి పేరు వచ్చింది.[2] ఈ పట్టణం జైన, బౌద్ధ మతాలకు కూడా ప్రసిద్ధమైంది. శాతవాహనులలో ప్రసిద్ధుడైన గౌతమీపుత్ర శాతకర్ణి మూలంగా సా.శ. ఒకటవ శతాబ్దంలో ధాన్యకటకం ప్రసిద్ధిచెందింది. చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్ ఈ పట్టణంలో నివసించి అచటి వైభవం గురించి ప్రశంసించాడు.
అమరావతీ నగరాన బౌద్ధులు విశ్వవిద్యాలయం స్థాపించారని రాయప్రోలు సుబ్బారావు అన్నాడు. ఇక్కడ నిర్మించబడిన అతి పెద్ద బౌద్ధారామాల కారణంగా కూడా ప్రసిద్ధి కెక్కింది. ఈ బౌద్ధ స్థూపాలను మౌర్య సామ్రాజ్య స్థాపనకు ముందే నిర్మించారని విశ్వసిస్తారు. దీనిని అప్పట్లో ధాన్య కటకం లేదా ధరణికోట అని పిలిచేవారు. ఆంధ్ర పాలకులలో మొదటి వారైన శాతవాహనులకు సుమారు సామాన్యశక పూర్వం 3 వ శతాబ్దం నుండి సామాన్యశక పూర్వం 2 వ శతాబ్దం వరకు వారి సామ్రాజ్యానికి రాజధానిగా వుండేది. గౌతమ బుద్ధుడు తన కాలచక్ర ప్రక్రియను అమరావతి లోనే బోధించాడు. అందువలన అమరావతి బుద్ధునికంటే ముందు నుండే ఉన్నదని నిర్ధారణ అవుతుంది. దీనికి చారిత్రక ఆధారాలు వజ్రయాన గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి.
సంస్థాన కేంద్రంగా
వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు అమరావతి సంస్థాన పాలకుడు. అతని పాలనా కాలంలో చెంచులు గ్రామాలపైబడి దోచుకుంటూ ఉండేవారు. ఈ దోపిడీలను అరికట్టడానికి అతను 150 మంది చెంచు నాయకులను ఆహ్వానించి, వారిని మట్టుపెట్టించాడు.[3] ఈ సంఘటన జరిగిన గ్రామం పేరు నరుకుళ్ళపాడుగా మారింది. దానితో ప్రజలకు దోపిడీల బెడద తగ్గినా, అతని అశాంతికిలోనయ్యాడు. పాప పరిహారార్ధం దేవాలయాల నిర్మాణం చెయ్యమన్న కొందరు పెద్దల సూచన మేరకు అనేక దేవాలయాలను కట్టించాడు. అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి గుడిని పునరుద్ధరించాడు. 1807-09లో మంగళగిరి నరసింహస్వామి దేవాలయానికి 11 అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మింపజేసాడు.
దర్శనీయ ప్రదేశాలు
అమరావతి స్తూపం
అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉన్న ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకం. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం పరిఢవిల్లింది. సా.శ..పూ. 4వ శతాబ్దిలో గ్రీకు రాయబారి మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్ర దుర్గాలలో ఈ నగరమొకటి. సుమారు 16 కి.మీ చుట్టుకొలత కలిగిన మహానగరం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. మౌర్యులకు పూర్వం సా.శ. పూ. 4-3 శతాబ్దాలలో ఈ ప్రాంతం గణతంత్ర రాజ్యం (జనపదం)గా ఉన్న ఆధారాలున్నాయి. బుద్ధుని జీవితకాలం నుండి సా. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దంలో వెలుగు చూసింది. దీపాలదిన్నెగా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ.[4] అప్పటికే మహాచైత్యం అంతా కూలిపోయి 90 అడుగుల చుట్టుకొలత, 20 అడుగుల ఎత్తుగల ఒక దిబ్బలాగా మిగిలింది. అనేక విడతలుగా జరిగిన తవ్వకాలలో ఎన్నో విలువైన విగ్రహాలు, పరికరాలు, ఇతర వస్తువులు దొరికాయి. ఈ త్రవ్వకాలను సర్ వాల్టర్ స్మిత్ 1845 లో, రాబర్ట్ సీవెల్ 1877 లో, జేమ్స్ బర్గెస్ 1881 లోను, అలక్జాండర్ రియ 1888-89 మధ్యలోనూ చేపట్టారు. ఆఖరున జరిగిన తవ్వకాలలో ఈ చైత్య నిర్మాణానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నివసించిన మెగాలిథ్స్ కి సంబంధించిన అవశేషాలు కూడా దొరికాయి. ఇక్కడ దొరికిన శిల్పాలలో ఎక్కువ మద్రాస్ గవర్నమెంట్ మ్యూజియం, చెన్నై, బ్రిటిష్ మ్యూజియం, లండన్ లలో భద్రపరిచారు. ధాన్యకటకంలో 1962-65 మధ్యలో యమ్. వెంకటరామయ్య, కె.రాఘవాచారి ల అధ్వర్యంలో త్రవ్వకాలు జరిగాయి. తవ్వకాల తరువాత పాలరాతి మీద చెక్కబడిన ప్రధాన్యత లేని కొన్ని శిల్పాలు నిర్లక్ష్యంగా వదిలి వేయబడ్డాయి. ప్రజలు ఈ పాలరాతి ముక్కలను తమ ఇండ్లకు తీసుకువెళ్ళి మెత్తని పొడిచేసి రంగోలీలో వాడుకున్నారు. తరువాత ఒక పలుచని కంచెతో సురక్షితం చేసినా ప్రజలు సులువుగా లోపల ప్రవేశించి స్థాపం సమీపంలో సంచరించారు. ఇందులో ఐదు పీరియడ్స్ కి సంబంధించిన నివాసుల ఆధారాలు దొరికాయి. కార్బన్ డేటింగ్ ద్వారా ఈ పట్టణం సా.శ.పూ.5వ శతాబ్దికి చెందిందని తెలిసింది.
అద్భుతమైన శిల్పకళతో అలరారే స్థూపంపై బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. స్థూపంపై బ్రాహ్మీ లిపిలో శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఈ స్థూపం గురించి అప్పటి బ్రిటిషు పురాతత్వ పరిశోధకుడు ఫెర్గుసన్ ఇలా అన్నాడు: "కళావైదుష్యానికి సంబంధించి ఇది భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన కట్టడం". దీన్ని చెన్నై లోని ప్రభుత్వ ప్రదర్శనశాలలో భద్రపరచారు.
అమరేశ్వరాలయం
చరిత్ర
అమరలింగేశ్వర స్వామి పుణ్య క్షేత్రం ఇక్కడ కృష్ణానదీ తీరాన ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లోని పంచారామాలలో ఇది ఒకటి.
స్థలపురాణం
త్రిపురాసుర సంహారసమయంలో కుమారస్వామిచేత విరుగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి ఇక్కడ పడిందని పురాణాలు వివరిస్తున్నాయి. పంచారామాలలో ఒకటైన అమరారామం (అమరావతి) కృతయుగంలోనే ఆవిర్భవించిన విశిష్టమైన పుణ్యక్షేత్రం. పురాణాల్లో క్రౌంచతీర్థంగా పేర్కొనబడింది. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించి. అమరేశ్వరుడనే నామకరణం చేసి పూజించినట్టు స్థలపురాణం తెలియజేస్తుంది. దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించడని. అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి.
శాసనాలు
వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది రాజులు తరతరాలుగా ఈ స్వామివారిని దర్శించుకుని తరించారనడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. కన్నడాంధ్ర ప్రభువైన శ్రీకృష్ణదేవరాయలు అమరావతిని సందర్శించి ఇక్కడి అమరేశ్వరునికి నైవేద్య మహాపూజలు నిర్వహించినట్టు, పెదమద్దూరు గ్రామ పంటభూముల్ని ఆలయానికి దానమిచ్చినట్టుగా ఇక్కడ ఉన్న రాజశాసనం తేటతెల్లం చేస్తోంది. ఒరిస్సా గజపతులపై విజయానంతరం 1517లో చారిత్రక ప్రాంతం కృష్ణాతీరమైన అమరావతిని దర్శించిన కృష్ణదేవరాయలు ఇక్కడ తులాభారం తూగాడు. తన బరువుతో సరిసమానమైన బంగారాన్ని పేదలకు పంచిపెట్టినట్టుగా శాసనంలో ఉంది. అందుకు గుర్తుగా రాయలు నిర్మించిన తులాభార మండపం, దానిముందు వేయించిన శాసనం నేటికీ ఇక్కడ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆలయంలోని దక్షిణ రెండో ప్రాకారంలో ఈ మండపం ఉంది. నేడు అమరావతి అమరేశ్వరునిగా కొలువందుకుంటున్న స్వామి నాడు ధరణికోట అమరేశ్వరస్వామిగా వెలుగొందు తున్నాడని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. రాయలు తన భార్య చిన్నాదేవి చేత కృష్ణవేణీ తీరాన రత్నధేను మహాదానం, తిరుమల దేవి చేత సప్తసాగర మహాదానం చేయించినట్టుగా ఇందులో రాసి ఉంది.
పునరుద్ధరణ
1980లో జరిగిన పుష్కరాల సమయంలో అమరావతిలో పెద్ద ఎత్తున పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ప్రస్తుతం మనం చూస్తున్న విశాలమైన ఆలయద్వారం ఎత్తైన గాలిగోపురం గతంలో చిన్నద్వారం గల చిన్న గాలిగోపురంగా ఉండేవి. మొత్తం విచ్ఛిన్నం చేసి కొత్త నిర్మాణం కొరకు లోతుగా పునాదులు తీయబడ్డాయి. ఈ తవ్వకాల బౌద్ధ సంస్కృతికి చెందిన పాలరాతి శిల్పాలు అనేకం లభించాయి. ప్రస్తుతం మ్యూజియంలో కనిపిస్తున్న నంది ఈ తవ్వకాలలో లభించిందే.
ఆలయ వైవిధ్యత
గర్భాలయంలో 15 అడుగుల ఎత్తులో పొడవుగా ఊన్న మహా శివలింగం దంతం రంగులో ఉంటుంది. ఈ శివలింగం అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో తలపై మేకు కొట్టినట్టు చెబుతారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపిస్తూ వుండటం విశేషం. ప్రతి యేటా విజయదశమి రోజున, మహా శివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ స్వామివారికి అమ్మవారికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవం జరిపించబడుతూ ఉంటుంది. చాముండికా సమేతుడైన అమరేశ్వరుడు ఇక్కడ విశేష పూజలను అందుకుంటూ ఉంటాడు. ఇక్కడి స్వామివారు త్రిగుణాలకు అతీతుడు అనే భావాన్ని ఆవిష్కరించేలా మూడు ప్రాకారాలతో ఆలయం కనువిందు చేస్తుంటుంది. మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు, జ్వాలాముఖీ దేవి కనిపిస్తారు. మధ్య ప్రాకారంలో వినాయకుడు, కాలభైరవుడు, కుమార స్వామి, ఆంజనేయ స్వామి ఉంటారు. ధ్వజ స్తంభం దగ్గరగా సూర్య భగవానుడు ప్రతిష్ఠితమై ఉన్నాడు.
ధ్యాన బుద్ధ మందిరం
38 మీ (125 అ) ఎత్తుగల ధ్యాన బుద్ధ మందిరం పర్యాటకులను ఆకర్షిస్తుంది.
పరిపాలన
2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, గుడిసె నిర్మలాదేవి, సర్పంచిగా ఎన్నికైంది.[5] ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వచ్చింది.[6]
జనగణన
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3316 ఇళ్లతో, 13400 జనాభాతో 1170 హెక్టార్లలో విస్తరించి ఉంది.[7] 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11378. [8] గ్రామంలో నివాసగృహాలు 2629 ఉన్నాయి.
వాతావరణం
ఈ ప్రదేశం సంవత్సరం పొడవునా ఉష్ణమండల వాతావరణం కలిగి, వేసవులు అధిక వేడి, పొడి గాని, చలి కాలాలు చలి గాను వుంటాయి.
రవాణా సౌకర్యాలు
కృష్ణా నది తీరం ఒక విహార ప్రదేశంగా వేలాది పర్యాటకులని ఆకర్షించే ఈ గ్రామానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ నుండి చేరుకోవడానికి నేరుగా బస్సులున్నాయి. 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. అమరావతికి అతి దగ్గర రైల్వే స్టేషను గుంటూరు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ విజయవాడ నుండి అమరావతికి మోటర్ పడవ సౌకర్యం కల్పించింది. అయినప్పటికీ ఇప్పుడే జలమార్గంలో బోటు సేవలు లభ్యం కావడం లేదు. అందుకు కారణం ఈ ప్రయాణానికి నాలుగు గంటల సమయం పట్టడం. వర్షాకాలంలో మాత్రమే బోట్లు నడపగలిగిన జలమార్గంలో మిగిలిన సమయంలో ఇసుకదిబ్బలు. రాళ్ళు అడ్డుగా ఉండడమే ఇదుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. దీనికి సమీప విమానాశ్రయం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం.
గ్రామంలోని ఇతర దేవాలయలు
శ్రీబాలత్రిపురసుందరీ అమ్మవారి ఆలయం:- అమరావతి గ్రామంలోని క్రోసూరు రహదారి చెంత ఈ నూతన ఆలయ ప్రతిష్ఠోత్సవ వేడుకలు 2014 జూన్ 8 (ఆదివారం) నాడు కన్నులపండువగా కొనసాగినవి.[9]
శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం:- అమరావతిలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 2022 జూన్ 9న ఆలయ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆలయ ప్రారంభోత్సవంంలో భాగంగా 2022 జూన్ 4నుంచి పూజా కార్యక్రమాలు, 9న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ఉంటాయి.[10]
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు నాలుగు ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల ధరణికోటలోను, ఇంజనీరింగ్ కళాశాల గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ గుంటూరులో ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులో ఉన్నాయి.
భూమి వినియోగం
అమరావతిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 270 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 80 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 14 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 3 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 4 హెక్టార్లు
- బంజరు భూమి: 4 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 791 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 785 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూమి: 15 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
అమరావతిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది
- కాలువలు: 3 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 12 హెక్టార్లు
గ్రామ ప్రముఖులు
- మన్నవ బాలయ్య, నటుడు
అమరావతి చిత్రాలు
-
అమరేశ్వరాలయ శిఖరం
-
అమరేశ్వరాలయ స్నానఘట్టం
-
అమరేశ్వరస్వామివారి స్నానఘట్టం.నావలరేవు
-
మ్యూజియంలో స్తూపం నమూనా, శకలాలు
-
బుద్ధుని పై మరుని దాడి - విగ్రహ రూపం, సా.శ.2వ శతాబ్దం
-
గ్రీకు శాసనంతే భారతీయ యక్షుడు, అమరావతి, సా.శ.3వ శతాబ్దం
-
అమరేశ్వరస్వామివారి ప్రధాన దేవాలయం.
-
అమారావతి మ్యూజియంలో ఒక చక్రవర్తి శిల్పం 1వ శతాబ్దం
-
అమరావతి ధ్యాన బుద్ధ విగ్రహం, ధ్యాన కేంద్రం
-
అమరావతి స్ధూపం
-
అమరావతి స్తూపం దగ్గర సమాచార ఫలకం
ఇవి కూడా చూడండి
- అమరావతి -ఆంధ్రప్రదేశ్ రాజధాని.
- అమరావతీ సంస్థానం
- ధరణికోట
- అమరావతి కథలు
- అమరావతి స్తూపం
బయటి లింకులు
మూలాలు
- ↑ 2011 census of India https://www.census2011.co.in/data/village/589946-amaravathi-andhra-pradesh.html.
{{cite web}}
: Missing or empty|title=
(help) - ↑ సమగ్ర ఆంధ్ర విజ్ఞానకోశము, మొదటి సంపుటి, 1958 ప్రచురణ, పేజీ సంఖ్య 261
- ↑ సత్యం శంకరమంచి. ""అటునుంచి కొట్టుకురండి"". అమరావతి కథలు.
- ↑ చిలుకూరి వీరభద్రరావు (1910). " తొమ్మిదవ ప్రకరణము#అమరావతీ స్తూపము బయల్పడుట". ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము. వికీసోర్స్.
- ↑ ఈనాడు గుంటూరు రూరల్; 2013,ఆగష్టు-19; 11వపేజీ.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2013-08-23.
- ↑ ఈనాడు గుంటూరు రూరల్; 2014.జూన్-9; 14వ పేజీ.
- ↑ "TTD Invites CM YS Jagan to Amaravati Temple Programme". web.archive.org. 2022-06-02. Archived from the original on 2022-06-02. Retrieved 2022-06-02.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Infobox mapframe without OSM relation ID on Wikidata
- అమరావతి మండలంలోని గ్రామాలు
- ఆంధ్రప్రదేశ్ చారిత్రక స్థలాలు
- ఆంధ్రప్రదేశ్ బౌద్ధ చారిత్రక స్థలాలు
- ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాలు
- పల్నాడు జిల్లా పర్యాటక ప్రదేశాలు
- పల్నాడు జిల్లా పుణ్యక్షేత్రాలు
- ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు
- ప్రసిద్ధ శైవక్షేత్రాలు
- భారతదేశ ప్రాచీన నగరాలు
- Pages using the Kartographer extension