తెలుగు సాహిత్యం - శ్రీనాధ యుగం

వికీపీడియా నుండి
(శ్రీనాధ యుగము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తిక్కనసోమయాజి చిత్రపటం

తెలుగు సాహిత్యం

దేశభాషలందు తెలుగు లెస్స
తెలుగు సాహిత్యం యుగ విభజన
నన్నయకు ముందు సా.శ. 1000 వరకు
నన్నయ యుగం 1000 - 1100
శివకవి యుగం 1100 - 1225
తిక్కన యుగం 1225 - 1320
ఎఱ్ఱన యుగం 1320 – 1400
శ్రీనాధ యుగం 1400 - 1500
రాయల యుగం 1500 - 1600
దాక్షిణాత్య యుగం 1600 - 1775
క్షీణ యుగం 1775 - 1875
ఆధునిక యుగం 1875 – 2000
21వ శతాబ్ది 2000 తరువాత
తెలుగు భాష
తెలుగు లిపి
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

తెలుగు సాహితీకారుల జాబితాలు
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
తెలుగు వ్యాకరణం
తెలుగు పద్యంతెలుగు నవల
తెలుగు కథతెలుగు సినిమా పాటలు
జానపద సాహిత్యంశతక సాహిత్యం
తెలుగు నాటకంపురాణ సాహిత్యం
తెలుగు పత్రికలుపద కవితా సాహిత్యము
అవధానంతెలుగు వెలుగు
తెలుగు నిఘంటువుతెలుగు బాలసాహిత్యం
తెలుగు సామెతలుతెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగులో విద్యాబోధనఅధికార భాషగా తెలుగు

తెలుగు సాహిత్యంలో 1400 నుండి 1500 వరకు శ్రీనాథ యుగము అంటారు. ఈ యుగాన్ని తెలుగు సాహిత్యంలో ఒక సంధి యుగంగా భావింపవచ్చును. ఈ కాలంలో పురాణ కవుల కావ్యానువాద విధానం కొనసాగింది. తరువాత వచ్చిన ప్రబంధ యుగానికి నేపథ్యంగా నిలిచింది. కొంత వాఙ్మయము అనువాదాలుగానూ, కొంత స్వతంత్ర కావ్యాలుగాను, కొంత నానావిధ వైచిత్ర్యంతోను ఆవిర్భవించింది. పురాణ కావ్యాలలో ప్రబంధ రీతులు గోచరమయ్యాయి. రచనలలో అక్షర రమ్యత, అర్ధగౌరవమూ కూడా భాసించాయి. లోకంలో ఉబుసుపోకకు చెప్పుకొనే కథలవంటివి కావ్యరూపం దాల్చాయి.[1]

రాజకీయ, సామాజిక నేపథ్యం[మార్చు]

శ్రీనాథుడు 1365 (లేదా 1385) -1470 మధ్యకాలంలో జీవించి ఉండవచ్చును. ఈ సమయానికి రెడ్డి రాజ్యాలు స్థిరపడ్డాయి. ప్రోలయ వేమారెడ్డి (1323-1350) రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు. వీరి రాజధాని మొదట అద్దంకి. తరువాత కొండవీడు. ప్రోలయవేమారెడ్డి తరువాత అతని తమ్ముడు అనవేమారెడ్డి, అనంతరం కుమారగిరి రాజ్యాన్ని పాలించారు. కుమారగిరి బావమరది కాటయవేముడు రాజమండ్రిలో రెడ్డి రాజ్యాన్ని దాదాపు స్వతంత్రంగా పాలించసాగాడు. కుమారగిరికి సంతానం లేనందున అతని తరువాత అతని పినతాత కొడుకు పెదకోమటివేముడు 1400-1420 మధ్యకాలంలో రాజ్యం చేశాడు. ఈ పెదకోమటి వేముని ఆస్థానకవి శ్రీనాథుడు. మంత్రి సింగనామాత్యుడు. రాజమండ్రిలో కాటయవేముడు, అతని వారసులు కూడా సాహిత్యాభిమానులు. స్వయంగా కవులు.

ముఖ్య కవులు, రచనలు[మార్చు]

యుగకర్త అయిన శ్రీనాథుడు మహాపండితుడు, విద్యాధికారి, వ్యవహార్త, కార్యనిర్వాహక నిపుణుడు. మూడుమార్లు దేశాటనము చేసి శాస్త్ర జ్ఞానమునకు లోకజ్ఞతను జోడించాడు. ఇతడు నైషధము, భీమ పురాణము, కాశీఖండము, పల్నాటి వీరచరిత్ర, హర విలాసము, క్రీడాభిరామము, శివరాత్రి మహాత్మ్యము వంటి గ్రంథములను రచించాడు. ఇదే కాలానికి చెందిన పోతన శ్రీనాథునికంటె సుమారు 15 సంవత్సరములు చిన్నవాడని సాహితీ చారిత్రికులు భావిస్తున్నారు. ఆంధ్ర మహాభాగవతంలో 8 స్కంధాలను పోతన తెనిగింపగా, తక్కిన నాలిగింటిని గంగన, ఏర్చూరి సింగన, వెలిగందల నారయ రచించారు. తెలుగునాట కృష్ణతత్వానికి, భక్తి భావానికి ఆంధ్ర భాగవతం చిరునామాగా నిలిచింది. ఇంతేగాక కవితా మాధుర్యానికి పోతన పెట్టింది పేరు.

ఇదే కాలానికి చెందిన మరొక కవి మడికి సింగన ద్విపద భాగవతాన్ని, వాసిష్ఠ రామాయణాన్ని రచించాడు. సకల నీతి సమ్మతము అనే సంకలన గ్రంథాన్ని కూడా వ్రాశాడు. ఇది తెలుగులో మొట్టమొదటి సంకలన గ్రంథము. జక్కన విక్రమార్క చరిత్ర వ్రాశాడు. అనంతామాత్యుని రచనలు - భోజరాజీయము, ఛందోదర్పణము, రసాభరణము. గౌరన మంత్రి ద్విపద హరిశ్చంద్ర కావ్యమును, నవనాధ చరిత్ర అనే శైవసిద్ధుల చరిత్రాన్ని వ్రాశాడు.

శ్రీనాథుని శిష్యుడు దగ్గుపల్లి దుగ్గన కాంచీమహాత్మ్యము, నాచికేతూపాఖ్యానము అనే కావ్యాలు వ్రాశాడు. పిల్లలమర్రి పినవీరభద్రుడు వ్రాశాడని భావిస్తున్న అనేక గ్రంథాలలో జైమిని భారతము, శాకుంతలము మాత్రం లభిస్తున్నాయి. దూబగుంట నారాయణ కవి పంచతంత్రం వ్రాశాడు. బైచరాజు వేంకటనాధుడు అనే కవి కూడా పంచతంత్రాన్ని ప్రౌఢభాషలో వ్రాశాడు. వెన్నెలకంటి సూరన విష్ణుపురాణాన్ని తెలిగించాడు. పిడుపర్తి సోమన అనే శివకవి పాల్కురికి సోమనాధుని బసవపురాణాన్ని చంపూకావ్యంగా వ్రాసి పాల్కురికి సోమనాధునికే అంకితం ఇచ్చాడు.

విజయనగర రాజ్యంలో నంది మల్లయ, ఘంట సింగన అనే జంటకవులు వరాహపురాణమును రచించారు. వీరిదే ప్రబోధ చంద్రోదయము అనే సమగ్ర ఆధ్యాత్మిక కావ్యాన్ని (కృష్ణమిశ్రుడు వ్రాసిన సంస్కృత కావ్యం) సంస్కృతంనుండి యధాతధంగా తెలుగులో వ్రాశారు. ఈ యుగంలో దాదాఫు చివరివాడైన కొఱవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక వ్రాశాడు. వెన్నెలకంటి అన్నయ్య షోడశ కుమార చరిత్ర వ్రాశాడు.

మూలాలు[మార్చు]

  1. పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం

బయటి లింకులు[మార్చు]