కూచిపూడి నృత్యం

వికీపీడియా నుండి
(కూచిపూడి (నృత్యము) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కూచిపూడి నృత్యరీతికి ఆద్యుడు--సిద్దేంద్ర యోగి
కూచిపూడి నాట్యం చేస్తున్న మహిళ
బెంగళూరులో ఉమా మురళికృష్ణ, కూచిపూడి నృత్యకారిణి ప్రదర్శనలో ఒక భంగిమ
లతాంగి భంగిమలో కూచిపూడి నాయిక
కూచిపూడి నృత్య ప్రదర్శన: ఆలోకయే శ్రీ బాలకృష్ణం
కూచిపుడి నృత్యం వీడియో

కూచిపూడి నృత్యం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక భారతీయ నాట్యం. ఇది కృష్ణా జిల్లాకు చెందిన కూచిపూడి (మొవ్వ మండలం) గ్రామంలో ఆవిర్భవించింది. సా.శ.పూ. 2వ శతాబ్దంలో ఈ ప్రాంతము లోని బ్రాహ్మణులు ఈ శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించటంతో దీనికి ఈ పేరు వచ్చింది. ఇది దక్షిణ భారతదేశం అంతటా పేరుగాంచింది.

చరిత్ర

[మార్చు]

3000 ఏళ్ళ క్రితం భరత ముని ఈ నాట్యానికి సంబంధించిన వివిధ అంశాలని వివరించాడు. ఒక పద్యం ద్వారా అప్పట్లో నాలుగు విధములైన నృత్యం ఉన్నట్లు గోచరిస్తూ ఉంది. వీటిలో దక్షిణ భారతానికి చెందిన దక్షిణాత్య కూచిపూడికి పూర్వ విధానమని తెలుస్తున్నది. సా.శ.పూ. 2 వ శతాబ్దంలో శాతవాహనులు ఈ కళకు గొప్ప ఆరాధకులుగా ప్రసిద్ధి గాంచారు. దశాబ్దాలుగా ఈ నాట్య ప్రదర్శనలు వైష్ణవారాధనకే అంకితమైనాయి. అందుకే ఈ రూపాన్ని భాగవత మేళ నాటకం అంటారు. అప్పట్లో అత్యంత పవిత్ర దేవాలయమైన ఆంధ్ర విష్ణు దేవాలయం ఆవరణలో లభ్యమైన శాసనాల ప్రకారం దాదాపుగా మూడు వందల మంది దేవదాసీలు రాజమర్యాదలు అందుకునేవారు. ఇక్కడ లభ్యమైన శిల్పాలు కూడా ఆ నృత్య కళాకారిణుల దైవపూజగా భావించే అపురూప భంగిమలను దాచిపెట్టినట్లు కనిపిస్తాయి. చాలాకాలం వరకు, కూచిపూడి నృత్యం [1][2] దేవాలయాలలో ప్రదర్శింపబడేది. సాంప్రదాయం ప్రకారం, పూర్వం బ్రాహ్మణ కులానికి చెందిన మగవారే కూచిపూడి నృత్యాన్ని చేసేవారు. అందుకే వీరిని కూచిపూడి భాగవతులు అంటారు.15 వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యాన్ని అభివృద్ధి చేసి పరిపుష్టం గావించాడు. అతని అనుచరులైన బ్రాహ్మణులు కూచిపూడిలో స్థిరపడి ఈ నాట్యాన్ని అభ్యసించటంతో ఆ ఊరి పేరే ఈ నాట్యానికి సిద్ధించింది. వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, చింతా కృష్ణమూర్తి, తాడేపల్లి పేరయ్య, భాగవతుల విస్సయ్య వంటి కూచిపూడి నృత్య కళాకారులు దీనిని విస్తరించి సంస్కరించారు. ఇది భరతుని 'నాట్య శాస్త్రాన్ని' అనుసరిస్తుంది.

1500 నాటికే కూచిపూడి భాగవతులు దక్షిణ భారతదేశంలో సుప్రఖ్యాతులైనట్టు మాచుపల్లి కైఫీయతులో ప్రస్తావించిన కొన్ని విషయాల వల్ల తెలుస్తోంది.[3] 1506-09 విజయనగర చక్రవర్తిగా పరిపాలించిన వీరనరసింహరాయలు ఎదుట కూచిపూడి భాగవతులు ప్రదర్శన చేస్తూ, సంబెట గురవరాజు అనే సామంతుడు తన పాలనలోని స్త్రీల పట్ల, ధనసంపాదన కోసం చేస్తున్న అసభ్యమైన ఘోరాలు ప్రదర్శనలిచ్చారని, దానిలోని వాస్తవాన్ని పరిశీలించి రాయలు సామంతుణ్ణి ఓడించి పట్టి మరణశిక్ష విధించి వధించారని కైఫీయత్తు తెలుపుతోంది.[4]

అలంకరించి ధారవు (ఒక చిన్న సంగీత, నాట్య రూపం) తో స్వీయపరిచయం చేసుకొంటారు. దీని తర్వాత కథ మొదలవుతుంది. ప్రక్కన ఒక గాయకుడు, కర్ణాటక సంగీతశైలిలో కీర్తనలను పాడతాడు. దీనినే నట్టువాంగం అంటారు. ఇందులో మృదంగం, వయొలిన్, వేణువు, తంబూరా వంటి వాద్యపరికరాలను

చురుగ్గా లయబద్ధంగా కదిలే పాదాలు, శిల్పసదృశమైన దేహభంగిమలు, హస్తాలు, కళ్ళతో చేసే కదలికలు, ముఖంలో చూపించే భావాలు, ముఖాభినయంతో కూచిపూడి నృత్య కళాకారులు సాత్వికాభినయం, భావాభినయం చేయడంలో ఉద్దండులు. నృత్యకారులు ధరించే ఆభరణాలు తేలికగా ఉండే బూరుగు అనబడేె చెక్కతో చేస్తారు.

శైలి

[మార్చు]

కూచిపూడి భరత నాట్యానికి దగ్గరగా ఉంటుంది. ఒకే పాత్ర గల నృత్యాల గాత్రాలలో జాతిస్వరం, తిల్లానా లు ఉంటాయి. అదే నృత్యం అయితే భక్తుడు దైవంలో ఐక్యమయ్యే కాంక్షను తెలియజేసే సాహిత్యం ఉంటుంది. శైలిలో భరతనాట్యంతో పోల్చినపుడు గల భేదాలతో బాటు కూచిపూడికి ప్రత్యేక నాట్యరీతులు ఉన్నాయి.

కూచిపూడి వారి నాట్య ప్రదర్శనములు చాలా ఉన్నాయి.వాని అన్నింటిని కలాపములని, భాగవత నాటకములని రెండు రకములుగా విభజింప వచ్చును. వీనిలో కలాపములు మూడు: సత్యభామా కలాపము, గొల్ల (భామా) కలాపము, చోడిగాని కలాపము.ఈ కలాపములోని విశేషమేమనగా; కథ గాని కథ యొకటి ఉండును. అనగా పేరునకు మాత్రము వీనిలో భామవేషము వేసెడి పాత్రయొక్కటే ప్రధానము. సూత్రధారుడు అనగా విదూషకుడో అట్టివారే నాట్యము నడిపింతురు. పదాభినయము లోని ప్రధాన కళాభాగము. ఆడుటకనువుగా పేరున కడ్డము తెచ్చి పెట్టుకున్న కథ ఆధారముగాగల ఈకలాపములు ఉపరూపకముల కోవకు వచ్చును. అస్సాం రాష్ట్రములోని మణిపురీ లోగాని, ఒరిస్సా రాష్ట్రములోని ఓఝూపాళి లోగాని, గుజరాత్ లోని గర్భ, భావై నాట్యములలోకాని ఈఉపరూపక లక్షణములు కనిపించవు. అవి అన్నియు మన పగటివేషకాండ్ర లీలావృత్తములవలె ఉండును. కూచిపూడి వారిది లాస్యకళ. సత్యభామాకలాపమున దశావిధలాస్యాంగములలో 9 ప్రదర్శించబడును. ఇందు కలాపమందలి నాట్యగత్తె తాను స్వయముగా పాడుచు అభినయించును.

  • కృష్ణుని భార్య, సత్యభామను అనుకరిస్తూ చేసే నాట్యం, భామాకలాపం. ఇది ఉషరూపకము.
  • గొల్లభామాకలాపం భాణిక అను ఒక ఉషరూపకం. ఇందు మూడు ప్రధాన భాగములుగా ఉన్నాయి. గొల్లభామ తెర బయలుదేరి రంగమున గొల్లకులమువారిని గురుంచి ఉపన్యసించి తన చుట్టును ఉన్న పౌరాణిక గాథలు అల్లుకొని పదాభినయనం చేయుట మొదటిభాగం. సుంకరి కొండాయ ప్రవేశము, గొల్లభామతోడి వాదులాట రెండవభాగం. గొల్లభామ అత్త రమ్ఘమున ప్రవేశించి సుంకరి కొండాయను తరుముగొట్టుట మూడవభాగం. ఇందు సుంకరి కొండాయ, వీడు సుంకం వసూలు చేయువాడు. అందుకే వీనికి సుంకరికొండడని పేరు. గొల్లపిల్లను సుంకరికొండడు అడ్డగించి సరసము చూపుట, అది విరసమై ఆమె అత్తగారు విరుచుకుపడుట అను సన్నివేశముల చుట్టును అందమైన ఆటపాటల వల అల్లబడింది. సత్యభామాకలాపం వలెనే ఇది కూడా పలువురు రచయితల చేతులలో పడి నలిగినది. ఇందు భామాకొండాయల రసాభాస శృంగారము ముఖ్యము. ఇందలి పాటలలో కొందరు రచయితల పేర్లుకూడ ముద్రల రూపమున పాదుకొని ఉన్నాయి. ఎందరో మేళములు కట్టి ఆడగా ఆసందున ఈకలాపమున చేయిజొనిపిన వారిలో గొడవర్తి జగన్నాధం, తెన్నేటి వేంకటదాసు, చేవూరి ఎరకయ్యదాసు, సరస్వతుల సుబ్బయ్య అను వారి చాలా కృషిచేసారు.
  • సాహిత్యదర్పణమున భాణికా లక్షణములు విపులముగా చెప్పబడినవి. భాణికయందు వేషము రుచిరము.ముఖ్యనిర్వణములు ఉన్నాయి.నాయకుడు హీనుడు, ఏడంగములు, ఉపన్యాసము, విన్యాసము, విభోధము, సాధ్వసము, సమర్పణము, నివృత్తి, సంహార్మౌ అనునవి. ఉపన్యాసము అనగా ప్రసంగవశమున కార్యమును కీర్తించుట; నిర్వేదవాక్యములను విస్తరించుట విన్యాసము; భ్రాంతి తొలుగుట విభోధము; అనృతము చెప్పుట సాధ్వసము; కోపపీడచేత నిందతోడి వాక్యము సమర్పణము; నిదర్శనము నుపససించుట నివృత్తి; కార్యమును సమాప్తి నొందించుట సంహారము. కలాపములలో ఈ విషయములు పూర్తిగా పొసగి ఉండుట వలన వీటిని భాణికములందురు.
  • ఒక ఇత్తడి పళ్ళెంపై పాదాల నుంచి, రెండు చేతుల్లోనూ వెలిగించిన దీపాలని ఉంచి, శిరసు పై నీరు నింపిన ఒక పాత్రనుంచి నాట్యం చేయడాన్ని తరంగం అంటారు.

అనాది కాలం నుండి కూచిపూడి నృత్య శైలి ప్రామాణిక గ్రంథాలైన అభినయ దర్పణ, నందికేశ్వర భరతర్ణవ ల పై ఆధారితం. ఈ శైలిని నట్టువ మాల, నాట్య మాలగా విభజించారు.

నట్టువ మాల

[మార్చు]

భరత నాట్యానికి పునాది అయిన నట్టువ మాల రెండు రకాలు.

  • పూజా నృత్యం: గుడిలో బలిపీఠం పై ప్రదర్శించేది
  • కాళికా నృత్యం: కళ్యాణ మండపంలో

నాట్య మాల

[మార్చు]

కూచిపూడికి పునాది అయిన నాట్య మాల పురుష సమూహం చేసే నృత్య రూపకం. ఇందులో స్త్రీ పాత్రలు కూడా పురుషులే అభినయిస్తారు. ఇది మూడు రకాలు

వనస్థలిపురంలో పళ్లెంపై చేయుచున్న నృత్యంలో ఒక భంగిమ.
  • సాంప్రదాయిక నృత్యం: దేవతలకై ఉద్దేశింపబడ్డది
  • కాళికా నృత్యం: మేధావులకై ఉద్దేశింపబడ్డది
  • సాధారణ నృత్యం: భాగవతం అను రకం

భరతనాట్యంతో భేదాలు

[మార్చు]

పై రెంటికీ ఉన్న భేదం అభినయం లోనే. సొగసైన, లాస్యానికి ప్రాముఖ్యత అధికంగా గల కూచిపూడిలో వాక్యార్థ అభినయం ఉండగా, ప్రతి పదం ముద్ర ద్వారానే అభినయంచటానికి అధిక ప్రాముఖ్యత గల భరత నాట్యంలో పదార్థ అభినయం ఉంటుంది. కొన్ని కదలికలే కాక వాచిక అభినయ (పదాలు/సంభాషణలు) కూడా కూచిపూడికే ప్రత్యేకం.

కదలికలు, సంగీతం

[మార్చు]

తరంగానికి చేసే గాత్రాన్ని కృష్ణ భగవానుని జీవిత ఘట్టాలని క్రోడీకరించే కృష్ణ లీలా తరంగిణి అంటారు.

భామాకలాపంలో గర్విష్టి సత్యభామ, కృష్ణ భగవానుని పాత్రలుంటాయి. సత్యభామ పాత్ర ప్రేమలోని వివిధ పార్శ్వాలని అభినయిస్తుంది. కృష్ణుడికి దూరమైన సమయంలో విరహవేదనని అనుభవిస్తూ, తాము కలసి ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో గుర్తు తెచ్చుకొంటూ అతని గూర్చి కాంక్షిస్తుంది. కృష్ణునికి రాయబారం పంపటంతో ఇద్దరూ కలసి కథని సుఖాంతం చేస్తారు.

కృష్ణ శబ్దం లో ఒక గోపిక కృష్ణుణ్ని కలవటానికి ఆహ్వానిస్తుంది. ఈ పాత్రలో ఒక స్త్రీ పురుషుణ్ణి ముగ్ధుణ్ణి చేసే ప్రయత్నంలోని హావభావాలని ప్రదర్శించే ఆస్కారం ఉంది.

అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం

[మార్చు]

తెలంగాణా, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో 2014 డిసెంబరు 26 నుండి మూడు రోజులపాటు సిలికానాంధ్ర ఆధ్వర్యంలో హైదరాబాద్‌ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో 4వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం 6327 మంది కూచిపూడి కళాకారులతో జరిగింది. అపురూప కళ విశ్వ వేదికలమీద ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలను నమోదు చేసింది. ఈ ప్రదర్శన గిన్నిస్ ప్రపంచ రికార్డులో చేర్చబడింది. అంతరించి పోతున్న మన కళను నేటి తరానికి సగర్వంగా పరిచయం చేసే బృహత్తర యజ్ఞం చేస్తుంది. నాట్యం సమ్మేళనం చూసేందుకు వేలాది సందర్శకులు తరలివచ్చారు. కళాకారుల మువ్వల సవ్వడి ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసింది. ముఖ్యంగా శివపార్వతి నాట్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.[5]

కొందరు ప్రముఖ కూచిపూడి నర్తకులు

[మార్చు]

చిత్ర మాలిక

[మార్చు]


ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "కూచిపూడి.కామ్ మూలాలు". Archived from the original on 2008-04-14. Retrieved 2008-04-17.
  2. "చంద్రకాంత.కామ్". Archived from the original on 2008-04-19. Retrieved 2008-04-17.
  3. మిక్కిలినేని, రాధాకృష్ణ మూర్తి (1992). "Wikisource link to సిద్ధేంద్రుని కూచిపూడి కళాక్షేత్రం". Wikisource link to తెలుగువారి జానపద కళారూపాలు. తెలుగు విశ్వవిద్యాలయం. వికీసోర్స్. 
  4. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-01-13. Retrieved 2015-01-30.
  6. "లలితా సింధూరి". Archived from the original on 2012-04-25. Retrieved 2012-01-03.
  7. "Jr NTR unseen classical dance video goes viral". ap7am.com/lv-332296-jr-ntr-unseen-classical-dance-video-goes-viral. Archived from the original on 2020-12-06. Retrieved 2020-11-27.

బయటి లింకులు

[మార్చు]