వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2019)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2019 సంవత్సరంలో "ఈ వారం వ్యాసం" శీర్షికలో ప్రదర్శించిన వ్యాసాలు

ప్రస్తుత ప్రతిపాదనలు, జాబితా కోసం వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా చూడండి.


1వ వారం

వేదనారాయణస్వామి ఆలయం

శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయం చిత్తూరు జిల్లాకు చెందిన నాగలాపురంలో ఉంది. ఇది అప్పట్లో వేదపురి అని, వేదారణ్య క్షేత్రమని హరికంఠాపురమని పేరు గాంచింది. సోమకాసురడనే రాక్షసుడు బ్రహ్మ దేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాచినపుడు, శ్రీమహావిష్ణువు మత్స్యావతారము దాల్చి సముద్ర గర్భమున సోమకాసురుని సంహరించి వేదాలను తెచ్చి ఈ స్థలంలోనే బ్రహ్మకిచ్చినట్లు స్థల పురాణంగా చెప్పబడుతుంది. దీనిని అప్పట్లో వేదపురి అని, వేదారణ్య క్షేత్రమని హరికంఠాపురమని పేరు గాంచింది. శ్రీకృష్ణ దేవరాయలు తన దక్షిణ దేశ పర్యటనలో హరికంఠ పురములో పల్లవులచే నిర్మించబడిన శ్రీ కరియ మాణిక్య పెరుమాళ్ అనే ఈ చిన్న ఆలయాన్ని సందర్శించి, శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంగా మార్చి, పంచ ప్రాకారములతో, సప్త ద్వారాలతో, అత్యంత కళాత్మకమైన శిల్ప కళతో, సుందర ఆలయంగా తీర్చి దిద్ది, పునర్నిర్మించి అనేక దానములు చేసి తన తల్లి పేరున దీనిని నాగలాపురముగా నామకరణము చేసెనని ఈ ఆలయ ఉత్తర కుడ్యమునందు గల శాసనము ద్వారా తెలియుచున్నది. ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరించడం ఈ ఆలయ విశిష్టత.

(ఇంకా…)

2వ వారం

వ్రిందావన్

వ్రిందావన్ ఉత్తర ప్రదేశ్, భారత దేశము నందలి మథుర జిల్లాలోని ఒక పట్టణము. ఇది కృష్ణ భగవానుడు తన చిన్ననాటి రోజులను గడిపిన ప్రదేశములో ఒకటి. ఈ పట్టణము కృష్ణ భగవానుని జన్మ స్థలమైన మథుర నుండి 15 కి.మీ. దూరంలో, ఆగ్రా-ఢిల్లీ రహదారికి దగ్గరలో ఉంది. ఈ పట్టణము రాథాకృష్ణుల వందలాది ఆలయాలకు నిలయముగా ఉంది. ఇది గౌడియ వైష్ణవ మతం, వైష్ణవ మతం, మరియు సాధారణ హిందూమతం లాంటి అనేక మత సంప్రదాయాలచే పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది. వ్రిందావన్ కు హిందూ చరిత్రకు సంబంధించిన పురాతన చరిత్ర ఉంది. ఇది ఒక ముఖ్యమైన హిందూ పుణ్య క్షేత్రము. ఇంకనూ నిలిచి ఉన్న పురాతన ఆలయాలలో గోవింద దేవ్ ఆలయం ఒకటి. ఇది 1590లో నిర్మించబడింది. ఈ పట్టణం అదే శతాబ్దము ప్రారంభంలో కనుగొనబడింది. వ్రిందావన్ యొక్క ప్రాశస్త్యము, 16వ శతాబ్దములో భగవాన్ చైతన్య మహాప్రభు తిరిగి కనుగోనేంత వరకు కాలగర్భంలో కలిసిపోయినట్లు నమ్మబడుతోంది. శ్రీ కృష్ణ ప్రభువునకు అతిశయించిన చిలిపిచేష్టలకు సంబంధించి కనుమరుగైన పవిత్ర ప్రదేశాలను గుర్తించే ఉద్దేశంతో భగవాన్ చైతన్య మహాప్రభు, 1515లో వ్రిందావనమును సందర్శించాడు. చైతన్య మహా ప్రభువు వ్రిందావన్ యొక్క పవిత్రమైన అడవులలో తిరుగుతూ పవిత్రమైన ప్రేమలో ఆధ్యాత్మికంగా మైమరచిపోయాడు. అతని దైవికమైన ఆధ్యాత్మిక శక్తి వలన, అతను వ్రిందావనములో మరియు చుట్టుప్రక్కల కృష్ణ భగవానుడు సంచరించిన ముఖ్య ప్రదేశాలను గుర్తించగలిగాడు.

(ఇంకా…)

3వ వారం

శ్రీరంజని

శ్రీరంజని (సీనియర్)గా ప్రసిద్ధి చెందిన మంగళగిరి శ్రీరంజని (1906 - 1939) ప్రముఖ పాతతరం చలన చిత్ర నటి. ఈవిడ మరో నటి శ్రీరంజని (జూనియర్)కు అక్క మరియు దర్శకుడు ఎం.మల్లికార్జునరావుకు తల్లి. 1906లో గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామంలో జన్మించింది. ఈవిడ 1920, 1930లలో గ్రామోఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా వారు విడుదలచేసిన నాటకాలను రికార్డులలో గాయనిగా తన ప్రైవేటు గీతాల ద్వారా ప్రసిద్ధి పొందింది. చిత్రాలలో నటించకముందు ఈమె పౌరాణిక నాటకాలలో అభిమన్యుడు, సత్యవంతుడు, కృష్ణుడు వంటి పురుష పాత్రలు వేసేది, అప్పట్లో ఆవిడ కృష్ణ విలాస నాటక సమాజంలో సభ్యురాలు. సి.పుల్లయ్యతీసిన లవకుశ (1934) ఈవిడ మొదటి చిత్రం. ఈవిడ మొత్తం 9 చిత్రాలలో నటించింది. 1939లో క్యాన్సర్ వ్యాధి కారణంగా మరణించింది. శ్రీరంజని బెజవాడ హనుమాన్‌ దాసు గారి దగ్గర సంగీతం నేర్చుకుంది. మహాకవి కాళిదాసు (1960), ప్రమీలార్జునీయం (1965) వంటి చిత్రాల నిర్మాత కె.నాగమణి గారు కూడా హనుమాన్‌దాసు గారి దగ్గరే హార్మోనియంనేర్చుకుంది. శ్రీరంజని నాటకాలలో నటిస్తున్నప్పుడు నాగుమణి గారు హార్మోనియం వాయించేది. పరిచమయిన కొన్నాళ్ళకి వారిద్దరు భార్యాభర్తలయ్యారు. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. శ్రీరంజని తను చనిపోయేముందు పిల్లల సంరక్షణార్థం తన భర్తను తన చెల్లెలు మహాలక్ష్మిని పెళ్ళి చేసుకోమని చెప్పారు. తర్వాత ఆమె పేరును కూడా శ్రీరంజనిగా మార్చారు. ఆవిడ శ్రీరంజని జూనియర్ గా ప్రసిద్ధి పొందింది, అందువలనే శ్రీరంజనికి సీనియర్ శ్రీరంజని అని పేరు వచ్చింది.

(ఇంకా…)

4వ వారం

కొండారెడ్డి బురుజు

కర్నూలు పేరు చెప్పగానే మనందరి ముందు తళుక్కున మెరిసేది కొండారెడ్డి బురుజు. ఇది కర్నూలు నగరానికి నడిబొడ్డులో ఉండి అందరినీ ఆకర్షిస్తుంది. ఈ బురుజుపైకెక్కి చూస్తే నగరమంతా అత్యంత సుందరంగా కనువిందు చేస్తుంది. కందనవోలు కోటకు నాలుగువైపుల ఉన్న బురుజులలో కొండారెడ్డి బురుజు ఒకటి. మిగతా మూడు శిధిలమైపోయినా నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నది ఈ కొండారెడ్డిబురుజు. శిధిలమైన ఆ మూడు బురుజులలో ఒకటి విక్టరీ టాకీస్ ప్రక్కన ఉంది. దీనిని "ఎర్ర బురుజు" అంటారు. ఎర్రని ఇసుకరాయితో నిర్మిచడం వలన దానికి ఆపేరు వచ్చింది. అందులో చిన్న ఎల్లమ్మ, పెద్ద ఎల్లమ్మ దేవాలయాలు ఉన్నాయి. ఎర్రబురుజు గోడల రాళ్లపై అనేక చిన్న చిన్న బొమ్మలను మనం గమనించవచ్చు. మిగిలిన రెండు బురుజులు తుంగభద్రానదిని ఆనుకొని ఉన్నాయి. ఒకటి కుమ్మరి వీధి దాటాక, మరొకటి సాయిబాబా గుడి ముందున్న బంగ్లా ప్రక్కన ఉన్నాయి. నదిని దాటి శత్రువులెవ్వరూ కర్నూలు నగరంలోనికి రాకుండా సైనికులు ఎప్పుడూ పహరా కాస్తుండేవారు. 1930లో భారతి పత్రికలో కర్నూలులోని ఒక బురుజు చిత్రాన్ని ప్రచురిస్తూ దాని క్రింద "రామానాయుడు బురుజు" అని రాసారు. మనం కుమ్మరి వీధి ప్రక్కన ఉన్న బురుజుకు పూర్వం ఆ పేరు ఉందని దీని ద్వారా తెలుసుకోవచ్చు. కొండారెడ్డి బురుజు చరిత్ర గూర్చి ఎటువంటి శాసనాలు లభ్యమవలేదు.

(ఇంకా…)

5వ వారం
వెల్చేరు నారాయణరావు

వెల్చేరు నారాయణరావు ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు మరియు పండితుడు. బ్రిటీష్ యుగంలో భారతీయ సాహిత్యం, ముఖ్యంగా తెలుగు సాహిత్యం పాశ్చాత్య సాహిత్య పరిశోధన వల్ల ఎలాంటి ప్రథలకు లోనైందో పరిశోధించి సమగ్రమైన అధ్యయనంతో ఆ లోపాలను సరిచేసే ప్రయత్నాలు చేస్తున్న విశిష్ట పరిశోధకుడు. వెల్చేరు నారాయణరావు విశిష్టమైన అవగాహనతో, లోతైన పరిశోధనతో, విస్తృతమైన అధ్యయనంతో తెలుగు విమర్శారంగంలో తనదైన స్థానాన్ని పొందాడు.ఆయన తొలి విమర్శా గ్రంథమైన "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం"లో కవిత్వంలోని విప్లవాల గురించి వివరించాడు. విప్లవాత్మక కవితల రూపం, విషయం, వ్యక్తీకరణ – ఈ పార్శ్వాలన్నీ ఆ కవిత పుట్టిన సందర్భాన్ని ప్రతిబింబిస్తాయని ఈ సిద్ధాంతసారం. వెల్చేరు నారాయణ రావు తెలుగులో, ఆంగ్లంలో పలు గ్రంథరచన, ఎన్నో ప్రామాణిక పత్రికల్లో వ్యాసరచన, పరిశోధనాత్మక గ్రంథాల్లో వ్యాసరచన ద్వారా భాగస్వామ్యం చేశాడు. అంతేకాక తెలుగు కావ్య, నాటక, నవల, కథలను ఆంగ్లంలోకి అనువదించి వాటి విశిష్టత తులనాత్మకంగా అధ్యయనం చేసి ముందుమాటలుగా రాశాడు. ఈ అనువాదాలు అంతర్జాతీయ స్థాయి ప్రామాణిక పత్రికల్లో ప్రచురించి ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల ప్రచురణలుగా వెలువరించడం వల్ల వాటికి ప్రామాణికత కట్టబెట్టి ప్రపంచ స్థాయిలో తెలుగు సాహిత్యానికి గుర్తింపు దక్కడానికి తనవంతు కృషి చేస్తున్నాడు. ఇండియన్ లిటరేచర్, జర్నల్ ఆఫ్ ఏషియన్ స్టడీస్, జర్నల్ ఆఫ్ లిటరరీ ట్రాన్స్ లేషన్, జర్నల్ ఆఫ్ సౌత్ ఏషియన్ లిటరేచర్ తదితర ప్రామాణిక చారిత్రిక, సాంస్కృతిక, సాహిత్య పత్రికల్లో ఆయన రచనలు ప్రచురణ పొందాయి.

(ఇంకా…)

6వ వారం

మగ్దూం మొహియుద్దీన్

మగ్దూం మొహియుద్దీన్ స్వాతంత్ర్య సమరయోధుడు, మహాకవి, ప్రముఖ కార్మిక నాయకుడు, ఉర్దూ కవి, హైదరాబాదు సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకరు. మగ్దూం మొహియుద్దీన్ తెలంగాణ లోని మెదక్ జిల్లా ఆందోల్లో 1908, ఫిబ్రవరి 4 న జన్మించాడు. ఆయన పూర్తిపేరు అబూ సయీద్ మహ్మద్ మఖ్దూమ్ మొహియొద్దీన్ ఖాద్రి (మహ్మద్‌ మగ్దూం మొహియుద్దీన్‌ హుజ్రీ). వీరి పూర్వీకులు ఉత్తర ప్రదేశ్ లోని ఆజంగఢ్‌లో ఉండేవారు. ఆయన తాత (తల్లితండ్రి) రషీదుద్దీన్ ఔరంగజేబు సైన్యాలతో పాటు దక్కన్ పీఠభూమికి వచ్చాడు. అలాగే, మరో తాత (తంవూడికి తండ్రి) సయ్యద్ జాఫర్ అలీ కూడా ఉత్తరవూపదేశ్ షాజహానాబాద్ నుండి 1857లోనే దక్షిణానికి వచ్చాడు. ఆ రకంగా ఆ కుంటుంబమంతా హైద్రాబాద్ దక్కన్ పరిసరాలకు చేరింది. ఆయన తండ్రి గౌస్ మొహియొద్దీన్ నిజాము ప్రభుత్వంలో సూపరింటెండెంటుగా పనిచేసేవాడు. మగ్దూం చిన్నతనంలోనే నాలుగేళ్ళయినా రాకముందే తండ్రి చనిపోయాడు. తల్లి మరో పెళ్ళి చేసుకోవడంతో మగ్దూం తన బాబాయి బషీరుద్దీన్ వద్ద పెరిగాడు. ప్రాథమిక విద్య హైదరాబాదు లోని ధర్మవంత హైస్కూల్లోను, మెట్రిక్యులేషను సంగారెడ్డిలోను చదివాడు. మఖ్దూం తండ్రి పరమ భక్తుడు- మహమ్మద్ గౌస్ మొహియుద్దీన్. తల్లి- ఉమ్దా బేగం. భర్త మరణానంతరం ఆమె వేరే వివాహం చేసుకుంది. పినతండ్రి బషీరుద్దీన్ పెంచాడు. 1929లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోచేరారు. పిన తండ్రి కొడుకు నిజాముద్దీన్ మఖ్దూమ్‌ను వెన్నంటి ఉన్నాడు. పినతండ్రి బషీరుద్దీన్ పెంపకంలో మఖ్దూమ్ సూఫీ మత సాంప్రదాయంలో క్రమశిక్షణతో పెరిగాడు.

(ఇంకా…)

7వ వారం

ఆక్సి ఎసిటిలిన్ వెల్డింగు

గ్యాసు వెల్డింగు అనునది, లోహాలను కరగించి అతుకు ప్రక్రియ, ఒక లోహపు అంచుతో మరొక లోహ అంచును కరగించి, కలసి ఏకరూపత వచ్చేటట్లుచేసి అతుకు ప్రక్రియ. ఇందులో రెండు వాయువు ల మిశ్రమాలను మండించడం ద్వారా ఏర్పడు ఉష్ణోగ్రతలో లోహలను కరగించి అతకటం జరుగుతుంది. మండించు వాయువులలో ఒకటి 'దహనవాయువు' లేదా 'ఇంధనవాయువు'. రెండవ వాయువు దహన దోహాదకారి. దహన లేదా ఇంధన వాయువులుగా ఎసిటిలిన్, హైడ్రోజన్, ప్రోపెన్ లేదా బ్యుటేన్ వాయువులను గ్యాసువెల్డింగు ప్రక్రియలోవాడెదరు. దహన దోహకారి వాయువుగా ఆక్సిజన్ లేదా గాలిని వినియోగిస్తారు. ఇంతకు ముందు పేర్కొన్న దహన వాయువులలో ఒక్క హైడ్రొజన్ వాయువును మినహాయించి మిగతా వాయువులన్ని కార్బను మరియు హైడ్రొజను సమ్మేళనం చెంది ఏర్పడిన కార్బొహైడ్రొజనులు. ఇందులో ప్రోపెన్ , మరియు బుటెన్ అనునవి ఆల్కెన్ గ్రూపునకు చెందిన హైడ్రోకార్బనులు కాగా అసిటిలిన్ మాత్రం అల్కైన్ గ్రూపునకు చెందిన హైడ్రోకార్బను/కార్బో హైడ్రొజను. అక్సి-అసిటిలిన్ వెల్డింగు ప్రక్రియలో లోహాలను అతుకుటకు పూరక లోహన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి. ఆక్సిజను మరియు అసిటిలిన్ వాయువులను తగిన నిష్పత్తిలో కలిపి, మండించుటకు వెల్డింగు టార్చు అనే పరికరం అవసరము. వాయువులు ప్రవహించు గొట్టాల చివరలు రెండూ నాజిలు ద్వారా ఒకటిగా కలుస్తాయి. రెండు గొట్టాలకు ప్రత్యేకంగా కవాటాలు ఉండి వీటి ద్వారా వాయువుల ప్రమాణాన్ని కావల్సిన మేరకు నియంత్రించవచ్చును. వెల్డింగుటార్చు నాజిల నుండి వెలువడు వాయువుల మిశ్రమాన్ని మండించడం వలన నాజిలు అంచువద్ద ప్రకాశవంతమైన అత్యధిక వెలుతురు వలయంతో కూడిన, ఉష్ణోగ్రత కలిగిన మంట/జ్వాల ఏర్పడును.

(ఇంకా…)

8వ వారం

మాయలోకం

మాయలోకం గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో కాంభోజరాజు కథ ఆధారంగా నిర్మించిన 1945 నాటి తెలుగు జానపద చలన చిత్రం. గోవిందరాజుల సుబ్బారావు, కన్నాంబ, సి.ఎస్.ఆర్, శాంతకుమారి, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి, గిడుగు సీతాపతి, లంక సత్యం, టి.జి.కమలాదేవి మొదలైన భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రానికి సంభాషణలు త్రిపురనేని గోపీచంద్ రాయగా, గాలిపెంచల నరసింహారావు సంగీతాన్ని సమకూర్చారు. ఇది అక్కినేని నాగేశ్వరరావు నటించిన రెండవ చిత్రం. చిత్రంలోని ఏడుగురు చిన్న రాజకుమారులలో మొదటి వానిగా బాలనటుడు బి.పద్మనాభం నటించారు. వరుస పరాజయాలతో ఆర్థికంగా దెబ్బతిన్న సారధి పిక్చర్స్‌ను గట్టెక్కించడానికి తనకు స్వతాహాగా సరిపడకున్నా ప్రేక్షకులు మెచ్చే జానపద ఫక్కీలో ఈ సినిమాని తీశాడు గూడవల్లి రామబ్రహ్మం. భారీ పెట్టుబడితో మంచి నిర్మాణ విలువలతో నిర్మించినా మాయలు, మంత్రాలు, దేవతలు, రాక్షసులతో కూడిన సినిమా తీసినందుకు రామబ్రహ్మం అపరాధ భావనతో సిగ్గుపడ్డాడు. అయితే సినిమా మాత్రం ఆశించిన విధంగా ప్రజాదరణ సాధించి, ఆర్థికంగా ఘనవిజయం చెందింది. అనంతర కాలంలో ఈ చిత్రం శోభన్ బాబు కథానాయకుడుగా కాంభోజ రాజు కథ పేరుతో పునర్నిర్మించారు.

(ఇంకా…)

9వ వారం

తూర్పు గాంగులు

తూర్పు గాంగులు మధ్యయుగంలో భారతదేశానికి చెందిన సామ్రాజ్య పాలకులు. వీరి స్వతంత్ర పాలన 11వ శతాబ్దం నుండి 15వ శతాబ్ద ప్రారంభం వరకూ, ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రముతో పాటు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ లోని అనేక ప్రాంతాలలోకి విస్తరించింది. వారి రాజధాని కళింగ నగరం లేదా ముఖలింగం (శ్రీకాకుళం జిల్లా). కోణార్క సూర్య దేవాలయం (ప్రపంచ వారసత్వ ప్రదేశం) నిర్మాతలుగా ప్రపంచ ప్రజలు ఇప్పటికీ వీరిని తలుచుకుంటారు. పశ్చిమ గాంగుల సంతతి వాడైన, అనంత వర్మన్ చోడగాంగునిచే ఈ రాజ్యాన్ని స్థాపించాడు. తూర్పు చాళుక్యులు, చోళులతో సంబంధ బాంధవ్యాలు కలిగిన తూర్పు గాంగులు, తమ దక్షిణ దేశ సంస్కృతిని ఒరిస్సా ప్రాంతానికి వ్యాపింపజేశారు. వీరి కాలంలో ఫణం అని పిలువబడిన నాణేలు, చెలామణీలో ఉండేవి. రాజ్యస్థాపికుడైన అనంతవర్మ చోళగాంగుడు, హైందవ మతాభిమాని మరియు లలిత కళల పట్ల ఆసక్తిని కలిగి ఉండేవాడు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరి లోని జగన్నాధ ఆలయాన్ని నిర్మించాడు. అనంత వర్మ అనంతరం అనేకమంది గాంగ రాజులు కళింగని పరిపాలించారు. వారిలో చెప్పుకోదగినవారిలో నరసింహదేవ వర్మ - 2 (1238–1264), ముఖ్యుడు. నరసింహదేవ వర్మ - 2 నిర్మింపజేసిన ఆలయాల్లో కోణార్క సూర్య దేవాలయం, శ్రీ కూర్మనాధుని దేవాలయం (శ్రీకూర్మం), వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, సింహాచలం ముఖ్యమైనవి.

(ఇంకా…)

10వ వారం

థెర్మిట్ వెల్డింగు

థెర్మిట్ వెల్డింగు అనునది మెటల్ ఆర్కు వెల్డింగు, గ్యాస్ వెల్డింగు, మరియు రెసిస్టెన్సు వెల్డింగుల కన్న కాస్త భిన్నమైన, వినూత్నమైన లోహలను అతుకు/వెల్డింగు విధానం.థెర్మిట్ వెల్డింగును థెర్మైట్ వెల్డింగు అనికూడా పిలుస్తారు. వేరువేరు మూలకాలు, లేదా రసాయనపదార్థాలు, లేదాసమ్మేళానాలు సంయోగంచెందునప్పుడు, రసాయనిక చర్య జరుపునప్పుడు, చర్యాసమయంలో ఉష్ణం గ్రహింపబడటం లేదా ఉత్పన్నం కావడం జరుగుతుంది. చర్యకాలంలో పదార్థంలచే ఉష్ణం గ్రహింపబడిన ఆ చర్యను ఉష్ణగ్రాహక చర్య అంటారు. ఉదా:నీటిలో ఉప్పును, చక్కెర లను కరగించినప్పుడు జరిగే చర్య. అలాగే చర్యాకాలంలో ఉష్ణం వెలువడిన చర్యను ఉష్ణమోచక చర్య అంటారు. ఉదా:గాఢ ఆమ్లాలను, క్షారాలను నీటిలో కరగించినప్పుడు. థెర్మిట్ వెల్డింగు ప్రక్రియలో పదార్థాల ఉష్ణమోచన చర్యవలన ఏర్పడు ఉష్ణశక్తిని వినియోగించుకొని లోహలను అతకడం జరుగుతుంది. థెర్మిట్ వెల్డింగులో ఉపయోగించు పదార్థాలను థెర్మిటులు అని వ్యవహరిస్తారు. మొత్తటి చూర్ణంగా వున్న అల్యూమినియంను లోహ అక్సైడులతో మండించినప్పుడు అత్యధికమొత్తంలో ఉష్ణ శక్తి విడుదల అవుతుంది. ఉష్ణోగ్రత 2500-30000C వరకు వుంటుంది. ఈ అసాధారణ ఉష్ణోగ్రతలో ఉక్కు, ఇనుప లోహాలు అతిత్వరగా ద్రవీకరణ చెందుతాయి. ఈ ద్రవీకరణ చెందిన లోహాన్ని ఉపయోగించి లోహాలను అతకడం జరుగుతుంది.

(ఇంకా…)

11వ వారం

ఎస్.వి.రంగారావు

ఎస్.వి.రంగారావుగా సుప్రసిద్ధుడైన సామర్ల వెంకట రంగారావు (జులై 3, 1918 - జులై 18, 1974) తెలుగు సినీ నటుడు. అతను నిర్మాత దర్శకుడు, రచయితగా కూడా వ్యవహరించాడు. కృష్ణా జిల్లా, నూజివీడులో జన్మించిన రంగారావు కొద్ది రోజులు మద్రాసులోనూ, తర్వాత ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నాడు. చదువుకునే రోజుల నుంచీ నాటకాల్లో పాల్గొనేవాడు. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా కొద్ది రోజులు ఉద్యోగం చేశాడు. నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం అతనికి నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశాడు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడొందల చిత్రాలకు పైగా నటించాడు. రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలనే కాక అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశాడు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల అతను ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో అతని నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారమే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నాడు. అతను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాలు అందుకున్నాయి. విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ మొదలైనవి ఇతని బిరుదులు. తెలుగు సినిమా స్వర్ణయుగంగా భావించే 1950-65 మధ్యలో ఎన్నో విజయవంతమైన, విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాల్లో మంచి నటన కనబరచడంతో ఎందరో తెలుగువారికి అభిమాన నటునిగా నిలిచాడు.

(ఇంకా…)

12వ వారం
బోయకొట్టములు పండ్రెండు

బోయకొట్టములు పండ్రెండు అనే గ్రంథం కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె వ్రాసిన చారిత్రక నవల. 9వ శతాబ్ది నాటి తొలి తెలుగు పద్యశాసనమైన "పండరంగని అద్దంకి శాసనము" ను ఆధారం చేసుకుని దీనిని వ్రాశాడు. ఆ శాసనం తెలుగు పద్యసాహిత్య రచన 9వ శతాబ్ది నాటికే ఉన్నట్టు స్పష్టపరిచేందుకు ఒక ఆధారం. "పండరంగడు అనే చాళుక్య సేనాని పండ్రెండు బోయకొట్టముల మీద దాడి చేసి స్వాధీనంచేసుకొని, బోయరాజ్యపు ప్రధాన కొట్టము, కట్టెపు దుర్గాన్ని నేలమట్టం చేసి, కందుకూరును బెజవాడవలె ప్రధాన పట్టణముగా బలిష్టము గావించెను. ఆదిత్య బటరునికి కొంతభూమి దానమిచ్చెను. నెల్లూరును పరశురామప్రీతి గావించెను." అన్నది పండరంగని అద్దంకి శాసనానికి సరళమైన నేటి తెలుగులో అనువాదం. పన్నెండు బోయకొట్టాలను పండరంగడనే సైన్యవీరుడు ఓడించాడని ఇది తెలుపుతోంది. దీన్ని ఆధారం చేసుకుని రచయిత రెండువందల యేళ్ళ ఆంధ్ర రాజ్యాల చరిత్ర పునఃసృజించి చారిత్రక నవలారచన చేశాడు. నవల తెలుగు సాహిత్యరంగంలో అత్యంత ప్రాచుర్యం పొందుతోంది. సాహిత్యవేత్తలైన "రాళ్ళబండి కవితా ప్రసాద్", "అంపశయ్య నవీన్" వంటి వారు ప్రశంసించారు.

(ఇంకా…)

13వ వారం

కాకతీయుల కాలంలో వ్యవసాయ రంగం

కాకతీయుల కాలం (11వ శతాబ్ది - 13వ శతాబ్ది) లో ఆర్థిక వ్యవస్థలో ఎప్పటివలె వ్యవసాయం ప్రధానవృత్తి, ఆర్థిక వ్యవస్థలో దానికి ముఖ్యభాగం ఉండేది. గోధుమలు, వరి, కొర్రలు, జొన్నలు, చెరుకు వంటివి, తోటల వ్యవసాయంతో కొబ్బరి, జామ, మామిడి, అరటి వంటి పంటలు పండించేవారు. కొన్ని ఆహార పంటలు కాగా, మరికొన్ని పంటలు పంచదార, బెల్లం, నూనె, వస్త్ర పరిశ్రమలకు ఆధారంగా ఉండేవి. దానితో కాకతీయ చక్రవర్తులు వ్యవసాయాభివృద్ధికి ప్రత్యేక సంస్కరణలు చేపట్టారు. సాగునీటి వనరుల పెంపు కోసం చెరువులు, భారీ సరస్సుల నిర్మాణం, సాగులో లేని కొత్త భూములలో వ్యవసాయం చేపట్టడానికి ప్రత్యేక చర్యలు వంటివి కాకతీయుల వ్యవసాయ విధానంలో కీలకంగా ఉండేవి. 11వ శతాబ్ది అర్థభాగంలో కాకతీయులు స్వాతంత్ర్యం ప్రకటించుకోవడానికి కొన్నేళ్ళ ముందు నుంచీ వారు వ్యవసాయరంగంపై దృష్టిపెట్టడం, సంస్కరణలు చేపట్టడం ప్రారంభమవుతున్న ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ కృషి కాకతీయ సామ్రాజ్య పతనం వరకూ కొనసాగాయి. ఈ చర్యల ద్వారా కాకతీయ సామ్రాజ్య వ్యాప్తంగా వందలాదిగా చెరువులు, సరస్సులు ఏర్పడ్డాయి. అడవులను కొట్టి శ్రీశైలం, పాకాల, మంథని, ఏటూరు నాగారం వంటి ప్రాంతాల్లో లక్షలాది ఎకరాలను సాగుకు తెచ్చి, వందల గ్రామాలను ఏర్పరిచారు.

(ఇంకా…)

14వ వారం

మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్‌ కార్పోరేషను ప్రపంచంలోనే అతి పెద్ద సాఫ్టువేర్ సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలను కలుపుకొని, మే 2004 నాటికి ఈ సంస్థలో సుమారుగా 50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని వాషింగ్టన్‌ రాష్ట్రంలోని రెడ్మాండ్‌ నగరంలో ప్రధాన కార్యాలయం గల ఈ సంస్థ 1975 వ సంవత్సరంలో బిల్ గేట్స్ మరియూ పౌల్‌ అలెన్‌ అను ఇద్దరు మిత్రులు స్థాపించారు. ఈ సంస్థ వివిధ రకాలైన కంప్యూటరు పరికరాలకు వివిధ రకాలయిన సాఫ్టువేర్ అభివృద్ధి పరచడం, తయారు చేయడం, లైసెన్స్‌లు ఇవ్వడం మరియూ సహకారం అందించడం చేస్తుంది. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మరియూ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అత్యంత ప్రముఖమైన, ప్రజాదరణ పొందిన సాఫ్టువేర్ ఉత్పత్తులు. ఈ రెండు సాఫ్టువేర్లు సుమారుగా డెస్క్-‌టాప్ కంప్యూటరులో అటో ఇటో పూర్తి వాటాని కలిగి ఉన్నాయి. (ఇంకా…)

15వ వారం

గిరీశం

గిరీశం కన్యాశుల్కం నాటకంలో గురజాడ అప్పారావు సృష్టించిన కాల్పనిక పాత్ర. కన్యాశుల్కం నాటకానికి ఉన్న తొలి, మలి కూర్పులు రెంటిలోనూ గిరీశం ప్రధాన పాత్ర. కన్యాశుల్కం నాటకంలో అతనిది ప్రధాన పాత్రే అయినా నాయక పాత్ర కాదు. కన్యాశుల్కంలో విజయనగరంలో అప్పులు, చేసిన తప్పులు చుట్టుముట్టడంతో శిష్యుడు వెంకటేశానికి చదువుచెప్పే మిషతో అతని ఊరైన కృష్ణరాయపుర అగ్రహారానికి వెళ్తాడు. అక్కడ బాల్యవివాహం వల్ల మీదపడ్డ వైధవ్యంతో కాలం గడుపుతున్న వెంకటేశం అక్క బుచ్చమ్మను ప్రేమలోకి దింపి పెళ్ళాడదామని, తద్వారా రకరకాలుగా డబ్బు, ఆస్తి కలిసివస్తుందని ఆలోచిస్తాడు. బుచ్చమ్మ చెల్లెలికీ ముసలివాడితో పెళ్ళిచేయబోగా, దాన్ని తప్పించేందుకు అని వంక పెట్టి బుచ్చమ్మను తీసుకుపోతాడు. విజయనగరంలో సంస్కర్త, న్యాయవాది అయిన సౌజన్యారావు పంతులు వద్ద వినయం నటించి నమ్మిస్తాడు. ఇతను మొదట్లో ఉంచుకున్న మధురవాణి బండారం బయటపెట్టడంతో కథ అడ్డం తిరుగుతుంది. గిరీశం వేశ్యాసాంగత్యం, మోసాలు, అబద్ధాలు, ఆడంబరాలు మరిగిన పాత్ర. అవసరానికి ఏదోక చక్రం అడ్డువేసి రోజులు గడుపుకుంటూ, వీలుంటే కొండకు వెంట్రుక వేద్దామని చూస్తూంటాడు. ఈ పాత్ర లక్ష్యం, దాని సిద్ధి, అసలు స్వభావంలోని కీలకం వంటి విషయాల మీద విమర్శకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

(ఇంకా…)

16వ వారం

మంచుమనిషి

సామాన్య శక పూర్వం 3,359 - 3,105 సంవత్సరాల మధ్య నివసించిన పురుషుని యొక్క మమ్మీ, మంచుమనిషి. ఇది ప్రకృతి సహజంగా తయారైన మమ్మీ. 1991 సెప్టెంబరులో, ఈట్జల్ ఆల్ప్స్ పర్వతాల్లో, ఆస్ట్రియా, ఇటలీల సరిహద్దు వద్ద ఈ మమ్మీని కనుగొన్నారు. ఈట్జల్ ఆల్ప్స్ పర్వతాల్లో లభించింది కాబట్టి ఈ మమ్మీని ఈట్జి అని కూడా పిలుస్తున్నారు. ఈ వ్యక్తి సా.శ.పూ 3,239 - 3,105 సంవత్సరాల మధ్య మరణించి ఉండేందుకు 66 శాతం అవకాశాలున్నాయి. ఇది ఐరోపాకు చెందిన, అత్యంత పురాతన, ప్రకృతి సహజ మమ్మీ. రాగియుగపు యూరపియన్ల గురించి పరిశోధకులకు అంతకుముందు తెలియని సమాచారం ఈ మమ్మీ ద్వారా లభించింది. అతడి దేహాన్ని, వస్తువులనూ ఇటలీ, దక్షిణ టైరోల్ లోని పురావస్తు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు. వివిధ శాస్త్ర విభాగాలకు చెందిన శాస్త్రవేత్తలు దేహంపై అనేక పరీక్షలు చేసి తాము కనుగొన్న విషయాలను విశ్లేషించారు. చనిపోయినపుడు ఆ వ్యక్తి వయసు, అతడి జీవన శైలి, వృత్తి, అతడి ఆహారపు అలవాట్లు, చనిపోయేముందు అతడు ఏమి తిన్నాడు, ఎన్ని గంటల ముందు తిన్నాడు వంటి అనేక అంశాలను వెలుగులోకి తెచ్చారు. అతడి మరణ కారణంపై శాస్త్రవేత్తలకు భిన్నాభిప్రాయలు ఉన్నప్పటికీ, అతడిది హింసాత్మక మరణమనే విషయంపై స్థూలంగా ఏకాభిప్రాయం ఉంది. 1991 సెప్టెంబరు 19 న ఆల్ప్స్ పర్వతాల్లో 3,210 మీటర్ల ఎత్తున ఇద్దరు జర్మను యాత్రికులు హెల్ముట్ సైమన్, ఎరికా సైమన్‌లకు ఆస్ట్రియా-ఇటలీ సరిహద్దులోని ఈట్జల్ ఆల్ప్స్ పర్వతాల్లో తూర్పు శిఖరం పైన ఈ మమ్మీ కనబడింది.

(ఇంకా…)

17వ వారం

భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‍స్టిట్యూట్

భండార్కర్ ప్రాచ్య పరిశోధనా సంస్థ లేదా భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‍స్టిట్యూట్ (BORI) భారతదేశంలో మహారాష్ట్ర లోని పూణే నగరంలో ఉంది. ఇది 6 జూలై, 1917న స్థాపించబడింది. ఈ సంస్థ డా. రామకృష్ణ గోపాల్ భండార్కర్ (1837-1925) జీవితం మరియు కృతులను గౌరవిస్తూ స్థాపించబడింది. ఈయన భారతీయత గురించి భారతదేశంలో మొట్టమొదటి సారి పరిశోధన మొదలుపెట్టారు. భారతీయతను ఒక శాస్త్రంగా గుర్తించిందీయనే. ఈ సంస్థ ఎన్నో పురాతన సంస్కృత మరియు ప్రాకృత తాళపత్రాలకు నెలవు. మొదట్లో బాంబే ప్రభుత్వం ఈ సంస్థకు నిధులు సమకూర్చింది. హైదరాబాదు నిజాం ఈ సంస్థలో ఒక అతిథి గృహానికి విరాళం ఇచ్చాడు. భారత ప్రభుత్వం నుంచి, యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన నుంచి ఈ సంస్థకు నిధులు అందుతున్నాయి. విమర్శనాత్మక మహాభారతం పేరుతో అతి పెద్ద మహాభారత గ్రంథాన్ని ఈ సంస్థ ప్రచురించింది.

(ఇంకా…)

18వ వారం

సాల్‌సీడ్ నూనె

సాల్‌సీడ్ నూనె సాలువా చెట్టు గింజలనుండి తీయబడుతున్న ఆహారయోగ్యమైన శాకనూనె. సాలువా చెట్టు గింజలలోని తైలం 45-50% వరకు సంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగివుండటం వలన 30-350C వద్ద ఘనీభవించును. అందుచే దీనిని సాల్‌ ఫ్యాట్‌ లేదా సాల్‌ బట్టరు అంటారు. సాల్/సాలువ/సాల్వ చెట్టు యొక్క వృక్ష శాస్త్రీయనామం: షోరియ రొబస్టా. ఇది యిదిడిప్టెరోకార్పేసి కుటుంబానికి చెందినది. ఉత్తర భారతదేశంలో మరియు హిందీలో ఈ వృక్షాన్ని సాల్‌, సాల్వా, రాల్, సాఖు, షాల్ అని పిలుస్తారు. సంస్కృతంలో 'అశ్వకర్ణ' అని, తెలుగులో సాలువ, సాల్వ అని పిలుస్తారు. సాల్వ వృక్షం బౌద్ధులకు ఎంతో పవిత్రమైనది. బుద్ధుని జననం మరణం సాల్వ వృక్షం క్రింద జరిగిందని వారి విశ్వాసం.ఇదే కుటుంబానికి చెందినావాటిక రొబస్టా అనే మరోమొక్కను గుగ్గిలం అంటారు.సాలువా మొక్కను గుగ్గిలం అని కుడా వ్యవహరిస్తారు. సాల్వవృక్షం 30-35 మీటర్ల ఎత్తు పెరుగును. బలమైన కాండం, శాఖలు కలిగి వుండును. పెరిగిన చెట్టు కాండం వ్యాసం 1.5-2.0 మీ, వుండును. పెరుగుచున్న చెట్టుబెరడు గోధుమ వర్ణంలోవుండి, నిలువుగా చీలికలుండి,4-5సెం, మీ. మందముండును. ఆకులు (పత్రాలు) 15-20 సెం, మీ, వుండును. ఈ నూనెను చాక్‌లెట్‌ తయారిలో, వనస్పతి తయారిలో సాల్ కొవ్వును వాడెదరు. సబ్బులతయారిలో కూడా వినియోగిస్తారు. సాల్‌ చెట్టు నుండి కలపను దూలలు, కిటికి, గుమ్మాల ఫ్రేములు తయారుచేయుదురు. టేకు, దేవదారు తరువాత అంతగా దృఢమైనది సాలువ కలప.

(ఇంకా…)

19వ వారం
పాండురంగ వామన్ కాణే
ఆచార్య పాండురంగ వామన్ కాణే (1880-1972) మహారాష్ట్రకు చెందిన ప్రముఖ భారతీయ చరిత్రకారుడు, సంస్కృత పండితుడు మరియు ఉపాధ్యాయుడు. 1963 లో ఈయన భారతరత్న పురస్కారానికి ఎంపికయ్యాడు. ఈయనకు మహామహోపాధ్యాయ అనే బిరుదు ఉంది. ఈయన రచించిన ప్రఖ్యాత గ్రంథం "హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర". శతాబ్దాలుగా వెలువడిన పలు తాళపత్రగ్రంథాల మొదలు పుస్తకాల వరకు పరిశోధించిన డా. కాణే ఈ పుస్తకము ద్వారా భారతదేశముయందలి ప్రాచీన, మధ్య తరాలలో న్యాయవర్తనయొక్క పరిణామక్రమము గురించి తెలియజేసెను. ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బాంబే, భండార్కర్ ఓరియంటల్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి ప్రఖ్యాత సంస్థలలో లభ్యమయిన వనరులను డా. కాణే తన పరిశోధనలో ఉపయోగించారు. ఆరువేల అయిదువందల పుటల పైబడి ఉన్న ఈ గ్రంథము ఐదు సంపుట్లలో ప్రచురితమయ్యింది; మొదటి సంపుటి 1930లో ప్రచురింపబడగా చివరి సంపుటి 1962లో ప్రచురింపబడింది. ఈ గ్రంథము విషయవైశాల్యము, లోతైన పరిశోధనలకు పేరు పొందినది - డా. కాణే మహాభారతం, పురాణాలు, చాణక్యుడు వంటి విభిన్న దృక్పథాల రచనలను సంప్రదించడమే కాక, అప్పటివరకు జనసామాన్యానికి తెలియని ఎన్నో పుస్తకాలను సంప్రదించారు. ఈ గ్రంథ వైశిష్ట్యము ఆయన సంస్కృత భాషా ప్రావీణ్యానికి ఆపాదించబడింది. పురాణాలు మున్నగు గ్రంథాలను పూజాభావముతో కాక అపేక్షాభావముతో పరిశోధించినందువలనే ఆయన కృతార్థులయ్యారని ఒక భావన.
(ఇంకా…)
20వ వారం
ఎం. హరికిషన్
ఎం. హరికిషన్‌ తెలుగు బాలసాహిత్యంలో ఒక నూతన ఒరవడికి కృషిచేస్తున్న ప్రముఖ రచయిత. అతను పిల్లలు మాట్లాడుకునే భాషలో అత్యంత సరళంగా, పిల్లలు తమంతట తామే చదవుకొనేలా కథలు రాయడంలో సిద్ధహస్తుడు. కర్నూలు జిల్లాలో అంతరించిపోతున్న జానపద బాల సాహిత్యాన్ని వెలికితీస్తూ రింగురుబిళ్ళ, కిర్రు కిర్రు లొడ్డప్ప ఒకటి తిందునా... రెండు తిందునా, నక్కబావ-పిల్లిబావ. నల్లకుక్క, నలుగురు మూర్ఖులు, కోటకొండ మొనగాడు... ఇలా అనేక పుస్తకాలు వెలువరించాడు. అప్పుడప్పుడే అక్షరాలు దిద్దుతూ, చదవడం నేర్చుకుంటున్న చిన్నారుల కోసం ఏమయినా చేయాలనే తపనతో "ఒత్తులు లేని గేయాలు, బొమ్మలతో సామెతలు, పిల్లల గేయాలు, సంయుక్త అక్షరాలు లేని కథలు" సృష్టించాడు. కోడుమూరు మండలంలోని అమడగుంట్లలో ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తున్న హరికిషన్‌ పోస్టుగ్రాడ్యుయేట్ చేస్తున్నప్పుడు వారి అధ్యాపకుడు, కథా రచయిత అయిన డా॥ తుమ్మల రామకృష్ణగారి సహచర్యం వల్ల సాహిత్య రచనపట్ల ఆసక్తి పెంపొందించుకున్నాడు. అప్పుడప్పుడే కర్నూలులో కథాసాహిత్యాన్ని, సామాజిక స్పృహ గలిగిన రచయితల్ని పెంపొందించాలనే ఆశయంతో ఆవిర్భవించిన సాహితీసంస్థ 'కథాసమయం'లో సభ్యునిగా చేరాడు. రాప్తాడు గోపాలకృష్ణ, శ్రీనివాసమూర్తి, వెంకటకృష్ణ, శేఖర్‌, ఉమామహేశ్వర్‌ విం సాహితీమిత్రుల సహకారంతో, చర్చాగోష్టులతో కథారచనలో మెళకువలను అందిపుచ్చుకున్నాడు.
(ఇంకా…)
21వ వారం

వై. వి. ఎస్. చౌదరి

వై. వి. ఎస్. చౌదరి (పూర్తి పేరు యలమంచిలి వేంకట సత్యనారాయణ చౌదరి) ప్రముఖ తెలుగు సినిమా రచయిత, దర్శకుడు, నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్జిబిటరు, ఆడియో కంపెనీ అధినేత. 1998వ సంవత్సరంలో అక్కినేని నాగార్జున నిర్మాణంలో "గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్" సంస్థలో రూపొందిన శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా విజయం తరువాత అక్కినేని నాగార్జున మరియు నందమూరి హరికృష్ణకథానాయకులుగా సీతారామరాజు, మహేష్ బాబు కథానాయకుడిగా యువరాజు సినిమాలను తెరకెక్కించాడు. తరువాత "బొమ్మరిల్లు వారి" నిర్మాణ సంస్థను స్థాపించి లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో నిర్మాతగా మారాడు. దాని తరువాత సీతయ్య, దేవదాసు, ఒక్క మగాడు, సలీమ్, రేయ్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. వీటిలో సలీమ్ మినహా మిగతా సినిమాలన్నింటినీ తానే నిర్మించాడు. చౌదరి ఇప్పటివరకు తొమ్మిది సినిమాలకు దర్శకత్వం వహించాడు. 2012లో రవితేజ కథానాయకుడిగా గుణశేఖర్ దర్శకత్వంలో నిప్పు సినిమాను నిర్మించాడు. మొదటి సినిమాతో వెంకట్, చాందిని అనే నటులను పరిశ్రమకు పరిచయం చేశాడు. దేవదాసుతో రామ్ మరియు ఇలియానా, రేయ్ తో సాయి ధరమ్ తేజ్ లను పరిచయం చేశాడు. తరువాతికాలంలో వీళ్ళు తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటులుగా స్థిరపడ్డారు.


(ఇంకా…)

22వ వారం

తిరుమల ప్రసాదం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి నైవేద్యంగా నివేదించి, భక్తులకు పంచిపెట్టే లడ్డు, వడ వంటి తినే పదార్థాలు తిరుమల ప్రసాదంగా ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుతం లడ్డు తిరుమలలో శ్రీవారి ప్రసాదాల్లో అత్యంత ప్రాచుర్యం పొంది, తిరుమల ప్రసాదం అంటే గుర్తుకువచ్చేలా పేరు తెచ్చుకుంది. అయితే చారిత్రకంగా 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ళ వరకూ వడకు తిరుమల ప్రసాదంగా ప్రస్తుతం లడ్డుకు ఉన్న పేరు ఉండేది. మనోహరం పడిగా పిలిచే సున్నుండ వంటి ప్రసాదానికి కూడా 16-20 శతాబ్దాల కాలంలో ప్రాముఖ్యత ఉండేది. ఈ రెండు ప్రసాదాల ప్రాధాన్యతను 20వ శతాబ్ది నుంచి సెనగపిండితోనూ, పంచదారతోనూ చేసే ప్రస్తుత తిరుపతి లడ్డు తీసుకుంది. విజయనగర సామ్రాజ్యం అత్యున్నత దశకు చేరుకునే నాటికి రాజులు, అధికారులు, సంపన్నులు ఏర్పాటు చేసిన దానాల వల్ల వందలాది గంగాళాల్లో నిత్యం వందసార్లు నివేదించే స్థితి నుంచి ఈస్టిండియా కంపెనీ కాలంలో అన్ని నైవేద్యాలను నిలిపివేసింది. 1840లో తిరిగి మహంతుల చేతికి దేవాలయాన్ని అప్పగించాకా తిరిగి ప్రారంభమైన నైవేద్యాలు ఈనాటికీ కొనసాగుతున్నాయి. ప్రసాదం తయారీలోనూ, వాటి ప్రాధాన్యతల్లోనూ, పంపిణీలోనూ, తయారుచేసే వ్యవస్థలోనూ వందలాది ఏళ్ళలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి.

(ఇంకా…)

23వ వారం

అబూబక్ర్

అబూ బక్ర్ (అరబ్బీ ابو بكر الصديق, అబూ బక్ర్ సిద్దీఖ్) (సా.శ. 573 - సా.శ.ఆగస్టు 23 634) మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతం గురించి ప్రకటించిన తరువాత, ఇస్లాంను స్వీకరించినవారిలో ప్రథముడు. మహమ్మద్ కి తొలి సహచరుడు (సహాబీ), తన కుమార్తె ఆయేషాను ఇచ్చి వివాహం చేసి మహమ్మద్ కి మామ కూడా అయ్యాడు. ఇస్లాంలోకి మారాకా అబూ బక్ర్ అన్న తన పేరు అబ్దుల్లా (అల్లాహ్ సేవకుడు అని అర్థం)గా మారింది. తొలి దశలో ఇస్లాంని వ్యాప్తి చేయడానికి ఇతను కృషిచేశాడు. ఇస్లాంలోకి మక్కా నగర ప్రజలను ఆహ్వానిస్తూ తొలి బహిరంగ ప్రసంగం చేసిందీ ఇతనే. ఈ కారణాల వల్ల ఇస్లాంకు అప్పట్లో వ్యతిరేకులైన ఖురేష్ తెగ వారి వేధింపులు ఎదుర్కొన్నాడు. మహమ్మద్ మక్కా నుంచి మదీనాకు వలస వెళ్ళినప్పుడు అనుసరించాడు. అతనితో పాటు యుద్ధాల్లో పాల్గొన్నాడు. తొలిసారిగా మదీనావాసులను మహమ్మద్ హజ్ కు పంపినప్పుడు నాయకత్వం వహించే గౌరవాన్ని అబూ బక్ర్ కి ఇచ్చాడు. మహమ్మద్ మరణాంతరం ప్రథమ ఖలీఫాగా నియమితుడయ్యాడు (రాషిదూన్ ఖలీఫాలులో ప్రథముడు). ఇతను ఖలీఫాగా పరిపాలించిన కాలం రెండు సంవత్సరాల మూడు నెలలు. ఇతను ఖురాన్ కి లిఖిత రూపాన్ని కల్పించాడు. ఇతని కాలంలో ముస్లింసామ్రాజ్యం పటిష్ఠమైంది, విస్తరించింది. అరేబియా అంతటా శాంతి నెలకొంది.

(ఇంకా…)

24వ వారం

రబ్బరుగింజల నూనె

రబ్బరుగింజల నూనె శాకతైలం. కాని ఆహరయోగ్యం కాదు. కాని పారిశ్రామికంగా పలు వుపయోగాలున్నాయి. రబ్బరుచెట్టు పుట్టుక స్థావరం, దక్షిణ అమెరికాలోని ఆమెజాన్ ప్రాంతం. అక్కడినుండి ఆఫ్రికా, ఆసియాఉష్ణమండల అరణ్య ప్రాంతాలకు 19 శతాబ్దికాలానికి వ్యాపించింది. ప్రపంచమంతటా 9.3 మిలియను హెక్టారులలో రబ్బరుతోటలు పెంచబడుచున్నవి. అందులో95% వరకు ఆసియా దేశాలలో పెంచబడుచున్నవి. రబ్బరుచెట్టు నిటారుగా పెరిగే బహువార్షికం. పెరుగుదల చాలా వేగంగా వుంటుంది.రబ్బరుచెట్టు ఆకురాల్చుచెట్టు.30-40మీటర్ల ఎత్తువరకు పెరుగును.అయితే తోటలలో15-20 మీటర్ల ఎత్తుపెరుగు చెట్లు పెంచెదరు. కాండం దిగువన కొమ్మలు లేకుండ నిటార్గా పెంచెదరు. రబ్బరుచెట్టు మూలం దక్షిణ అమెరిక ఆమెజాన్‌ ప్రాంతం. అక్కడి నుండి దక్షిణాసియా దేశాలకు మొదటవ్యాప్తి చెందినది. కీ.శ,1876లో ఇండియాకు తీసుకు రాబడింది. హెన్రి విక్‌మెన్, బ్రెజిల్‌ నుండి ఇండియాకు తెచ్చాడు. ఆ తరువాత రబ్బరుసాగు ఆసియా, ఆఫ్రికా, మరియు అమెరికాలకు వ్యాప్తి చెందినది. ఇండియాలో ఆధికవిస్తీర్ణంలో కేరళ రాష్ట్రంలో సాగులోవున్నది. ఇండియాలో సాగులోవున్న రబ్బరుతోటల విస్తీర్ణంలో 85% కేవలం కేరళలోనీ సాగులో ఉంది. కేరళలోదాదాపు 45 వేలహెక్టారులలో సాగులో ఉంది. రబ్బరు విత్తనాలు చూచుటకు ఆముదం విత్తనాల వలెవుండి, ఆముదం విత్తనాల కంటే పరిమాణంలో పెద్దవిగా వుండును.

(ఇంకా…)

25వ వారం
రత్నం బాల్ పెన్ వర్క్స్
రత్నం పెన్ భారతదేశంలో తయారైన మొట్టమొదటి ఫౌంటెన్ పెన్. 1930 లో రాజమండ్రిలో ఫౌంటెన్ పెన్‌లు తయారు చెయ్యడం ప్రారంభించిన రత్నం పెన్ వర్క్స్ నేటికీ కలాలు తయారు చేస్తోంది. 80 ఏళ్ళ పైచిలుకు ప్రస్థానంలో అనేక ప్రశంసలు అందుకుంది. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో పెన్నుల రంగంలో అడుగుపెట్టి, అలనాడు గాంధీజీ ప్రశంసలు అందుకున్న రత్నంపెన్ ఇప్పుడు మూడవ తరం భాగస్వామ్యంతో రత్నంపెన్, రత్నం బాల్ పెన్ వర్క్స్‌గా విరాజిల్లుతోంది. స్వాతంత్ర్య పోరాటంలో స్వదేశీ స్ఫూర్తిని జీర్ణించుకుని ఎన్నో కార్యక్రమాలకు వేదికగా నిలిచిన రాజమండ్రి నగరంలో 'కలం' పరిశ్రమకు రత్నం పెన్ వర్క్స్ నాంది పలికింది. ఎందరో ప్రముఖులు ఈ సంస్థను సందర్శించి ముగ్దులయ్యారు. స్వాతంత్ర్య సమర స్ఫూర్తితో స్వదేశీ నినాదానికి వేదికగా నిలిచిన ఈ సంస్థ 85 ఏళ్ళు పూర్తి చేసుకుంది. కె.వి.రత్నం బ్రదర్స్ పేరిట స్వర్గీయ కోసూరి వెంకటరత్నం నెలకొల్పిన రత్నం పెన్స్ సంస్థ రత్నం గారి హయాంలోనే రత్నం పెన్ వర్క్స్, రత్నం బాల్‌పెన్ వర్క్స్ గా విడివడింది. ప్రస్తుతం రెండు సంస్థలూ వ్యాపారంలో విరాజిల్లుతున్నాయి. దేశ విదేశాలలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న 'రత్నం పెన్' ఆవిర్భావం వెనుక మహాత్మాగాంధీ ప్రేరణ ఉంది. 1921లో వార్ధాలో కె.వి.రత్నంగారు కలసికొని, హితి బ్లాక్ డైస్ (నగలకు సంబంధించి) తయారు చేసి గాంధిజీకి చూపించారు. త్వరలో విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపు ఇవ్వబోతున్నామని, అందుచేత సామాన్యులకు ఉపయోగపడే వస్తువు తయారు చేయాలని గాంధీజీ చెప్పడంతో, అయితే ఏ వస్తువు తయారుచేయాలో చెప్పాలని రత్నంగారు అడగడం, పిన్ నుంచి పెన్ వరకు ఏదైనా తయారు చేయవచ్చని గాంధిజీ సూచించడంతో, పెన్ తయారీకే రత్నంగారు మొగ్గు చూపారు. 1930 లో పెన్నుల తయారీ ప్రారభించారు. 14 కేరట్ల బంగారు పాళీలు రూపొందించి, ఇంగ్లాండ్ నుంచి ఇరేడియం పాయింట్లు రప్పించి, పెన్నులు తయారు చేసారు.
(ఇంకా…)
26వ వారం
విజయశాంతి

విజయశాంతి తెలుగు చలన చిత్రాలలో ప్రసిద్ధిగాంచిన నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు తన 30 సంవత్సరాల సినిమా ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం మరియు హిందీ భాషా చిత్రాలలో నటించింది. ఆమె "ద లేడీ సూపర్ స్టార్" మరియు "లేడీ అమితాబ్" గా దక్షిణ భారతదేశంలో పిలువబడుతుంది. ఆమె 1991 లో కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నది.  ఆమె ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను, ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిన భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారాన్ని పొందింది. ఆమె నాలుగు రాష్ట్ర నంది పురస్కారాలను అందుకుంది.  1985లో ప్రతిఘటన సినిమాలో పాత్రకు నంది పురస్కారాన్ని పొందింది. 1987లో ఆమె చిరంజీవి తో కలసి నటించిన స్వయంకృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లోనూ, హాలీవుడ్ నటుడు థామస్ జనె తో నటించిన పడమటి సంధ్యారాగం సినిమా లూస్వెల్లీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడినాయి. 1990లలో సినిమా కథానాయకులతో సమానంగా పారితోషకం డిమాండ్ చేసిన ఏకైక సినిమా నటిగా గుర్తింపు పొందింది. ఆమె నటించిన కర్తవ్యం సినిమాలో రెమ్యూనిరేషన్ ఒక కోటి రూపాయలు ఆ కాలంలో ఏ కథానాయికలు పొందని అత్యంత ఎక్కువ రెమ్యూనిరేషన్. ఆమె 1998లో రాజకీయ రంగంలోనికి ప్రవేశించింది.

(ఇంకా…)

27వ వారం

శ్యాంప్రసాద్ ముఖర్జీ

శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయవాద నేతలలో ముఖ్యుడు. 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ మరియు హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించాడు. హిందూ మహాసభ మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యాం ప్రసాద్ ముఖర్జీ, జనసంఘ్‌ను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన నేతగా స్థానం పొందినాడు. కలకత్తా విశ్వవిద్యాలయం కులపతిగా పనిచేసిన అశుతోష్ ముఖర్జీ కుమారుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ కోల్‌కత లోనే ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించి ప్రారంభంలో కాంగ్రెసు వాదిగానే రాజకీయ జీవితం ఆరంభించాడు. స్వాతంత్ర్యానికి పూర్వం జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు. 1949లో ఢిల్లీ ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీ నుంచి తప్పుకొని అక్టోబర్ 21, 1951 న జనసంఘ్ పార్టీని స్థాపించి, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మే 23, 1953 న మరణించేవరకు కొనసాగినాడు. వినాయక్ దామోదర్ సావర్కర్తో బాటు ముఖర్జీ కూడా భారతదేశంలో హిందూజాతీయ వాదపు, ముఖ్యంగా హిందూత్వ ఉద్యమమునకు ప్రముఖుడిగా పరిగణించబడతాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరియు విశ్వహిందూ పరిషత్తు మద్దతుదారులచే మంచి గౌరవానికి పాత్రుడయ్యాడు. 1960, 70 దశకాలలో భారతీయ జనసంఘ్ పార్టీకి ఆ తదనంతరం భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి దోహదపడిన అటల్ బిహారీ వాజపేయికి శ్యాంప్రసాద్ ముఖర్జీ మంచి మార్గనిర్దేశం చేశాడు.

(ఇంకా…)

28వ వారం
చంద్రశేఖర్ సింగ్
చంద్రశేఖర్ సింగ్ భారతదేశ రాజకీయనాయకుడు, భారత దేశపు 11వ ప్రధానమంత్రి. అతను ప్రధానమంత్రిగా 1990 నవంబరు 10 నుండి 1991 జూన్ 21 వరకు తన సేవలనందించాడు. చంద్రశేఖర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని బల్లియా జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్టి గ్రామంలో 1927 ఏప్రిల్ 17న రైతు కుటుంబంలో జన్మించాడు. అతను సతీష్ చంద్ర పి.జి. కళాశాల నుండి బి.ఎ చేసాడు. 1951లో అలహాబాదు విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రంలో పి.జి. చేసాడు. అతను విద్యార్థి దశలో ఉన్నప్పుడే విద్యార్థి రాజకీయాలలో క్రియాశీలకంగా డా.రాంమనోహర్ లోహియా తో కలసి రాజకీయ జీవితం ప్రారంభించాడు. విద్యార్థి స్థాయి రాజకీయాల్లో ఎంతో చురుకైనవాడుగా పేరుతెచ్చుకున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత అతను సోషలిస్టు రాజకీయ రంగ ప్రవెశం చేసాడు. అతను దుజా దేవిని వివాహం చేసుకున్నాడు. అతను సోషలిస్టు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా జీవితాంతం పనిచేసిన రాజకీయ యోధుడు చంద్రశేఖర్. పాదయాత్ర ద్వారా దేశ ప్రజలను ఆకర్షించి చివరి వరకు ప్రజాసమస్యల కోసమే పనిచేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. అతను సోషలిస్టు ఉద్యమంలో ప్రజా సోషలిస్టు పార్టీ (PSP) కి సెక్రటరీ గా నియమితుడయ్యాడు. అతను ఉత్తరప్రదేశ్ లోని పి.ఎస్.పి రాష్ట్ర విభాగంలో జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాడు. 1956-57లో అతను ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శి అయ్యాడు. 1962 నుండి 1967 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నాడు. తన రాజకీయ జీవితం ప్రారంభంలో ప్రముఖ సోషలిస్టు నాయకుడు ఆచార్య నరేంద్రదేవ్ సారధ్యంలో పనిచేసాడు.
(ఇంకా…)
29వ వారం
సౌందర్య
సౌందర్య భారతీయ సినిమా నటి. ఈమె తెలుగు, తమిళం, కన్నడం మరియు మలయాళం భాషలలో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది. 12 సంవత్సరాలు నటిగా వెలిగిన ఈమె బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో మరణించింది. సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీ రంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నది. ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించేటపుడే మొదటి చిత్రంలో నటించింది. ఆమె ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా, ఆమె తండ్రి యొక్క స్నేహితుడు, గంధర్వ (1992) చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. అమ్మోరు చిత్రం విజయవంతమైన తరువాత, ఆమె చదువును మధ్యలోనే ఆపేసింది. తరువాత ఆమె తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె మంచి పేరు ప్రఖ్యాతులు గడించి విజయఢంకా మ్రోగించింది. ఆమె కన్నడ, తమిళం, మలయాళం చిత్రాలతో పాటు ఒక హిందీ చిత్రంలో కూడా నటించింది. హిందీలో ఆమె అమితాబ్ బచ్చన్ తో కలిసి సూర్యవంశ్ అనే హిందీ చిత్రంలో నటించింది. సౌందర్య గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం జాతీయ పురస్కారాలలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణకమలంతో పాటు పలు పురస్కారాలు అందుకుంది. ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ ఛాయాచిత్రగ్రహణానికి గాను పురస్కారాలు లభించాయి. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో కూడా ప్రదర్శింపబడింది.
(ఇంకా…)
30వ వారం
ఆముదము నూనె
ఆముదపు నూనె ఆముదపు గింజల నుండి తీయు నూనె ఖాద్యతైలం కాదు. కాని పారీశ్రామిక రంగంలో దీని వాడకం విస్తృతంగా ఉంది. శాస్త్రీయనామము రిసినస్ కమ్మినిస్. ఇది యుపెర్బెసియె కుటుంబానికి చెందినది. ఆముదపు మొక్కలను కేవలం నూనె గింజల ఉత్పత్తికై సాగుచేయుదురు. తూర్పుఆఫ్రికాలోని యిథోఫియా అముదం మొక్క ఆవిర్భవ స్థానం. ఆముదపు మొక్క ఏపుగా, ఎత్తుగా పెరగడం వలన ఆముదపు చెట్టు అని కూడా అంటారు. ఈ మొక్కను ఎక్కువగా ఏక వార్షికంగానే సాగు చేయుదురు. మొక్క చాలా ఏపుగా చురుకుగా పెరుగును. ఇది సతత హరితపత్రమొక్క. ఇది సుమారు 2-5 మీ.ఎత్తు పెరుగును. మొక్కపెరిగినతరువాత మొక్క కాండంలోపలి భాగం గుల్లగా మారును. హస్తాకారంగా చీలికలున్న ఆకులు 5-10 అంగుళా లుండును. పూలు పచ్చనిరంగుతోకూడిన పసుపురంగులో ఉండును. పూలు గుత్తులుగా పూయును. ప్రపంచంలో 30 కిపైగా దేశాలు ఆముదపు పంటను సాగుచేస్తున్నవి.అందులోఆముదపుపంట వుత్పత్తిలో ఇండియా అగ్రస్దానంలో ఉంది. విత్తనంలనుండి నూనెను 'ఎక్సుపెల్లరు'లనబడునూనెతీయుయంత్రాలద్వారా తీయుదురు. ఆముదపునూనె లేతపసుపు రంగులో వుండును. ఒకరకమైన ప్రత్యేకమైన వాసన వుండి, 'ఆముదపువాసన' అనే జననానుడి వచ్చింది. ఆముదపు నూనె మిగిలిన శాక నూనెలకంటె ఎక్కువ సాంద్రత మరియు స్నిగ్థత కలిగి ఉన్న నూనె.
(ఇంకా…)
31వ వారం
ఫాస్పారిక్ ఆమ్లం
ఫాస్పారిక్ ఆమ్లం ఒక అకర్బన, ఖనిజ ఆమ్లం. దీనిని అర్థోఫాస్పారిక్ ఆమ్లం అనికూడా అంటారు. ఫాస్పారిక్ ఆమ్లం రసాయన ఫార్ములా H3PO4. ఫాస్పర్ (భాస్వర౦) హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ పరమాణువుల సంయోగం వలన ఈ ఆమ్లం ఏర్పడినది. అర్థోఫాస్పారిక్ ఆమ్లం అనుపేరు ఈ ఆమ్లం యొక్క శాస్త్ర నామం. అర్థో అను పూర్వపదం, ఈ ఆమ్లాన్ని మిగతా పాలిఫాస్పారిక్ ఆమ్లాలకన్నా వేరుగా గుర్తించుటకు పెట్టారు. అర్థోఫాస్పారిక్ ఆమ్లం విష గుణం లేని ఆమ్లం. సాధారణ గది ఉష్ణోగ్రత మరియు పీడనం వద్ద శుద్ధమైన ఫాస్పారిక్ ఆమ్లం ఘనస్థితిలో ఉండును. ఫాస్పారిక్ ఆమ్లం ఒక రసాయన పదార్థంగా ఉపయోగపడటం కాకుండా ఇతర పలు ఉపయోగాలు కల్గి ఉంది. దీనిని తుప్పు తొలగించుటకు/నిరోధించుటకు, ఆహారంలో ఆదరువుగా , ఎలక్ట్రోలైట్‌గా, ఎరువులలో, గృహశుద్ధీకరణ పదార్థాలలో అంశిభూతంగా ఉపయోగిస్తారు. జీవశాస్త్రలో కుడా ఫాస్పారిక్ ఆమ్లం మరియు ఫాస్పేట్‌లు సముచితస్థానం కల్గిఉన్నది. ఫాస్పారిక్ ఆమ్లం సాధారణంగా 85% గాఢత కల్గిన ద్రవరూపంలో లభిస్తుంది. సజల ద్రావణరూప ఫాస్పారిక్ ఆమ్లం రంగు మరియు వాసన లేని ఆమ్లం. 85% గాఢత కల్గిన ఆమ్లం చిక్కని తియ్యగా నుండు ద్రవం. ఫాస్పారిక్ ఆమ్లం బలమైన ఆమ్లం కావున వస్తువులను క్షయించు లక్షణం కల్గి ఉంది. ఇది కాస్మటిక్స్ మరియు చర్మసంరక్షక ఉత్పత్తులలో పి.హెచ్ ను తగిన స్థితిలో ఉంచు పదార్థంగా వాడెదరు.
(ఇంకా…)
32వ వారం

హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు

1945 లో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో, అమెరికా, జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై రెండు అణుబాంబు దాడులు చేసింది. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జరిగిన ఈ దాడుల్లో కనీసం 1,29,000 మంది మరణించారు. మానవ చరిత్రలో అణ్వాయుధ దాడులు జరిగినది ఈ రెండు సంఘటనల్లో మాత్రమే. ఈ దాడులు చేసే ముందు అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మద్దతు తీసుకుంది. యుద్ధం చివరి ఏడాదిలో మిత్రరాజ్యాలు జపానును ఆక్రమించుకునేందుకు సిద్ధపడ్డాయి. దీనికి ముందు అమెరికా సాంప్రదాయిక బాంబుదాడులు చేసి 67 జపాన్ నగరాలను ధ్వంసం చేసింది. 1945 మే 8 న, హిట్లరు ఆత్మహత్య చేసుకున్న కొద్దిరోజులకు, జర్మనీ లొంగుబాటు ఒప్పందంపై సంతకం చెయ్యడంతో ఐరోపాలో యుద్ధం ముగిసింది. ఓటమి తప్పని స్థితిలో ఉన్న జపాను బేషరతు లొంగుబాటుకు ఒప్పుకోకపోవడంతో పసిఫిక్ యుద్ధం కొనసాగింది. జపాను బేషరతుగా లొంగిపోవాలని 1945 జూలై 26 న మిత్ర రాజ్యాలు తమ పోట్స్‌డామ్ డిక్లరేషనులో ప్రకటించాయి. లేదంటే పెనువినాశనమేనని కూడా డిక్లరేషను హెచ్చరించింది. జపాను దాన్ని పెడచెవిని పెట్టింది. 1945 ఆగస్టు నాటికి మన్‌హట్టన్ ప్రాజెక్టు రెండు రకాల అణుబాంబులు తయారు చేసింది. మారియానా ద్వీపాల్లోని టినియన్ నుండి ఈ బాంబులను మోసుకెళ్ళేందుకు అమెరికా వైమానిక దళం బోయింగ్ B-29 సూపర్‌ఫోర్ట్రెస్‌ను సమకూర్చుకుంది.

(ఇంకా…)

33వ వారం

రేలంగి వెంకట్రామయ్య

రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకట్రామయ్య పద్మ శ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు. అతను తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ సమీపంలోని రావులపాడు అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి హరికథ, సంగీతం నేర్పించేవాడు. రేలంగి చిన్నతనం నుండి తన తండ్రి దగ్గర సంగీతం, హరికథలు నేర్చుకుంటూ పాటలు, పద్యాలు పాడడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అతని బాల్యమంతా ఎక్కువ భాగం రావులపాడు, కాకినాడల్లో గడిచింది. చదువుకునే వయసునుంచే నాటకాలు వేయడం ప్రారంభించాడు. రేలంగిని సినీ పరిశ్రమకు పరిచయం చేసింది దర్శకుడు సి.పుల్లయ్య. 1935లోనే సినిమాల్లోకి ప్రవేశించినా 1948 దాకా చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. ఈ సమయంలో పుల్లయ్య దగ్గర సినీ నిర్మాణానికి సంబంధించి పలు శాఖల్లో పని చేశాడు. 1948లో వచ్చిన వింధ్యరాణి సినిమాతో ఆయన కెరీర్ విజయాల బాట పట్టింది. తర్వాత వచ్చిన కీలుగుర్రం, గుణసుందరి కథ, పాతాళ భైరవి, పెద్ద మనుషులు, మాయాబజార్, మిస్సమ్మ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో ఆయన దాదాపు నాలుగు దశాబ్దాల పాటు 300కి పైగా చిత్రాల్లో నటించాడు. నటుడిగా తారా స్థాయినందుకున్న రేలంగి పలు సన్మానాలు, బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. 1970లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రధానం చేసింది. రేలంగి నటుడిగా తారా స్థాయికి చేరగానే ఆయనకు సన్మానాలు, బిరుదులు, కనకాభిషేకాలు, గజారోహణలు మొదలైనవెన్నో జరిగాయి.

(ఇంకా…)

34వ వారం
తిరువళ్ళూరు
తిరువళ్ళూరు తమిళనాడు రాష్ట్రంలోగల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది తిరువళ్ళూరు జిల్లాకు ప్రధాన పట్టణం. ఇక్కడ 108 వైష్ణవుల ప్రధాన దేవాలయాల్లో ఒకటైన వీర రాఘవుల స్వామి ఆలయం ఉంది. ఈయన శ్రీమహావిష్ణువు స్వరూపుడు. విగ్రహం ఆదిశేషుడిపై ఆయన శయనించినట్లుగా ఉంటుంది. వీర రాఘవ స్వామి మందుల తలకింద పెట్టుకున్నాడు కాబట్టి, ఆయన దర్శనం చేసుకుంటే వ్యాధులు నయమవుతాయని ప్రజల విశ్వాసం. ఇక్కడ గల కోనేరు దేశంలోని అతి పెద్ద కోనేర్లలో ఒకటి. 1830-31 సంవత్సరాల్లో తన కుటుంబం, సేవకులు, పరివారంతో కాశీయాత్ర చేసిన ఏనుగుల వీరాస్వామయ్య ఆ యాత్రను తెలుగులో ముద్రితమైన తొలి ట్రావెలాగ్ కాశీయాత్ర చరిత్రగా మలిచారు. ఆ ప్రయాణం ఈ గ్రామం మీదుగా సాగి, వారు ఇక్కడ విడిది చేయడంతో ఈ గ్రామంలో 1830 సమయంలో స్థితిగతులు ఎలా ఉండేవో ఆ గ్రంథంలో రికార్డు అయింది. ఏనుగుల వీరాస్వామయ్య ఆ గ్రంథంలో వ్రాస్తూ: తిరువళ్ళూరు విష్ణుస్థలము. హృత్తాపనాశిని అనే తీర్థమున్నది. అందులో ప్రార్థనలవారు (భక్తులు) బెల్లము వేయిచున్నారు. ఆ తీర్థస్నానము స్మృతులయందు మహాప్రాయశ్చిత్తములలో ముఖ్యముగా జెప్పబడియున్నది. అది పేట స్థలము. అన్ని వస్తువులు దొరకును అన్నారు.
(ఇంకా…)
35వ వారం

అమృతా ప్రీతం

అమృతా ప్రీతం  (1919 ఆగస్టు 31 - 2005 అక్టోబరు 31) భారతదేశపు రచయిత్రి. ఆమె పంజాబీ, హిందీ భాషలలో రచనలు చేసింది.ఆమె పంజాబీ భాషలో మొట్టమొదటి కవయిత్రి, నవలా రచయిత్రి, వ్యాసకర్త. 20వ శతాబ్దంలో ప్రముఖ కవయిత్రిగా కొనియాడబడింది. ఆమె భారత-పాకిస్తాన్ సరిహద్దుకు రెండు వైపులనూ సమానంగా ప్రేమించిన వ్యక్తి. ఆరు దశాబ్దాల జీవితంలో ఆమె సుమారు 100 పుస్తకాలను రచించింది. వాటిలో కవిత్వం, కల్పనా కథలు, జీవిత చరిత్రలు, వ్యాసాలు, పంజాబీ జానపద పాటల సేకరణ, స్వీయ చరిత్ర ఉన్నాయి. అవి ఇతర భారతీయ భాషలు, విదేశీయ భాషలలోనికి అనువదించబడ్డాయి. ఆమె రాసిన పదునైన కవిత "ఆజ్ ఆఖాన్ వారిస్ షా ను" 18వ శతాబ్దానికి చెందిన కవి, వారిస్ షా స్మృతిగా రాసిన విషాద గీతం. ఇందులో ఆమె భారత్ విభజనసమయంలో జరిగిన ఊచకోతపై వేదనను వ్యక్తీకరించింది. ఒక నవలా రచయిత్రిగా ఆమె గుర్తింపబడిన నవల "పింజర్" (బోను) (1950). దీనిలో ఆమె తన చిరస్మరణీయ పాత్ర "ప్యూరో"ను సృష్టించింది. ఈ పాత్ర ద్వారా మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింస, మానవత్వానికి నష్టం కలిగించిన అంశాలను గూర్చి సంగ్రహంగా తెలియజేసింది. ఈ నవల 2003 లో "పింజర్" చలన చిత్రంగా రూపొందించబడి పురస్కారాన్ని గెలుచుకుంది. (ఇంకా…)

36వ వారం

జమలాపురం కేశవరావు

సర్దార్ జమలాపురం కేశవరావు (సెప్టెంబరు 3, 1908 - మార్చి 29, 1953), నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. హైదరాబాదు రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు . ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ తొలి అధ్యక్షుడు. ప్రజల మనిషిగా, ప్రజల కోసం జీవిస్తూ, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ఆయన ప్రవృత్తిగా జీవించాడు. అందుకే ఆయన్ను అందరూ తెలంగాణ ‘సర్దార్’ గా పిలుచుకుంటారు. దక్కన్‌ సర్దార్‌గా, ఉక్కు మనిషిగా ప్రజలు పిలుచుకునే కేశవరావు నిజాం సంస్థానంలో తూర్పు భాగాన ఉన్న ఖమ్మం (నాటి వరంగల్ జిల్లా)లోని ఎర్రుపాలెంలో 1908 సెప్టెంబర్ 3 న జమలాపురం వెంకటరామారావు, వెంకటనరసమ్మలకు తొలి సంతానంగా జన్మించాడు. సంపన్న జమీందారీ వంశంలో పుట్టినా, నాటి దేశ రాజకీయాలు అతనిని ఎంతగానో కలవరపరచాయి. ఎర్రుపాలెం లో ప్రాథమిక విద్య అనంతరం, హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించాడు. వందేమాతరం గీతాలాపనను నిషేధించినందుకు నిరసనగా, కళాశాల విద్యార్థులను కూడగట్టి, నిరసనోద్యమంలోకి దిగారు. గీతాన్ని ఆలాపించనివ్వకపోతే తరగతులకు హాజరుకాబోమని హెచ్చరించారు. దీంతో చివరకు నిజాం పాలకవర్గం నిషేధాన్ని ఎత్తివేయక తప్పలేదు. ఈఘటన తర్వాత కేశవరావు ఆలోచనా పరిధిని మరింత విస్తృతం చేసి ఆయన వెళ్లాల్సిన మార్గాన్ని మరింత స్పష్టం చేసింది.

(ఇంకా…)

37వ వారం
మోక్షగుండం విశ్వేశ్వరయ్య
మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశపు ప్రముఖ ఇంజనీరు, పండితుడు, రాజనీతిజ్ఞుడు. మైసూరు సంస్థానానికి 1912 నుండి 1918 దివానుగా పనిచేశాడు. 1955 లో ఆయనకు భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న లభించింది. ఆయన ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఐదవ కింగ్ జార్జి నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ బిరుదునిచ్చి సత్కరించాడు. భారతదేశంలో ఆయన జన్మదినమైన సెప్టెంబరు 15 ను ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. మైసూరులో గల ప్రముఖ ఆనకట్ట కృష్ణరాజ సాగర్ కు ఆయన ఛీఫ్ ఇంజనీరుగా పనిచేశాడు. హైదరాబాదును మూసీ నది వరదల నుంచి రక్షించడానికి పథకాలను రూపొందించాడు. విశ్వేశ్వరయ్య 1861, సెప్టెంబరు 15న బెంగుళూరు నగరానికి 60 మైళ్ళ దూరంలోగల చిక్కబళ్ళాపూర్ తాలూకా, ముద్దెనహళ్ళి అనే గ్రామంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి, వెంకటలక్ష్మమ్మ. వీరి పూర్వీకులు ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మోక్షగుండం గ్రామానికి చెందిన వారు. మూడు శతాబ్దాల కిందట వారు మైసూరు రాష్ట్రానికి వలస వెళ్ళారు. కాబట్టి వీరు తెలుగు మాట్లాడగలిగే వారు.
(ఇంకా…)
38వ వారం
స్లమ్‌డాగ్ మిలియనీర్
స్లమ్‌డాగ్ మిలియనీర్ 2008లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక ఆంగ్ల చిత్రము. ముంబై మురికి వాడల్లో చిన్నారుల జీవనం, వారిలో నిగూఢమైన ప్రతిభను అత్యంత హృద్యంగా తెరపై ఆవిష్కరించిన సినిమా ఇది. ఇలా పెరిగిన ఒక బాలుడు పెద్దవాడైన తర్వాత కౌన్ బనేగా కరోడ్ పతి అనే కార్యక్రమంలో పాల్గొని రెండు కోట్ల రూపాయలు ఎలా గెల్చుకొన్నాడన్నది ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాకు సైమన్ బీఫాయ్ స్క్రీన్ ప్లే రాసినా, డానీ దర్శకత్వం వహించినా, చిత్రానికి ఆధారం మాత్రం బ్రిటన్ లో మాజీ భారతీయ దౌత్య ప్రతినిథి వికాస్ స్వరూప్ రాసిన క్యూ అండ్ ఏ అనే నవల. కథ విషయానికొస్తే ముంబై లోని ధారవి అనే మురికివాడ నేపథ్యంలో మొదలౌతుంది. సినిమా ప్రారంభంలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ (ఇర్ఫాన్ ఖాన్) వీధిబాలుడిగా పెరిగిన జమాల్ మాలిక్ (దేవ్ పటేల్) ను హింసకు గురి చేస్తూ విచారిస్తుంటాడు. జమాల్, ప్రేమ్ కుమార్ (అనిల్ కపూర్) చే నిర్వహించబడే కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో ఒక పోటీదారు. జమాల్ ఈ పోటీలో చివరి ప్రశ్న దాకా వస్తాడు. కానీ అప్పుడే పోలీసులు వచ్చి అతన్ని మోసం కేసులో విచారణకోసం తీసుకుని వెళ్తారు.
(ఇంకా…)
39వ వారం
సెర్బియా
సెర్బియా అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ సెర్బియా.ఇది మధ్య, ఆగ్నేయ యూరప్ లో ఉన్న సదరన్ పనానియన్ మైదానం బాల్కన్ ద్వీపకల్పంలో ఉంది. ఈ దేశానికి బెల్ గ్రేడ్ రాజధానిగా ఉంది. దేశానికి ఉత్తర సరిహద్దులో హంగరీ, తూర్పు సరిహద్దులో రొమేనియా మరియు బల్గేరియా దక్షిణ సరిహద్దులో మేసిడోనియా, క్రొయేషియా, బోస్నియా, మాంటెనెగ్రో మరియు పశ్చిమసరిహద్దులో కొసావో మరియు అల్బేనియాకు చెందిన వివాదాస్పద భూభాగం ఉంది. సెర్బియాలో సుమారుగా 7 మిలియన్ల మంది పౌరులు నివసిస్తున్నారు. దీని రాజధాని బెల్‌గ్రేడ్ పురాతనమైన, ఆగ్నేయ ఐరోపాలో అతిపెద్ద నగరాల్లో ఒకటిగా ఉంది. 6 వ శతాబ్దానికి చెందిన బాల్కంన్స్‌కు స్లావిక్ వలసల తరువాత మధ్య యుగప్రారంభంలో సెర్బ్స్ అనేక రాజ్యాలను స్థాపించారు. సెర్బియా కింగ్డమ్ 1217 లో రోమ్ మరియు బైజాంటైన్ సామ్రాజ్యాల గుర్తింపు పొందింది. ఇది 1346 లో స్వల్ప-కాలిక సెర్బియన్ సామ్రాజ్యంగా ఉంది. 16 వ శతాబ్దం మధ్యకాలం నాటికి మొత్తం ఆధునిక సెర్బియా ఒట్టోమన్లచే విలీనం చేయబడింది. కొన్నిసార్లు హబ్స్బర్గ్ సామ్రాజ్యం అంతరాయం కలిగించింది.
(ఇంకా…)
40వ వారం
లె కార్బుజియె
లె కార్బూజియె గా ప్రసిద్ధి చెందిన ఛార్లెస్ ఎడ్వర్డ్ జెనరెట్ స్విట్జర్లాండ్‌లో జన్మించిన ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్, డిజైనర్, అర్బన్ ప్లానర్, పెయింటర్, రచయిత. ఇతడు స్విట్జర్లాండ్‌లో జన్మించి 1930లో ఫ్రెంచి పౌరసత్వం స్వీకరించాడు. ఇతడు 5 దశాబ్దాలపాటు యూరప్, జపాన్, అమెరికా మరియు భారత దేశాలలో పలు భవంతులకు డిజైన్ చేశాడు. జనసమ్మర్దమైన నగరాలలో ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరచడానికి ఇతడు అర్బన్ ప్లానింగ్ రంగంలో అంకిత దృష్టితో పనిచేశాడు. ఇతడు ఇంటర్నేషనల్ మాడ్రన్ ఆర్కిటెక్చర్ కాంగ్రెస్ లో వ్యవస్థాపక సభ్యుడు. ఇతడు చండీగఢ్ నగరం మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ నగరంలోని పలు భవంతులకు ఇతడు డిజైన్ చేశాడు. 2016, జూలై 17న యునెస్కో ప్రకటించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో 17 ఇతడు చేపట్టిన ప్రాజెక్టులు కావడం మాడ్రన్ ఆర్కిటెక్చర్‌లో ఇతని కృషికి ఒక తార్కాణంగా పేర్కొనవచ్చు. ఇతడు తన 15వ యేట విజువల్ ఆర్ట్స్ పట్ల ఆకర్షితుడైనాడు. ఇతడు లా షాక్స్ డి ఫాండ్స్ గ్రామంలోని మునిసిపల్ ఆర్ట్ స్కూలులో చేరి గడియారాల తయారీకి సంబంధించిన అప్లైడ్ ఆర్ట్ నేర్చుకున్నాడు. మూడు సంవత్సరాల పిమ్మట ఛార్లెస్ అనే పెయింటర్ వద్ద అలంకరణలో ఉన్నత శిక్షణను తీసుకున్నాడు.
(ఇంకా…)
41వ వారం
Mv Raghu nandi award frm NTR.jpg

ఎం. వి. రఘు

మాడపాక వెంకట రఘు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పేరు గాంచిన అవార్డులు, రివార్డులు పొందిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు. ఇతను వివిధ భాషలలో యాభైకి  పైగా సినిమాలకు, 10 డాక్యుమెంటరీలకు ఛాయగ్రాహణం నిర్వర్తించాడు. రెండు సినిమాలకి దర్శకత్వం వహించాడు. ఛాయగ్రాహకునిగా మరియు దర్శకునిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డులతో పాటు వివిధ సాంస్కృతిక సంస్థల నుండి యాభైకి పైగా అవార్డులు పొందిన లబ్దప్రతిష్ఠుడు. అతను1954 అక్టోబరు 5న పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఎం. ఎస్. చిన్నయ్య, నాగేశ్వరమ్మ దంపతులకు జన్మించాడు. అతని రైల్వే ఉద్యోగి, తల్లి గృహిణి. చిన్నయ్యకు ఫోటోగ్రఫిలో చాలా ఆసక్తి ఉండేది. తన 620 కొడాక్ బాక్స్ కెమెరాతో తరచూ ఫోటోలు తీసి స్వంతంగా డెవలప్ చేసేవాడు. వాళ్ళ ఇంట్లోనే ఒక డార్క్ రూమ్ ఉండేది. రఘుకు బాల్యం నుండే ఫోటో రీళ్ళను కడగటం వంటి పనులు బాగా అలవడ్డాయి. చిన్నయ్యకు సినిమారంగంలో అడుగుపెట్టాలని ఆశ ఉన్నా, అప్పటి పరిస్థితులు అనుకూలించక ఆ కల సాకారం కాలేదు. ఫోటోగ్రఫిలో తండ్రి అనేక అవార్డులను గెలుచుకోవటం, తనయుడైన రఘుకు పెద్దయిన తర్వాత కెమెరామెన్ కావలనే స్ఫూర్తిని కలుగజేసింది. దానికి ఆయన కుటుంబము మంచి ప్రోత్సాహాన్నిచ్చింది. తొమ్మిదేళ్ల వయసులో తండ్రికి గుంటూరు బదిలీ అవడంతో కుటుంబముతో సహా గుంటూరు వచ్చాడు. అక్కడున్న ఆ తర్వాత పదేళ్ళు రఘు, తండ్రితో పాటు గుంటూరులోని లీలామహల్ థియేటర్లో విడుదలైన ఇంగ్లీషు సినిమాలన్నీ చూసేవాడు.

(ఇంకా…)

42వ వారం
ఉత్తర సర్కారుల్లో ఐరోపా వారి యుద్ధాలు
ఉత్తర సర్కారులపై ఆధిపత్యం కోసం ఐరోపా దేశాలైన బ్రిటిషు, ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీసు దేశీయులు తమలోతాము, స్థానిక నాయకులతోనూ అనేక యుద్ధాలు చేసారు. ఈ యుద్ధాల కారణంగా ఆ ప్రాంతాలపై ఆధిపత్యం మారుతూ వచ్చింది. పర్యవసానాల పరంగా గాని, యుద్ధ ఫలితాల కారణంగా గానీ వీటిలో ప్రధానమైనవి -బొబ్బిలి యుద్ధం, చెందుర్తి యుద్ధం, మచిలీపట్నం ముట్టడి. 1758 జూలై నాటికి ఉత్తర సర్కారుల్లో ఫ్రెంచి వారి ప్రాబల్యం బలంగా ఉంది. డి బుస్సీ తిరుగులేని నాయకుడిగా ఫ్రెంచి వారి ప్రాబల్యాన్ని ఆ ప్రాంతంలో నెలకొల్పాడు. హైదరాబాదు నిజాముతో వారికి మైత్రి ఉంది. బొబ్బిలి యుద్ధం పర్యవసానంగా బొబ్బిలి సంస్థానం నేలమట్టమైంది. విజయనగర రాజు, బుస్సీకి అనుంగు అనుచరుడూ అయిన విజయరామరాజు ఈ యుద్ధాంతాన హతుడయ్యాడు. అతడి స్థానంలో వరుసకు అతడి సోదరుడు ఆనందరాజు రాజయ్యాడు. విజయరామరాజు మరణించాక, వారసత్వం విషయంలో బుస్సీ చేసిన ఏర్పాటు పట్ల అతడు ఆగ్రహంగా ఉన్నాడు. ఈ లోగా బుస్సీ, నిజాము కోరిక మీద అతడికి సాయం చేసేందుకు ఔరంగాబాదు వెళ్ళాడు. ఆ సమయంలో, ఆనందరాజు విశాఖపట్నాన్ని (తెల్లవారు విజాగపటం అనేవారు) ఆక్రమించుకుని అక్కడ ఉన్న ఫ్రెంచి సేనానిని బందీగా పట్టుకున్నాడు.
(ఇంకా…)
43వ వారం

కిత్తూరు చెన్నమ్మ

కిత్తూరు చెన్నమ్మ బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీ పాలనాకాలంలో, కన్నడ దేశానికి చెందిన కిత్తూరు అనే చిన్నరాజ్యానికి రాణి. మధ్యప్రదేశ్ లోని ఝాన్సికి చెందిన లక్ష్మీబాయి కన్న 56 సంవత్సరముల ముందే పుట్టి, తన రాజ్య స్వాతంత్ర్యానికై బ్రిటిషు కంపెనీతో పోరాటం చేసిన మొదటి భారతీయ వీరవనిత. కిత్తూరు అనేది బెల్గాము రాజ్యానికి సమీపమున ఉన్న చిన్నరాజ్యం. ఆమె బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా తన గళమెత్తి, వారి అఘాయిత్యాలను నిరసిస్తూ 1824లో బ్రిటిషువారి అపారసైన్యానికి బెదరక, మొక్కవోని ధైర్యంతో పోరుసల్పినది. కాని మొదట విజయం అమె వైపే ఉన్ననూ, చివరకు బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనికి బందీగా చిక్కి, చెరసాలలోనే కన్ను మూసింది. కన్నడదేశానికి చెందిన నాటి వీరవనితలైన అబ్బక్కరాణి, కెలారి చెన్నమ్మ మరియు ఒనక ఒబవ్వ చిత్రదుర్గల సరసన అగ్రస్థానములో పేరెక్కిన సాహసి కిత్తూరు చెన్నమ్మ. చెన్నమ్మకు కిత్తూరు పాలకుడయిన దేశాయిరాజ కుటుంబీకుడైన మల్ల సర్జన తో వివాహం జరిగింది. ఆమె కిత్తూరు రాజ్య రాణి అయ్యింది. ఆమె మల్ల సర్జనకు రెండవ భార్య, రెండో రాణి. వారికి ఒక కుమారుడు జన్మించాడు కానీ అనారోగ్యంతో మరణించాడు. అప్పుడు చెన్నమ్మ శివలింగరుద్రప్ప అనే బాలుకుడిని కుమారునిగా దత్తత తీసుకున్నది. అతనిని తన వారసునికిగా ప్రకటించింది. కిత్తూరు రాజ్యచరిత్ర 1586 నుండి ప్రారంభమైనది. మలెనాడుకు చెందిన మల్ల అనే పేరున్న అన్నదమ్ములు బిజాపుర సంస్థానము పాలకుడు ఆదిలశాహి సైన్యములో పనిచేసేవారు.

(ఇంకా…)

44వ వారం
శాన్ అంటోనియో
అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని టెక్సస్ రాష్ట్రంలోని పెద్ద నగరాలలో శాన్ అంటోనియో ఒకటి. 1.3 మిలియన్ల ప్రజలు కలిగిన శాన్ అంటోనియో నగరం జనసాంద్రతలో సంయుక్త రాష్ట్రాలలో 7వ స్థానంలోనూ అలాగే టెక్సస్ రాష్ట్రంలో 2వ స్థానంలోనూ ఉంది. ఈ నగరం 2000-2010 మధ్యకాలంలో సంయుక్త రాష్ట్రాలలో శీఘ్రగతిలో అభివృద్ధి చెందిన 10 పెద్ద నగరాలలో మొదటిది, 1990-2000 మధ్య కాలంలో రెండవది. ఈ నగరం నైరుతి అమెరికాలో ఉపస్థితమై ఉంది. అలాగే టెక్సస్ దక్షిణ మధ్య భాగంలో మరియు టెక్సస్ త్రికోణ ప్రదేశంలో నైరుతి శివార్లలో ఉంది. మే 1, 2018 న తన 300 వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న రాష్ట్రంలోని పురాతన మునిసిపాలిటీ ఇది. శాన్ అంటోనియో బెస్టర్ కౌంటీ స్థానంగా సేవలు అందిస్తుంది. మిగిలిన జనసాంద్రత కలిగిన పశ్చిమ నగరాలలోలాగ పట్టణంలో అక్కడక్కడా జనసాంద్రత కలిగి శివారు ప్రాంతంలో తక్కువ జనసాంద్రత కలిగి ఉంటుంది. నగరం శాన్ అంటోనియో-న్యూ బ్రౌన్‍ ఫెల్ మహానగర ఆకర్షణీయమైన పురపాలకం. అలాగే ఈ నగర అతిపెద్ద శివారు ప్రాంత ప్రధాన నగరం న్యూ బ్రౌన్‍ ఫెల్. 2011 యు.ఎస్ గణాంకాలను అనుసరించి శాన్ అంటోనియో మహానగర జనసంఖ్య 2.2 మిలియన్లు.
(ఇంకా…)
45వ వారం
దీర్ఘ కృపాణ రాత్రి
దీర్ఘ కృపాణ రాత్రి 1934 జూన్ 30, జూలై 2 ల మధ్య నాజీ జర్మనీలో హిట్లర్ జరిపిన ఏరివేత కార్యక్రమం. దీనినే రోహ్మ్ ఏరివేత అని, ఆపరేషన్  హమ్మింగ్‌బర్డ్ (జర్మన్ భాషలో అంటర్‌నెహ్మెన్ కోలిబ్రి) అనీ కూడా అంటారు. తన అధికారాన్ని సుస్థిర పరచుకునేందుకు గాను చట్టానికి అతీతంగా హిట్లర్ జరిపిన మారణ హోమమే ఈ ఆపరేషన్. నాజీలకు చెందిన పారామిలిటరీ సంస్థ స్టర్మాబ్టీలంగ్ (ఎస్.ఏ), దాని నేత ఎర్నెస్ట్ రోహ్మ్ ల నుండి జర్మను సైనిక బలగాలకు ముప్పుందని భావించి, హిట్లర్ ఈ అపరేషన్ జరిపాడు. నాజీ ప్రచార యంత్రాంగం, రోహ్మ్ తలపెట్టిన కుట్రను ఛేదించేందుకే చెయ్యాల్సి వచ్చిన హత్యలుగా ఈ ఆపరేషన్ను చూపింది. హిట్లర్ జరిపిన ఈ ఆపరేషన్‌లో ప్రధాన పాత్ర వహించింది, షుట్జ్‌స్టాఫెల్ (ఎస్.ఎస్), గెస్టాపో అని పిలిచే రహస్య పోలీసు సంస్థలు. ఎస్.ఎస్‌కు సారథి హిమ్లర్. ఈ ఏరివేతలో చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది ఎస్.ఏ కు చెందిన నేతలు. వీరిలో పేరు పొందినవాడు ఎస్.ఏ అధినేత, హిట్లరుకు అనుయాయీ అయిన రోహ్మ్. నాజీ పార్టీలోని స్ట్రాసెరిస్ట్ వర్గపు నాయకుడు గ్రెగోర్ స్ట్రాసర్‌తో సహా ఆ వర్గంలోని ముఖ్య నేతలను కూడా చంపేసారు.
(ఇంకా…)
46వ వారం
బీర్బల్ సహాని
బీర్బల్ సహాని పురా వృక్ష శాస్త్రవేత్త. అతను భారత దేశానికి లభించిన అరుదైన శాస్త్రవేత్త. ఖగోళ, జ్యోతిష, గణిత, వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాలలో మనకు ఎందరెందరో మహనీయులైన శాస్త్రవేత్తలున్నారు. ఈ శాస్త్రాలకు భిన్నమైన పక్షి శాస్త్రంలో విశేష ప్రతిభ కనబరచి గుర్తింపు పొందినవారు సలీంఆలీ అయితే పురా వృక్ష శాస్త్ర పరిశోధనలలో శాస్త్రీయ విజ్ఞాన పరిశోధనలను కొత్తపుంతలు తొక్కించింది మాత్రం బీర్బల్ సహానీ. అతను భారతీయ ఉపఖండంలోని శిలాజాలను అధ్యయనం చేసిన భారతీయ పాలియోబొటానిస్ట్. అతను భూగర్భ శాస్త్రం మరియు పురావస్తు శాస్త్రంలో కూడా ఆసక్తి చూపించాడు. అతను 1946 లో లక్నోలో బీర్బల్ సహానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలియోబోటనీని స్థాపించాడు. భారతదేశపు శిలాజ మొక్కల అధ్యయనంలో, మొక్కల పరిణామంలో అతని ప్రధాన రచనలు ఉన్నాయి. అతను భారతీయ విజ్ఞాన విద్య స్థాపనలో కూడా పాల్గొన్నాడు. భారతదేశంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడిగా మరియు స్టాక్‌హోమ్‌ అంతర్జాతీయ బొటానికల్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షుడిగా పనిచేశాడు.
(ఇంకా…)
47వ వారం
దోసె
దోశ భారతీయులకు ఇష్టమైన అల్పాహారం. దోశ పుట్టుపూర్వోత్తరాలు అంతగా తెలియదు. ఎప్పటి నుండి ఇవి వాడుకలో ఉన్నాయో కచ్చితమైన ఆధారలు లేవు. దోశ భారతీయులకు అందరికీ పరిచయమైన అహారమే అయినా దక్షిణ భారతీయులకు మాత్రం ఇది అత్యంత ఇష్టమైన అల్పాహారం. దీనిని దోశ, దోసె, దోసై, అట్టు అని కూడా ప్రాంతాల వారిగా అంటూ ఉంటారు. అంతేకాదు అట్లకోసం ఒక పండుగ కూడా ఉంది. అదే అట్ల తద్ది. అట్ల కొరకు నోములు కూడా చేస్తారు. కన్నెపిల్లలు మంచి భర్త రావాలని కోరుతూ ఈ నోము చేస్తారు. వివాహము అయిన తరువాత ఈ నోము తప్పక తీర్చుకోవడం కొంత మందిలో ఆనవాయితీగా వస్తుంది. స్త్రీలు అట్లతద్ది నాడు శుచిగా 11 అట్లు పోసి వాటి మధ్య పప్పు, బెల్లం మరియు నెయ్యి ఉంచి ఇంటి సింహద్వారం పూజించి అట్లను నైవేద్యంగా ఉంచి నమస్కరిస్తారు. దీనిని ఎక్కువగా తెలుగు వారు ఆచరిస్తారు. నోము నోచుకున్న వారు అట్లు పోసి ఒక్కొక్కరికి 11 అట్లను పప్పు, బెల్లం, నెయ్యి చేర్చి ముత్తైదువలకు వాయనం ఇస్తారు. ఇలా అట్లకు సంప్రదాయంలో కూడా చోటు ఉంది. పాత కాలంలో స్త్రీలు ఉద్యోగాలు చేయరు కనుక ఆర్థికంగా జరుగుబాటు తగ్గిన సమయంలో ఇంట్లో అట్లు తయారు చేసి అమ్మడం ద్వారా జీవనం సాగిస్తుంటారు. ఇవి కూడా తెలుగు నాట ప్రసిద్దం.
(ఇంకా…)
48వ వారం
మహారాజా నందకుమార్
బెంగాల్ కు చెందిన మహారాజా నందకుమార్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో బర్ద్వాన్, నదియా, హుగ్లీ జిల్లాలకు పన్ను వసూళ్ళ అధికారి. సమకాలీన పత్రాలలో "నున్ కొమార్" గా వ్యవహరించబడ్డాడు. నాటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన వారన్ హేస్టింగ్స్ యొక్క క్రౌర్యానికి బలియైన వారిలో నందకుమార్ ప్రముఖుడు. వారన్ హేస్టింగ్స్ చేసిన అవినీతి గురించి సాక్షాధారాలతో బెంగాల్ సుప్రీమ్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేసిన అనంతరం ఒక కల్పిత ఫోర్జరీ చేసిన కేసులో ఇరికించబడ్డాడు. విలియం ఫోర్ట్ లోని సుప్రీమ్ కోర్ట్ లో విచారించబడి 1775 ఆగస్టు 5 న కలకత్తాలో బహిరంగంగా ఉరి తీయబడ్డాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో ఒక బ్రిటిష్ కోర్ట్ తీర్పు ద్వారా ఉరితీయబడ్డ తొలి వ్యక్తి మహారాజా నందకుమార్. మహారాజా నందకుమార్ పై జరిగిన నేర విచారణ కేసును "న్యాయాన్ని అవహేళన చేసిన కేసు" గా చరిత్రకారులు పరిగణిస్తారు. ఇతని ఉరితీతను బ్రిటిష్ ఇండియాలో జరిగిన "తొలి న్యాయ హత్య" గా ఎడ్మండ్ బర్కీ, లార్డ్ మెకాలే లాంటి బ్రిటిష్ ప్రముఖులు పేర్కొన్నారు. మహారాజ నందకుమార్ పై జరిగిన నేర విచారణ – విధించిన మరణదండన తీవ్ర విమర్శకు గురై బ్రిటిష్ పార్లమెంటును కుదిపింది.
(ఇంకా…)
49వ వారం
నిక్ వుజిసిక్
నికోలస్ జేమ్స్ వుజిసిక్ ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రేరణ కలిగించే వక్త, క్రైస్తవ మత ప్రచారకుడు. ఇతను ఫొకొమీలియా అనే రుగ్మత కారణంగా కాళ్ళు, చేతులు లేకుండానే పుట్టాడు. వారి కుటుంబం యుగోస్లేవియా నుండి సెర్బియన్ వలసదారులు. అతను రెండు కాళ్ళు, చేతులు లేకుండా టెట్రా అమీలియా అనే అరుదైన వ్యాధితో జన్మించాడు. అతని జీవిత చరిత్ర ప్రకారం అతను అరుదైన వ్యాధితో జన్మించినందున అతని తల్లి ఆ స్థితిలో అతనిని తీసుకోవడానికి, ఎత్తుకోవడానికి నిరాకరించింది. తరువాత అతని తల్లిదండ్రులు పరిస్థితులను అర్థం చేసుకొని అతనిని తీసుకోవడానికి అంగీకరించారు. ఆ పరిస్థితిని "వారి కొడుకు కోసం దేవుని ప్రణాళిక" గా వారు అర్థం చేసుకొన్నారు. ఇతను కాళ్ళు, చేతులు లేకపోయినా తండ్రి సాయంతో ఐదేళ్ల వయసులోనే ఈత నేర్చుకున్నాడు, అంతేకాకుండా సముద్రంపై సర్ఫింగ్ చేయడం నేర్చుకున్నాడు. బాల్యంలో తన తల్లి చేతుల్లో మామూలు పిల్లవాడిలాగేనే పెరిగిన తను సమాజంలో మామూలు వ్యక్తిగా ఎదగడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. నోటిలో పెన్ను పెట్టుకొని రాయడం నేర్చుకున్నాడు. గొంతు కింద గోల్ఫ్‌స్టిక్ పెట్టుకుని బంతిని కొట్టడం నేర్చుకున్నాడు. 2005లో "లైఫ్ వితౌట్ లింబ్స్‌" అనే లాభాపేక్షలేని అంతర్జాతీయ సంస్థను ప్రారంభించాడు. 2007లో "ఆటిట్యూడ్ ఈజ్ ఆటిట్యూడ్" అనే ప్రేరణనందించే ప్రసంగాలనిచ్చే కంపెనీని స్థాపించాడు.
(ఇంకా…)
50వ వారం

విప్రనారాయణ

విప్రనారాయణ 1954 డిసెంబరు 10వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. దీనిని భానుమతి మరియు రామకృష్ణారావులు భరణీ పిక్చర్స్ పతాకం క్రింద నిర్మించారు. ఈ సినిమాకు కీలకమైన మాటలు మరియు పాటలను సముద్రాల రాఘవాచార్య సమకూర్చారు. ఈ పూర్తి సంగీతభరితమైన చిత్రంలోని పాటల్ని ఎ.ఎమ్.రాజా మరియు భానుమతి గానం చేయగా సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్ని కూర్చారు. ఇది పండ్రెండుమంది ఆళ్వారులలో ఒకడైన తొండరడిప్పొడి ఆళ్వారు జీవితచరిత్ర. ఇతడు విప్రనారాయణ అనే పేరుతో ప్రసిద్ధుడు. ఇతని చరిత్రను సారంగు తమ్మయ్యవైజయంతీ విలాసము అనే పేరుతో కావ్యంగా రచించాడు. ఈ కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను నిర్మించారు. విప్రనారాయణ (అక్కినేని నాగేశ్వరరావు) శ్రీరంగని భక్తుడు. పరమ నిష్టాగరిష్టుడైన పూజారి. రంగనాథున్ని పూలదండలతో అలంకరించి, పూజించి తరించాలనే భక్తాగ్రగణ్యుడు. నర్తకి దేవదేవి (భానుమతీ రామకృష్ణ) అందించిన నమస్కారాన్ని అన్యమనస్కుడైన విప్రనారాయణుడు గమనించడు. దానితో ఆమెలోని అహంకారం పడగ విప్పి ఎలాగైనా అతడిని తన పాదదాసున్ని చేసుకొంటానని అక్క (సంధ్య) తో పందెం వేస్తుంది. భక్తినెపంతో ఏకాకినని చెప్పి విప్రనారాయణుని ఆశ్రయం సంపాదిస్తుంది. అందుకు విప్రనారాయణుని ప్రియ సచివుడు రంగరాజు (రేలంగి) అడ్డు తగిలినా లాభం లేకపోతుంది.

(ఇంకా…)

51వ వారం

మేడపాటి వెంకటరెడ్డి

మేడపాటి వెంకటరెడ్డి యోగవిద్య లో నిష్ణాతులు. సికింద్రాబాదులోని ప్రభుత్వ వేమన యోగ పరిశోధనా సంస్థకు డైరెక్టర్‌గా, ఆరోగ్య వైద్యశాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ యోగాధ్యయన పరిషత్తుకు కార్యదర్శిగా పనిచేసారు. ఆంధ్రప్రదేశ్ గవర్నరు గారికి యోగచికిత్సా నిపుణుడిగా సేవలను అందిస్తున్నారు. మేడపాటి వెంకట రెడ్డి తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం సమీపంలోని అర్తమూరు గ్రామంలో 18 డిసెంబరు 1947న జన్మించారు. ఈ గ్రామం వైష్ణవ మత ప్రభోధకుడు పరమహంస పరివ్రాజకులు అయిన త్రిదండి చిన్ నజీయర్ స్వామి జన్మించిన ఊరు. ఇతడు రాజకీయ నేపధ్యంలో కూడిన మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో మేడపాటి సుబ్బిరెడ్డి, వీరయమ్మ దంపతులకు గల ముగ్గురు మగ పిల్లలలో ఆఖరి సంతానంగా జన్మించారు. 5వ తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనూ, ఎస్.ఎస్.ఎల్.సి వరకు మండపేటలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు. రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో బి.ఎ పట్టాను, విశాఖపట్నం నందలి ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో ఎం.ఎ (అంతర్జాతీయ న్యాయశాస్త్రం) పట్టాను పొందారు. రాజమండ్రిలో ఉండగా హిందీ వ్యతిరేక ఉద్యమంలోనూ మరియు ఉక్కు ఉద్యమంలో చురుగ్గా పాల్గొని రాష్ట్రంలో విద్యార్థి నాయకునిగా గుర్తింపు పొందారు. అతను పురాతత్వ, శాసన, సాహిత్య, సంప్రదాయాలను సమన్వయ పర్చి తరతరాల ఆంధ్రుల ఇంటిపేర్లను క్రీస్తు పూర్వం నుండి నేటి వరకు చరిత్రను జాతికి కానుకగా అందిచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

(ఇంకా…)

52వ వారం

చరణ్ సింగ్

చౌదరి చరణ్ సింగ్ (1902 డిసెంబరు 23 - 1987 మే 29) భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు తన సేవలనందించాడు. చరిత్రకారులు, ప్రజలు తరచూ అతనిని 'భారతదేశపు రైతుల విజేత' గా గుర్తించారు. చరణ్ సింగ్ 1902లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రము, మీరట్ జిల్లాలోని నూర్‌పూర్ గ్రామంలోని జాట్ కులంలో జన్మించాడు. అతను మహాత్మా గాంధీ అద్వర్యంలో జరిగిన భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. అతను గజియాబాద్ జిల్లాలోని ఆర్యసమాజ్, అదే విధంగా మీరట్ జిల్లాలోని భారత జాతీయ కాంగ్రెస్ లలో 1931 నుండి క్రియాశీలకంగా ఉన్నాడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో రెండు సార్లు జైలు పాలయ్యాడు. భారత స్వాతంత్ర్యానికి ముందు అతను 1937 లో యునైటెడ్ ప్రొవిన్సెస్ శాసనసభలో సభ్యునిగా ఉన్నాడు. అతను గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే చట్టాలపై ఎక్కువ ఆసక్తిని కనబర్చేవాడు. భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా తన సైద్ధాంతిక, ఆచరణాత్మక విధానాన్ని నిర్మించాడు. 1962 - 1967 మధ్య కాలంలో అతను "రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలలోని ముగ్గురు ప్రధాన నాయకుల"లో ఒకనిగా ఉన్నాడు.  1950లలో ఉత్తరప్రదేశ్ లోని అప్పటి ముఖ్యమంత్రి పండిట్ గోవింద్ వల్లబ్ పంత్ పర్యవేక్షణలో భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని అత్యంత విప్లవాత్మక భూ సంస్కరణల చట్టాలను రూపొందించడంలోను, వాటిని ఆమోదించడంలోనూ చరణ్ సింగ్ మంచి గుర్తింపు పొందాడు.

(ఇంకా…)

ఇవి కూడా చూడండి[మార్చు]