కొబ్బరి
| కొబ్బరి | |
|---|---|
| Coconut Palm (Cocos nucifera) | |
| Conservation status | |
|
Secure
|
|
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| Division: | మాగ్నోలియోఫైటా |
| Class: | Liliopsida |
| Order: | Arecales |
| Family: | పామే |
| Genus: | కోకాస్ |
| Species: | కో. న్యూసిఫెరా |
| Binomial name | |
| కోకాస్ న్యూసిఫెరా లి. |
|
కొబ్బరి ఒక ముఖ్యమైన పాము కుటుంబానికి చెందిన వృక్షం. దీని శాస్త్రీయ నామం 'కోకాస్ న్యూసిఫెరా' (Cocos nucifera). కోకాస్ ప్రజాతిలో ఇది ఒక్కటే జాతి ఉన్నది. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. కొబ్బరి చెట్టు 30 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. కొబ్బరి కాయ రూపంలో కొబ్బరి చెట్ల నుండి లభిస్తుంది. హిందువులకు ఒక ముఖ్యమైన పూజా ద్రవ్యం. దీనినే టెంకాయ అని కూడా పిలుస్తాం. దీనిని రకరకాల ఆహార పదార్థాలలో రకరకాల రూపాలలో వినియోగిస్తారు. కొబ్బరి చెట్లనుండి వివిధరకాల పదార్ధాలు అనేకమైన పద్ధతులలో ఉపయోగపడుతున్నాయి.
విషయ సూచిక |
వివరాలు [మార్చు]
కొబ్బరి చెట్లు కోస్తా ప్రాంతాలలోనూ, ఇసుక ప్రాంతాలలోను ఎక్కువగా పెరుగుతాయి. సారవంతం కాని నేలలో కూడా ఇవి పెరుగుతాయి. ఈ చెట్టు సుమారు 100 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇవి సుమారు 100 సంవత్సరాలపాటు జీవించి వుంటాయి. 7 సంవత్సరాల వయసు రాగానే ఈ చెట్టు నెలనెలా చిగురిస్తూ, పూతపూస్తూ ఉంటుంది. భారతదేశపు సాంస్కృతిక జీవనంలో కొబ్బరి చెట్టుకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది. దీనిని కల్పవృక్షం - స్వర్గానికి చెందిన చెట్టు అంటారు. ఇది మనకు కావలసిన ఆహారాన్నీ, పానీయాన్నీ, తలదాచుకునే చోటునీ, జీవితానికి కావలసిన ఇతర నిత్యావసర వస్తువులనూ ప్రసాదిస్తుంది. ఉష్ణ ప్రాంతంలో నివసించేవారికి ఇదొక శుభకరమైన చెట్టు. పూజలలో, పెళ్ళిళ్ళలో, ఇతర ఉత్సవాల సమయంలో దీనిని వాడడం జరుగుతుంది.
శాస్త్రీయ విశ్లేషణ [మార్చు]
కొబ్బరికాయలో నీరు, కండ ఉంటాయి. నీరు, కండ, గట్టితనంగల నారతో కప్పబడి ఉంటుంది. కొబ్బరి బోండాలోని నీళ్ళు చాలా పౌష్టిక గుణాలను కలిగి ఉంటాయి. దీనికి ఔషధగుణాలు కూడా ఉన్నాయి. బలహీనంగా ఉన్న వ్యక్తికి గ్లూకోజ్ దొరకనప్పుడు డ్రిప్స్‌గా కొబ్బరి నీళ్ళను ధారాళంగా వాడతారు. ఈ నీళ్ళు శరీరంలోని వేడిని తగ్గించి కావలసిన చల్లదనాన్ని ఇస్తాయి. ఇది దప్పికను కూడా తీరుస్తుంది. ఇందులో గ్లూకోజ్‌తోపాటు పొటాషియం, సోడియంలాంటి ఖనిజాలు ఉంటాయి. ఆ కారణంగా దీన్ని నెల శిశువు కూడా ఇవ్వవచ్చు. ఇది సులభంగా జీర్ణం అవుతుంది. కొబ్బరి [1]
కొబ్బరి - ఆరోగ్యం [మార్చు]
ఇందులో ఎలెక్ట్రోలిటిక్ ఉన్నందువల్ల తక్కువ మూత్ర విసర్జన జరుగుతున్నప్పుడు, జలోదరానికీ, మూత్ర విసర్జన ధారాలంగా జరిగేందుకూ, డయేరియా కారణంగా శరీరంలోని నీరు తగ్గిపోయినప్పుడూ, దిగ్భ్రాంతి కలిగినప్పుడూ, లేత కొబ్బరికాయ నీళ్ళను వాడవచ్చు. అతిసారం, చీము రక్తం భేదులు, శూల వల్ల కలిగే పేగుల మంటను చల్లార్చడానికి దీనిని వాడవచ్చును. హైపర్ అసిడిటి ఉన్నప్పుడు కూడా దీన్ని వాడవచ్చును. కొబ్బరి నీరు వాంతులను, తల తిరగడాన్ని ఆపుచేస్తుంది. కలరా వ్యాధికి ఇది మంచి విరుగుడు. కారణం అతిసారం భేదుల వల్ల, వాంతుల వల్ల శరీరంలో తగ్గిపోయిన పొటాషియంను శరీరానికి సరఫరా చేయగలగడమే. మూత్ర విసర్జనను ఎక్కువ చేయగలగడం వల్ల శరీరంలో ఉన్న విష పదార్ధాలను బయటకు గెంటడం వల్ల అంటురోగాల వల్ల కలిగే జ్వరాలకు ఇది వాడబడుతుంది. లేత కొబ్బరికాయ కొంత ముదిరినప్పుడు అందులో ఉన్న నీరు జెల్లీలాగా తయారవుతుంది. దీనిని "స్పూన్ కోకోనట్" అంటారు. రుచికరంగా ఉంటూ ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో నూనె, పిండిపదార్ధాలు, మాంసకృత్తుల వల పేగులలో కుళ్ళిపోవడం అన్నది జరగదు. ఆ కారణంగా ఇది మెరుగైన మాంసకృత్తులతో కూడిన ఆహారంగా భావించబడుతోంది. అంతేకాదు ఇది శరీరంలో ఎలాంటి విషంతో కూడిన వస్తువును చేరనివ్వదు. ఇందులో ఉన్న మెత్తటి కండను గాయాలకు రాయవచ్చును. ఈ కండకు గాయాలను మాపే ఔషధ గుణం ఉంది.
బాగా పండిన కొబ్బరిలో నూనె ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది భేదిమందుగా, క్రిమినాశనిగా కూడా వాడబడుతుంది. నూనె కడుపులో ఉన్న యాసిడ్ల విసర్జనను అణిచిపెడుతుంది. కాబట్టి అసిడిటికి ఇది మంచి మందు. పొడిదగ్గు, ఎదనొప్పి నుండి ఇది మనిషికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కొబ్బరిని తురిమి కూరలకూ, చట్నీలకూ, తీపిపదార్ధాల తయారీకీ వాడతారు. బెల్లంతో కలిపి కొబ్బరిని తింటే మోకాళ్ళ నొప్పులు రావు. కొలెస్టెరాల్ ఎక్కువై బాధపడుతున్న వారు కొబ్బరి తినకూడదు
లక్షణాలు [మార్చు]
- శాఖారహిత కాండంతో పెరిగే వృక్షం.
- పొడవుగా దీర్ఘవృత్తాకారంలో పొడిగించిన కొనతో ఉన్న అనేకమైన పత్రకాలు గల సరళ పిచ్ఛాకార సంయుక్త పత్రాలు.
- సంయుక్త స్పాడిక్స్ పుష్పవిన్యాసాక్ష పీఠభాగంలో అమరిన ఆకుపచ్చరంగు స్త్రీ పుష్పాలు, కొనభాగంలో అమరిన మీగడరంగు పురుష పుష్పాలు.
- పీచు వంటి మధ్య ఫలకవచం ఉన్న టెంకగల ఫలాలు.
ఉపయోగాలు [మార్చు]
ఆహారపదార్ధం [మార్చు]
- కొబ్బరి కాయలోని తెల్లని గుజురు మంచి ఆహారం. దీని కోరు నుండి కొబ్బరి పాలు తీస్తారు. దీనిలో 17 శాతం కొవ్వు పదార్ధాలు ఉంటాయి. పాలు తీయగా మిగిలిన దానిని పశువుల దానాగా వాడతారు.
- కొబ్బరి నీరు మంచి పానీయం. ముదురు కొబ్బరిలో కంటే లేత కొబ్బరి బొండంలో ఎక్కువగా నీరు ఉంటాయి. దీనిలోని లవణాలు వేసవికాలంగా చల్లగా దాహం తీరుస్తాయి.
- కొబ్బరి పుష్పవిన్యాసాల చివరి భాగాన్ని కాబేజీ లాగా వంటలలో ఉపయోగిస్తారు. వీటి మూలం నుండి కల్లు తీస్తారు.
ఇతరమైనవి [మార్చు]
- కొబ్బరి పీచు తో తాళ్ళు, చాపలు, పరుపులు తయారుచేస్తారు. ఇది వంటచెరకుగా కూడా ఉపయోగిస్తారు.
- కొబ్బరి కురిడి నుండి కొబ్బరి నూనె తయారుచేస్తారు.
- కొబ్బరి ఆకులు చాపలు, బుట్టలు అల్లడానికి, పందిరి, ఇంటిపైకప్పులపైన వేస్తారు. కొబ్బరి ఈనెలను కట్టలు కట్టి చీపురుగా ఉపయోగిస్తారు.
- కొబ్బరి చెట్టు కాండం కలపగా ఇల్లు కట్టుకోవడంలో దూలాలు, స్తంభాలు క్రింద వాడతారు. ఇవి వంతెనలుగా పిల్ల కాలువల మీద ఉపయోగించవచ్చును.
సంస్కృతి [మార్చు]
- హిందువుల సంస్కృతి మరియు సంప్రదాయాలలో కొబ్బరి కాయకు చాలా ప్రాముఖ్యత కలదు. ఇవి వివిధ పూజలలో దేవతలకు ముఖ్యంగా సమర్పిస్తారు. ఇంచుమించు అన్ని శుభకార్యాలలో కొబ్బరి కాయను పగుల కొడతారు. దీనిని ఆత్మసమర్పణంతో సమానంగా భావిస్తారు.
- భారతదేశంలో కేరళ రాష్ట్రం కొబ్బరికాయలకు ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ కొబ్బరికి చాలా ప్రసిద్ధి.
మూలాలు [మార్చు]
బయటి లింకులు [మార్చు]
- Coconut Research Center
- Coconut Research Institute of Sri Lanka
- Kokonut Pacific Developers of Direct Micro Expelling (DME) technology that enables Islanders to produce pure cold-pressed virgin coconut oil
- Coconut Time Line
- Plant Cultures: botany, history and uses of the coconut
- Purdue University crop pages: Cocos nucifera