Jump to content

ఆంధ్రుల దుస్తులు

వికీపీడియా నుండి
పంచె కండువా ధరించిన నరనారాయణుల చిత్రపటం.

దక్షిణ భారతదేశం మొత్తం మీద ఒకే రకమైన దుస్తులున్ననూ, రాష్ట్రాల, వాటి ప్రదేశాల, మతాల వారీగా వీటిలో స్వల్ప తేడాలు గలవు. (మిగతా దక్షిణ రాష్ట్రాలతో పోలిస్తే ఒక్క కేరళలో మాత్రం విభిన్న సంస్కృతి ఉండటంతో, ఇక్కడి దుస్తులలో కూడా అంతే వ్యత్యాసం కనబడుతుంది.) దుస్తులలో వైవిధ్యాలు సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి.దుస్తుల నేత, వాటిని తయారు చేసే నూలు, వాటికి వాడబడే రంగులు, వాటి తయారీలో ఇతర ముడిసరుకుల వినియోగం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

పురుషుల పంచెకట్టు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది. కోస్తా ఆంధ్రలో పంచెని ధోవతి వలె కట్టటం ఎక్కువ. రాయలసీమలో తమిళుల వలె నడుము చ్టుటూ కట్టే పంచెకట్టుని ఎక్కువగా వినియోగిస్తారు. వ్యవసాయం/సైకిలు త్రొక్కటం వంటి పనులు చేసే సమయంలో కట్టే ధోవతులు/పంచెకట్టులు, తలపాగా కట్లు, ఇతర సమయాలలో కట్టే కట్లతో భేదాలు ఉన్నాయి.

ఉత్తర భారత స్త్రీలు సాధారణంగా పైట చెంగు కుడి భుజం పైకి కడతారు. ఆంధ్రలో (ఆ మాటకొస్తే దక్షిణ రాష్ట్రాలన్నింటిలో) ఇది ఎడమ వైపుకు ఉంటుంది. |పంచెకట్టు

పురుషుల వస్త్రధారణ

[మార్చు]
కండువా పంచెలో కళాకారుడు

సాంప్రదాయిక దుస్తులు

[మార్చు]

తలపాగా అనునది తలని చుట్లతో కప్పే ఒక వస్త్రము. దీనిని ధరించే విధానాలు వేర్వేరుగా ఉంటాయి. తలపాగా, పైపంచ (ఉత్తరీయం) అనేవి గ్రామీణప్రాంత ఆంధ్రులకు తప్పనిసరి. తలపాగా అనేది రోజువారీ పనులలోనే కాకుండా శుభకార్యాలలోను, ఉత్సవాలలోను తప్పనిసరిగా ధరిస్తారు. ఆంధ్రుని ఆహార్యమంటే పంచకట్టు, లాల్చీలాంటి చొక్కా, పైపంచ, తలపాగా .

సాధారణంగా పురుషులు నూలు/ఖద్దరు లేదా నూలుతో కలసిన ఇతర రకాలు (blend) తో తయారు చేసిన కుర్తా (జుబ్బా/లాల్చీ), ధోవతి (పంచె) లని ధరిస్తారు.

మ్యాండరిన్ కాలర్ (చైనీసు కాలర్) తో కూడి గానీ, అసలు కాలరే లేకుండా గానీ, మెడ నుండి తొడల వరకూ/భుజాల నుండి అరచేతుల వరకు కుర్తా శరీరాన్ని కప్పుతుంది. చేతుల వద్ద బొత్తాలు ఉండవు. ఛాతీ వద్ద కాజాలతో కూడిన, లేక నొక్కుడు బొత్తాలు రెండు లేదా మూడు ఉంటాయి. కుర్తాలు సాధారణంగా తెలుపే అయిననూ అప్పుడప్పుడూ వేరే రంగులలో ఉండగలవు. జేబులు సాధారణంగా ఛాతీ వద్ద ఉండవు. కానీ నడుముకు ఇరువైపులా ఉంటాయి. పెన్ను, పాకెట్ బుక్, మొబైల్, పర్సు వంటివి భద్రపరచుకొనటానికి అనువుగా ఛాతీ వద్ద ఒక జేబు వ్యక్తిగతంగా కొందరు పెట్టించుకొంటారు. కుర్తాకి నడుముకు ఇరువైపులా ఒక్కో వెంటు (చీలిక) ఉంటుంది. కాళ్ళ కదలికలకి అడ్డు పడకుండా ఈ వెంటులు ఖాళీ స్థలాన్ని సృష్టిస్తాయి. ఒక్కోమారు కుర్తా స్థానంలో చొక్కాని కూడా ధరిస్తారు.

ఉదర భాగం/పొత్తి కడుపు నుండి రెండు కాళ్ళ మధ్య నుండి వెనక్కి వెళ్ళేలా ధోవతిని కడతారు. కొన్ని ప్రాంతాల (ఎక్కువగా రాయలసీమ)లో ధోవతిని పంచెకట్టుతో ధరిస్తారు. యునైటెడ్ కింగ్డమ్కి చెందిన గ్లాస్గోలో ఉత్తమ నూలు ఉత్పత్తి అవటం వలన నాణ్యత గల పంచెలని గ్లాస్గో పంచెలు అని సంబోధిస్తారు. అయితే వీటి వికృతి గ్లాస్కో పేరే వాటికి స్ధిరపడినది. జారకుండా ఉండటానికి మొలత్రాడుని వాడతారు. పంచ, పై పంచలు సాధారణంగా తెలుపు రంగులో గానీ, క్రీం కలర్ లో గానీ ఉంటాయి. వీటికి అంచుల్లో రంగులతో నగిషీలు అద్దబడి ఉంటాయి. సాధారణంగా ఈ నగిషీ ఒకే రంగుతో అద్దబడి ఉంటుంది. అంచుల్లో ఉండే ఈ నగిషీ లని కేవలం అంచు అని గానీ లేదా బార్డర్ (border) అని గానీ వ్యవహరిస్తూ ఉంటారు. బార్డరులు స్త్రీలు ధరించే చీరలు/పై లంగాలు/జాకెట్లు/రవిక లకి కూడా ఉంటాయి. అయితే స్త్రీల దుస్తులపై వాడే బార్డరులు (ఉదా: మామిడి పిందెలు), పురుషుల దుస్తులపై వాడే బార్డరులు (ఉదా: సర్పిలమును పోలినవి) వేర్వేరుగా ఉంటాయి.

పంచెకట్టు: చీరకు వేసే కుచ్చిళ్ళ అంత ఒద్దికగా పెద్దగా కాకుండా, దాదాపు అదేవిధంగా, చిన్నగా నడుముకు ఒక వైపు మాత్రమే గానీ, ఇరువైపుల గానీ, రెండువైపులు బయటకు గానీ లోపలకుగానీ దోపుతారు. (ఒకటి బయటికి, ఇంకొకటి లోపలికి దోపరు.)

ధోవతి కట్టు: పై విధంగా కట్టిన పంచెకి క్రిందికి వ్రేలాడే అంచును కాళ్ళ మధ్య నుండి వెనుకకు తీసుకుపోయి, నడుము వద్ద లోపలికి (మాత్రమే) దోపుతారు. వెనుకకు దోపటం తప్పని సరి కాదు. నడిచే సమయంలో పెద్ద పెద్ద అడుగులు వేసేందుకు వీలుగా దీనిని చేత పట్టుకొనవచ్చును.

కుర్తా పై కండువా/పై పంచ ధరిస్తారు. ఇది అన్ని ప్రాంతాలలో కచ్చితం కాకున్ననూ, పెద్దరికానికి, హుందాతనానికి చిహ్నంగా దీనిని ఎడమ భుజము పై (కుడి చేత్తో) సగం వీపు వైపుకు, సగం ఛాతీ వైపుకు వ్రేలాడేలా (ఎక్కువగా కోస్తాంధ్ర)లో అలంకరించుకొంటారు.

ఇవి పురుషుల సాంప్రదాయిక దుస్తులు. ఈ మధ్య పెళ్ళికొడుకులు ఫ్యాషన్ అనుసరించి షేర్వానీలు ధరిస్తున్నారు. కానీ పూర్వం పెళ్ళికొడుకు కుర్తా-ధోవతులనే ధరించేవారు.

రఘుపతి వెంకయ్య నాయుడు, చుక్కల తలపాగా, షర్టు, టై, కోటు, ప్యాంటు ధరించేవాడు.

ఆంధ్ర పురుషుల సాంప్రదాయిక దుస్తుల చిత్రమాలిక
[మార్చు]

సాంప్రదాయేతర దుస్తులు

[మార్చు]
  • లుంగీ
  • టవల్ (తలపాగా, పైపంచెలకి అసాంప్రదాయిక ప్రత్యాన్మాయంగా)
  • సైకిల్ కట్టు ధోవతి

ఇంట్లో ఉన్నప్పుడు/సాంప్రదాయికత అవసరం లేనప్పుడు పంచెను ధరించగలిగిననూ, వాటి స్థానంలో లుంగీ ల వాడకం ఎక్కువ. ఇవి రకరకాల రంగులలో గడుల డిజైనులలో లభిస్తాయి. నేసిన (గడుల) వే కాకుండా (ఇతర) ప్రింటు డిజైనులలో కూడా ఇవి లభ్యమౌతాయి.

టవల్
[మార్చు]

వ్యవసాయం, కూలి, నిర్మాణాలలో పని చేసేవారు పై పంచకి ప్రత్యామ్నాయముగా ఒక టవల్ ని వాడతారు. ఇదే టవల్ నే తలపాగా కూడా ధరిస్తారు. అయితే, టవల్ తో పై పంచ, తలపాగా రెండూ అసాంప్రదాయికాలే.

సైకిల్ కట్టు ధోవతి
[మార్చు]

సైకిల్ నడిపే సమయంలో సైకిల్ చక్రాలలో, చైన్ గల పెడల్ చక్రంలో ఇరుక్కుపోకుండా, ధోవతి కట్టే విధానాన్ని సైకిల్ కట్టు అంటారు. దసరా బుల్లోడు, జానకిరాముడు వంటి చిత్రాలలో కథానాయకులు మోచేతుల వరకు మడచిన కుర్తా, సైకిల్ కట్టులో ధోవతిని ధరించి అసాంప్రదాయికంగా కనిపించారు.

ఆంధ్ర పురుషుల అసాంప్రదాయిక దుస్తుల చిత్రమాలిక
[మార్చు]

లోదుస్తులు

[మార్చు]
  • బనియను
  • నాడాలు కలిగిన లాగు (బాక్సర్ షార్ట్ ని పోలిన నిక్కరు)
  • లంగోటి

బనియను లేదా బాడీ పురుషులు చొక్కా లేదా కుర్తా లోపల వేసుకొంటారు.

ఇంట్లో ఉన్నప్పుడు, సాంప్రదాయికత అవసరం లేనప్పుడు, వేసవి కాలాలలో పురుషులు వీటిని అత్యధికంగా వాడతారు.

చేతులు లేని (sleeveless) బనియను వంటి వస్త్రం పూర్వం ధరించేవారు. ఉదర భాగం వద్ద కుడి ప్రక్క నుండి చేత్తో వస్తువులను వేసుకొనే విధంగా ఒక జేబు వీటికి ఉండేది. ఇవి ఇప్పుడు కనుమరుగైనాయి

నాడాలు కలిగిన లాగు
[మార్చు]

నాడాలు కలిగిన లాగు భారతదేశ పురుషుల లోదుస్తులలో ఒకటి. దీనిని పంచె/లుంగీల లోపల ధరిస్తారు. సాధారణంగా ఇది నీలి రంగులో ఉండి వాటి మీద వేర్వేరు రంగుల చారలు గల (పైజామాలు కుట్టే ) వస్త్రంతో తయారు చేయబడి ఉంటుంది. వీటికి నాడాలు ఉంటాయి. ఇవి తొడల వరకే ఉంటాయి. సాధారణంగా తొడల వద్ద (బాక్సరు షార్టు వలె) వదులుగా ఉండి, జేబులు లేకుండా ఉంటాయి. కొందరు వ్యక్తిగతంగా నడుముకిరువైపులా జేబులు పెట్టించుకొంటారు.

తెల్లని పంచెలు మరీ దళసరిగా ఉన్నప్పుడు కానీ, నీళ్ళలో తడిచినపుడు గానీ, ఆడ్డపంచె కట్టినప్పుడు గానీ, ఇవి కనబడుతుంటాయి.

ఆంధ్ర పురుషుల లోదుస్తుల చిత్రమాలిక
[మార్చు]

స్త్రీల వస్త్రధారణ

[మార్చు]
దక్షిణ ఆసియాలో వివిధ శైలులలో స్త్రీల వస్త్రధారణ చూపించే చిత్రపటం

సాంప్రదాయిక దుస్తులు

[మార్చు]

సాధారణంగా స్త్రీలు చీర జాకెట్టు ధరిస్తారు. ఉత్తర భారతీయ ప్రభావంతో సల్వార్ కమీజ్ (పంజాబీ డ్రెస్), పాశ్చాత్య పోకడలతో జీన్స్ టి-షర్టులు వచ్చిననూ, చీర ప్రత్యేకత చీరదే. అందుకే పెళ్ళిచూపులు, నిశ్చితార్థం, పెళ్ళిళ్ళలో పెళ్ళికూతురు చీర ధరించటం తప్పని సరి. కేరళలో స్త్రీలు గుడికి వెళ్ళినపుడు చీర కాకుండా ఏ ఇతర దుస్తులకి అనుమతి లేదు. నైట్-డ్రెస్ ల వంటి ఇతర దుస్తులు గృహ సంబంధిత కార్యకలాపాలు చేసుకోవటానికి సౌకర్యంగా ఉన్నందున, ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాలు వీటి పైనే మొగ్గు చూపినననూ, రోజువారీ జీవితంలో చాలా మంది దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి గృహిణులు చీరలనే వాడతారు.

బ్రాహ్మణ స్త్రీలు కాలి మడమల వరకు ధోవతి వలె చీరలు కడతారు. ఈ మధ్య ఈ విధంగా ఎవరూ కట్టటం లేదు. అయితే మరాఠీ, తమిళ మహిళలు దాదాపు దీనిని పోలిన చీరకట్టే కడతారు.

పెళ్ళిళ్లలో ఆడవాళ్లు ఎక్కువగా పట్టు చీరలు కట్టాలనుకుంటుంటారు. హిందూ సంప్రదాయంలో పట్టు చీరకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పండగకీ, పెళ్ళికీ తళతళలాడే పట్టు చీరలు ఉండాల్సిందే. ఇప్పుడు కొత్తగా వర్క్ చీరల ఫ్యాషన్ వచ్చింది. సాధారణ జరీనుంచి వెండి జరీ దాకా వర్క్ చేసిన పట్టు, నైలెక్స్ చీరల ధరలు కూడా ఎక్కువే.

పూర్వం జాకెట్టుకి బదులుగా రవిక (వికృతి: రైక) ని వాడేవారు. జాకెట్టుకు వక్షోజాల మధ్య అమర్చబడే కొండీలు (హుక్కులు) రవికకు ఉండవు. వాటి స్థానే రెండు చివరలను మధ్యకి తెచ్చి రవికను ముడి వేస్తారు. అయితే రవికలని చీరలతోనే కాకుండా, ధోవతి వలె కాలి పిక్కల వరకు కట్టిన చీరలతో కూడా ఉపయోగిస్తారు. ఎంకి అనే పాత్రకి, జాలరి మహిళకి రూపం, ఎడమ చేతిలో గంప కలిగి ఉండి రవిక, ధోవతి వలె కట్టిన చీరే.

దక్షిణాదితో బాటు ఉత్తరాది సినిమాలలో రవికను మహిళను శృంగారపూరితంగా చిత్రీకరించటానికి ఉపయోగించటం ఇప్పటికీ చూస్తూనే ఉంటాము.

పెళ్ళి కావలసిన యువతులు దైనందిన జీవితాలలో పైట-పావడ (లంగా-పైట/ఓణి)లు వాడతారు. గుళ్ళకి, పుణ్యక్షేత్రాలకి వెళ్ళేప్పుడు, ఉత్సవాలకి, ఇతరుల నిశ్చితార్థం, పెళ్ళిళ్ళ వంటి శుభకార్యాలకి కూడా సాంప్రదాయికత ఉట్టిపడటం కోసం యువతులు పైట-పావడలలో హాజరు అవుతారు.

పెళ్ళి కాబోతోంది కాబట్టి లంగా-ఓణీ, నేటితో రద్దయిపోనీ అనే పాట వర్షం (సినిమా)లో ఉంది. చంటి సినిమాలో కథానాయిక పుష్పించిన సందర్భానికి జరిగే పేరంటానికి నాయికకి లంగా-ఛోళీ నే తొడిగారు. (వాస్తవానికి ఈ సందర్భములో యౌవనాన్ని సూచించే పైట-పావడ నో, లేక పరిపూర్ణత సూచించే చీరకట్టో ఉంటుంది.)

అసాంప్రదాయిక దుస్తులు

[మార్చు]

స్త్రీ వస్త్రధారణలో సాంప్రదాయికతకి అసాంప్రదాయికతకి ఇట్టే తేడా లేదు. కాకపోతే పండుగలకి, ఉత్సవాలకి, శుభకార్యాలకి స్త్రీ వస్త్రధారణ పట్టు వంటి ఖరీదైన వాటితో ఉంటే, అసాంప్రదాయిక దుస్తులు నూలు, షిఫాన్ వంటి తక్కువ ధరలలో అందుబాటయ్యే వస్త్రాలతో ఉంటాయి.

ఆంధ్ర స్త్రీల దుస్తుల చిత్రమాలిక

[మార్చు]

లోదుస్తులు

[మార్చు]

బ్రా లేదా బ్రాసియర్ స్త్రీలు వక్షోజాలకు రక్షణగా ధరించే లోపలి దుస్తులు. వీటిని రవికె లోపల బయటికి కనిపించకుండా జాగ్రత్తపడతారు.

లంగా భారతీయ స్త్రీలు ధరించే ఒక రకమైన దుస్తులలో ఒకటి. లంగాకు నాడాలు ఉంటాయి. ముడి నడుముకి కుడివైపు వచ్చేలా కడతారు. ఈ ముడిని నడుము కుడి భాగం నుండి ఎడమ భుజం వైపుకి వెళ్ళే పైట కప్పివేస్తుంది. లంగాలు రెండు రకాలు. లోపలి లంగా, పై లంగా (పావడ/పరికిణీ) .

పెళ్ళైనవారు చీర లోపల కనిపించకుండా ధరిస్తారు. ఇది సామాన్యంగా నూలుతో చేసినదై ఉంటుంది.

అయితే పెళ్ళికి ముందు లంగా ఓణిలు కలిపి ధరించడం ఆంధ్రదేశంలో సాంప్రదాయంగా ఉండేది. ఇవి పండుగలలో పట్టుతో చేసి వివిధ రంగులలో అంచులతో అందంగా కనిపిస్తాయి. పైలంగాలను పైట లోపల, బయటికి కనిపించేలా (లోపలి లంగా పైన) ధరిస్తారు.

చిన్న పిల్లల వస్త్రధారణ

[మార్చు]

ఈ మధ్య మగపిల్లలలు చొక్కా-లాగు-నిక్కరు వంటివి ధరిస్తున్నారు. కానీ పూర్వం పెద్దవారు ధరించిన ధోవతి, ఉత్తరీయము, లాల్చీ,షరాయి వంటివి ధరించేవారు.

ఈ మధ్య ఆడ పిల్లలు మిడ్డీ, ఫ్రాక్,పంజాబీ డ్రస్,గాగ్రా వంటివి ధరిస్తున్నారు. కానీ పూర్వం పరికిణి-జాకెట్టులని మాత్రం ధరించేవారు.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

వనరులు

[మార్చు]