భారతీయులు ధరించే విదేశీ వస్త్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1918 లో భార్య కమల నెహ్రూ, కుమార్తె ఇందిరా గాంధీతో జవహర్లాల్ నెహ్రూ. ఈ ఫోటోలో నెహ్రూ ప్లీటెడ్ ట్రౌజర్స్, వెయిస్ట్ కోట్, సింగిల్ బ్రెస్ట్ లాంగ్ ల్యాపెల్ లాంగ్ కోట్, ధరించారు
మేరా జూతా హై జపానీ

ఏ పటలూన్ ఇంగ్లిస్తానీ
సర్ పే లాల్ టోపీ రూసీ
ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ '

శ్రీ 420 చిత్రంలో పాట భాగం

పై పాటలోని భాగం యొక్క అర్థం

నా బూట్లు జపానువి
నా ప్యాంట్లు ఇంగ్లీషువి
నా తలమీది ఎర్ర టోపీ రష్యాది
కానీ, నా హృదయం మాత్రం భారతదేశానిది.'

—అని రాజ్ కపూర్ అభినయించిన ఈ పాట[1] పెదవులపై చిరునవ్వుని తెప్పించిననూ ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ వస్త్రాలు ధరించినా పాటలోని ఆ మాటలు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నూరు శాతం వాస్తవాలే!!!

పాశ్చాత్య దుస్తుల ప్రవేశము[మార్చు]

నోర్ఫోక్ జాకెట్

ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోనికి ప్రవేశించక మునుపు ఇక్కడ పాశ్చాత్య దుస్తుల ధారణ ఉండేది కాదు. అయితే రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించే దృఢ సంకల్పంతో బ్రిటీషు వారు క్రమంగా వారి వేష భాషలని, సంస్కృతి/సంప్రదాయాలని భారతీయులకి పరిచయం చేశారు. విదేశీ విద్య, డాబు-దర్పం, సంఘంలో గుర్తింపు ఇలా వివిధ కారణాల వలన భారతీయులు పాశ్చాత్య దుస్తులని ధరించటం ప్రారంభించారు. మొదట సంపన్న వర్గాలకి మాత్రమే పరిమితమైన ఈ శైలి చాప క్రింద నీరులా తర్వాత అన్ని వర్గాలకి పాకినది. రంగస్థలాల స్థానే సినిమాలు ప్రాచుర్యం పొందటం, యువతని ఆకర్షించేందుకు నాయికా నాయకులు విదేశీ పోకడలు పోవటం, అభిమానులు వారిని అనుకరించటంతో రాను రాను పాశ్చాత్య దుస్తులు చాలా వేగంగా జనం మనసుల లోతులకు నాటుకుపోయాయి. భారతీయులపై పాశ్చాత్య దుస్తుల ప్రభావం ఏ స్థాయిలో ఉన్నదంటే ప్రస్తుత కాలం యువత వేసే దుస్తులని చూసి నాయికా నాయకులు వారి వస్త్రధారణకి మెరుగులు దిద్దుకొనే పరిస్థితి ఉంది.

మొదట షర్టులు, ప్యాంటులు, నూలుతో చేసిన వస్త్రాలతో మాత్రమే కుట్టబడేవి. వీటిని గంజి పెట్టి ఇస్త్రీ చేయటం వలన ఇవి వేసుకొన్నంత సమయం గట్టిగా, పలపలలాడుతూ ఉండేవి. ప్రత్యామ్నాయంగా షార్క్ స్కిన్ ని ఉపయోగించేవారు. తర్వాతి కాలంలో పాలిష్టరు, విస్కోజ్ వంటి వాటిని నూలుతో మేళవించిన వస్త్రాల వాడకం మొదలయినది. ఇటీవలె లినెన్ ఉపయోగం కూడా పెరిగింది.

మొదట రెడీమేడ్ వస్త్రాలు లభించేవి కావు. పూర్వానుభవంతో కావలిసినంత వస్త్రాలను విడిగా కొనుగోలు చేసి, దర్జీల వద్దకి వెళ్ళి, కొలతలు ఇస్తే, కొద్దిరోజుల వ్యవధిలో వాటిని కుట్టి ఇచ్చేవారు. చాలా కాలం భారతదేశంలో ఈ పద్ధతే కొనసాగినది. కొలతలు సరిపోక పోవటం, నాణ్యత/మన్నిక తక్కువగా ఉండటంతో రెడీమేడ్ వస్త్రాలు వాడటానికి ప్రజలు మొగ్గు చూపేవారు కారు. రెడీమేడ్ వస్త్రాలపై ఈ వ్యతిరేకతని గమనించిన అరవింద్ మిల్స్ 90 లలో ఫ్యాషన్ పై అవగాహన పెరుగుతున్న యువతని లక్ష్యంగా చేసుకొని రెడీ-టు-స్టిచ్ జీన్స్ ని రూపొందించింది. ఇందులో ప్యాంటుకి కావలసిన జీన్స్ గుడ్డ, బొత్తా, జిప్పు, రివెట్లు ఉండేవి. కానీ భారతదేశంలో దర్జీల వద్ద జీన్స్ గుడ్డని కుట్టటానికి అవసరమయే ప్రత్యేక కుట్టు మిషన్ లు ఉండేవి కావు. సాధారణ కుట్టు మిషనుతో కుడితే వీటికి అంత మంచి ఫినిషింగ్ వచ్చేది కాదు. అందుకే వీటి ఉత్పత్తి ఆగిపోయింది.

రెడీమేడ్ విప్లవం[మార్చు]

90 వ దశకంలో జరిగిన సరళీకరణ తర్వాత చాలా విదేశీ సంస్థలు భారతదేశంలోనికి ప్రవేశించాయి. ఈ సంస్థలు రూపొందించే దుస్తుల నాణ్యత మన్నికల ప్రమాణాలు మిక్కిలి ఎక్కువగా ఉండటం, కావలిస్తే కొంత మేరకు కొలతలని సరిచేసి ఇవ్వగలగటం, ప్రభుత్వేతర ఉద్యోగాలు, ప్రజల వ్యయపరిమితులు పెరగటం, కాలం వేగవంతం కావటంతో రోజుల తరబడి దర్జీల కుట్టి ఇచ్చే దుస్తుల కోసం వేచి ఉండవలసిన అవసరం లేకపోవటంతో, రెడీమేడ్ దుస్తులు ఉత్పత్తి/వాడకం ఊపందుకొన్నాయి.

పురుషుల దుస్తులు[మార్చు]

ఒకే వస్త్రంతో కుట్టబడిన ప్యాంటు, కోటు గల సూటు పురుషుల సాంప్రదాయిక దుస్తులు. ఇప్పటికీ ఇవి సాంప్రదాయికాలుగానే వాడకంలో ఉన్నాయి. అసాంప్రదాయికంగా బ్లేజరుని ధరిస్తారు.

కాలరు ఉన్న షర్టు సాంప్రదాయికం కాగా ల్యాపెల్ (కాలరు స్థానే సఫారీ షర్టుకి ఉండేది) ఉన్న షర్టు అసాంప్రదాయికం. ల్యాపెల్ గల షర్టులని ఇప్పుడు ఎవరూ ధరించుట లేదు. వాటి స్థానే టి-షర్టులు ధరిస్తున్నారు.

టై సాంప్రదాయికం కాగా, బౌ టై లని విందులు వినోదాలకి ధరించేవారు. సందర్భాన్ని, వ్యక్తిగత అభిరుచులని బట్టి టై, బౌల ధారణ మారేది.

ప్రపంచీకరణ, సరళీకరణ వలన ప్రభుత్వేతర ఉద్యోగాలలో అభివృద్ధి వలన సాంప్రదాయిక దుస్తుల ఆదరణ పెరిగింది. సాఫ్టువేర్ సంస్థల వలన అమెరికా సంస్కృతి విస్తరణ, ఉద్యోగుల స్వేచ్ఛకి పెరిగిన ప్రాముఖ్యం వలన ఉన్నత వర్గాల వారు, అమ్మక విభాగ ప్రతినిధులు (సేల్స్ ఎగ్జిక్యూటివ్ లు) తప్పితే ఈ కాలంలో ఇతరులు సూటులు, బ్లేజర్లు, టైలు, బౌలు వాడటం లేదు. పబ్ ల సంస్కృతి పెరగటం, పార్టీ వేర్ ల రాక ల వలన, ప్రస్తుతం బౌటై ల వినియోగం (కనీసం భారతదేశంలో) తగ్గినది. అయితే కాస్తో కూస్తో ఉన్నవారు, వివాహ విందుల సమయంలో వరుణ్ణి సూట్ లో అలంకరిస్తున్నారు.

ట్రౌజర్లు సాంప్రదాయికంగా ధరిస్తే అసాంప్రదాయికంగా లో-వెయిస్ట్ ప్యాంట్లని ధరించేవారు. ప్రస్తుతం ప్లీట్లు లేని ఫ్లాట్-ఫ్రంట్ కాటన్ ట్రౌజర్లు కూడా సాంప్రదాయికాలు అవ్వగా అసాంప్రదాయిక ప్యాంటులుగా జీన్సు/కార్గో ప్యాంట్లని ధరిస్తున్నారు

ఇవి కాకుండా పూర్వం బుష్ కోట్, బుష్ షర్ట్, మనీలా షర్ట్ వంటివి కూడా అసాంప్రదాయిక షర్ట్లుగా ధరించే వారు. ఇవి ఇప్పుడు కనుమరుగైనవి.

సూటు[మార్చు]

సూటు అనగా ఒకే వస్త్రంతో కుట్టిన వివిధ వస్త్రాల సముదాయము. ఈ సముదాయంలో కనీసం కోటు (పురుషుల జాకెట్), ట్రౌజర్సు ఉంటాయి.

సూటు యొక్క డిజైను, దానిని కత్తిరించే విధానము, ఉపయోగించే వస్త్ర రకము, రెండు-భాగాల/మూడు భాగాల, సింగిల్/డబుల్ బ్రెస్ట్ అనునవి సందర్భాన్ని/వాతావరణాన్ని బట్టి ఉంటాయి.

సూట్లు తరచుగా కాలర్ కలిగిన షర్టులు, నెక్ టై లతో ధరిస్తారు. రెండు భాగాల సూట్ లో కేవలం జాకెట్, ట్రౌజర్సు, అదే మూడు భాగాల సూట్ లో అయితే వెయిస్ట్ కోట్, ఒక్కో మారు ఫ్ల్యాట్ క్యాప్ కూడా చేరతాయి.

షర్టు[మార్చు]

  • ఇంగ్లీష్ షర్ట్: ఇవి మొదటి తరం షర్టులు. ఇవి ఇప్పుడు వేసుకొనే మామూలు షర్టు వలెనే కానీ బొత్తాలు మాత్రం టి-షర్టు లకు ఉన్నట్టు ఛాతీ వరకు మాత్రం ఉండేవి. వీటి ధారణ కూడా టి-షర్ట్ ధారణ వలెనే ఉండేది. వెనుక ప్లీట్లు వీపు మధ్య భాగం వద్ద దగ్గరగా కాకుండా బాగా ఎడంగా ఉండేవి. ధరించే సమయంలో ఇస్త్రీ నలిగే అవకాశం ఎక్కువగా ఉండటం, ధరించే విధానం కష్టతరంగా ఉండటం వంటి వాటి వలన తర్వాతి కాలంలో అమెరికన్ షర్ట్ లు జనాదరణ పొందాయి. ప్రస్తుతం ఇంగ్లండు వారు కూడా అమెరికన్ షర్ట్ల పైనే మొగ్గు చూపటం విశేషం.
  • అమెరికన్ షర్ట్: కాలరు వద్ద నుండి క్రింద వరకు బొత్తాలు కలది. ఇంగ్లీష్ షర్ట్ తో పోలిస్తే వీటి వినియోగం, ధారణ, ఇస్త్రీ సులభం. అమెరికన్ షర్ట్ వచ్చిన తర్వాత షర్టులలో (కాలరులలో తప్పితే) పెద్ద తేడాలు కనబడలేదు. బిగుతు షర్ట్ లకి చిన్న కాలర్లు, బెల్ బాటం ప్యాంట్ల కాలంలో చాలా పెద్ద (భుజాల వరకు వచ్చే పాయింటెడ్, రౌండెడ్) కాలర్లు, ప్యారలెల్ ప్యాంట్ల సమయంలో బటన్ డౌన్ కాలర్ల వంటి స్వల్ప మార్పులు మాత్రం కనబడ్డాయి.

నెక్ టై[మార్చు]

కాలర్ చుట్టూ అలంకార ప్రాయంగా కట్టుకునే రిబ్బను వంటి గుడ్డనే నెక్ టై అంటారు . కాలరు విధానం, వాతావరణం, వ్యక్తిగత అభిరుచులని బట్టి టై నాట్ (ముడి) ఉంటుంది. కాలరు వద్దనున్న గుండీని పెట్టుకొన్నచో ఇది సాంప్రదాయికం అవ్వగా, అదే గుండీని విప్పేసి, వదులుగా తగిలించుకొన్నచో ఇది అసాంప్రదాయికం అవుతుంది. టై నాట్ లు పలు రకాలుగా ఉన్ననూ భారతదేశంలో ఈ క్రింది నాట్ లనే ఎక్కువగా కడతారు.

  • స్మాల్ లేదా ఓరియెంటల్
  • ఫోర్ ఇన్ హ్యాండ్
  • హాఫ్ విండ్సర్
  • (ఫుల్/డబల్) విండ్సర్

వివిధ రకాల నెక్ టై నాట్ లు[మార్చు]

బౌ టై[మార్చు]

బౌ టై, ఒక రకమైన పురుషుల నెక్ టై. రిబ్బను వంటి ఈ అలంకారం కాలరు మధ్యకి ఇరు వైపులా అతికినట్లు ఉంటుంది. ముందే కట్టి ఉంచిన రెడీ-టైడ్ బౌ టైలతో బాటు, స్వయంగా కట్టుకునే సాంప్రదాయిక సెల్ఫ్-టై, "టై-ఇట్-యువర్సెల్ఫ్ " లేదా "ఫ్రీ స్టయిల్ " బౌ టైలు కూడా లభ్యమవుతాయి. దుస్తులను తయారు చేసే పట్టు, పాలిష్టరు, నూలు లేదా వీటి కలయికలతో బౌ టై లను తయారు చేస్తారు. అరుదుగా వీటి తయారీలో ఉన్నిని కూడా వినియోగిస్తారు.

స్కార్ఫ్[మార్చు]

టై, బౌ లకి బదులుగా స్కార్ఫ్ ని కూడా వాడతారు. అయితే ఇది ఫక్తు అసాంప్రదాయికం. అయితే పోలీసు శాఖ, రక్షణ శాఖలో ఉన్నత పదవులలో ఉన్న వారి యూనిఫాంలో స్కార్ఫ్ లు భాగాలు. అలాగే స్కౌట్ బాయ్/ గైడ్ ల యూనిఫాం లలో కూడా ఇవి భాగాలే. షర్టు లోపల కాలరు వలన ఏర్పడ్డ ఖాళీ ప్రదేశాన్ని కప్పేందుకు గొంతు చుట్టూ, లేదా కాలరు బయట టై వలె ముడి వేసి కడతారు.

స్కార్ఫ్ లు ధరించిన భారతీయుల చిత్రమాలిక[మార్చు]

కోటు[మార్చు]

పురుషులు తమ షర్టు పై వెచ్చదనానికి, ఫ్యాషన్ కి వేసుకొంటారు. సాంప్రదాయికంగా ప్యాంటు గుడ్డనే సూటులో భాగంగా కుడతారు. అలా కాకుండా అసాంప్రదాయికంగా ధరించే కోట్ని బ్లేజర్ అని అంటారు. ఇవి కాకుండా వర్షం నుండి కాపాడే ప్రత్యేకమైన రెయిన్ కోట్ లు, జీంస్ తో కుట్టిన జాకెట్లు, కోటు లు, చేతులు లేని స్లీవ్ లెస్ జాకెట్లు కూడా కలవు

వెయిస్ట్ కోట్[మార్చు]

వెయిస్ట్ కోట్ అనునది సూట్ లోని ఒక భాగము. ఇది చొక్కా పైన, కోటు లోపల వేసుకొనే ఒక చేతులు లేని (స్లీవ్ లెస్) కోటు. దీని ముందు భాగం బయటికి కనబడుతుంది కాబట్టి ఒక వస్త్రంతోను వెనుక భాగం కనబడదు కాబట్టి దానిని ఇంకొక వస్త్రంతోను కుడతారు. దీనికి కాలరు గానీ, ల్యాపెల్ గానీ ఉండవు.

ప్యాంటు[మార్చు]

మొదటి తరం ప్యాంటు, వివిధ భాగాలు

మగవారు/ఆడవారు నడుము నుండి పాదాల వరకు తొడుక్కొనే వస్త్రము. ఇది లావుగా ఉండే గుడ్డతో తయారుచేస్తారు. ఇది సూటు లోని ఒక భాగమైననూ, సూటు యొక్క ఇతర భాగాలైన నెక్ టై/బౌ టై, కోటు లేకున్ననూ, కేవలం షర్టుతో బాటు దీనిని వేసుకొనవచ్చును. చాలా వరకు భారతీయులు (, ఇతర ఉష్ణ దేశస్థులు) కేవలం షర్టు ప్యాంటు లతోనే కనబడతారు. ప్యాంటులో సగం మాత్రం అనగా తొడల వరకు ఉండే వస్త్రాన్ని నిక్కరు అంటారు. బెర్మూడా వంటి దేశంలో ప్యాంటుకి బదులుగా మోకాళ్ళ వరకు ఉండే సాంప్రదాయిక నిక్కరులని సూటుతో వేసుకొనగా, స్కాట్లండ్, ఐర్లండ్ వటి దేశాలలో ప్యాంటుకి బదులుగా స్కర్టుని కూడా వాడతారు.

ఒక్కోమారు ప్యాంటుకి బదులుగా మోకాళ్ళ వరకు వదులుగా ఉండే నికర్ బాకర్స్ని ధరిస్తారు.

సాంప్రదాయికాలని ట్రౌజరు (ఉదా: ప్లీటెడ్ ట్రౌజర్సు) అనీ అసాంప్రదాయికాలని ప్యాంటు (ఉదా: లో-వెయిస్టెడ్ ప్యాంటు) అనీ పూర్వం వ్యవహరించేవారు. కానీ కాలక్రమేణా ఇవి రెండూ ఒకటే అయినాయి. ప్యాంటు అన్న పదం అన్నింటికీ వర్తించిననూ ట్రౌజరు అంటే మాత్రం సాంప్రదాయికం అనే మిగిలి పోయింది.

జీన్ గుడ్డ ట్రౌజరు గుడ్డ కన్నా ఇంకా మందంగా ఉండి ఉతకకుండా చాలా కాలం ఉపయోగించవచ్చును. సాధారణ పాంటుకు రెండు జేబులు ప్రక్కగాను ఒకటి/రెండు జేబులు వెనుకగాను ఉంటాయి. బెల్టు కట్టుకోవడానికి అనువుగా నడుం చుట్టూ రింగులు కుట్టబడి ఉంటాయి.

సస్పెండర్స్[మార్చు]

భుజాల మీదుగా వెళ్ళి ప్యాంటుకి ముందు (ఉదరభాగం వద్ద), వెనుక (నడుము భాగం వద్ద) దానిని పట్టి ఉంచే పొడవాటి పట్టీలు

విదేశీ వస్త్రాలని భారతీయ పురుషులు ధరించే శైలి[మార్చు]

మధ్యప్రాచ్య దుస్తులు[మార్చు]

పఠానీ (వదులుగా పలుచగా ఉండే కుర్తా పైజామాలు), షేర్వానీ (కొద్దిగా బిగుతుగా, మందంగా ఉండే కుర్తా పైజామాలు) కూడా భారతీయులు ధరిస్తుంటారు. ఇవి మధ్యప్రాచ్యం నుండి వచ్చినవి.

పఠానీ[మార్చు]

పఠానీ అనునది వదులుగా ఉండే ఒక రకమైన కుర్తా, పైజామా. సినిమాలలో చూపించబడే కాబూలీవాలాలు పఠానీ లలోనే కనబడతారు. ఇది ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, భారతదేశం లలో కనబడుతుంది.

షేర్వానీ[మార్చు]

షేర్వానీ దక్షిణ ఆసియాలో ధరించే కోటు వంటి వస్త్రం. ఇది పాకిస్థాన్ దేశపు జాతీయ వస్త్రంగా గుర్తించబడిననూ ఉత్తర భారతదేశనికి చెందిన ముస్లిం రాచరిక వంశాల వారు కూడా దీనిని ధరించేవారు. పైజామాతో వేసుకొన్న కుర్తా పై కానీ, కమీజ్ తో బాటు ధరించే సల్వార్ పై కానీ దీనిని ధరిస్తారు. బ్రిటీషు ఫ్రాక్ కోట్ ని సల్వార్ కమీజ్ని కలిపి రూపొందించినదే ఈ షేర్వానీ.

చిత్రమాలిక[మార్చు]

ఉత్తర అమెరికా దుస్తులు[మార్చు]

కౌబాయ్లుగా ప్రసిద్ధులైన ఉత్తర అమెరికన్లు దుస్తులను భారతీయులు రోజువారీ జీవితంలో ఎవరూ ధరించకున్ననూ ఆ పాత్రలు పోషించిన కథానాయకులు వీటిని ధరించారు. అయితే వీరు ధరించే జీన్స్ మాత్రం రోజువారీ జీవితంలో ధరిస్తున్నారు. ఈ క్రింది చిత్రాలలో ఈ దుస్తులను చూడవచ్చును.

చిత్రమాలిక[మార్చు]

స్త్రీల దుస్తులు[మార్చు]

స్కర్టు[మార్చు]

హ్యాంగరుకు వ్రేలాడదీసిన పోల్కా డాట్ లు గల ఒక స్కర్టు

స్కర్టు అనునది నడుము నుండి (లంగా వలె) వ్రేలాడుతూ కాళ్ళకు పూర్తిగా గానీ, కొంత భాగం గానీ ఆచ్ఛాదననిచ్చే ఒక పాశ్చాత్య వస్త్రము.

సాధారణంగా వీటిని స్త్రీలు ధరించిననూ, (స్కాట్లండు, ఐర్లండు వంటి) కొన్ని దేశాలలో పురుషులు కూడా వీటిని ధరిస్తారు.

కొన్ని కాలాలలో కొంత మంది వనితలు (ఉదా: రాణులు/మహారాణులు) మూడు మీటర్ల వ్యాసం ఉన్న పాదాల వరకు అచ్చాదననిచ్చే స్కర్టులని ధరించటం ఒక వైపు అయితే, 1960 లలో వచ్చిన మినిస్కర్టులు ప్యాంటీల కంటే కొద్దిగా పెద్దవిగా మాత్రం ఉండేవి.

గౌను[మార్చు]

గౌను అనునది బాలికలు లేదా స్త్రీలు వేసుకొనే ఒక వస్త్రము. ఇది గొంతు వద్ద నుండి తొడల/మోకాళ్ళ/పిక్కల/పాదాల వరకు ఆచ్ఛాదననిస్తుంది. ప్రస్తుతము మహిళలు వాడుతున్న నైట్ డ్రెస్ కూడా ఒక రకమైన గౌనే.

మిడి[మార్చు]

మిని[మార్చు]

మిని లేదా మిని-స్కర్టు అనునది మోకాళ్ళపై వరకు (సాధారణంగా తొడల వరకు) ఉండే స్కర్టు. పాశ్చాత్య దేశాలలో టీనేజీ యువతులతో బాటు అన్ని వయస్కుల స్త్రీలు వీటిని ధరించటానికి ఇష్టపడిననూ, భారతదేశంలో ఇది కేవలం నగరాలకి మాత్రమే పరిమితమైనది. కాకపోతే టెన్నిస్, ఫిగర్ స్కేటింగ్ క్రీడాకారిణులు, ఛీర్ లీడర్స్ వీటిని భారతదేశంలోనూ ధరించటం ఉంది.

మైక్రో మిని[మార్చు]

మైక్రో మిని స్కర్టు మినిస్కర్టు కంటే మరింత చిన్నదిగా ఉండే స్కర్టు. పొడవు అత్యల్పంగా ఉండే మైక్రో మినీల వలన తొడలపై భాగానికి కూడా ఆఛ్ఛాదన ఉండదు. అందుకే హాస్యాస్పదంగా దీనిని బెల్ట్ స్కర్టు అంటారు (బెల్టు కంటే కొద్దిగా పొడవు ఉంటుంది కాబట్టి).

వివిధ రకాల స్కర్టుల చిత్రమాలిక[మార్చు]

స్త్రీ పురుషులిరువురూ ధరించే (యూనిసెక్సువల్) దుస్తులు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచికలు[మార్చు]

మూలాలు[మార్చు]