కె.ఆర్. నారాయణన్

వికీపీడియా నుండి
(కె. ఆర్. నారాయణన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కె.ఆర్.నారాయణన్
కె.ఆర్. నారాయణన్


పదవీ కాలం
1997 జూలై 25 – 2002 జూలై 25
ప్రధాన మంత్రి ఐ.కె.గుజ్రాల్
అటల్ బిహారీ వాజపేయి
ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్
ముందు శంకర దయాళ్ శర్మ
తరువాత ఏ.పి.జె. అబ్దుల్ కలామ్

9వ ఉప రాష్ట్రపతి
పదవీ కాలం
1992 ఆగస్టు 21 – 1997 జూలై 24
అధ్యక్షుడు శంకర దయాళ్ శర్మ
ప్రధాన మంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు
అటల్ బిహారీ వాజపేయి
హెచ్.డి.దేవెగౌడ
ఐ.కె.గుజ్రాల్
ముందు శంకర దయాళ్ శర్మ
తరువాత కృష్ణకాంత్

వ్యక్తిగత వివరాలు

జననం (1921-02-04)1921 ఫిబ్రవరి 4
పెరుంథానం, ట్రావెన్స్‌కోర్, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం ఉఝవూర్, కేరళ, భారతదేశం)
మరణం 2005 నవంబరు 9(2005-11-09) (వయసు 85)
న్యూఢిల్లీ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి
(m. 1951⁠–⁠2005)
సంతానం చిత్ర నారాయణన్
అమృతా నారాయణన్
పూర్వ విద్యార్థి కేరళ విశ్వవిద్యాలయం (బి.ఎ., ఎం.ఎ.)
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ (బి.ఎస్.సి)
మతం హిందూ
సంతకం కె.ఆర్. నారాయణన్'s signature

కొచెరిల్ రామన్ నారాయణన్ (audio speaker iconవినండి ); (1921 ఫిబ్రవరి 4 - 2005 నవంబరు 9) భారతదేశ 10వ రాష్ట్రపతి. అతను ఉఝుపూర్ లోని ఒక దళిత కుటుంబంలో జన్మించాడు. పాత్రికేయుడిగా కొంతకాలం పనిచేసిన తర్వాత, ఉపకార వేతనం సహాయంతో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో రాజకీయ శాస్త్రాన్ని అధ్యయనం చేసాడు. నెహ్రూ ప్రభుత్వంలో భారత విదేశాంగ శాఖలో ఉద్యోగిగా నారాయణన్ తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. నారాయణన్ ప్రతిభను గుర్తించిన జవహర్ లాల్ నెహ్రూ ఆయనను రంగూన్ లోని భారత విదేశాంగ శాఖలో భారతదేశ ప్రతినిధిగా నియమించాడు. అతను జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్‌, థాయ్‌లాండ్, టర్కీ, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు దేశాలలో భారత రాయబారిగా పనిచేసాడు. అమెరికాలో భారత రాయబారిగా 1980 నుండి 1984 వరకూ నాలుగేళ్ళు పనిచేసాడు. అతనిని దేశంలో అత్యుత్తమ దౌత్యవేత్తగా నెహ్రూ పేర్కొన్నాడు. [1]

ఇందిరాగాంధీ అభ్యర్థన మేరకు రాజకీయాలలోకి ప్రవేశించి, మూడు సార్లు వరుసగా లోక్‌సభకు ఎన్నికైనాడు. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు.1992 లో 9వ భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనాడు. 1997 న భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు. 1997 స్వాతంత్ర్య స్వర్ణోత్సవ సంవత్సరం. ఆ సంవత్సరం ఒక దళితుడు రాష్ట్రపతిగా పదవినలంకరించడం దేశంలో ఒక మంచి మార్పుగా పేర్కొనబడింది. నారాయణన్ స్వతంత్ర, దృఢమైన అధ్యక్షుడిగా పేరుపొందాడు. అతను కొన్ని సంప్రదాయాలకు శ్రీకారం చుట్టి, రాజ్యాంగ కార్యాలయ పరిధిని విస్తరించాడు. అతను తనకు తాను "రాజ్యాంగం నాలుగు మూలల పరిథిలో" పనిచేసే "వర్కింగ్ ప్రెసిడేంట్" గా అభివర్ణించుకున్నాడు. ప్రత్యక్ష అధికారం కలిగిన "ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు", ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించకుండా లేదా చర్చ లేకుండా ఆమోదించే "రబ్బర్ స్టాంపు ప్రెసిడెంట్" కు మధ్యస్థమిది. [2]

అతను అధ్యక్షుడిగా తన విచక్షణాధికారాన్ని ఉపయోగించాడు. అనేక సందర్భాల్లో సాంప్రదాయిక పద్ధతుల నుండి ప్రక్కకు జరిగి వ్యవహరించాడు. వాటిలో హంగ్ పార్లమెంట్ లో ప్రధాన మంత్రి నియామకం, రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగిస్తూ, కేంద్ర మంత్రివర్గం ప్రతిపాదనపై అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం, కార్గిల్ పోరాట సమయంలో నిర్ణయాలు కూడా ఉన్నాయి. అతను భారత స్వాతంత్ర్య స్వర్ణోత్సవ వేడుకలకు అధ్యక్షత వహించాడు. 1998 లో జరిగిన దేశ సాధారణ ఎన్నికలలో, పదవిలో ఉండగా ఓటు వేసిన మొదటి భారత రాష్ట్రపతి అయ్యాడు.

ప్రారంభ జీవితం

కె.ఆర్.నారాయణన్ పెరుమథనం, ఉఝవూర్ గ్రామంలో పేద కుటుంబంలో కొచెరిల్ రామన్ వైద్యర్, పున్నత్తురవీట్టిల్ పాపియమ్మ దంపతులకు జన్మించాడు. అతని తండ్రి సిద్ధ, ఆయుర్వేద వైద్యం చేస్తుండేవాడు. అతని కుటుంబం ("పరవాన్" కులానికి చెందినవారు. వారు కులవ్యవస్థ ప్రకారం కొబ్బరికాయలను ఒలుస్తారు) పేదరికంతో ఉండేది. అతని తండ్రి వైద్యం చేయడం ద్వారా గౌరవాన్ని సంపాదించాడు. నారాయణన్ 1921, ఫిబ్రవరి 4 న జన్మించాడు. అతని మామయ్య అతన్ని పాఠశాలలో చేర్పించేటప్పుడు పుట్టినతేదీ సరిగా తెలియక 1921 అక్టోబరు 27 గా పాఠశాల రికార్డులలో నమోదు చేయించాడు. నారాయణన్ తరువాత ఆ తేదీనే అధికారికంగా ఉంచుకున్నాడు.

నారాయణన్ ప్రారంభ విద్యను ఉఝవూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించాడు. తరువాత అవర్ లేడీ అఫ్ లౌర్డెస్ అప్పర్ ప్రైమల్ స్కూల్, ఉళవూర్ (1931–35) లో చదివాడు. తన యింటి నుండి 15 కిలోమీటర్ల దూరంలో గల పాఠశాలకు వరిపొలాల గుండా నడుచుకొని వెళ్ళేవాడు. పాఠశాల విద్యకు ఫీజులు చెల్లించలేక పోయేవాడు. తరచుగా తరగతిగది వెలుపల నిలబడి పాఠాలు నేర్చుకునేవాడు. ట్యూషన్ ఫీజులు అధికంగా ఉండటం వల్ల తరగతి గదిలోనికి అతని హాజరును నిషేధించారు. ఆ కుటుంబం పుస్తకాలు కొనడానికి కూడా ఆర్థిక యిబ్బందులు పడేది. అతని అన్నయ్య కె.ఆర్. నీలకంఠన్ ఆస్త్మా రోగం వల్ల బాధపడుతూ గృహానికి పరిమితమయ్యాడు. నీలకంఠన్ ఇతర విద్యార్థుల నుండి పుస్తకాలను తీసుకొని, వాటిని నకలు చేసి, వాటిని నారాయణ్‌కి ఇచ్చేవాడు. నారాయణన్ సెయింట్ మేరీ హైస్కూలు, కురవిలంగడ్ లో (అంతకు ముందు 1935–36 లో సెయింట్ జాన్స్ హైస్కూలు కూతట్టుకుళంలో చదివాడు) మెట్రిక్యులేషన్ (1936–37) పూర్తిచేసాడు. ఇంటర్మీడియట్ విద్యను కొట్టయం లోని సి.ఎం.ఎస్ కళాశాలలో (1938–40) పూర్తిచేసాడు. ట్రావెన్స్‌కోర్ రాజ కుటుంబం నుండి ఉపకార వేతనాన్నిపొందాడు.


నారాయణన్ బి.ఎ (ఆనర్స్), ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ డిగ్రీలను ట్రావెన్స్‌కోర్ విశ్వవిద్యాలయం (ప్రస్తుతం కేరళ విశ్వవిద్యాలయం) నుండిపూర్తిచేసాడు. విశ్వవిద్యాలయంలో ప్రథమ శ్రేణిలో (ట్రావెన్స్‌కోర్ లో డిగ్రీలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడైన మొదటి దళిత విద్యార్థి) ఉత్తీర్ణుడయ్యాడు. అతని కుటుంబం తీవ్రమైన యిబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు అతను ఢిల్లీ వెళ్ళి ది హిందూ, ది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలలో పాత్రికేయుడిగా (1944–45) పనిచేసాడు. ఆ కాలంలో అతను తన స్వంత సంకల్పంతో 1945 ఏప్రిల్ 10న బొంబాయిలో మహాత్మా గాంధీని ఇంటర్వ్యూ చేసాడు[3] .1945లో నారాయణన్ లండన్ వెళ్ళి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ వద్ద హారోల్డ్ లాస్కీ అధ్యర్యంలో రాజనీతి శాస్త్రాన్ని అభ్యసించాడు. [4] అతను కార్ల్ పాప్పర్, లియోనెల్ రోబిన్స్, ఫ్రెడిరిచ్ హైక్ ఉపన్యాసాలకు హాజరయ్యేవాడు. జె.ఆర్.డి.టాటా అందించిన ఉపకార వేతనంతో రాజనీతి శాస్త్రం ప్రత్యేకాంశంగా బి.ఎస్.సి (ఆర్థిక శాస్త్ం) డిగ్రీ ఆనర్స్ ను పూర్తిచేసాడు.[5] లండన్ లో ఉన్నప్పుడు అతను (కె.ఎన్.రాజ్ అనే సహ విద్యార్థితో) వి.కె.కృష్ణమీనన్ అధ్వర్యంలోని ఇండియా లీగ్ లో క్రియాశీలకంగా పాల్గొన్నాడు. కె.ఎం.మున్షీ ప్రచురిస్తున్న సోషల్ వెల్ఫేర్ వారపత్రికకు అతను లండన్ విలేకరిగా వ్యవహరించాడు. కె.ఎన్.రాజ్, వీరసామి రింగాడూ (తరువాత కాలంలో మలేషియా మొదటి అధ్యక్షుడు) లతో కలసి ఒకే గదిలో ఉండేవాడు. అతనికి మరొక ఆప్త మిత్రుడు పియరీ త్రుదే (తరువాత కాలంలో కెనడా ప్రధానమంత్రి).

దూత, విద్యావేత్త

1948లో నారాయణన్ భారతదేశానికి తిరిగి వచ్చేటపుడు లాస్కీ, ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూకి పరిచయ లేఖను ఇచ్చాడు.[6] కొన్ని సంవత్సరాల తరువాత, అతను ప్రజాసేవలో తన వృత్తిని ఎలా ప్రారంభించాడో వివరించాడు:

నేను ఎల్.ఎస్.ఇ పూర్తి చేసినప్పుడు, లాస్కి స్వయంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూని పరిచయం చేసుకొనేందుకు లేఖను ఇచ్చాడు. ఢిల్లీ వచ్చిన తరువాత నేను ప్రధానమంత్రిని కలుసుకొనేందుకు అపాయింట్‌మెంటు కోరాను. లండన్ నుండి తిరిగి వచ్చిన భారతీయ విద్యార్ధిని కనుక నాకు సమయం ఇస్తారు అని నేను అనుకున్నాను. పార్లమెంట్ హౌస్ లో ఆయన నన్ను కలిసారు. మేము లండన్ గురించి కొన్ని నిమిషాలు మాట్లాడుకున్నాం. దాంతోటే నాకు మాట్లాడే సమయం అయిపోయింది. నేను వీడ్కోలు చెప్పి లాస్కీ ఇచ్చిన లేఖను అందచేసాను. వెలుపల గొప్ప వృత్తాకార కారిడార్లోకి అడుగు పెట్టాను. నేను సగం మార్గంంలో ఉండగా, వెనుక నుండి ఎవరో చప్పట్లు కొడుతున్న శబ్దాన్ని విన్నాను. వెనక్కి తిరిగితే, పండిట్ నెహ్రూ నన్ను రమ్మని పిలవడం కనబడింది. నేను ఆయన దగ్గరనుండి వచ్చేసిన తరువాత ఆయన ఆ లేఖను చదివాడు. "మీరు ఇంతకు మునుపు నాకు ఈ లేఖ ఎందుకు ఇవ్వలేదు?" అని నెహ్రూ ప్రశ్నించాడు. దానికి నేను "నన్ను క్షమించండి. నేను వెళ్ళేప్పుడు అది మీకు ఇస్తే సరిపోతుందని అనుకున్నాను" అని సమాధానమిచ్చాను. మరికొన్ని ప్రశ్నలు అడిగిన తరువాత, అతను మళ్ళీ నన్ను కలవమని చెప్పాడు. త్వరలోనే నేను భారత విదేశాంగ సర్వీసులోనికి ప్రవేశించాను.
2000 అక్టోబరు 3 న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిత్ తో కె.ఆర్.నారాయణన్.

1949లో అతను భారత విదేశాంగ సర్వీసులో (ఐ.ఎఫ్.ఎస్) నెహ్రూ అభ్యర్థన మేరకు చేరాడు. [7] అతను దౌత్యవేత్తగా రంగూన్, టోక్యో, కెనడా , హనోయ్ లలో పనిచేసాడు. థాయ్‌లాండ్(1967–69), టర్కీ (1973–75), చైనా(1976–78) ల భారత అంబాసిడర్ గా ఉన్నాడు. 1954 లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో బోధించాడు. అతను జవహర్‌లాల్ నెహ్రూ ఫెలోషిప్(1970–72) పొందాడు. అతను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో సెక్రటరీగా(1976) ఉన్నాడు. 1978 లో పదవీవిరమణ చేసిన తరువాత అతను న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలర్ గా 1979 జనవరి 3 నుండి 1980 అక్టోబరు 14 వరకు పనిచేసాడు. అతను ఈ అనుభవం తన ప్రజా జీవితానికి పునాదిగా అభివర్ణించాడు[8] తరువాత పదవీవిరమణ నుండి తిరిగి వచ్చి ఇందిరా గాంధీ ప్రభుత్వ కాలంలో 1980 నుండి 84 వరకు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో భారత అంబాసిడర్ గా తన సేవలనందించాడు. చైనాకు భారత రాయబారిగా నారాయణన్ పదవి, 1962 భారత-చైనా యుద్ధం తరువాత ఆ దేశంలో మొట్టమొదటి అగ్రశ్రేణి దౌత్య పదవి. 1982 లో రీగన్ అధ్యక్ష పదవీ కాలంలో అతను ఏర్పాటు చేసిన ఇందిరా గాంధీ వాషింగ్టన్ సందర్శన అమెరికాతో దెబ్బతిన్న సంబంధాలను బాగుచేయడానికి ఉపయోగపడింది.[9][10] 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా విదేశాంగ వ్యవహారాల మంత్రిగా ఉన్న నెహ్రూ కె.ఆర్. నారాయణన్ "దేశ ఉత్తమ దౌత్యవేత్త" అని అభిప్రాయపడ్డాడు. (1955)


కుటుంబం

అతను రంగూన్, బర్మా (మయన్మార్) లో పనిచేస్తున్నప్పుడు, మా టింట్ టింట్ ను కలిసాడు. తరువాత 1951 జూన్ 8 న ఆమెతో వివాహమయింది. మా టింట్ టింట్ "ప్రపంచ యువ మహిళా క్రిస్టియన్ అసోసియేషన్" లో క్రియాశీలక సభ్యురాలు. ఆమె లాస్కీ విద్యార్థిని. ఆమె తన పరిచయానికి ముందు రాజకీయ స్వేచ్ఛ గురించి మాట్లాడటానికి అతనిని సంప్రదించింది. నారాయణన్ ఐ.ఎఫ్.ఎస్, ఆమె విదేశీయురాలు అయినందున వారి వివాహానికి భారతీయ చట్టం ప్రకారం నెహ్రూ నుండి ప్రత్యేక మినహాయింపు అవసరమైంది. మా టింట్ టింట్ భారతీయ నామం "ఉషా" గా మార్చుకొని భారతీయ పౌరసత్వం తీసుకుంది. ఉషా నారాయణన్ (1923–2008) మహిళలు, పిల్లలకు సంబంధించిన అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో పనిచేసింది. ఆమె ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ లో మాస్టర్ డిగ్రీని చేసింది. [11] ఆమె బర్మా భాషలోని అనేక కథలను అనువాదం చేసి ప్రచురించింది. థిన్ పీ మైంట్ (బర్మా రచయిత) ద్వారా అనువదించబడిన కథల సంకలనం "స్వీట్ అండ్ సోర్" అనే శీర్షికతో 1998 లో కనిపించింది. విదేశీయ నేపథ్యం గల వారిలో భారతదేశంలో "ప్రథమ మహిళ"గా స్థానం పొందిన వారిలో ఆమె రెండవదానిగా గుర్తింపబడింది. వారికి ఇద్దరు కుమార్తెలు. వారు చిత్రా నారాయణన్ (స్విడ్జర్లాండ్, ద హోలీ సీ దేశాలకు భారత అంబాసిడర్)[12], అమృత.

రాజకీయ ప్రవేశం

ఇందిరా గాంధీ అభ్యర్థన మేరకు అతను రాజకీయాలలోనికి ప్రవేశించాడు. 1984, 1989, 1991 లలో వరుసగా మూడు సార్లు పాలక్కాడ్ (కేరళ) లోని ఒట్టపాళం నియోజకగర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొంది లోక్‌సభకు ఎన్నికయ్యాడు. అతను రాజీవ్ గాంధీ కేబినెట్ లో రాష్ట్ర వ్యవహారాల మంత్రిగా ఉన్నాడు. 1985 లో ప్లానింగ్ , 1985-86 మధ్య విదేశీ వ్యవహారాలు, 1986-89 మధ్య సైన్సు అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పదవులను స్వీకరించాడు. పార్లమెంటు సభ్యునిగా అతను అతను భారతదేశంలో పేటెంట్ నియంత్రణలను అణచడానికి అంతర్జాతీయ ఒత్తిడిని అడ్డుకున్నాడు. 1989 నుండి 1991 మధ్య కాలంలో కాంగ్రెస్ పదవిలో లేనందువల్ల ప్రతిపక్షంలో ఉన్నాడు. 1991లో కాంగ్రెస్ మరలా అధికారంలోనికి వచ్చిన తరువాత అతనికి ఏ కేబినెట్ పదవీ దక్కలేదు. అతనికి రాజకీయ విరోధి అయిన అప్పటి కేరళ ముఖ్యమంత్రి కె.కరుణాకరన్, కమ్యూనిస్టు భావజాలం కలిగి యున్నందున నారాయణన్ మంత్రి అయ్యే అవకాశం లేదని తెలిపాడు. అయితే, తాను మూడు ఎన్నికలలో కమ్యూనిస్ట్ అభ్యర్ధులను ఓడించినట్లు నారాయణన్ స్పష్టం చేశాడు.[8]

1992 ఆగస్టు 21 న నారాయణన్ భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నారాయణన్ పేరును మొదటి సారిగా జనతాదళ్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, పూర్వపు భారతదేశ ప్రధానమంత్రి వి.పి.సింగ్ ప్రతిపాదించాడు. జనతాదళ్ , పార్లమెంటులోని వామపక్ష పార్టీలు ఉమ్మడిగా అతనిని అభ్యర్థిగా ప్రకటించాయి. ఇది తరువాత పి.వి. నరసింహారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి మద్దతు పొందింది. ఇది అతని ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైంది. వామపక్షంతో తనకు గల సంబంధంపై నారాయణన్ తరువాత వివరించాడు[8]. అతనికి కమ్యూనిజం పై భక్తి గానీ విరోధం గానీ లేదని ప్రకటించాడు. వారు తన సైద్ధాంతిక వైవిధ్యాల గురించి తెలుసుకున్నారు కానీ తనకు ఉప రాష్ట్రపతిగా మద్దతునిచ్చారని, దేశంలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల కారణంగా ఇలా జరిగిందని తెలియజేసాడు. అతను వారి మద్దతు నుండి ప్రయోజనం పొందాడు. క్రమంగా వారి రాజకీయ స్థానాలు ఆమోదయోగ్యతను పొందాయి. 1992 డిసెంబరు 6 న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో "ఇది మహాత్మా గాంధీ హత్య తరువాత భారత్ ఎదుర్కొన్న గొప్ప దుర్ఘటన " అని ఆయన వివరించాడు.[2]

రాష్ట్రపతి పదవి

కె.ఆర్. నారాయణన్ 1997 జూలై 17 న భారత రాష్ట్రపతిగా ఎన్నుకయ్యాడు.[13] రాష్ట్రపతి ఎన్నికలలో అతనికి 95% ఎలక్టోరల్ కాలేజి ఓట్లు వచ్చినవి. ఈ ఎన్నికలు జూలై 14న జరిగింది. కేంద్రంలో మైనారిటీప్రభుత్వం ఉన్న సమయంలో జరిగిన ఏకైక అద్యక్షుని ఎన్నిక ఇది. అతనిని టి. ఎన్. శేషన్ ఏకైక ప్రత్యర్థి అభ్యర్థి. శివసేన తప్ప మిగతా ప్రధాన రాజకీయ పక్షాలన్నీ నారాయణన్‌కు ఈ అధ్యక్ష ఎన్నికలలో మద్దతు నిచ్చాయి.[14] నారాయణన్ కేవలం దళిత అభ్యర్థిగా ఎన్నికయ్యారని శేషన్ ఆరోపించాడు.

1997 జూలై 25న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్.వర్మ సమక్షంలో పార్లమెంటు సెంట్రల్ హాలులో దేశాధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసాడు. తన ప్రారంభోపదేశంలో[15] ఇలా అన్నాడు:

ఈ సమాజం అట్టడుగు స్థాయిలో పుట్టి, ఈ పవిత్ర భూమి పైనున్న దుమ్ము , ఉష్ణం లలో పెరిగిన కొందరు వ్యక్తులలో ఒకరిని అత్యున్న స్థాయి పదవి కోసం ఏకాభిప్రాయాన్ని తెలపడం మన సామాజిక, రాజకీయ వేదికపై సగటు మనిషి కేంద్రస్థాయికి చేరాడనడానికి సంకేతం. వ్యక్తిగతంగా నాకు కలిగిన గౌరవం కంటే కూడా ఈ ఎన్నికకున్న ఈ విస్తృత ప్రాముఖ్యత నాకు సంతోషాన్ని కలిగించింది.
స్వాతంత్ర్యం స్వర్ణోత్సవం

భారత దేశ స్వాత్రంత్ర్య స్వర్ణోత్సవ సంబరాలలో భాగంగా ఆగస్టు 14 అర్థరాత్రి పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో నారాయణన్ చేసిన ప్రసంగం ప్రధాన సంఘటన.[16] ఈ ప్రసంగంలో అతను ప్రజాస్వామ్య ప్రభుత్వం , రాజకీయాల స్థాపన స్వాతంత్ర్యం తరువాత భారతదేశ గొప్ప ఘనత అని అతను గుర్తించాడు.

తరువాత రోజు ఉదయం, భారత ప్రధానమంత్రి ఐ.కె.గుజ్రాల్ జాతినుద్దేశించి [17]ఎర్ర కోట పై నుండి ఇలా అన్నాడు:

మహాత్మా గాంధీ భారతదేశం యొక్క భవిష్యత్ గురించి కలలుగన్నప్పుడు, అతను దేశంలో ఒక దళితుడు రాష్ట్రపతిగా పదవినలంకరించినపుడు మాత్రమే నిజమైన స్వాతంత్ర్యం సాధించినట్లు తెలిపాడు. స్వాతంత్ర్యపు స్వర్ణోత్సవ సందర్భంగా ఇది మన గొప్ప అదృష్టం. మేము గాంధీ యొక్క ఈ కలను నెరవేర్చగలిగాము. కె.ఆర్.నారాయణన్ అనే వ్యక్తి గాంధీజీ కలను పూర్తిచేయగలిగాడు. దేశం గర్వపడేలా, మన దేశ అధ్యక్షుడు చాలా పేద, దళిత కుటుంబం నుండి వచ్చి గర్వంగా, గౌరవంగా రాష్ట్రపతి భవన్ లో ప్రవేశించాడు. ఈ దేశం మేధావుల మధ్య అతను రాష్ట్రపతిగా చాలా ఉన్నత స్థానాన్ని కలిగి ఉన్నందుకు నాకు మరింత ఆనందంగా ఉంది. ఇది మన సమాజంలో వెనుకబడిన వర్గాలు తమ నిజమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయని మన ప్రజాస్వామ్యం తెలియజేస్తుంది. ప్రస్తుతం దేశంలో మైనారిటీలు, షెడ్యూల్ కులాలు (దళితులు) లేదా షెడ్యూల్ తెగలు (ఆదివాసీలు) దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
ఎన్నికలలో పాల్గొనడం

1998 సార్వత్రిక ఎన్నికలలో నారాయణన్ రాష్ట్రపతి భవన్ సముదాయం లోని ఒక పాఠశాలలో నిర్వహింపబడుతున్న పోలింగు బూత్‌లో సామాన్య ఓటర్లతో కలసి వరుసలో నిలబడి ఓటు వేసి పదవిలో ఉండి ఓటు వేసిన మొదటి రాష్ట్రపతిగా గుర్తింపబడ్డాడు. ఈ ప్రక్రియను తన పూర్వపు రాష్ట్రపతులు వదిలి వేసినప్పటికి అతను ఓటు వేయడానికి పట్టుబట్టాడు. నారాయణన్ సాధారణ ఎన్నికలలో ఓటు వేయని భారతీయ అధ్యక్షుల సుదీర్ఘమైన ఆచారాన్ని మార్చాలని ప్రయత్నించాడు.[18][19] 1999 సార్వత్రిక ఎన్నికలలో కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.

రిపబ్లిక్ స్వర్ణోత్సవం

రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ భారత రిపబ్లిక్ స్వర్ణోత్సవాల సందర్భంగా 2000 జనవరి 26న జాతినుద్దేశించి చేసిన ప్రసంగం[20] ఒక మైలురాయిగా భావిస్తారు;[21] పెరుగుతున్న అసమానతల కారణంగా దేశం భారతీయ ప్రజలకు ఆర్థిక న్యాయం అందించడానికి (ముఖ్యంగా గ్రామీణ, వ్యవసాయ జనాభాకు) విఫలమైన అనేక మార్గాలను[22] విశ్లేషించడానికి ఒక అధ్యక్షుడు ప్రయత్నించడం ఇది మొదటిసారి. [23] ప్రజల్లో అసంతృప్తి ఉన్నదని, సమాజంలోని అణగద్రొక్కబడిన వర్గాలలో అది హింసతో బయటపడుతుందనీ తెలిపాడు. తరువాత రోజు అతను పార్లమెంటులో చేసిన ప్రసంగంలో [24] భారత రాజ్యంగ నిర్మాణంలో బి.ఆర్.అంబేద్కర్ పాత్రను కొనియాడాడు. ప్రభుత్వ స్థిరత్వం కోసం కంటే జవాబుదారీతనం, భాద్యతలు ముఖ్యమనే అంబేద్కర్ భావనతో ఏకీభవిస్తూ, రాజ్యాంగం మౌలిక నిర్మాణాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా హెచ్చరించాడు. తరువాత 2001 లోజరిగిన గణతంత్ర దినోత్సవంలో అతను ఈ బలమైన పదజాలాన్ని పునరుధ్ఘాటించాడు. [25]

అధ్యక్షునిగా విచక్షణా వ్యవహారాలు:

అధ్యక్షునిగా నారాయణన్ తన వివేచనా శక్తులను ఉపయోగించి అతను తీసుకున్న వివిధ నిర్ణయాలు, ఆలోచనను దేశానికి వివరించే ముఖ్యమైన ఆచరణను ప్రవేశపెట్టాడు; ఇది అధ్యక్షుడి పనితీరులో పారదర్శకతకు దారితీసింది.

ప్రధానమంత్రి నియామకం, పార్లమెంట్ రద్దు

నారాయణన్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో వివిధ రాజకీయ పార్టీలలో ఎవరికీ సభలో విశ్వాసం పొందవలసిన స్థితి లేదని వారితో సంప్రదింపుల ద్వారా నిర్ణయించుకున్న తరువాత లోక్ సభను రెండు సార్లు రద్దు చేయబడినది. 1997 నవంబరు 28 నాటికి ప్రభుత్వం ఏర్పాటు చేయవలసినదిగా షరతు విధించబడినపుడు ఐ.కె.గుజ్రాల్ ప్రభుత్వానికి మద్దతును అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరి ఉపసంహరించుకున్నాడు. గుజ్రాల్ లోక్ సభ రద్దుకు నారాయణన్‌కు సలహా ఇచ్చాడు. లోక్ సభలో ఎవ్వరూ మెజారిటీని సాధించలేరని అధ్యక్షుడు నారాయణన్ నిర్ణయించుకొని గుజ్రాల్ సలహాను స్వీకరించాడు.(డిసెంబరు 4) [26] తరువాత జరిగిన సాధారణ ఎన్నికలలో, భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో ఎక్కువ స్థానాలు పొందిన పార్టీగా అవతరించింది. ఈ పార్టీ దాని మిత్ర పక్షాలతో కలసి నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ (ఎన్.డి.ఎ) ఏర్పరచి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. ఆ సంకీర్ణ వర్గానికి అటల్ బిహారీ వాజపేయి నాయకత్వం వహిస్తూ తనకు సరైన సంఖ్యాబలం లేనప్పటికీ ప్రభుత్వ ఏర్పరచేందుకు నారాయణన్ కు కోరాడు. నారాయణన్ వారి కూటమితో సుస్థిర ప్రభుత్వం ఏర్పరచడానికి కావలసిన సంఖ్యా బలం పొందడానికి వివిధ పార్టీలు తమకు యిచ్చిన మద్దతు లేఖలను సమర్పించమని కోరాడు. ఎన్.డి.ఎ మిత్ర పక్షాల మద్దతుతో వాజ్‌పేయి ప్రధానమంత్రిగా (1998 మార్చి 15) న నియమితులైనాడు.[27] 10 రోజులలో పార్లమెంటులో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గాలనినిర్ణయించబడినది.[18]

ఈ మైనారిటీ ప్రభుత్వానికి మద్దతునిస్తున్న పార్టీలలో జయలలిత సారధ్యంలోని ఆన్నా డి.ఎం.కె 1999 ఏప్రిల్ 14 న మద్దతు ఉపసంహరించుకున్నట్లు రాష్ట్రపతికి లేఖ రాసింది. నారాయణన్ లోక్‌సభలో విశ్వాస పరీక్ష జరుపవలసినదిగా వాజ్‌పేయిని కోరాడు. ఏప్రిల్ 17న జరిగిన ఈ విశ్వాస పరీక్షలో వాజ్‌పేయి ఓడిపోయాడు. కొన్ని షరతులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయుటకు వాజ్‌పేయి, ప్రతిపక్ష నేత సోనియా గాంధీలు సిద్ధమయ్యారు. నారాయణణ్ ఎన్.డి.ఏ, కాంగ్రెస్ పార్టీలకు పార్లమెంటులో విశ్వసనీయత కోల్పోయినప్పటి నుండి మద్దతు పొందాయనడానికి కావలసిన రుజువులు చూపించమన్నాడు. ఇరు పక్షాలు సరియైన సాక్షాలను అందజేయలేకపోయాయి. పరిపాలనలో సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఏకైక మార్గంగా తాజా ఎన్నికలు నిర్వహించాలని నారాయణన్ ప్రధానమంత్రికి తెలియజేశాడు. వాజ్‌పేయి సలహాతో లోక్‌సభ రద్దయింది.(ఏప్రిల్ 26).[28] (తరువాత జరిగిన ఎన్నికలలో ఎన్.డి.ఎ కు సరిపడినంత సీట్లు వచ్చినప్పుడు వాజ్‌పేయి ప్రధానమంత్రి కాగలిగాడు. (1999 అక్టోబరు 11)

ఈ నిర్ణయాలలో, నారాయణన్ ప్రధానమంత్రి నియామకానికి కొత్త రూపకల్పనలు చేసాడు - ఏ పార్టీగానీ లేదా ఎన్నికల ముందు భాగస్వాములైన కూటమి గానీ మెజారిటీ పొందినపుడు, మిత్రపక్షాల నుండి మద్దతు లేఖలను సమర్పించడం ద్వారా తాను సభలో విశ్వాసంపొందుతానని ఒప్పించగలిగిన తరువాత మాత్రమే ఒక వ్యక్తి ప్రధాన మంత్రిగా నియమితుడవుతాడు. అతడు హంగ్ పార్లమెంటు విషయంలో వివిధ ప్రధాన మంత్రుల నియామకాల విషయంలో తనకు పూర్వం ఉన్న రాష్ట్రపతులైన నీలం సంజివరెడ్డి, ఆర్.వెంకటరామన్, శంకర్ దయాళ్ శర్మ లు చేసిన చర్యలను విస్తరించాడు.

తరువాత అతడు ఈ విషయంలో రెండు విధానాలను అవలంబించాడు. వాటిలో అతిపెద్ద పార్టీ లేదా ఎన్నికల ముందు జరిగిన కూటమి లలో నాయకుడు లోక్ సభలో విశ్వాసం పొందగలరనే పరిశీలన జరిగిన తరువాతనే అతనిని ఆహ్వానించాలి.

రాష్ట్రపతి పాలన అధికారం

అధ్యక్షుడు నారాయణన్ ఒక రాష్ట్రంలో రాజ్యాంగంలోని 356 అధికరణ క్రింద రాష్ట్రపతి పాలనను విధించేందుకు కేంద్ర మంత్రివర్గం చేసిన సిఫారసును పునఃపరిశీలించమని రెండు సార్లు కోరాడు; గుజ్రాల్ ప్రభుత్వం (1997 అక్టోబరు 22) ఉత్తర ప్రదేశ్ లోని కళ్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నప్పుడు[29], వాయ్‌పేయి ప్రభుత్వం (1998 సెప్టెంబరు 25) న బీహార్ లోని రబ్రీదేవి ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నప్పుడు[30] అతను ఈ విధంగా పునః పరిశీలను కోరాడు. ఈ రెండు సందర్భాలలో అతను నిర్ణయం తీసుకున్నప్పుడు 1994 లో జరిగిన ఎస్.ఆర్.బొమ్మై, కేంద్ర ప్రభుత్వం పై సుప్రీ కోర్డు ఇచ్చిన తీర్పును ఉదహరించాడు. రాష్ట్రపతి సూచనను మంత్రివర్గం గౌరవించింది. ఒక అధ్యక్షుడు ఇటువంటి పునఃపరిశీలనను కోరినప్పుడు, ఈ సంఘటనలు ఫెడరలిజం, రాష్ట్రప్రభుత్వాల అధికారాలను గూర్చి ముఖ్యమైన సంప్రదాయాన్ని నెలకొల్పింది.

కార్గిల్ వివాదం

కార్గిల్ యుద్ధం, భారత్, పాకిస్తాన్ మధ్య మే - జూలై 1999 లో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలో, మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్దానికి కారణం పాకిస్తాన్ సైనికులు, కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం.[31] ఈ సందర్భంలో వాజ్‌పేయి ప్రభుత్వం పార్లమెంటులో విశ్వాస పరీక్షను వీగిపోయింది. ప్రతిపక్షం కూడా ప్రభుత్వం ఏర్పాటుకు విఫలమైంది. లోక్‌సభ రద్దు కాబడినందువల్ల ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతుంది. ఇటువంటి సందర్భంలో ప్రధాన ప్రభుత్వ నిర్ణయాన్ని పార్లమెంటులో చర్చించబడి ఆమోదించబడిన తరువాత అంగీకరిచవలసి ఉన్నందున, సుస్థిర ప్రభుత్వం లేకపోవడం వల్ల ఇది ప్రజాస్వామ్య జవాబుదారీతనంతో ఒక సమస్యకు దారితీసింది. ఈ సంఘర్షణపై చర్చించడానికి సమావేశం జరపాలని అనేక ప్రతిపక్ష పార్టీల డిమాండ్ చేసిన ఫలితంగా రాజ్యసభలో చర్చించమని వాజ్‌పేయిని నారాయణన్ సూచించాడు. అయితే ఆతను రాజ్యసభను అంతరాయం కలిగించే విధంగా ఉన్న రాజ్యసభ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు.[32] అంతేగాక, భారతీయ సైనిక దళాల ముగ్గురు సైన్యాధిపతులతో ఈ సంఘర్షణపై నారాయణన్ వివరించాడు. మరుసటి సంవత్సరం అతని రిపబ్లిక్ డే ప్రసంగం దేశాన్ని కాపాడటానికి మరణించిన సైనికులకు గౌరవించడం ద్వారా మొదలైంది.[20]

తరువాత జీవితం

భారత రాష్ట్రపతిగా పదవీవిరమణ చేసిన తరువాత కె.ఆర్. నారాయణన్ తన భార్య ఉషతో పాటు తన మిగిలిన జీవితాన్ని సెంట్రల్ ఢిల్లీ బంగ్లా (34 ఫృధ్వీ రోడ్) లో గడిపాడు. ముంబై (21 జనవరి 2004) లో వరల్డ్ సోషల్ ఫోరమ్ (WSF) "ప్రత్యామ్నాయ ప్రపంచీకరణ ఉద్యమానికి" తన మద్దతును అందించాడు.

అతను సిద్ధ, ఆయుర్వేదం కోసం నవజ్యోతిశ్రీ కరుణాకర గురు పరిశోధనా కేంద్రాన్ని స్థాపించడానికి ఉఝావూరు నుండి పోథెన్‌కోడ్ లోని సంతిగిరి ఆశ్రమానికి వెళ్ళాడు. [33]

కె.ఆర్.నారాయణన్ 2005 నవంబరు 9 న తన 85వ యేట న్యూఢిల్లీ లో మరణించాడు. అతనికి హిందూ ధర్మ శాస్త్రంప్రకారం దహన కార్యక్రమాలను సైనిక లాంఛనాలతో చేసారు. ఇది రాజ్‌ఘాట్ కు సమీపంలోని "కర్మ భూమి" లో జరిగింది.

కె.ఆర్.నారాయణన్ ఫౌండేషన్

కె.ఆర్.నారాయణన్ ఫౌండేషన్ (K.R.N.F) 2005లో స్థాపించబడినది. ఇది కె.ఆర్.నారాయణణ్ జ్ఞాపకార్థం అతని ఆదర్శాలను ప్రచారం చేయుటకు ప్రారంభించబడింది. దీని లక్ష్యం కేరళ సమాజంలోని దుర్బల వర్గాలైన మహిళలు, పిల్లలు, అంగవైకల్య వ్యక్తులు, వృద్ధులు, ఇతర వెనుకబడిన వర్గాలకు విద్యా శిక్షణను అందిచడం, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం, వారిజీవన పరిస్థితులను మెరుగుపరచడాం, వారి కుటుంబాలను బలోపేతం చేయడం వంటి కార్యక్రమాలద్వారా మంచి భవిష్యత్తునందించడం.

ఈ ఫౌండేషన్ పధ్ధతులు ఐదు ముఖ్యమైన అంశాల చుట్టూ తిరుగుతుంది;

  • పేదలకు పర్యావరణ అనుకూల గ్రామీణ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించడం ద్వారా శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోధన, అభివృద్ధి
  • మానవ వనరుల అభివృద్ధి
  • దృక్పథ మార్పు, స్వీయ నిర్వహణ
  • పేద ప్రజల ఆర్థికాభివృద్ధి

ప్రజాజీవితం, జర్నలిజం, సివిల్ సర్వీస్, మెడికల్ సైన్స్, సమాజ సేవ,సాహిత్యం, క్రీడలు, వినోదం, రాజకీయం వంటి జాతీయ ప్రాముఖ్యత ఉన్న రంగాలలోని గొప్పవారిని గుర్తించి ఫౌండేషన్ ఉత్తమంగా గౌరవించడం.

ఈ ఫౌండేషన్ కె.ఆర్. నారాయణన్ జీవితంపై డాక్యుమెంటరీ (మలయళం,ఆంగ్లం) లను తయారుచేసింది. ఈ డాక్యుమెంటరీలో కె.ఆర్ నారాయణన్ జ్ఞాపకార్థం అతని అడుగు జాడలు పేరుతో అతని ఆదర్శాలను ప్రచారం చేయుటం జరిగింది. ఈ డాక్యుమెంటరీకి సీనియర్ జర్నలిస్టు సన్నీ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. డాక్యుమెంటరీ కథను ఈ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ అయిన ఎబే జె.జోస్ రచించిన జీవిత చరిత్ర ఆధారంగా తీసుకున్నారు. ఈ డాక్యుమెంటరీ డి.వి.డి కాపీలను అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రజా గ్రంథాలయాలకు అందజేసారు.

ఈ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ఎబే జె. బోస్ కె,ఆర్. నారాయణన్ జీవిత చరిత్రను కె.ఆర్. నారాయణన్ భారతతింటె సూర్యతేజస్సుపేరుతో పుస్తకం రాసాడు. ఇది మలయాళ భాషలో రాయబడింది.

మూలాలు

  1. Manmohan Singh: Condolence message Archived 27 సెప్టెంబరు 2007 at the Wayback Machine. Retrieved 24 February 2006.
  2. 2.0 2.1 Interview with K. R. Narayanan on Independence day, 15 August 1998; by N. Ram, Editor, Frontline ["K. R. Narayanan in conversation with N. Ram", The Hindu, 10 November 2005. Retrieved 24 February 2006].
  3. K. R. Narayanan's interview with M. K. Gandhi, 10 April 1945; given in full in H. Y. Sharada Prasad: "How an interview with Gandhi was spiked", The Asian Age, n.d. Retrieved 24 February 2006.
  4. LSE counts K. R. Narayanan among its distinguished alumni Archived 3 ఫిబ్రవరి 2009 at the Wayback Machine; his portrait has been unveiled and placed in a position of honour; B. R. Ambedkar is the only other Indian to have been similarly honoured. . Retrieved 24 February 2006."Archived copy". Archived from the original on 3 February 2009. Retrieved 2005-09-08.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  5. Some of his experiences as a Tata fellow are recounted here [1]. . Retrieved 24 February 2006. Archived 30 జూన్ 2008 at the Wayback Machine
  6. Gopalkrishna Gandhi: "A remarkable life-story", Frontline 22 (24), 5–18 November 2005. Retrieved 24 February 2006.
  7. Haresh Pandya: "K. R. Narayanan: Indian president from downtrodden caste", The Guardian, 29 November 2005. Retrieved 6 March 2006.
  8. 8.0 8.1 8.2 P. T. Thomas: "Interview with K. R. Narayanan", Maanavasamskruthi 1 (8), February 2005, in Malayalam. English translation of part of the interview, at CHRO web page: Part I Archived 28 సెప్టెంబరు 2007 at the Wayback Machine; Part II Archived 12 అక్టోబరు 2008 at the Wayback Machine. Additional translation of question on his relationship with the Left front in "Narayanan criticises Vajpayee for Gujarat riots", The Hindu, 10 November 2005. Retrieved 24 February 2006.
  9. His speech Archived 30 జూన్ 2006 at the Wayback Machine at Peking University while on a state visit, briefly describes his vision of relations between India and China. (Retrieved 24 February 2006.) Narayanan spoke Chinese, and had a scholarly knowledge of Chinese culture and history, particularly the cultural exchanges between the two countries. His visit as President eased tensions that had developed with China after the Pokhran nuclear tests.
  10. His banquet speech Archived 30 జూన్ 2006 at the Wayback Machine welcoming Bill Clinton to Rashtrapati Bhavan briefly describes his vision of relations between India and the USA. . Retrieved 24 February 2006.
  11. "Her Excellency Tin Tin". The OutLook. 2 July 2013. Retrieved 25 February 2013.
  12. "Chitra Narayanan concurrently accredited Ambassador to Holy See". News.oneindia.in. 7 August 2008. Retrieved 10 January 2012.
  13. "Results of Presidential poll". Archived from the original on 1 August 1997. Retrieved 2017-04-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link), 17 July 1997. Archived Aug. 1997.
  14. Diwanji, Amberish K. (1997). "The importance of a dalit President". Rediff. Retrieved 2 May 2006.
  15. K. R. Narayanan: "Inaugural address". Archived from the original on 4 August 1997. Retrieved 2017-04-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link), 25 July 1997. Archived Aug. 1997.
  16. K. R. Narayanan: Address on the golden jubilee of Indian independence Archived 30 జూన్ 2006 at the Wayback Machine, 15 August 1997. Retrieved 24 February 2006.
  17. I. K. Gujral: Address to the nation from the ramparts of the Red fort on the golden jubilee of Indian independence, 15 August 1997. Retrieved 24 February 2006.
  18. 18.0 18.1 Sukumar Muralidharan: "A role for the President" Archived 28 జూన్ 2006 at the Wayback Machine, Frontline 15 (5), 7–20 March 1998. Retrieved 24 February 2006.
  19. Sukumar Muralidharan: "A presidential intervention" Archived 23 సెప్టెంబరు 2005 at the Wayback Machine, Frontline 18 (3), 3–16 February 2001. Retrieved 24 February 2006.
  20. 20.0 20.1 K. R. Narayanan: Address to the nation on the golden jubilee of the Republic, 26 January 2000. Retrieved 24 February 2006. Archived 24 మార్చి 2015 at the Wayback Machine
  21. V. Venkatesan: "A wake-up call" Archived 18 ఫిబ్రవరి 2005 at the Wayback Machine, Frontline 17 (3), 5–18 February 2000. Retrieved 17 March 2006.
  22. P. Sainath:"Iron in the soul, decay in the brain" Archived 13 అక్టోబరు 2005 at the Wayback Machine, Frontline 17 (3), 5–18 February 2000. Retrieved 17 March 2006.
  23. Ammu Joseph: "Areas of darkness", Humanscape, April 2000 Archived 3 జూలై 2010 at the Wayback Machine
  24. K. R. Narayanan: Address to parliament on the golden jubilee of the Republic, 26 January 2000. Retrieved 24 February 2006.
  25. K. R. Narayanan: Address on Republic day, 26 January 2001. Retrieved 24 February 2006. Archived 10 ఏప్రిల్ 2009 at the Wayback Machine
  26. K. R. Narayanan: "Rashtrapati Bhavan communique concerning the dissolution of the eleventh Lok Sabha". Archived from the original on 19 January 1998. Retrieved 2017-04-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link), 4 December 1997. Archived Jan. 1998.
  27. K. R. Narayanan: "Rashtrapati Bhavan communique concerning the appointment of the Prime minister". Archived from the original on 18 February 1999. Retrieved 2017-04-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link), 15 March 1998. Archived Feb. 1999.
  28. K. R. Narayanan: "Rashtrapati Bhavan communique concerning the dissolution of the twelfth Lok Sabha". Archived from the original on 20 February 2001. Retrieved 2017-04-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link), 26 April 1999. Archived Feb. 2001.
  29. Venkitesh Ramakrishnan, Praveen Swami: "A crisis defused" Archived 16 డిసెంబరు 2004 at the Wayback Machine, Frontline 14 (22), 1–14 November 1997. Retrieved 24 February 2006.
  30. Praveen Swami, Sudha Mahalingam: "The BJP's Bihar fiasco", Frontline 15 (21), 10–23 October 1998. Retrieved 24 February 2006.
  31. "1999 Kargil Conflict". GlobalSecurity.org. Retrieved 2009-05-20.
  32. V. Venkatesan: "Political echoes" Archived 29 జూన్ 2006 at the Wayback Machine, Frontline 16 (15), 17–30 July 1999. Retrieved 24 February 2006.
  33. Manmohan Singh: Speech Archived 5 అక్టోబరు 2006 at the Wayback Machine on the dedication of K. R. Narayanan's tharavaadu for establishing a research centre in Indian medicine (Navajyothisree Karunakara Guru research centre for Siddha and Ayurveda), 15 February 2005. Retrieved 24 February 2006.
రాజకీయ కార్యాలయాలు
అంతకు ముందువారు
శంకర దయాళ్ శర్మ
భారత ఉపరాష్ట్రపతి
1992–1997
తరువాత వారు
కృష్ణకాంత్
భారత రాష్ట్రపతి
1997–2002
తరువాత వారు
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.