Jump to content

గురజాడ అప్పారావు

వికీపీడియా నుండి
గురజాడ అప్పారావు
గురజాడ అప్పారావు
జననంఅనకాపల్లి జిల్లా, ఎలమంచిలి తాలూకా, యస్. రాయవరం గ్రామం
మరణంనవంబరు 30, 1915
నివాస ప్రాంతంఅనకాపల్లి జిల్లా, ఎలమంచిలి తాలూకా, యస్. రాయవరం గ్రామం
ఇతర పేర్లుగురజాడ
వృత్తిరచయిత
సంఘ సంస్కర్త
సాహితీకారుడు
హేతువాది
అభ్యుదయ కవి
ఉద్యోగంరచయిత, కవి
ప్రసిద్ధిగురజాడ కన్యాశుల్కం
జీతం500
పదవి పేరుతెలుగు భాష మహాకవి
మతంహిందూ
భార్య / భర్తఅప్పల నరసమ్మ
పిల్లలుఓలేటి లక్ష్మి నరసమ్మ
వెంకట రామదాసు
పులిగెడ్డ కొండయ్యమ్మ
తండ్రివెంకట రామదాసు
తల్లికౌసల్యమ్మ

గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21 - 1915 నవంబర్ 30) ప్రముఖ తెలుగు రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. హేతువాది. 19వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. అతను ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేసారు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో అతను సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. అతనుకు *కవి శేఖర* అనే బిరుదు ఉంది.

బాల్యం-విద్యాభ్యాసం

[మార్చు]

గురజాడ అప్పారావు విశాఖ జిల్లా, యస్.రాయవరం లో, మేనమామ ఇంట్లో 1862 సెప్టెంబరు 21 న, వెంకట రామదాసు, కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు. అతనికి శ్యామలరావు అనే తమ్ముడు ఉన్నాడు. గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా, గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది. అప్పారావు తండ్రి విజయనగరం సంస్థానంలో పేష్కారుగా, రెవెన్యూ సూపర్వైజరు గాను, ఖిలేదారు గానూ పనిచేసాడు. తన పదవ ఏట వరకు అప్పారావు చీపురుపల్లిలో చదువుకున్నాడు. తర్వాత, వారి తండ్రి కాలం చెయ్యటంతో, విజయనగరానికి వచ్చారు. ఇక్కడ చాలా పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించాడు. ఈ సమయంలో అప్పటి ఎమ్. ఆర్. కళాశాల ప్రధానాధ్యాపకులు సి. చంద్రశేఖర శాస్త్రి ఇతన్ని చేరదీసి ఉండడానికి చోటిచ్చాడు. 1882లో మెట్రిక్యులేషను పూర్తిచేసి, తర్వాత 1884లో ఎఫ్.ఎ చేసాడు. ఇదే సంవత్సరంలో ఏం. ఆర్. ఉన్నత పాఠశాల లో ఉపాధ్యాయునిగా చేరాడు. విజయనగరంలో బి.ఏ చదువుతున్నపుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి అతనుకు సహాధ్యాయి. వారిద్దరూ ప్రాణస్నేహితులు. ప్రతి ఏటా గురజాడ జన్మదిన వేడుకను యస్.రాయవరం ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు.

వివాహం-సంతానం

[మార్చు]
గురజాడ చిత్రపటం

1885లో అప్పారావు అప్పల నరసమ్మగారిని వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం - ఇద్దరు కుమార్తెలూ, ఒక కుమారుడు. 1887లో మొదటి కుమార్తె ఓలేటి లక్ష్మి నరసమ్మ జన్మించింది. 1890లో కుమారుడు వెంకట రామదాసు, 1902లో రెండవ కుమార్తె పులిగెడ్డ కొండయ్యమ్మ జన్మించింది.

ఉద్యోగాలు

[మార్చు]

అప్పటి కళింగ రాజ్యంగా పేరుపొందిన విజయనగరంలోనే అప్పారావు నివసించాడు. విజయనగర సంస్థాన పూసపాటి గజపతి రాజులతో అతనుకు మంచి సంబంధాలు ఉండేవి. 1887లో విజయనగరం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో అతను మొదట ప్రసంగించాడు. ఇదే సమయంలో సాంఘిక సేవకై విశాఖ వాలంటరీ సర్వీసులో చేరాడు. 1889లో ఆనంద గజపతి డిబేటింగ్ క్లబ్బుకు ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇదే సమయంలో తమ్ముడు శ్యామలరావుతో కలిసి ఆంగ్లంలో పద్యాలు రాసాడు. వీరు రాసిన ఆంగ్ల పద్యం సారంగధర, ఇండియన్ లీషర్ అవర్ (Indian leisure hour) లో చదివినప్పుడు అందరూ మెచ్చుకున్నారు. అప్పుడే కలకత్తాలో ఉన్న రీస్ అండ్ రోయిట్ ప్రచురణకర్త శంభుచంద్ర ముఖర్జీ విని, అప్పారావును తెలుగులో రచన చేయడానికి ప్రోత్సహించాడు. ఆంగ్లంలో యెంత గొప్పగా వ్రాసినా అది పరభాషేనని, తన మాతృభాషలో వారు ఇంకా గొప్పగా వ్రాయగలరని అతడన్నాడు. ఇండియన్ లీషర్ అవర్ ఎడిటరు గుండుకుర్తి వెంకట రమణయ్య కూడా అతనిని ఇదే త్రోవలో ప్రోత్సహించాడు. 1891లో విజయనగర సంస్థానంలో సంస్థాన శాసన పరిశోధకునిగా గురజాడ నియామకం పొందాడు.

1897లో మహారాజా ఆనంద గజపతి చిన్న వ్యాధితో కాలం చేసినప్పుడు, రీవా మహారాణి, అప్పల కొండమాంబ గార్లకు వ్యక్తిగత కార్యదర్శిగా అప్పారావు నియమితుడయ్యారు. 1884లో మహారాజా కాలేజి వారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. 1886లో డిప్యూటీ కలెక్టరు కార్యాలయంలో హెడ్‌ క్లర్కు పదవినీ, 1887లో కళాశాలలో అధ్యాపక పదవినీ నిర్వహించాడు. 1886లో రాజా వారి ఆస్థానంలో చేరాడు. 1911లో మద్రాసు యూనివర్సిటీ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌లో సభ్యత్వం లభించింది.

కన్యాశుల్కం

[మార్చు]

గిడుగు రామమూర్తితో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించాడు. (కచ్చితమైన సంవత్సరం తెలియ రాలేదు). ఆ రోజుల్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. 1892లో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది.[1] 1897లో కన్యాశుల్కం తొలి కూర్పును మహారాజా ఆనందగజపతికి అంకితమిచ్చాడు. ఇప్పుడు మనకు దొరుకుతున్న కన్యాశుల్కం రెండవ కూర్పును 1909లో రచించాడు.[2]

1892లో గురజాడ వారి కన్యాశుల్కం నాటకాన్ని తొలిసారిగా ప్రదర్శించారు. మొదటి ప్రదర్శనకే ఎంతో పేరు వచ్చింది. దీనితో సాహిత్యంలో వాడుక భాష ప్రయోగానికి ఒక రకంగా నాంది పలికింది అని చెప్పవచ్చు. సాంఘిక ఉపయోగంతో పాటు రసజ్ఞుల ఆనందానికి కూడా వాడుక భాష వాడవచ్చని ఈ నాటకం నిరూపించింది. దీని విజయంతో, అప్పారావు ఈ ఆలోచన సరళిని అవలంబించి ఇతర సాహిత్యకర్తలను వెదకసాగారు. ఈ సరళికి అతని చిన్ననాటి స్నేహితుడు చీపురుపల్లిలో తన సహాధ్యాయి అయిన గిడుగు రామమూర్తి ముఖ్యుడు. వాడుక భాష ప్రయోగానికి వ్యతిరేకి అయిన కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి కూడా ఈ నాటకం సాహితీ విలువలను ప్రశంసించడంతో అప్పారావుకు ఎంతో పేరు వచ్చింది. 1896లో ప్రకాశిక అన్న పత్రికను మొదలుపెట్టాడు. 1897లో కన్యాశుల్కాన్ని వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు వారు ప్రచురించారు. అప్పారావు దీన్ని మహారాజా ఆనంద గజపతికి అంకితం ఇచ్చాడు. 1909 ఆరోగ్యం కుదుట పడడానికి నీలగిరి కొండల్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కన్యాశుల్కం తిరగ రాసాడు. 1910లో రాసిన దేశమును ప్రేమించుమన్నా అనే దేశభక్తి గీతం ఎంతో ప్రసిద్ధి పొందింది. 1911లో మద్రాసు విశ్వవిద్యాలయం బోర్డు అఫ్ స్టడీస్లో నియమించబడ్డారు. అదే సంవత్సరంలో, స్నేహితులతో కలిసి ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రారంభించాడు.

అస్తమయం

[మార్చు]

1913లో అప్పారావు పదవీ విరమణ చేసాడు. అప్పటినుండి అనారోగ్యంతో బాధపడ్డారు. ఇదే సమయంలో మద్రాస్ విశ్వవిద్యాలయం వారు "ఫెలో" తో గౌరవించారు. చివరికి, 53 సంవత్సరాల వయసులో 1915 నవంబరు 30 న గురజాడ అప్పారావు మరణించారు.

వ్యవహారిక భాషోద్యమంలో

[మార్చు]

20వ శతాబ్ది తొలినాళ్ళలో జరిగిన వ్యవహారిక భాషోద్యమంలో గురజాడ అప్పారావు తన సహాధ్యాయి గిడుగు రామమూర్తి పంతులుతో కలిసి పోరాటం సలిపారు. వారిద్దరూ కలిసి పత్రికల్లో, సభల్లో, మద్రాసు విశ్వవిద్యాలయంలో గ్రాంథిక భాషావాదులతో అలసట ఎరగకుండా తలపడ్డారు.గిడుగు వాదనాబలానికి, గురజాడ రచనాశక్తి వ్యావహారిక భాషోద్యమానికి వినియోగపడ్డాయి.[2].

సాహితీ చరిత్ర

[మార్చు]

కన్యాశుల్కం

[మార్చు]
గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కము (నాటకం)

గురజాడ రచనల్లో కన్యాశుల్కము (నాటకం) అగ్రగణ్యమైంది. కన్యాశుల్కం దురాచారాన్ని విమర్శిస్తూ గురజాడ రచించిన ఈ నాటకం భారతీయ భాషల్లో వెలువడిన అత్యుత్తమమైన రచనలలో ఒకటి. 1892లో ప్రచురించిన మొదటి కూర్పుకు ఎన్నో మార్పులు చేసి 1909లో రెండవ కూర్పును ప్రచురించాడు. వాడుక భాషలో, విజయనగర ప్రాంత యాసలో రాసిన ఈ నాటకం 100 సంవత్సరాల తరువాత కూడా ఈ నాటికీ పాఠకులను అలరిస్తూ ఉంది. ఈ నాటకం కన్నడం, ఫ్రెంచి, రష్యన్‌, ఇంగ్లీషు (2 సార్లు), తమిళం, హిందీ (2 సార్లు) భాషల్లోకి అనువాదమైంది.

గురజాడ మరణం తరువాత కన్యాశుల్కం పై ఎన్నో వివాదాలు రేగాయి. అది అసలు అతను రాయనేలేదనీ, వేరెవరో రాస్తే, తన పేరు వేసుకున్నారని ఒకటి; అతను ఇంగ్లీషులో రాస్తే, వేరే ఒకాయన దానిని తెలుగు లోకి అనువదించారని మరొకటి, ఇలాగ కొన్ని వివాదాలు రేగాయి. చివరికి ఆ వాదనలన్నీ అసత్యాలని తేలిపోయాయి. ఈ వివాదాలన్నీ గురజాడ మరణం తరువాత వచ్చినవే. ఇన్ని వివాదాల మధ్యా కన్యాశుల్కం కొన్ని వందల ప్రదర్శనలు పూర్తి చేసుకుంది. 100 ప్రదర్శనలు పూర్తి చేసుకున్న మొదటి తెలుగు సాంఘిక నాటకమదే!

పుత్తడి బొమ్మా పూర్ణమ్మా అనే సుప్రసిద్ధ గేయం అతను రచనల్లో మరొకటి. దీని ఇతివృత్తం కూడా కన్యాశుల్కము దురాచారమే. కరుణ రసాత్మకమైన ఈ గేయ కావ్యంలోని చివరి పద్యం ఇది:

కన్నుల కాంతులు కలువల చేరెను
మేలిమి జేరెను మేని పసల్‌
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ
పుత్తడి బొమ్మా పూర్ణమ్మా

దేశమును ప్రేమించుమన్నా

[మార్చు]

అతను రాసిన ప్రముఖ గేయం లోని ఒక భాగం ఇది:

పూర్తి గేయాన్ని కూడా చదవండి.
దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టవోయ్
గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌

పాడి పంటలు పొంగిపొరలే దారిలో

నువ్వు పాటు పడవోయ్

తిండి కలిగితే కండకలదోయ్

కండకలవాడేను మనిషోయ్

ఈసురోమని మనుషులుంటే

దేశమే గతి బాగుపడునోయ్‌

జల్దుకొని కళలెల్ల నేర్చుకు

దేశి సరకులు నింపవోయ్‌

అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్

దేశి సరుకుల నమ్మవలెనోయి;

డబ్బు తేలేనట్టి నరులకు

కీర్తి సంపద లబ్బవోయి

వెనక చూసిన కార్యమేమోయి

మంచి గతమున కొంచెమేనోయి

మందగించక ముందు అడుగేయి

వెనుకపడితే వెనకే నోయి

పూను స్పర్థను విద్యలందే

వైరములు వాణిజ్యమందే;

వ్యర్థ కలహం పెంచబోకోయ్

కత్తి వైరం కాల్చవోయ్

దేశాభిమానం నాకు కద్దని వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌

పూని ఏదైనాను ఒక మేల్‌

కూర్చి జనులకు చూపవోయ్‌

ఓర్వలేమి పిశాచి దేశం

మూలుగులు పీల్చే సెనోయ్;

ఒరుల మేలుకు సంతసిస్తూ

ఐకమత్యం నేర్చవోయ్

పరుల కలిమికి పొర్లి యేడ్చే

పాపి కెక్కడ సుఖం కద్దోయ్;

ఒకరి మేల్ తన మేలనెంచే

నేర్పరికి మేల్ కొల్లలోయ్

సొంత లాభం కొంత మానుకు

పొరుగు వానికి తోడుపడవోయ్‌

దేశమంటే మట్టి కాదోయ్‌

దేశమంటే మనుషులోయ్‌

చెట్టపట్టాల్‌ పట్టుకొని

దేశస్థులంతా నడువవలెనోయ్‌

అన్నదమ్ముల వలెను జాతులు

మతములన్నియు మెలగవలెనోయ్‌

మతం వేరైతేను యేమోయ్

మనసు లొకటై మనుషులుంటే;

జాతమన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయ్

దేశమనియెడి దొడ్డ వృక్షం

ప్రేమలను పూలెత్తవలెనోయ్;

నరుల చమటను తడిసి మూలం

ధనం పంటలు పండవలెనోయ్

ఆకులందున అణగిమణగీ

కవిత కోవిల పలకవలెనోయ్;

పలుకులను విని దేశమందభి

మానములు మొలకెత్తవలెనోయ్

ఇతర రచనలు

[మార్చు]

ప్రభావం

[మార్చు]

సానుకూలాంశాలు

[మార్చు]

వివాదాలు, వ్యతిరేకత

[మార్చు]

గురజాడను వ్యతిరేకించినవారు ప్రధానంగా అతను భావాల విషయంలో కొందరు, సాహిత్యపరంగా అతను వాడుక భాష విషయకంగా మరికొందరు వ్యతిరేకించారు. అతను సంస్కరణలను సమర్థిస్తూ, సాంఘికాంశాల విషయంలో అతని అభిప్రాయాలను వ్యతిరేకించినవారు భావాల విషయంలో వ్యతిరేకులు కాగా, గ్రాంథిక భాష సమర్థకులు అతన్ని వాడుక భాష విషయంలో వ్యతిరేకించారు.

1955 మార్చి 13 న (అప్పారావు మరణించిన దాదాపు 40 ఏళ్ళ తరువాత) జయంతి కుమారస్వామి ఆంధ్ర పత్రికలో రాసిన ఒక వ్యాసంతో ఒక పెద్ద వివాదం చెలరేగింది.

పూర్తి వివరాలను కన్యాశుల్కం (నాటకం) పేజీలో చూడండి.

ఇతర లింకులు

[మార్చు]

ఎవరెవరు ఏమన్నారు

[మార్చు]
  • "కన్యాశుల్కం నాటకానికి సాటి రాగల రచన భారతీయ సాహిత్యంలో మృచ్చకటికం తప్ప మరోటి లేదు" - శ్రీశ్రీ
  • "కన్యాశుల్కము బీభత్స రస ప్రధానమైన విషాదాంత నాటకం"-శ్రీ శ్రీ
  • "కవిత్రయమంటే తిక్కన, వేమన, గురజాడ" - శ్రీశ్రీ
  • "గురజాడ 1915 లో చనిపోలేదు, అప్పుడే అతను జీవించడం ప్రారంభించాడు" - దేవులపల్లి కృష్ణశాస్త్రి

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "నూటపాతికేళ్ల కన్యాశుల్కం నాటకం". Sakshi. 2017-08-14. Archived from the original on 2017-09-16. Retrieved 2022-04-29.
  2. 2.0 2.1 కె, బాబూరావు (1990). అడుగుజాడ-గురజాడ (1 ed.). p. 11. Retrieved 2014-11-30.

ఇతర లింకుల

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.