కవి చౌడప్ప శతకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కవి చౌడప్ప శతకం

కం. బూతులు నీతులు చెప్పితి - నీతులు విని మెచ్చ బుధులు, నీతి విదూరుల్
బూతుల మెచ్చందగు నని - కౌతుక మతి కుందవరపు కవి చౌడప్పా !

కం . నీతుల కేమి ఒకించుక - బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో
నీతులు బూతులు లోక - ఖ్యాతులురా కుందవరపు కవి చౌడప్పా !

కం. పది నీతులు పది బూతులు - ఓదు శ్రుంగారములు కల్గు పద్యముల సభన్
చదివిన వాదే అధికుడు - కద రప్పా ! కుందవరపు కవి చౌడప్పా !


తన కాలంలోని పరిస్తితుల పట్ల తన అసంతృప్తిని అతి పరుషమైన భాష లో నిర్భయంగా ప్రకటించిన సాహసి కవి చౌడప్ప.


కం. విద్దెల మే లెరుగని నరు -డెద్దే సరి ; గది తినెది దెద్దా ? పనులం
దెద్దుకు కొంత వివెకము - కద్దప్పా కుందవరపు కవి చౌడప్పా !


ఇలాంటి తిట్టుపద్యాలలో 'గాడిద' పద్యం సుప్రసిద్ధమైంది.


కం. ఆడిన మాటలు తప్పిన - గాడిద కొడుకంచు తిట్టగా విని, మదిలో
వీడా కొడు కనఏడ్చును - గాడిదయును కుందవరపు కవి చౌడప్పా !దాతల్ని పొగడడం, లోభుల్ని తెగడడం కనిపిస్తుంది కొన్ని పద్యాల లో;


కం.
దేవుడు దేవుం డనగా
దేవుం డా దివి నుండి దిగి వచ్చేనా ?
ఈవి గల దొరయె దేవుడు
కావంగను కుందవరపు కవి చౌడప్పా !

కం. ఇయ్యగ ఇప్పింపం గల - అయ్యలకే కాని మీస మందరి కేలా ?
రొయ్యకు లేదా బారెడు - కయ్యమునకు కుందవరపు కవి చౌడప్పా !

తంజావూరి రఘునాధ నాయకుని రసజ్ఞతను గురించి కవి చౌడప్ప చెప్పిన పద్యం వల్ల ఈయన రఘునాధ నాయకుని సమకాలికు డనీ, ఆయన ఆస్థానం సందర్శించిన వా డనీ స్పష్ట మవుతూంది.


కం.నేరుతు నని మాటాడగ - నారిజ భవు నంతవాని వశమా ? తంజా
వూరి రఘునాధ నాయని - గా రెరుగగ కుందవరపు కవి చౌడప్పా !


యువతీ యువకులు చాటుగా చదువుకుని గుటకలు వేసే అశ్లీల శ్రుంగార పద్యాలు - ఈనాటి సెక్సు సాహిత్యం కంటె కూడా ఘాటైనవి - చౌడప్ప చాటువుల్లో అనేకం కనిపిస్తున్నాయి. మరీ పచ్చిగా లేనివి రెండు చచ్చుకి ;


కం. పడతుకయును వంకాయయు - అడరు సమూలంబు మధుర, మందుల లోగా
తొడ మొదలుతొడిమమొదలును - కడుమధురముకుందవరపు కవి చౌడప్పా !

ఆకారే త్రిభుజాకారే మధ్య స్థలం మహాబిలం
ప్రాకారే కీకారణ్యే దిన దినం కదలీఫలం సమర్పయామి

పండగ పండగ ఎప్పుడనిన పడతుల పక్కన
పండిన అప్పుడే పండగనిన కాకోదుర కుందవరపు కవి చౌడప్పాశా.ఒడ్డారంబు ఘటించె బ్రహ్మ వినరా ! ఓరోరి చన్ ముక్కులన్
బిడ్డం డంటిన పాలు కారు, అవియే ప్రేమన్ మగం డంటినన్
జిడ్డం చె మ్మగు కాళ్ళ సందిది మహాసాధ్యంబె అ బ్రహ్మకున్
దొడ్డా కుందవరంపురాయ సుకవీ ! ధూర్త ప్రకారాగ్రణీ !


ఏది చెప్పినా బలంగా సూటిగా గుండెకు తగిలేట్టు చెప్పగల చౌడప్ప ఉమ్మడి కుటుంబ సౌభాగ్య చిత్రం ఎంత అందంగా చిత్రిస్తాడో చూడండి;


కం. తన సతి ఇడగా మనుమలు - తనయులు తలిదండ్రు లన్న దమ్ములు బంధుల్
దిన దినమును భుజియించుట - ఘన విభవము కుందవరపు కవి చౌడప్పా !


కాకర కాయ కూరంటే కవి చౌడప్పకి ప్రాణం !


కం. వేయారు వగల కూరలు - కాయ లనేకములు ధాత్రి కల వందులలో
నాయకములు రా కాకర - కాయలు మరి కుందవరపు కవి చౌడప్పా !


పూర్వ కవులలో కవి చౌడప్పకు ఇష్టమైన కవులు -


కం. విను భారవి భట్టును నా - చన సోముని మాఘ కవిని చతురత శ్రీ నా
ధు నుతింతును కవితకు తి - క్కన తలతున్ కుందవరపు కవి చౌడప్పా !


పెద్దన పట్ల తన ప్రశంసను చాటే చౌడప్ప పద్యం సుప్రసిద్ధం -


కం. పెద్దన వలె క్రుతి చెప్పిన - పె ద్దనవలె, అల్ప కవిని పె ద్దనవలెనా ?
ఎ ద్దనవలె, మొ ద్దనవలె - గ్ర ద్దనవలె కుందవరపు కవి చౌడప్పా !


కందపద్యం నడపడంలో తిక్కన తరువాత తనంత మొనగాడు లే డని గర్వంగా చెప్పుకుంటాడు చౌడప్ప;


కం. ముందుగ చను దినములలో - కందమునకు సోమయాజి ఘను డందురు; నే
డందరు నను ఘనుడందురు - కందమునకు కుందవరపు కవి చౌడప్పా !


చౌడప్ప 'పస' పద్యాల్ని చవి చూడకపోతే ఆయన చాటుకవితా సమీక్ష అసమగ్రమే అవుతుంది.


కం. పప్పే పస బాపలకును, - ఉప్పే పస రుచుల కెల్ల, ఉవిదల కెల్లన్
కొప్పే పస, దంతములకు - కప్పే పస కుందవరపు కవి చౌడప్పా !కం. మీసము పస మొగ మూతికి, - వాసము పస ఇండ్ల కెల్ల, వనితల కెల్లన్
వేసము పస, బంట్రౌతుకు - గ్రాసము పస కుందవరపు కవి చౌడప్పా !కం. వెన్నెల పస అగు రాత్రుల - కెన్నులు పస సస్యములకు, ఇంతుల కెల్లన్
చన్నులు పస, అటు మీదట- కన్నులు పస కుందవరపు కవి చౌడప్పా !కం. మాటలు పస నియ్యోగికి - కోటలు పస దొరల కెల్ల, ఘోటకములకున్
దాటులు పస, బెబ్బులులకు- కాటులు పస, కుందవరపు కవి చౌడప్పా !


పస పద్యాలలాగే దేనికి ఏది 'పదిల'మో చెప్పే ఒక చక్కని చాటువు ఉంది;


కం. ఇంటికి పదిలము బీగము - వింటికి పదిలము నారి, వివరింపంగా
చంటికి పదిలము రవికెయు - కంటికి పదిలము రెప్ప కవి చౌడప్పా !


తిక్కనగారి నాటినుంచి కందపద్యానికి మధుర మధుర మైన నడకలు అలవరచిన కవులు ఎందరో ఉన్నారు గాని, ఆటవెలదికి వేమన కవి ఇచ్చినంత తేటయిన రూపం కంద పద్యానికి సమకూర్చిన వారు సుమతి శతకకర్త, కవి చౌడప్ప అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రజల నాలుకల మీద విరివిగా మసలడమే చాటుకవిత్వ లక్షణమైతే, వేమన సరసన పీట వేయదగిన ప్రముఖ చాటుకవి చౌడప్ప. తన నీతి పద్యాలు నోటికి రానివాళ్ళూ, వానలో తడవని వాళ్ళూ తెలుగుదేశంలో లేరని చౌడప్ప చెప్పుకున్న మాట అతిశయోక్తి కాదు ;కం. నా నీతి వినని వానిని - భానుని కిరణములు మీద పారని వానిన్
వానను తడియని వానిని - కానను రా కుందవరపు కవి చౌడప్పా !


శతకములు
ఆంధ్ర నాయక శతకము | కామేశ్వరీ శతకము | కుక్కుటేశ్వర శతకము | కుప్పుసామి శతకము | కుమార శతకము | కుమారీ శతకము | కృష్ణ శతకము | గాంధిజీ శతకము | గువ్వలచెన్న శతకము | గోపాల శతకము | చక్రధారి శతకము | చిరవిభవ శతకము | చెన్నకేశవ శతకము | దాశరథీ శతకము | దేవకీనందన శతకము | ధూర్తమానవా శతకము | నరసింహ శతకము | నారాయణ శతకము | నీతి శతకము | భారతీ శతకము | భాస్కర శతకము | మారుతి శతకము | మందేశ్వర శతకము | రామలింగేశ శతకము | విజయరామ శతకము | విఠలేశ్వర శతకము | వేమన శతకము | వేంకటేశ శతకము | వృషాధిప శతకము | శిఖినరసింహ శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | శ్రీ కాళహస్తీశ్వర శతకము | శ్రీవేంకటాచల విహార శతకము | సర్వేశ్వర శతకము | సింహాద్రి నారసింహ శతకము | సుమతీ శతకము | సూర్య శతకము | సమాజ దర్పణం | విశ్వనాథ పంచశతి | విశ్వనాథ మధ్యాక్కఱలు | టెంకాయచిప్ప శతకము | శ్రీగిరి శతకము | శ్రీకాళహస్తి శతకము | భద్రగిరి శతకము | కులస్వామి శతకము | శేషాద్రి శతకము | ద్రాక్షారామ శతకము | నందమూరు శతకము | నెకరు కల్లు శతకము | మున్నంగి శతకము | వేములవాడ శతకము | శతకము