లక్ష్మణ రేఖ

వికీపీడియా నుండి
(లక్ష్మణరేఖ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
లక్ష్మణుడ్ని మందలిస్తున్న రాముడు

లక్ష్మణ రేఖ రామాయణంలోని మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో భాగమైన దండకరణ్య అడవిలోని పంచవటి వద్ద తన సోదరుడు శ్రీ రాముడు, వదిన సీతతో ఉన్న నివాసం చుట్టూ లక్ష్మణుడు గీసిన గీత. రామాయణంలో సీతను సంరక్షించడానికి లక్ష్మణుడు గీసిన ఒక రేఖే లక్ష్మణ రేఖ. ఇటువంటిది వాల్మీకి రామాయణంలో లేదు.

పురాణ కథ

[మార్చు]

మాయలేడిని వేటాడటానికి వెళుతున్న రాముడు, ఆశ్రమంలోని సీతను రక్షిస్తూ ఆశ్రమంలోనే ఉండమని లక్ష్మణుడికి చెప్తాడు. కొంతసేపటి తరవాత రాముని కంఠ స్వరాన్ని పోలి హా సీతా! హా! లక్ష్మణా అన్న కేకలు వినపడతాయి. ఆ కేకలు విన్న సీత లక్ష్మణునితో మీ అన్నగారు ఆపదలో చిక్కుకున్నట్లుంది, వెళ్ళి రక్షించు అని చెబుతుంది. కానీ లక్ష్మణుడు కదలడు. దాంతో సీతకి కోపం వచ్చి మీ అన్నపట్ల నీకు ప్రేమలేదు, ఆపద సమయంలో రక్షణకి వెళ్ళక నా మీద కోరిక పడుతున్నటున్నావు అని అంటుంది. అప్పుడు లక్ష్మణుడు రాముడు అత్యంత బలవంతుడు, ఆయనకు ఎలాంటి ఆపద రాదు, నువ్వు ఇలా మాట్లాడటం భావ్యం కాదు, ఆ కంఠం రాముడిది కాదు, నువ్వు భయపడకు, శాంతంగా ఉండు. రాముడు నీ రక్షణ బాధ్యతను నాకు అప్పజెప్పి వెళ్ళాడు, నిన్ను ఒంటరిగా వదలి వెళ్ళలేను అని చెప్పాడు. సీత ఇవేవి పట్టించుకోకుండా లక్ష్మణుడిని అనరాని మాటలు అంటుంది. లక్ష్మణుడు తట్టుకోలేక సీతకు శిరసు వంచి నమస్కరించి సీతాదేవీ! నీవు నాకు పూజ్యురాలవైన దేవతవు. నీవు మాట్లాడినవి నా చెవులలో శూలాలు దింపినట్లున్నాయి, నీ మాటలకు తట్టుకోలేను అని చెప్పి సీత చుట్టు ఒక రేఖ గీసి, తామ వచ్చేంతవరకు ఈ రేఖ దాటి రావొద్దని చెప్పి రాముడి వద్దకు బయలుదేరాడు. అలా లక్ష్మణుడు గీసిన రేఖనే లక్ష్మణ రేఖ అంటారు.

మరిన్ని కథనాలు

[మార్చు]
  1. సీత మాట్లాడిన తీవ్రమైన మాటలకు నొచ్చుకున్న లక్ష్మణుడు వెంటనే శ్రీరాముని దగ్గరకు బయలుదేరాడు. లక్ష్మణుని చూచిన రాముడు లక్ష్మణా! నీవు సీతను ఒంటరిగా విడిచివచ్చి తప్పు చేశావు అన్నాడు. లక్ష్మణుడు వెంటనే వెళ్ళనందుకు అటు సీతతోనూ, సీతను వదలి వచ్చినందుకు ఇటు రాముడితోనూ మాటలుపడ్డాడు. అనవసరంగా మాట పడినపుడు రేఖ బాగోలేదంటాం, అలాగే లక్ష్మణుడు మాటపడి రేఖ బాగోలేదనుకున్నాడు, రేఖ అంటే అదృష్టం అని కూడా అర్ధం ఉంది. అదీ లక్ష్మణ రేఖ, లక్ష్మణుని దురదృష్టం.[1]
  2. భగవద్గీత అంటే భగవంతుని గాత్రంలోంచి వచ్చినది అని అర్థం కదా, ఇక్కడకూడా లక్ష్మణ గీత అంటే లక్ష్మణుడు చెప్పిన బోధ/మాట అని అర్థం చేసుకోవాలి. కాలాంతరంలో కొత్త కవులు ఈ గీతనికాస్తా రేఖగా మార్చి ఉంటారు. వాల్మీకి మహర్షి తరవాత వచ్చిన కవులు మొదట్లో ఈ గీతని లక్ష్మణుడు చెప్పిన మాట వినలేదు అన్న అభిప్రాయంతో వాడి ఉంటారు. ఆ తరవాత ఆ గీత కాస్తా నేలమీద గీసిన గీత అయ్యింది అని అనిపిస్తోంది. లక్ష్మణుడు చెప్పిన ముఖ్యమైన మాటలు (గీతలు): 1. అడవిలో మణులతో కూడిన బంగారు జింక ఉండదు ఆ బంగారు జింక ఒక మాయ, అది మారీచుని మాయ, 2. రాముని ఎవరూ నిర్జించలేరు రాముడు క్షేమంగా ఉంటాడు ఆ మాయావిని సంహరించి త్వరత్వరగా వచ్చేస్తాడు, 3. నేను రాముని కోసం వెళితే వదినా మీకు అపాయం కలుగుతుంది, రోజూ మీ పాదసేవ చేసే భాగ్యాన్ని దూరం చేయవద్దు అని తాను వెళ్ళిపోతే జరిగే అనర్థాన్ని ముందే సీతమ్మకి చెప్పడం. ఈ మూడు ముఖ్యమైన లక్ష్మణుని బోధలను వినలేదు అంటే వాటిని అధిక్షేపించింది ఆ బోధలను దాటింది అదే సీతమ్మ గీతని దాటడం. ఈ బోధలు సీతమ్మ దాటకుండా ఉంటే రావణుడు సీతమ్మని ఎత్తుకెళ్ళలేడు. అదే రావణుడు లక్ష్మణ గీతని దాటలేకపోవడం. వీటినే దృశ్యరూపకంగా చూపించేందుకు నాటకాలలో వాల్మీకేతర రామాయణాలలో లక్ష్మణుడు గీతలు గీసినట్టు చూపించడం ద్వారా అలానే ప్రచారం జరిగిపోయింది.[2]

మూలాలు

[మార్చు]
  1. కష్టేఫలే, ఆధ్యాత్మికం (15 October 2012). "శర్మ కాలక్షేపంకబుర్లు-లక్ష్మణ రేఖ ?". www.kastephale.wordpress.com. Retrieved 1 August 2020.
  2. శ్రీ కామాక్షి బ్లాగ్, ఆధ్యాత్మికం (5 February 2013). "శ్రీ కామాక్షి: లక్ష్మణ రేఖ నిజమా...?". www.sri-kamakshi.blogspot.com. Ayyagari Surya Nagendra Kumar. Retrieved 1 August 2020.