ఉషశ్రీ రామాయణము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామచరితం రసభరితం. రామాయణము వలె లోక వ్యవహారాన్ని విస్పష్టంగా బోధించే కావ్యం మరొకటి లేదు. ఆదికవి వాల్మీకి నుంచి నేటివరకు రమణీయమైన రామకథ పలుభాషలలో, పలురీతులలో రూపుదిద్దుకుంటూ, భారతావనిలోనే కాకుండా భారతీయుల సంస్కృతి ప్రసరించిన అన్యదేశాలలోనూ ప్రచార ప్రశస్తి పొందింది.


రామాయణ కావ్యాన్ని వాల్మీకి మహర్షి రచించడానికి కారణం బ్రహ్మానుగ్రహం. ఆ తపస్వి సమసా నదికి స్నానానికి వెళ్ళగా ఆ నదీతీరాన ఒక కరుణ దృశ్యం కంటబడింది. ఎదురుగావున్న చెట్టుకొమ్మమీద క్రీడిస్తున్న క్రౌంచ మిథునంలో మగపక్షి, కిరాతకుడొకడు కొట్టిన బాణం దెబ్బతో నేలమీదపడి విలవిల తన్నుకొని ప్రాణాలు విడిచింది. ఆడపక్షి విలపిస్తున్నది. దాని ఆక్రందనానికి మహర్షి హృదయం కరుణార్ద్రమయింది. ఆయన హృదయశోకం శ్లోకరూపంలో రామాయణంగా వెలువడింది.


తెలుగుదేశంలోను, తెలుగువాజ్మయంలోను సీతారాములు ప్రకాశించే దైవదంపతులు. రామాయణం చదవడంవల్ల తల్లిదండ్రులపట్ల భక్తి, సోదరప్రీతి, జ్యేష్టానువర్తనం, లోక మర్యాదానుసరణం, ప్రతిజ్ఞాపాలనం, ఆశ్రితవాత్సల్యం, స్వామికార్యనిర్వహణం, స్వార్థపరత్వనివృత్తి, చిత్తశుద్ధి, పరోపకారబుద్ధి వంటి అనేక సద్గుణాలు అలవడడానికి అవకాశం ఉన్నది.


సులభసుందరాలూ, భక్తి రసబంధురాలూ అయిన వాక్యాలతో సాగిన ఉషశ్రీ రామాయణం ఆకాశవాణి శ్రోతల నెందరెందరినో ఆకర్షించింది. దీనిని ఉషశ్రీ గా పేరుగాంచిన పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు వారు రచించారు. ఇటువంటి అత్యుత్తమ భక్తిసాహిత్యాన్ని అందరికీ అందజేయాలని సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానములు ఈ గ్రంధాన్ని ప్రచురించింది.

మూలము[మార్చు]

  • ఉషశ్రీ: రామాయణము, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1979, 1982, 1990, 1992.