అక్షాంశ రేఖాంశాలు: 19°43′N 85°19′E / 19.717°N 85.317°E / 19.717; 85.317

చిలికా సరస్సు

వికీపీడియా నుండి
(చిల్కా సరస్సు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
చిలికా
చిలికా సరస్సులో వలస పక్షులు
ప్రదేశంఒడిశా
అక్షాంశ,రేఖాంశాలు19°43′N 85°19′E / 19.717°N 85.317°E / 19.717; 85.317
సరస్సు రకంఉప్పు నీటి
సరస్సులోకి ప్రవాహం52 ప్రవాహాలు - భార్గవి నది, దయా నది, మకర, మలగుని నది, లూనా నది[1]
వెలుపలికి ప్రవాహంఅరఖాకుడా వద్ద ఉన్న పాత ముఖద్వారం, శతపడా వద్ద కొత్త ముఖద్వారం - బంగాళాఖాతం లోకి
పరీవాహక విస్తీర్ణం3,560 కి.మీ2 (1,370 చ. మై.)
ప్రవహించే దేశాలుభారత దేశం
గరిష్ట పొడవు64.3 కి.మీ. (40.0 మై.)
ఉపరితల వైశాల్యంmin.: 900 కి.మీ2 (347 చ. మై.)
max.: 1,165 కి.మీ2 (450 చ. మై.)
గరిష్ట లోతు4.2 మీ. (13.8 అ.)
నీటి ఘనపరిమాణం4 కి.మీ3 (3,200,000 acre⋅ft)
ఉపరితల ఎత్తు0 – 2 మీ. (6.6 అ.)
Islands223 కి.మీ2 (86 చ. మై.):
బడాకుడ, బ్రేక్‌ఫాస్ట్, హనీమూన్, కాళిజాయ్ కొండ, బర్డ్‌స్ ద్వీపం, కాంతాపంథా, కృష్ణపసాద్ రాహ్ (పాత పారికుడ), నలబానా, నౌపాడ, సొమోలో, సనాకుడ.
ప్రాంతాలుపూరి, శతపాద
మూలాలు[1][2]
గుర్తించిన తేదీ1 October 1981
రిఫరెన్సు సంఖ్య.229[3]

చిలికా సరస్సు భారతదేశపు తూర్పు తీరంలో ఉన్న ఉప్పునీటి సరస్సు. ఇది దయా నది ముఖద్వారం వద్ద, ఒడిశా రాష్ట్రం లోని పూరి, ఖుర్దా, గంజాం జిల్లాల్లో విస్తరించి ఉంది. దీని విస్తీర్ణం 1,100 చ.కి.మీ. పైచిలుకు ఉంటుంది. ఇది భారతదేశంలో అతిపెద్ద తీర ప్రాంత సరస్సు. ది న్యూ కాలెడోనియన్ బారియర్ రీఫ్ [4]తరువాత, ప్రపంచం లోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సుల్లో ఇది రెండవది.[5] [6] దీన్ని తాత్కాలికంగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. [7]

వలస పక్షులకు భారత ఉపఖండంలో చిలికా అతిపెద్ద శీతాకాల స్థావరం. అంతరించి పోతున్న అనేక జాతుల మొక్కలు, జంతువులకు ఈ సరస్సు నిలయం. [8] [9]

ఈ సరస్సు, పెద్ద ఎత్తున మత్స్య వనరులతో కూడుకుని ఉన్న పర్యావరణ వ్యవస్థ. దీని తీరం లోను, ద్వీపాల్లోనూ ఉన్న 132 గ్రామాల లోని 1,50,000 పైచిలుకు మత్స్యకారులకు ఇది జీవిక నిస్తోంది. [10] [11]

వలస కాలంలో గరిష్ఠంగా 160 కి పైగా జాతుల పక్షులు ఈ సరస్సులోకి చేరతాయి. కాస్పియన్ సముద్రం, బైకాల్ సరస్సు, అరల్ సీ ల నుండి,రష్యాలోని ఇతర మారుమూల ప్రాంతాల నుండీ, కజాకస్తాన్ కిర్గిజ్ స్టెప్పీలు, మధ్య, ఆగ్నేయాసియాల నుండి, లడఖ్, హిమాలయాల నుండీ పక్షులు ఇక్కడికి వలస వస్తాయి. ఈ పక్షులు చాలా దూరం ప్రయాణిస్తాయి; ఇవి సూటిగా సరళ రేఖల మార్గాల్లో కాకుండా, చుట్టు తిరుగుడు మార్గాల్లో ప్రయాణిస్తాయి. కొన్ని పక్షులు దాదాపు 12,000 కి.మీ. వరకు ప్రయాణిస్తాయి.

1981 లో రామ్‌సార్ కన్వెన్షన్ కింద చిలికా సరస్సును అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలగా నిశ్చయించారు. భారతదేశంలో అలా గుర్తించిన స్థలాల్లో ఇదే మొదటిది [12] [13]

ఒక సర్వే ప్రకారం, ఇక్కడున్న పక్షుల్లో 45 శాతం నేలపై ఉండేవి, 32 శాతం నీటిపక్షులు, 23 శాతం ఒడ్డున నీటిలో నడుస్తూ వేటాడే తీరపక్షులు. సరస్సులో 14 రకాల వేటాడే పక్షులు కూడా ఉన్నాయి. సుమారు 152 అరుదైనవీ, అంతరించిపోతున్నవీ ఐన ఇరావడీ డాల్ఫిన్లు కూడా ఉన్నాయి. వీటికి తోడు, సరస్సులో 37 రకాల సరీసృపాలు, ఉభయచరాలు కూడా ఉన్నాయి. [14]

చిలికా పర్యావరణ వ్యవస్థలో ఉన్న గొప్ప మత్స్య సంపద సరస్సులోను, దాని సమీపంలోనూ నివసించే చాలా మంది మత్స్యకారులకు జీవనోపాధి కలిగిస్తోంది. సరస్సులో నీటి విస్తీర్ణం వర్షాకాలంలో 1165 కిమీ2,, వేసవిలో 906 కిమీ2 ఉంటుంది. 32 కిలోమీటర్ల పొడవైన, సన్నటి, కాలువ సరస్సును బంగాళాఖాతంతో కలుపుతుంది. ఇటీవల, చిలికా డెవలప్‌మెంట్ ఏజన్సీ ఒక కొత్త ముఖద్వారాన్ని తెరవడంతో సరస్సుకు కొత్త జీవితాన్నిచ్చింది.

చిలికా సరస్సు లోని ఉప్పునీటిలో మైక్రోఅల్గే, సముద్ర పాచి, సముద్రపు గడ్డి, చేపలు, పీతలు వర్ధిల్లుతాయి. ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాలలో సముద్రపు గడ్డి పునరుద్ధరణ పొందింది. దీనితో, చివరికి అంతరించిపోతున్న దుగోంగ్‌లు తిరిగి నిలదొక్కుకునే అవకాశం ఉంది. [15]

దస్త్రం:Golabai plan.jpg
గోలబాయి సాసన్ తవ్వకాల స్థలం

చరిత్ర

[మార్చు]

దిగువ ప్లైస్టోసీన్ కాలంలో (18 లక్షల సంవత్సరాల క్రితం నుండి 10,000 సంవత్సరాల క్రితం వరకు) చిలికా సరస్సు బంగాళాఖాతంలో భాగంగా ఉండేదని భౌగోళిక ఆధారాలు సూచిస్తున్నాయి.

చిలికా సరస్సుకు ఉత్తరాన ఖుర్దా జిల్లా లోని గోలాబాయి సాసాన్ ( 20°1′7″N 85°32′54″E / 20.01861°N 85.54833°E / 20.01861; 85.54833) వద్ద భారత పురావస్తు సర్వే సంస్థ త్రవ్వకాలు నిర్వహించింది.[16] కొత్తరాతియుగం (క్రీ.పూ. 1600), తామ్రయుగం (క్రీ.పూ. 1400 నుండి క్రీ.పూ. 900 వరకు), ఇనుప యుగం (క్రీ.పూ. 900 నుండి క్రీ.పూ. 800 వరకు) మూడు దశల్లోనూ చిలికా ప్రాంత సంస్కృతి యొక్క క్రమాన్ని గోలబాయి చూపిస్తుంది. రేడియోకార్బన్ డేటింగ్ క్రీస్తుపూర్వం 2300 వరకు గోలాబాయి ప్రారంభ స్థాయిని గుర్తించింది. ఈ ప్రదేశం దయా నదికి ఉపనది అయిన మలగుని నదికి ఎడమ ఒడ్డున ఉంది. చిలికా సరస్సు ద్వారా సముద్రానికి దారి కల్పించిన ఈ ప్రదేశం, ఈ ప్రాంతం నుండి గతంలో జరిగిన సముద్ర వ్యాపారాలకు బలమైన సాక్ష్యంగా ఉంది. బాడిస వంటి అనేక చెక్క పనిముట్లు, ఇతర హస్తకృతులు ఇక్కడ దొరకడాన్ని బట్టి, గోలాబాయి ఒక పడవ నిర్మాణ కేంద్రంగా ఉండేదని సూచిస్తుంది. విశేషమేమిటంటే, ఒడిశాలో తవ్వకాలు జరిపిన ప్రదేశాల్లో ఒక్క గోలబాయిలో మాత్రమే పడవ నిర్మాణాల జాడలు కనిపించాయి. చిలికా సరస్సు గోలాబాయికి చాలా దగ్గరగా ఉండేదనీ, ఇది పురాతన కాలంలో ఈ ప్రాంత ప్రజల సముద్ర వ్యాపారానికి దోహదపడిందనీ తెలుస్తోంది. [17]

సముద్ర వాణిజ్యానికి సాగరప్రభువుగా పేరొందిన కళింగ రాజు ఖారవేలుని కాలంలో (క్రీ.పూ. 209 - క్రీ.పూ. 170 తరువాత), చిలికా దక్షిణ ప్రాంతం ఒక ప్రధాన నౌకాశ్రయంగా ఉండేదని కొన్ని పురాతన గ్రంథాలు చెప్పాయి. [18]

గ్రీకు భౌగోళికుడు టోలెమి (150 CE), సరస్సు దక్షిణ కొనకు వెలుపల ఉన్న నిర్గమ స్థలం, కాంతియాగఢ్ వద్ద ఉన్న పాలూర్ ఓడరేవును పాలౌరా అని పిలుచాడు. అక్కడ నుండి ఆగ్నేయాసియాలోని వివిధ ప్రాంతాలకు ఓడలు ప్రయాణించాయి. 639 తరువాత, చైనా యాత్రికులు ఫా-హియాన్, హ్యూయెన్-త్సాంగ్ లు సముద్రం ఒడ్డుకు సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధ ఓడరేవు " చే-లి-టా-లోచింగ్ " గురించి ప్రస్తావించారు, ఇది సుదూర ప్రాంతాల నుండి సముద్రతీర వ్యాపారులకు, ఆగంతకులకూ విశ్రాంతి ప్రదేశంగా ఉండేది. ఈ నౌకాశ్రయం చిలికా సరస్సు ఒడ్డున 'ఛత్రగఢ్' వద్ద ఉంది. [17]

నాలుగో శతాబ్దపు జానపద కథ ఒకటి చిలికా పుట్టుకను వివరిస్తుంది. సముద్రపు దొంగల రాజు, రక్తబాహుడు, పూరిపై దాడి చేసేందుకు భారీ ఎత్తున ఓడలపై బయల్దేరాడు. తనను గుర్తించకుండా ఉండేందుకు అతడు తీరం నుండి కనబడనంత దూరాన లంగరు వేసాడు. అయితే ఓడల నుండి వెలువడ్డ వ్యర్థాలు తేలుతూ ఒడ్డుకు కొట్టుకువచ్చి పూరీ ప్రజలకు ఇతడి దాడి గురించి తెలిసిపోయింది. దాంతో పట్టణ ప్రజలందరూ, తమ ఆస్తులతో సహా తప్పించుకున్నారు. చివరికి, ఒడ్డుకు చేరి దాడి చెయ్యబోయిన రక్తబాహునికి విషయం అర్థమై,తనకు ద్రోహం చేసిన సముద్రంపై దాడికి వెళ్ళాడు. అది చూసి సముద్రం వారికి అతడి సైన్యానికి దారి ఇచ్చింది, ఆ దారిలో సైన్యం ముందుకు పోగానే తిరిగి వెనక్కి పొంగి, సైన్యాన్ని ముంచేసింది. ఆ క్రమం లోనే చిలికా సరస్సు ఏర్పడింది. [2]

చిలికాకు 25 కి.మీ.దూరాన ఉన్న కానాస్ అనే గ్రామం వద్ద జరిపిన పురావస్తు త్రవ్వకాల్లో ఏడవ శతాబ్దపు ఓడ లంగర్లు, యుద్ధ వీరుల కోసం నిర్మించిన స్మారక ఫలకాలు బయటపడ్డాయి. ఈ గ్రామం చిలికా సరస్సు లోకి ప్రవహించే నూనా నది ఒడ్డున ఉంది. ఇది తీరంలో జరిగిన చారిత్రిక నావికాదళ యుద్ధానికి ఆధారం.

10 వ శతాబ్దపు గ్రంథం, బ్రహ్మాండ పురాణం, చిలికా సరస్సు వాణిజ్య వ్యాపారాలకు ఒక ముఖ్యమైన కేంద్రం అని పేర్కొంది. జావా, మలయా, సింఘల, చైనా, తదితర దేశాలకు ప్రయాణించే నౌకలకు ఇది ఆశ్రయంగా ఉండేది. దీన్నిబట్టి ఈ సరస్సు ఆ కాలంలో సముద్రంలో ప్రయాణించే నౌకలకు సరిపోయేంత లోతుగా ఉండేదనీ, ఆగ్నేయాసియాకు వెళ్ళే వాణిజ్య నౌకలు సముద్రం లోకి చేరేందుకు సరిపోయే పెద్ద కాలువ కూడా సరస్సు నుండి ఉండేదనీ ఇది సూచిస్తోంది. [19] [20] చిలికా సరస్సు చుట్టుపక్కల గ్రామస్తులు ఇప్పటికీ " బాలి యాత్ర " అనే పండుగను ఏటా జరుపు కుంటారు.

1803 లో, బ్రిటిష్ వారు సరస్సు ఒడ్డుకు ప్రవేశించి, పూరి చేరుకుని, ఫతే ముహమ్మద్ సహాయంతో ఒడిశాను ఆక్రమించుకున్నారు. ఈనాటి గఢ్ కృష్ణప్రసాద్ రెవెన్యూ బ్లాక్ లో ఉన్న మాలుద్, పరికుద్ ప్రాంతాలను ఫతే ముహమ్మదుకు బ్రిటిష్ వారు బహుమతిగా ఇచ్చారు. [18]

సంవత్సరాలుగా, కబీబర్ రాధానాథ్ రే, పండిత గోదావరీష్ మిశ్రా వంటి కవులు, స్వాతంత్ర్య సమరయోధులు, సాధువులూ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, మత సంబంధ, సుందరమైన అంశాలకు సంబంధించి సరస్సు చరిత్రను ఎలుగెత్తి చాటారు. [18] [19]

"ప్రసిద్ధ ఒడియా కవి గోపబంధు దాస్, రైల్లో వెళ్లేటప్పుడు వెనక్కి పరుగెడుతున్న చిలికా సరస్సు రంగురంగుల దృశ్యాలు, శబ్దాలను సరిగ్గా చూసే వీలు లేక అసహనానికి గురయ్యాడు. సరస్సు అందాలను ఆస్వాదించడానికి గాను, రైలును ఆగమని కోరాడు. అతణ్ణి అప్రతిభుణ్ణి చేసిన సరస్సు అందమే అతడి చేత ఈ మాట చెప్పించింది". [21]

జియాలజీ

[మార్చు]

ప్లైస్టోసీన్ కాలంలో సరస్సు పశ్చిమ తీరం వెంబడే సముద్రతీరం ఉండేదని, సరస్సు ఈశాన్య ప్రాంతం, సముద్రం క్రింద ఉండేదని భౌగోళిక అధ్యయనాలు సూచిస్తున్నాయి. తీరరేఖ తూర్పు దిశగా జరిగిందనడానికి సమీపంలోని కోణార్క సూర్య దేవాలయమే ఋజువు. కొన్ని వందల సంవత్సరాల క్రితం సముద్ర తీరం వద్దనే నిర్మించిన ఈ దేవాలయం ఇప్పుడు తీరం నుండి సుమారు 3 కి.మీ లోపలికి ఉంది.

చిలికా సరస్సు పరీవాహక ప్రాంతంలో ఉపరితలానికి కింద రాయి, ఇసుక, మట్టి ఉన్నాయి. ఇందులో మట్టి, ఒండ్రు, ఇసుక, కంకర, షెల్ వంటి విస్తృత అవక్షేపాలు ఉన్నాయి. కాని పరీవాహక ప్రాంతంలో ఎక్కువగా ఉన్నది ఒండ్రే. దయా నదితో పాటు అనేక ఇతర ప్రవాహాల ద్వారా సంవత్సరానికి 16 లక్షల మెట్రిక్ టన్నుల అవక్షేపం చిలికా సరస్సులోకి చేరుతోంది. [21]

గత 6,000–8,000 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ ఉన్న సముద్ర మట్టాలు సుమారు 7,000 సంవత్సరాల క్రితం స్థిరంగా ఉండేవి. దీని ఫలితంగా సరస్సు దక్షిణ ప్రాంతంలో తీరానికి సమీపంలో బీచ్ ఏర్పడి ఉండవచ్చు. ఈ బీచ్ క్రమంగా పెరిగి, ఈశాన్య దిశలో సముద్రతీరం వైపుగా పురోగమించి ఉంటుంది. ఈ క్రమంలో చిలికా లోని ఇసుక తిన్నె ఏర్పడింది. తిన్నె నైరుతి అంచు నుండి వెలికితీసిన ఒక శిలాజంపై చేసిన అధ్యయనం, ఈ సరస్సు సుమారు 3,500-4,000 సంవత్సరాల క్రితం ఏర్పడిందని సూచిస్తోంది.

భౌగోళికం, స్థలాకృతి

[మార్చు]
నలిబాన్ ద్వీపం, చిలికా పక్షుల అభయారణ్యం, డాల్ఫిన్ అభయారణ్యం, పూరి పట్టణం, మలుద్ ద్వీపకల్పాన్ని చూపించే చిలికా సరస్సు పటం.
చిలికా సరస్సు - మధ్య, పశ్చిమ1958 టోపోగ్రాఫిక్ మ్యాప్, 1: 250,000
చిలికా సరస్సు-తూర్పు చివర
కటక్ వద్ద మహానది మూడుగా చీలి, ఒక పాయ చిలికా సరస్సులో కలుస్తుంది.
చిలికా సరస్సు దృశ్యం
చిలికా సరస్సు
ఒడిశాలోని చిలికా సరస్సులోని సతపాడ వద్ద జెట్టీ
చిలికా సరస్సులో శతపాద డాల్ఫిన్ పాయింట్ వద్ద ఒక పర్యాటక పడవ
చిలికా సరస్సు సముద్ర ముఖద్వారం దగ్గర, ఒడిశా
చిలికా సరస్సు
చిలికా సముద్ర ముఖద్వారం

చిలికా సరస్సు లోతులేని పెద్ద ఉప్పు నీటి కయ్య. సరస్సు పశ్చిమ, దక్షిణ అంచులు తూర్పు కనుమల శ్రేణి వరకు ఉన్నాయి. [20]

సరస్సులోకి ఒండ్రును తీసుకువచ్చే అనేక నదులు సరస్సు ఉత్తర కొనను నియంత్రిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉత్తర ప్రవాహాల ద్వారా ఏర్పడిన రెజ్‌హన్సా అనే పొడవైన అవరోధ (బ్యారియర్) బీచ్[22] కారణంగా ఈ లోతు లేని సరస్సు ఏర్పడింది. ఈ బీచ్, సరస్సుకు తూర్పు హద్దుగా ఉంది.

ఈ సరస్సులో అనేక ద్వీపాలు ఉన్నాయి. బారియరుకూ, సరస్సు ప్రధాన భాగానికీ మధ్య పెద్ద పెద్ద ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీపాల మధ్య లోతు లేని కాలువలు ఉంటాయి. మొత్తం 42 చ.కి.మీ వైశాల్యం ఉన్న కాలువలు సరస్సును బంగాళాఖాతంతో కలుపుతాయి. [19] ఆరు ప్రధాన ద్వీపాలు పారికుడ, ఫుల్బారి, బెరాహ్‌పురా, నువపారా, నల్బానా, టాంపారా. ఈ ద్వీపాలనూ, మాలుద్ ద్వీపకల్పాన్నీ కలిపి, పూరి జిల్లాలోని కృష్ణప్రసాద్ రెవెన్యూ బ్లాక్‌ను ఏర్పరచారు. [6] [11]

సరస్సు ఉత్తర తీరం ఖుర్దా జిల్లాలో భాగం కాగా, పశ్చిమ తీరం గంజాం జిల్లాలో భాగం. ఒండ్రు చేరడం వలన, అవరోధం (బ్యారియరు) వెడల్పు హెచ్చుతగ్గులకు గురౌతూ సముద్రానికి కలిపే ముఖద్వారం అప్పుడప్పుడూ మూసుకుపోతూ ఉంటుంది. ముఖద్వార స్థానం కూడా తరచుగా ఈశాన్య దిశ వైపు జరుగుతూ ఉంటుంది. 1780 లో 1.5 కి.మీ. వెడల్పున్న ముఖ ద్వారం, నలభై సంవత్సరాల తరువాత 0.75 కి.మీ. మాత్రమే ఉంది. స్థానిక మత్స్యకారులు, చేపలు పట్టడానికి సముద్రంలోకి ప్రవేశించడానికి ఎప్పటికప్పుడు ముఖ ద్వారాన్ని తవ్వి వెడల్పు చేస్తూ ఉండాల్సి వచ్చేది. [18]

వేసవిలో సరస్సు లోతు 0.3 - 0.8 మీ. ఉండగా, వర్షాకాలంలో 1.8 - 4.2 మీ. వరకు ఉంటుంది. సరస్సును సముద్రానికి కలిపే పాత కాలువను మగర్‌ముఖ్ (మొసలి నోరు) అంటారు. ప్రస్తుతం ఇది 100 మీ. వెడల్పు ఉంటుంది. ఈ సరస్సును నాలుగు వేర్వేరు మండలాలుగా విభజించారు, అవి దక్షిణ, మధ్య, ఉత్తర మండలాలు, బయటి కాలువ ప్రాంతం. బయటి కాలువ, సరస్సు నుండి బయలుదేరి 32 కి.మీ. దూరంలోని ఆరాఖుడా గ్రామం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ సరస్సు కొద్దిగా పియర్ ఆకారంలో ఉంటుంది. దీని గరిష్ట పొడవు 64.3 కి.మీ., సగటు వెడల్పు 20.1 కి.మీ. ఉంటుంది. [6] [23]

పరిరక్షణ   - ఆందోళనలు, నిర్వహణ

[మార్చు]

1971 లో, చిలికా సరస్సు రామ్‌సార్ కన్వెన్షన్ కింద అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న చిత్తడి భూములుగా (భారతదేశంలో మొట్ట మొదటిది) పరిగణించారు. దీనికి కారణాలు:

 • పది లక్షల వలస నీటిపక్షులకు, తీరపక్షులకూ ఈ సరస్సు శీతాకాల ఆశ్రయం.
 • 400 కి పైగా సకశేరుక జాతులు ఉన్నాయి.
 • ఇది సముద్ర, ఉప్పునీటి, మంచినీటి జాతుల జీవులకు నెలవుగా ఉన్న ఉప్పు నీటి సరస్సు
 • ఈ ప్రాంతంలో అనేక అరుదైన, అంతరించిపోతున్న జాతులు కనిపిస్తాయి.
 • ఈ సరస్సు మత్స్యకారులకు జీవనాధారం.
 • జన్యు వైవిధ్యాన్ని పరిరక్షించడంలో ఈ సరస్సు ఎంతో విలువైనది.
 • సరస్సులో కలుపు మొక్కలు, ఆక్వాకల్చర్ కార్యకలాపాలు పెరుగుతున్నాయి. [12] [13]

ఆందోళనలు

[మార్చు]

సంవత్సరాలుగా, సరస్సు పర్యావరణ వ్యవస్థ అనేక సమస్యలను, భయాందోళనలనూ ఎదుర్కొంటోంది:

 • లోతట్టు నది వ్యవస్థల నుండి అవక్షేపాల రూపంలో ఒండ్రు చేరిక
 • నీటి ఉపరితల వైశాల్యం కుదించుకు పోవడం
 • ఇన్లెట్ ఛానల్ బక్కచిక్కిపోవడంతో పాటు సముద్రానికి కలిపే ముఖద్వార స్థలం మారిపోవడం
 • లవణీయత, మత్స్య వనరుల తగ్గుదల
 • మంచినీటి వృక్ష జాతుల, కలుపు విస్తరణ
 • ఉత్పాదకత క్షీణించడంతో మొత్తమ్మీద జీవవైవిధ్యం కోల్పోవడం, దానిపై ఆధారపడిన సమాజపు జీవనోపాధి దెబ్బతినడం
 • సరస్సులో చేపలు పట్టే హక్కుల గురించి మత్స్యకారులకు, ఇతరులకూ మధ్య ఘర్షణలు, పర్యవసానంగా కోర్టు కేసులు

వాణిజ్య స్థాయిలో రొయ్యల పెంపకం వేగంగా విస్తరించడంతో సరస్సు లోని మత్స్య సంపద, పక్షుల జనాభా గణనీయంగా క్షీణించాయి. [24]

పరిరక్షణ, నిర్వహణ చర్యలను అవలంబించడానికి భారత ప్రభుత్వ సహకారంతో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సంఘటిత చర్యలు తీసుకుంది. [9] [23]

1993 నాటికి, చిలికాలో సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, ఈ సరస్సును "ది మాంట్రియక్స్ రికార్డ్" లో చేర్చాల్సి వచ్చింది. ఎందుకంటే "ఈ సరస్సు యొక్క పర్యావరణ స్వభావం మానవుడు తీసుకువచ్చిన మార్పుకు లోనైంది, లోనవుతోంది, లేదా లోనయ్యే అవకాశం ఎంతైనా ఉంది". సరస్సు పరిరక్షణకు పరిష్కార చర్యలు తీసుకోవడంపై ప్రజలను, ప్రభుత్వాలనూ ఉత్తేజపరచడం దీని ఉద్దేశ్యం.

మొత్తమ్మీద, పైప్రాంతాల నుండి వచ్చిన ఒండ్రు వలన నీటి ఉపరితల వైశాల్యం కుదించుకు పోవడం, లవణీయత తగ్గడం, మంచినీటి కలుపు మొక్కలు సరస్సును ఆక్రమించడం వంటివన్నీ వన్యప్రాణుల ఆవాసాల పైన, మత్స్య వనరుల పైనా తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. [21]

చిలికా డెవలప్‌మెంట్ అథారిటీ (సిడిఎ)

[మార్చు]

1992 లో సరస్సు పర్యావరణ వ్యవస్థ క్షీణించడం పట్ల ఆందోళన చెందిన ఒడిశా ప్రభుత్వం చిలికా డెవలప్మెంట్ అథారిటీ (సిడిఎ) ని ఏర్పాటు చేసింది. అటవీ, పర్యావరణ శాఖ పరిపాలనా పరిధిలో సంఘాల రిజిస్ట్రేషన్ చట్టం క్రింద సరస్సు పునరుద్ధరణ కోసం, సంకలిత అభివృద్ధి కోసం సిడిఎ ను క్రింది లక్ష్యాలతో ఏర్పాటు చేసారు:

 • సరస్సు పర్యావరణ వ్యవస్థను దాని సమస్త జన్యు వైవిధ్యాలతో సహా సంరక్షించడానికి
 • ఇంటిగ్రేటెడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ కోసం నిర్వహణ ప్రణాళికను రూపొందించడం, సరస్సు వనరులను సమాజం తెలివిగా ఉపయోగించుకునేలా చెయ్యడం
 • మల్టీ డైమెన్షనల్, మల్టీడిసిప్లినరీ అభివృద్ధి కార్యకలాపాలను స్వయంగా గానీ, ఇతర ఏజెన్సీల ద్వారా గానీ అమలు చేయడం
 • సరస్సు అభివృద్ధి కోసం వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలసి పనిచెయ్యడం [23]

అథారిటీ పాలకమండలి ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉంటుంది. స్థానిక ప్రజా ప్రతినిధులు, మత్స్యకారు సంఘాల ప్రతినిధులు, ముఖ్య విభాగాల కార్యదర్శులు, నిపుణులు, ప్రముఖ శాస్త్రవేత్తలు దానిలో సభ్యులుగా ఉంటారు.

1998 లో, భారత ప్రభుత్వ పదవ, పదకొండవ ఆర్థిక కమిషన్ల నుండి అందిన ఆర్థిక సహాయంతో ఆర్థిక అధికారాలతో కూడిన కార్యనిర్వాహక కమిటీ, సిడిఎ చేపట్టిన నిర్వహణ కార్యక్రమాలకు మద్దతు ఇచ్చింది. సమర్థవంతమైన మెరుగుపరచే చర్యలను రూపొందించడానికి, అమలు చేయడానికీ ఇది సమన్వయ విధానాన్ని సులభతరం చేసింది.

ఫైనాన్స్ కమీషన్లు సిఫారసు చేసిన "స్పెషల్ ప్రాబ్లమ్ గ్రాంట్స్" నుండి లభించిన 57 కోట్ల రూపాయల ఆర్థిక సహాయంతో సమగ్ర నిర్వహణ ప్రణాళికను అమలు చేసారు. ప్రపంచ బ్యాంకు వారి డిశా జల వనరుల అభివృద్ధి ప్రాజెక్టు కింద హైడ్రోబయోలాజికల్ పర్యవేక్షణకు రూ కోటి అందింది. 7 రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, 33 ఎన్జీఓలు, 3 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, 6 ఇతర సంస్థలు, 11 అంతర్జాతీయ సంస్థలు, 13 పరిశోధనా సంస్థలు, 55 వివిధ వర్గాల సంఘాలతో బలమైన నెట్‌వర్కును తయారు చేసారు. [23]

2003 లో, భారతీయ, జపాను నిపుణుల మధ్య పరస్పర సహకారంతో చిలికా సరస్సుకు, జపాన్లోని సరోమా సరస్సుకూ మధ్య సిస్టర్ వెట్ ల్యాండ్స్ అనే మైత్రీ సంబంధం నెలకొల్పారు. [21]

మెరుగుపరచే చర్యలు

[మార్చు]

సరస్సు ఎదుర్కొంటున్న ఆందోళనలను పరిశీలిస్తే, భారత ప్రభుత్వ జాతీయ చిత్తడి నేలలు, మడ అడవులు, పగడపు దిబ్బల కమిటీ కూడా ఈ సరస్సును పరిరక్షణ, నిర్వహణకు ప్రాధాన్యత నివ్వాల్సిన ప్రదేశంగా గుర్తించింది. [8] పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడానికి, సరస్సు చుట్టూరానూ, దాని ద్వీపాలలోనూ నివసిస్తున్న సమాజాల సామాజిక-ఆర్ధిక పరిస్థితులను మెరుగుపరచడానికీ CDA మెరుగైన చర్యలు తీసుకుంది.

 • కొత్త ముఖద్వారాన్ని నిర్మించడం

సరస్సు పరిస్థితిని మెరుగుపరచేందుకు తీసుకున్న చర్యల్లో అత్యంత ప్రభావవంతమైనది, సతపాడ లోని బారియర్ బీచ్ ద్వారా సరస్సుకు కొత్త ముఖద్వారాన్ని నిర్మించడం. ఇది సరస్సు ప్రాదేశిక, తాత్కాలిక లవణీయతలను మెరుగుపరిచింది..పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ లు 3 డైమెన్షనల్ మ్యాథమెటికల్ మోడలింగ్, హైడ్రాలిక్స్ అధ్యయనాలతో సహా వివరణాత్మక శాస్త్రీయ అధ్యయనాలు చేసాక, ఈ చర్య తీసుకున్నారు. ఈ చర్యల వల్ల సరస్సులో చేపల దిగుబడి గణనీయంగా పెరిగింది. మంచినీటి కలుపు మొక్కలు తగ్గాయి. కొత్త ముఖద్వారం వలన ఔట్‌ఫ్లో ఛానల్ పొడవు 18 కి.మీ. తగ్గింది. [13] [25] సరస్సు అంతటా లవణీయత పెరిగింది, లవణీయతలో హెచ్చుతగ్గులు తగ్గాయి. [21]

ఇతర చర్యలు:

 • పరీవాహక ప్రాంతాల నిర్వహణ
 • పక్షి ఆవాసాల, పక్షి జాతుల సంరక్షణ
 • పక్షుల వేటను ఆపడానికి స్థానిక జనాభాకు ఆర్థిక ప్రోత్సాహకాలు
 • పర్యావరణ-పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి శిక్షణా కార్యక్రమాలు వంటి సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే చర్యలు.
 • ద్వీప గ్రామాలకు సౌర దీపాల వ్యవస్థలను అందించడం
 • వివిక్త గ్రామాలకు ఫెర్రీ సేవ అభివృద్ధి
 • మత్స్యకారులకు ల్యాండింగ్ సౌకర్యాల నిర్మాణం, అలాగే విద్య, పర్యావరణ అవగాహన కార్యకలాపాలు.

సరస్సు పరిస్థితులు మెరుగవడంతో, 2002 లో చిలికాను మాంట్రియక్స్ రికార్డ్ నుండి తీసివేసారు. [12] [13] ఆసియాలో మాంట్రియక్స్ రికార్డు నుండి తొలగించిన మొట్టమొదటి రామ్‌సార్ ప్రదేశం చిలికా సరస్సు. [21]

పురస్కారాలు

[మార్చు]
 • "పునరుద్ధరణ లోను, చిత్తడి నేలలను తెలివిగా ఉపయోగించడం లోను, ఈ కార్యకలాపాలలో స్థానిక సమాజాలను భాగస్వాములుగా చెయ్యడం లోనూ అత్యుత్తమ విజయాలు సాధించినందుకు" గాను చిలికా డెవలప్‌మెంట్ అథారిటీకి 2002 నవంబరులో రామ్‌సార్ వెట్ ల్యాండ్ కన్జర్వేషన్ అవార్డును బహుకరించారు. [12] [13]
 • చిలికా సరస్సు పర్యావరణ వ్యవస్థ పరిరక్షణకు, పునరుద్ధరణకూ విశేష కృషి చేసినందుకు గాను, చిలికా అభివృద్ధి అథారిటీకి భారత ప్రభుత్వం, 2002 సంవత్సర ఇందిరా గాంధీ పర్యావరణ్ పురస్కార్ ప్రదానం చేసింది. [26]

వృక్ష, జంతుజాలాలు

[మార్చు]

సరస్సు పర్యావరణం జన్యు వైవిధ్యాన్ని పరిరక్షించడంలో ఎంతో విలువైనది.[9] జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ZSI) 1985 - 1988 మధ్య ఈ సరస్సును సర్వే చేసి, 800 జంతు జాతులను గుర్తించింది. వీటిలో చాలా అరుదైన, అంతరించిపోతున్న జాతులు ఉన్నాయి. కాని భూసంబంధమైన కీటకాలను ఈ జాబితాలో చేర్చలేదు.

వారు గుర్తించిన అరుదైన, అంతరించిపోతున్న జంతు జాతుల్లో ఆకుపచ్చ సముద్ర తాబేలు ( EN ), దుగాంగ్ ( VU ), ఇరావడీ డాల్ఫిన్ ( EN ), బ్లాక్‌బక్ (NT), స్పూన్ బిల్డ్ శాండ్‌పైపర్ ( CR ), చిలికా లింబ్లెస్ స్కింక్ (CR), ఫిషింగ్ క్యాట్ ( VU ) లు ఉన్నాయి. 24 క్షీరద జాతులు ఉన్నాయి. 37 జాతుల సరీసృపాలు, ఉభయచరాలు కూడా ఉన్నాయి. [9] [10]

వృక్షజాలం

[మార్చు]

ఇటీవలి సర్వేలలో 496 ప్రజాతులు, 120 కుటుంబాలకు చెందిన మొత్తం 726 జాతుల పుష్పించే మొక్కలు కనిపించాయి. ఒడిశా రాష్ట్రం మొత్తంలో కనిపించే 2900 వాస్కులర్ మొక్కల జాతుల్లో నాలుగో వంతు ఇది. ఫాబేసి అత్యంత ప్రబలంగా ఉన్న మొక్కల కుటుంబం. దాని తరువాత పోయేసీ, సైపెరేసి ఉన్నాయి. కొన్ని జాతులైతే, కొన్ని ద్వీపాలకు స్వాభావిక లక్షణంగా మారాయి. వృక్షజాలంలో ప్రధానంగా జల, జలగర్భ మొక్కలు ఉన్నాయి. గుర్తించిన జాతులు లెగ్యుమినోసే, పోయేసి, సైపెరేసి; స్థానిక కాసిపౌరియా సెలానికా; ఐదు జాతుల సీగ్రాస్ మొదలైనవి. గుర్తించిన ముఖ్యమైన జాతుల్లో కిందివి ఉన్నాయి. [9] [23]లిప్యంతరీకరణ

 • లెగ్యుమినోసే, పోయేసి, సైపెరేసి
 • స్థానిక కాసిపౌరియా సెలానికా
 • ఐదు జాతుల సీగ్రాస్
 • ఉద్యాన ప్రాముఖ్యత కలిగిన అడవి మొక్కలు, పురుగుల మొక్కలు, ఎపిఫైట్స్, పరాన్నజీవులు, లిథోఫైట్స్ వంటి ఆసక్తికరమైన మొక్కల సమూహాలు
 • మాంగ్రోవ్ అసోసియేట్స్, ఏజిసెరస్ కార్నికులాటస్, ఎక్స్‌కోకారియా అగాలోచ్, సాల్వడోరా పెర్సికా, పొంగమియా పిన్నాటా, కొలుబ్రినా ఆసియాటికా, కప్పారిస్ రోక్స్బర్గి, మాక్రోటైలోమా సిలియటమ్, అనేక ఇతరాలు.

పక్షులు

[మార్చు]

చిలికా సరస్సు భారత ఉపఖండంలో వలస పక్షులకు అతిపెద్ద శీతాకాల స్థావరం. ఇది దేశంలోని జీవవైవిధ్యపు హాట్ స్పాట్లలో ఒకటి. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్‌లో ఉన్న కొన్ని జాతుల పక్షులు వాటి జీవిత చక్రంలో కనీసం కొంత కాలమైనా ఈ సరస్సులో గడుపుతాయి. [27]

వైట్ బెల్లీడ్ సీ ఈగల్స్, గ్రేలాగ్ పెద్దబాతులు, పర్పుల్ మూర్హెన్, జకానా, ఫ్లెమింగోలు, ఎగ్రెట్స్, గ్రే అండ్ పర్పుల్ హెరాన్స్, ఇండియన్ రోలర్, కొంగలు, వైట్ ఐబిస్, స్పూన్‌బిల్స్, బ్రాహ్మణ బాతులు, పారలు, పిన్‌టెయిల్స్ వగైరా పక్షులు.

కాస్పియన్ సముద్రం, బైకాల్ సరస్సు, రష్యా, మంగోలియా, లకా, సైబీరియా, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, హిమాలయాల నుండి మారుమూల ప్రాంతాల నుండి వలస పోయే నీటి కోడి ఇక్కడకు వస్తుంది. [19] 1997-98 శీతాకాలంలో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం సరస్సులో సుమారు 20 లక్షల పక్షులు ఉన్నాయి. [28]

2007 లో, దాదాపు 8,40,000 పక్షులు ఈ సరస్సును సందర్శించాయి, వాటిలో 1,98,000 నల్బానా ద్వీపంలో కనిపించాయి. 2008 జనవరి 5 న, 85 మంది వన్యప్రాణి అధికారులు పాల్గొని చేసిన పక్షుల జనాభా గణనలో 9,00,000 పక్షులను లెక్కించారు. వీటిలో 4,50,000 నల్బానాలోనే కనిపించాయి. లవణీయత పునరుద్ధరించడం వల్ల, నీటి హైసింత్ తొలగింపు వల్లనూ ఇటీవలి కాలంలో పక్షులు మరింతగా సరస్సు వైపు ఆకర్షితు లౌతున్నాయి. [19] [29]

నల్బానా పక్షుల అభయారణ్యం

[మార్చు]

చిలికా సరస్సులో చిత్తడి నేలలు కలిగిన ప్రధాన ప్రాంతం నల్బానా ద్వీపం. నల్బానా అంటే ఒడియా భాషలో కలుపుతో కప్పబడిన ద్వీపం . ఇది సరస్సు మధ్యలో ఉన్న ఒక ప్రధాన ద్వీపం. దీని విస్తీర్ణం 15.53 చ.కి.మీ..వర్షాకాలంలో ఈ ద్వీపం పూర్తిగా మునిగిపోతుంది. శీతాకాలంలో రుతుపవనాలు తగ్గుముఖం పట్టడంతో, సరస్సు మట్టాలు తగ్గుతూండడంతో, ద్వీపం క్రమంగా బయటపడుతుంది. ద్వీపంలోని మడ్‌ఫ్లాట్లలో దొరికే ఆహారం తినేందుకు పక్షులు పెద్ద సంఖ్యలో చేరుతాయి. నల్బానాను 1987 లో గుర్తించి, 1973 లో వన్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం పక్షుల అభయారణ్యంగా ప్రకటించారు. [19] [30]

జల జంతుజాలం

[మార్చు]

చిలికా డెవలప్‌మెంట్ అథారిటీ (సిడిఎ) అప్‌డేట్ చేసిన డేటా (2002) ప్రకారం, ఇక్కడ 323 జల జాతులు ఉన్నాయి. వీటిలో 261 చేప జాతులు, 28 రొయ్యలు, 34 పీతలు ఉన్నాయి. వీటిలో అరవై ఐదు జాతులు సరస్సులో సంతానోత్పత్తి చేస్తాయి. 27 జాతుల చేపలు మంచినీటిలో పేరిగే రకాలు. రొయ్యలు రెండు ప్రజతులకు చెందినవి. మిగిలిన జాతులు సంతానోత్పత్తి కోసం సముద్రంలోకి వలసపోతాయి. క్లూపిడే కుటుంబానికి చెందిన 21 జాతుల హెర్రింగ్‌లు, సార్డైన్లూ ఉన్నాయి.

వల్లాగో అట్టు   - సరస్సులో ఒక సాధారణ రకం చేప

1998-2002 మధ్య, 40 చేప జాతులు ఇక్కడ మొదటిసారిగా నమోదు చేసారు. 2000 లో సరస్సు ముఖద్వారాన్ని తిరిగి తెరిచిన తరువాత, ఆరు అంతరించిపోతున్న జాతులు తిరిగి కనిపించాయి. వీటిలోకింది జాతులు ఉన్నాయి:

 • పాల చేప (సెబా ఖైంగా),
 • ఇండో-పసిఫిక్ టార్పాన్ (పానియాలెహియో),
 • పది పౌండర్ (నహామా),
 • బ్రీమ్ (కాలా ఖురాంతి),
 • హిల్సా (తెన్యులోసా) ఇలిషా (ఇలిషి)
 • ముల్లెట్ ఆర్. కోర్సులా (కెకెండా) [9] [10]

వాణిజ్య రంగంలో చేపల పెంపకం

[మార్చు]

శతాబ్దాలుగా మత్స్యకార ప్రజలు సంక్లిష్ట విభజన వ్యవస్థ ద్వారా సరస్సు లోని మత్స్యసంపదపై ప్రత్యేక హక్కులను తీసుకున్నారు. ఓ స్థిరమైన పద్ధతిలో సరస్సులో చేపల పంటను పండించుకుంటున్నారు. పెద్ద ఎత్తున చేపలు పట్టే పద్ధతులు, వలలు, ఇతర పనిముట్లను అభివృద్ధి చేసుకున్నారు. [18]

బ్రిటిషు పాలనలో, 1897-98లో, మత్స్యకారుల సంఘం సరస్సుపై ప్రత్యేకమైన హక్కులను పొందింది. సరస్సులో చేపల చెరువులు ఖల్లికోట్, పరికుడ్, సునా బీబీ, మీర్జా తాహెర్ బేగ్, భుంగర్‌పూర్ కు చెందిన చౌదరి కుటుంబాలు, ఖుర్దాలోని ఖాస్ మహల్ జమీందారీల్లో భాగంగా ఉండేవి. ఇవి పారికుడ, ఖల్లికోట్ రాజ్యాలలో భాగం. జమీందార్లు (భూస్వాములు) ఈ చేపల చెరువుల స్థానిక మత్స్యకారులకు ప్రత్యేకంగా లీజుకు ఇచ్చారు. [18]

1953 లో జమీందారీ వ్యవస్థను రద్దు చేయడంతో, సాంప్రదాయ చేపల చెరువులు స్థానిక మత్స్యకార సహకార సంస్థల అధీనంలోనే కొనసాగాయి. చేపల పెంపకం, ముఖ్యంగా, రొయ్యల పెంపకం లాభదాయకంగా తయారైంది. 1991 లో ఒడిశా ప్రభుత్వం ప్రతిపాదించిన లీజింగ్ విధానంలో, అత్యధిక బిడ్డర్‌కు లీజులను వేలం వేసే అవకాశం ఏర్పడింది. మత్స్యకారుల సహకార సంస్థలు దీన్ని కోర్టులో సవాలు చేశాయి. సాంప్రదాయిక మత్స్యకారుల ప్రయోజనాలను పరిరక్షించేలా మార్పులను అమలు చేయాలని ఒడిశా హైకోర్టు, ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటి నుండి కొత్త లీజులు ఏవీ ఇవ్వలేదు. ఇది అస్తవ్యస్తమైన పాలనకు దారితీసి, బయటి నుండి స్వార్థపర శక్తులు జోక్యం చేసుకుని ఆధిపత్యం చెలాయించడంతో, స్థానిక ప్రజలు అణచివేతకు గురయ్యారు. [18]

బట్టర్ క్యాట్ ఫిష్, వల్లాగో అట్టు సరస్సులో ఎక్కువగా లభించే చేపలు. 11 జాతుల చేపలు, 5 రకాల రొయ్యలు, 2 పీత జాతులు వాణిజ్యపరంగా ముఖ్యమైనవి. వాణిజ్యపరంగా ముఖ్యమైన రొయ్యలు జెయింట్ టైగర్ రొయ్యలు ( మెటాపెనియస్ మోనోసెరోస్ ), ఇండియన్ రొయ్యలు ( పెనియస్ ఇండికస్ ), మెటాపెనియస్ మోనోసెరోస్ (స్పెక్లెడ్ రొయ్యలు), మెటాపెనియస్ అఫినిస్ (పింక్ రొయ్యలు), మెటాపెనియస్ డాబ్సన్ (కడల్ రొయ్యలు). మడ పీత చాలా ముఖ్యమైన వాణిజ్య పీత. [24] గతంలో హెచ్చుతగ్గులకు గురైన సరస్సులోని చేపలు, కొత్త ముఖద్వారం తెరిచిన తరువాత, 2000-2001లో పాత ముఖద్వారం మగర్‌ముఖ్ పూడిక తీసిన తరువాత, చెప్పుకోదగిన స్థాయిలో వృద్ధి చెందాయి. దీని ఫలితంగా సముద్రం నుండి వచ్చేటైడల్ ప్రవాహం నదుల నుండి వచ్చే మంచినీటి ప్రవాహాలు బాగా కలిసిపోయాయి. 1995-96లో అత్యల్పంగా 1,269 టన్నులు మాత్రమే చేపలు, రొయ్యలు లభించగా, 2001-2002లో 11,878 టన్నులు లభించి అత్యధిక స్థాయిగా నమోదైంది. ఈ సంవత్సరంలో మత్స్యకారుల తలసరి ఆదాయం 19,575 రూపాయలని లెక్కించారు. [10] చేపల పెంపకం కోసం చిలికా సరస్సును లీజుకు ఇవ్వడాన్ని నిషేధిస్తూ ఇటీవల ఒడిశా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. [18]

డాల్ఫిన్‌లు

[మార్చు]

ఇర్రావాడి డాల్ఫిన్ ( ఓర్కెల్లా బ్రీవిరోస్ట్రిస్ ) చిలికా సరస్సులో ప్రధానమైన జాతి. భారతదేశంలో ఇరావడీ డాల్ఫిన్ల స్థావరం చిలికా ఒక్కటే [31] ఈ జాతికి ఆశ్రయమిస్తున్న సరస్సులు ప్రపంచంలో రెండే ఉండగా వాటిలో చిలికా ఒకటి. [30] ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయుసిఎన్) ప్రకారం దీనిని అంతరించిపోతున్న జాతిగా వర్గీకరించారు.

బాటిల్‌నోస్ డాల్ఫిన్లు సముద్రం నుండి మడుగులోకి వలసపోతూంటాయి. [5] ఇరావడీ డాల్ఫిన్లు, బాటిల్‌నోస్ డాల్ఫిన్‌లు బయటి ఛానెల్‌లో ఎదురు పడినప్పుడు, ఇరావడీ డాల్ఫిన్లు భయపడి, వెనక్కి సరస్సు లోకి పారిపోయి వచ్చేస్తాయని చిలికా మత్స్యకారులు అంటారు. [32]

కొన్ని ఇరావడీ డాల్ఫిన్లు ఇన్లెట్ ఛానల్ వెంట, మధ్య మండలం లోని పరిమిత ప్రాంతంలో మాత్రమే కనిపిస్తాయి. 2000 లో సతపాడ వద్ద కొత్త ముఖద్వారాన్ని తెరిచిన తరువాత, అవి ఇప్పుడు సరస్సు మధ్య, దక్షిణ మండలాల్లో బాగా కనిపిస్తున్నాయి. [30] కనబడిన డాల్ఫిన్ల సంఖ్య 50 నుండి 170 వరకు ఉంటుంది. 2006 జనాభా లెక్కల ప్రకారం 131 డాల్ఫిన్లు, 2007 జనాభా లెక్కల ప్రకారం 138 ఉన్నాయి. 138 డాల్ఫిన్లలో 115 మంది పెద్దవి, 17 కౌమారదశలోను, ఆరు పిల్లలూ ఉన్నాయి. బయటి ఛానల్‌లో 60 పెద్దవి కనిపించగా, మధ్య మండలంలో 32, దక్షిణ మండలంలో 23 ఉన్నాయి. [33]

డాల్ఫిన్‌లను చూసేందుకు పడవల్లో చేసే పర్యటనలు డాల్ఫిన్‌ల ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. ప్రతీ సంవత్సరం ప్రమాదవశాత్తు అనేక డాల్ఫిన్‌లు మరణిస్తున్నాయి. [34] CDA డాల్ఫిన్ మరణాలపై వార్షిక గణన నిర్వహిస్తుంది. 2003-04లో 15, 2004-05లో 11, 2005-06లో 8, 2006-07లో 5 మరణాలూ జరిగినట్లు వారు నివేదించారు. 2006-07 మరణాలలో 40% యాంత్రిక పడవల ద్వారానే జరిగాయి. [33]

2004 నుండి, వేల్ అండ్ డాల్ఫిన్ కన్జర్వేషన్ సొసైటీ ఇరావడీ డాల్ఫిన్లను, చిలికా సరస్సునూ పరిరక్షించడానికి సైన్స్ ఆధారిత సామాజిక శిక్షణ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. డాల్ఫిన్ల మరణానికి ప్రధాన కారణం తేలియాడే గిల్ వలలు, పర్యాటక పడవలు గుద్దుకోవడం అని వారు తేల్చారు. [31]

ఇరావడీ డాల్ఫిన్లు చేపలు పట్టడంలో మత్స్యకారులకు సాయం చేస్తూంటాయి. మత్స్యకారులు తమ వలలలో చేపలను తోలేందుకు డాల్ఫిన్లను పిలుస్తారు. [34] అయ్యవాడి నది ఎగువ ప్రాంతాలలో ఇరావడీ డాల్ఫిన్ల సహాయంతో చేపలు ఎలా పడతారో చక్కగా నమోదు చేయబడింది. [35]

ప్రధాన ఆకర్షణలు

[మార్చు]

15 కి.మీ. 2 విస్తీర్ణం గల నలబన్ ద్వీపం సరస్సు పరిధిలో ఉంది. ఇది రామ్సార్ గుర్తించిన చిత్తడి నేలల్లోని ప్రధాన ప్రాంతం. దీనిని 1973 లో వన్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం పక్షుల అభయారణ్యంగా ప్రకటించారు. ఇది ఈ వనానికి గుండెకాయ లాంటిది. వలస కాలంలో వేలాది పక్షులు ఇక్కడికి రావడం చూడవచ్చు. వర్షాకాలంలో వర్షాలకు ఈ ద్వీపం మునిగిపోయి, వర్షాకాలం తరువాత, మళ్లీ వెలుగు చూస్తుంది.

విస్తారమైన ఈ సరస్సులో 225 రకాల చేపలు, అనేక రకాల ఫైటోప్లాంక్టన్, ఆల్గే, నీటి మొక్కలూ ఉన్నాయి. నీటి బయట పెరిగే 350 కి పైగా జాతుల మొక్కలు కూడా సరస్సు ప్రాంతంలో ఉన్నాయి. పక్షులు అధికంగా ఉన్న ఇతర ప్రాంతాలు గెరసారా, పరికుడ్ ద్వీపం, ఉత్తర రంగంలోని పశ్చిమ తీరాలు.

పర్యావరణ పర్యాటకం

[మార్చు]

సుందరమైన సరస్సు, ప్రకృతి సహజమైన వృక్ష, జంతుజాలాలు ఇక్కడి పర్యావరణ పర్యాటకానికి ఆకర్షణలు. ఇది స్థానిక సమాజానికి ప్రత్యామ్నాయ ఉపాధిని అందిస్తుంది. సరస్సు సహజ వనరుల పరిరక్షణ గురించి, వాటిని తెలివిగా ఉపయోగించుకోవడం గురించీ స్థానిక నివాసితులతో పాటు సందర్శకులలో అవగాహనను కలిగిస్తుంది. అటువంటి కార్యకలాపాల కోసం గుర్తించిన కొన్ని ప్రదేశాలు:

 • సరస్సు దక్షిణ కొసన ఉన్న రంభా బే ద్వీపాల సమూహం:
  • బేకన్ ద్వీపం: ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన గంజాం కలెక్టర్ స్నోడ్‌గ్రాస్ నిర్మించిన శంఖాకార స్తంభం (పైన్ దీపం పెట్టేందుకు వీలుగా) ఘంటాసిలా కొండకు సమీపంలో ఉన్న రంభా బేలో భారీ రాతిపై దీన్ని నిర్మించారు.
  • బ్రేక్‌ఫాస్ట్ ద్వీపం: కాలికోట్ రాజు నిర్మించిన శిధిలమైన బంగ్లా అవశేషాలతో బ్రేక్ ఫాస్ట్ దీవిలో అరుదైన మొక్కలున్నాయి. పియర్ ఆకారంలో ఉన్న ఈ దీవిని సంకుడా ద్వీపం అని కూడా అంటారు. ఇది ఆకర్షణీయమైన వృక్షజాలంతో పచ్చదనంతో నిండి ఉంటుంది.
  • హనీమూన్ ద్వీపం: రంభ జెట్టీ నుండి 5 కి.మీ. దూరంలో ఉంది. స్పష్టమైన నీరు, సమృద్ధిగా ఉన్న ఎరుపు, ఆకుపచ్చ ఆల్గేతో, ఉండే ఈ దీవిని బార్‌కూడా అని కూడా పిలుస్తారు.
 • సరస్సు మధ్య, దక్షిణ మండలాల్లో ఉన్న సుమోలో, దుమ్‌కుడి ద్వీపాలు, సుందరమైన ఖలీకోట్ పర్వత శ్రేణి నేపథ్యంలో గొప్ప వృక్ష, జంతుజాలం ఇక్కడి ఆకర్షణ. ఇరావడీ డాల్ఫిన్‌లను కూడా ఇక్కడ చూడవచ్చు.
 • సరస్సు దక్షిణ మండలంలో ఉన్న పక్షుల ద్వీపంలో భారీగా రాళ్ళుంటాయి. పక్షుల రెట్టల్లో ఉండే ఫోలిక్ ఆమ్లం కారణంగా ఈ రాళ్ళు తెల్లగా ఉంటాయి. గొప్ప ఆల్గే కు, కొన్ని జాతుల మడ అడవులకూ, శీతాకాలంలో వలస పక్షులకూ కూడా ప్రసిద్ది చెందింది.
 • పరికుడ్ ప్రకృతి ప్రేమికుల కోసం గఢ్ కృష్ణప్రసాద్ బ్లాక్‌లోని ద్వీపాల సమూహం. శీతాకాలంలో గొప్ప విహంగ దృశ్యాలను చూదవచ్చు
 • కాళిజాయ్ ఒక ద్వీపంలో ఉన్న ఆలయం. ఈ ఆలయం నీటి ఎలుగుబంట్లు ఉండే కొండపై ఉంది. స్థానిక ప్రజలు ఈ దేవతను చిలికా సరస్సు అధిష్ఠాన దేవతగా భావిస్తారు
 • క్రొత్త ముఖద్వారం వద్ద ఉన్న సతపాడ గ్రామం సరస్సు దృశ్యాన్ని, డాల్ఫిన్ల దృశ్యాలను కూడా అందిస్తుంది. ఇక్కడ వందలాది పడవలు పర్యాటకులను సరస్సు పర్యటనకు తీసుకెళ్తాయి.
 • బరున్‌కుడా, మగర్‌ముఖి సమీపంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. ఇక్కడ వరుణ దేవాలయం ఉంది.
 • నబగ్రహా, బయటి చానెల్ గట్టున ఉన్న ఒక పురాతన దేవత.
 • చౌర్‌బార్ శివాలయం బయటి కాలువ వెంట అలుపట్న గ్రామానికి సమీపంలో ఉంది.
 • బయటి ఛానెల్‌లో ఉన్న మాణిక్‌పట్న. చారిత్రికంగా ఇదొక ఓడరేవు అని చెప్పే ఆధారాలు ఉన్నాయి. ఇక్కడి నుండి దూరప్రాచ్య దేశాలతో వాణిజ్యం జరిగేది. శివుని భబకుందేశ్వర్ ఆలయం, తిమింగలం దవడలతో చేసిన ప్రవేశద్వారం గల ఒక పాత మసీదు కూడా ఇక్కడ ఉన్నాయి.
 • సాండ్-బార్, మౌత్ ఆఫ్ ది లేక్: సరస్సుకూ సముద్రానికీ మధ్య ఉండే 30 కిలోమీటర్ల ఇసుక పట్టీ పొడుగునా ఉన్న బీచ్ . [36]
 • మంగళజోడి వలస పక్షులు కనిపించే ప్రసిద్ధ పక్షుల అభయారణ్యం.
 • కాళీజై దేవాలయం చిలికా సరస్సులోని ఒక ద్వీపంలో ఉంది. గోపురము నీలిరంగులో ఉంటుంది.ఈ అభయారణ్యం ఒడిశా పర్యాటకానికి చారిత్రక పురాణంగా పేరుగాంచింది.దాదాపు 24 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపంలో కాళీజై తల్లిని పూజిస్తారు.

చేరుకోవడం

[మార్చు]

ఈ సరస్సు చెన్నై కోల్‌కతా జాతీయ రహదారిపై ఉంది. సరస్సు తూర్పు ఒడ్డున ఉన్న సతపాద పట్టణం పూరి నుండి సుమారు 50 కి.మీ., ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుండి 100 కి.మి.. దూరంలోనూ ఉంది. భుబనేస్వరే సమీప విమానాశ్రయం కూడా.

కోల్‌కతా నుండి ఆగ్నేయ రైల్వే బ్రాడ్ గేజ్ రైల్వే మార్గం సరస్సు పశ్చిమ ఒడ్డున ఉన్న్ బలుగావ్, చిలికా, రంభ స్టేషన్ల గుండా వెళుతుంది. [8]

సరస్సు ఆవరణలో, ఒడిశా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. (OTDC), రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ విభాగం పడవలపై విహార యాత్రలను అందిస్తున్నాయి. ప్రైవేట్ ఆపరేటర్లు సరస్సులోని వివిధ ద్వీపాలకు వెళ్ళేందుకు పడవలను అద్దెకు ఇస్తారు. [37]

బార్కుల్, రంభ, సతపాడ వద్ద OTDC అతిథి గృహాలు, బలుగావ్ వద్ద అనేక హోటళ్ళు ఉన్నాయి. నల్బానా పక్షుల అభయారణ్యంలోకి ప్రవేశించే ముందు ఎంట్రీ పర్మిట్ పొందాలి. ఎంట్రీ పర్మిట్‌ను ఎంట్రీ / ఎగ్జిట్ పాయింట్ల వద్ద, చెక్ గేట్ల వద్దా అధికారులు కోరినప్పుడల్లా చూపించాలి.

గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 Tripati, Sila; A. P. Patnaik (10 February 2008). "Stone anchors along the coast of Chilika Lake: New light on the maritime activities of Orissa, India" (PDF). Current Science. 94 (3). Bangalore: Indian Academy of Sciences: 386–390.
 2. 2.0 2.1 Mohanty, Prof. Prafulla Kumar; Dr. Sanjaya Narayan Otta (June 2008). "Dolphins of Chilika" (PDF). Orissa Review. Govt. of Orissa: 21–26. Archived from the original (PDF) on 10 April 2009.
 3. "Chilika Lake". Ramsar Sites Information Service. Retrieved 25 April 2018.
 4. "New Caledonia - at the heart of the world's biggest lagoon</02.11>". www.boat-duesseldorf.com. Archived from the original on 2016-08-17. Retrieved 2016-07-31.
 5. 5.0 5.1 Forest and Environment Department. "Chilika". Wildlife Conservation in Orissa. Govt of Orissa. Archived from the original on 2012-04-16. Retrieved 2008-12-21.
 6. 6.0 6.1 6.2 "Inventory of wetlands" (PDF). Govt. of India. Retrieved 2008-12-09.
 7. Centre. "Chilika Lake". UNESCO World Heritage Centre. Retrieved 2019-03-19.
 8. 8.0 8.1 8.2 "Chilika At A Glance". Chilika Development Authority. Archived from the original on 2013-03-08. Retrieved 2013-01-23.
 9. 9.0 9.1 9.2 9.3 9.4 9.5 "Chilika Lake". Retrieved 2008-12-16.
 10. 10.0 10.1 10.2 10.3 Chilika Development Authority (2008). "Fish Yield Status". Archived from the original on 2008-06-30. Retrieved 2008-12-11.
 11. 11.0 11.1 Chilika Development Authority (2008). "Welcome to Chilika Lagoon". Archived from the original on 2008-10-01. Retrieved 2008-12-16.
 12. 12.0 12.1 12.2 12.3 The Ramsar Convention (26 November 2008). "The Montreux Record". Retrieved 2008-12-18.
 13. 13.0 13.1 13.2 13.3 13.4 Chilika Development Authority. "Ramsar Award". Archived from the original on 2008-12-07. Retrieved 2008-12-16.
 14. "Dolphin population rises to 152 in Chilika lake in Orissa". The Times Of India. 22 January 2013. Retrieved 2013-01-23.
 15. IANS. 2010. Will growing seagrass beds bring back rare sea cows to Chilika? Archived 2018-06-25 at the Wayback Machine. The Thaindian News. Retrieved on April 19, 2017
 16. Sinha, B.K. (2000). "13. B.K. Sinha, Golabai". In Kishor K. Basa; Pradeep Mohanty (eds.). A Protohistoric Site on the Coast of Odisha. Vol. I (in: Archaeology of Odisha ed.). Delhi: Pratibha Prakashan. pp. 322–355. ISBN 978-81-7702-011-3.
 17. 17.0 17.1 Patra, Sushanta Ku.; Dr. Benudhar Patra (1992–93). "ARCHAEOLOGY AND THE MARITIME HISTORY OF ANCIENT ORISSA" (PDF). OHRJ. XLVII (2). Bhubaneswar: Govt. of Orissa: 107–118. Archived from the original (PDF) on 29 October 2009.
 18. 18.0 18.1 18.2 18.3 18.4 18.5 18.6 18.7 "History of Chilika". Chilika Lake Development Authority, Odisha. Archived from the original on 2008-12-07. Retrieved 2008-12-16.
 19. 19.0 19.1 19.2 19.3 19.4 19.5 Choudhury, Dr. Janmejay (November 2007). "Nature Queen Chilika and Eco-Tourism" (PDF). Orissa Review. Govt. of Orissa: 17–19. Archived from the original (PDF) on 10 April 2009.
 20. 20.0 20.1 Tripathy, Dr. Balaram (November 2007). "Maritime Heritage of Orissa" (PDF). Orissa Review. Govt. of Orissa: 27–41. Archived from the original (PDF) on 10 April 2009.
 21. 21.0 21.1 21.2 21.3 21.4 21.5 Iwasaki, Shimpei (14 December 1998). "Sustainable Regional DevelopmentIn the Catchment of Chilika Lagoon, Orissa State, India" (PDF). In Chilika Development Authority and Department of Water Resources (Odisha) (ed.). Proceedings of the International Workshop in Sustainable Development of Chilika Lagoon. Tokyo, Japan.: Global Environment Information Centre. p. 27. Archived from the original (PDF) on 10 June 2007.
 22. Singh, Sarina; Joe Bindloss; Paul Clammer; Janine Eberle (2005). India. Lonely Planet. pp. 576. ISBN 978-1-74059-694-7.
 23. 23.0 23.1 23.2 23.3 23.4 International Lake Environment Committee (ILEC) (2005). "Chilika Lagoon-Experience and Lessons Learned Brief, Asish K.Ghosh, CED & Ajit K.Patnaik, CDA, pp. 116-129" (PDF). Retrieved 2008-12-16.
 24. 24.0 24.1 Wood, Alexander; Pamela Stedman-Edwards; Johanna Mang, eds. (2000). "Ch. 10 India: Chilika Lake". The Root Causes of Biodiversity Loss. Earthscan. pp. 213–230. ISBN 978-1-85383-699-2.
 25. Chilika Development Authority. "Restoration". Archived from the original on 2008-08-03. Retrieved 2008-12-15.
 26. Chilika Development Authority. "News". Archived from the original on 2008-12-07. Retrieved 2008-12-16.
 27. "Chilika Lake". Retrieved 2008-12-16.
 28. staff (15 October 1998). "Birds Crowd Odisha Sanctuary". Times of India. Times of India. Archived from the original on 27 July 2009. Retrieved 2008-12-21.
 29. "900,000, Birds Visit Chilika Lake". Archived from the original on 2012-12-09. Retrieved 2008-12-09.
 30. 30.0 30.1 30.2 "fig.1 Chilika Lagoon Basin" (PDF). Retrieved 2008-12-23.
 31. 31.0 31.1 Sutaria, Dipani (2007). "Irrawaddy dolphin — India" (PDF). Whale and Dolphin Conservation Society. Archived from the original (PDF) on 2009-03-26. Retrieved 2008-12-25.
 32. Sinha, R.K. (May–August 2004). "The Irrawaddy Dolphins Orcaella of Chilika Lagoon, India" (PDF). Journal of the Bombay Natural History Society. 101 (2). Mumbai, India: online edition: Environmental Information System (ENVIS), Annamalai University, Centre of Advanced Study in Marine Biology, Parangipettai - 608 502, Tamil Nadu, India: 244–251. Archived from the original (PDF) on 10 April 2009.
 33. 33.0 33.1 Das, Subrat (28 February 2008). "Dolphins better off in Chilika — Survey reveals dip in death toll of Irrawaddy School". The Telegraph. Calcutta, India: Calcutta. pp. Front page. Retrieved 2008-12-25.
 34. 34.0 34.1 D'Lima, Coralie (2008). "Dolphin-human interactions, Chilika" (PDF). Whale and Dolphin Conservation Society. Archived from the original (PDF) on 2009-03-19. Retrieved 2008-12-21.
 35. Tun, Tint (2008). "Castnet Fishing with the Help of Irrawaddy Dolphins". Irrawaddy Dolphin. Yangon, Myanmar. Archived from the original on 2008-07-25. Retrieved 2008-12-25.
 36. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ecotour అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 37. Chilika Development Authority (2008). "How to reach". Archived from the original on 2008-06-28. Retrieved 2008-12-16.