బోయ

వికీపీడియా నుండి
(చుండు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

రామాయణం భారతీయ వాజ్మయంలో ఆదికావ్యంగాను దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిద్ధం. శ్రీరాముడు జీవనయానమే రామాయణం. ఆ మహాగ్రంధమే లేకుంటే రాముడెవరో మనకు తెలిసేది కాదు అలా తెలిసేలా చేసిన మహాపురుషుడే వాల్మీకి. వాల్మీకిమహర్షి బోయజాతి మూలపురుషుడు. వాల్మీకి మహర్షిని తమ ఆరాధ్య దైవంగా బోయలు కొలుస్తారు.

ఆశ్వీజమాసంలో వచ్చే పౌర్ణమి రోజున వాల్మీకి జయంతిగా జరుపుతుంటారు. ఈ సందర్భంగా వాల్మీకిమహర్షి గురించి తెలుసుకుందాం. సంస్కృతంలో మొట్టమొదటి కవి వాల్మీకి. శ్లోకం అనే ప్రక్రియను కనుగొన్నది కూడా ఈయనేనంటారు. వల్మీకం అంటే పుట్ట. ఆ పుట్ట నుంచి వెలుపలికి వచ్చినవాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు అంటారు. వాల్మీకి తల్లిదండ్రుల గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుడు తాను పరాశరుడి కుమారుడినని తన రచనల్లో చెప్పుకున్నారు. కానీ వాల్మీకి ఎక్కడా తల్లిదండ్రుల గురించి ప్రస్తావించలేదు. అయితే.... సీతను శ్రీరాముడుకి అప్పగించే సమయంలో తన గురించిన ప్రస్తావన చేశాడు.

ఉత్తరకాండలో ఉన్న విషయం ఏమిటంటే... రామా నేను ప్రచేతనుడి ఏడో కుమారుడిని. వేల సంవత్సరాలు తపస్సు చేసి ఏ పాపమూ చేయలేదు, ఎలాంటి అబద్దమూ ఆడలేదు. సీత నిన్ను తప్ప వేరే పరపురుషుడిని ఎరుగదు. నా మాట అబద్ధం అయితే నేను చేసిన తపస్సు అంతా పోతుంది’ అంటాడు.

ఇంతకీ... ఈ ప్రచేతనుడు ఎవరు? ఆయనది ఏ వంశం? లాంటి విషయాలను కూడా తెలుసు కోవాలి. ‘శ్రీమద్భాగవతం’ లో అతని ప్రస్తావన ఉంది. దీన్ని వేదవ్యాసుడు రాశాడు. రామాయణం త్రేతాయుగంలో జరిగితే భాగవతం రాసిన వేదవ్యాసుడు ద్వాపరయుగం నాటి వాడు. ఇది ఎలా రాశాడన్న ప్రశ్న కూడా కలుగుతుంది. పురాణ రచయితలను భగవంతులుగానే భావిస్తారు. అది ఏ యుగమైనా ఒకటే కదా. ఆ భగవంతుడే వాల్మీకిగానూ, వేదవ్యాసుడిగానూ జన్మించి పురాణాలు రాశాడంటారు. ప్రచేతనుడు చేస్తున్న సత్రయాగంలో నారదుడు గానం చేసినట్లు చెప్పారు కదా.. అతను ఎవరు? వారి కుమారులు ఎవరు? అని విదురుడు మైత్రేయునితో అడిగే సందర్భంలో ఈ ప్రశ్న కనిపిస్తుంది. ఇక్కడ తెలిసింది ఏమిటంటే ప్రచేతనుడు విష్ణుభక్తుడు. అతను క్షత్రియుడు. ఆయనకు యజ్ఞయాగాల గురించి నారదుడు ఉపదేశించారు.

ఆ తర్వాత కథాక్రమంలో ధ్రువుడి తపస్సు, శ్రీహరి ప్రత్యక్షమై వరాలివ్వడంతో ధ్రువ వంశ విస్తరణ జరిగింది. వీరు సూర్యవంశస్తులైన బోయలు. వీరి వంశక్రమం వత్సరుడు, పుష్పార్ణుడు, సాయంకాలుడు, చక్షుడు, ఉల్కకుడు, అంగుడు, వేనుడు, పృథ్వీరాజు, విజితాశ్వుడు, పావనుడు, హవిర్ధానుడు, ప్రచేతసుడుగా చెబుతారు.

ఈ ప్రచేతనుడికి పది మంది ప్రాచేతసులు అని ఉంది. వీరి జన్మవృత్తాంతాలు చూస్తే అంగుడి బాధ, వేనుడి దుశ్చర్యలు, పృథ్వీరాజు ఔన్నత్యం, నిషాదుడు అడవులలోకి వెళ్లిపోయి కిరాత రాజవ్వటం జరుగుతుంది. ప్రచేతసుడికి జన్మించిన ఆ 10 మంది ప్రాచేతసులలో 7వ వాడు వాల్మీకి మహర్షి. నారదుల ఉపదేశంతో తండ్రి, తాతల, ముత్తాతల పూర్వజన్మ సుకృతం, శ్రీహరిపై తరతరాల భక్తి విశ్వాసాలు వాల్మీకిని మహర్షిగా మార్చాయి. వాల్మీకిమహర్షికి సంబంధించిన అసలు కథ ఇది.

వాల్మీకిమహర్షి ‘ఓం ఐం హ్రీం క్లీo శ్రీo’ అనే బీజాక్షరాలను సరస్వతీ , లక్ష్మి, మాయ కటాక్షాన్ని కలుగచేసే మంత్రాలను లోకానికి పరిచయం చేశారు. వాల్మీకి మహర్షి వద్ద శిష్యరికం చేసిన భరద్వాజుడు, లవుడు, కుశుడు మహర్షిని భగవాన్ అని సంబోధించేవారట. బ్రహ్మసమానుడని, రామాయణాన్ని రాయటానికి బ్రహ్మ తానే వాల్మీకి మహర్షిగా అవతరించాడని నమ్మేవారు కూడా ఉన్నారు. ఆదికవి వాల్మీకి ఆ రోజులలోనే ‘అక్షరలక్ష’ అనే ఈనాటి ఎన్సైక్లోపెడియా ఆఫ్ బ్రిటానికా లాంటి విజ్ఞాన సర్వస్వన్ని అందించారు. యోగవాశిష్టం అనే యోగా , ధ్యానం గురించిన మరో పుస్తకాన్ని కూడా వాల్మీకి రాశారు. ఈ పుస్తకం రామాయణంలో భాగమే. రాముడు పది – పన్నెండేళ్ల వయసులో మానసిక అశాంతికి లోనైనప్పుడు వశిస్టుడి ద్వారా యోగా, ధ్యానం శ్రీరాముడికి బోధించారు. వశిష్ఠుడు పలికిన విషయాలనే వాల్మీకి రాశాడు. ఆదిత్య హృదయం రాసింది కూడా వాల్మీకి మహర్షే. వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడినని వాల్మీకి పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు , సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ – కుశలను కన్నట్టు ఉంది. వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తోంది. మహర్షిగా మారిన వాల్మీకి దండకార్యణం గుండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడని చెబుతారు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో రాశాడని అంటారు. తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలో పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదీ తీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడట.

శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడని చెబుతారు పరిశోధకులు. వాల్మీకి జీవితం శ్రీలంకలోనే ముగిసింది...వాల్మీకి చరిత్ర..

బోయల సామజికహోద

[మార్చు]

భారతదేశంలోని ప్రధాన సామాజిక వర్గాలలో లేదా కులాలలో బోయ ఒకటి. బోయలను కన్నడబాషలో వాల్మీకినాయక అని పిలుస్తారు.వీరు వాల్మీకి మహర్షిని వారి జాతి దైవంగా మూలపురుషుడుగా గుర్తించి.పూజిస్తారు. వీరిని వాల్మీకి, నాయుడు, నాయక అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఈ దేశంలో పెద్దకులాలలో బోయ ఒక్కటి.

చరిత్ర

[మార్చు]

సంస్కృత మహాభారత కావ్యంలో పేర్కొనబడ్డ బోయవారు తమ ధైర్య సాహసాలతో భూములను ఆక్రమించి అనుభవించే వారు కావున వీరు "భోగికులని" అదే పేరు బోయ అయ్యిందని శ్రీ కంభంపాటి సత్యనారాయణ అభిప్రాయ పడ్డారు . శ్రీ ఆర్.బి.కిత్తూర "వాల్మీకి వంశజరా" అనే కన్నడ ప్రచురణలో దక్షిణ భారతదేశములోని బోయలు, ఉత్తరభారతదేశములోని రాజ కుటుంబాలు అన్నదమ్ములని, దాయాదులని వ్రాశారు. బోయ అన్నది ఆటవిక కాలములో ధైర్య ,సాహసములకు మెచ్చిఇచ్చిన ఒక బిరుదు అని కంభంపాటి సత్యనారాయణ తెలిపారు. బోయలు క్షత్రియులు అని జవహరలాల్ యూనివర్సిటీ చరిత్రపరిశోధకులైన ఆచార్య ఛటోపాధ్యాయ అభిప్రాయపడ్డారు. బోయ అనేపదమును ఒక గౌరవ పదముగా బిరుదుగా ఇవ్వబడినది అని ధైర్యసాహసములు కలిగిన వారికి ఒసంగ బడినది అని (ఆంధ్రులచరిత్ర -సంస్కృతి) తెలపబడినది. ఆనాటి స్థితిగతులను అనుసరించి వేట వీరి జీవనాధారము. అడవులలో,కొండలు,గుట్టలు కలిగిన ప్రాంతాలలో బోయలు నివసించే వారు.

బోయవారిని "వారియర్స్ అండ్ రూలర్స్" అని ఆంగ్లేయులు (castes and tribes of southern India) అభివర్ణించారు. "రాయ వాచకము" ప్రకారం శత్రువులను తుదముట్టించడానికి విజయనగర సామ్రాజ్యపు రాజైన కృష్ణదేవరాయలు తన మంత్రి అయిన అప్పాజీతో కలిసి విలువిద్యలో సాటిలేని బోయ దొరలను, ఇతర 11 సంస్థానాల సహాయం తీసుకొన్నాడు.అనతి కాలంలోనే బోయ దొరలు కర్నాటకలో రాయదుర్గం, ఆంధ్రదేశంలో కళ్యాణదుర్గం కోటలకు అధిపతులై విజయనగర సామ్రాజ్యానికి సామంతులుగా చేశారు. 10 - 18 శతాబ్దాల మధ్య కర్నాటకలో చిత్రదుర్గ కోట నిర్మాణంలో రాష్ట్రకూటులు, హోయసాల, చాళుక్యులుతోపాటూ బోయపాలెగార్లు కూడా పాలుపంచుకొన్నారు. తూర్పు చాళుక్యులు, విష్ణుకుండినులు, కాకతీయులు సైన్యాల్లో బోయ తెగలవారు సైనికులుగా కీలక పాత్ర పోషించారు.

"బోయలు" గురించిన మొట్టమొదటి సూచన తూర్పు చాళుక్య పాలకుడు విష్ణువర్ధన II యొక్క శాసనంలో కనుగొనబడింది , ఇక్కడ వివిధ గ్రామాల నుండి అనేక మంది వ్యక్తులకు భూమి మంజూరు చేయబడింది, అన్నింటికీ బోయ వారి పేరుతో జతచేయబడింది. పూర్వపు వలసవాద పండితులు దీనిని కేవలం "నివాసి" అని భావించారు, అయితే ఇటీవలి స్కాలర్‌షిప్ వేరే విధంగా సూచిస్తుంది, అంటే గ్రహీతలు బోయా కమ్యూనిటీకి చెందినవారు కావచ్చు. ప్రారంభ బోయలు ఒక గిరిజన సంఘంగా భావించబడ్డారు, వారు క్రమంగా కుల సమాజంలోకి ప్రవేశించారు. ఇది శాసనాలు మరియు ప్రస్తుత రోజుల్లో వృత్తిపరమైన స్వభావంగా కనిపించే వంశ పేర్ల నుండి ఆధారాలపై ఆధారపడింది.[1]

700 CE నుండి ప్రారంభమైన కర్ణాటకలో వారి గురించిన తొలి సూచనలు , వారిని దోపిడీదారులుగా మరియు స్థిరపడిన గ్రామాలపై దాడి చేసేవారిగా చిత్రీకరించబడ్డాయి. ఈ సూచనలు మధ్యయుగ కాలం అంతటా కొనసాగుతాయి. పరివారాలు అనే పేరుతో , తక్కోళం యుద్ధంలో చోళులు ఉపయోగించిన సైనికులుగా బేడార్లను పేర్కొన్నారు .[2]

విష్ణువర్ధన V మరణం తరువాత, బోయలు చాళుక్యులకు వ్యతిరేకంగా లేచి, ఆధునిక కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని వేంగిని త్వరగా స్వాధీనం చేసుకున్నారు . కొత్త రాజు బోయలను ఓడించడానికి పాండ్రంగ అనే సైన్యాధిపతిని పంపాడు. పంద్రాంగ విజయవంతంగా వెంగిని తిరిగి స్వాధీనం చేసుకుని, 12 బోయ ఎస్టేట్‌లను స్వాధీనం చేసుకున్నాడు మరియు పునరావృతం కాకుండా నిరోధించడానికి, మొత్తం ప్రాంతానికి గవర్నర్‌గా నియమించబడ్డాడు.


చిత్రదుర్గ కోట బీదర నాయకుల కాలంలో నిర్మించబడింది. మధ్యయుగ కాలంలో కన్నడ ప్రాంతాలలో, బేడార్లను మొదట "బిల్లవులు" (వెలిగిన విల్లు ప్రజలు) అని పిలిచేవారు మరియు భూమి మంజూరు చేయడానికి తగినంత శక్తి కలిగి ఉన్నారు. మరికొందరు అరస మరియు నాయక వంటి బిరుదులను కలిగి ఉన్నారు , వారు పాలకవర్గంలో భాగమని సూచిస్తున్నారు. వారి ఆసక్తులను పెంపొందించడానికి, శాసనాలు బేదార్లు తమ సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి మరియు తమను తాము కీర్తించుకోవడానికి సంఘాలను ఏర్పాటు చేసుకున్నాయని కూడా వెల్లడిస్తున్నాయి. ఇంకా చాలా మంది విరగల్లులో తరచుగా కీర్తించబడ్డారు . [2]

విజయనగర సామ్రాజ్యం పతనం సమయంలో , ఏర్పడిన అధికార శూన్యత అనేక సంఘాలు ముందుకు రావడానికి వీలు కల్పించింది. గతంలో అధీనంలో ఉన్న చాలా మంది బీదర్ నాయకులు ఇప్పుడు మరింత బహిరంగంగా భూభాగాన్ని నియంత్రించడం ప్రారంభించారు. ఈ బహుగార్లలో చాలా మంది బోయ దళాల పెద్ద బలగాలను సేకరించడం ప్రారంభించారు. బళ్లారి ఈస్టిండియా కంపెనీలోకి ప్రవేశించే సమయంలో మొత్తం బళ్లారి వారి ఆధీనంలో ఉంది. హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్ హయాంలో బేదార్లు మైసూర్ సైన్యంలోకి భారీగా రిక్రూట్ అయ్యారు ..[3] [4]

సర్ధార్ హనుమప్పనాయుడు గద్వాల సంస్థానం పాలనాకాలంలో యంగన్న పల్లె గ్రామానికి చెందిన సర్ధార్. బోయ కులస్థుడు. గద్వాల సంస్థాన స్థాపక ప్రభువు పెద్ద సోమభూపాలుడునికి(నల సోమనాద్రికి) సమకాలికుడు. ఇతని స్వగ్రామం నేడు మహబూబ్ నగర్ జిల్లా లోని అలంపూర్ ప్రాంతంలో ఉండిన ఇటిక్యాల మండలంలోని ఒక చిన్న పల్లె. దీనిని ప్రస్తుతం బొచ్చెంగన్న పల్లెగా పిలుస్తారు. ఇదే మండలంలోని ధర్మవరం గ్రామ పంచాయతీకి ఇది అనుబంధ గ్రామం. ఈ గ్రామానికి చెందిన హనుమప్ప నాయుడు ధైర్యశాలి. సాహాసి. రాజకార్యపరుడు. ప్రాణాలకు తెగించి తన ప్రభువు విజయానికి దొహదపడిన కార్యశూరుడు.

సర్ధార్ హనుమప్పనాయుడు త్యాగాన్ని తెలిపే ఉదంతం

[మార్చు]

గద్వాల ప్రాంతం కృష్ణానది సమీపాన ఉండటం వలన తనకు అన్ని విధాల అనుకూలమైనదిగా భావించి, ఇక్కడ కోట నిర్మించి, తన రాజధానిని పూడూరు నుండి ఇక్కడకు మార్చాలనుకున్నాడు సోమనాద్రి . అయితే సోమనాద్రి కోట నిర్మించాలనుకున్న ప్రాంతం తన ఆధీనంలోని ప్రాంతమని గద్వాలకు, రాయచూరుకు మధ్యలో ఉన్న ఉప్పేరును పాలిస్తున్న నవాబు సయ్యద్ దావూద్ మియా కోట నిర్మాణానికి అడ్డుచెప్పాడు. ఇతను నాటి నిజాం నవాబు నాసిరుద్దౌలాకు బంధువు. ఎలాగైనా కోటను ఇక్కడే నిర్మించాలని నిర్ణయించుకున్న సోమనాద్రి తీవ్ర ఆలోచనలో పడిపోయాడు. అనుకున్న పని జరుగాలంటే ఓ మెట్టు దిగక తప్పదని భావించిన సోమనాద్రి, సంధి తప్ప మరో మార్గం లేదని గ్రహించాడు. ఉప్పేరు నవాబుతో సంధి కుదుర్చుకున్నాడు. కోట నిర్మాణానికి అనుమతిస్తే, నిర్మాణానంతరం కొంత పైకం చెల్లించగలనని సోమనాద్రి చెప్పాడు. నవాబు కూడా అంగీకరించాడు. కోట నిర్మాణానికి ముందు ఉప్పేరు నవాబుతో చేసుకున్న ఒప్పందాన్ని సోమనాద్రి కోట నిర్మాణానంతరం ఉల్లంఘించాడు. మొదట్లోనే పైకం చెల్లించడం ఇష్టం లేకపోయినా కోట నిర్మాణానికి ముందు, అనవసర రాద్ధాంతం దేనికని నవాబుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పని పూర్తైన పిదప ఒప్పందాన్ని తోసిపుచ్చాడు. దానితో ఆగ్రహించిన నవాబు సోమనాద్రిపై యుద్ధాన్ని ప్రకటించాడు. తనకు తోడు రావలసిందిగా రాయచూరు నవాబు బసర్ జంగుకు, అలంపూర్ పరగాణాలోని ప్రాగటూరును పాలిస్తున్న హైదర్ సాహెబ్‌కు కబురు పంపాడు సయ్యద్ దావూద్ మియా. సోమనాద్రి తన సైన్యంతో, మూడు ప్రాంతాల నవాబుల సైన్యాన్ని రాయచూరు సమీపంలోని అరగిద్ద(ఇది నేడు గట్టు మండలంలోని ప్రాంతం)దగ్గర ఎదుర్కొన్నాడు. ఇరు పక్షాల మధ్య సంకుల సమరం సాగింది. ఈ యుద్ధంలో సోమనాద్రి వీరోచిత పోరాటానికి తాళలేక రాయచూరు నవాబు బసర్ జంగ్ పలాయానం చిత్తగించాడు. ఇది గమనించిన ప్రాగటూరు నవాబు హైదర్ సాహెబ్ కూడా చేసేదేమిలేక ఇంటి ముఖం పట్టాడు. తోడు నిలుస్తారని భావించిన మిత్రులు వెన్ను చూపడంతో, ఏకాకిగా మిగిలిన సయ్యద్ దావూద్ మియా పోరాటం చేయలేక, ప్రాణాల మీది తీపితో తన ఓటమిని అంగీకరించి, సోమనాద్రిని శరణు వేడాడు. ఇక ముందెన్నడూ మీ జోలికి రానని, యుద్ధ పరిహారంగా తన యుద్ధ చిహ్నాలైన నగారా, పచ్చ జెండా, ఏనుగులను సోమనాద్రికి సమర్పించుకున్నాడు. దిగాలుగా ఉప్పేరుకు చేరుకున్నాడు.

అరగిద్ద యుద్ధంలో పరాబావాన్ని ఎదుర్కొన్న ఉప్పేరు నవాబు సయ్యదు దావూద్, మరుసటి రోజు తన కోటపై నుండి గద్వాల వైపు చూడగా గద్వాల కోటపై రెపరెపలాడుతున్న తన పచ్చ జెండా కనిపించింది. అది అతనిని మరింతంగా కుంగదీసింది. ఆగ్రహింపజేసింది. ప్రతీకారంతో రగిలిపోయాడు. ఎలాగైనా దెబ్బకు దెబ్బ తీయాల్సిందేనని కంకణం కట్టుకున్నాడు. అనుకున్నదే తడువుగా నాటి నిజాం నాసిరుద్దౌలా దగ్గరకు హైదరాబాద్‌కు ప్రయాణమయ్యాడు. తన అవమానాన్ని, తన దీనస్థితిని చెప్పుకున్నాడు. సోమనాద్రిని దండించే వరకు నాకు మనశ్శాంతి ఉండదని చెప్పాడు. దానికి నిజాం సోమనాద్రి మీదకు దండయాత్ర మంచిది కాదని, ఆ యోచన విరమించుకోమని సయ్యద్‌కు సలహా ఇచ్చాడు. కాని సయ్యద్ పట్టు విడవలేదు. తప్పని పరిస్థితిలో ఉప్పేరు నవాబు సయ్యదు దావూద్ మియాకు బాసటగా నిజాం నవాబు సోమనాద్రి మీదకు యుద్ధాన్ని ప్రకటించాడు. అరగిద్ద యుద్ధంలో పరాజయం పాలై అవమానంతో రగిలిపోతున్న రాయచూరు, ప్రాగటూరు నవాబులకు ఇది అనుకోని వరమైంది. వెంటనే తమ సైన్యాలతో కలిసి, నిజాం సైన్యానికి తోడయ్యారు. తుంగభద్రకు ఉత్తరాన ఉప్పేరు, రాయచూరు, ప్రాగటూరు నవాబుల సైన్యం తోడుగా నిజాం సైన్యం బయలుదేరింది. వీరు చాలరని తుంగభద్రకు దక్షిణాన గుత్తి నవాబు టీకు సుల్తాన్, కర్నూలు నవాబు దావూద్ ఖాన్, బళ్ళారి నవాబుల సైన్యాలు జతగూడాయి. ఇంత మంది సైన్యం జతగూడడమే సోమనాద్రి పరాక్రమానికి ప్రబల నిదర్శనం. ఏడుగురు నవాబుల సైన్యాలు తుంగభద్ర నదికి దక్షిణాన నిడుదూరు(నేటి నిడ్జూరు) గ్రామానా విడిది చేశాయి. సోమనాద్రి తన సైన్యంతో తుంగభద్రకు ఉత్తరాన ఉన్న కలుగొట్ల (నేటి మానోపాడు మండలంలోని గ్రామం) దగ్గర విడిది చేశాడు. మరుసటి రోజు నిడుదూరు దగ్గర యుద్ధం ప్రారంభమయింది. సూర్యోదయంతోనే సోమనాద్రి తన సైన్యంతో నిడుదూరు మిద దండెత్తాడు. రోజంతా నవాబుల సైన్యంతో వీరొచితంగా పోరాడాదు. నవాబుల సైన్యం కకావీలమైపోయింది. సోమనాద్రి ఆ రాత్రి తిరిగి కలుగొట్లకు వచ్చి విశ్రమించాడు.

ఆ రోజు పోరాటంలో సోమనాద్రి పరాక్రమాన్ని చూసిన నిజాం, ఆ రాత్రి తక్షణ దర్బారు నిర్వహించాడు. సోమనాద్రిని ఓడించడానికి ఉపాయం చెప్పమన్నాడు. ఒక సర్ధారు సోమనాద్రి బలమంతా అతని గుర్రమేనని దాన్ని వశం చేసుకొంటే, మన విజయం సులువేనని చెప్పాడు. వెంటనే నిజాం, సోమనాద్రి గుర్రాన్ని ఈ రాత్రికి దొంగిలించి తెచ్చినవాడికి జాగీరును ఇస్తానని ప్రకటించాడు. ప్రాణాలకు తెగించి ఒక సైసు కలుగొట్లకు వచ్చి సోమనాద్రి గుర్రాన్ని తీసుకవెళ్ళాడు. ఇచ్చిన మాట ప్రకారం నవాబు అమితానందంతో జాగీరుతో పాటు, ఒక బంగారు కడియాన్ని కూడా సైసుకు బహుమానంగా ఇచ్చాడు.

మరుసటి రోజు సోమనాద్రి కలుగొట్ల శిబిరంలో కలకలం చెలరేగింది. తన గుర్రం లేక పోవడం తనకు కుడిచేయి తెగినట్లుగా అనిపించింది. అయినా ధైర్య,స్థైర్యాలను విడువకుండా ఎలాగోలా రెండో రోజు యుద్ధాన్ని ముగించాడు. ముందు రోజు నాటి ఉత్సాహం లేక పోవడాన్ని గమనించి, తన వాళ్ళందరితో సమాలోచన చేశాడు. తన గుర్రాన్ని తెళ్ళవారేలోగా ఎవరైతే తిరిగి తెచ్చివగలరో వారికి ఆ గుర్రం ఒక రోజు తిరుగునంత వరకు భూమిని ఇనాంగా ఇవ్వగలనని ప్రకటించాడు.

సోమనాద్రి ప్రకటనకు సర్ధారు హనుమప్పనాయుడు ముందుకు వచ్చాడు. నాయుడు ఆ రాత్రి జొన్న సొప్పను ఒక మోపుగా కట్టుకొని నిడ్జూరుకు బయలుదేరాడు. నిజాం సైన్యం డేరాలను సొప్ప అమ్మేవాడిగా సమీపించాడు. అక్కడి సైన్యం సొప్పను ఖరీదు చేయగా హనుమప్ప ధర కుదురనీయలేదు. తన లక్ష్యం గుర్రం కాబట్టే అలా చేశాడు. ఎవరికి అనుమానం రాకుండా గుర్రాన్ని వెతుకుతూ డేరాలన్ని చూశాడు. చివరకు ఒక దగ్గర గుర్రం ఉండటాన్ని గమనించాడు. గుర్రం కూడా హనుమప్పను చూసి సకిలించింది. సొప్పను చూసే సకిలించిందని సరి పెట్టుకున్నారు అక్కడి సైనికులు. గుర్రం కనపడిన ఆనందంతో తక్కువ దరకే సొప్పను అమ్మాడు. ఆ తర్వాత తప్పించుకొనే సమయం కోసం ఎదురుచూస్తూ, ఎవరి కంటాపడకుండా అక్కడే ఉన్న గడ్డి మోపుల కింద చప్పుడు కాకుండా దూరాడు. నాయుడుని చూసిన ఆనందంతో కట్టేసిన గుర్రం పెనుగులాడి గూటం పెరికి, సకిలించింది. దాని అలికిడికి దగ్గరలో ఉన్న ఒక సైనికుడు గుర్రం దగ్గరకు వచ్చాడు. నాయుడు చప్పుడు కాకుండా గడ్డి కింద అలాగే పడుకొని ఉండిపోయాడు. ఆ సైనికుడు పెరికిన గూటాన్ని తిరిగి గడ్డి మీద మోపి పాతి, గుర్రాన్ని కట్టేసిపోయాడు. ఆ గడ్డి కింద వెల్లకిలా పడుకొని ఉన్న నాయుడి కుడి చేతి మీద ఆ గూటం దిగిపోయింది. ఆ బాధకు తనుకులాడితే, ప్రాణాలే పోయే ప్రమాదమని గ్రహించిన నాయుడు సహనంతో ఓర్చుకొని అలాగే ఉండిపోయాడు. అర్థ తాత్రి దాకా, సమయం కొరకు ఎదురు చూశాడు. అందరూ గాడ నిద్రలో ఉండటాన్ని గమనించి ఇదే తగిన సమయమని భావించి, చేతిని పీకే ప్రయత్నం చేశాడు. ఎంతకూ రాక పోయేసరికి నడుముకున్న కత్తిని ఎడమ చేతితో తీసుకొని, గూటం పాతిన కుడి చేతి భాగాన్ని నరుక్కొన్నాడు. తెగిన భాగానికి తలపాగ చుట్టికొని లేచాడు. గుర్రాన్ని చప్పుడు కాకుండా సైనికుల డేరాలు దాటించి, కలుగొట్ల వైపు దౌడు తీయించాడు. ఆ రాత్రి సోమనాద్రి ముందు గుర్రంతో సహా నిలబడి హనుమప్ప నాయుడు ఎడమ చేతితో సలాం చేశాడు. నాయుడి దుశ్చర్యకు రాజు ఆగ్రహించాడు. రక్తమోడుతున్న నాయుడి తెగిన కుడి చేతిని చూశాకా, జరిగిన సంగతంతా విన్నాకా సోమనాద్రి కదిలిపోయి,నాయుడుని కౌగిలించుకొని సన్మానం చేశాడు. ఇచ్చిన మాట ప్రకారం అప్పటికప్పుడు దాన శాసనం రాయించాడు. తన గుర్రం తిరిగి రావడంతో అమితోత్సాహుడైన సోమనాద్రి మరుసటి రోజు యుద్ధంలో ఉత్సాహంతో పాల్గొని నవాబులపై విజయాన్ని సాధించాడు. విజయోత్సాహంతో సోమనాద్రి గద్వాలకు తిరిగి వచ్చాడు. గద్వాలకు తిరిగి వచ్చిన తరువాత సోమనాద్రి ఇచ్చిన మాట ప్రకారం హనుమప్ప నాయుడుకి గుర్రం ఒక రోజంతా తిరిగే భూమిని ఇనాంగా ఇచ్చాడు. కాల క్రమేణా చాలా భూమి ఇతరుల ఆధీనంలోకి వెళ్ళిపోయినా ఈ నాటికి హనుమప్ప నాయుడు సంతతి వారు అధిక భూములను ఆ గ్రామంలో అనుభవిస్తున్నారు. ఆ గ్రామంలో, దాని సమీప గ్రామమైన బొచ్చు వీరాపురంలో ఇతని సంతతి వారే భూస్వాములు. ఈ నాటికీ ఆయా గ్రామాలలో నాయుడి సంతతి వారి మాట చెలామణి కావడాన్ని గమనించవచ్చు.

ఉప కులములు

[మార్చు]

తూర్పు చాళుక్యుల రికార్డుల ప్రకారం అనగా విష్ణువర్ధనుడు 2 పాలనా కాలంలో కొన్ని బోయ వంశాలవారు బ్రాహ్మణులకు దీటుగా వేదాలు, పురాణాలు చదివి, వైదిక ధర్మాలను ఆచరించి బోయ-బ్రాహ్మణులుగా ప్రకటించుకున్నారు. బోయ-బ్రాహ్మణులను ద్రావిడ-బ్రాహ్మణులు అని కూడా అంటారు. ఈ ఉప కులము వారు బ్రాహ్మణ వైదిక ధర్మాలను ఆచరించసాగారు, యజ్ఞయాగాదులు నిర్వహించే వారు. మధ్య యుగంలో కొన్ని బోయ తెగలవారు ఉత్తరభారతంలో కిరాత తెగల చేతిలో పెరిగిన వాల్మీకిని తమ పూర్వీకుడుగా భావించుకొనుట వలన వాల్మీకి-బోయ అను ఉపకులము కూడా ఏర్పడినది. తరువాత పెద్ద బోయ, చిన్న బోయ, బోయ నాయుడు, బోయ నాయక్ లు, బోయ తలారులు వంటి అను ఉప కులాలు కూడా ఏర్పడ్డాయి. బోయలు ఆనాటి స్థితిగతులను, వృత్తి, వ్యాపకములను బట్టి 1.కోవెల బోయలు 2.సింహాసనబోయలు 3.ఆల బోయలు 4.మంద బోయలు 5.గొల్ల బోయలు అని సామాజిక విభజనలు చేసుకున్నారు. కోవెలబోయలు ధార్మిక కార్యక్రమములను నిర్వహిస్తూ, వేదములను చదువుకునెడి వారు. సింహాసనబోయలు ప్రజా రక్షణ, పరిపాలన గావిస్తూ, క్షత్రియ ధర్మాలను ఆచరించేవారు. ఆల బోయలు ఆవులను కాస్తూ, పాడిపంటలను కొనసాగించే వారు. మందబోయలు ప్రజల ఆరోగ్యమునకై పాటు బడుతూ మందులను ఆకుల, వేర్ల, కాండములతో తయారు చేసి ఇచ్చేవారు. గొల్ల బోయలు గొర్రెలు, మేకలను పోషించేవారు. ఈ సామాజికవిభజనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

  • బోయ ➼ భయములేని వారు:
  • క్షత్రియ ➼ క్షాత్రము కలిగినవారు:
  • ఊరుబోయ ➼ గ్రామాలు, నగరాలలో నివసించే బోయలు:
  • మ్యాసబోయలు ➼ గడ్డి గల నేలల్లో, అడవులలో నివసించే బోయలు:
  • సూర్యబోయలు ➼ సూర్యవంశస్థులైన బోయలు:
  • చందనబోయలు ➼ చంద్ర వంశబోయలు:
  • త్రికోటిబోయలు ➼ నక్షత్రవంశబోయలు:
  • కోవెలబోయలు ➼ దేవాలయాలలో పూజా కార్యక్రమములు నిర్వహించే బోయలు, వీరు వేదము నేర్చుకొని, యజ్ఞ, యాగాదులు నిర్వహించి “శర్మ” అనే పేరు కలిగి ఉంటారు.వీరే “బ్రాహ్మణు”లైనారు.
  • సింహాసనబోయలు ➼ వీరు సైనికులు,నాయకులు,మండలాధీశ్వరులు,పాలయగార్లు,నాయకరాజులు.వీరే “రాజులు “అయినారు.
  • ఆలబోయలు ➼ వీరు ఆవులను కాచుకునేవారు,వీరే గో అంటే ఆవుల గురించే ఎక్కువగా మతి అనగా ఆలోచన కలిగి ఉండేవారు.గోమతులు-కోమటులు అయి కోమట్లు అయింది.వీరే”వైశ్యులై”నారు
  • గొల్లబోయలు ➼ గడ్డి నేలల్లో గొర్రెలను,మేకలను పెంచుకునే వారిని “గొల్ల బోయలు” అన్నారు.వీరే “గొల్లలు”అయినారు.
  • మందబోయలు ➼ అడవులలో దొరికే ఆకులు, కాండములు, లతలు, వేర్లు ఉపయోగించి మందులను తయారు చేసి వైద్యము చేసే వారు.
  • పెద్దబోయలు ➼ వీరు అడవి జంతువులను వేటాడములో నిష్ణాతులు.అడవి దున్న, ఎద్దులను పట్టుకొని వాటిని ఆహారముగా తీసుకునే అలవాటు గలవారు.
  • చిన్నబోయలు ➼ వీరు ఆవులను కాచుకొనే వారు.వ్యవసాయము, వ్యాపారము సాగించే వారు.
  • సదరుబోయలు ➼ వీరు రైతు కూలీలుగా, పొలము, ఇంటిపనుల సహాయకులుగా పని చేసే వారు. [ఆధారం చూపాలి]

ఆచార వ్యవహారాలు

[మార్చు]

సర్ ఎడ్వర్డ్ తర్ద్స్టున్ ప్రకారం బోయ తెగల్లో ఎన్నో ఉపకులాలు ఉన్నాయి,16 రకాల షోడశ ఉపచార ఆచార వ్యవహారాలు ఉన్నాయి.వివాహ విధుల్లో ఈ ఉపకులాల మధ్య కూడా ఎన్నో తేడాలు ఉన్నాయి.కొన్ని బోయ ఉప కులాల్లో ఆచార వ్యవహారాలు, వివాహ విధులు వైదికత్వానికి భిన్నంగా ఉంటాయి.ఉత్తర కర్నాటక, తెలంగాణాలో కనిపించే భేదార్ అను బోయ తెగవారు తిరుపతి వెంకటేశ్వరుడు, శివుడు, రాముడు, విష్ణువు, కృష్ణుడు, హనుమంతుడు వంటి ప్రధాన దేవుళ్ళనే కాకుండా ఎల్లమ్మ, పోచమ్మ, బాలమ్మ, మైసమ్మ, మరియమ్మ, నాగమ్మ వంటి గ్రామ దేవతలను కూడా ఆరాధిస్తారు.

ప్రముఖులు

[మార్చు]

పురాణ పురుషులు

[మార్చు]
  • వాల్మీకి - శ్రీరాముడి జీవితచరిత్రను రామాయణముగా మహాకావ్యరచన గావించినవాడిగా ఆదికవి అయ్యాడు.
  • అంగదుడు - జగన్నాధ మహాత్మ్యం అనే కావ్యంలో శ్రీరాముని ఆజ్ఞ వల్ల అంగదుడు ద్వాపర యుగం లో కృష్ణావతార కాలంలో బోయవాడుగా పుట్టాడు.
  • గుహుడు - రామాయణంలో గుహుడు ఒక బోయ రాజు. శ్రీరాముని భక్తుడు.
  • శబరి - శ్రీరాముని భక్తురాలు. శ్రీరాముని దర్శనానికై జీవితాంతం భక్తితో వేచియుండి చివరికి రామ దర్శనం పొందిన ధన్యజీవి.

క్రీ. శ. ప్రముఖులు

[మార్చు]

ప్రస్తుత ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Nandi, R. N. (1968). "The Boyas—Transformation of a Tribe into Caste". Proceedings of the Indian History Congress. 30: 94–103. ISSN 2249-1937. JSTOR 44141458. ఏడవ శతాబ్దం CE నాటికి, నెల్లూరు-గుంటూరు ప్రాంతంలోని గ్రామాలను బోయలకు మంజూరు చేయడం జరిగింది మరియు నిషాద (చాలా మటుకు బోయ) అని వర్ణించబడిన ఒక అధిపతి, విష్ణువర్ధన II యొక్క సామంత రాజుగా నెల్లూరు అంచులను పరిపాలిస్తున్నాడు. పల్లవుల దాడులకు గురయ్యే సరిహద్దు ప్రాంతమైన నేటి దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో బోయల ప్రాబల్యం ఉన్నందున ఈ భూమి మంజూరు చేయబడిందని నంది ఊహించారు.
  2. 2.0 2.1 Nayaka, Hanuma (2010). "Situating Tribals in the Early History of Karnataka". Proceedings of the Indian History Congress (in ఇంగ్లీష్). 71: 97–109. JSTOR 44147477. Retrieved 2021-02-23.
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :2 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. "తెలుగు బోయల వీరగాథ బోయకొట్టములు పండ్రెండు". sarasabharati-vuyyuru.com/. సరసభారతి, ఉయ్యూరు. Retrieved 8 December 2014.
  1. ఆంధ్రుల చరిత్ర-ఆచార్యడా.బిఎస్ఎల్ హనుమంతరావు
  2. ఆంధ్రుల సంస్కృతి-చరిత్ర-ఆచార్య ఖండవల్లి లక్ష్మి నిరంజనం, శ్రీ బాలేందు శేఖరం
  3. ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి-శ్రీకంభంపాటి సత్యనారాయణ
  4. castes and tribes of southern India-sir Edgard Thurdstun and Rangachary
  5. వాల్మీకి వంశాజర (కన్నదబాషలో) -శ్రీఆర్.బి.కిత్తూర
  6. బోయలే తొలి తెలుగు చోళరాజులు-భీమనాథుని శ్రీనివాస్
  7. మను స్మృతి-మనువు

యివికూడా చూడండి

[మార్చు]

లంకెలు

[మార్చు]
  1. హైందవ ధర్మవీరులు- సురవరం ప్రతాపరెడ్డి.
  2. సోమనాద్రి- సురవరం ప్రతాపరెడ్డి,తెలుగు వాచకం, 9 వ తరగతి,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణలు, హై.బా.,1967, పుట- 132.
  3. సోమనాద్రి- సురవరం ప్రతాపరెడ్డి,తెలుగు వాచకం, 6 వ తరగతి,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణలు, హై.బా.,2013, పుట- 63.
"https://te.wikipedia.org/w/index.php?title=బోయ&oldid=4361385" నుండి వెలికితీశారు