Jump to content

బాలకాండ

వికీపీడియా నుండి
(బాలకాండము నుండి దారిమార్పు చెందింది)

బాలకాండ లేదా బాలకాండము (Bala Kanda ) రామాయణం కావ్యంలో మొదటి విభాగము.

భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని రచించిన వాల్మీకిమహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. చాలా భారతీయ భాషలలోను, ప్రాంతాలలోను ఈ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. భారతీయుల సంస్కృతి, సాహిత్యము, ఆలోచనా సరళి, సంప్రదాయాలలో రామాయణం ఎంతో ప్రభావం కలిగి ఉంది. రామాయణంలోని విభాగాలను కాండములు అంటారు. ఒకో కాండము మరల కొన్ని సర్గలుగా విభజింపబడింది.

వీటిలో బాల కాండ మొదటి కాండము. ఇందులో 77 సర్గలు ఉన్నాయి. ఈ కాండములోని ప్రధాన కథాంశాలు: కథా ప్రారంభము, అయోధ్యా నగర వర్ణన, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము, పరశురామునితో స్పర్ధ

సంక్షిప్త కథ

[మార్చు]

బాలకాండము కథ సంక్షిప్తముగా ఇక్కడ చెప్పబడింది.

కావ్యావతరణ

[మార్చు]

నారదుడు ఒకమారు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. సర్వోన్నత లక్షణాలున్న పురుషుడెవరైనా ఉన్నాడా అని వాల్మీకి అడుగగా నారదుడు శ్రీరాముని కథ చెప్పాడు. రాముడు సత్యధర్మవ్రతుడు. మహావీరుడు. అనితర రూప గుణ సంపన్నుడు. సకల గుణాభిరాముడు. ఆ రాముని చరిత్రం పరమ పవిత్రం. సకల వేద సారం. అని చెప్పాడు.

క్రౌంచ పక్షులను నిషాదుడు చంపగా వాల్మీకి నోటి నుండి అప్రయత్నంగా వచ్చిన రామాయణ శ్లోకం

తరువాత వాల్మీకి తమసా నదిలో స్నానానికి వెళ్ళినపుడు ఒక నిషాదుడు క్రౌంచపక్షిని సంహరించడం చూచాడు. అప్రయత్నంగా వాల్మీకి నోట మానిషాద! ప్రతిష్ఠాం... అనే ఛందోబద్ధమైన శ్లోకం వెలువడింది. అనంతరం బ్రహ్మ వాల్మీకి చెంతకు వచ్చి అటువంటి శ్లోకాలలోనే రామాయణాన్ని రచించమని ఆదేశించాడు. పర్వతాలు, నదులూ ఉన్నంతకాలం లోకంలో సీతారామచరితం నిలిచి ఉంటుందని అనుగ్రహించాడు.

వాల్మీకి ధ్యానమగ్నుడైనపుడు అతనికి రామాయణం మొత్తం సకల రహస్యాలతో అవగతం అయ్యింది. అపుడు వాల్మీకి రామచరితాన్ని సమస్త కామార్ధాలతోను, గుణార్ధాలతోను మధురంగా రచించాడు. అందులో మొత్తం 24 వేల శ్లోకాఉన్నాయి. 500 సర్గలు (ఉత్తర కాండతో కలిపి) ఉన్నాయి. ఆ రామాయణాన్ని వాల్మీకినుండి నేర్డి కుశలవులు అందరూ ఆనందించి ప్రశంసించేలా గానం చేశారు.

అయోధ్యాపురం, రాముని జననం

[మార్చు]
దశరథునికి పాయస పాత్రను అందిస్తున్న యజ్ఞపురుషుడు

ఘనమైన ఇక్ష్వాకు వంశానికి చెందిన దశరథుడు వేదవేత్త, పరాక్రమశాలి, ధర్మ పరాయణుడు. సుసంపన్నమైన కోసల దేశాన్ని అతడు అయోధ్యా నగరం రాజధానిగా జనరంజకంగా పరిపాలిస్తున్నాడు. కాని సంతానం లేనందున ఆ మహారాజు చింతాక్రాంతుడైనాడు. మంత్రులు, గురువుల దీవనలతో యాగం చేయ తలపెట్టాడు. అందుకు తన సోదర సముడైన అంగరాజు రోమపాదుని కూతురు శాంత, అల్లుడు ఋష్యశృంగులను అయోధ్యకు ఆహ్వానించాడు. ఋష్యశృంగుడు ఋత్విక్కుగా అశ్వమేధయాగం జరిగింది. తరువాత ఋష్యశృంగుడే పుత్రకామేష్టి యాగం కూడా చేయించాడు.

ఆ యాగం వల్ల సంతుష్టులైన దేవతల ప్రార్థనలను మన్నించి, శ్రీ మహావిష్ణువు తాను రావణ సంహారార్ధమై తన నాలుగు అంశలతో దశరథ మహారాజునకు నలుగురు కుమారులుగా మానవ జన్మ ఎత్తడానికి సంకల్పించాడు. దేవ దానవ గంధర్వ యక్ష రాక్షసులచే మరణం సంభవించదని వరం పొందిన రావణుడు దేవతలను పీడిస్తున్నాడు. కనుక నర వానరుల చేత మాత్రమే వాడు మరణించే అవకాశం ఉంది.

దశరథుని కుమారుల జననం - 1712 కాలంనాటి చిత్రం

యజ్ఞపురుషుడిచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలైన కౌసల్య, కైక, సుమిత్రలకిచ్చాడు. వారు తేజోవతులై గర్భము దాల్చారు. చైత్ర నవమి నాడు, పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో, గురూదయ సమయంలో కౌసల్యకు రాముడు జన్మించాడు. కైకకు పుష్యమీ నక్షత్రయుక్త మీన లగ్నంలో భరతుడు జన్మించాడు. సుమిత్రకు ఆశ్లేషా నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు. వారికి కులగురువు వశిష్ఠుడు నామకరణం జరిపించాడు. అన్నదమ్ములు నలువురూ సకల గుణ తేజో సంపన్నులై విద్యాభ్యాసం చేస్తూ అందరికీ ప్రీతిపాత్రులైనారు. అన్నదమ్ములలో రాముడు ప్రత్యేకించి దశరథునకూ, సకల జనులకూ ప్రాణసమానుడై ప్రకాశించాడు. లక్ష్మణుడు ఎప్పుడూ రాముని ఎడబాసి ఉండేవాడు కాదు.

ఇంద్రాది దేవతలు తమ అంశలతో వానర, భల్లూక వీరులకు జన్మలనిచ్చారు. బ్రహ్మ అంశతో జాంబవంతుడు, ఇంద్రుని అంశతో వాలి, సూర్యుని అంశతో సుగ్రీవుడు, బృహస్పతి అంశతో తారుడు, విశ్వకర్మ అంశతో నలుడు, అగ్ని అంశతో నీలుడు, కుబేరుని అంశతో గంధమాదనుడు, అశ్వినీ దేవతల అంశలతో మైంద ద్వివిధులు, వరుణాంశతో సుషేణుడు, పర్జన్యాంశతో శరభుడు - ఇలా మహావీరులైన వానర భల్లూక సమూహం శ్రీరామునకు రావణ సంహారంలో సహాయపడడానికి వృద్ధి చెందింది. వాయుదేవుని అంశతో అసమాన పరాక్రమశాలి, తేజో వేగ సంపన్నుడు, వజ్ర సదృశ దేహుడు అయిన ఆంజనేయుడు జన్మించాడు.

విశ్వామిత్రుని వద్ద శిష్యరికం

[మార్చు]
యాగాన్ని రక్షించడానికి రాముని తనతో పంపమనీ దశరథుని కోరుతున్న విశ్వామిత్రుడు

ఒకమారు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చి, తాను చేసే యాగాన్ని మారీచ సుబాహులనే రాక్షసులు విధ్వంసం చేస్తున్నారనీ, వారిని సంహరించి యాగాన్ని పరిరక్షించడానికి రాముని తనతో పంపమనీ దశరథుని కోరాడు. పదిహేను సంవత్సరాల బాలుడు కౄర రాక్షసును నిలువరించ జాలడనీ, కనుక తానే సైన్య సమేతంగా వచ్చి యాగ రక్షణ చేయడానికి అనుమతించమనీ దశరథుడు అర్ధించాడు. విశ్వామిత్రుడు సమ్మతించలేదు. ఇక కులగురువు వశిష్ఠుని ప్రోత్సాహంతో దశరథుడు రామునీ, లక్ష్మణునీ విశ్వామిత్రునితో పంపాడు.

మార్గంలో ముందుగా విశ్వామిత్రుడు బల, అతిబల అనే తేజోవంతమైన విద్యలను రామునకుపదేశించాడు. వాటివలన అలసట, ఆకలిదప్పులు కలుగవు. మువ్వురూ రాత్రి విశ్రమించారు. తెల్లవారి విశ్వామిత్రుడు "కౌసల్య కడుపు చల్లగా ఉండుగాక. రామా. తెల్లవారింది. మేలుకో, ఆహ్నికాలు నెరవేర్చుకో" అని ప్రబోధించాడు.

తాటక వధ, యాగ పరిరక్షణ

[మార్చు]
తాటకిపై బాణ ప్రయోగం చేస్తున్న రాముడు

మరొక రాత్రి మన్మధాశ్రమంలో విశ్రమించి, మరునాడు వారు భయంకరమైన తాటకా వనంలో ప్రవేశించారు. అక్కడ మహాబలవంతురాలు, మాయావి అయిన తాటక వారిని వేధించసాగింది. గురువుఆజ్ఞపై రాముడు తాటకను వాడిబాణంతో సంహరించాడు.

మరునాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను దీవించి, వారికి అనేక దివ్య శస్త్రాస్త్రాలు, వాని ప్రయోగ ఉపసంహార క్రమాలు ప్రసాదించాడు. అనంతరం వారు విశ్వామిత్రుని సిద్ధాశ్రమం ప్రవేశించారు. ఒకప్పుడు అది త్రివిక్రముడైన శ్రీ వామనమూర్తి ఆశ్రమం. అక్కడ రామలక్ష్మణులకు ఆశ్రమ, యాగ సంరక్షణా బాధ్యతను అప్పగించి విశ్వామిత్రుడు యజ్ఞదీక్ష వహించాడు. యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి మారీచ సుబాహలు రాక్షస సమూహాలతో ఆకాశంలో ముసురుకున్నారు. రాముడు శేతేశువుతో మారీచుని నూరామడల దూరంలోని సముద్రంలోకి విసిరేశాడు. ఆగ్నేయాస్త్రంతో సుబాహుని దండించాడు. వాయువ్యాస్త్రంతో అందరినీ తరిమికొట్టాడు. యజ్ఞం నిరుపద్రవంగా నిర్విఘ్నంగా ముగిసింది. ఆనందించిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులను దీవించాడు.

మరునాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటనిడుకొని జనక మహారాజు చేసే యజ్ఞాన్ని చూడడానికి మిధిలానగరానికి బయలుదేరాడు.

విశ్వామిత్రుని వంశము

[మార్చు]
కుశనాభుని యొక్క నూరుగురు కుమార్తెలు

ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ దారిలో శోణానది తీరాన విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు తన వంశగాధ చెప్పాడు – కుశుడనే ధర్మ వ్రతుడైన తపశ్శాలి భార్య విదర్భ రాజపుత్రి. వారి నలుగురు కొడుకులలో కుశనాభుడనే వానికి భార్య ఘృతాచి అనే అప్సరస. వారికి నూరుగురు కూతుళ్ళు. ఒక మారు వారు వాయుదేవుని కోరికను తిరస్కరించడంవలన అతని శాపానికి గురై వారు కుబ్జలయ్యారు.

ఊర్మిళ కూతురు సోమద అనే గంధర్వ కన్యకకు చూళి అనే బ్రహ్మర్షి అనుగ్రహం వలన బ్రహ్మదత్తుడనే కొడుకు లభించాడు. మహారాజయిన ఆ బ్రహ్మదత్తుడు కుశనాభుని కుమార్తెలు అయిన నూరుగురు కుబ్జలనూ పెళ్ళాడడానికి అంగీకరించాడు. అతను చేత్తో తాకగానే ఆ నూరుగురు కుబ్జలూ యధాప్రకారం త్రిలోక సుందరులైనారు.

తరువాత కుశనాభుడు పుత్రునికోసం యాగం చేసి గాధి అనే కొడుకును కన్నాడు. ఆ గాధి, సోమదల కుమారుడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని అక్క సత్యవతి ఋచీకుడనే మహామునిని పెండ్లాడింది. ఆమే తరువాత కౌశికీ నదిగా భూలోకంలో అవతరించింది. ఆ నది ఒడ్డునే విశ్వామిత్రుడు నివసిస్తున్నాడు.

గంగావతరణ గాధ

[మార్చు]
దొంగిలించబడిన అశ్వమును కపిలుని ఆశ్రమము దగ్గర కనుగొన్న సగర పుత్రులు

TAరువాత రాముని కోరికపై విశ్వామిత్రుడు కుమారస్వామి జన్మ వృత్తాంతాన్ని, త్రిపధ గామిని అయిన గంగానది అవతరణ గాథను వినిపించాడు.

తేజోమయమైన శివుని రేతస్సును అగ్ని గంగానదికిచ్చాడు. ఆమె ఆ తేజస్సును భరించలేక హిమవత్పర్వత పాదంపై తన గర్భాన్నుంచింది. అందుండి శ్వేత పర్వతమూ, రెల్లుగడ్డీ జన్మించాయి. అందులో ఉద్భవించిన కుమారస్వామిని షట్కృత్తికలు పాలిచ్చి పెంచారు. ఆ కార్తికేయునికి దేవతలందరూ దేవసేనాధీపత్యం ఇచ్చి అభిషేకించారు.

అయోధ్యాధిపతి సగరునకు పెద్దభార్య కేశిని వల్ల అసమంజసుడనే కొడుకు, రెండవ భార్య సుమతి వల్ల అరవై వేలమంది కొడుకులు జన్మించారు. అసమంజసుని కొడుకు అంశుమంతుడు అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. సగరుడు అశ్వమేధయాగం చేసినపుడు దేవేంద్రుడు యజ్ఞాశ్వాన్ని హరించుకుపోయాడు. అశ్వాన్ని వెదుకుతూ సగరుని అరవై వేల మంది కొడుకులు భూమి అంతా గాలించి, ఆ పై భూమిని త్రవ్వుతూ పాతాళానికి పోయి దిగ్గజాలకు నమస్కరించి, ఇంకా త్రవ్వసాగారు. కపిలుని సమీపంలో యజ్ఞాశ్వాన్ని చూచి కపిలుని నిందించారు. కపిలుని కోపాగ్నికి భస్మమైపోయారు.

తన జటాజూటము నుండి గంగను విడుదల చేస్తున్న శివుడు. - రాజా రవి వర్మ చిత్రం

పినతండ్రులను, గుర్రాన్ని వెదుకుతూ అంశుమంతుడు పాతాళానికి చేరి పినతండ్రుల భస్మరాశులను చూచి దుఃఖించాడు. వారి ఆత్మలు స్వర్గం చేరాలంటే వారికి గంగాజలాలతో తర్పణం చేయమని గరుత్మంతుడు అంశుమంతునికి చెప్పాడు. అశ్వాన్ని తీసుకువచ్చి సగరునిచే యజ్ఞం పూర్తి చేయించిన అంశుమంతుడు సగరుని అనంతరం రాజైనాడు. తన తరువాత తన కొడుకు దిలీపునకు పట్టం గట్టి అంశుమంతుడు 12 వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. దిలీపుని కొడుకు భగీరధుడు వేయి సంవత్సరాలు తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై, భగీరధుని కోరిక మన్నించమని గంగకు అనుజ్ఞ ఇచ్చాడు. కాని భూమిపై దూకే గంగను భరించడం ఒక్క సదాశివునకే సాధ్యం. భగీరధుడు మరల తపస్సుతో శివుని ప్రసన్నం చేసుకొని గంగను శిరసున ధరించమని కోరాడు.

హైమనతి అయిన గంగ దుస్సహ వేగంతో ఆకాశంనుండి శివునిపైకురికింది. ఆమెను శివుడు తన జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్థనపై ఒక పాయను నేలకు వదిలాడు. ఉరుకులు పరుగులతో గంగ భగీరధుని వెంట బయలుదేరి, దారిలో ఎందరినో పునీతం చేసింది. ఆ ప్రవాహం తన యజ్ఞశాలను ముంచివేసినందుకు కోపించి జహ్న మహర్షి గంగను పానం చేసేశాడు. పిదప దేవతల విన్నపాలపై తన చెవిలోనుండి వదలిపెట్టాడు. కనుక ఆమె జాహ్నవి అయ్యింది. గంగ భగీరధుని వెంట సముద్రంలో కలిసి, పాతాళానికి వెళ్ళి, సగర పుత్రుల భస్మరాసులపైనుండి ప్రవహించి, వారికి ఉత్తమ గతులు కలిగించింది.

తరువాత విశాల అనే నగరంలో విశ్రమించినపుడు విశ్వామిత్రుడు ఆ నగరానికి చెందిన క్షీర సాగర మధన గాథను, మరుత్తుల గాథను రామలక్ష్మణులకు చెప్పాడు. విశాల నగరానికి రాజయిన సుమతి వారిని సమ్మానించాడు.

అహల్య వృత్తాంతము

[మార్చు]
అహల్య శాపవిమోచనం

ఆపై మిథిలకు వెళ్ళే దారిలో వారికి శూన్యమైన గౌతమాశ్రమం కనిపించింది. ఒకప్పుడు ఇంద్రుడు గౌతమ రూపం ధరించివచ్చి గౌతముని ముని అయిన అహల్యతో కలిసాడు. అందుకు గౌతముడు కుపితుడై ఇంద్రుని, అహల్యను శపించాడు. తత్కారణంగా ఇంద్రుడు మేషవృషణుడూ (శరీరము అన్తటా 1000 కన్నులు కలవాడూ) అయ్యాడు. అహల్య అదృశ్యరూపంలో వాయుభక్షణ మాత్రమే చేస్తూ, ధూళిలో పొరలాడుతూ ఆ ఆశ్రమంలోనే, మంచుతెరచే కప్పబడిన పూర్ణ చంద్రబింబంలా, ధూమావృతమైన అగ్నిజ్వాలలా ఉంది. శ్రీరాముడు ఆశ్రమంలోకి వచ్చినపుడు ఆమె శాపం తొలగిపోవడం వలన ఆమె అందరికీ కనిపించింది. రామ లక్ష్మణులు ఆమె పాదాలు స్పృశించారు. ఆమె భక్తి శ్రద్ధలతో వారిని పూజించింది. గౌతముడు కూడా వచ్చి అహల్యతో కలిసి అతిథులను పూజించాడు.

సంతుష్ఠులైన విశ్వామిత్ర రామ లక్ష్మణులు ప్రయాణం కొనసాగించి జనకుని పాలనలో ఉన్న మిథిలా నగరాన్ని చేరుకొన్నారు. జనకుడు సవినయంగా వారిని తన యజ్ఞశాలకు ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను పరిచయం చేశాడు.

విశ్వామిత్రుని కథ

[మార్చు]
విశ్వామిత్రుని బ్రహ్మర్షిగా ప్రకటిస్తున్న బ్రహ్మ, ఇతర దేవతలు

జనకుని పురోహితుడైన శతానందుడు అహల్య, గౌతముల కొడుకు. తన తల్లి శాపవిమోచనయై భర్తను చేరుకోవడం విని మిక్కిలి సంతసించాడు. విశ్వామిత్రుని తపోబల చరిత్ర రామునికి చెప్పాడు –

గాధి కొడుకైన విశ్వామిత్రుడు మహారాజుగా ఉన్నపుడు ఒకమారు వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠుడు తనవద్దనున్న శబళ అనే కామధేనువు సాయంతో విశ్వామిత్రునికీ, అతని చతురంగ బలాలకూ గొప్పగా విందు చేశాడు. విశ్వామిత్రుడు సంతోషించి ఆ శబళను తనకీయమని, అందుకు ప్రతిగా కోటి గోవులు, కావలసినంత ధనం ఇస్తానని, కోరాడు. వశిష్ఠుడు నిరాకరించగా విశ్వామిత్రుడు బలవంతంగా శబళను తీసుకుపోదలచాడు.

ఆత్మ రక్షణార్ధం వశిష్ఠుని అనుమతి తీసుకొని శబళ తననుండి సృష్టించిన మహాసైన్యంతో విశ్వామిత్రుని సేనను నాశనం చేసింది. విశ్వామిత్రుడు ప్రయోగించిన శస్త్రాస్త్రాలు కూడా వ్యర్ధమయ్యాయి. పంతం పట్టి విశ్వామిత్రుడు శివుని గూర్చి తపస్సు చేసి సకల దివ్య శస్త్రాస్త్రాలూ సాధించి, మరల వశిష్ఠుని ఆశ్రమంపై దండెత్తాడు. కాని వశిష్ఠుని బ్రహ్మదండం ముందు అవీ విఫలమయ్యాయి. బ్రహ్మాస్త్రం కూడా పనిచేయలేదు.

క్షాత్రబలం వ్యర్ధమని గ్రహించి విశ్వామిత్రుడు తీవ్రంగా తపస్సు ఆచరించాడు. అతనికి బ్రహ్మదేవుడు రాజర్షి స్థాయినొసగినా విశ్వామిత్రుడు సంతుష్ఠుడు కాలేదు. తరువాత ఇక్ష్వాకు వంశీయుడైన త్రిశంకు మహారాజు కోరికను నెరవేర్చే ప్రయత్నంలో విశ్వామిత్రుడు మరో స్వర్గాన్నే సృష్టించాడు. లోకాలన్నీ ఉన్నంతకాలం విశ్వామిత్రుని సృష్టి కూడా వైశ్వానర పథానికి బయట శాశ్వతంగా ఉంటుంది.

పుష్కర తీర్ధంలో తపసు చేసుకొంటున్న విశ్వామిత్రుడు అంబరీషుని యజ్ఞంలో నరపశువుగా వాడబడుతున్న శునశ్శేపుడనే వాడిని రక్షించాడు. తరువాత మరో వెయ్యి సంవత్సరాలు ఉగ్రమైన తపస్సు చేశాడు. అతడిని మహర్షి అని బ్రహ్మ నిర్ణయించినా తృప్తుడు కాలేదు. కొంత కాలం మేనక, ఇంద్రుడు, రంభ విఘ్నాలు కలిగించినా గాని మరలా తపసు కొనసాగించాడు. ఆ తపసుకు మెచ్చి చివరకు బ్రహ్మాది దేవతలు, వశిష్ఠుడు వచ్చి విశ్వామిత్రుని బ్రహ్మర్షి అని కొనియాడి గౌరవించారు.

వివాహ నిశ్చయము

[మార్చు]
శివ ధనుర్భంగము - రవివర్మ చిత్రం

జనకుడు యాగ సమయంలో భూమిని దున్నుతున్నపుడు నాగేటి చాళ్ళలో ఒక ఆడు బిడ్డ లభించింది. అయోనిజయైన ఆమెకు సీత అని సార్థకనామం ఉంచి జనకుడు పెంచాడు. ఆమె వీర్యశుల్క అనీ, శివధనుస్సును ఎక్కుపెట్టిన వారికే ఇస్తాననీ ప్రకటించాడు. జనకుని ఇంట పూర్వులకాలం నుండి శివధనుస్సు పూజలందుకొంటున్నది. దానిని అంతకు పూర్వం ఎవరూ ఎక్కుపెట్టలేకపోయారు.

విశ్వామిత్రుని కోరికపై జనకుడు శివధనుస్సును తెప్పించి రాఘవులకు చూపించాడు. విశ్వామిత్రుని అనుజ్ఞ తీసికొని రాముడు అవలీలగా నారి ఎక్కుపెట్టాడు. బ్రహ్మాండమైన ధ్వనితో విల్లు విరిగిపోయింది. జనకుడు సంతోషించి వీర్యశుల్క అని తాను ప్రతిజ్ఞ చేసిన సీతకు రాముడు తగిన వరుడని నిశ్చయించాడు, విశ్వామిత్రుని అంగీకారంతో దశరథ మహారాజుకు కబురు పంపాడు. వర్తమానం తెలుసుకొని దశరథుడు సపరివారంగా మిథిలకు వెళ్ళి జనక మహారాజు పూజలందుకొన్నాడు. కన్యాదాత ఔదార్యాన్ని బట్టి తాము సీతను కోడలిగా ప్రతిగ్రహించడానికి సిద్ధమని చెప్పాడు. జనకుని యజ్ఞం ఆనందంగా ముగిసింది.

మరునాడు సభకు జనకుని తమ్ముడైన కుశధ్వజుడు కూడా వచ్చాడు. సభలో విశ్వామిత్రుని అనుమతితో వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశక్రమాన్ని వివరించాడు. జనకుడు తమ వంశక్రమాన్ని వివరించాడు. వశిష్ఠుడూ విశ్వామిత్రుడూ సంప్రదించి జనకుని కుమార్తెలైన సీతకు రాముడూ, ఊర్మిళకు లక్ష్మణుడూ, కుశధ్వజుని కుమార్తెలైన మాండవికి భరతుడూ, శ్రుతకీర్తికి శత్రుఘ్నుడూ తగిన వరులని నిర్ణయించారు. వారి ప్రతిపాదనకు జనకుడు ఎంతో సంతోషించి, దోసిలియొగ్గి వందనమొనర్చి, భగదేవతానీకమైన ఉత్తర ఫల్గునీ నక్షత్రంలో నలుగురు జంటల వివాహం కావాలని ఆకాంక్షించాడు.

సీతారామ కల్యాణము

[మార్చు]
దశరథుని కుమారుల వివాహము

దశరథుడు గోదానాది కర్మలు ముగించుకొని వచ్చి, కృతకౌతుక మంగళులైన కుమారులతో కూడా వచ్చి కన్యాదాతలకోసం నిరీక్షించాడు. సర్వాలంకృతమైన పందిరిలో జనకుడు వశిష్ఠ, విశ్వామిత్ర, శతానందుల సమక్షంలో అగ్నిని ప్రతిష్ఠింపజేసి, హోమాలు చేశాడు. సర్వాభరణ భూషితురాలైన సీతను తీసుకొని వచ్చి జనకుడు కౌసల్యానంద వర్ధనా! రామా! ఇదిగో నా కూతురు సీత. ఈమె నీకు సహధర్మచారిణి. ఈమెనంగీకరించి పాణి గ్రహణం చెయ్యి. పతివ్రత అయిన మా సీత నిన్నెప్పుడూ నీడలాగ అనుసరిస్తుంది అని చెప్పి మంత్రపూరితమైన జలం రాముని చేతిలో విడచాడు. ఆకాశంలో దేవ దుందుభులు మ్రోగాయి. పూలవాన కురిసింది. వశిష్ఠుని అనుమతి పొంది రాముడు సీతను, లక్ష్మణుడు ఊర్మిళను, భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు శృతకీర్తిని పాణి గ్రహణం చేశారు. వారందరూ అగ్నిహోత్రానికి, జనకునకు, ఋషులకు ప్రదక్షిణాలు చేశారు. సీతారాముల, వారి సహజన్ముల కళ్యాణం వైభవంగా, లోక కళ్యాణంగా జరిగింది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ నవోఢలతో ఋషి బంధు సమేతంగా విడిదికి వెళ్ళారు.

పరశురామ గర్వ భంగము

[మార్చు]
పరశురాముని ముందు రాముడు

అందరి పూజలు అందుకొని విశ్వామిత్రుడు హిమవత్పర్వతానికి వెళ్ళిపోయాడు. జనకుని వీడ్కోలు గ్రహించి దశరథుడు నూతన వధూవరులతో అయోధ్యకు బయలుదేరాడు. అప్పుడు భీకరమైన గాలి దుమారం లేచింది. కాలాగ్నిలా ప్రజ్వరిల్లుతూ కైలాసగిరి సదృశుడైన పరశురాముడు వారియెదుట ప్రత్యక్షమయ్యాడు. వశిష్ఠాది మహర్షులు అతనిని పూజించారు.

దశరథ రామా! నీవు శివుని విల్లు విరచిన వృత్తాంతాన్ని విన్నాను. ఇదిగో నా ధనుస్సు జామదగ్న్యాన్ని ఎక్కుపెట్టి, బాణం తొడిగి నీ బలం చూపు. అపుడు నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాను – అని భార్గవరాముడు దశరథరాముని ఆక్షేపించాడు. దశరథుని అభ్యర్ధనలను లెక్కచేయలేదు. శివధనస్సుతో సమానంగా చేయబడిన తన విష్ణు ధనస్సును ఎక్కుపెట్టి చూపమని మళ్ళీ అన్నాడు. క్రుద్ధుడైన రాముడు అవలీలగా పరశురాముని ధవస్సుకు బాణం తొడిగాడు. దివ్యాస్త్రం వృధా కారాదు గనుక పరశురాముని పాదగతిని కానీ, లేదా అతను తపస్సుతో సాధించుకొన్న లోకాలను గానీ ఏదో ఒకటి నాశనం చేస్తానని చెప్పాడు.

పరశురాముడు నిర్వీర్యుడైపోయాడు. తాను కశ్యపునకిచ్చిన మాట ప్రకారం భూమిమీద నివసించజాలడు గనుక తన పాదగతిని నిరోధించవద్దనీ, తాను తపస్సుతో సాధించుకొన్న దివ్యలోకాలను తనకు కాకుండా చేయవచ్చనీ కోరాడు. రాముడు నిత్యుడైన శ్రీహరి అని గ్రహించినందున అలా జరగడం తనకు లజ్జాస్పదం కాదన్నాడు. రాముడు బాణం విడచాడు. తరువాత పరశురాముడు మళ్ళీ తపస్సు చేసుకోవడానికి మహేంద్రగిరికి వెళ్ళిపోయాడు.

అయోధ్యాగమనం

[మార్చు]
తన కుమారులతో అయోధ్యకు తిరిగి వస్తున్న దశరథుడు

తమకు పునర్జన్మ లభించిందని ఆనందించిన దశరథుడు సేనా సమేతంగా గురువులను, పుత్రులను, కోడళ్ళను వెంటబెట్టుకొని అయోధ్యలో ప్రవేశించాడు. కోడళ్ళు అత్తలకు నమస్కరించి, మంగళాశీర్వచనాలు పొంది, దేవాలయాలలో పూజలు చేసి వచ్చారు. సోదరులు పెద్దల ఆశీర్వచనాలు పొంది తమ తమ వధువులతో తమ నివాస గృహాలలో ప్రవేశించారు.

కొన్ని దినాల తరువాత భరతుడూ, శత్రుఘ్నుడూ మేనమామ ఇంటికి వెళ్ళారు. సీతారాములు పెద్దలను సేవిస్తూ, పరస్పరం ప్రీతిపాత్రులై సుఖించారు. ఉత్తమ రాజకన్య అయిన సీతతో కలిసి శ్రీరాముడు లక్ష్మితో కూడిన విష్ణువు లాగా ప్రకాశించాడు.

కొన్ని శ్లోకాలు, పద్యాలు

[మార్చు]

(వివిధ రచనలనుండి)

రామాయణంలో మొదటి శ్లోకం
తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరమ్
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవమ్
రామాయణ మహత్తు గురించి
యావత్ స్థాస్యంతి గిరయ: సరితశ్చ మహీతలే
తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి.
రామాయణ మహాకావ్యమ్ శతకోటి ప్రవిస్తరమ్
ఏకైకమక్షరమ్ ప్రోక్తమ్ పుంసామ్ మహా పాతక నాశనమ్
కావ్యం రామాయణం కృత్స్నమ్, సీతాయాశ్చరితం మహత్
పౌలస్త్య వధమిత్యెవ, చకార చరితవ్రతః (4-7)
వాల్మీకి నోటివెంట వెలువడ్డ ప్రప్రథమ శ్లోకం
మానిషాద ప్రతిష్ఠాం త్వమగమ: శాశ్వతీస్సమా:
యత్ క్రౌంచ మిధునాదేకమ్ అవధీ: కామ మోహితమ్

"ఓరీ కిరాతకుడా! క్రౌంచ దంపతులలో కామమోహితమగు ఒకదానిని చంపి, నీవు శాశ్వతమగు అపకీర్తిని పొందితివి"

విశ్వామిత్రుడు రాముని మేలుకొలుపుట
కౌసల్యా సుప్రజా రామ! పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్
బ్రహ్మబలం ముందు క్షత్రియబలం కొరగాదని విశ్వామిత్రుడు భావించుట
ధిక్బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం బలం
ఏకేన బ్రహ్మ దండేన సర్వాస్త్రాణి హతానిమే
జనకుడు సీతను రామునకప్పగించుట
ఇయం సీతా మమ సుతా సహధర్మచారిణీ తవ,
ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా
పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా
ఇత్యుక్త్వా ప్రాక్షిప్తద్రాజా మంత్రపూతం జలం తధా
సీతారాముల అన్యోన్యత
ప్రియాతు సీతా రామస్య దారాః పితృకృతాఇది
గుణాద్రూపగుణాచ్చాపి ప్రీతిర్భూయోభ్యవర్దత

ఇవి కూడా చూడండి

[మార్చు]

సీతాకళ్యాణం

సీతారామ కల్యాణం

రామాయణం

మూలాలు, వనరులు

[మార్చు]

• వాల్మీకి రామాయణం – సరళ సుందర వచనము – బ్రహ్మశ్రీ కొంపెల్ల వేంకటరామ శాస్త్రి • ఉషశ్రీ రామాయణం – ఉషశ్రీ

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బాలకాండ&oldid=4225315" నుండి వెలికితీశారు