Jump to content

రామోజీరావు

వికీపీడియా నుండి
(రామోజీ రావు నుండి దారిమార్పు చెందింది)
చెరుకూరి రామోజీరావు
రామోజీరావు

తెలుగు పత్రిక ఈనాడు అధిపతి రామోజీరావు


వ్యక్తిగత వివరాలు

జననం (1936-11-16)1936 నవంబరు 16
పెదపారుపూడి, పెదపారుపూడి మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణం 2024 జూన్ 8(2024-06-08) (వయసు 87)
హైదరాబాద్
జాతీయత  భారతీయుడు
తల్లిదండ్రులు వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ
జీవిత భాగస్వామి రమాదేవి
సంతానం కిరణ్, సుమన్
నివాసం రామోజీ ఫిల్మ్‌సిటీ, హైదరాబాదు
వృత్తి పత్రికా సంపాదకుడు
ప్రచురణకర్త
చిత్ర నిర్మాత
వ్యాపారవేత్త
ఈటీవీ అధినేత
పురస్కారాలు పద్మవిభూషణ్‌ పురస్కారం (2016)

చెరుకూరి రామోజీరావు (1936 నవంబరు 16 - 2024 జూన్ 8) ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, గొప్ప దార్శనికులు. ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడు వ్యవస్థాపకులు, ప్రధాన సంపాదకులు, ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రంగారెడ్డి జిల్లాలో నిర్మించిన రామోజీ ఫిల్మ్ సిటీ రామోజీరావు కలల పుత్రిక అని చెప్పవచ్చు. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోని అతి పెద్ద సినిమా స్టూడియోలలో ఒకటిగా పేరుగాంచింది, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకెక్కింది. 2016లో రామోజీరావును దేశంలోకెల్లా రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ కోరి వరించింది. ఏ పని మొదలుపెట్టినా చివరివరకూ శ్రమించి ఆ పనిలో విజయం సాధించేందుకు పట్టుదలతో కృషి చేయడం,విజయం సాధించి చూపించడం రామోజీరావు తరహా. "కృషితోనాస్తి దుర్భిక్షం" అన్న నానుడికి నిలువెత్తు నిదర్శనం ఆయన. కేవలం తన కుటుంబానికి మాత్రమే కాక తన సంస్థల్లో పనిచేసే కుటుంబాలన్నింటికీ పెద్ద దిక్కుగా నిలచి ఉద్యోగుల ప్రేమాభిమానాలను అపారంగా సంపాదించుకున్న గొప్ప మనిషి రామోజీరావు. జీవించినంతకాలం క్రమశిక్షణకు నిలువెత్తు నిదర్శనంగా భాసిల్లారు.

జీవిత చరిత్ర

[మార్చు]

కుటుంబ నేపథ్యం

[మార్చు]

రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతు కుటుంబంలో సుబ్బమ్మ, వెంకట సుబ్బారావు దంపతులకు జన్మించారు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. రామోజీరావు తాతగారైన రామయ్య ఆ రోజుల్లో కుటుంబంతో పెరిశేపల్లిని విడిచి పెదపారుపూడికి చేరుకుని అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. తాతయ్య మరణించిన 13 రోజులకు పుట్టారుకనుక రామోజీరావుకు ఆయన తాతగారి జ్ఞాపకార్థం రామయ్య అని పేరు పెట్టారు. రామోజీరావుకు ఇద్దరు అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ.

బాల్యం, విద్యాభ్యాసం, వివాహం (1937 - 1961)

[మార్చు]

వీరిది శ్రీవైష్ణవ సంప్రదాయ కుటుంబం. రామోజీరావు తల్లి చాలా భక్తురాలు, ఆచారవంతురాలు కావడం వల్ల చిన్నతనంలోనే ఆయనకు శుచి, శుభ్రత, సంస్కారం అలవడ్డాయి. లేకలేక పుట్టిన మగపిల్లవాడు కనుక చిన్నతనంలో రామోజీరావును ఇంట్లో అందరూ చాలా ముద్దుగా, మురిపెంగా చూసుకునేవారు. పెద్దక్క రాజ్యలక్ష్మి పెళ్లి చేసుకుని అత్తవారింటి వెళ్లిన తర్వాత రామోజీరావును చిన్నక్క రంగనాయకమ్మ మరింత గారాబంగా చూసుకునేవారు. తన చిన్నక్కతో కలసి రామోజీరావు తల్లికి ఇంటిపనుల్లో చిన్నప్పుడు ఎంతో సాయం చేసేవారు. తల్లి పెంపకంలో చిన్ననాడే అలవడిన ఋజువర్తన, ముక్కుసూటితనం, దయ, కరుణ కలిగిన మనస్తత్త్వం జీవితంలో తర్వాతి రోజుల్లో ఆయన్ని అగ్రపథంలో నిలిపాయని చెప్పవచ్చు.


మొదటినుండీ రామోజీరావుది విభిన్నమైన శైలి, వ్యక్తిత్త్వం. చిన్ననాడే ఆయన అనేక విషయాల్లో తన ప్రత్యేకతను స్పష్టంగా చూపించేవారు. ప్రాథమిక పాఠశాల్లో చేరినప్పుడు ఉపాధ్యాయుడు రిజిస్టరులో పేరు రాసే సమయంలో తన పేరును "రామోజీరావు" అని చెప్పి రాయించుకున్న దార్శనికుడు. పెరిగి పెద్దైన తర్వాత ఒక సమున్నతమైన సంస్థానాన్ని, విలువలతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పాలని ఆయన చిన్న వయసునుండే కలలు కనేవారు. 1947లో గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరారు. 1957లో సిక్స్ త్ ఫారం పూర్తిచేసుకుని, ది గుడివాడ కళాశాలలో (అక్కినేని నాగేశ్వరరావు కళాశాల)ఇంటర్, బీఎస్సీ చదివారు.


1961 ఆగస్టు 19న రామోజీరావుకు, పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ. పెద్దలు మొదట పెట్టిన పేరు నచ్చక తర్వాత ఆమె పేరును రమాదేవిగా మార్చారు. రామోజీరావు భార్య తరఫున బంధువుల్లో చిన్న బావమరిది తాతినేని వెంకట కృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో డైరెక్టరుగా, తోడల్లుడు ముసునూరు అప్పారావు ఈనాడు, డాల్ఫిన్స్ హోటల్స్ మ్యానేజింగ్ డైరక్టరుగా పనిచేశారు.

ఉద్యోగం, వ్యాపారాల ఆరంభం (1960 - 1970)

[మార్చు]

రామోజీరావుకు పరిచయస్తులైన టి.రామచంద్రరావు అడ్వర్ టైజింగ్ రంగంలో పనిచేసేవారు. ఆయన్ని చూసి రామోజీరావుకు అడ్వర్ టైజింగ్ రంగానికి సంబంధించిన మెలకువలు తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. దానికోసం చదువు పూర్తి అయిన తర్వాత ఢిల్లీలోని ఒక అడ్వర్ టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు రామోజీరావు. మూడు సంవత్సరాలపాటు అక్కడ పనిచేసిన తర్వాత 1962లో హైదరాబాద్ కు తిరిగివచ్చారు.


1962 అక్టోబర్ నెలలో రామోజీరావు హైదరాబాద్ లో మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీని ప్రారంభించారు. ఇది ఆయన జీవితంలో తొలి వ్యాపారం. 1965లో కిరణ్ యాడ్స్ అనే పేరుతో ఒక అడ్వర్ టైజింగ్ ఏజెన్సీని ప్రారంభించారు. 1967 - 69 మధ్యకాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టారు. 1969లో ఆయన అన్నదాతకు అండగా నిలవాలన్న సత్సంకల్పంతో వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని అందించే సమగ్రమైన పత్రిక అన్నదాతను ప్రారంభించారు. 1970లో ఆయన ప్రారంభించిన ఇమేజెస్ ఔట్ డోర్ అడ్వర్ టైజింగ్ ఏజెన్సీ బాధ్యతల్ని అప్పట్లో ఆయన సతీమణి రమాదేవి చూసుకున్నారు.

డాల్ఫిన్ హోటల్స్, ఈనాడు ప్రారంభం (1971-1974)

[మార్చు]
ఈనాడు దిన పత్రిక, రామోజీరావు విజయాలలో ప్రముఖమైనది

విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్స్ ప్రారంభించాలన్న రామోజీరావు సంకల్పం 1970లో సాకారమయ్యింది. రామోజీ గ్రూపు సంస్థల్లో మార్గదర్శి చిట్ ఫండ్స్, ఈనాడు వార్తాపత్రిక, ఈటీవి, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్ సిటీ, కళాంజలి షోరూములు ముఖ్యమైనవి.[1]

అంచెలంచెలుగా ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వందలాది కుటుంబాలకు అన్నం పెట్టే గొప్ప వ్యక్తిగా, సమున్నతమైన శక్తిగా ఎదిగారు. తాను ఎదుగుతున్నకొద్దీ ఉగ్యోగుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ తన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను కన్నబిడ్డల్లా చూసుకునే సమున్నతమైన సంస్కారాన్ని అంతకంతకూ పెంచుకుంటూ వచ్చారు. అదే ఆయన సాధించిన విజయాలకు సమున్నతమైన సోపానంగా మారింది.

ఈనాడు దిన పత్రిక ప్రస్థానం

[మార్చు]

రామోజీరావు జీవితంలో సాధించిన అద్భుతమైన విజయాల్లో ఈనాడు దిన పత్రిక పాత్ర మరువలేనిది. దశాబ్దాలుగా ప్రజాస్వామ్యానికి అండగా నిలచిన, నిలుస్తోన్న ఈ పత్రిక విజయం చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోయే విజయమని  చెప్పాలి. 1974 ఆగష్టు 10న రామోజీరావు విశాఖపట్నం శివార్లలోని, సీతమ్మధార పక్కన నక్కవానిపాలెం అనే ఊరిలో ఈనాడు దినపత్రికను ప్రారంభించారు. అదే సంవత్సరం ఆగష్టు 28 తేదీన ఈ పత్రికను రిజిస్టర్ చేశారు. 1975 డిసెంబర్ 17వ తేదీన హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమయ్యింది. 1988 ఫిబ్రవరి 28న సండే మ్యాగజైన్ ను, 1989 జనవరి 26న జిల్లా ఎడిషన్లను తీసుకొచ్చారు. 1984లో న్యూస్ టైమ్ పేరిట ఓ అంగ్ల దినపత్రికను కూడా ప్రారంభించారు. ఈ పత్రిక 20 ఏళ్లపాటు నడిచింది.

అతి సామాన్యంగా ఎలాంటి హంగులూ ఆర్భాటాలు లేకుండా  5వేల ప్రతులతో మొదలైన ఈనాడు ప్రస్థానం అనతికాలంలోనే అత్యున్నతమైన స్థాయికి ఆ పత్రికను ఎదిగేలా చేసింది. తెల్లవారేసరికల్లా గుమ్మం ముందు ప్రత్యక్షమయ్యే ఈనాడు పత్రికను ప్రజలు బాగా ఆదరించారు. దానికితోడు ఎప్పటికప్పుడు వార్తల్ని అందించడంలో కొత్త పుంతలు తొక్కడం, స్థానిక వార్తలకు ప్రాధాన్యతను ఇవ్వడం లాంటి అనేక కీలకమైన నిర్ణయాలు ఈనాడు దినపత్రికను అగ్రపథాన నిలిపాయి. అనునిత్యం వార్తలు, విలువలు, వలువల విషయంలో రామోజీరావు చూపించిన ప్రత్యేకమైన శ్రద్ధ ఈనాడు దిన పత్రిక ఎదుగుదలకు మూలకారణమని చెప్పాలి.

ఈనాడు జర్నలిజం స్కూల్

[మార్చు]

ఈనాడు, ఈటీవీ సంస్థలకోసం నిబద్ధత కలిగిన అక్షర యోధుల్ని తయారు చేసేందుకు రామోజీరావు రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ‘ఈనాడు జర్నలిజం స్కూల్’ను ప్రారంభించారు. ఈ జర్నలిజం స్కూల్లో చదువుకున్న విద్యార్థినీ విద్యార్థులు నేడు దేశ వ్యాప్తంగా అనేక మీడియా సంస్థల్లో ఉన్నత స్థానాల్లో రాణిస్తూ, వ్యక్తిగత జీవీతాల్లోకూడా సమున్నతమైన స్థానంలో నిలచి తమ మాతృసంస్థ అయిన ఈనాడు, ఈటీవీ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నారు. మానుకొండ నాగేశ్వరరావు ప్రిన్సిపాల్ గా ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఈనాడు జర్నలిజం స్కూల్ వేలాదిమంది అక్షర సైనికుల్ని తయారు చేసిన ఘనతను సొంతం చేసుకుంది. నిజానికి ఈనాడు జర్నలిజం స్కూల్, ఈనాడు దినపత్రిక, ఈటీవీ సంస్థ మూడింటినీ కలిపిచూస్తే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ కి మించిన ఖ్యాతి ఉందంటే అందులో అణుమాత్రమైనా అతిశయోక్తిలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈనాడు జర్నలిజం స్కూల్ ను ఓ సమున్నతమైన విశ్వవిద్యాలయంగా అభివర్ణించవచ్చు.

ఈనాడు జర్నలిజం స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకోసం స్కూల్ లోనే ఓ సమగ్రమైన చిన్నపాటి లైబ్రరీని ఏర్పాటు చేయడం మరో విశేషం. ఈ స్కూల్ లో చదువుకునే విద్యార్థినీ విద్యార్థులు ఈ లైబ్రరీనుండి పుస్తకాలను తీసుకుని, ఇంటికి తీసుకెళ్లి చదువుకుని తిరిగి లైబ్రరీకి అప్పగించే సౌకర్యం ఉంది. విద్యార్థినీ విద్యార్థులు జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసం జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ మానుకొండ నాగేశ్వరరావు అభ్యర్థనపై రామోజీరావు జర్నలిజం స్కూల్ కు ప్రత్యేకంగా ఈ సౌకర్యాన్ని కల్పించడం విశేషం.

రీసెర్చ్ మరియు రిఫరెన్స్ గ్రూప్

[మార్చు]

ఏ పత్రికకైనా టీవీ ఛానల్ కైనా అందులో పనిచేసే అక్షరయోధులకు జ్ఞానాన్ని సముపార్జించుకోవడం నిరంతరాయంగా జరగాల్సిన ప్రక్రియ అని భావించిన రామోజీరావు రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ గ్రూప్ పేరుతో రామోజీ ఫిల్మ్ సిటీలోని కార్పొరేట్ బిల్డింగ్ లో అతి పెద్ద లైబ్రరీని స్థాపించారు. ఈ గ్రంథాలయంలో దాదాపుగా ప్రపంచంలో పేరుగాంచిన అన్ని ముఖ్యమైన పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. రామోజీ గ్రూప్ సంస్థల్లోని ఏ ఉద్యోగి అయినా సరే ఈ రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ గ్రూప్ కి వెళ్లి ఏ విభాగానికి సంబంధించి అయినా సరే తమకు కావాల్సిన పుస్తకాన్ని తీసుకుని చక్కగా అధ్యయనం చేయవచ్చు. తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల ఉన్నతికోసం ఇంత గొప్ప గ్రంథాలయాన్ని నెలకొల్పిన రామోజీరావు దార్శనికతకు ఈ రీసెర్చ్ మరియు రిఫరెన్స్ గ్రూప్ చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది.

సాహితీ సేవ

[మార్చు]

సినీ ప్రేమికుల కోసం రామోజీరావు ‘సితార’ పత్రికను ప్రారంభించారు. తెలుగు భాషాభిమానులకోసం ‘చతుర’, ‘విపుల’ మాస పత్రికలను కూడా తీసుకొచ్చారు. ‘ప్రియా ఫుడ్స్‌’ తో పాటు 1983లో ‘ఉషాకిరణ్‌ మూవీస్‌’ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ లో అనేక చిత్రాలను నిర్మించారు. కళాంజలి, బ్రిసా, ప్రియా ఫుడ్స్, డాల్ఫిన్ హోటల్, కొలోరమ ప్రింటర్స్, ప్రియా పచ్చళ్లు వంటి రామోజీ గ్రూపు సంస్థలు ప్రగతిపథంలో అప్రతిహతంగా పయనిస్తున్నాయి.

రామోజీ ఫిల్మ్ సిటీ

[మార్చు]

90వ దశకంలో ప్రపంచలోనే అతి పెద్ద చిత్రనగరి ‘రామోజీ ఫిల్మ్‌ సిటీ’ని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పరిధిలో నిర్మించారు రామోజీరావు. 1996 నవంబర్ 16వ తేదీన ప్రారంభమైన రామోజీ ఫిల్మ్ సిటీ బిగ్గెస్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్ సెంటర్ గా గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లాంటి దేశంలోని పలు భాషలకు చెందిన అనేక చిత్రాలు ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ లు చేసుకునేవి. ఓ సినిమాను ఓం ప్రదంగా మొదలుపెట్టి పూర్తి స్థాయిలో పూర్తి చేసుకుని బయటికి వెళ్లేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలనూ రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేయడంతో ఇక్కడ సినిమాల నిర్మాణానికి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఓ దశలో రాష్ట్ర ప్రభుత్వం ఓ సంవత్సరంలో ఇచ్చే ఉద్యోగాలకంటే తన రామోజీ గ్రూపు సంస్థల్లో ఓ సంవత్సరానికి ఇచ్చే ఉద్యోగాల సంఖ్యే ఎక్కువగా ఉందనిపించి రికార్డ్ సృష్టించారు ఆయన. అలా తనదైన ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించారు.


ఆ సమయంలో రామోజీరావు నిర్మాతగా మారి ప్రతిఘటన, మౌనపోరాటం వంటి విప్లవాత్మక సినిమాలను నిర్మించి తానే స్వయంగా పంపిణీ కూడా చేశారు. ఓవైపు ప్రియ పచ్చళ్ల వ్యాపారం, మరోవైపు సినిమాల నిర్మాణం, ఇంకోవైపు మీడియా రంగంలో విజయాలు, అటు మార్గదర్శి చిట్స్ ఇలా చూస్తుండగానే రామోజీ ఓ పెద్ద సామ్రాజ్యాన్నే సృష్టించారు. అలా ఈనాడు గ్రూప్ సంస్థలు అంతకంతకూ విస్తరిస్తూ ప్రపంచంలోనే పేరెన్నికగన్న సంస్థలుగా రూపుదిద్దుకున్నాయి. వీటిని ఇలా తీర్చిదిద్దడం వెనుక రామోజీరావు కృషి అనిర్వచనీయం. అనన్య సామాన్యమైన దీక్షాదక్షతలతో ప్రతి చిన్న విషయాన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఆయన అనేక రంగాల్లో వేలాదిమందికి ఉపాధిని కల్పించే అతి పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించడం చాలా గొప్ప విషయం.

ఈటీవీ ప్రస్థానం

[మార్చు]

1995లో “ఈటీవీ – మీటీవీ” అంటూ బుల్లితెర ప్రయాణాన్ని ప్రారంభించారు రామోజీరావు. అంతర్జాలం వేదికగా వార్తల్ని అందించేందుకు ఈనాడు డాట్ నెట్ వైబ్ సైట్ ను తీసుకొచ్చారు. ‘ఈటీవీ’ ఆధ్వర్యంలో 18 భారతీయ ప్రాంతీయ భాషా వార్తా ప్రసార టీవీ ఛానెళ్లను నెలకొల్పిన ఘనత రామోజీరావుకే దక్కుతుంది. “ఈటీవీ భారత్” పేరిట డిజిటల్ వేదికను కూడా నిర్మించి అరచేతిలో ఉన్న సెల్ ఫోన్ లోనే ప్రపంచం నలుమూలలకు చెందిన వార్తలు, విశేషాలను తెలుసుకునే ఏర్పాటు చేసిన మీడియా మొఘల్ రామోజీరావు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ తాను ఎంచుకున్న ఏ రంగంలో అయినా సరే ముందడుగు వేయడం ఆయన ప్రత్యేకత.

విద్యా రంగానికి సేవ

[మార్చు]

రామోజీరావు 2002లో తన సతీమణి రమాదేవి పేరిట ‘రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌’ను నెలకొల్పి విద్యా వ్యవస్థకు కూడా సమున్నతమైన సేవలు అందించారు. విద్యార్థి దశలోనే సమున్నతమైన ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యతోపాటు విద్యార్థినీ విద్యార్థులకు విలువలను అందించడంకోసం ఆయన ఈ విద్యాలయాన్ని నెలకొల్పారు. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులు తమ జీవితాల్లో సమున్నతమైన స్థానాలకు చేరుకోవడం విశేషం.

సామాజిక సేవ

[మార్చు]

రామోజీ ఫౌండేషన్ ద్వారా రామోజీరావు దేశవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన చోట్ల బీదసాదలకు సూర్య హోమ్స్ పేరిట పక్కా గృహాలను నిర్మించి గూడు, నీడ కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రభుత్వ సంస్థలకు పక్కా బిల్డింగులను నిర్మించి ఆ కార్యాలయాలకు వచ్చే సామాన్యులకు చక్కటి సౌకర్యాలను కల్పించింది ఈ సేవా సంస్థ. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలోని ఆర్టీయే కార్యాలయ భవన నిర్మాణం దీనికి ఓ మచ్చు తునక. రామోజీ ఫౌండేషన్ ఇక్కడ పక్కా భవనాన్ని నిర్మించేవరకూ ఇబ్రహీం పట్నం ఆర్టీయే కార్యాలయానికి వచ్చే వాళ్లు ఎండనకా, వానెనకా ఆర్టీయే కార్యాలయం భవనం ముందు నిలబడి పడిగాపులు పడాల్సొచ్చేది. కానీ రామోజీ ఫౌండేషన్ చక్కటి భవంతిని నిర్మించడమే కాక ఈ కార్యాలయానికి వచ్చే వారు వేచి ఉండడానికి, వారికి మంచినీటిని అందించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లను చేయడం విశేషం. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నోచోట్ల ఎన్నో భవనాలను నిర్మించి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సామాన్యులకు సౌకర్యాలను కల్పించిన ఘనత రామోజీ ఫౌండేషన్ కి దక్కుతుంది.  

వ్యాపారాల్లో ఒడిదొడుకులు

[మార్చు]

ఈనాడు పత్రిక ప్రజలకు, ప్రజాస్వామ్యానికీ అండగా నిలుస్తోందన్న కోపంతో కొందరు ప్రభుత్వాధినేతలు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై ఉద్దేశపూర్వకంగా కక్షసాధింపు చర్యలకు దిగినప్పటికీ అశేషమైన ఖాతాదారుల అభిమానం, అండదండలు, విశేషమైన ప్రజాభిమానం వెన్నంటి ఉన్నందువల్ల ఎన్ని ఆరోపణలు వచ్చినా అవన్నీ పూర్తిగా కొట్టుకుపోయాయి తప్ప రామోజీరావుపై రవ్వంతైనా మచ్చ పడలేదు సరికదా ఆయనపై ప్రజల్లో ఉన్న అభిమానం రెట్టింపు కావడం విశేషం.

వ్యాపారాలు

[మార్చు]
రామోజీ ఫిల్మ్ సిటీ

మీడియా

[మార్చు]

ఆర్థిక సేవలు

[మార్చు]

ఇతరాలు

[మార్చు]
  • కళాంజలి - సంప్రదాయ వస్త్రాలు, గృహాలంకరణ సామగ్రి (విజయవాడ, హైదరాబాద్)
  • బ్రిసా - ఆధునిక వస్త్రాలు
  • ప్రియా ఫుడ్స్ - పచ్చళ్ళు, మసాలా దినుసులు, ధాన్యం ఎగుమతి
  • డాల్ఫిన్ హోటల్ (విశాఖపట్నం, హైదరాబాద్)
  • కొలోరమ ప్రింటర్స్
  • ప్రియా పచ్చళ్లు

నిర్మించిన సినిమాలు

[మార్చు]

పురస్కారాలు/గౌరవాలు

[మార్చు]

వివిధ రంగాల్లో తాను అందించిన సేవలకుగాను రామోజీరావు పలు పురస్కారాలను అందుకున్నారు. అంధ్రవిశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు, శ్రీశ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు, యుధ్ వీర్ పురస్కారం, కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదురి పురస్కారం, బి.డి.గోయెంకా పురస్కారం, 2016లో సాహిత్యం, విద్య విభాగాలకు సంబంధించి భారత ప్రభుత్వం అందించిన పద్మ విభూషణ్ పురస్కారం వాటిలో ప్రధానమైనవి.

కుటుంబం

[మార్చు]

రామోజీరావుకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు కిరణ్‌, చిన్న కొడుకు సుమన్. సుమన్ బుల్లితెర రచయిత, నటుడు, దర్శకుడు, చిత్రకారుడు. సుమన్ 2012లో అనారోగ్యంతో చనిపోయారు. ప్రస్తుతం పెద్ద కుమారుడు కిరణ్ ఈనాడు గ్రూప్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్‌గా, పెద్ద కోడలు శైలజా కిరణ్‌ మార్గదర్శి ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుమన్‌ సతీమణి విజయేశ్వరి రామోజీ ఫిలిం సిటి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూనే.. రామోజీ గ్రూప్‌కు చెందిన పలు సంస్థల బాధ్యతలు చూసుకుంటున్నారు. సహరి, బృహతి, దివిజ, సోహన రామోజీరావు మనుమరాళ్లు. సుజయ్ రామోజీరావు మనుమడు.[3] వీరిలో రామోజీరావు పెద్ద మనుమరాలు, కిరణ్ పెద్దకూతురైన సహరి ప్రియాఫుడ్స్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. కిరణ్ రెండవ కుమార్తె బృహతి ఈటీవీ భారత్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సుమన్ కుమార్తె అయిన సోహన రామోజీ ఫిల్మ్ సిటీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సుమన్ కుమారుడు సుజయ్ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు.

నిర్యాణం

[మార్చు]

రామోజీరావు 87 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో 2024 జూన్ 8న నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని స్టార్‌ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. [4][5][6][7][8][9] తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఫిలింసిటీలోని స్మృతివనంలో జూన్ 9న ఆయన అంత్యక్రియలు జరిగాయి. [10][11]మరణాన్నికూడా గౌరవించాలన్న సమున్నతమైన ఆలోచనకు ఆయన నిదర్శనంగా నిలవడం విశేషం. జీవించి ఉండగానే తన స్మారకాన్ని తానే నిర్మించుకున్న ధీశాలి ఆయన.

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Praveen Donthi (2014-12-01). "Chairman Rao, How Ramoji Rao of Eenadu wrested control of power and politics in Andhra Pradesh". Archived from the original on 2014-12-31.
  2. "సాహిత్యాభిమానులకు ధన్యవాదాలు". రామోజీ ఫౌండేషన్. 2021-03-01. Retrieved 2021-03-08.[permanent dead link]
  3. Eenadu (11 June 2024). "తాతయ్య కోరిక అదే". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  4. EENADU (8 June 2024). "రామోజీరావు అస్తమయం". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  5. NT News (9 June 2024). "రామోజీ ఇకలేరు". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  6. "Today Latest News Updates: రామోజీరావు అస్తమయం | ramoji-rao-passes-away". web.archive.org. 2024-06-08. Archived from the original on 2024-06-08. Retrieved 2024-06-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "Ramoji Rao: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతి.. | Ramoji Rao, the chairman of group companies, passed away, Suri". web.archive.org. 2024-06-08. Archived from the original on 2024-06-08. Retrieved 2024-06-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. "ఈనాడు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూత Eenadu and Ramoji Film City founder Ramoji Rao passed away this morning in Hyderabad. Sakshi". web.archive.org. 2024-06-08. Archived from the original on 2024-06-08. Retrieved 2024-06-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. BBC News తెలుగు (8 June 2024). "రామోజీరావు: ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ కన్నుమూత". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  10. Andhrajyothy (9 June 2024). "ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు." Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  11. Hindustantimes Telugu (9 June 2024). "ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు - పాడె మోసిన చంద్రబాబు" (in telugu). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

వెలుపలి లంకెలు

[మార్చు]