వీరవల్లడు (నవల)

వికీపీడియా నుండి
(వీరవల్లడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

వీరవల్లడు నవల కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించారు. ఇది 19వ శతాబ్దం చివరి కాలాన్ని ప్రతిబింబించే సాంఘిక నవల

వీర వల్లడు నవల కవర్ పేజీ

నేపథ్యం

[మార్చు]

వీరవల్లడు నవలను విశ్వనాథ సత్యనారాయణ 1935-40 ప్రాంతాల్లో రచించారు. విశ్వనాథ సత్యనారాయణ ఆశువుగా చెప్తూండగా ఆయన పెద్దతమ్ముడు విశ్వనాథ వేంకటేశ్వర్లు గానీ, పెద్ద అల్లుడు గుంటూరు సుబ్బారావు గానీ లిపిబద్ధం చేసి ఉండొచ్చు. తొలిసారి ఈ నవల భారతి మాసపత్రిక 1944 సెప్టెంబరు సంచికలో ప్రచురితమైంది.

విశ్వనాథ వారి కుటుంబంలో ఆయనకు రెండు, మూడు తరాల క్రితం జరిగిన వాస్తవ సంఘటనలకు కథారూపమే ఈ నవల అని నవల 2006 ముద్రణకు ముందుమాటలో గ్రంథకర్త కుమారులు విశ్వనాథ పావని శాస్త్రి ధృవీకరించారు. 2001 నాటికి ఈ పుస్తకం 5 ముద్రణలు పొందింది.[1]

ఇతివృత్తం

[మార్చు]

పట్నవాసపు చదువుల్లో చేరిన ఓ పల్లెటూరి బ్రాహ్మణ బాలుడికి పాఠశాలలో మాస్టారు వల్లప్ప అనే తన పేరును వెక్కిరించగా తన పేరంటేనే విరక్తి ఏర్పడుతుంది. సెలవుల్లో తన పేరు మార్చమని చెప్పగా వల్లడనే పాలేరు పేరు పెట్టామనీ అది అందుకని గొప్ప పేరనీ తండ్రి చెప్తే అతనికి పేరు మార్చుకోవాలని ఇంకా పట్టుదల పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తన చిన్నతనంలో వల్లని గురించి దాదాపు ఇదే పరిస్థితుల్లో విన్న కథను ఆయన కొడుక్కి చెప్తాడు. తన దొర మరణానంతరం ఆయన కుటుంబానికి ఆస్తి దక్కకుండా చేసిన దొర బాబాయిని ఒంటరిగా ఎదిరించి, నేర్పుగా వ్యవహారాన్ని చక్కబెట్టి ఎలా ఆస్తి తిరిగి రప్పించాడన్నదే వల్లడి కథ. అయితే పందొమ్మిదవ శతాబ్ది తొలినాళ్ళలోని భూవ్యవహారాలు, ఆనాటి కులకట్టుబాట్ల మధ్య ఈ కథను రచయిత నడిపిన తీరు ఆకట్టుకుంటుంది.[2]

శిల్పం

[మార్చు]

వల్లడి కథను రచయిత వివరించేందుకు ఆ కథకు రెండు తరాల అనంతరం ఆ వంశంలోని కుర్రాడి విషయంతో ప్రారంభించి ఆసక్తి రేకెత్తిస్తారు. ఆ కుర్రాడికి తండ్రి వల్లడి గురించి చెప్పేప్పుడు కూడా తండ్రి చిన్నవయసులో వల్లడు ముసలివానిగా ఉన్నప్పుడు జరిగిన ఉదంతం, ఇప్పుడు కథ చెప్తున్న నాటి కుర్రాడి తండ్రి మందలించి వల్లడి కథను చెప్పడంతో ఆ కథలో మరో పొర కల్పిస్తారు ఆయన. ఇలా మూడో పొరలో వల్లడు తాను చేసిన విషయాన్ని చెప్పిన కథలోకి వెళ్ళేసరికి పాఠకుని ఆసక్తిని అత్యున్నత స్థితిలోకి తీసుకువెళ్తారు.

శైలి, ఉదాహరణలు

[మార్చు]

విశ్వనాథ సత్యనారాయణ ఈ నవల ఇతివృత్తాన్ని బట్టి వ్యావహారికాన్ని ఎన్నుకుని రచన చేశారు. కథాప్రారంభ ఘట్టాల్లోని కథాకాలానికి వల్లని కథలోని కథాకాలానికి రెండు తరాల అంతరువులు ఉండడంతో రచయిత ఆయా ఘట్టాల్లోని పాత్రల భాషలో చక్కని సూక్ష్మమైన అంతరం చూపిస్తారు. నవలలో ప్రత్యేకంగా వర్ణించకనే ఆ గ్రామాన్ని సందర్భవశాన చక్కని వర్ణన చేశారు.

ఉదాహరణలు

[మార్చు]
  • వల్లడు అన్న పేరు చాలా మంచి పేరు. ఒక్కొక్క పేరు - ఒక్కొక్క విధంగా మంచిదోయి. కృష్ణుడు అన్న పేరూందనుకో ఆ పేరు మంచిది కాదని ఎవరూ అనరు కదా! ఎందుకు అనరు? కృష్ణుడు గొప్ప పనులు చేశాడు గనుక. ఆపేరు అందరికీ మంచిది అనిపిస్తుంది.

ప్రాచుర్యం

[మార్చు]

అనువాదాలు

[మార్చు]
  • విమర్శకుడు, విఖ్యాత ఆచార్యులు వెల్చేరు నారాయణరావు వల్లడు ద హీరో శీర్షికన ఆంగ్లంలోకి అనువదించగా "జర్నల్ ఆఫ్ సౌత్ ఏషియన్ లిటరేచర్"లో ప్రచురితమైంది.[3]

విమర్శనలు

[మార్చు]
  • విమర్శకుడు, ఆచార్యులు వెల్చేరు నారాయణరావు ఆఫ్టర్ వర్డ్:స్ట్రక్చరల్ వ్యూ ఆఫ్ వీరవల్లడు శీర్షికన వీరవల్లడు నవల గురించి చేసిన విశ్లేషణాత్మక విమర్శ "జర్నల్ ఆఫ్ సౌత్ ఏషియన్ లిటరేచర్"లో ప్రచురితమైంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. వీరవల్లడు నవల(ప్రచురణ:అక్టోబర్ 2006) ముందుగా ఒక్క మాట శీర్షికన ప్రచురించిన విశ్వనాథ పావని శాస్త్రి నోట్
  2. వీరవల్లడు నవల
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2014-05-14. Retrieved 2014-01-15.

ఇవి కూడా చూడండి

[మార్చు]

విశ్వనాథ సత్యనారాయణ