Jump to content

భద్రాచలం

అక్షాంశ రేఖాంశాలు: 17°40′N 80°53′E / 17.67°N 80.88°E / 17.67; 80.88
వికీపీడియా నుండి
(శ్రీరామ దివ్యక్షేత్రం నుండి దారిమార్పు చెందింది)
భద్రాచలం
భద్రాద్రి
A View of Bhadrachalam Gopuram.JPG
భద్రాచలం is located in Telangana
భద్రాచలం
భద్రాచలం
భద్రాచలం is located in India
భద్రాచలం
భద్రాచలం
Coordinates: 17°40′N 80°53′E / 17.67°N 80.88°E / 17.67; 80.88
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాభద్రాద్రి కొత్తగూడెం జిల్లా
Government
 • Bodyపురపాలకసంఘం
విస్తీర్ణం
 • Total12.00 కి.మీ2 (4.63 చ. మై)
Elevation
50 మీ (160 అ.)
జనాభా
 (2011)[2]
 • Total50,087
 • Rankతెలంగాణలో 40వ పట్టణం
 • జనసాంద్రత7,121/కి.మీ2 (18,440/చ. మై.)
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
507111
టెలిఫోన్ కోడ్08743
Sex ratio1:1 /
కొత్తగూడెం నుండి దూరం40 కిలోమీటర్లు (25 మై.)
హైదరాబాదు నుండి దూరం325 కిలోమీటర్లు (202 మై.)
Websitehttps://www.telanganatourism.gov.in

భద్రాచలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం మండలం లోని రెవెన్యూ గ్రామం,[3] జనగణన పట్టణం. ఇక్కడ భక్త రామదాసు నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము వలన పుణ్యక్షేత్రం. ఇది గోదావరి నది దక్షిణ తీరాన ఉంది. దీనిని భద్రాద్రి, శ్రీరామ దివ్యక్షేత్రం అనే పేర్లుతో కూడా పిలుస్తారుఇది పూర్వపు జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, పేరొందింది. జిల్లాలోని పారిశ్రామిక కేంద్రాలైన పాల్వంచ 27 కి.మీ., మణుగూరు 35 కి.మీ., కొత్తగూడెం 40 కి.మీ. దూరంలోను ఉన్నాయి. భద్రాచలం తప్ప మిగిలిన పుణ్యక్షేత్రాలన్ని పోలవరం ముంపు ప్రాంతాలుగా మారాయి. భద్రాచలం రెవెన్యూ డివిజను మొదట తూర్పుగోదావరి జిల్లాలో ఒక భాగంగా ఉండేది. అంధ్ర, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై, కొత్తగా ఖమ్మం జిల్లా ఏర్పడిన సమయంలో దీనిని ఖమ్మం జిల్లాలో విలీనం చేయటం జరిగింది. తెలంగాణ ఉద్యమం తీవ్రముగా ఉన్న రోజులలో ఇది వివాదాస్పదం అయ్యింది.

భద్రాచలం పట్టణం

[మార్చు]

భద్రాచలం గ్రామ పంచాయితీ 1962లో మద్రాసు గ్రామ పంచాయితీ చట్టం క్రింద ఏర్పడింది. తరువాత 26.07.2001న వచ్చిన ప్రభుత్వం చట్టం GOMs.No.245 (PR & RD) ప్రకారం ఇది ఒక పట్టణంగా గుర్తించబడింది. G.O.Ms.No.118 (PR & RD) తేది. 08.04.2002న, ప్రకారం ఈ పట్టణం పేరు "శ్రీరామ దివ్య క్షేత్రం" అని మార్చబడింది.[4] హర్షభద్రాచలం టౌన్షిప్ గా తరువాత మునిసిపాలిటిగా ఎదిగినప్పటికీ 1/70 ఆక్ట్ అనుసరించి మరల దీనిని గ్రామపంచాయితీగా మార్చుట జరిగింది.

గణాంక వివరాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 89,048 - పురుషులు 44,029 - స్త్రీలు 45,019.

రామాలయ ప్రశస్తి

[మార్చు]
భద్రాచలంలో ఒక మండపం
భద్రాచల దేవస్థానx వద్ద రామదాసు విగ్రహం

పూర్వం భద్రుడు అను భక్తుడు శ్రీ రాముడుకి తపస్సు చేసి, తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధంగా వరం పొందాడని అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాతి కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం (భద్ర + అచలం) అని పేరు స్థిరపడింది.

గ్రామ చరిత్ర

[మార్చు]
భద్రాచలం దేవస్థానం
భద్రాచల దేవస్థానంలో శ్రీ సీతారామ లక్ష్మణుల మూల విగ్రహాలు

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలాలతో పాటు ఆయా గ్రామాలను. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను, ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ లోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా ఖమ్మం జిల్లా పరిధిలోని కుక్కనూరు, వేలేరుపాడు, కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం మండలాలతోపాటు అన్ని గ్రామాలు, భద్రాచలం మండలం లోని భద్రాచలం పట్టణం తప్ప అన్ని గ్రామాలు, బూర్గంపాడు మండలం లోని సీతారామనగర్, శ్రీధర-వేలేరు, గుంపనపల్లి, గణపవరం, ఇబ్రహీంపేట, పెద్ద రావిగూడెం ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్-లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర - జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను 2014 మే 29న గెజిట్-లో ప్రచురించారు.[5]

భద్రాచలం దండకారణ్యం అని పిలువబడే అడవి ప్రాంతం. శ్రీరాముడు తన భార్య, తమ్ములతో వనవాసం చేస్తూ వున్నప్పుడు, ఈ ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తూ వున్న భరద్వాజ మహర్షి దగ్గరకు వచ్చాడు. ఆయన సూచన ప్రకారం ప్రస్తుతం భద్రాచలానికి దగ్గరలోనే వున్న పంచవటి అనేచోట ఒక వర్ణశాల నిర్మించుకొని అందులో వుంటూ వుండేవాడు.

ఆ పర్వతాల బయట, గోదావరి నది ఒడ్డున, ఒక రాతి మీద సీతారాములు కూర్చుండి విశ్రాంతి తీసుకుంటూ వుండేవారు. అలా ప్రతి రోజు తమకు సుఖాసనంగా వున్న రాతిని చూసి సీతాదేవి ఒకనాడు ఇంతకు ముందు రాతి రూపంలో వున్న అహల్యను కరుణించారు గదా, మరి ఈ రాతి మీద కూడా కరుణ చూపించగూడదా అని అడిగింది. దానికి శ్రీరాముడు, ఆ రాయి మరి కొంతకాలానికి తనకు మరింత ప్రీతిపాత్రమయ్యే జన్మ పొందుతుంది అని చెప్పాడు.

మేరువు అనే పర్వతరాజు హిమవంతుని తర్వాత మిక్కిలి శ్రేష్టుడు. ఆ మేరువునకు సంతానం లేదు. అందుకని ఆయన బ్రహ్మ దేవుని ప్రార్థిస్తూ తపస్సు చేశాడు. బ్రహ్మ యిచ్చిన వరంతో ఒక కొడుకు పుట్టాడు. అతనికి భద్రుడు అని పేరు పెట్టాడు. వశిష్ట మహర్షి వద్ద సకల విద్యలు నేర్పించాడు. ఆ భద్రుడు శ్రీరాముడు అంటే అమితభక్తి కలిగి నిరంతరమూ ఆయననే స్మరిస్తూ వుండేవాడు. ఒకనాడు వారి యింటికి నారద మహర్షి వచ్చాడు.

అంత చిన్న వయస్సులోనే అమిత భక్తి వైరాగ్య లక్షణాలతో వున్న ఆ పిల్లవాడినిచూసి, నారద మహర్షి ఆశ్చర్యపడి, దివ్యదృష్టి ద్వారా భద్రుడు ఒకప్పుడు రాతి రూపమే అయినా ఇప్పుడు మేరు పర్వత రాజుకు కుమారుడుగా జన్మించాడని తెలిసికొన్నాడు. వెంటనే భద్రునకు రామతారక మంత్రం ఉపదేశించాడు. అప్పుడు భద్రుడు గోదావరి నది ఒడ్డున ఇంతకు ముందు తాను రాతిరూపంలో వున్న ప్రదేశానికి చేరుకుని, రామతారక మంత్రం జపిస్తూ ఘోరమైన తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చి శ్రీరాముడు ప్రత్యక్షమై, ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు.

శ్రీ రాముని పాదసేవ చేయడం తప్ప తనకు మరే వరము అక్కరలేదని చెప్పి, భద్రుడు, తన శిరస్సు మీద శ్రీరాముడు నిరంతరమూ నివసిస్తూ వుండేటట్లు వరం అడిగాడు. శ్రీరాముడు అలాగేనని చెప్పి, తనూ, తన భార్య, తమ్ములతో భద్రుని శిరస్సు మీద వెలసి ఉంటానని వరం యిచ్చాడు. భద్రుడు పర్వత రాజు యొక్క కుమారుడు గనుక, ఇక్కడ ఒక చిన్న కొండ రూపం ధరించి, సీతారామ చంద్రులను తన శిరస్సున మోస్తూ ఉన్నాడు. కనుక ఈ ప్రాంతానికి భద్రాచలం (భద్రునికొండ) అని పేరు వచ్చింది.

ఒకప్పుడు నాగలోకానికి రాజు అయిన ఆది శేషుడు రాక్షసుల వలన గొప్ప బాధలు ఎదుర్కొనవలసి వచ్చింది. ఆయన గోదావరి నది ఒడ్డుకు వచ్చి, ఒక అగ్నిగుండం రగిల్చి, హోమంచేసి, పరమ శివుని గూర్చి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఒక శూలాన్ని ప్రసాదించాడు. ఆ శూలం ధరించి ఆదిశేషుడు రాక్షసులను సంహరించాడు. ఆయన హోమంచేసిన చోట ఒక చిన్న గుంట ఏర్పడి ఒక కొలనుగా మారింది. దానికి శేష తీర్థమని పేరు వచ్చింది. హోమం చేసిన గుంట వల్ల ఏర్పడింది గనుక ఆ కొలనులో నీళ్లు వేడిగా వుంటాయి. అందుకే దీనిని ఉష్ణుగుండం అని గూడ అంటారు. భద్రాచలం అనే వూరుకు కొంచెం దూరంగా ఈ శేష తీర్ధం ఉంది.[6]

శ్రీ సీతారాములు వనవాస కాలంలో ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు, శబరి అనే ఒకామె, ఈ అడవిలో దొరికే మధురమైన ఫలాలను వారికి యిచ్చి, స్వయంగా దగ్గరే కూచుని తినిపించింది. దానికి ఎంతో సంతోషించిన శ్రీరాముడు చరిత్రలో ఆమెపేరు శాశ్వతంగా వుండిపోయేటట్లు వరం యిచ్చాడు. ఆమె ఒక నది రూపంగా మారి ఇక్కడ ప్రవహిస్తూ, ఇప్పటికి శ్రీరాముని కొలుచుకుంటూ ఉంది. భద్రాచలం వూరుకు సుమారు ముప్పయి కి.మీ. దూరంలో వున్న ఈ శబరినది. ఇక్కడి నుంచి ప్రవహించుకుంటూ కొంత దూరం సాగిపోయి గోదావరి నదిలో కలుస్తుంది.

లో 1620 క్రీ.శ., ప్రాంతంలో ఈ భద్రాచలానికి దగ్గరలో వున్న ఒక గ్రామంలో, ఒకప్పుడు దమ్మక్క అనే స్త్రీ ఉండేది. ఒకనాడు రాత్రి ఆమెకు కలలో శ్రీరాముడు కనబడి, తను అక్కడకు దగ్గరలోనే అడవిలో, ఫలానా చోట పడివున్నానని చెప్పాడు. మరునాడు ఆమె గ్రామస్తులను పిలిచి తనకు వచ్చిన కల విషయం చెప్పి. వారిని వెంటబెట్టుకొని అడవిలోనికి వెళ్లి వెదకగా, రాళ్లు, ఆకుల మధ్య పడివున్న సీతారాముల విగ్రహాలు కనిపించాయి. ఆమె గ్రామస్తుల సహాయంతో ఆ విగ్రహాలను శుభ్రపరచి, అక్కడ ఒక చిన్న తాటియాకులు పాకవేసి అందులో ఆ విగ్రహాలను ప్రతిష్ఠించింది.

ప్రతి రోజూ తనే స్వామికి పూజాకార్యక్రమాలను నిర్వహిస్తూ వుండేది. ఒక రోజున ఆమె పని మీద పొరుగూరికి వెళ్తూ, పది, పన్నెండేళ్లువున్న తన కుమార్తెను పిలచి స్వామికి పూజచేసి నైవేద్యం పెట్టమని చెప్పి వెళ్లింది. ఆ పిల్ల పూజచేసి, నైవేద్యం స్వామి ఎదుట పెట్టి తినమని చెప్పింది. ఎంతసేపు గడిచినా ఆ నైవేద్యం అలాగే వుండిపోయింది. అమాయకురాలయిన ఆ చిన్న పిల్ల తను స్వామికి నైవేద్యం పెట్టలేదని తల్లి తిడుతుందేమోనని భయపడి నైవేద్యం తినకపోతే తను ప్రాణత్యాగం చేస్తానని స్వామితో చెప్పి, అందుకు సిద్ధ పడింది. ఆమె నిష్కల్మషమైన అమాయకపు భక్తికి మెచ్చి శ్రీరాముడు ప్రత్యక్షమై స్వయంగా ప్రసాదం ఆరగించాడు. తరువాత కొంత సేపటికి దమ్మక్క వూరినుంచి వచ్చి, స్వామికి నివేదన చేసిన ప్రసాదం ఏది అని కూతురిని అడిగింది.

స్వామి తిని వేశాడని ఆ పిల్ల చెప్పింది. మామూలుగా అలా జరగదు కాబట్టి, ఆ పిల్ల తనే తినివేసి అలా అబద్దం చెబుతోందని భావించిన దమ్మక్క, కూతురిని దండించబోయింది. నిజంగా తనే ఆ ప్రసాదం తిన్నానని స్వామి చెప్పిన మాటలు విగ్రహాలలో నుంచి వినిపించాయి. ఇంతకాలంగా సేవ చేస్తూ వున్నా తనకు కలగని భాగ్యం, అమాయకురాలయిన ఆ చిన్న పిల్లకు కలిగినందుకు దమ్మక్క ఆనందపడిపోయింది.

సరిగ్గా అదే సమయంలో, అంటే 1620 క్రీ.శ., అదే ప్రాంతంలో నేలకొండపల్లి అనే గ్రామంలో కంచర్ల లింగన్న కామమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి గోపన్న అనే కుమారుడు వుండేవాడు. వారిది దైవభక్తి గల కుటుంబం కావడంచేత ఆ గోపన్నకు చిన్న తనం నుంచి దైవభక్తి అధికంగా వుండేది. ఒక తడవ ఆ గ్రామానికి సాధుమూర్తి అయిన కబీరు వచ్చాడు. అతను గోపన్న యొక్క దైవభక్తికి, ఉత్తమ లక్షణాలకు ఆనందపడి, అతనికి రామ తారక మంత్రం ఉపదేశించాడు. ఆనాటి నుంచిగోపన్న నిరంతరమూ ఆ మంత్రం జపించుకుంటూ శ్రీరాముని మనసులో నిలుపుకొని వుంటూ వుండేవాడు. ఇంతలో గోపన్న యొక్క తల్లి తండ్రులు ఇద్దరూ గతించారు. పేదవాడయిన గోపన్నకు కుటుంబ పోషణ పెద్ద భారంగా వుండేది.

అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఈ ప్రాంతమంతా గోలుకొండ రాజధానిగా వున్న సామ్రాజ్యంలో భాగంగా వుండేది. గోలుకొండ ప్రభువు తానీషా అనే మహమ్మదీయ నవాబు, ఆయన ఆస్థానంలో అక్కన్న మాదన్న అనే అన్న దమ్ములు మంత్రులుగా వుండేవారు. వారిద్దరు గోపన్నకు మేనమామలు. వారు గోపన్న యొక్క దీన పరిస్థితిని గూర్చి విని, తానీషాతో చెప్పి, గోపన్నకు భద్రాచలం ప్రాంతానికి తహసీల్దారు ఉద్యోగం యిప్పించారు. గోపన్న ఆనందంగా వుద్యోగం చేసికొంటూ ఉన్నాడు.

ఇంతలో శ్రీరామనవమి పర్వదినం సమీపించింది. శ్రీరాముడు అంటే గోపన్నకు గల భక్తి ప్రవత్తుల గూర్చి వివి వున్న దమ్మక్క, ఆయన దగ్గరకు వచ్చి తనకు అడవిలో సీతారాముల విగ్రహాలు దొరకడము మొదలైన వృత్తాంతం చెప్ని, శ్రీరామ నవమినాడు స్వామివారి కళ్యాణం జరిపించితే బాగుంటుందని అర్ధించింది. అప్పటికే గోపన్నకు శ్రీరాముడు ఇలవేలుపు. అందువలన అయాచితంగా లభించిన ఈ అవకాశానికి అనంద పడిపోయి, గ్రామస్తులందరను కూడగట్టుకొని, సీతారామకళ్యాణం వైభవంగా జరిపించాడు.

అయితే, తన ఇష్టదైవమయిన రామచంద్రుడు దీనంగా తాటియాకుల పందిరికింద పడివుండటం గోపన్న మనసును కల్లోలపరచింది. ఆయన వెంటనే స్వామికి ఆలయం నిర్మించడం ప్రారంభించాడు. తన దగ్గర వున్న డబ్బు అంతా ఖర్చు అయి పోయింది. తహసీల్దారుగా తను వసూలు చేసి ఖజానాలో వుంచిన ప్రభుత్వపు వారి డబ్బు ఆరు లక్షల రూ॥లు తీసి ఖర్చు చేసి, ఆలయ నిర్మాణం పూర్తిచేశాడు. ఈ విషయం నవాబు తానీషాకు తెలిసింది. తన అనుమతి లేకుండా ప్రభుత్వ ఖజానాలోని సొమ్మును ఖర్చుచేసినందుకు మండిపడి వెంటనే ఆ డబ్బు చెల్లించమని గోపన్నకు ఆజ్ఞ జారీ చేశాడు.

గోపన్న దగ్గర చిల్లి గవ్వలేదు. తానీషా గోపన్ననను గోలకొండ కోటలోని చెరసాలలో బంధించాడు. పధ్నాలుగు సంవత్సరాల పాటు గోపన్న జైలులో అనేక కష్టాలు అనుభవించాడు. రాజుగారి సైనికులు ఆయనను కొరడాలతో కొట్టేవారు కూడ. ఆ బాధలు భరించలేక గోపన్న ప్రాణత్యాగం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. అదే రాత్రి అంతఃపురంలోవున్న రాజుగారి దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చి, ఆయనను నిద్రలేపి ఆరు లక్షల రూపాయలు వున్న ఒక సంచిని ఆయనకు యిచ్చారు. తాము గోపన్నగారి సేవకులమని, తమపేరు రామన్న, లక్ష్మన్న అని, గోపన్న గారు ఖజానాకు చెల్లించవలసిన డబ్బు తమ ద్వారా పంపించారని చెప్ని, తానీషా వద్ద రసీదుకుగూడ తీసుకుని వెళ్లిపోయారు. తానీషా మరునాడు గోపన్నను పిలిపించి విషయం వివరించగా, తనకు ఆ విషయమేమి తెలియదని గోపన్న అన్నాడు.

అప్పుడు, రామలక్ష్మణులే స్వయంగా వచ్చి గోపన్న చెల్లించవలసిన డబ్బు చెల్లించి వేశారని అందరకూ అర్ధమయింది. రామలక్ష్మణుల దర్శన భాగ్యం కలిగిన తానీషా అదృష్టానికి ఆయనను గోపన్న ఎంతో కొనియాడాడు. తాను గోపన్నను ఎన్నో బాధలు పెట్టినా తిరిగి తననే పొగుడుతూ వున్న డు. ఆయన ఉత్తమ లక్షణాలకు తానీషా సిగ్గుపడి, గోపన్న కాళ్లమీద పడి తనను క్షమించమని వేడుకొన్నాడు.గా గోపన్నను గొప్పగా గౌరవించి, ఎన్నో కానుకలు యిచ్చి భద్రాచలానికి తిరిగి పంపించాడు.

భద్రాచలంలోని ఆలయానికి ఎన్నో దానాలు వ్రాసి యిచ్చాడు. ప్రతిరోజు స్వామికి సకల సేవలూ జరిగేటందుకూ, టి ప్రతిఏడూ శ్రీరామనవమినాడు సీతారామకళ్యాణం ఘనంగా జరిగేటందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పరిచాడు. ప్రతి సంవత్సరమూ స్వామి కళ్యాణ సమయంలో గోలకొండనుండి ఎన్నో కానుకలు పంపించేవాడు. ఆ ఆనవాయితీ తప్పకుండా ఇప్పటికీ, శ్రీరామనవమినాడు జరిగే సీతారామకళ్యాణానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు స్వామికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తున్నారు.

భద్రాచలం తిరిగి వచ్చిన గోపన్న స్వామి వారికి ఉత్సవం జరిపించి గ్రామంలోని వారి కందరికి అన్న సంతర్పణ చేశాడు. భోజన కార్యక్రమం జరుగుతూవుండగా, గోపన్న కుమారుడు పొరపాటున వంటశాలలోనికి వెళ్లి అక్కడ వున్న వేడిగంజి గుంటలోపల పడిపోయాడు. గోపన్న వచ్చి కుమారుని మృత దేహాన్ని తీసుకుని పోయి ఆలయంలో స్వామి ఎదుట వుంచి, ఎంతో ప్రార్థించాడు. స్వామి కరుణించి పిల్లవానిని బ్రతికించాడు. అంతకు ముందు వరకూ గోపన్న తను శ్రీరామచంద్రుని దాసుడని చెప్పుకునేవాడు. ఇప్పుడు ఆయనకున్న రామభక్తి తత్పరత అన్ని దిక్కులకు వ్యాపించి, ఆయనకు రామదాసు అనే పేరు శాశ్వతంగా వుండిపోయింది.[7]

గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా కంచెర్ల గోపన్న ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను (6 లక్షల రూపాయలు) సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా, 1645 AD - 1680 AD మధ్య కాలంలో భద్రగిరిపై శ్రీ రాముడు వెలసిన ప్రదేశమందు ఈ రామాలయాన్ని నిర్మించాడు. దేవునికి రకరకాల నగలు - చింతాకుపతకం, పచ్చలపతకం మొదలైనవి - చేయించాడు.

ఆ సొమ్ము విషయమై తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా, ఆ చెరసాల నుండి తనను విముక్తి చెయ్యమని రాముణ్ణి ప్రార్థించాడు, గోపన్న. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడాడు. ఇవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని ఐతిహ్యం. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు రామదాసు అనే పేరు వచ్చింది.

దేవాలయమందు సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ అత్మారాముని రూపంలో కొలువుతీరి ఉన్నాడు. సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేష ప్రజానీకం వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రామదాసు చేయించిన వివిధరకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు.భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తరువాత మరల భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచాడు.

భద్రాచలం మండలం

[మార్చు]

రవాణా సౌకర్యాలు

[మార్చు]

మండలకేంద్రమైన భద్రాచలం యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా ఉంది. హైదరాబాదు నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా, విజయవాడ నుండి కొత్తగూడెం మీదుగా, రాజమండ్రి నుండి మోతుగూడెం మీదుగా, విశాఖపట్నం నుండి సీలేరు, చింతపల్లి మీదుగా, వరంగల్లు నుండి మహబూబాబాద్, ఇల్లందు మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

భద్రాచలం రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుసౌకర్యం లేదు. ఇక్కడికి 35కి.మీ.ల దూరంలోని కొత్తగూడెంలో ఉన్న భద్రాచలం రోడ్ స్టేషను అతి దగ్గరలోని రైల్వే స్టేషను. ప్రతిరోజూ హైదరాబాదు నుండి మూడు (కొల్లాపూర్ ఎక్స్ ప్రెస్, మణుగూరు ఎక్స్ ప్రెస్, కాకతీయ ప్యాసింజర్), మణుగూరు, విజయవాడ నుండి ఒకటి, రామగుండం నుండి ఒక రైలు ఈ స్టేషనుకు వచ్చిపోతాయి.

గోదావరి నది పక్కనే భద్రాచలం ఉండడంతో రాజమండ్రి నుండి ప్రతిరోజూ లాంచీ ద్వారా రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఈ మార్గంలోనే పాపికొండలు కానవస్తాయి. భద్రాచలం కేంద్రంగా జరిగే విహారయాత్రల్లో ఈ జలమార్గం ప్రముఖమైనది.

వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారు భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయం చేరటానికి లిఫ్ట్‌ సౌకర్యం కలదు దక్షిణం వైపు మెట్ల నుంచి ఈ లిఫ్ట్‌ ఆలయ గాలిగోపురం ముందుకు చేరుస్తుంది.

కొన్ని వివరాలు

[మార్చు]

భద్రాచలం పట్టణం పేరును ప్రభుత్వం 2002లో శ్రీరామ దివ్యక్షేత్రం పట్టణంగా మార్చింది. భద్రాచలం రెవెన్యూ మండల జనాభాలో దాదాపు మూడోవంతు గిరిజనులు. వ్యవసాయాధారిత ఆర్థికవ్యవస్థ. పర్యాటకం మరో ప్రధాన ఆర్థిక వనరు. ప్రతీ వర్షాకాలంలోను గోదావరికి వరదలు వచ్చి భద్రాచలం పట్టణపు పల్లపు ప్రాంతాలు జలమయం కావడం సర్వసాధారణంగా ఉండేది. పట్టణ అభివృద్ధిలో భాగంగా నదికి వరదకట్టను నిర్మించిన తరువాత ఈ బెడద బాగా తగ్గింది. ప్రభుత్వ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం (ఐ.టి.డి.ఏ) భద్రాచలంలోనే ఉంది.

  1. "District Census Handbook - Khammam" (PDF). Census of India. The Registrar General & CensusCommissioner. pp. 14, 40. Retrieved 2 June 2016.
  2. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 26 July 2014.
  3. "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived from the original on 2022-01-06. Retrieved 2022-07-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "భద్రాచలం అధికారిక వెబ్‌సైటు". Archived from the original on 2009-01-16. Retrieved 2008-07-24.
  5. "THE ANDHRA PRADESH REORGANISATION (AMENDMENT) ORDINANCE, 2014 (NO. 4 OF 2014)" (PDF). Archived from the original (PDF) on 2020-11-28. Retrieved 2019-04-04.
  6. "BHADRACHALAM - TRIP TO INDIA - TRIP ADVISOR - Earnerscube". web.archive.org. 2023-02-11. Archived from the original on 2023-02-11. Retrieved 2024-08-22.
  7. Vasperi (2023-01-22). "BHADRACHALAM - TRIP TO INDIA - TRIP ADVISOR - Earnerscube". Archived from the original on 2023-02-11. Retrieved 2023-02-11.
"https://te.wikipedia.org/w/index.php?title=భద్రాచలం&oldid=4354670" నుండి వెలికితీశారు