సరోజినీ నాయుడు

వికీపీడియా నుండి
(సరోజిని నాయుడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సరోజినీ నాయుడు
1946 లో బొంబాయి లో సరోజినీ నాయుడు
జననంసరోజినీ ఛటోపాధ్యాయ
1879, ఫిబ్రవరి 13
హైదరాబాద్ , తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
మరణం1949 , మార్చి 2
లక్నో , ఉత్తర ప్రదేశ్
నివాస ప్రాంతంగోల్డెన్ త్రెషోల్డ్, హైదరాబాద్
జాతీయతఇండియన్ బెంగాలీ
ఇతర పేర్లుసరోజినీ ఛటోపాధ్యాయ
విశ్వవిద్యాలయాలుకింగ్స్ కాలేజ్, లండన్
గిర్టాన్ కాలేజ్ , కేంబ్రిడ్జ్
వృత్తిరచయిత్రి, కవయిత్రి, సమాజ సేవకురాలు
ప్రసిద్ధిభారత కోకిల
భార్య / భర్తడా. ముత్యాల గోవిందరాజులు నాయుడు
పిల్లలుజయసూర్య నాయుడు, పద్మజా నాయుడు, రణధీర్ నాయుడు, నిలవార్ నాయుడు, లీలామణి నాయుడు.
తండ్రిడా. అఘోరనాథ్ చటోపాథ్యాయ ,
తల్లివరద సుందరి దేవి
హైదరాబాదులోని సరోజిని నాయుడు గారి నివాస గృహం. ప్రస్తుతం దాని పేరు గోల్డెన్ త్రెషోల్డ్ (golden threshold)

సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి.[1] సరోజినీ దేవి 1925 డిసెంబరులో కాన్పూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా.[2]

బాల్యము

ఈమె సా.శ. 1879 వ సంవత్సరం ఫీబ్రవరి నెల 13 వ తేదీన హైదరాబాద్లో జన్మించారు. తండ్రి డా. అఘోరనాథ్ చటోపాద్యాయా, తల్లి శ్రీమతి వరద సుందరి.[3] అఘోరనాథ్ చటోపాధ్యాయగారు హైదరాబాదు కళాశాలకి, (అనగా నేటి నిజాం కళాశాల) మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసారు. తల్లి వరదాదేవి చక్కని రచయిత్రి. చిన్నతనం నుంచీ ఆమె బెంగాలీ భాషలో చక్కని కావ్యాలు, కథలు వ్రాయడం జరిగింది.

తండ్రి గారైన అఘోరనాథ్ చటోపాధ్యాయ ఎనిమిది భాషలలో పండితుడు. సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ, గ్రీకు, జర్మనీ, హిబ్రూ, ఫ్రెంచ్, ఆంగ్లం మొదలైన భాషలు ఆయనకు అనర్గళంగా వచ్చు. వీరు ఎడిన్బరో విశ్వవిద్యాలయంలో డాక్టర్ పట్టాను పొందటం జరిగింది.

శ్రీమతి సరోజినీ నాయుడు సద్ వంశంలో జన్మించటం వలనా, తల్లి దండ్రులు విద్యాధికులవటం వలన, ఆమెలో చిన్నతనం నుంచే కార్యదీక్షా, పట్టుదలా, విద్యపై తిరుగులేని సదభిప్రాయాలు ఏర్పడటం జరిగింది. ఏది చూసినా, ఎవరి మాటలు విన్నా పట్టించుకోకుండా తమ ఆలోచనల్లో తాముంటారు చాలా మంది. కొందరు ఆ విధంగా కాక బాల్యం నుంచి ప్రతి విషయంలోనూ కుతూహలం కనబరచి ఏది, ఏమిటో తెలుసుకొనే వరకూ విశ్రమించరు. రెండవ కోవకు చెందిన మేధావి శ్రీమతి సరోజినీ నాయుడు.

చిన్నతనం నుంచీ ఆమెకు ఇంగ్లీషు భాషమీద చాలా మక్కువ ఉండేది. ఇంగ్లీషు మాట్లాడాలని ఆమె ఎంతగానో ప్రయత్నిస్తూండేది. ఆ పట్టుదలా, ధ్యేయాలతోనే ఇంగ్లీషు భాషను ఎంతో శ్రద్ధగా అభ్యసించింది. సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ లో చదువుకుంది. పదకొండో సంవత్సరం వచ్చేసరికి ఆమె అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఆ వయసులోనే ఇంగ్లీషులో రచనలు ఆరంభించింది కూడా!

ఆమె పన్నెండవ ఏట మద్రాసు విశ్వవిద్యాలయంలో మెట్రిక్యులేషన్ పూర్తి చేయగలిగిందంటే ఆమె చురుకైన తెలివితేటలూ, విద్య యందు ఆమెకు గల అంకిత భావం మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది విద్యార్థులు నిత్యం పాఠశాలలకు వెళుతూ, విద్య యందు దృష్టి నుంచక, గురువులు చెప్పే పాఠాలు కాలక్షేపానికి భావిస్తూ, గురువులను, సాటి విద్యార్థులనూ ఆవహేళన చేస్తూ కాలం విలువ తెలియక ప్రవర్తించి, జీవితంలో అడుగు పెట్టి సాధక, బాధకాలు ఎదురయ్యాక వృథా చేసిన కాలం గురించి బాధపడుతుంటారు. అటువంటి వారందరికీ శ్రీమతి సరోజినీ నాయుడు నిజంగా ఆదర్శమూర్తి.భారత దేశ మొదటి మహిళా గవర్నరుగా సరోజిని నాయుడు చరిత్రకెక్కారు.

గోల్డెన్ త్రెషోల్డ్

ఇది శ్రీమతి సరోజినీ నాయుడు హైదరాబాదు నివాస గృహం. హైదరాబాదులోని నాంపల్లి రైల్వే స్టేషనుకు సమీపంలో వున్న ఈ చారిత్రాత్మక బంగళాలో సరోజిని తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ నివాసముండేవాడు. సరోజినీ నాయుడు తదనంతరం దీనిని ప్రసిద్ధ కవితా సంకలనమైన గోల్డెన్ త్రెషోల్డ్గా పేరు మార్చి గుర్తించసాగారు.

1974లో పద్మజా నాయుడు దానిని విద్యా ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. 1975లో, ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ గోల్డెన్ త్రెషోల్డ్ ను హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి అంకితం చేశారు. సాంఘిక శాస్త్రాలు, మానవీయ శాస్త్ర కార్యక్రమాలు గోల్డెన్ థ్రెషోల్డ్‌లో నిర్వహించబడ్డాయి. ఇవి 1988లో ప్రధాన క్యాంపస్‌కు మార్చబడ్డాయి. సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ 2003 వరకు ప్రాంగణంలో నడిచింది.[4]

ఉన్నత చదువుకు విదేశ యానం

సరోజినీ పదమూడవ యేట చాలా పెద్ద రచన రచించింది. దానిపేరు సరోవరరాణి (Lady of Lake). అది పదమూడు వందల పంక్తులతో నిండిన అతి చక్కని రచన. తాను చెప్పదలచుకున్న విషయము ఇతరుల హృదయాలకు హత్తుకుని ఆలోచింపజేసే విధంగా కమ్మని శైలిలో చిన్న తనం లోనే రచనలు ప్రారంభించిన ఆమెలోని ప్రత్యేకతలు గ్రహించిన నిజాంనవాబు ఆమె యందు గల అభిమానంతో ఆమెను విదేశాలకు పంపాలని నిర్ణయించుకుని, ఆమె వివిధ శాస్త్రాలలో పరిశోధన చేసేందుకు ప్రోత్సాహమిస్తూ, ఆమెకు ప్రతి సంవత్సరం నాలుగువేల రెండు వందల రూపాయలు విద్యార్థి వేతనంగా ఇచ్చేందుకు కూడా అంగీకరించాడు.

నిజాంనవాబు ప్రోత్సాహం దొరికేసరికి, ఆమెకు చదువుమీదనున్న ఆసక్తి గ్రహించిన తల్లిదండ్రులు ఆమెను విదేశాలకు పంపారు. సరోజినీ లండన్ కింగ్స్ కళాశాల లోను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ అధ్వర్యంలోని గిర్టన్ కళాశాలలోనూ విద్యాధ్యయనం చేసింది. ఈవిడ రాసిన కవితలను చదివి, ఇంగ్లాండ్ లోని ఆంగ్ల భాషా విమర్శకులు ‘ఆర్థర్ సైమన్స్’, ఎడ్వర్ గూస్ లు అభినందించారు. పాశ్చాత్య విద్వాంసులను చాలా మందిని కలసి వారికి గల పాండిత్యాన్ని ఆకళింపు చేసుకుని వారితో స్నేహ సంబంధాలు పెంచుకుని వారి సలహాలతో, ఇంగ్లీషులో అతి చక్కని గ్రంథాలు వ్రాసింది.

ఆమె రచించిన కావ్యాలలో "కాలవిహంగం" (Bird of time), "స్వర్గ ద్వారం" (the Golden Threshold), విరిగిన రెక్కలు (the broken wings) అనేవి చాలా ప్రసిద్ధమైనవి. ఆమె ఇంగ్లాండులో నివసిస్తూ రచనలు సాగించినా, వాటిలో భారతీయ జీవితాలు ప్రతిబింబించేటట్లు చేయడం, మన జాతి ప్రత్యేకతలు అందులో చొప్పించి కథా విధానం నడిపించడం విశేషం.

వివాహము-కుటుంబ బాధ్యతలు

1898 వ సంవత్సరం విదేశాలలో విద్య పూర్తి చేసుకుని భారతదేశం తిరిగి వచ్చాక, ఆమె శ్రీ ముత్యాల గోవిందరాజులు నాయుడు గారిని పెండ్లాడటం జరిగింది. ముత్యాల గోవిందరాజులు నాయుడు అప్పటి హైదరాబాద్ ప్రధాన ఔషధారోగ్యాధికారి. కులం మతమూ అనే మూఢవిశ్వాసాలంటే శ్రీమతి సరోజినీ నాయుడికి చిన్నతనం నుంచే ఏవగింపు. ఈ కుల, మతము లేకమై జాతి జీవనంపై గొడ్డలి పెట్టు పెడుతూ, వర్గ భేదాన్ని సృష్టించి ధనవంతులు, నిరుపేదలు, బలవంతులు, బలహీనులు అంటూ జాతిని వేర్పాటు ధోరణికి బలి చేస్తున్నాయనీ, కుల మతాతీత భావాలతో పెరిగే ప్రజానీకం మాత్రమే సమ సమాజ స్థాపన చెయ్యగలరనీ ఆమె అభిప్రాయం.

ఆమె అదే అభిప్రాయంతో శ్రీ ముత్యాల గోవిందరాజులు నాయుడు తన కులము కాకపోయినా భారతీయ మహిళా లోకానికి ఆదర్శము కావాలన్న ఉద్దేశంతో ఆనాడే వర్ణాంతర వివాహం చేసుకుంది. ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు వీరి వివాహం జరిపించారు. ఆమె చేసిన పనికి ఎన్నో విమర్శలు ఎదుర్కోవలసి వచ్చినా మానవ జీవిత మనుగడకు మనసూ, మానవత్వం ముఖ్యం కాని, అర్థం లేని గ్రుడ్డి నమ్మకాలను ప్రోత్సహించి, జాతిని పతనము చేసే కులము కాదని ఆమె నిరూపించగలిగింది. తనూ, తన భర్త భిన్నమైన ఆచార వ్యవహారాలు, కులాల వారైనా, మనసున్న మనుషులుగా, సంస్కారవంతులుగా నియమబద్దమైన జీవితం సాగించసాగారు. స్త్రీ పురుషులు ఒకరినొకరు అర్థం చేసుకుని సంసారము దిద్దుకోగలిగితే కులము గొడవ ఏదీ లేదని మిగిలిన సమాజానికి నిరూపించారు.

శ్రీమతి సరోజినీ నాయుడు గోవిందరాజులు నాయుడు గార్ల దాంపత్య చిహ్నంగా వారికి ఒక కుమారుడూ, ఇద్దరు కుమార్తెలు కలిగారు. కుమారుడు ముత్యాల జయసూర్య నాయుడు ప్రముఖ హోమియోపతీ వైద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదుకు చెందిన రాజకీయ నాయకుడు. వీరి కుమార్తెలలో ఒకరైన పద్మజా నాయుడు బెంగాల్ గవర్నర్గా పనిచేశారు కూడా.[5]

వివాహమై బిడ్డలు పుట్టినా, ఆమె కేవలం తన సంతోషం, తన పిల్లల సుఖమే ఆలోచించలేదు. అప్పటి ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా ఎందరో నాయకులు దేశము నాలుగు మూలల నుండి ప్రజల్లో స్పాతంత్ర్య భావాలు రేకెత్తించాలని ఉద్యమాలు సాగిస్తున్నారు. భారతీయులలో విప్లవ భావాలు తలెత్తడము సహించలేకపోయింది బ్రిటిష్ ప్రభుత్వం. గంగిరెద్దుల్లా వారు చెప్పిన దానికల్లా తలలూపుతూ మన సంపదనంతా వారికి నచ్చ చెప్పి, మనము చెప్పు క్రింద తేళ్ళ మాదిరిగా జీవిస్తూ పర ప్రభుత్వానికి నివాళులివ్వాలని వారి అభిప్రాయం. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ ఆ రోజులలో గోపాల కృష్ణగోఖలే నాయకత్వంలో ఉద్యమాలు సాగిస్తోంది.

రాజకీయ రంగ ప్రవేశం

వీరు మహిళాభివృద్దికి ఎంతో కృషి చేసి 1906లో మహిళలకు విద్య అవసరమని దేశమంతా ఎన్నో మహిళా సమావేశాలు ఏర్పరచి మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో పాటు పడ్డారు. స్వాతంత్ర్య సాధనలో తనూ పాలుపంచుకోవాలని ఆలోచించిన శ్రీమతి సరోజినీ నాయుడు కాంగ్రెస్ జాతీయ భావాలకు అనుగుణంగా నడుచుకోనారంభించింది. 1915 వ సంవత్సరం బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో, 1916 లో జరిగిన లక్నో కాంగ్రెస్ సభలలో ఆమె పాల్గొనటం జరిగింది.[6] ఆనాటి కాంగ్రెస్ భావాలు చాలా ఆదర్శంగా ఉండేవి. సరోజినీనాయుడు భారతదేశములో గల ముఖ్యమైన నగరాల్లో తిరుగుతూ స్వాతంత్ర్యోద్యమ ఉపన్యాసాలిచ్చి, ప్రజలతో భాష విప్లవము వచ్చేందుకు కారకురాలయినది. మృదువుగా మాట్లాడుతూ, ఎంత కఠినమైన విషయాలైనా, శ్రోతల గుండెలను హత్తుకుని, మరుగున ఉన్న యథార్థ స్థితిని అర్థమయ్యే విధంగా ఉండే ఆమె గంభీరమైన ఉపన్యాసాలు శ్రోతలకు కాలం, శ్రమ తెలియనిచ్చేవి కావు.[7]

ప్రభుత్వానికి ఎదురు తిరిగి తూటా దెబ్బలకో, చీకటి కొట్లకో బలయ్యే బదులు ఈ బానిస బ్రతుకే నయమనుకుని సర్దుకుపొయ్యే అమాయక ప్రజానీకములో ఆమె ఉపన్యాసాలు దేశభక్తిని నూరి పోసి చావుకు కూడా భయపడని తెగింపును తేగలిగాయి. "జాతి వేరనీ, దేశం వేరనీ, నువ్వు వేరనీ విడిగా ఉండకు. నీకు జరిగితే దేశానికి జరిగినట్టే. దేశం అనుభవించే బానిసతనం నీవూ అనుభవించవలసినదే" అంటూ దేశమంతా తిరిగి దేశభక్తిని నూరిపోసిందా వీరతిలకం.

ఈ విశ్రాంతి లేని ప్రయాణాలతోనూ, ఉపన్యాసాలతోనూ ఆమె ఆరోగ్యం పాడైంది. 1919 సంవత్సరంలో పంజాబ్ లోని జలియన్ వాల బాగ్లో హత్యా కాండ బరిగింది. ఆ సమయానికి సరోజినీనాయుడు లండన్ నగరంలో చికిత్స పొందుతోంది. అప్పటి పంజాబ్ గవర్నరైన డయ్యర్ లక్షలాది ప్రాణాలను తుపాకి గుండ్లకు బలిచేసి దారుణంగా హింసించి, చంపిన విషయం ఆమె లండన్ నగరంలో విన్నది. ఆమె గుండె ఆ వార్తకు నీరయిపోయింది. అప్పటికే ఆమె గుండె జబ్బుతో ఉన్నదని బాగా ముదిరిపోయినదని చెప్పారు వైద్యులు. అయినా చనిపోయే ప్రతి భారతీయుని భయంకరమైన కేకలు ఆమె చెవుల్లో గింగురుమన్నాయి. ఆమె గుండె జబ్బు కాక చనిపోయిన వారి భార్యలు, కుమార్తెలు, కుమారుల గుండెలు పగిలే శోకాలు తలుచుకొని ఆ కరుణామూర్తి చలించిపోయింది.

ఆ పరిస్థితిలో తను ఉండి కూడా ఆరోగ్యాన్ని ఏ మాత్రం లెక్క చేయక పంజాబ్ గవర్నర్ డయ్యర్ మీద ఆందోళన లేవదీసింది. గాంధీజీకి పంజాబ్ దారుణము గురించి ఉత్తరము వ్రాస్తూ, యావత్ ప్రపంచ భారతీయులకు డయ్యర్ ద్వారా జరిగిన ఘోరాన్ని వినిపించనిదే నిద్రపోననీ, వారి రాక్షస కృత్యాలకు బదులుగా భారతదేశం నుంచి వారిని తరిమి కొట్టి, భారతీయుల స్వేచ్ఛ చూడనిదే, భరతమాత ఆత్మ శాంతించదని తన సందేశము ద్వారా తెలియపరిచింది.

శాసన ధిక్కారం

సరోజిని లండన్ నగరం నుంచి బయలుదేరి సముద్ర మార్గం గుండా ప్రయాణించి, భారతదేశములో ఓడ దిగటం తోటే శాసన ధిక్కారం అమలు పరిచింది. స్వాతంత్ర్యోద్యమ చరిత్రల పుస్తకాలను అమ్మకూడదని, బ్రిటిష్ ప్రభుత్వం ఆజ్ఞలు జారీ చేసింది. ఆ ఆజ్ఞలు ఫలితంగా చాలా పుస్తకాలను అమ్మటం మానేశారు. గాంధీజీ సలహాపైన ఆ పుస్తకాలన్నింటినీ ప్రతి వీధిలోనూ అమ్మి ప్రభుత్వ శాసన ధిక్కారం జరిపింది సరోజినీనాయుడు.

భారతదేశం పైనా, భారతీయుల పట్ల ఆమెకున్న ప్రేమ, వాత్సల్యం ఆమె సొంత ఆరోగ్య విషయం కూడా మరచిపొయ్యే విధంగా చేశాయంటే ఆమె దేశభక్తిని, త్యాగనిరతిని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలోనే ఒక బహిరంగ సభలో ఉపన్యసిస్తూ, బ్రిటిషు పాలకులు భారతదేశాన్ని స్వంతంగా భావించడమే అపరాధం. భారతీయుల హక్కులు కాలరాసి, బానిసలుగా చేసి వారి ప్రాణాలు సైతం బలి తీసుకోవటం క్షమించరాని అపరాధం" అంటూ ఆడపులిలా గర్జించింది.

లండన్ కామన్స్ సభలోని భారత దేశ మంత్రి ఆమె చేస్తున్న తిరుగుబాటు ధాటికి చలించిపోయ్యాడు. ఆమె ఉపన్యాసాలు, ఉద్వేగం సక్రమమైనవి కావనీ, ఇకపై అటువంటి ప్రచారం చెయ్యవద్దనీ, బ్రిటిష్ ప్రభుత్వం ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. తనకే రకమైన శిక్ష విధించినా యథార్థాన్ని ప్రచారం చేయక మాననని నిర్భయంగా సమాధానం చెప్పింది సరోజినీ నాయుడు. ఒక భారత స్త్రీకి దేశంపై గల ప్రేమనూ, ఆమెకు గల స్వాతంత్ర్య పిపాసనూ అర్థం చేసుకున్న గాంధీజీ ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఆయన రాజద్రోహము, నేరము క్రింద ఆరేండ్లు కారాగార శిక్షననుభవించేందుకు వెళుతూ, సరోజినీనాయుడు పై గల విశ్వాసంతో, ఉద్యమనాయకత్వం ఆమెకు అప్పగించారు.

ఊరూరా, వాడవాడలా తిరుగుతు స్వాతంత్ర్య ప్రభోదం ముమ్మరంగా సాగించింది. అప్పటికే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. తన భర్త, బిడ్డల యోగక్షేమాలు కూడా మాని సాటి భారతీయులంతా బిడ్డల మాదిరిగా భావించి పర్యటన సాగించిందా త్యాగమూర్తి. విరామ సమయాలలో దేశ ప్రజల భవిష్యత్ ను గురించి, బ్రిటిష్ వారి ఘోర పరిపాలన గురించి రచనలు చేస్తూనే ఉంది. ఎక్కడున్నా, ఏదో ఒక రకంగా దేశ ప్రజలకు స్వాతంత్ర్య ప్రభోదాలు అందజేస్తూనే ఉందావిడ.

పురోగతినీ, స్వచ్ఛమైన స్వేచ్ఛా, స్వాతంత్ర్య జీవితాలను వాంఛించిన పురుష కవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాదిరిగా స్త్రీయై ఉండి కూడా జాతి విమోచనానికి శాయశక్తులా అహోరాత్రులు కృషి చేసిన త్యాగ పూరిత కవయిత్రి శ్రీమతి సరోజినీనాయుడనటంలో యే మాత్రము సందేహం లేదు.

విదేశీ పయనం

దక్షిణాఫ్రికాలో భారతీయులు అనుభవిస్తున్న దుర్భర బానిసత్వాన్ని అర్థం చేసుకొని, అక్కడి వారి హక్కులకోసం పోరాడేందుకు 1926 వ సంవత్సరం శ్రీమతి సరోజినీ నాయుడు దక్షిణాఫ్రికా వెళ్ళి వారికెంతో సేవ చేసింది. ఆమె దేశానికి చేసిన సేవలు, ఆమెకు దేశంపై గల నిష్కళంక ప్రేమ ఫలితంగా కాన్పూర్ లో 1925 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షురాలైంది.[8][9] "పీడిత ప్రజల విమోచనానికి జాతి, మత, కుల భేదాలు ఇనుప సంకెళ్ళన్నీ, భారతీయులంతా ఒక్కటేనని, స్త్రీ పురుష భేదములేకుండ త్యాగం చేస్తే గానీ, జాతి బానిసత్వం నుంచి విమోచన పొందదని, అవసరమైతే ప్రాణత్యాగాల కైనా వెనుకాడవద్దనీ, బానిస భావంతో తరతరాలు మ్రగ్గిపోతూ బ్రతికే కంటే త్యాగంతో ఒక తరం అంతరించి భావితరాల వారికి స్వేచ్ఛను ప్రసాదించటం జాతీయ సంస్థ లక్ష్యమనీ!" మహోపన్యాసం యిచ్చి లక్షలాది ప్రజలను స్వాతంత్ర్య పిపాసులుగా తయారుచేసింది.

కెనడా, అమెరికా మొదలైన దేశాలకు 1928 లో వెళ్ళి భారతీయుల బానిసత్వాన్ని గురించీ వీరి ఆశయాల గురించీ ప్రచారం చేసింది. 1929 లో తూర్పు ఆఫ్రికా అంతా ప్రచారము చేస్తూ పర్యటించింది. గాంధీజీ అరెస్టయినది మొదలు విశ్రాంతి అనే మాటకు తావివ్వకుండా దేశ, దేశాలు పర్యటిస్తూ పీడిత భారత ప్రజల విముక్తికి ఆమె ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

ఒక భారతీయ మహిళ చేస్తున్న ఉద్యమ ప్రచారనికి బ్రిటిష్ ప్రభుత్వం బెంబేలెత్తిపోయింది. ఆమెను స్వేచ్ఛగా తిరగనీయడం తనకూ, తన దగాకోరు పరిపాలనకూ తగదని తలంచి 1930 వ సంవత్సరం మే 23 వతేదీన శ్రీమతి సరోజినీ నాయుడును అరెస్టు చేసింది. అరెస్టయినందుకు గానీ, కారాగార జీవితం అనుభవించేందుకు గానీ ఆమె ఏ మాత్రం భయపడలేదు. అవసరమైతే ప్రాణాలే ధార పోయాలని నిశ్చయించుకున్న దేశభక్తురాలికి ఏడెనిమిది నెలల కారాగార జీవితం మొక లెక్కా? సమర్థురాలైన నాయకురాలిని, నిస్వార్థ దేశభక్తురాలిని అరెస్టు చేశారని విని గాంధీజీ ఎంతో బాధపడ్డారు. ఆయన కారాగారంలో ఉన్న సమయంలో అటువంటి ప్రచారకులు చీకటిలో ఉండటం వలన ప్రచారం ముమ్మరంగా సాగే అవకాశాలు లోపించగలవని ఆయన బాధ.

భారతీయ ప్రతినిధిగా 1931 వ సంవత్సరంలో లండన్ రౌండ్ టేబిల్ సమావేశానికి వెళ్ళింది సరోజినీ నాయుడు. క్విట్ ఇండియా ఉద్యమంలో 1942 లో బ్రిటిష్ ప్రభుత్వాన్నెదిరించి ఎన్నో రకాలుగా స్వాతంత్ర్య పోరాటం సాగించిందామె. అందుకు ఫలితంగా అరెస్టు చేయబడి, దాదాపు 1945 వరకు దుర్బర కారాగారవాస జీవితాన్ని నవ్వుతూ అనుభవించింది. అనారోగ్యంగా ఉన్న కారణంగా ఆమెను విడుదల చెయ్యవలసి వచ్చింది.

యు.పి. రాష్ట్రపతి గా

ఎందరో మహానుభావుల అచంచల దేశభక్తి, ఎడతెగని ఉద్యమ ప్రచారాల మూలంగా, 1947, ఆగస్టు 15 వ తేదీన మనం స్వాతంత్ర్యం సాధించగలిగాము. శ్రీమతి సరోజినీనాయుడు దేశానికి చేసిన సేవలు దృష్టిలో ఉంచుకుని ఆమెకు ఉత్తర ప్రదేశ్కు గవర్నర్ పదవి యిచ్చి సత్కరించడం జరిగినది[10][11]. వృద్దాప్యంలో, అనారోగ్యంతో ఉండి కూడా ఆమె ఉత్తరప్రదేశ్ కు చేసిన సేవ, కార్యదక్షత ఎన్నటికీ మరపురానివి.

అంతిమ సందేశం

తనే దేశం, దేశమే తనుగా భావించి దేశ సేవ చేసిన అభేద భావాల మూర్తి రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో రకరకాలుగా సేవలు చేసి మానవ సేవ చేయదలుచుకున్న వారికి మార్గాలనేకం అని నిరూపించిన మహిమాన్వితురాలు. జీవితమంతా మానవ సేవకు, దేశసేవకూ అంకితము చేసి తన డెబ్బై వ యేట 1949 మార్చి 2 వ తేదీన లక్నోలో ప్రశాంతంగా కన్ను మూసింది.

జీవిత విశేషాలు

1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో గాంధీజీతో సరోజినీ నాయుడు (కుడి పక్క మొదటి వ్యక్తి)

సరోజినీ పన్నెండో ఏట మద్రాస్ విశ్వవిద్యాలయం మెట్రిక్యులేషన్ పరీక్షలో ప్రథమురాలిగా నిలిచి పలువురి ప్రశంసలందుకుంది. ఈమె 13 సంవత్సరాల వయసులోనే ది లేడి ఆఫ్ ద లేక్ పేరున 1300 పంక్తుల కవితను ఆరు రోజుల్లో రాసింది. సరోజినీ దేవి చటోపాధ్యాయ హైదరాబాదులో ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబములో జన్మించింది. ఈమె తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయతూర్పు బెంగాల్ కి చెందిన గొప్పవిద్యావేత్త, డా.ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందిన మొదటి భారతీయుడు.నిజాం కళాశాల స్థాపకుడు, శాస్త్రవేత్త, తత్వవేత్త. తల్లి బరదా సుందరి దేవి ఒక కవయిత్రి. సరోజినీ నాయుడు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో మహాత్మాగాంధీతో పాటు పాల్గొన్నది. ఆమె మద్రాసులో చదువుకున్నది. చదువు పూర్తయిన తర్వాత 19 సంవత్సరాల వయసులో కులాంతర వివాహము చేసుకున్నది. కులాంతర వివాహములకు సమాజము చాలా వ్యతిరేకముగా ఉన్న ఆ రోజుల్లో సరోజిని గోవిందరాజులు నాయుడును బ్రహ్మో వివాహ చట్టం (1872) ప్రకారం 1898 డిసెంబర్ 2న మద్రాసులో పెళ్ళి చేసుకున్నది. వీరి వివాహాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు జరిపించారు. నాయుడు దంపతులకు నలుగురు పిల్లలు కలిగారు: జయసూర్య, పద్మజ, రణధీర, లీలామణి.

ఆమె 1905లో మొదటి కవిత్వం గోల్డెన్ త్రెషోల్డ్ రాసింది. తద్వారా నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రపంచపు ప్రఖ్యాతి గడించింది. తర్వాత ది బర్ద్ ఆఫ్ టైం, ది బ్రోకెన్ వింగ్, పాలంక్వైన్ బేరర్స్ ఆమె కవితల్లో కొన్ని.

హైదరాబాదు లోని గోల్డెన్ త్రెషోల్డ్ అనే పేరుతో గల ఆమె ఇంటిలో హైదరాబాద్ యూనివర్సిటీని నెలకొల్పారు. బెంగాలీయుల ఆడపడుచు, తెలుగు వారి కోడలు శ్రీమతి సరోజినీ నాయుడు. అఘోరనాథ్ ఛటోపాధ్యాయ, వరద సుందరీ దంపతులకు 1879 ఫిబ్రవరి 13న వారి ప్రథమ సంతానంగా జన్మించారు.

సరోజిని కవితలని చదివి, మెట్రిక్యులేషన్లో మొదటి స్థానాన్ని తెచ్చుకున్న ఆమె ప్రతిభని గుర్తించిన హైద్రాబాద్ నిజామ్ ప్రభువు విదేశాల్లో చదువుకి ఉపకార వేతనం ఇచ్చారు. కానీ అనారోగ్యం కారణంగా రెండు సంవత్సరాలు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. ఆ రెండు సంవత్సరాలు పుస్తక పఠనంలోనే గడిపి అపారమైన జ్ఞానాన్ని సముపార్జించారు.

ఆ కాలంలోనే పదహారేళ్ళ వయసులో సరోజినీ ఛటోపాద్యాయ పై చదువులకు లండన్ ప్రయాణమై వెళ్ళారు.

లండన్లోనే ప్రముఖ కవులైన ఎడ్మండ్ గాస్, ఆర్థర్ సైమన్ల పరిచయం కలిగింది.

సరోజిని వ్రాసిన "ది బర్డ్ ఆఫ్ టైమ్" కవితా సంకలం పరిచయ వాక్యాలలో ఎడ్మండ్ గాస్ వెలిబుచ్చిన భావాలు, ఆయన మాటల్లోనే.. సరోజిని. మొదటి కవితా సంకలనం, "ది గోల్డెన్ త్రెష్ హోల్డ్" ౧౯౦౫ లో ప్రచురించారు. తనకి మార్గదర్శి అయిన ఎడ్మండ్ గాస్కి ఆ సంకలనాన్ని అంకితమిచ్చారు సరోజిని. దానికి పరిచయ వాక్యాలు ఆర్థర్ సైమన్ రాశారు.

కవికోకిల కవితలలో గేయాలు, గీతాలు, పద్యాలు ఉన్నాయి. ఆవిడ ప్రథమ కవితా సంకలనం "గోల్డెన్ త్రెషోల్డ్"లో మూడు ప్రక్రియలూ ఉన్నాయి. ఆ సంకలనం రూపొందడానికి ఆర్థర్ సైమన్ ముఖ్య కారకులు. 1908లో మూసీనదికి వరదలు సంభవించిన సమయంలో చేపట్టిన సేవా కార్యక్రమానికి బ్రిటీష్ ప్రభుత్వం ‘‘కైజార్ ఎ హిందూ’’ స్వర్ణ పతకాన్ని బహుకరించింది.

ఆర్థర్ సైమన్ ప్రోత్సాహంతో మొదటి కవితా సంకలనం వెలువడింది.

జానపద గేయాల్లో అత్యంత ప్రాముఖ్యమైన "పాలంక్విన్ బేరర్స్" ఉంది.

19వ శతాబ్దపు చివర్లో.. సంధ్యా సమయంలో హైద్రాబాద్ నగరం ఏ విధంగా ఉండేది? కవికోకిల కవిత, "నైట్ఫాల్ ఇన్ ది సిటీ ఆఫ్ హైద్రాబాద్" చదివితే చాలు.. కళ్ళ ముందు నిలుస్తుంది.

నగరవంతెన మీదినుండి ఠీవిగా రాణిలా వస్తోంది రాత్రి.."

ఒక్కసారి ఆకాలానికి వెళ్ళి నగర వీధుల్లో సంచారం చేసినట్లు లేదూ!

ఇంక హైద్రాబాద్ బజార్లలో సందడి ఎలా ఉండేది?

"ఇన్ ది బజార్ ఆఫ్ హైద్రాబాద్ చదివామంటే చాలు.. ఆ బజార్లోకి వెళ్ళిపోవలసిందే..

తండ్రి మరణాంతరం రచించిన విషాదకవితలు ఈమెకు కైసర్-ఇ-హిండ్' బంగారు పతాకాన్ని సాధించిపెట్టాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో అప్పటి అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్కి ఈమె రాష్ట్రపతిగా నియమించబడింది. హైదరాబాదులో తాను నివసించిన ఇంటికి తన మొదట కవితాసంకలనం పేరున స్వర్ణప్రాఃగణంగా"ఎన్నుకొన్నది.

ఈమె 1949 మార్చి 2న లక్నోలో మరణించినది. ఈమె జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం 1964 ఫిబ్రవరి 13న ఈమె చిత్రంతో ఒక తపాలబిళ్ళను విడుదల చేసింది.

ఈమెపై అభిమానంతో హైదరాబాదులో సికింద్రాబాద్ దగ్గర ఒక వీధికి సరోజినీ దేవి రోడ్డు' అని నామకరణం చేసారు. ఈమె పేరున హైదరాబాదులో సరోజినీ కంటి ఆసుపత్రి'ని కూడా స్థాపించారు. ఈవిడగారి విలువైన వస్తువులు ఇప్పటికీ సాలార్ జంగ్ మ్యూజియంలోను, జాతీయ పురావస్తు ప్రదర్శనశాలలోనూ భద్రంగా ఉన్నాయి.

చిత్రమాలిక

మూలాలు

  1. "Colors of India". First Woman Governor of a State in India. Retrieved 25 March 2012.
  2. 10TV (14 August 2020). "భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు" (in telugu). Archived from the original on 2 సెప్టెంబరు 2021. Retrieved 2 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. "Biography of Naidu".
  4. "Golden Threshold is all set to be a thriving cultural hub". The Hindu (in Indian English). 2019-11-14. ISSN 0971-751X. Retrieved 2023-05-27.
  5. "Family of Naidu".
  6. Pasricha, Ashu (2009). The political thought of Annie Besant. New Delhi: Concept Pub. Co. p. 24. ISBN 978-81-8069-585-8.
  7. Agrawal, M.G., ed. (2008). Freedom fighters of India (in four volumes). Delhi: Isha Books. p. 142. ISBN 978-81-8205-468-4.
  8. Paranjape, Makarand R. (2010). "Chronology". Sarojini Naidu. Rupa & Company. ISBN 978-81-291-1580-5. Retrieved 13 February 2014.
  9. "President of the Indian National Congress". Retrieved 13 February 2014.
  10. Jesudasen, Yasmine (2006). "Sarojini Naidu". Voices of Freedom Movement. Sura Books. pp. 53–54. ISBN 978-81-7478-555-8. Retrieved 13 February 2014.
  11. Agrawal, Lion M. G. (2008). "Indian National Congress and Indian Women". Freedom fighters of India. Vol. 4. Gyan Publishing House. p. 143. ISBN 978-81-8205-472-1. Retrieved 13 February 2014.

ఇతర లింకులు