Jump to content

అలన్ బోర్డర్

వికీపీడియా నుండి
అలన్ బోర్డర్

AO
2014 లో బోర్డర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అలన్ రాబర్ట్ బోర్డర్
పుట్టిన తేదీ (1955-07-27) 1955 జూలై 27 (వయసు 69)
క్రెమ్మోం, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా
మారుపేరుఏ బి
ఎత్తు175 cమీ. (5 అ. 9 అం.)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి స్పిన్
పాత్రబ్యాటింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 299)1978 డిసెంబరు 29 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1994 మార్చి 25 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 49)1979 జనవరి 13 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1994 ఏప్రిల్ 8 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1976/77–1979/80న్యూ సౌత్ వేల్స్
1977Gloucestershire
1980/81–1995/96Queensland
1986–1988Essex
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 156 273 385 382
చేసిన పరుగులు 11,174 6,524 27,131 9355
బ్యాటింగు సగటు 50.56 30.62 51.38 31.71
100లు/50లు 27/63 3/39 70/142 3/62
అత్యుత్తమ స్కోరు 205 127* 205 127*
వేసిన బంతులు 4,009 2,661 9,750 3703
వికెట్లు 39 73 106 90
బౌలింగు సగటు 39.10 28.36 39.25 32.27
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 0 3 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 1 0
అత్యుత్తమ బౌలింగు 7/46 3/20 7/46 3/20
క్యాచ్‌లు/స్టంపింగులు 156/– 127/– 379/– 183/–
మూలం: ESPNcricinfo, 2008 జనవరి 13

1955, జూలై 27సిడ్నీలో జన్మించిన అలాన్ బోర్డర్ (Allan Robert Border) ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. తన క్రీడాజీవితంలో 156 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 11,174 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. (టెస్ట్ సంఖ్యలో స్టీవ్ వా, పరుగులలో బ్రియాన్ లారా,లు ఇతని రికార్డును తరువాత అధికమించారు). 27 టెస్ట్ సెంచరీలు, 6524 వన్డే పరుగులు సాధించి అందులోన్ అధికుడు అనిపించుకున్నాడు. 1977లో అంతర్జాతీయ క్రికెట్‌లో రంగప్రవేశం చేసి 1993 వరకు సుమారు 16 సంవత్సరాలు దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాడు.

ప్రారంభ క్రీడా జీవితం

[మార్చు]

16 సంవత్సరాల ప్రాయంలో సిడ్నీ గ్రేడ్ క్రికెట్‌లో ఎడమచేతి స్పిన్నర్‌గా ప్రవేశించాడు. బ్యాటింగ్‌లో 9 వ స్థానంలో వచ్చేవాడు. 1972-73లో సంయుక్త పాఠశాలల జట్టులోకి ఎంపికైనాడు. 1975-76లో బోర్డర్ 600 పైగా పరుగులు సాధించడమే కాకుండా వరుసగా రెండు శతకాలు కూడా చేసి NSW టీంలోకి ఆహ్వానించబడ్డాడు. 1977 జనవరిలో బోర్డర్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో క్వీన్స్‌లాండ్ పై ఆడి 36 పరుగులు చేసి, 3 వికెట్లు తీసి జట్టు విజయానికి దోహదపడ్డాడు.

టెస్ట్ క్రికెట్

[మార్చు]

1977లో ప్రపంచ సీరీస్ క్రికెట్ ఒప్పందం వలన పలు క్రికెటర్లు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు, టెస్ట్ మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడంతో బోర్డర్ 1978-79 సీరీస్‌లో రంగప్రవేశం చేసి పెర్త్ లో పశ్చిమ ఆస్ట్రేలియాపై ఆడుతూ 135 పరుగులు, విక్టోరియాపై 114 పరుగులు సాధించాడు. ఆ తరువాత ఇంగ్లాడుపై 1979 డిసెంబర్లో తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడినాడు. గణాంకాలు సరిగా లేకపోవడంతో జట్టునుంచి తొలిగించబడ్డాడు. తరువాత పాకిస్తాన్ తో జరిగిన సీరీస్‌కు మళ్ళీ పిలుపు అందింది. మెల్ బోర్న్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలి సెంచరీని పూర్తిచేశాడు. దాంతో ఆస్ట్రేలియా స్కోరు 3 వికెట్లకు 305 పరుగులకు చేరింది. 382 పరుగులు చేస్తే గెలిచే మ్యాచ్‌లో చివరి 7 వికెట్లు 5 పరుగుల తేడాతో పడిపోవడంతో ఆస్ట్రేలియా 71 పరుగుల తేడాతో ఓడిపోయింది.[1]

1979 ప్రపంచ కప్ అనంతరం భారత పర్యటనకు వచ్చి సుదీర్ఘమైన 6 టెస్టుల సీరీస్‌లో ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ కూడా నెగ్గకపోయిననూ బోర్డర్ సీరీస్‌లో 521 పరుగులు సాధించాడు. చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో 162 పరుగులు చేశాడు. 1979 నవంబర్లో ఇంగ్లాండు పర్యటనలో పెర్త్ టెస్ట్‌లో రెండో ఇన్నింగ్సులో 115 పరుగులు సాధించి ఆస్ట్రేలియాను గెలిపించాడు. అదే క్రమంలో టెస్టులలో 1000 పరుగులు కూడా పూర్తిచేశాడు. కేవలం 354 రోజులలో ఈ ఘనత సాధించి ఆస్ట్రేలియా తరఫున అతివేగంగా 1000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.

పాకిస్తాన్ పర్యటనలో లాహోర్లో జరిగిన టెస్టులో 150*, 153 పరుగులు సాధించి క్రికెట్ చరిత్రలోనే ఒకే టెస్టులోని రెండు ఇన్నింగ్సులలోనూ 150 పైగా పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

1981లో తన మొదటి యాషెష్ పర్యటనకు బయలుదేరి తొలి రెండు టెస్టులలోనీ అర్థశతకాలను సాధించాడు. ఓల్డ్ ట్రాఫర్డ్లో జరిగిన ఐదవ టెస్టులో వేలిగాయంతో ఆడి 377 నిమిషాలపాటు బ్యాటింగ్ చేసి 123 పరుగులు చేశాడు. అది ఆస్ట్రేలియా తరఫున అతినెమ్మదైన సెంచరీ కావడం గమనార్హం. ఆ టెస్టులో ఆస్ట్రేలియా ఓడిపోయింది. చివరిదైన ఓవల్ మ్యాచ్‌లో 106*, 84 పరుగులు సాధించాడు. ఆ సీరీస్‌లో మొత్తంపై రాణించి 59.22 సగటుతో 533 పరుగులు చేశాడు. ఈ గణాంకాల ఫలితంగా 1982లో విజ్డెన్ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు.

1981-82లో బోర్డర్ మిశ్రమ ఫలితాలను అనుభవించాడు. పాకిస్తాన్‌పై 3 టెస్టులలో 84 పరుగులు మాత్రమే చేయగా, వెస్ట్‌ఇండీస్‌పై ఒక సెంచరీ, 3 అర్థసెంచరీలతో 67.2 సగటుతో 336 పరుగులు సాధించాడు. న్యూజీలాండ్ పర్యటనలో 3 టెస్టులలో కేవలం 44 పరుగులు మాత్రమే చేశాడు. పాకిస్తాన్ పర్యటనలో కూడా మంచి ప్రతిభను చూపలేకపోయాడు. ఆ సీరీస్‌లో పాకిస్తాన్ మొత్తం 3 టెస్టులలో విజయం సాధించింది.

1982-83లో యాషెష్ సీరీస్‌లోని తొలి 3 టెస్టులలో విఫలమైననూ నాల్గవ టెస్టులో పోరాటం కొనసాగించి విజయాన్ని అంచులవరకు తెచ్చాడు. ఆస్ట్రేలియా 9 వికెట్లను కోల్పోయి ఇంకనూ 74 పరుగులు చేయాల్సిన దశలో జెఫ్ థాంప్సన్ బోర్డర్‌తో జతగా కలిశాడు. స్టేడియంలోని 18000 ప్రేక్షకులు కళ్ళార్పకుండా చూస్తున్న మ్యాచ్‌లో ఇద్దరూ ఎంతో తెగువ చూపించి ఒక్కొక్క పరుగును జోడిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంకనూ కేవలం మూడు పరుగులు చేయాల్సిన స్కోరువద్ద థాంప్సన్ వికెట్టు పారేసుకున్నాడు. దీంతో బోర్డర్ శ్రమ వృధా అయింది అయిననూ పోరాటప్రతిభను మాత్రం మెచ్చుకోతగినదే. ఆస్ట్రేలియా విజయం సాధించిన ఆ యాషెష్ సీరీస్‌లో బోర్డర్ 45.28 సగటుతో 317 పరుగులు సాధించాడు.

కొత్త శకం

[మార్చు]

1983-84లో ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్ పర్యటనలో బోర్డర్ రెండో, మూడవ మ్యాచ్‌లో 118, 117 పరుగులు పూర్తిచేశాడు. ఆ సీరీస్‌లో బోర్డర్ సగటు 85.8 కాగా ఆ సీరీస్ ఆస్ట్రేలియా సునాయాసంగా విజయం సాధించింది. ఆ తరువాత రాడ్ మార్ష్, డెన్నిస్ లిల్లీ, గ్రెగ్ చాపెల్ లాంటి వారు రిటైర్ కావడంతో ఆస్ట్రేలియా జట్టు కళతప్పింది. 1984లో వెస్ట్‌ఇండీస్ పర్యటించే కిమ్ హుగ్స్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టుకు ఉపసారథిగా బోర్డర్ నియమించబడ్డాడు. తొలి టెస్ట్ డ్రాగా ముగిసిన తరువాత రెండో టెస్టులో రెండూ ఇన్నింగ్సులలోనూ మంచిగా రాణించాడు. తొలి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియాను 16/3 స్కోరు నుంచి స్వయంగా 98 పరుగులు జోడించి 255 పరుగులకు లాక్కొచ్చాడు. వెస్ట్‌ఇండీస్ 213 పరుగుల ఆధిక్యం ఉన్న దశలో రెండో ఇన్నింగ్సులోనూ ఆస్ట్రేలియా 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. బోర్డర్ మళ్ళీ ఆదుకొని 238/9 వరకు చేర్చి మ్యాచ్ ఓడిపోకుండా రక్షించాడు. మ్యాచ్ చివరి బంతికి బౌండరీకి తరలించి 100 నాటౌట్‌తో నిలిచాడు. ఆస్ట్రేలియా చివరి మ్యాచ్‌లలో ఓడిపోయినప్పటికీ బోర్డర్ ఈ సీరీస్‌లో 74.73 సగటుతో 521 పరుగులు సాధించాడు.

జట్టు నాయకుడిగా

[మార్చు]

1984-85లో ఆస్ట్రేలియా మళ్ళీ వెస్ట్‌ఇండీస్‌ను ఎదుర్కొంది. మొదటి రెండూ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా పరాజయం పొందిన పిదప హుగ్స్ రాజీనామా చేయడంతో అలాన్ బోర్డర్‌కు నాయకత్వ పగ్గాలు అందించబడ్డాయి. మూడో మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియా ఓడిపోయిననూ చివరి రెండూ మ్యాచ్‌లలో విజయం సాధించింది. నాయకత్వం ప్రభావం వల్ల అతని గణాంకాలు కూడా పడిపోయాయి.

1985 యాషెష్ సీరీస్‌లో ఇంగ్లాండు చేతిలో 1-3 తో ఓడిపోయింది. లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులో మాత్రమే ఆస్ట్రేలియా గెలిచింది. ఆ టెస్టులో బోర్డర్ 196 పరుగులు చేశాడు. 1985-86లో ఆస్ట్రేలియా పరిస్థితి ఆశాజనకంగా లేదు. న్యూజీలాండ్ జట్టు కూడా తొలిసారిగా ఆస్ట్రేలియాపై సీరీస్ విజయాన్ని నమోదుచేసింది. బోర్డర్ రెండు ఇన్నింగ్సులలోనూ 152 పరుగులు సాధించిననూ ఆస్ట్రేలియాకు పరాజయం తప్పలేదు. రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించిననూ మూడో టెస్టులో ఓడి సీరీస్ 2-1తో న్యూజీలాండ్‌కు సమర్పించుకుంది. అదే ఏడాది భారత్‌తో జరిగిన సీరీస్ డ్రా అయింది.

తదుపరి న్యూజీలాండ్ పర్యటనలో బోర్డర్ వ్యక్తిగతంగా విజయం సాధించాడు. రెండో టెస్టులో 140, 114 (నాటౌట్) పరుగులు చేశాడు. సీజన్‌లో 4 శతకాలు సాధించిననూ జట్టు విజయాలు మెరుగ్గాలేవు. జట్టు పరిస్థితి ఇలాగే ఉంటే నాయకత్వం నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు.

1987 ప్రపంచ కప్

[మార్చు]

1987లో జరిగిన నాలుగవ ప్రపంచ కప్ క్రికెట్‌లో బోర్డర్ నాయకత్వంలో ఆస్ట్రేలియా తొలిసారిగా టోర్నమెంట్ నెగ్గింది. 1987-88లో న్యూజీలాండ్‌పై నెగ్గి నాలుగేళ్ళలో తొలి టెస్ట్ సీరీస్ విజయాన్ని నమోదు చేయగలిగింది. అడిలైడ్లో జరిగిన రెండో టెస్టులో 205 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించి గ్రెగ్ చాపెల్ను వెనక్కు నెట్టి ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు.[2] ఆ తరువాత జరిగిన శ్రీలంక సీరీస్ లో కూడా బోర్డర్ మెరుగ్గా రాణించి 71 సగటుతో సీరీస్‌లో 426 పరుగులు సాధించాడు. 1988లో పాకిస్తాన్తో జరిగిన సీరీస్‌లో మాత్రం పరాజయం పాలైంది. 1988-89లో వెస్ట్‌ఇండీస్‌తో జరిగిన సీరీస్‌లో మళ్ళీ ఓడిపోయింది.

100 టెస్టులు ఆడిన తొలి ఆస్ట్రేలియన్

[మార్చు]

1988-89లో వెస్ట్‌ఇండీస్‌తో జరిగిన సీరీస్‌లో బోర్డర్ తన 100వ టెస్టు పూర్తిచేసుకొని ఆ ఘనత పొందిన తొలి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. రెండో టెస్టులో 46 పరుగులకు 7 వికెట్లు తీసి ఆస్ట్రేలియా తరఫున మంచి బౌలింగ్ విశ్లేషణ కలిగిన రెండో కెప్టెన్‌గా అవతరించాడు. ఆ సీరీస్‌లో ఆ ఒక్క టెస్ట్ మాత్రమే ఆస్ట్రేలియా వశం కావడం గమనార్హం.

1990వ దశాబ్దం

[మార్చు]

1991లో వెస్ట్‌ఇండీస్ పర్యటించిన ఆస్ట్రేలియా 2-1తో సీరీస్ నెగ్గింది. అందులో బోర్డర్ 34.37 సగటుతో 275 పరుగులు సాధించాడు. 1991-92లో ఆస్ట్రేలియా భారత్‌ను 4-0 తో ఓడించినప్పటికీ దేశంలో విమర్శలు తలెత్తినాయి. 1989నుంచి జట్టులో మార్పులు లేవని జట్టు కూర్పు మారాలనిఊత్తిడి పెరిగింది. దీనితో ఐదవ టెస్టులో సెలెక్టర్లు జట్టులో మార్పుచేయడంతో బోర్డర్ బాధపడ్డాడు. ఆ సీరీస్‌లో బోర్డర్ 55 సగటుతో 275 పరుగులు చేసిననూ శతకం చేయలేకపోయాడు.

1992లో జరిగిన ప్రపంచ కప్ టోర్నమెంటులో బోర్డర్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే బయటపడి 5 వ స్థానం మాత్రమే పొందినది. ఆ తరువాత శ్రీలంక పర్యటనలో 1-0 తో విజయం సాధించింది. భారత ఉపఖండంలో బోర్డర్ నాయకత్వంలో సాధించిన తొలి సీరీస్ విజయమది. మూడో టెస్టులో 106 పరుగులు సాధించి నాలుగ్ సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న శతకాన్ని సాధించాడు. 1992-93లో వెస్ట్‌ఇండీస్ వివియన్ రిచర్డ్స్, మాల్కం మార్షల్, డెస్మండ్ హేన్స్ లాంటి హేమాహేమీలు లేకుండానే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళినది. ఆస్ట్రేలియా తొలి టెస్టులో ముందంజ వేసి కూడా నెగ్గలేకపోయింది.

టెస్ట్ క్రికెట్‌లో 10000 పరుగులు

[మార్చు]

1992-93లో ఆస్ట్రేలియా పర్యటించిన వెస్ట్‌ఇండీస్ జట్టుపై మూడో టెస్టు ఆడుతూ బోర్డర్ 74 పరుగులు చేసి వ్యక్తిగతంగా టెస్ట్ క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తిచేసుకున్నాడు. ఈ ఘనత సాధిమ్చిన తొలి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. ప్రపంచ్వ టెస్ట్ క్రికెట్‌ రంగంలోనే ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మె బోర్డర్. ఇది వరకు భారత్‌కు చెందిన సునీల్ గవాస్కర్ మాత్రమే ఈ ఘనత సాధించిన వారిలో ఉన్నాడు.

వన్డే క్రికెట్

[మార్చు]

అలాన్ బోర్డర్ 273 వన్డేలలో ప్రాతినిధ్యం వహించి 30.62 సగటుతో 6524 పరుగులు సాధించాడు. అందులో 3 సెంచరీలు, 39 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 127 (నాటౌట్). బౌలింగ్‌లో 73 వికెట్లు కూడా సాధించాడు. వన్డేలలో అతడి అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 20 పరుగులకు 3 వికెట్లు. 1984 ఏప్రిల్ 8దక్షిణాఫ్రికాతో చివరి వన్డే ఆడి అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి నిష్క్రమించాడు.

అలాన్ బోర్డర్ సాధించిన రికార్డులు

[మార్చు]
  • టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ (11174 పరుగులు)
  • టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ (156 టెస్టులు)
  • అత్యధిక టెస్ట్ ఇన్నింగ్సులు ఆడిన క్రికెటర్ (265 ఇన్నింగ్సులు)
  • అత్యధిక అర్థసెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ (63)
  • అత్యధిక టెస్టులకు నాయకత్వం వహించిన ఆస్ట్రేలియన్ (93 టెస్టులు)
  • అత్యధిక క్యాచ్‌లు పట్టిన రెండో ఫీల్డర్ (156)
  • ఒకే టెస్ట్ రెండూ ఇన్నింగ్సులలోనూ 150 పైగా పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్
  • 10000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్

ప్రపంచ కప్ క్రికెట్

[మార్చు]

బోర్డర్ యొక్క మొదటి విదేశీపర్యటన 1979 ప్రపంచ కప్ సందర్భంగా ఇంగ్లాడుపై కాలుపెట్టాడు. సెమీఫైనల్ వరకు వెళ్ళిన ఆస్ట్రేలియా తరఫున 2 మ్యాచ్‌లలో ఆడి 59 పరుగులు చేశాడు. 1983లో రెండో పర్యాయం ప్రపంచ కప్‌లో ఆడినాడు. 1987లో అతడి నాయకత్వంలోనే తొలిసారిగా ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది. చివరిసారిగా 1992లో ప్రపంచ కప్ పోటీలలో పాల్గొన్నాడు. మొత్తం పై 4 సార్లు ప్రాతినిధ్యం వహించగా అందులో రెండు సార్లు నేతృత్వం వహించి ఒక సారి టోర్నమెంట్ గెలిపించాడు.

మూలాలు

[మార్చు]
  1. Wisden, 1980 edition: 1st Test Australia v Pakistan.
  2. Wisden, 1989 edition: 2nd Test Australia v New Zealand, match report.