ఇంటి పేర్లు

వికీపీడియా నుండి
(పేర్లు, ఇంటిపేర్లు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అల్లూరి సీతారామరాజు

ఇంటిపేరు (లేదా గృహనామం) సమాజంలో ఒక మనిషి గుర్తు పట్టడానికి వీలవుతుంది. ఇంటిపేరు కులాన్ని, గోత్రాన్ని సూచించవచ్చు. పూర్వం గోత్రాన్ని బట్టే మనిషిని గుర్తించేవారు. కాలక్రమేణా జనాభా పెరిగే కొలదీ ప్రతి మనిషినీ గుర్తించడం కష్టతరమైయ్యేది కనుక మధ్య యుగంలో ఊరు పేరుని బట్టి అన్ని కులాలకు ఇంటిపేర్లు ఏర్పడ్డాయి. ఆనాటి నుండి ప్రతి మనిషి ఇంటిపేరుతో గుర్తించబడుతూనే ఉన్నాడు. కొన్ని సందర్భాలలో ఒక కులంలో ఉన్న ఇంటిపేరు మరొక కులంలో కూడా ఉండే అవకాశముంది. కనుక కేవలం ఇంటి పేరుని బట్టి కులాన్ని నిర్ధారించడం సరి కాదు. దానికి గోత్రం కూడా అవసరముంటుంది.

పేరు వ్యక్తులను, వస్తువులను లేదా చెట్లు చేమలను గుర్తించేందుకు ఉపయోగించే ఒక నామవాచకము. మనుషులను మరింత ప్రత్యేకంగా గురించటానికి, లేదా వారి పూర్వీకుల గురించి తెలుసుకోవటానికి పేరుతో పాటు ఇంటి పేరు కూడా ఉంటుంది. ఈ మధ్యనే కావించిన ఒక పరిశోధనలో డాల్ఫినులు కూడా తమని తాము పేర్లతో పిలుచుకుంటాయని అవి ఈలల రూపంలో ఉంటాయని తెలుసుకున్నారు.[1] ఈ వ్యాసంలోని మిగతా భాగము మనుషుల పేర్లు ఇంటి పేర్లు గురించి వివరిస్తూ ఉంటుంది.

పూర్వ కాలంలో ప్రజలకి పేర్లే ఉండేవి; ఇంటి పేర్లు ఉండేవి కావు. వ్యాసుల వారు, కృష్ణుడు, అర్జునుడు, అశోకుడు, శంకరాచార్యులు, మొదలయిన వారు ఈ కోవకి చెందుతారు. వేదాలని నాలుగు భాగాలుగా విడగొట్టి, వాటిని ఏ విధంగా పఠించాలో సూచించేరు కనుక వ్యాసుని వేదవ్యాసుడు అన్నాం. శంకరాచార్యులు స్థాపించిన పీఠాధిపతులందరినీ శంకరాచార్యులు అనే పిలవడం మొదలు పెట్టేము కనుక మొట్టమొదటి శంకరాచార్యులవారిని ఆదిశంకరాచార్యులు అన్నాం. ఆ రోజులలో ఈ “వేద”, “ఆది” అన్న మాటలు గౌరవార్థకాలయిన విశేషణాలే కాని ఇంటిపేర్లుగా చెలామణీ అవలేదు.

క్రమేపీ పేరు ఒక్కటే వాడితే ఎవరు ఎవరో తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదురయాయి. ఈ పరిస్థితి భారతదేశానికే పరిమితం కాదు. ఉదాహరణకి, నార్మనులు క్రీ. శ. 1066లో దండెత్తి ఇంగ్లండుని ఆక్రమించిన తర్వాత అక్కడ ఇంటి పేర్ల వాడకం వ్యాప్తి లోకి వచ్చింది. ఉదాహరణకి, ఎలైజా అనే పేరింటిగత్తెలు ఎంతో మంది ఉండొచ్చు. ఫలానా ఎలైజాని గురించి ఎలా వాకబు చెయ్యడం? బద్ధకిష్టి ఎలైజా అనో, తినమరిగిన ఎలైజా అనో, పనిదొంగ ఎలైజా అనో చెప్పాలి కదా. కనుక ఇంగ్లీషులో “ఎలైజా డు లిటిల్‌” అని ఉంటారు. అదే క్రమేపీ ఎలైజా డులిటిల్‌గా మారింది.

ఇలాగే విలియమ్‌ అనే ఆసామి కొడుకు జాన్‌ ఉన్నాడనుకుందాం. వాడు మన ఎలైజాలా బద్ధకిష్టి బడుద్ధాయి కాడు. అటువంటప్పుడు వాడిని “విలియమ్‌ కొడుకు జాన్‌” అని పిలవచ్చు. ఇంగ్లీషు భాషా సంప్రదాయం ప్రకారం, ఈ విషయాన్ని “జాన్‌, విలియమ్స్‌ సన్‌” అని అనొచ్చు. అదే “జాన్‌ విలియమ్‌సన్‌” గానూ, తర్వాత “జాన్‌ విలియమ్స్‌” గానూ మారి ఉంటుంది.

వృత్తి పేరుని ఇంటిపేరుగా వాడే అలవాటు చాల దేశాలలో ఉంది. చాకలి రంగన్న, కమ్మ వెంకన్న మొదలయిన మాటలు వాడుకలో ఉన్నా తెలుగుదేశంలో ఈ పద్ధతి అంత ఎక్కువగా లేదు. ఉత్తర భారతదేశం లోనూ, పాశ్చాత్య దేశాలలోనూ ఇది విరివిగా వాడే పద్ధతే. ఇంగ్లీషులో స్మిత్‌, బ్లేక్‌స్మిత్‌, గోల్డ్‌స్మిత్‌, టేలర్‌, రైట్‌ మొదలయినవి ఇటువంటి పేర్లే. బ్లేక్‌స్మిత్‌ అంటే కమ్మరి. గోల్డ్‌స్మిత్‌ అంటే కంసాలి. టేలర్‌ అంటే దర్జీ. రైట్‌ అంటే యంత్రాలతో పనిచేసే మనిషి; లేదా మెకానిక్‌. పార్సీలలో ఈ రకం పేర్లు ఇంజనీర్‌, కంట్రాక్టర్‌ మొదలయినవి విరివిగా కనిపిస్తాయి. మహారాష్ట్రులలో కూడా ఈ రకం పేర్లు ఎక్కువే. కర్మర్కర్‌, కరండికర్‌, మొదలయినవి.

నివసించే స్థలాన్ని ఇంటిపేరుగా వాడడం చాల చోట్ల ఉంది. ఈ స్థలం ఊరు పేరేనా కావచ్చు. మరొకటేదయినా కావచ్చు. ఇంగ్లీషులో పుంత పక్కని ఉన్న ఇంట్లో ఉన్నవాడిని “ఉడ్‌” అనీ మైదానానికి ఎదురుగా ఉన్న వాడిని “గ్రీన్‌” అనీ అనుంటారు. జవాహర్‌లాల్‌ నెహ్రూ అసలు ఇంటి పేరు కౌల్‌. కాశ్మీర్‌లో కాలవ పక్క ఇంట్లో ఉండి ఉంటారు. అందుకని కౌల్‌ కాస్తా “నహర్‌” గాను, అదే “నెహ్రూ” గానూ మారేయి. బూర్గుల రామకృష్ణారావు, పదకల్లు గ్రామంలో (కల్వకుర్తి తాలూకా, మహబూబ్ నగర్ జిల్లా), తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. అతని ఇంటిపేరు 'పుల్లంరాజు'. కొంతకాలం తరువాత అతను ఉంటున్న 'బూర్గుల' గ్రామంపేరుతో, 'బూర్గుల రామకృష్ణారావు' గా పిలవటం మొదలు పెట్టారు. ఆ ఇంటిపేరే స్థిరపడిపోయింది. చూ [1]

సినిమా రంగంలో అసలు పేరు తీసేసి తెర పేరు పెట్టుకోవటం జరుగుతూ ఉంటుంది. మేరిలిన్ మన్రో అసలు పేరు నార్మా జీన్స్. రాక్ హడ్సన్‌ అసలు పేరు లిరోయ్ హేరల్డ్ షేరర్‌. తెలుగు తారలలో మగవాళ్ళు తెర పేర్లు పెట్టుకోవటం తక్కువే కాని ఆడవాళ్ళు తెర పేర్లు వాడటం ఎక్కువే. వాణిశ్రీ ఒక ఉదాహరణ. ఏ సినిమాలో అయితే పెద్ద పేరు వచ్చిందో ఆ సినిమా పేరు ఇంటిపేరుగా చలామణీ అయిన సందర్భాలు అనేకం. షావుకారు జానకి ఒక ఉదాహరణ.

ఆంధ్రుల చరిత్ర

[మార్చు]

క్రీ.పూ. 73 వరకు, అనగా శ్రీముఖ శాలివాహనునికి ప్రాచీనకాలంలో నివసించిన ఆదివాసులలోనైతేనేమీ ద్రావిడులలో నైతేనేమీ, యింటిపేరు వ్యవహరింపబడలేదు. శ్రీముఖ శాలివాహనుడు తరువాతివాడు కృష్ణ శాలివాహనుడు అందుచే కొందరు ఈ శాలివాహనుడు ఇంటిపేరా అని సందేహించినా, అటుపై వచ్చిన శ్రీ శాతకర్ణికి ఈపేరు వాడబడనందున ఈ శాలివాహనుడు అన్నది ఇంటిపేరు అనడానికి అవకాశం లేదు. ఇదే ప్రకారము శాతకర్ణి తరువాత చాలామందికి ఈ శాతకర్ణి పదం పేరుతో జతకూడి ఉన్నప్పటికీ దాన్ని ఇంటిపేరుగా భావింపరాదు. యేమంటే, ఈ ఆంధ్ర భృత్య వంశాంలో సా.శ.130-160 కాలంలో పాలించిన శ్రీ పులమాయికి శాతకర్ణి పదము వాడలేదు. ఈవంశం తరువాత వచ్చిన ఆంధ్ర పల్లవుల కాలంలోగాని, ఆంధ్ర చాళుక్యుల కాలంలో గాని ఇంటిపేరు వాడుకలో లేదు.

చాళుక్యులలో పేరుగాంచినవాడు రాజరాజ నరేంద్రుడు. ఇతడి ఆస్థానకవి నన్నయకు గాని, ఈ రాజుకు గానీ ఇంటిపేరు లేదు. కాని ఈ రాజు చేత నవఖండవాడ అను గ్రామమును బహుమానముగా పొందినవాడు, తెలుగులో గణితశాస్త్రము ఒకటి వ్రాసినవాడు పావులూరి మల్లన కవి. ఇతను ఇంటిపేరు పావులూరి అని కొందరు అభిప్రాయపడిరి, కాని ఈతని వంశంలో పావులూరి బుచ్చన్నో, అచ్చన్నో మరి కనబడలేదు.

చాళుక్యుల తరువాత కొంతకాలము పాలించిన కాలచుర్యుల వంశంలో బిజ్జలుడు కాలమైన శైవమతోద్ధారకుడైన బసవేశ్వరుడు హీంగుళేశ్వర అగ్రహారికుడగు మండంగి మాదిరాజుకు జనించినట్లు, ఈ మండంగి అన్నది మాదిరాజు ఇంటిపేరే అయితే బవవేశ్వరునికి ఎక్కడా వాడక పోవడం చేత బిజ్జలాదులగు కాలచూర్యులలో ఇంటిపేరు లేదనే భావించవచ్చును.

పిమ్మట చోడుల కాలములో కూడా ఇంటిపేరు వాడుకలోలేదు. నన్నెచోడుడుకి మనుమసిద్ధికి ఇంటిపేరులేదు. తిక్కనసోమయాజికి ఇంటిపేరులేదు.

పిమ్మటిది కాకతీయులు యుగం. ఈ కాకతి అనేపదం ప్రోలరాజాదులగు కొంతమందికి పేరుతో కలిపి వాడబడియుండుటచేత ఇది ఇంటిపేరా అన్నఅనుమానము కలుగును. కాని కాకతీయులలో ఈ పదం పేరుతో కలిపి వ్యవహరింపబడని రాజులు అనేకులు గోచరించడం వలన దీనిని ఇంటిపేరుగా తీసుకోలేము. అందువలన కాకతీయులకుకూడా ఇంటిపేరులేదని భావింపవచ్చును. ఈ కాకతీయులలో మొదటి ప్రతాపరుద్రుని కాలములో వుండిన పాల్కురికి సోమనాథుడికి స్పష్టంగా ఇంటిపేరు కనిపిస్తోంది.

తదుపరి కమ్మవారిలో నైతేనేమి, పల్నాటి వీరులలో నైతేనేమి, వెలమలలో నైతేనేమి ఇంటిపేరు ఉన్నట్టు కనబడదు. రెడ్ల కాలములో రేచర్లవారు, అల్లడివారు, కోమటివారు ఇత్యాది ఇంటిపేర్లు కొన్ని కనబడుతున్నవి.

బమ్మెర పోతనకుబమ్మెర అన్నది పైన ఉదహరించిన పావులూరి మల్లన కవి అన్వయమే అనువర్తిస్తుంది. ఏమంటే ఈతని సమకాలికుడు, బావమరిది అయిన శ్రీనాథుడికి ఇంటిపేరు లేదు.

రాయల అష్టదిగ్గజాలలోనూ ఇంటిపేరు బాగా కనబడుతోంది గాని, రామరాజభూషణుడికి మాత్రము లేదు. చేమకూరి వెంకటకవికి ఇంటిపేరు ఉందిగాని రఘునాధ నాయకుడికి మాత్రము లేదు. రాయల వంశీయులలో మాగిశెట్టి అనునది ఇంటిపేరు ఉంది.

ఇంటిపేరు అనేది మొదట ఆంధ్రులలో లేదు. ఏదో మధ్యకాలంలో వొచ్చింది. కచ్చితమైన కాల నిర్ణయము చేయుట కష్టతరము.

తెలుగు సంప్రదాయం

[మార్చు]

తెలుగు దేశపు సంప్రదాయం ప్రకారం ఇంటి పేరు పూర్వభాగం లోనూ, వ్యక్తివాచకం, అంటే పెట్టినపేరు, ఉత్తరభాగంలోనూ రాసుకోవడం సర్వసాధారణం. మిగిలిన భారతదేశపు ఆచారం తెలుగు దేశపు ఆచారానికి వ్యతిరేకం. చాలామంది పేరు ముందు, ఇంటిపేరు తర్వాత రాసుకుంటారు. ఇందిరా గాంధీ, ఆవిడ కొడుకు రాజీవ్‌ గాంధీ ఉదాహరణలు. ఇక్కడ ఇందిర, రాజీవ్‌ మొదలయిన మొదటి పేర్లు వ్యక్తి నామాలు. ఇంటిపేరయిన గాంధి ఆఖరి పేరు. కాని తెలుగుదేశంలో శ్రీరంగం సత్యనారాయణ మూర్తి అన్నప్పుడు ఇంటి పేరయిన శ్రీరంగం మొదటి పేరు అయింది. సత్యనారాయణమూర్తి అన్న పేరంతా ఒకే మాటలా రాసి, దానిని ఆఖరి పేరని తీర్మానించవచ్చు. లేదా, సత్యనారాయణ అన్న మాటని విడిగా రాసి, దానిని మధ్య నామంగా భావించి, మూర్తి అన్న మాటని ఆఖరి పేరుగా వాడుకోవచ్చు. ఈ విషయం ఇక్కడ ఎందుకు ప్రస్తావించటం జరిగిందంటే తెలుగులో సత్యనారాయణమూర్తి అన్న అక్షరాలని ఒకే ఒక మాటగా రాసేవారే, అదే పేరుని ఇంగ్లీషులో రాసినప్పుడు సత్యనారాయణ అన్న అక్షరాలని ఒక మాట గానూ, మూర్తి అన్న అక్షరాలని మరొక మాట గానూ విడివిడిగా రాస్తారు. పైపెచ్చు, మూర్తి అన్న మాటని ఇంగ్లీషులోని పెద్ద బడిలోని అక్షరంతో మొదలు పెడతారు. అప్పుడు అమెరికా వాళ్ళ లెక్క ప్రకారం మూర్తి మొదటి పేరు, సత్యనారాయణ మధ్య పేరు, శ్రీరంగం ఆఖరి పేరు అవుతాయి. ఈ సందర్భంలో ఈ శ్రీరంగం సత్యనారాయణమూర్తి అమెరికా వచ్చి ఉంటే "మూర్తి ఎస్. శ్రీరంగం" అవుతాడు.

విదేశ విశ్వవిద్యాలయాలలో ప్రవేశార్హత కొరకు దరఖాస్తు పెట్టే సమయంలో మొట్టమొదటి సారి పేర్లలోనూ, ఇంటిపేర్లలోనూ ఉన్న ధర్మసూక్ష్మాల అంతు ఏమిటో తేల్చుకోవాలనే బుద్ధి చాలమందికి పుడుతుంది. అమెరికా దరఖాస్తు పత్రాలలో ”ఫస్ట్‌ నేమ్‌” ఏమిటి? “మిడిల్‌ నేమ్‌” ఏమిటి? “లాస్ట్‌ నేమ్‌” ఏమిటి? అని పుంఖానుపుంఖంగా ప్రశ్నలు ఉంటాయి. కొందరు “గివెన్‌ నేమ్‌” అడుగుతారు. అంటే పెట్టిన పేరు అని అర్థం కనుక మనకి బారసాల నాడు పెట్టిన పేరే ఈ “గివెన్‌ నేమ్‌” అని తార్కికంగా ఆలోచించి తీర్మానించే లోగా, ఆ యూనివర్సిటీ వారు పక్కని కుండలీకరణాలు వేసి, వాటి మధ్య “ఇక్కడ నీ క్రిష్టియన్‌ పేరు రాయునది” అని అంటారు. క్రిష్టియన్స్‌ కానివాళ్ళ సంగతి? తరువాత్ “ఫేమిలీ నేమ్‌” ఏమిటి అని అడుగుతారు. “ఫేమిలీ నేమ్‌” అంటే కుటుంబ నామం. పక్కనే “ఇక్కడ నీ సర్‌నేమ్‌ రాయునది” అని సలహా ఉంటుంది. “సర్‌నేమ్‌” అంటే ఇంటిపేరు అని ఇంగ్లీషు వాడు చెప్పగా భారతీయులందరికీ తెలిసినదే కదా! “సర్‌నేమ్‌” (surname) అనే మాట ఎలా వచ్చిందో తెలుసా? లేటిన్‌ భాషలో “సర్‌” అంటే “ఊర్ధ్వ” అని కాని “కొసరు” అని కాని అర్థం చెప్పుకోవచ్చు. “సర్‌ప్లస్‌” (surplus) అన్న మాటలో ఈ కొసరు అనే అర్థమే స్ఫురిస్తుంది. కనుక “సర్‌నేమ్‌” అన్న మాటకి “కొసరుపేరు” అన్నది సరి అయిన తెలుగుసేత. ఈ లెక్కని రెడ్డి, శర్మ, శాస్త్రి, వర్మ, శెట్టి, నాయుడు, చౌదరి, మొదలయినవి కొసరు పేర్లుగా చలామణీ అయే సావకాశం ఉంది. కాని అవి అలా కావు. ఎందుకంటే వీటికి పట్టపు పేర్లు అని మరో పేరు ఉంది. "గివెన్ నేమ్" సంప్రదాయం మనవారిలో కూడా ఉంది.ఐతే అది ఏదైనా దీక్షను స్వీకరించినవారికి వర్తిస్తుంది. ఇటువంటివి శ్రీవిద్యా దీక్ష తీసుకొన్నవారిలో, సన్యాస దీక్ష తీసుకొన్నవారిలో కనిపిస్తుంది.త్రిపురానందనాథ, మదనానంద మొదలైనవి బారసాలనాడు పెట్టినవి కాకపోగా వారి దీక్ష సమయంలో పెట్టినవే.దీన్ని "మతనామం" అని అందామా? దీనికి దీక్షా నామమనే పేరు మొదలే ఉంది.

“గివెన్‌నేమ్‌” అన్నా, “క్రిష్టియన్‌నేమ్‌” అన్నా, బారసాల నాడు పెట్టిన పేరూన్నూ, “ఫేమిలీ నేమ్‌” అంటే ఇంటిపేరున్నూ. కాని “ఫస్ట్‌ నేమ్‌”కీ “లాస్ట్‌ నేమ్‌”కీ మధ్యనున్న తేడా అర్ధం అవటం కష్టం. “ఫస్ట్‌నేమ్‌” అంటే మొదట రాసుకునే పేరు. “లాస్ట్‌ నేమ్‌” అంటే ఆఖరున రాసుకునే పేరు. మధ్యలో వచ్చేవన్ని “మిడిల్‌ నేమ్స్". తార్కికంగా ఆలోచిస్తే చందూరి మాలతి అన్నప్పుడు చందూరి "ఫస్ట్‌నేమ్‌”, మాలతి “లాస్ట్‌ నేమ్‌” అవుతుంది. ఇదే పేరుని పాశ్చాత్య సంప్రదాయంలో మాలతీ చందూర్ అని రాసినప్పుడు పెద్దలు పెట్టిన పేరు "ఫస్ట్‌నేమ్‌” అవుతుంది, వంశపారంపర్యంగా వచ్చే పేరు “లాస్ట్‌ నేమ్‌” అవుతుంది. అంటే మనం పేరు రాసుకునే వరసని బట్టి ఈ పేర్లు ఏవేమిటో నిర్ణయించ బడతాయి.

అసలు తెలుగు వారికి ఈ మూడు నామాలతో పాటు మరొక నామం కూడా ఉందని చాలా మందికి తెలియదు. టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, త్రిపురనేని రామస్వామి చౌదరి మొదలయిన పేర్లలో పంతులు, రెడ్డి, చౌదరి అనేవి పట్టపు పేర్లు. ఇక్కడ గమనించవలసినది పంతులు అన్నది ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరులో ఉండుండదు; అది ప్రజలు గౌరవ సూచకంగా తగిలించి ఉంటారు. చౌదరి కూడా ఈ కోవకి చెందినదే. ఒకానొకప్పుడు రెడ్డి అనే పట్టపు పేరుని కూడా ఇలాగే పెద్ద కాపులకి వాడేవారు. దరిమిలా ఒకరు పట్టం కట్టే వరకు ఆగడం ఎందుకని అందరూ పేరులో ఒక భాగంగా పెట్టేసుకుంటున్నారని ఒక సిద్ధాంతం.

ఇప్పటికి ఇంటి పేరు, మధ్య పేరు, పెట్టిన పేరు, పట్టపు పేరు, కొసరు పేరు అయేయి కనుక ఇంకేమి పేర్లుంటాయని అనుకునేరు. ఈ పేర్లన్నిటితో పాటు వేడుక పేర్లు అంటే “నిక్‌ నేమ్స్‌”, ముద్దు పేర్లు అంటే “పెట్‌ నేమ్స్‌” వగయిరా చాలా ఉన్నాయి.

ఇలా ఇంటిపేరు ముందు, తర్వాత పెద్దవాళ్ళు పెట్టిన పేరు రాసుకునే అలవాటు ఒక్క తెలుగు వాళ్ళకే ఉండి ఉంటే “ఇదో తెలుగు తెగులు” అని సరిపెట్టుకోవచ్చు. కాని తమాషా ఏమిటంటే ఇదే అలవాటు జపాన్‌లోను, చైనా లోనూ కూడా ఉంది. అసలు జపాను వాళ్ళు తెలుగువారి లాగే ముందు ఇంటి పేరు, తర్వాత పెట్టిన పేరు, తర్వాత “గారు”కి బదులు “సాన్‌” అని గౌరవ వాచకం తగిలించి వాడతారు. చైనాలో పద్ధతి దరిదాపు ఇదే. చైనా చరిత్ర చదివిన వారికి “సన్‌ యట్‌ సెన్‌” అన్న పేరు జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఇందులో “సన్‌” అన్నది ఇంటిపేరు. “మావ్‌ జేడుంగ్‌”లో “మావ్‌” ఇంటిపేరు. “జో ఎన్‌లై”లో “జో” ఇంటిపేరు.

కాని పాశ్చాత్య సంప్రదాయపు సుడిగాలికి వీళ్ళు కూడా ఒంగి, లొంగిపోయి, పాశ్చాత్య పద్ధతి ప్రకారం పెట్టిన పేరు మొదట, ఇంటిపేరు చివర రాయడం ఈ మధ్యే మొదలు పెట్టేరు. కాని కల్చరు పేరు మీద కొట్టుకు కోర్టుకెక్కే తెలుగు వాళ్ళు అంత సులభంగా లొంగుతారా? హరి మీద గిరి పడ్డా, గిరి మీద హరి పడ్డా తెలుగువారు మాత్రం వి. వి. రావ్‌, పీ. కే. మూర్తి, యన్‌. టీ. రామారావు అనే రాస్తాం తప్ప, మిగిలిన ప్రపంచపు అడుగుజాడల్లో నడవడానికి ఇష్టపడం. అసలు యన్‌. టీ. రామారావుని “యన్టీయార్‌” అన్నప్పుడున్న మజా తల్లకిందులుగా రామారావ్‌ టీ. నందమూరి అంటే వస్తుందా? తల్లకిందులుగా తపస్సు చేసినా రాదు.

కొంతమంది తమ తమ ఇంటి పేర్లు శ్రవణరంజకంగా లేవనిన్నీ, అశ్లీలార్థకాలనిన్నీ, నైచ్యార్థకాలనిన్నీ భ్రమపడో, భయపడో చెప్పడానికి ఇష్టపడరు. బొక్కా, ముష్టి, ముట్లూరు, సూద్నగుంట మొదలైనవి ఈ జాతివి. అలాగని ఎన్నాళ్ళు ఇంటిపేరు చెప్పకుండా ఉండగలరు? అందుకని కొందరు ఇంటిపేరుని సాధుసభా సమ్మతంగా ఉండేటట్లు మార్చేసుకుంటారు. ఈ ధోరణిలోనే ముట్లూరు కాస్తా ముట్నూరుగా మారి ఉండవచ్చు. బొక్కా వారు భారతం వారుగా పరిణమించి ఉండొచ్చు.

పేరుని బట్టీ, ఇంటి పేరుని బట్టీ కులం ఏమిటో, ఒకే కులంలో శాఖ ఏమిటో, గోత్రం ఏమిటో కూపీ లాగడం అంత తేలికయిన పని కాదు. పేర్లకి అయ్య, మూర్తి, రావు, స్వామి మొదలైన ప్రత్యయాలని (వీటినే పట్టపు పేర్లని అంటారని చెప్పటం జరిగింది) చేర్చినప్పుడు పేరుని బట్టి ఏ కులమో చెప్పడం కష్టం. శాస్త్రి, శర్మ, రెడ్డి, చౌదరి, నాయుడు మొదలయిన ప్రత్యయాలని బట్టి కులం తెలుసుకోవచ్చు. కాని ఈ చిటకా అన్ని సందర్భాలలోనూ పని చెయ్యదు. రెడ్డిశాస్త్రి ఎవరు? పి.యల్‌. సంజీవరెడ్డి ఐ.ఎ.ఎస్‌. గారు రెడ్లు కాదు, కమ్మవారు. అలాగే కర్రా అన్న ఇంటి పేరు బ్రాహ్మణులలో ఉంది, మాల కులంలో ఉంది. కడియాల అనే ఇంటిపేరు కమ్మవారిలో ఉంది, బ్రాహ్మణులలో ఉంది. వేమూరి అనే ఇంటిపేరు బ్రాహ్మణులలో, కమ్మ వారిలో, హరిజనులలో ఉంది. గొర్తివారు కాపులలో ఉన్నారు, బ్రాహ్మణులలో ఉన్నారు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. ఇంటి పేర్లు ఎక్కవగా ఊరు పేరుని బట్టి, వంశంలో ప్రముఖ వ్యక్తి పేరుని బట్టి ఏర్పడతాయి కనుక ఒక కులంలో ఉన్న ఇంటి పేరు మరొక కులంలో కూడా ఉండవచ్చు.

సూరపనేని, రామినేని, అక్కినేని, త్రిపురనేని మొదలైన “నేని” శబ్దంతో అంతమయే వన్నీ సర్వసాధారణంగా కమ్మవారి ఇంటిపేర్లు. ఈ “నేని” అన్న మాట “నాయడు” అన్న మాటకి రూపాంతరం. ఈ “నాయడు” అనేది “నాయకుడు”కి క్లుప్తరూపం. నేని అంటే నాయని సంక్షిప్తరూపం (నాయని:నాయడు యొక్క) కనుక రామినేని అచ్యుతరావు అంటే రామినాయడి అచ్యుతరావు అన్నమాట.

తండ్రిపేరుని వ్యక్తి వాచకాలకు తగిలించే పద్ధతిలో కొన్ని చిక్కులు ఉన్నాయి. ఊళ్ళో అయితే శ్రీనివాసన్‌ కొడుకు జయరామన్‌ అంటే పనిచేస్తుంది కాని, పొరుగూరు వెళితే ఆ శ్రీనివాసన్‌ ఎవరో అందరికీ తెలియక పోవచ్చు కనుక అంతగా ఉపయోగించదు. అప్పుడు పేరుతో పాటు స్వగ్రామం పేరు జోడించి లాల్‌గుడి జయరామన్‌ అని చెప్పడం ప్రచారంలోకి వచ్చి ఉంటుంది.తెనాలి రామకృష్ణ మరో ఉదాహరణ.

తమిళ సంప్రదాయం

[మార్చు]

తమిళుల పద్ధతిలో ఇంకా చాల చిక్కులు ఉన్నాయి. తాత, తండ్రి, కొడుకు, మనుమలకు వివిధమైన ఇంటిపేర్లు ఉండడంతో ఇంటిపేర్ల ప్రయోజనానికే ముప్పు. అందుకని కొందరు తమిళులు తరాల మార్పుతో ఇంటిపేర్లని మార్చకుండా స్థిరపరచి వాడుతున్నారు. అంటే రామానుజన్‌ సంతతి వారంతా ఇటుపైన రామానుజన్‌లే. తండ్రి పేరుని పెట్టిన పేరుకి తగిలించి ఇంటిపేరుగా వాడడంలో మరొక ఇబ్బంది. శ్రీనివాసన్‌ రామానుజన్‌ అన్న పేరు విన్నప్పుడు అందులో ఇంటిపేరేదో, పెట్టిన పేరేదో చెప్పుకోవడం కష్టం.

ఈ తమిళ సంప్రదాయం మన పూర్వీకుల పేర్లలో కొంత కనిపిస్తుంది. నాచన సోమన, కాచన బసవన, కొమ్మయమంత్రి తిక్కడు మొదలయిన పేర్లలో ఇంటిపేరు చూస్తే వ్యక్తి నామంలా స్ఫురిస్తుంది. ఇలా ఇంటిపేరు ఉండవలసిన చోట ఇంటిపేరుతో పాటు తండ్రిపేరుని కూడా నిలపడం మరాఠీ సంప్రదాయం. ఈ ముద్ర తెలుగుదేశంలో అక్కడక్కడ కనిపిస్తుంది. ఉదాహరణకి ఇందాకా చెప్పిన డాక్టర్‌ పి. యల్‌. సంజీవరెడ్డి పూర్తిపేరు పైడి లక్ష్మయ్య సంజీవరెడ్డి. ఇక్కడ పైడి ఇంటిపేరు, లక్ష్మయ్య తండ్రి పేరు.

ఇక తమిళ సోదరీమణుల పేర్లు పరికిద్దాం. మాలతీ రామచంద్రన్‌ అంటే రామచంద్రన్‌ కుమార్తె మాలతి అనేనా అనుకోవాలి, భార్య మాలతి అనేనా అనుకోవాలి. ఈవిడ డాక్టర్‌ అనుకోండి. అప్పుడు డాక్టర్‌ రామచంద్రన్‌ అంటే డాక్టరో, డాక్టరమ్మో గభీమని అర్థం కాదు. రామచంద్రన్‌ అన్న పేరు మగ పేరు కనుక డాక్టర్‌ రామచంద్రన్‌ అనగానే మగ వైద్యుడనే మనస్సుకి స్ఫురిస్తుంది.

ఇంటిపేరు, పెట్టినపేరు ఏ వరుసలో రాస్తే వచ్చే నష్టం ఏమిటోనని విచారిస్తూ కొంచెం దారి తప్పేం. నష్టమో, కష్టమో సోదాహరణంగా విచారిద్దాం. పొరుగూరిలో పిల్లలమర్రి శివరామకృష్ణ ఉన్నాడు. అతని టెలిఫోను నంబరు కావాలి. డైరక్టరీలో ఎక్కడని వెతకటం? పిల్లలమర్రిలో లేదు. శివరామకృష్ణలో లేదు. రామకృష్ణలో లేదు. మహానుభావుడు పేరుని కత్తిరించేడుట; శివ ఆర్‌. పీ. కృష్ణ అని వేయించేట్ట పుస్తకంలో. తర్వాత తెలిసింది. మొదటి నామధేయం శివ ట, కడపటి పేరు కృష్ణ ట. కూతురు పేరు రేఖ కృష్ణ ట. కొడుకు పేరు ప్రవీణ్‌ కృష్ణ ట. ఈ కత్తిరింపులు, సవరింపులలో పిల్లలమర్రి అన్న ఇంటిపేరు, పంచాంగంలో తిథిలా, ఏష్యం అయి పోయింది.

పాశ్చాత్య సంప్రదాయంలో మిస్టర్‌, డాక్టర్‌, ప్రొఫెసర్‌ మొదలయిన బిరుదులు ఇంటిపేరుకి తగిలించి వాడతారు. వేమూరి వేంకటేశ్వరరావు ఉన్నాడు. పాశ్చాత్య సంప్రదాయం ప్రకారం అతనిని మిస్టర్‌ వేమూరి, డాక్టర్‌ వేమూరి, లేదా ప్రొఫెసర్‌ వేమూరి అనాలి కాని మిస్టర్‌ రావ్‌, లేదా ప్రొఫెసర్‌ రావ్‌ అని అనకూడదు. చనువుగా ఉన్న వాళ్ళయితే రావ్‌ అని కానీ, వేంకటేశ్వరరావు అని కానీ పిలుస్తారు. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అయినప్పుడు ఆయనని (పాశ్చాత్య) న్యాయంగా ప్రెసిడెంట్‌ నీలం అనాలి. కాని ఎవ్వరూ అలా అనలేదు. అందరూ ప్రెసిడెంట్‌ సంజీవరెడ్డి అనో, క్లుప్తంగా ప్రెసిడెంట్‌ రెడ్డి అనో అనేసి ఊరుకున్నారు.

తెలుగు సంప్రదాయం ప్రకారం వేమూరి వేంకటేశ్వరరావు ఇంగ్లీషులోకి తర్జుమా చేసి, కుదించి, వీ. వీ. రావు అని రాసే సరికి హిందుస్థానీ వాళ్ళు కాని, పాశ్చాత్యులు కాని చూసి, రావు ఇంటిపేరని అనుకోవడం సహజం. అప్పుడు ఈ రావు భార్య ఉమా రావు, కొడుకు సునీల్‌ రావు అవుతారు. ఇలా తిరకాసు పడ్డ పేర్లే రాధా శర్మ, రేఖా రావు, మొదలైనవి. రాధా శర్మ అంటే రాధాకృష్ణ శర్మ పేరుని కత్తిరించేడని అనుకోవాలా? శర్మ గారి భార్య రాధ అనుకోవాలా?

తమాషా ఏమిటంటే ఇంగ్లండులో ప్రభుత్వం “సర్‌” (Sir) అన్న బిరుదు ఇచ్చినప్పుడు ఆ “సర్‌”ని పెట్టిన పేరుకి తగిలిస్తారు కానీ ఇంటి పేరుకి తగిలించరు. ఉదాహరణకి “సర్‌ సీ. వీ.” అనాలి కాని, “సర్‌ రామన్‌” అనరు. “సర్‌ విన్‌స్టన్‌” అంటారు కానీ, “సర్‌ చర్చిల్‌” అనరు. ఇక్కడ రాసిన “సర్‌” కీ, “సర్‌ నేమ్‌”లో “సర్‌”కీ మధ్య బాదరాయణ సంబంధం మాత్రమే ఉంది; ఉచ్ఛారణలో పోలిక ఉన్నా, వర్ణక్రమంలో తేడా ఉంది.

పోకడ సంప్రదాయ విరుద్ధం అయేసరికి భాషాంతరీకరణ చేసేటప్పుడు చిక్కులు తెచ్చిపెడుతుంది. ఉదాహరణకి, ఊరి పేరు ఇంటి పేరుగా మారడం బహుళ ప్రచారంలో ఉన్న ఆనవాయితీ అని ఆందరికీ తెలుసు. మహమ్మద్‌ ఘజనీ, మహమ్మద్‌ ఘోరీ, జార్జి వాషింగ్‌టన్‌ మొదలయిన పేర్లలో మహమ్మద్‌, జార్జి మొదలైనవన్నీ పెట్టిన పేర్లు. ఘజనీ, ఘోరి, మొదలయినవి ఇంటిపేర్లుగా మారిన ఊళ్ళ పేర్లు. కాని తెలుగు వాళ్ళు ఈ పేర్లని తెలుగులో రాయవలసి వచ్చినప్పుడు ఘజనీ మహమ్మద్‌, ఘోరీ మహమ్మద్‌ అని తెలుగు సంప్రదాయంలో రాస్తారు. కాని అదే తెలుగు వాళ్ళు ఇంగ్లీషు పేర్ల దగ్గరికి వచ్చేసరికల్లా ప్లేటు ఫిరాయించి జార్జి వాషింగ్టన్‌, జాన్‌ కెన్నెడీ అన్ని అస్తవ్యస్తంగా రాస్తారు. వాషింగ్టన్‌ జార్జి అని రాయడం కనీ వినీ ఎరుగుదుమా?

పాశ్చాత్య సంప్రదాయం

[మార్చు]

పేరులో ఏముంది అని కొట్టిపారేయటానికి వీలు లేదు. ఈ మధ్య శాస్త్రీయమైన పరిశోధనలు చేసి కనుక్కున్నది ఏమంటే మగరాయుళ్ళ పేర్ల వంటి పేర్లు పెట్టుకున్న ఆడవాళ్ళు సైన్సు లోనూ లెక్కల్లోనూ మగవాళ్ళతో సమానంగా ప్రతిభ చూపించేరుట. అంతే కాదు. ఆడ పేరులో 'మగతనం' (మాస్కులనిటి) లేదా 'ఆడతనం' (ఫెమినిటీ) ఎంతుందో లెక్క కట్టి కూడా చూపించేరు. ఉదాహరణకి ఏనా (ఆన్న) లో ఆడతనం 1.04, ఎలిజబెత్ (ఏలిజబెథ్) లో ఆడతనం 1.02, ఎమిలీలో 0.68, ఏబిగెయిల్ (ఆబిగైల్) లో 0.48, ఏలెక్స్ (ఆలెక్ష్) లో 0.28 ఉందిట. కనుక ఏనా కంటే ఏలెక్స్ కి లెక్కలు బాగా వస్తాయిట. ఈ రకం 'పరిశోధన' తెలుగు పేర్ల మీద ఎవ్వరూ చేసినట్లు కనిపించదు.

కొత్త పోకడలు

[మార్చు]

తండ్రి ఇంటి పేరే పిల్లలకు రావడం సర్వ సాధారణం. ఈ విషయంలో కొందరు కొత్త సంప్రదాయాలకు తెర తీస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ రవాణా శాఖ సంయుక్త కమిషనరుగా ఉన్న సి.ఎల్.ఎన్.గాంధీ, ఆయన భార్య, పబ్లిక్ ప్రాసిక్యూటరు అయిన రాధారాణిలు తమ పిల్లలకు తమ ఇద్దరి ఇంటిపేర్లు కాకుండా కొత్త ఇంటిపేరు పెట్టారు. తమ ఇద్దరి పేర్లలోని కొంత భాగాన్ని తీసుకుని దాన్నే ఇంటి పేరుగా పిల్లలకు పెట్టారు. ఆ విధంగా వారి పిల్లల ఇంటిపేరు రాధాగాంధి అయింది.[2] ఇదే సంప్రదాయాన్ని పాటిస్తూ రాధారాణి గారి తమ్ముడు కూడా తమ పిల్లల ఇంటిపేర్లు పెట్టారు. ఈమధ్య స్త్రీ వాదులు, కొందరు అమ్మాయిలు, పెరిగిన వారి ఆర్థిక స్వేచ్ఛ, ఉద్యోగ భధ్రత, వ్యక్తిగత స్వేచ్ఛ, స్పాశ్చాత్య నాగరికతల వలన 'వివహమైన తర్వాత స్త్రీలు ఎందుకు ఇంటిపేరు మార్చు కోవాలి?' అని ప్రశ్నిస్తున్నారు. ఇది పురుషాధిక్యత అని అంటున్నారు.

వివాహమైన స్త్రీలు తమ ఇంటి పేరు ఎందుకు మార్చుకుంటారు?

[మార్చు]

ఒక కుటుంబములో సాధారణంగా భర్త వయస్సులో పెద్దవాడు కనుక వాడు ఇంటి యజమాని అవుతాడు. వివాహమైన తర్వాత స్త్రీ తన ఇంటి పేరు మారుట వలన, కుటుంబ సభ్యుల మధ్య గట్టి ఐక్యతా భావము ఏర్పడుతుంది. ముఖ్యముగా ఈ సంప్రదాయము 'సమాజంలో స్త్రీ తన కుటుంబ పరువు, గౌరవ మర్యాదలు భుజాన్న మోస్తానని, వాటిని పెంచుతానని' బాధ్యత స్వీకరించుట్లుగా చెబుతుంది. ఈ సంప్రదాయము స్త్రీ యొక్క వైవాహిక స్థితిని చెప్పడమే కాక, సమాజంలో ఆ స్త్రీ ఏ కుటుంబానికి చెందినది?, ఎవరి భార్య? అని చెబుతుంది. భారతీయ కుటుంబ వ్యవస్థ పటిష్ఠంగా ఉండటానికి ఈ సంప్రదాయము ఒక కారణము.

తెలుగు వారి ఇంటి పేర్లను ఈ క్రింది విధంగా విభజించ వచ్చును.

[మార్చు]
  • రాజులు: వీరికి సూర్య,చంద్ర,భట్టరాజులు (బ్రహ్మా క్షత్రియ) వంశాల గృహనామాలు 350 గృహనామాలు ఉన్నాయి.వీరి ఇంటి పేర్లను బట్టి వీరు క్షత్రియులా కాదా అని గుర్తుపట్టగలరు.
  • గవర కులం వారు,వారి ఇంటిపేర్లు ఎక్కువగా సెట్టితో ముగుస్తాయి,వారి ఇంటిపేర్లు ఆర్య వైశ్య, కళింగ వైశ్య, కాపులు (తెలగాస్)లో కూడా సాధారణం,వారి ఇంటిపేర్లు ప్రత్యేకమైనవి, కొన్ని కులాలు మినహా ఇతర కులాలలో సాధారణంగా కనిపించవు.ఉదాహరణలు భీమరశెట్టి, కనిశెట్టి, భీసెట్టి, సూరిశెట్టి, వడిశెట్టి,ఐతంశెట్టి, అతికంశెట్టి, బడిశెట్టి, మారిశెట్టి, పెతకంశెట్టి, పొలమరశెట్టి
  • ఆర్యవైశ్యులు మాత్రం, తమ కులంలో వున్న 101 గోత్రాల వైశ్యుల యొక్క ఇంటిపేర్లను (గోత్రాలతో సహితంగా) పుస్తక రూపంలో ప్రకటించుకుని, తెలుగు వారికి మార్గ దర్శకులయ్యారు. వారు, 101 గోత్ర నామాలు ఒక కోలంలో ఇచ్చి, మరొక కోలం లో, ఆ గోత్రంలో వున్న వారి 'ఇంటిపేర్లు' ఇచ్చారు.
  • కమ్మ వారి ఇంటి పేర్లు:[3] మూల పురుషులు ప్రతిభావంతులైన పురుషులకు వ్యక్తి పేరు జారి పోయి వ్యక్తి నామాలే ఇంటి పేర్లుగా ఏర్పడ్డాయి. ఉదా: 1.'నేని', 2. 'రాజు', 3.'సాని', 4.రెడ్డి మొదలగునవి. అక్కినేని నుండి అక్షర క్రమంలో స్వర్ణపనేని వరకు, కొసరాజు, గుళ్ళపల్లి, గోకరాజు, ఛలసాని, పోసాని, కామిరెడ్డి మొదలగునవి.గ్రామ నామాలు కమ్మ కుల ఇంటి పేర్లు గ్రామ నామాల నుండి ఏర్పడినవే ఎక్కువగా ఉన్నాయి. 1. ఊరు (అట్లూరు నుండి సరికూరి వరకు), 2.కంటి-గంటి-అంటి-అంకి (ఇంద్రకంటి, యాగంటి, ఎల్లంకి, యల్లంకి, వెల్లంకి), 3.కొండ-గొండ, 4.పల్లి-మల్లి-వల్లి-పెల్లి-నెల్లి, 5.పాటి-మాటి-వాటి,6.ప్రోలు-వోలు-మోలు-కోలు,7.చర్ల-చెర్ల,8.నాటి-మాటి,9.మఱ్ఱి-పఱ్ఱు-పర్రు-మర్తి-పర్తి-కుర్తి,10.మంచి-మంచిలి,11.వీటి-వీదు,12.మూడి-పూడి,13.వాడ,14.పురం-వరం-వరపు,15.గడ్డ,16.తోట,17మోతు-బోతు-గోతు
  • రెడ్లు ఇంటిపేర్లలో, కొందరి వంశనామాలలో 'రెడ్డి' అనే పదం ఇంటిపేరుతో కలిపి కనిపిస్తుంది. మిగిలినవి గ్రామ నామాల నుండి ఏర్పడినవే ఎక్కువగా ఉన్నాయి. రెడ్ల లోని వివిధ ఉప కులాలకు లేదా వివిధ శాఖలకు అనుగుణంగా గోత్రాల బట్టి పెళ్లిళ్ల సమయంలో ఇంటిపేర్లు చర్చకు వస్తాయి. మద్దూరి సుజాత గారు వ్రాసిన "చరిత్రలో రెడ్ల ఇంటి పేర్లు-గోత్రాలు", శేషాద్రి రమణకవులు రచించిన "రెడ్డి కుల నిర్ణయ చంద్రిక"లో రెడ్ల ఇంటి పేర్లు, గోత్రాల వివరాలు పొందుపరచబడ్డవి.
  • తెలగా, బలిజ కులం : గోత్రాల ప్రకరం వస్తే ఎక్కువగా విరికి కుడా పెళ్ళిళ్ళు సమయాలలో, ఇంటిపేర్లు ప్రముఖంగా చర్ఛకు వస్తాయి. తెలగా, బలిజ వారి ఇంటి పేర్లు పేరు చివర ఎక్కువగా రెడ్డి, శెట్టి, గ్రామ నామాలతో ఉంటాయి. (రెడ్డి-ఉమ్మారెడ్డి, వన్నెంరెడ్డి, కొమ్మిరెడ్డి) (శెట్టి -చెన్నంశెట్టి, బైరిశెట్టి, ముత్తంశెట్టి, పినిశెట్టి, చలమలశెట్టి) ( ఊరు - కొమ్మూరి, కోసూరి, పాలూరి) మొదలైనవి.
  • వెలమ ఇంటిపేర్లు ఎక్కువగా కాపులను,గవరలను పోలి ఉంటాయి , గవరలు , రాచ వెలమల ఇంటిపేర్లు పూర్తిగా భిన్నమైనవి
  • నాయిబ్రాహ్మణులు వారి ఇంటి పేర్లలో "ల" అనే పదం ఎక్కువగా కనిపిస్తుంది.

(నాదేళ్ళ, నిడుముక్కల, గోట్టిముక్కల, రావులకోల్లు, పండితారాజుల)

ఆంధ్రజ్యోతి వారపత్రిక కొన్ని సంవత్సరాల క్రితం, ఈ 'ఇంటిపేర్లు' పై ఒక శీర్షిక నిర్వహించి, ఆంధ్ర దేశంలోని ప్రజల నుంచి, చాలా వివరాలు ప్రకటించింది. అందులో, పాఠకులు పాల్గొని, తమ తమ ఇంటిపేర్ల వివరాలు, ఆ ఇంటిపేర్లు రావటానికి గల కారణాలు, చరిత్ర వివరించారు.

మరీదు

ఆడవారి పేరో, మగవారి పేరో గుర్తుపట్టలేని పేర్లు

[మార్చు]
  • మనం పెట్టే పేర్లలో కొన్ని పేర్లను, అవి ఆడ వారి పేరో, మగవారి పేరో చెప్పలేనివి ఉన్నాయి.

వెంకటరత్నం -- వెంకటరవణ -- (పద్మశ్రీనివాసు)గవర్రాజు -- అచ్ఛిరాజు—బంగారం -- రత్నం -- మాణిక్యం -- బుజ్జి --

గోరా గారి సంప్రదాయం

[మార్చు]

గోరా అని పిలిచే గోపరాజు రామచంద్ర రావు ప్రముఖ నాస్తికుడు. అతని పేరు క్లుప్తంగా గోరా అనే వారు. ఈ రోజున అతని భార్య పేరును సరస్వతి గోరా అని ప్రజలు, పత్రికలు పలుకుతున్నారు. ఈ తరం ఆడవారు భర్తపేరుని చివరగా పెట్టుకుంటున్నారు. అలాగైనట్లయితే, 'సరస్వతి రామచంద్ర రావు' లేదా ఇంటిపేరు చివర పెట్టుకుంటే 'సరస్వతి గోపరాజు' అని ఉండాలి. క్లుప్తంగా ఉన్న భర్త పేరు గోరా పేరుతో సరస్వతి గోరా అని పిలుచుకుంటున్నారు. కారణం, గోరా ప్రముఖ వ్యక్తి. సరస్వతి గోరా అంటేనే ప్రజలకు తెలుస్తుంది. అదే 'సరస్వతి రామచంద్ర రావు' అనో 'సరస్వతి గోపరాజు' అనో అంటే ప్రజలకు తెలియదు. ఆ సౌకర్యం కోసం సరస్వతి గోరా పేరు వాడుకలోకి వచ్చింది. భవిష్యత్తులో ఇదొక సంప్రదాయంగా ఉంటుందా, లేదా అనేది కాలమే నిర్ణయించాలి. వారి పిల్లల పేర్లు లవణం, విజయం, సమరం, నియంత. తొమ్మిదవ సంతానానికి 'నౌవ్' (సంస్కృతం లేదా హిందీ అంకె పేరు). కుమార్తెల పేర్లు: మైత్రి, మనోరమ. తెలుగు వారి పేర్లలో కూడా ఇదొక కొత్త ఒరవడి. ఈ పేర్లలో, లవణం, విజయం, సమరం, నియంత, నౌవ్ అనే పేర్లను మగవారి పేరా, ఆడవారి పేరా అని తెలుసుకోవటం కష్టం (బంగారం, రత్నం, వెంకట రత్నం, మరకతం, మాణిక్యం, మణి వంటి పేర్లను కూడా మగవారి పేరా, ఆడవారి పేరా అని తెలుసు కోవటం కష్టం).

మూలాలు

[మార్చు]
  1. డాల్ఫినులు తమని తాము ఈలలతో పిలుచుకుంటాయి ప్రచురించిన వారు: నేషనల్ జియోగ్రాఫిక్ న్యూస్. ప్రచురణ తేదీ: మే 8, 2006. లింకును సందర్శించిన తేదీ: మే 7, 2007
  2. 2007 ఏప్రిల్ 24 రాత్రి జెమినీ టీవీ లో వచ్చిన పెళ్ళి పుస్తకం కార్యక్రమంలో ఆ దంపతులు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
  3. కమ్మ కుల చరిత్ర -గోత్రాలు, రచన:మద్దినేని గంగారావు.

వనరులు

[మార్చు]
  • వేమూరి వేంకటేశ్వరరావు, "మన పేర్లు, ఇంటిపేర్లు" ఈమాట అంతర్జాల పత్రిక, 2000 నవంబరు, http://eemaata.com/em/issues/200011/817.html
  • తూమాటి దోణప్ప, "ఆకాశ భారతి: వ్యాస సంపుటి," సుధారా పబ్లికేషన్స్,1988
  • Anushka Asthana, "Names Really do make a Difference," The Observer, Sunday April 29, 2007.
  • విప్రుల ఇండ్లపేర్లు-శాఖలు-గోత్రాలు, ముసునూరి వేంకటశాస్త్రి, పంచమ ముద్రణము, లావణ్యా పబ్లికేషన్స్, రాజమండ్రి, 1986.
  • శ్రీ ఏమ్మెస్రాయ్ శాస్త్రి, రఛన చేసిన ఆంధ్ర విప్రుల గోత్రముల ఇండ్ల పేర్లు శాఖలు (గొల్లపూడి వీరాస్వామి సన్, రాజమండ్రి వారి ప్రచురణ).
  • http://www.teluguthesis.com/2018/06/teluguvari-inti-perlu.html (Ph.D. సిద్ధాంతవ్యాసం)

బయటి లింకులు

[మార్చు]

www.searchforancestors.com/surnames/origin

surnames.behindthename.com

genealogy.about.com/od/surname_meaning

genealogy.about.com/library/surnames/bl_meaning.htm

www.familychronicle.com/surname.htm

www.intl-research.com/surname.htm

ఇవి కూడా చూడండి

[మార్చు]